‘సత్క్రియలు అను ధనము గలవారై ఉండండి’
1 అపొస్తలుడైన పౌలు అత్యంతాసక్తితో చేసిన తన పరిచర్య చివరి సంవత్సరాల్లో, తిమోతితోనూ తీతుతోనూ సన్నిహితంగా పనిచేశాడు. వారిద్దరికీ, ఆయన ఒకేలాంటి ప్రోత్సాహకరమైన మాటలు వ్రాశాడు. తీతుతో, ‘దేవునియందు విశ్వాసముంచినవారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచాలని’ ఆయన చెప్పాడు. (తీతు 3:8) తమ నిరీక్షణను దేవునిపై ఉంచేవారు ‘సత్క్రియలు అను ధనము గలవారై’ ఉండాలని ఆయన తిమోతికి చెప్పాడు. (1 తిమో. 6:17, 18) ఇది మనకు కూడా అత్యుత్తమమైన సలహా! కానీ మన జీవితాల్లో సత్క్రియలు చేయడానికి మనల్ని ఏది పురికొల్పుతుంది? మరియు రాబోయే రోజుల్లో మనము ఏ నిర్దిష్టమైన పనులు చేస్తాము?
2 మనకు యెహోవా మీదున్న విశ్వాస ప్రేమలనుండి, ఆయన మనకిచ్చిన అద్భుతమైన నిరీక్షణనుండి, సరైన పనులు అను ధనముగలవారిగా ఉండాలన్న ప్రేరణ మనకు కలుగుతుంది. (1 తిమో. 6:18, 19; తీతు 2:11) ప్రత్యేకంగా సంవత్సరంలోని ఈ సమయంలో, యేసు తన తండ్రి నామమును మహిమపరచడానికీ యోగ్యులైన మానవులందరికి నిత్యజీవ మార్గాన్ని తెరవడానికీ యెహోవా తన కుమారుడ్ని భూమి మీదికి పంపించాడన్న విషయం మనకు గుర్తు చేయబడుతుంది. (మత్త. 20:28; యోహా. 3:16) మార్చి 28న జరిగే క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణలో ఇది పూర్తిగా స్పష్టము చేయబడుతుంది. నిత్యజీవాన్ని పొందడం గురించి మనకున్న నిరీక్షణకు ప్రతిస్పందనగా ‘సత్క్రియలు అను ధనముగలవారమై’ ఉండడానికి మనము చేయగలిగినదంతా చేయడానికి మనం పురికొల్పబడలేదా? నిజంగా పురికొల్పబడ్డాము! మనము ఇప్పుడు ఏ క్రియలు చేయవచ్చు?
3 మార్చిలో, ఆ తరువాతి నెలల్లో చేయవలసిన సత్క్రియలు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులమైన మనకు సంవత్సరమంతటిలో అతిప్రాముఖ్యమైన సంఘటన. దానికి మనము తప్పక హాజరౌతాము. (లూకా 22:19) అయితే ఆ సందర్భంలోని మన ఆనందాన్ని వీలైనంతమందితో మనం పంచుకోవాలనుకుంటాము. 2002 వార్షిక పుస్తకము నందున్న సేవా నివేదికను చూడండి, గత సంవత్సరం భూవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలలో జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనవారి సంఖ్య ప్రచారకుల సంఖ్యకంటే మూడు, నాలుగు, అయిదు, లేక ఇంకా ఎక్కువ రెట్లు అధికంగా ఉన్నట్లు మీరు గమనిస్తారు. తమ క్షేత్రమంతటా జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానాలను విస్తృతంగా పంచిపెట్టడానికి, సంఘాల్లో ఉన్నవారందరూ ఖచ్చితంగా ఎంతో కృషి చేశారు. కాబట్టి, మనము ఇప్పటినుంచి మార్చి 28 వరకు, రక్షణ నిరీక్షణ గురించి తెలుసుకొనేలా ప్రజలకు సహాయపడుతూ, వారిని జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించడంలో సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని గడపాలనుకుంటాము.
