మర్యాద—దైవభక్తి గల ప్రజలకుండే ఒక విశిష్ట లక్షణం
1 నేడు మర్యాద చాలా అరుదుగా కనబడుతుంది. కారణమేమిటి? ప్రజలు ఎంత హడావుడిగా ఉన్నారంటే, వాళ్ళు “దయచేసి,” “థాంక్యూ,” లేక “క్షమించండి” లాంటి మాటల గురించి చాలా అరుదుగా తలంచుతుండవచ్చు. దేవుని వాక్యం అంత్యదినాల్లోని సంస్కారహీనత గురించి తెలియజేస్తూ మనుష్యులు ‘స్వార్థప్రియులు, బింకములాడువారు, అహంకారులు, కృతజ్ఞతలేనివారు, అనురాగరహితులు, అజితేంద్రియులు, సజ్జనద్వేషులు, గర్వాంధులు’ అవుతారని ముందుగానే చెప్పింది. (2 తిమో. 3:1-4) అలాంటి లక్షణాలన్నీ అమర్యాదను పుట్టిస్తాయి. దైవభక్తి గల ప్రజలైన క్రైస్తవులు ఇతరులపట్ల ఈ లోకానికున్న అమర్యాదకరమైన ధోరణిని అలవర్చుకోకుండా తప్పకుండా జాగ్రత్త పడాలి.
2 మర్యాద అంటే ఏమిటి? మంచి మర్యాద అంటే ఇతరుల భావానుభూతుల గురించి నిశితంగా ఎరిగి ఉండడం, ఇతరులతో శాంతిగా జీవించే సామర్థ్యం అని వర్ణించవచ్చు. మంచి మర్యాద యొక్క ఆకృతులు ఏవంటే, ఇతరుల కష్టసుఖాలు ఆలోచించడం, సంస్కారం, స్నేహశీలత, సభ్యత, ఔచిత్యం మరియు ఆలోచనాశీలురై ఉండడం. ఈ విశిష్ట లక్షణాలు దేవునిపట్ల, పొరుగువారిపట్ల ఉండే ప్రేమనుండి పుట్టినవి. (లూకా 10:27) వాటిని ఉపయోగించడానికి ఖర్చేమీ కాదు, కానీ ఇతరులతో మన సంబంధాలను దృఢపరచుకోవడంలో అవి ఎంతో విలువైనవి.
3 యేసు క్రీస్తు ఈ విషయంలో పరిపూర్ణమైన మాదిరినుంచాడు. ఆయన ఎల్లప్పుడూ ఈ బంగారు సూత్రాన్ని అనుసరించాడు: “మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి.” (లూకా 6:31) ఆయన తన శిష్యులపట్ల చూపించిన ఆలోచనాశీలతకూ, ప్రేమపూర్వక ప్రవర్తనకూ మనకు విస్మయం కలగదూ? (మత్త. 11:28-30) ఆయన మంచి మర్యాద, ప్రవర్తన గురించి సలహాలనిచ్చే పుస్తకాలనుండి వచ్చినది కాదు. అది ఒక యథార్థమైన, ఉదారమైన హృదయం నుండి ఉత్పన్నమైంది. ఆయన చక్కని మాదిరిని అనుకరించడానికి మనం తప్పకుండా ప్రయత్నించాలి.
4 క్రైస్తవులు మర్యాదగా ఎప్పుడు ప్రవర్తించాలి? మనం మంచివాళ్ళమని సదభిప్రాయం కలిగించాలనే ఉద్దేశంతో కేవలం ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే మర్యాదగా ప్రవర్తించాలా? లేక ఇతరులను ప్రభావితం చేయాలనుకున్నప్పుడే మర్యాదగా ఉండాలా? లేదు! మనం అన్ని సందర్భాల్లోనూ మర్యాదగా ప్రవర్తించాలి. సంఘంలో మనం ఒకర్నొకరం కలుసుకున్నప్పుడు ముఖ్యంగా ఏయే విధాల్లో మర్యాద చూపించవచ్చు?
