‘సువార్తనుగూర్చి సాక్ష్యమివ్వండి’
1 మంచి వార్తలు అరుదుగా ఉన్న ప్రపంచంలో, ‘దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చే’ ఆధిక్యత మనకుంది. (అపొ. 20:24) త్వరలోనే “అంత్యదినాలు” ముగిసి, యెహోవా నీతియుక్తమైన నూతన లోకం వస్తుందనీ, అప్పుడు ‘మొదటి సంగతులు గతించిపోతాయని’ ప్రజలకు తెలియజేయడం కూడా ఈ ఆధిక్యతలో భాగమే. (2 తిమో. 3:1-5; ప్రక. 21:4) అప్పుడు వ్యాధులు ఇక ఉండవు. (యెష. 33:24) చనిపోయిన ఆత్మీయులు సమాధుల్లో నుండి బయటకు వచ్చి కుటుంబసభ్యులను, స్నేహితులను తిరిగి కలుసుకుంటారు. (యోహా. 5:28, 29) భూమియావత్తు అందమైన పరదైసుగా మారుతుంది. (యెష. 65:21-23) మనం తెలియజేసే సువార్తలో ఇవి మచ్చుకు కొన్ని విషయాలు మాత్రమే!
2 అలాంటి సువార్తను ప్రకటించడానికి మార్చి, ఏప్రిల్, మే నెలలు ఎంతో అనువైనవి. ఈ నెలల్లో, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వాతావరణం పొడిగావుండి త్వరగా చీకటిపడదు కాబట్టి, పరిచర్యలో ఎక్కువ సమయం గడపడానికి వీలుంటుంది. అంతేకాక, సంవత్సరంలో అత్యంత ప్రాముఖ్యమైన సందర్భమైన జ్ఞాపకార్థ ఆచరణ ప్రపంచమంతటా మార్చి 22, శనివారం సూర్యాస్తమయం తర్వాత జరపబడుతుంది. కాబట్టి క్షేత్ర సేవలో ఎక్కువ సమయం గడిపేందుకు ఏర్పాట్లు చేసుకోవడానికి ఇదే తగిన సమయం.
3 సహాయ పయినీరు సేవ: ఒకటి, రెండు, లేదా మూడు నెలలు కూడా సహాయ పయినీరు సేవ చేయడానికి సర్దుబాట్లు చేసుకోగలరా? ఈ విషయాన్ని చర్చించడానికి, మీరు తర్వాతి కుటుంబ అధ్యయనంలో కొంచెం సమయం ఎందుకు తీసుకోకూడదు? కుటుంబం మంచిగా సహకరిస్తే ఒకరు కాదు అంతకన్నా ఎక్కువమందే సహాయ పయినీరు సేవ చేయవచ్చు. (సామె. 15:22) ఈ విషయం గురించి ప్రార్థిస్తే, యెహోవా మీ ప్రయత్నాలను ఆశీర్వదించడాన్ని మీరే స్వయంగా చూడగలుగుతారు. (సామె. 16:3) ఒకవేళ కుటుంబంలో ఎవరూ సహాయ పయినీరు సేవ చేయలేకపోయినా, కుటుంబంలో ఉన్నవారంతా పయినీరు సేవ చేయగలిగే ఇతరులతో కలిసిపనిచేయడం ద్వారా పరిచర్యలో ఎక్కువగా భాగం వహించాలనే నిర్దిష్ట లక్ష్యాలను పెట్టుకోవచ్చు.
4 మీరు ఉద్యోగస్థులైతే, చక్కగా ప్రణాళిక వేసుకోవడం ద్వారా సహాయ పయినీరు సేవ చేయవచ్చు. బహుశా మధ్యాహ్నం దొరికే భోజన విరామంలో మీరు కొంత సమయయాన్ని ప్రకటించడానికి వెచ్చించవచ్చు. లేక మీ ఇంటికి దగ్గర్లోగానీ, మీ ఉద్యోగస్థలం దగ్గర్లోగానీ వ్యక్తిగత క్షేత్రాన్ని మీరు అడిగి తీసుకుని, అలా తీసుకున్న క్షేత్రంలో, పనికివెళ్ళే ముందుగానీ, తర్వాతగానీ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ గంటలు పరిచర్య చేయవచ్చు. అంత ప్రాముఖ్యంకాని పనులను మరో నెలకి వాయిదా వేసుకోవడంద్వారా వారాంతాల్లో రోజంతా పరిచర్యలో గడపడానికి వీలుగా ప్రణాళిక వేసుకోవచ్చు. కొంతమంది క్షేత్ర సేవ చేయడానికి ఒకటి, రెండు రోజులు సెలవు తీసుకోగలిగారు.
5 మీరు వయోజనులైనా లేదా అస్వస్థులైనా లేక ఒంట్లో సత్తువ లేనివారైనా, ప్రతీరోజు కొద్దిసేపు పరిచర్య చేయడం ద్వారా మీరు సహాయ పయినీరు సేవ చేయవచ్చు. మీకు ‘బలాధిక్యత’ ఇవ్వమని యెహోవాను కోరండి. (2 కొరిం. 4:7) ఒక సహోదరి 106 సంవత్సరాల వయసులో కూడా సహాయ పయినీరు సేవ చేయగలిగింది! క్రైస్తవులైన తన బంధువుల, సంఘలోని ఇతరుల సహాయంతో ఆమె ఇంటింటి పరిచర్యకు, పునర్దర్శనాలకు, బైబిలు అధ్యయనాలకు వెళ్ళగలగడంతోపాటు వివిధ రీతుల్లో పరిచర్య చేయగలిగింది. ఆమె పదిమందికి బైబిలు అధ్యయనాలను ప్రారంభించడంలో సహాయపడింది. ఆమె ఇలా చెబుతోంది: “సహాయ పయినీరు సేవ చేసే అద్భుతమైన అవకాశం గురించి ఆలోచించినప్పుడు, యెహోవాపట్ల, ఆయన కుమారునిపట్ల, ప్రేమగల ఆయన సంస్థపట్ల నా హృదయం ప్రేమతో, కృతజ్ఞతతో నిండిపోతుంది. నేను ‘యెహోవా నీకెంతో కృతజ్ఞతలు’ అని నిజంగా చెప్పాలనుకుంటున్నాను.”