4 ఏప్రిల్ నెలలో స్కూళ్ళకు సెలవు ఉండడంవల్ల తల్లిదండ్రులు, పిల్లలు ఖాళీగా ప్రశాంతంగా ఉంటారు. మనము ‘సత్క్రియలు అను ధనముగలవారమై’ ఉండటానికి ఇటువంటి అనుకూలమైన పరిస్థితులను ప్రయోజనకరంగా ఎలా ఉపయోగించుకోవచ్చు? సువార్త ప్రకటనా పనియందు ఉత్సాహంగా భాగం వహించడంలో కొనసాగుతూ ‘సత్క్రియలయందు ఆసక్తిగల’ వారంగా ఉండడం ద్వారా మనమలా చేయవచ్చు. (తీతు 2:14; మత్త. 24:14) మీరు ఒకవేళ మార్చిలో సహాయ పయినీరు సేవ చేయలేకపోతే, ఏప్రిల్ మరియు/లేక మే నెలలో చేయగలరా? మీరు మార్చి నెలలో పయినీరు సేవ చేస్తున్నట్లైతే, దాన్ని అలాగే కొనసాగించగలరా?
5 ఉద్యోగాలు చేసుకునే కొందరు, తమ పనిస్థలానికి వెళ్ళేటప్పుడు, వీధి సాక్ష్యం ఇవ్వడం ద్వారా లేక ఉదయం తొందరగా తమ వ్యాపారాలు ప్రారంభించే ప్రజలతో మాట్లాడడం ద్వారా, పరిచర్యలో ఒక గంట సమయం గడపగలమని గ్రహిస్తారు. ఇతరులు, తమ మధ్యాహ్న భోజన సమయంలో కొంత భాగం సాక్ష్యమివ్వడానికి ఉపయోగించాలని పట్టిక వేసుకుంటారు. ఆ సమయంలో తోటి పనివారితో బైబిలు అధ్యయనం నిర్వహించడం సాధ్యమని కొందరు గ్రహించారు. గృహిణులైన చాలామంది సహోదరీలు స్కూళ్ళు మూసివున్నప్పుడు క్షేత్ర పరిచర్యకు సమయం వెచ్చించగలిగినట్లే స్కూళ్ళు తెరచి ఉన్నప్పుడు కూడా సమయం వెచ్చించగలిగారు. కొన్ని రోజుల్లో ఇంటి పనులు చేసుకోవడానికి కొంచెం ముందుగా నిద్ర లేవడం వల్ల, మిగతా రోజంతటిలో ప్రకటించడానికి, బోధించడానికి వారికి ఎక్కువ సమయం ఉంటుంది.—ఎఫె. 5:15, 16.
6 మీరు సహాయ పయినీరు సేవ చేయలేకపోతున్నప్పటికీ, ‘మేలుచేయడానికి, సత్క్రియలు అను ధనము గలవారై ఉండడానికి, ఔదార్యముగలవారై ఉండడానికి,’ సత్యము అనే ‘ధనములో ఇతరులకు పాలిచ్చువారై’ ఉండడానికి, మీరు చేయగలిగినదంతా చేస్తూ పరిచర్యలో ఎక్కువగా భాగం వహించడానికి ఒక వ్యక్తిగత షెడ్యూల్‌ను తయారుచేసుకోవచ్చు.—1 తిమో. 6:18.
7 శిష్యులను చేయడమనే సత్క్రియను జ్ఞాపకముంచుకోండి: ప్రతి సంవత్సరం ఆసక్తి కలవారు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవుతారు. అలా హాజరై ప్రస్తుతం అధ్యయనం చేయకుండా ఉన్నవారి గురించి శ్రద్ధ తీసుకోవడానికి సంఘంలో కొందరికి సాధ్యమవుతుందా? వారు ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించటానికి సహాయపడే ఉద్దేశంతో పునర్దర్శనాలు చేయడం సాధ్యమవుతుందా? ఇలా జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైనవారిలో కొందరు బహుశా సాక్షుల బంధువులు అయ్యుండవచ్చు. ఇతరులు గతంలో అధ్యయనం చేసి ఉండవచ్చు, వారు తిరిగి అధ్యయనాన్నీ, క్రమంగా కూటాలకు హాజరుకావడాన్నీ పునఃప్రారంభించేందుకు వారికి కేవలం కొద్దిపాటి ప్రోత్సాహం అవసరం కావచ్చు. మనతోపాటు వారుకూడా యెహోవా యొక్క క్రియాశీల సేవకులవ్వడం చూసినప్పుడు అది మనకెంత ఆనందాన్నిస్తుందో కదా!