5 రాజ్య మందిరంలో: రాజ్య మందిరం మనం ఆరాధన చేసుకునే స్థలం. మనమక్కడికి యెహోవాచే ఆహ్వానించబడ్డాము. ఆ విధంగా మనం అతిథులం. (కీర్త. 15:1) మనం రాజ్య మందిరానికి వచ్చినప్పుడు మాదిరికరమైన అతిథుల్లా ఉంటున్నామా? మన వస్త్రాలంకరణ, కేశాలంకరణ విషయాల్లో తగిన జాగ్రత్త వహిస్తున్నామా? మనం ఒక పద్ధతంటూ లేకుండా లేక అతి ఫ్యాషన్‌గా అలంకరించుకోవాలనుకోము. హాజరయ్యేది సమావేశాలకైనా లేక వారపు సంఘ కూటాలకైనా, యెహోవా ప్రజలు దేవునిపై భయభక్తులు గలవారిగా మర్యాదస్తులుగా కనబడతారని గుర్తింపు పొందారు. (1 తిమో. 2:9, 10) అందుకే మనం మన పరలోకపు ఆతిథేయుడికి ఆహ్వానించబడిన ఇతర అతిథులకు తగిన శ్రద్ధ, గౌరవం చూపిస్తాం.
6 మనం మంచి మర్యాదను చూపించే మరో మార్గం, కూటాలకు సరైన సమయానికి చేరుకోవడం. ఇది అన్ని సమయాల్లో సులభం కాదని ఒప్పుకోవాల్సిందే. కొంతమంది చాలా దూరంగా ఉంటుండవచ్చు లేక పెద్ద కుటుంబాలు ఉన్నవాళ్ళు కావచ్చు. అయినా, కొన్ని సంఘాల్లోని 25 శాతం ప్రచారకులకు ప్రారంభపు పాట, ప్రార్థన అయిపోయిన తర్వాత చేరుకునే అలవాటున్నట్లు గమనించడం జరిగింది. ఇది చాలా గంభీరమైన విషయం. మంచి మర్యాద అంటే ఇతరుల భావానుభూతుల గురించి నిశితంగా ఎరిగి ఉండడం అనే విషయం మనం మరచిపోకూడదు. దయాళుడైన మన ఆతిథేయుడు, యెహోవా ఈ ఆధ్యాత్మిక విందులను మన ప్రయోజనం కోసం ఏర్పాటు చేశాడు. సమయానికి చేరుకోవడంవల్ల మనం ఆయన భావానుభూతులపట్ల ప్రశంస, గౌరవాలను చూపిన వారమౌతాము. అంతేగాక, కూటాలకు ఆలస్యంగా చేరుకోవడంవల్ల, అక్కడ అప్పటికే హాజరైవున్నవారికి ధ్యానభంగం కలిగించినవారమేగాక, వారిని అగౌరవపరచిన వారమవుతాము.
7 మనం కూటాల్లో సమావేశమైనప్పుడు, కొత్తగా హాజరైనవారిని గమనిస్తున్నామా? వారిని సాదరంగా ఆహ్వానించడం మన మంచి మర్యాదలో భాగం. (మత్త. 5:47; రోమా. 15:7) స్నేహపూర్వకమైన పలకరింపు, ఉత్సాహంగా చేతులు కలపడం, ఒక చిరునవ్వు—ఇవన్నీ స్వల్పమైన విషయాలే, కానీ అవి మనం నిజ క్రైస్తవులుగా గుర్తించబడడానికి దోహదపడతాయి. (యోహా. 13:35) ఒక వ్యక్తి మొదటిసారి రాజ్య మందిరానికి హాజరైన తర్వాత ఇలా అన్నాడు: “నేను ఒకరోజు నిజమైన ప్రేమగల ప్రజలను కలిశాను, వారు పూర్తిగా అపరిచితులు, నేను పుట్టి పెరిగిన చర్చిలో ఎప్పుడూ అంతమందిని కలవలేదు. అక్కడే నేను సత్యాన్ని కనుగొన్నానని స్పష్టమైంది.” దాని ఫలితంగా, ఆయన తన జీవనశైలిని మార్చుకొన్నాడు, ఏడు నెలల తర్వాత బాప్తిస్మం తీసుకున్నాడు. అవును, మంచి మర్యాద ఎంతో ప్రభావాన్ని చూపించగలదు!
