సంభాషణను ప్రారంభించేందుకు కరపత్రాలను ఉపయోగించండి
1 ప్రభావవంతంగా సాక్ష్యమివ్వడమనేది, సంభాషణను ప్రారంభించేందుకు మీరు తీసుకొనే చొరవపైనే ఎక్కువగా ఆధారపడివుంటుందని మీరు అంగీకరించరా? అవతలి వ్యక్తి ఆసక్తిని రేకెత్తించేదేదైనా చెప్పి, అతనిని సంభాషణలోకి దించడం సవాలుతో కూడినదే. కానీ దాన్ని ప్రభావవంతంగా ఎలా చేయగలము?
2 జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న కొన్ని మాటలతో మన బైబిలు ఆధారిత కరపత్రాలను అందించడం ద్వారా సంభాషణను ప్రారంభించవచ్చని చాలామంది ప్రచారకులు కనుగొన్నారు. శీర్షికలు ఆసక్తికరంగా ఉండి, రంగురంగుల చిత్రాలతో ఆకర్షణీయంగా ఉంటాయి. కరపత్రాలు, ఒక వ్యక్తికి చాలా చదవాలే అనే చికాకును కలిగించే అభిప్రాయాన్ని ఏర్పడనీయవు. అయినప్పటికీ ఆ కరపత్రాల్లో ఉన్న సంక్షిప్త సమాచారం, ఆసక్తిని చూరగొనేలా ఉండి బైబిలు పఠనాన్ని ప్రారంభించటానికి ఉపయోగపడుతుంది.
3 ఒక సాక్షి ఇలా భావించాడు: “బిజీగా ఉండే ఈ ప్రపంచంలో ప్రజలు చదవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి ఇష్టపడరు. కానీ ప్రాముఖ్యమైన వర్తమానాన్ని ఇచ్చేందుకు కరపత్రాలు సరైన పరిమాణంలో ఉన్నాయి. అయితే అవి ప్రజలు చిరాకు పడేంత సుదీర్ఘమైనవి కావు. నేను చాలా కరపత్రాలు చదివాను, అలా సత్యము తెలుసుకున్నాను.” అవును, కరపత్రాల్లో ఉండే ముద్రిత సందేశం చాలా క్లుప్తంగా ఉన్నప్పటికీ దానిలోని దేవుని వాక్య శక్తిని ఎన్నడూ తక్కువగా అంచనా వేయవద్దు.—హెబ్రీ. 4:12.
4 నాలుగు సులభ చర్యలు: సరళంగా చెప్పడం ప్రయోజనకరంగా ఉంటుందని చాలామంది కనుగొన్నారు. (1) ఒక వ్యక్తికి కొన్ని కరపత్రాలను చూపించి ఆయనకు ఏది ఆసక్తిని కలిగిస్తుందో అడగండి. (2) ఆ వ్యక్తి ఏదైనా ఒక కరపత్రాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత ఆ కరపత్రం యొక్క ముఖ్యాంశాన్ని నొక్కి చెప్పే ప్రశ్నను, ముందే ఆలోచించిపెట్టుకుని ఆ వ్యక్తిని అడగండి. (3) ఆ ప్రశ్నకు సమాధానంగా, ఆ కరపత్రంలో నుండి తగిన పేరాను గానీ లేఖనాన్ని గానీ చదవండి. (4) అనుకూలంగా ప్రతిస్పందిస్తే, ఆ కరపత్రంలోని అంశాన్ని చర్చించండి, లేదా సృష్టి (ఆంగ్లం) పుస్తకంలోని 16-20 అధ్యాయాల్లోని యుక్తమైన విషయాన్ని చర్చించండి. అలా మీరు నేరుగా బైబిలు పఠనాన్ని మొదలుపెట్టవచ్చు. ఈ క్రింద ఇవ్వబడిన సలహాలు, నాలుగు కరపత్రాలను ఉపయోగించి ఏమి చెప్పాలనేది సిద్ధపడేందుకు మీకు సహాయం చేస్తాయి.
5 “లోకాన్ని నిజంగా ఎవరు పరిపాలిస్తున్నారు?” అనే కరపత్రం యొక్క శీర్షికనే మీరు ప్రశ్నగా ఉపయోగించవచ్చు.