8 మార్చిలోను, ఆ తరువాతి నెలల్లోను పరిచర్యలో అధికంగా పాల్గొనడం వల్ల, మళ్ళీ దర్శించవలసిన ఆసక్తిగలవారిని ఇంకా ఎక్కువమందిని మనం తప్పక కనుగొనే అవకాశం ఉంది. మీరు వారివద్ద నుండి వచ్చేసేటప్పుడు వారిని ఒక ప్రశ్న అడగండి. ఈ సారి వారిని దర్శించినప్పుడు జవాబిస్తానని చెప్పండి. మనమలా చేస్తే పునర్దర్శనం చేయడానికి మార్గం సుగమం అవుతుంది. మనం ఎంత త్వరగా పునర్దర్శనం చేయగలిగితే అంత మంచిది. మొదటి దర్శనంలో బైబిలు అధ్యయనం ప్రారంభించలేకపోతే, వీలైతే తర్వాతి దర్శనంలోనే దాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించాలనుకుంటాము.
9 మనము వీధి సాక్ష్యంలో పాల్గొంటున్నప్పుడు, ప్రజలతో సంభాషణ ప్రారంభించేందుకు ప్రయత్నించడానికి అప్రమత్తంగా ఉండాలి. వీధి సాక్ష్యం ఇస్తుండగా చాలామంది ప్రచారకులకు తాము కలిసిన ఆసక్తిగలవారు తమ పేర్లు, చిరునామాలు, టెలిఫోన్ నంబర్లు ఇచ్చారు. మీరు కలిసిన వ్యక్తి మీ సంఘ క్షేత్రంలో నివసించకపోతే, రాజ్యమందిరం నుంచి ప్లీజ్ ఫాలో అప్ (S-43) పత్రాన్ని తీసుకుని, దాన్ని నింపి, సంఘ కార్యదర్శికి ఇవ్వండి. అతను దాన్ని ఆ వ్యక్తి ఏ సంఘ క్షేత్రంలో నివసిస్తాడో, ఆ సంఘానికి పంపిస్తాడు. ఒకవేళ కార్యదర్శి అలా చేయలేకపోతే, దాని గురించి శ్రద్ధ తీసుకోవడానికి గాను దాన్ని బ్రాంచి కార్యాలయానికి పంపుతాడు. ఈ విధంగా, ఆసక్తిని పెంపొందింపచేయవచ్చు.
10 ఒకవేళ చిరునామా కాకుండా టెలిఫోన్ నంబరు లభిస్తే, ఆ వ్యక్తికి ఫోన్ చేయడం ద్వారా పునర్దర్శనం చేయండి. మీరు ఏమి చర్చించాలనుకుంటున్నారో ముందుగానే సిద్ధపడండి. వెంటనే సంప్రదించడానికి వీలుగా తర్కించడం (ఆంగ్లం) పుస్తకాన్ని దగ్గర్లో ఉంచుకోండి. కొందరు ఇతరులతో టెలిఫోను ద్వారా అధ్యయనం చేయడంలో చక్కని ఫలితాలను సాధిస్తున్నారు, నేరుగా ఇంటికి వెళ్ళి కలవడం కుదరనివారితో కూడా అలా అధ్యయనం చేస్తున్నారు. ఒక సహోదరి ఇంటింటి పరిచర్యలో తాను కలుసుకున్న ఆసక్తిగల స్త్రీల ఫోన్ నంబర్లు అడగడం మొదలుపెట్టింది, దాని ఫలితంగా ఆమె రెండు బైబిలు అధ్యయనాలను ప్రారంభించగలిగింది.
