కోతపనిలో పూర్తిగా పాల్గొనండి
1 యెహోవా యొక్క ప్రాచీన ప్రవక్తలతోపాటు యేసు క్రీస్తు కూడా సమకూర్చే ఒక పని గురించి మాట్లాడాడు. (యెష. 56:8; యెహె. 34:11; యోహా. 10:16) ఇప్పుడా పని, రాజ్య సువార్త ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడడం ద్వారా నెరవేరుతోంది. (మత్త. 24:14) దేవుణ్ణి సేవించేవారికీ సేవించనివారికీ మధ్య వ్యత్యాసం చాలా స్పష్టమౌతోంది. (మలా. 3:18) అది మనకేమి సూచిస్తోంది?
2 వ్యక్తిగత బాధ్యత: క్రైస్తవ పరిచర్యలో నేతృత్వం వహించడంలో పూర్తిగా నిమగ్నమైన పౌలు మాదిరినుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఆయన ప్రకటనా పనిని ఋణం తీర్చుకునే బాధ్యతగా భావించాడు. ఆ విధంగా ప్రజలందరికీ సువార్త వినడానికి రక్షించబడడానికి సదవకాశముంటుంది. వారి మేలు కోరి నిరంతరం కష్టపడి పనిచేయడానికి, ఆ భావము ఆయనను కదిలించింది. (రోమా. 1:14-17) మరి నేడు మానవజాతి చాలా ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మనకు నియమించిన ప్రాంతంలోని వారికి ప్రకటించడానికి మనపై మరింత ఎక్కువ బాధ్యత లేదా?—1 కొరిం. 9:16.
3 అత్యవసర చర్యకు ఇదే సమయం: ప్రకటనా పనిని, తప్పిపోయిన వారిని వెదకి కాపాడే ప్రక్రియతో పోల్చవచ్చు. ఆలస్యం కాకముందే ప్రజలను కనుగొని సురక్షితమైన స్థలానికి చేర్చడానికి సహాయపడాలి. సమయం చాలా తక్కువుంది. ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి! అందుకే యేసు, “కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొను[డి]” అని తన శిష్యులకు ఉద్బోధించడంలో ఆశ్చర్యమేమీ లేదు.—మత్త. 9:38.
4 నేటి అత్యవసర పరిస్థితిని గుర్తించిన అనేకమంది రాజ్యపు పనివాళ్ళు, ప్రాణాలను కాపాడే పనిలో తమ భాగాన్ని అధికం చేసుకున్నారు. యౌవనారంభంలోవున్న హిరోహిశా అనే ఒక అబ్బాయి, నలుగురు తమ్ముళ్ళు చెల్లెళ్ళతోపాటు తల్లి మాత్రమే ఉన్న ఒక కుటుంబంలో పెరిగాడు. ఆయన తెల్లవారుజామున మూడు గంటలకు లేచి పేపర్లు వేయడం ద్వారా తన కుటుంబానికి మద్దతునిచ్చాడు. అయినా హిరోహిశా తన పరిచర్యలో ఇంకా ఎక్కువ చేయాలని కోరుకున్నాడు, ఆ మేరకు ఆయన క్రమ పయినీరు సేవ చేయడం ప్రారంభించాడు. మరెన్నడూ పునరావృత్తం కాబోని ఈ గొప్ప పనిలో మీరు మరింత ఎక్కువగా పాల్గొనే మార్గాలేవైనా ఉన్నాయా?
5 “కాలము సంకుచితమై యున్నది.” (1 కొరిం. 7:29) కాబట్టి, నేడు భూమ్మీద జరుగుతున్న, రాజ్య సువార్తను ప్రకటిస్తూ శిష్యులను చేసే అత్యంత ప్రాముఖ్యమైన పనిలో మనం చేయగలిగినంత చేద్దాం. యేసు ఈ పరిచర్యను ఒక కోత పనితో పోల్చాడు. (మత్త. 9:35-38) మనమీ కోత పనిలో పూర్తిగా పాల్గొనడం ద్వారా పొందే మంచి ఫలితాల్లో, ప్రకటన 7:9, 10 లో వర్ణించబడిన ఆరాధకుల గొప్ప సమూహంలో భాగస్థులవడానికి ఇతరులకు సహాయం చేయడం కూడా ఉంది.