◼ మీరు ఎవరితో మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి దానికి సమాధానంగా “దేవుడు” లేక “నాకు తెలియదు” అని చెప్తే 2వ పేజీలోని మొదటి రెండు లైన్లనూ, 3వ పేజీలోని మొదటి పేరాను చదవండి. 1 యోహాను 5:19 ని, ప్రకటన 12:9ని నొక్కి చెప్పండి. ఆ వ్యక్తి అపవాదియైన సాతాను ఉనికిని సందేహించినా సందేహించకపోయినా, లోకం అపవాది చేతిలో ఉందన్న విషయాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా, “లోక పరిస్థితులనుండి ఒక సూచన” అన్న ఉపశీర్షిక క్రిందనున్న తర్కాన్ని ఉపయోగిస్తూ మీ సంభాషణను కొనసాగించవచ్చు. ఆసక్తి కనపరిస్తే, ఆ కరపత్రంలోని 3, 4 పేజీల్లో ఉన్న విషయాలను ఉపయోగిస్తూ అపవాది ఎక్కడనుండి వచ్చాడన్నది వివరించండి.
6 “మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు?” అన్న కరపత్రం చూడగానే ఆసక్తిని రేకెత్తించవచ్చు. ఇలా అడగడం ద్వారా సంభాషణను ప్రారంభించవచ్చు:
◼ “మరణించిన మన ప్రియమైన వారిని ఎప్పటికైనా మరలా చూస్తామని మీరు అనుకుంటున్నారా?” ఆ వ్యక్తి ప్రతిస్పందించిన తర్వాత, 4వ పేజీలోని రెండవ పేరా వైపు దృష్టి మరల్చి యోహాను 5:28, 29 ని చదవండి. ఈ కరపత్రంలోని మొదటి ఉపశీర్షిక క్రింద ఉన్న సమాచారాన్ని అర్థం చేసుకుంటే విషయాలు స్పష్టమౌతాయని వివరించండి. ఆ సమాచారాన్ని కలిసి చర్చిద్దాము అని చెప్పండి.
7 “కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి” అన్న కరపత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని కుటుంబాలకూ ఆకర్షణీయంగా ఉంటుంది. దాన్ని ఉపయోగిస్తూ మీరిలా చెప్పవచ్చు:
◼ “నేడు కుటుంబం దాడికి గురవుతుందని బహుశా మీరు అంగీకరిస్తారు. మీ కుటుంబ బంధాలను పటిష్ఠపరచుకునేందుకు ఏమి చేయవచ్చని మీరు అనుకుంటున్నారు?” ఆ వ్యక్తి ప్రతిస్పందించిన తర్వాత, 6వ పేజీలోని మొదటి పేరాలో ఉన్న విషయాల వైపుకు ఆయన దృష్టిని మళ్ళించండి. ఆ కరపత్రంలో 4, 5 పేజీల్లో ఉదాహరించబడిన లేఖనాల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకొని దాని అర్థమేమిటో వివరించండి. ఆ తర్వాత ఉచిత గృహ బైబిలు పఠనం గురించి తెలియజేయండి.
8 ఈ క్రింది విధంగా అంటూ “బైబిలును మీరెందుకు నమ్మవచ్చును?” అనే కరపత్రాన్ని ఉపయోగించవచ్చు:
◼ “బైబిలులోని మొదటి పుస్తకంలో కన్పించే కయీను హేబేలులను గూర్చిన కథను చాలామంది వినే ఉంటారు. ఆదికాండములోని వృత్తాంతము కయీను భార్యను గూర్చి కూడా మాట్లాడుతుంది. ఆమె ఎక్కడ నుండి వచ్చిందని మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా?” సమాధానం చెప్పడానికి ఆ కరపత్రంలోని 2వ పేజీలోవున్న ఆఖరి పేరాను ఉపయోగించండి. భవిష్యత్తులో మన కోసం ఏమి వేచి ఉందనే దాని గురించి బైబిలు ఇస్తున్న ప్రాముఖ్యమైన వ్యాఖ్యానాలను కూడా ఈ కరపత్రం చర్చిస్తుందని వివరించండి. 5వ పేజీలోని మూడవ పేరా నుండి మొదలుపెట్టి, మద్దతునిచ్చే లేఖనాలను ఉపయోగిస్తూ చర్చను కొనసాగించండి.
9 బైబిలు కరపత్రాలను పంచిపెట్టడమనేది కాలపరీక్షను తట్టుకొని ఇప్పటివరకూ నిలబడగలిగింది, సువార్తను ప్రకటించేందుకు ఇది ప్రభావవంతమైన మాధ్యమంగా కూడా ఉంది. ఎందుకంటే కరపత్రాలు, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి సులభంగా పట్టుకెళ్ళగలిగేలా ఉంటాయి గనుక, మనం ఇంటింటి పరిచర్యలోనూ, అనియత సాక్ష్యమివ్వడానికీ వాటిని ప్రభావవంతంగా ఉపయోగించవచ్చు. మన పరిచర్యను నెరవేర్చడంలో కరపత్రాలు ఒక ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తున్నాయి. వివిధ రకాల కరపత్రాలను దగ్గర ఉంచుకొని సంభాషణను ప్రారంభించేందుకు వాటిని ధారాళంగా ఉపయోగించండి.—కొలొ. 4:17.