11 నిష్క్రియులకు సహాయం చేయడంలో పెద్దలతో సహకరించండి: వీరికి ప్రేమపూర్వక అవధానాన్నివ్వడంలో పెద్దలు ఎంతో శ్రద్ధ వహిస్తారు. అలాంటి వారిలో చాలామంది తామే చొరవ తీసుకొని మళ్ళీ సంఘ కూటాలకు హాజరవ్వడము ఇప్పటికే మొదలుపెట్టారు. 91వ కీర్తనలో వర్ణించబడిన ఆధ్యాత్మిక భద్రతను పొందడానికి యెహోవా సంస్థతో సన్నిహితంగా సహవసించడం అవసరమని వారు గుర్తిస్తారు. ఇప్పుడు వీరిలో కొందరు క్షేత్ర సేవలో భాగం వహించడానికి సిద్ధంగా ఉన్నారు. నిష్క్రియులుగా ఉన్న ఇతరులు ఈ నెలలో జ్ఞాపకార్థ ఆచరణకు హాజరైతే, వారు వ్యక్తిగత బైబిలు అధ్యయనం చేయడానికి ఇష్టపడవచ్చు. ఒకవేళ వారు అలా ఇష్టపడి సహాయం కోరితే, వారితో అధ్యయనం చేయడానికి పెద్దలు ఎవరినైనా ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా సహాయపడడానికి మీరు ఆహ్వానించబడితే, మీ సహకారం ఎంతో విలువైనదిగా ఎంచబడుతుంది.—రోమా. 15:1, 2.
12 ‘సత్క్రియలను శ్రద్ధగా’ చేయడంలో కొనసాగండి: ఒక నెల లేదా అంతకన్నా ఎక్కువ నెలలు సహాయ పయినీరు సేవ చేసిన చాలామంది, తర్వాతి నెలల్లో క్షేత్ర సేవలో తాము ఎక్కువగా పాల్గొన్నట్లు కనుగొన్నారు. తిరిగి సందర్శించవలసిన అవసరత ఉన్నట్లు తమకు అనిపించిన, ఆసక్తి కలవారిని వారు కలుసుకున్నారు. ఆసక్తి గలవారిని మళ్ళీ కలుసుకోవడానికి వీలుగా, క్షేత్ర సేవలో మరింత తరచుగా పాల్గొనడానికి ఎక్కువ కృషి చేయడానికి అది వారిని పురికొల్పింది. కొందరు అధ్యయనాలను ప్రారంభించారు, వారు పరిచర్యలో ఇంకా ఎక్కువగా భాగం వహించడానికి అది వారికి సహాయపడింది.
13 మరితరులు, ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో ఎక్కువగా భాగం వహించడం ద్వారా ఎంత సంతోషాన్ని పొందారంటే, వారు తమ ప్రాధాన్యతలను విశ్లేషించుకోవడానికి పురికొల్పబడ్డారు. దాని ఫలితంగా, కొందరు ఉద్యోగానికి కేటాయించే సమయాన్ని తగ్గించి, సహాయ పయినీర్లుగా కొనసాగగలిగారు. ఇతరులు క్రమ పయినీరు సేవను ప్రారంభించగలిగారు. వారు తమ నిరీక్షణను లోకం అందించే విషయాలమీద కాక పూర్తిగా దేవుని మీద ఉంచగలిగారు. ‘ఔదార్యముగలవారిగా, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారిగా’ ఉండడం యెహోవా నుంచి గొప్ప ఆశీర్వాదాలను తెచ్చినట్లు, “వాస్తవమైన జీవమును” అనుభవించే తమ నిరీక్షణను బలపరచినట్లు వారు గ్రహించారు. (1 తిమో. 6:18, 19) ఎక్కువమంది పయినీరు సేవను చేపట్టడం ద్వారా సహజంగానే మొత్తం సంఘం ప్రయోజనం పొందుతుంది. పయినీర్లు తమ అనుభవాల గురించి మాట్లాడడానికి, తమతోపాటు పరిచర్యలో పాల్గొనమని ఇతరులను ఆహ్వానించడానికి మొగ్గు చూపుతారు, వారలా చేయడం సంఘంలో చక్కని ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఉత్పన్నం చేస్తుంది.
14 మనందరం ఈ జ్ఞాపకార్థ ఆచరణ కాలంలోను ఆ తరువాత కూడా క్రైస్తవ పరిచర్యలో అధికంగా భాగం వహిస్తూ ‘సత్క్రియలు అను ధనముగలవారమై’ ఉందుము గాక. మనకు నీతియుక్తమైన క్రొత్త భూమిమీద నిరంతరం జీవించే నిరీక్షణను ఇవ్వడానికి యెహోవా చేసినదానికి మనము మన కృతజ్ఞతను వ్యక్తపరుద్దాము.—2 పేతు. 3:13.