సువార్తను వ్యాప్తి చేయడానికి కరపత్రాలు ఉపయోగించండి
1. దేవుని ప్రజలు కరపత్రాలను ఎలా ఉపయోగిస్తూ వచ్చారు?
1 సువార్తను వ్యాప్తి చేయడానికి యెహోవా ప్రజలు బైబిలు కరపత్రాలను ఎప్పటి నుండో ఉపయోగిస్తున్నారు. సి.టి. రస్సెల్, ఆయన సహచరులు 1880లో బైబిలు విద్యార్థుల కరపత్రాలు రూపొందించడం మొదలుపెట్టారు. వీటిని ప్రజలకు అందించడానికి కావలికోట పాఠకులకు ఇచ్చేవారు. వీటిని ఎంత ప్రాముఖ్యమైనవిగా పరిగణించారంటే, సి.టి. రస్సెల్ రాజ్య సంబంధ పనుల కోసం చట్టపరమైన స్వచ్ఛంద సంస్థను రిజిస్టర్ చేయిస్తున్నప్పుడు జాయన్స్ వాచ్‌టవర్ ట్రాక్ట్ సొసైటీ పేరులో “ట్రాక్ట్” అనే ఆంగ్ల పదం (తెలుగులో “కరపత్రం”) ఉండేలా చూశాడు, ఇప్పుడు అది వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ పెన్సిల్వేనియాగా మారింది. 1918కల్లా బైబిలు విద్యార్థులు 30 కోట్ల కన్నా ఎక్కువ కరపత్రాలను పంచిపెట్టారు. సాక్ష్యమివ్వడంలో కరపత్రాలు ఇప్పటికీ శక్తివంతమైన పనిముట్లుగా ఉపయోగపడుతున్నాయి.
2. కరపత్రాలు ఎందుకంత సమర్థవంతమైనవి?
2 ఎందుకంత సమర్థవంతమైనవి? రంగురంగుల్లో ఉండే కరపత్రాలు ఆకర్షణీయంగా ఉంటాయి. వాటిల్లోని క్లుప్త సందేశం ఆసక్తికరంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. పత్రికను లేదా పుస్తకాన్ని చదవడానికి ఇష్టపడని గృహస్థులు వీటిని చదవడానికి ఇష్టపడతారు. కొత్త ప్రచారకులు, పిల్లలు కూడా వీటిని సులభంగా అందివ్వొచ్చు. అంతేకాదు, అవి చిన్నగా ఉంటాయి కాబట్టి వెంట తీసుకువెళ్లడం చాలా సులువు.
3. మీదైనా లేదా ప్రచురణల్లో వచ్చినదైనా, కరపత్రాల విలువను తెలియజేసే ఒక అనుభవం చెప్పండి.
3 చాలామంది కరపత్రాలతోనే సత్యం గురించి తెలుసుకున్నారు. ఉదాహరణకు, ఒక స్త్రీ మన కరపత్రాల్లో ఒకటి రోడ్డు మీద పడివుండడం చూసింది. ఆమె దాన్ని తీసుకుని, చదివి, “నాకు సత్యం దొరికింది!” అని అంది. చివరకు, ఆమె రాజ్యమందిరానికి వెళ్లి, బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టి, బాప్తిస్మం తీసుకుంది. ఇదంతా కరపత్రంలో ఉన్న దేవుని వాక్యపు శక్తివల్లే సాధ్యమైంది.
4. కరపత్రాలు అందించాల్సిన నెలలో మనం ఏ లక్ష్యం పెట్టుకోవాలి?
4 ఇంటింటి పరిచర్యలో: సాక్ష్యమివ్వడానికి కరపత్రాలు చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి, నవంబరు మొదలుకొని అప్పుడప్పుడు నెలలో అందించాల్సిన ప్రచురణల్లో కూడా అవి రానున్నాయి. కరపత్రాలు ఇవ్వడమే మన ఉద్దేశం కాదుకానీ, సంభాషణలు మొదలుపెట్టడానికి మనం వాటిని ఉపయోగించాలి. మొదటిసారి లేదా రెండోసారి కలిసినప్పుడు ఆసక్తి చూపిస్తే బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని లేదా మరో ప్రచురణను ఉపయోగించి బైబిలు అధ్యయనాన్ని పరిచయం చేయవచ్చు. ఇంటింటి పరిచర్యలో మనం కరపత్రాలను ఎలా అందివ్వవచ్చు? ఒక్కో కరపత్రం ఒక్కోలా ఉంటుంది కాబట్టి మనం ఇవ్వాలనుకుంటున్న వాటి గురించి బాగా తెలుసుకునివుండాలి.
5. ఇంటింటి పరిచర్యలో మనం కరపత్రాలను ఎలా అందివ్వవచ్చు?