8 మనం అపరిచితులపట్లనే మర్యాదగా ప్రవర్తించినప్పుడు, మనం “విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడల” కూడా అలాగే ప్రవర్తించవద్దా? (గల. 6:10) “వృద్ధులను గౌరవించండి” అనే సూత్రం ఇక్కడ వర్తిస్తుంది. (లేవీ. 19:32, ఈజీ-టు-రీడ్ వర్షన్) మన కూటాల్లో అలాంటి వారిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
9 ఏకాగ్రత చూపించండి: మనం బలపడేలా, ఆత్మసంబంధమైన కృపావరమివ్వడానికి సంఘ కూటాల్లో దేవుని క్రైస్తవ పరిచారకులు మాట్లాడతారు. (రోమా. 1:11, 12) కూటం జరుగుతున్నప్పుడు మనం నిద్రలో జోగడం, ఏవైనా తినుబండారాలు లేక చూయింగ్ గమ్ నమలడం, పక్కన కూర్చున్నవారితో పదే పదే గుసగుసలాడడం, అనవసరంగా బాత్రూముకు చక్కర్లు కొట్టడం, కూటంలో జరుగుతున్న దానికి సంబంధంలేని వాటిని చదవడం లేక చేయడంలాంటివి మన అమర్యాదను ప్రకటిస్తాయి. ఈ విషయంలో పెద్దలు మంచి మాదిరిగా ఉండాలి. మంచి క్రైస్తవ మర్యాదలు మనం ఏకాగ్రతగా వింటూ ప్రసంగీకునికి, ఆయనిచ్చే బైబిలు ఆధారిత సందేశానికి సరైన గౌరవం చూపించేలా చేస్తాయి.
10 దాంతోపాటు, ప్రసంగీకునిపట్ల ప్రేక్షకులపట్ల శ్రద్ధ చూపిస్తూ, మన కూటాలకు భంగపాటు కలగకుండా మనం మన ఎలక్ట్రానిక్ పేజర్లను, సెల్యులర్ ఫోన్లను ఆఫ్ చేసివుంచాలి.
11 మర్యాద మరియు పిల్లలు: తమ పిల్లల ప్రవర్తనపట్ల తల్లిదండ్రులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా పాప లేక బాబు ఏడుస్తున్నా, చిరాకు పడుతున్నా అది ఇతరులకు భంగం కలిగిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ పాపను లేక బాబును ఊరుకోబెట్టడానికి వీలైనంత త్వరగా బయటకు తీసుకువెళ్ళడం మంచిది. అది కొన్నిసార్లు కష్టమనిపించినా, అలా చేయడం ఇతరుల భావానుభూతులపట్ల మనం అప్రమత్తంగా ఉన్నామని చూపిస్తుందని గుర్తుంచుకోండి. చిరాకుపడే చిన్నపిల్లలుగల తల్లిదండ్రులు, అవసరమైనప్పుడు బయటకు వెళ్ళాల్సి వస్తే కూటంలో ఎక్కువమందికి భంగం కలిగించకూడదని, తరచుగా వెనక సీట్లలో కూర్చోవడానికి ఇష్టపడతారు. వాళ్ళలా కూర్చోగలిగేలా, హాజరవుతున్న ఇతరులు తమతోటివారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని వెనక సీట్లను అవసరాన్నిబట్టి ఖాళీగా ఉంచాలి.
