తల్లిదండ్రులారా—మీ పిల్లలకు మంచి మాదిరినుంచండి
1 “నీతిమంతుని తండ్రికి [అలాగే తల్లికి] అధిక సంతోషము కలుగును” అని మనకు దేవుని వాక్యం చెబుతుంది. (సామె. 23:24, 25) తమ సంతానానికి మంచి మాదిరిని ఉంచిన తల్లిదండ్రులకు ఎంతటి ఆశీర్వాదం! ఒక బ్రాంచ్ కమిటీ సభ్యుడు, తన తల్లిదండ్రులను గురించి చెబుతూ, “వాళ్ళ జీవితమంతా సత్యమయమే, నేను కూడా నా జీవితమంతటినీ అలాగే చేసుకోవాలని కోరుకున్నాను” అని అన్నారు. పిల్లలు తమ తల్లిదండ్రుల్లో ఏం చూడాలి?
2 మంచి మర్యాదలు, ప్రగాఢమైన గౌరవం: తమ పిల్లల్లో ఆరోగ్యకరమైన లక్షణాలను అలవర్చడం తల్లిదండ్రుల బాధ్యత. మంచి మర్యాదలనేవి, కేవలం మౌఖికంగా ఇవ్వబడిన నిర్దేశాల ద్వారానే కాక, గమనించడం ద్వారా అనుకరించడం ద్వారా అలవడుతాయి. కనుక, మీరు ఎటువంటి మర్యాదలను చూపిస్తారు? “ఎక్స్క్యూజ్ మీ,” “ప్లీస్,” “థ్యాంక్యూ” అని మీరు అనడం మీ పిల్లలు వింటారా? మీరు కుటుంబంలో ఒకరితో ఒకరు ప్రగాఢమైన గౌరవంతో వ్యవహరిస్తారా? ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మీరు శ్రద్ధగా వింటారా? మీ పిల్లలు మీతో మాట్లాడేటప్పుడు మీరు ఆలకిస్తారా? రాజ్య మందిరంలోనూ, ఇంట్లో ఏకాంతంగా ఉన్నప్పుడూ మీరు ఈ మంచి లక్షణాలను ప్రదర్శిస్తారా?
3 బలమైన ఆధ్యాత్మికతా, అభినివేశంతో కూడిన క్రియాశీలతా: “కూటాలంటే మెప్పుదలను చూపించడంలోనూ, పరిచర్య అంటే అభినివేశం [అంటే అంకిత భావంతో కూడిన ఉత్సాహం] చూపించడంలోను మా అమ్మానాన్నలు చక్కని మాదిరులుగా ఉండేవారు” అని పూర్తికాల సేవలో 50 కన్నా ఎక్కువ సంవత్సరాలు గడిపిన ఒక సహోదరుడు గుర్తు చేసుకుంటున్నారు. మీ కుటుంబ సభ్యుల ఆధ్యాత్మికతను కాపాడే విషయంలో మీకు శ్రద్ధ ఉందని మీ పిల్లలకు మీరు ఎలా చూపిస్తారు? మీరు దినవచనాన్ని కుటుంబసమేతంగా పరిశీలిస్తారా? మీ కుటుంబంలో కుటుంబ పఠనం క్రమంగా జరుగుతుందా? మీరు బైబిలునూ, సొసైటీ ప్రచురణలనూ చదవడాన్ని మీ పిల్లలు చూస్తారా? మీరు కుటుంబం పక్షాన ప్రార్థించేటప్పుడు, మీరేమని ప్రార్థించడం వాళ్ళు వింటారు? మీరు సత్యాన్ని గురించిన, సంఘాన్ని గురించిన అనుకూల విషయాలను చర్చిస్తూ, మీ పిల్లలతో ఆధ్యాత్మికంగా నిర్మాణాత్మకమైన సంభాషణలను జరుపుతారా? మీరు కుటుంబ సమేతంగా అన్ని కూటాలకూ హాజరయ్యేందుకూ, క్షేత్ర పరిచర్యలో భాగం వహించేందుకూ ఆతురత చూపిస్తారా?
4 తల్లిదండ్రులారా, మీ పిల్లలకు మీరు ఉంచే మాదిరిని గురించి అవలోకించండి. మీ మాదిరి ఉత్తమమైనదిగా ఉండేలా చూడండి. అలాగైతే, వాళ్ళు దాన్ని తమ జీవిత కాలమంతటిలోనూ ఒక నిధిగా తమ మనస్సులో పదిలపరచుకుంటారు. “ప్రేమామయులైన నా క్రైస్తవ తల్లిదండ్రుల మాదిరి నుండి నేను ఇప్పటికీ ప్రయోజనాన్ని పొందుతున్నాను. నేను ఈ వారసత్వాన్ని భవిష్యత్తులో కూడా ఉపయోగిస్తూ నా పూర్ణ మెప్పుదలను నిరూపించుకోవాలని హృదయపూర్వకంగా దేవుడ్ని ప్రార్థిస్తున్నాను” అని ఇప్పుడు తన 70వ పడిలో ఉన్న ఒక ప్రయాణ పైవిచారణకర్త భార్య అన్నారు.