5 పరిచర్య చేస్తున్న ప్రాంతానికి, మనం ఇవ్వాలనుకుంటున్న కరపత్రానికి అనుగుణంగా మన సంభాషణను మలచుకోవాలి. కరపత్రాన్ని గృహస్థుల చేతికిచ్చి సంభాషణ మొదలుపెట్టవచ్చు. ఆకర్షణీయంగా ఉండే మొదటిపేజీ గృహస్థుల ఆసక్తిని చూరగొంటుంది. ఇంకో పద్ధతి, మనం కొన్ని కరపత్రాలను వాళ్లకు చూపించి వాళ్లకు నచ్చినదాన్ని ఎంచుకోమనడం. తలుపు తీయడానికి భయపడే ప్రాంతాల్లో మనం పరిచర్య చేస్తుంటే, కవరు పేజీ వాళ్లకు కనిపించేలా పట్టుకోవాలి లేదా దాన్ని తలుపు కింద నుండి మెల్లగా లోపలికి వేయవచ్చేమో అడిగి, దాని గురించి వాళ్ల అభిప్రాయం తెలుసుకోవాలని అనుకుంటున్నామని చెప్పవచ్చు. కరపత్రం శీర్షిక ప్రశ్నలా ఉంటే, దాని మీద వాళ్ల అభిప్రాయం చెప్పమని అడగవచ్చు. లేదా మనమే ఆసక్తి కలిగించి, సంభాషణకు అవకాశం కల్పించే ఒక ప్రశ్నను తయారు చేసుకోవచ్చు. కరపత్రంలోని కొంతభాగాన్ని గృహస్థులతో కలిసి చదివి, అందులోని ప్రశ్నల దగ్గర ఆగి, వాళ్ల అభిప్రాయాన్ని చెప్పమని అడగవచ్చు. ముఖ్య లేఖనాలను బైబిలు నుండి చదవవచ్చు. కొంత భాగాన్ని పరిశీలించిన తర్వాత, చర్చను ముగిస్తూ వాళ్ల దగ్గరకు మళ్లీ వెళ్లేందుకు కచ్చితమైన ఏర్పాట్లు చేసుకోవాలి. తాళం వేసివున్న ఇళ్లల్లోకి సాహిత్యం వేస్తున్న సంఘాలవాళ్లు తాళం వేసివున్న ఇళ్లవద్ద కరపత్రం వేరేవాళ్ల దృష్టిలో పడకుండా దాన్ని పెట్టవచ్చు.
6. వీధి సాక్ష్యంలో కరపత్రాలను ఎలా ఉపయోగించవచ్చు?
6 వీధి సాక్ష్యం: మీరు ఎప్పుడైనా వీధి సాక్ష్యంలో కరపత్రాలను ఉపయోగించారా? కొందరు పాదచారులు హడావిడిగా వెళుతుంటారు కాబట్టి ఆగి మనతో మాట్లాడడానికి సుముఖంగా ఉండరు. అలాంటి వాళ్లకు ఆసక్తి ఉందో లేదో గ్రహించడం కష్టం. వాళ్లు చదువుతారో లేదో తెలియకుండా తాజా పత్రికలను వాళ్ల చేతికిచ్చే బదులు కరపత్రం ఇస్తే సరిపోతుంది. మొదటి పేజీ ఆకర్షణీయంగా ఉండి, దానిలోని సందేశం క్లుప్తంగా ఉంటుంది కాబట్టి వాళ్లు తీరిక సమయంలో దాన్ని చదవడానికి ఇష్టపడవచ్చు. వాళ్లు హడావిడిలో లేకపోతే కరపత్రంలోని కొంత భాగాన్ని వారితో చర్చించవచ్చు. అయితే, గమనిస్తూ ఉండండి, గొడవ చేసేలా ఉన్నవాళ్లతో మాట్లాడకండి.
7. వివిధ సందర్భాల్లో సాక్ష్యమిస్తున్నప్పుడు కరపత్రాలను ఎలా ఉపయోగించాలో చూపించే అనుభవాలను చెప్పండి.
7 వివిధ సందర్భాల్లో సాక్ష్యమిస్తున్నప్పుడు: వీటి సహాయంతో వివిధ సందర్భాల్లో సులువుగా సాక్ష్యమివ్వవచ్చు. ఒక సహోదరుడు బయటకు వెళ్తున్నప్పుడల్లా జేబులో కొన్ని కరపత్రాలు పెట్టుకుంటాడు. షాపులో కౌంటర్ దగ్గర ఉండే వ్యక్తి వంటివాళ్లను కలిస్తే, చదువుకోవడానికి ఏదైనా ఇస్తానంటూ ఒక కరపత్రాన్ని చేతిలో పెట్టేసేవాడు. ఒక జంట ఓ నగరానికి విహార యాత్రకు వెళ్తున్నప్పుడు అక్కడ తాము చాలా దేశాల ప్రజలను కలుస్తామని గ్రహించారు. అందుకే అన్ని జనాంగాలకు అనే చిన్న పుస్తకాన్ని, వివిధ భాషల్లో కొన్ని కరపత్రాలను వెంట తీసుకువెళ్లారు. దారిలో రోడ్డు పక్కన అమ్ముకునే వాళ్లు లేదా పార్కులో, హోటల్లో తమ పక్కన కూర్చున్న వాళ్లు వేరే భాష మాట్లాడుతుంటే వాళ్ల సొంత భాషలో కరపత్రాన్ని ఇచ్చారు.
8. కరపత్రాలను విత్తనాలతో ఎందుకు పోల్చవచ్చు?
8 ‘విత్తనం విత్తండి’: కరపత్రాలను విత్తనాలతో పోల్చవచ్చు. ఏ విత్తనం మొలకెత్తి ఫలిస్తుందో రైతుకు తెలీదు కాబట్టి ఆయన విస్తారంగా విత్తనాలు వెదజల్లుతాడు. ప్రసంగి 11:6 ఇలా చెబుతోంది: “ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తియ్యక విత్తుము, అది ఫలించునో యిది ఫలించునో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీవెరుగవు.” కాబట్టి, ఎంతో సమర్థవంతమైన ఈ పనిముట్టుతో మనం జ్ఞానాన్ని వెదజల్లుతూ ఉందాం.—సామె. 15:7.
[3వ పేజీలోని బ్లర్బ్]
సాక్ష్యమివ్వడానికి కరపత్రాలు చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి, నవంబరు మొదలుకొని అప్పుడప్పుడు నెలలో అందించాల్సిన ప్రచురణల్లో అవి రానున్నాయి