12 తల్లిదండ్రులు తమ పిల్లలు కూటాలకు ముందూ తర్వాతా ఎలా ప్రవర్తిస్తున్నారని కూడా తప్పకుండా కనిపెట్టుకొని ఉండాలి. కూటం జరిగే స్థలాల్లో పిల్లలు అటూ ఇటూ పరుగెత్తకూడదు, అది ప్రమాదాలకు దారితీయగలదు. రాజ్య మందిరము చుట్టుపక్కల పరుగెత్తడం కూడా ప్రమాదకరమే, ప్రత్యేకంగా మసక మసకగా ఉండే సాయంత్రాల్లో. బయట గట్టిగా మాట్లాడడం పొరుగువారికి భంగపాటు కలిగించడమేకాక మన ఆరాధన గురించి అపార్థాలు చేసుకోవడానికి అవకాశమిస్తుంది. రాజ్య మందిరం లోపలా బయటా తమ పిల్లలను శ్రద్ధతో కనిపెట్టుకొని ఉండే తల్లిదండ్రులను మెచ్చుకోవాలి, ఎందుకంటే అది మన ఐక్యతకు ఆనందానికి దోహదపడుతుంది.—కీర్త. 133:1.
13 పుస్తక అధ్యయనం దగ్గర: సంఘ కూటాల కోసం తమ తమ ఇండ్లను వాడుకునేందుకు అనుమతించిన సహోదరులను మేము అభినందిస్తున్నాము. హాజరవుతున్నప్పుడు మనం వారి ఇంటిపట్ల, ఇంట్లోని వస్తువులపట్ల శ్రద్ధా గౌరవాలు చూపించాలి. మన కాళ్ళతో మట్టి, దుమ్ము లోపలికి రాకుండా లేక కార్పెట్లను మలినపరచకుండా ఉండేందుకు బయటే జాగ్రత్తగా కాళ్ళు దులుపుకొని లోపలికి ప్రవేశించాలి. ఆ ఇంట్లో పుస్తక అధ్యయనం చేయడానికి కేటాయించిన స్థలంలోనే తమ పిల్లలుండేలా తల్లిదండ్రులు పర్యవేక్షించాలి. గ్రూపు చిన్నగా ఉన్న చోట్లలో క్రమపద్ధతి కాస్త తక్కువుంటుంది, అలాగని మనమెలా ప్రవర్తించినా వాళ్ళు ఏమీ అనుకోరు అని ఇతరుల ఇండ్లలో అధికంగా స్వతంత్రం తీసుకోకూడదు. చిన్నపిల్లలు బాత్రూముకు వెళ్ళాల్సివస్తే వారివెంట తల్లో తండ్రో తప్పకుండా వెళ్ళాలి. అంతేగాక, పుస్తక అధ్యయనం కూడా సంఘ కూటమే కాబట్టి, మన వస్త్రాలంకరణ మనం రాజ్య మందిరానికి వెళ్తున్న విధంగానే ఉండాలి.
14 మంచి మర్యాద చాలా ముఖ్యం: క్రైస్తవుల మర్యాదపూర్వక ప్రవర్తన పరిచర్యలో మంచి ఫలితమివ్వడంతోపాటు ఇతరులతో మన సంబంధాలు పెరగడానికీ దోహదపడుతుంది. (2 కొరిం. 6:3, 4, 6) సంతోషముగల దేవుని ఆరాధకులుగా మనం సహజంగా నవ్వుతూ ఉండాలి, ఇతరులకు ప్రీతికలిగించే చిన్న చిన్న పనులైనా కూడా చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఈ మర్యాదపూర్వకమైన విశిష్ట లక్షణాలు భక్తిగలవారిగా మన జీవితాలకు అలంకరణగా ఉంటాయి.