6 మీరు ఇప్పటికే బాప్తిస్మం తీసుకొని, స్కూల్లో చదువుకుంటున్న యౌవనులైతే, మీరు కూడా సహాయ పయినీరు సేవ చేయవచ్చు. ఉద్యోగస్థుల్లాగే మీరు కూడా బహుశా వారాంతాలను పరిచర్య కోసం కేటాయించవచ్చు. బహుశా మిగతా రోజుల్లో కూడా మీరు స్కూలు ముగిసిన తర్వాత ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ గంటలు పరిచర్య చేయవచ్చు. అలా చేయడానికి వీలుగా ఆ నెలలో సెలవులు ఏవైనా ఉన్నాయా? మీకు సహాయ పయినీరు సేవ చేయాలనివుంటే దాని గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడండి.
7 ఉత్సాహాన్ని పెంచండి: పెద్దలు తమ మాదిరి ద్వారా సంఘ సభ్యుల ఉత్సాహాన్ని పెంచడానికి ఎంతో చేయవచ్చు. (1 పేతు. 5:2, 3) ఉదయాన్నే, స్కూలు అయిపోయిన తర్వాత లేదా ఉద్యోగం నుండి వచ్చిన తర్వాత పరిచర్య చేయాలనుకునే వారికోసం అదనపు క్షేత్ర సేవా కూటాలను ఏర్పాటు చేయాలనుకోవచ్చు. ఈ క్షేత్ర సేవా కూటాలను నిర్వహించడానికి అర్హులైన ప్రచారకులను సేవా పైవిచారణకర్త నియమించాలి. అంతేకాక ప్రత్యేక కార్యకలాపాలు జరిగే ఈ నెలల్లో కావలసినంత క్షేత్రం, పత్రికలు, సాహిత్యాలు అందుబాటులో ఉండేలా చూడాలి.
8 ఒక సంఘంలో పెద్దలు, ఎన్నో నెలల ముందు నుండే సహాయ పయినీరు సేవ చేయమని ప్రోత్సహిస్తూ వచ్చారు. అలా చేయడానికి అర్హులైన ప్రచారకుల పేర్లను ప్రతీవారం సంఘంలో ప్రకటించారు. దీనివల్ల పరిచర్యను ఎక్కువగా చేయాలనుకున్నవారు తమకు మంచి మద్దతు ఉంటుందని తెలుసుకోగలిగారు. తెల్లవారుజామున, సాయంకాలాల్లో క్షేత్ర సేవా కూటాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఫలితంగా సంఘంలో 53 మంది ప్రచారకులు అంటే ఇంచుమించు సగంమంది ఏప్రిల్ నెలలో సహాయ పయినీరు సేవ చేయగలిగారు! వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో సహోదరులకు పెద్దల ప్రోత్సాహం చాలా అవసరం. ఉత్తరాలు రాయడం, ఫోన్ సాక్ష్యం వంటి వివిధ పద్ధతుల్లో సువార్తను ప్రకటించడాన్ని క్షేత్ర సేవా కూటాల్లో ప్రదర్శింపజేయవచ్చు.
9 ప్రకటించేందుకు ఇతరులకు సహాయపడండి: క్రొత్తవారు, యౌవనస్థులు ప్రచారకులవ్వడానికి అర్హులైనప్పుడు, వారిని అనుభవంగల ప్రచారకులు తమతో కలిసి క్షేత్ర సేవలో పనిచేయడానికి రమ్మని పిలవవచ్చు. జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో సంఘంలోని అనేకమంది పరిచర్యలో ఎక్కువగా పాల్గొంటారు కాబట్టి వారిని పరిచర్యకు తీసుకువెళ్లడానికి అది చక్కని సమయం. మీ బైబిలు విద్యార్థులెవరైనా యెహోవా నీతియుక్తమైన ప్రమాణాలకు అనుగుణంగా తమ జీవితాన్ని మలచుకుని ప్రగతి సాధిస్తున్నారా? ఇంకా ప్రచారకులుకాని మీ పిల్లలు మంచి ప్రవర్తనకలిగి, ప్రగతి సాధిస్తున్నారా? అలాంటి వారు బాప్తిస్మం తీసుకోని ప్రచారకులు కావాలనుకుంటున్నాం అని చెప్పినప్పుడు, వారు దానికి అర్హులు అని మీకనిపిస్తే ఆ విషయాన్ని పెద్దల్లో ఒకరికి తెలియజేయండి. సంఘ పైవిచారణకర్త మీతో, మీ పిల్లవానితో లేక విద్యార్థితో ఇద్దరు పెద్దలు ఆ విషయం గురించి చర్చించడానికి ఏర్పాటు చేస్తాడు.
10 చాలా కాలంగా పరిచర్యలో పాల్గొనని వారు తిరిగి సంఘంతో కలిసి ప్రకటనా పనిలో భాగం వహించడానికి కూడా రాబోయే నెలలు అనువైనవి. సంఘ పుస్తక అధ్యయన పైవిచారణకర్తలు, ఇతర పెద్దలు అలాంటి వారిని కలుసుకోవడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేసి, పరిచర్యలో తమతోపాటు కలిసి పనిచేయమని స్నేహపూర్వకంగా వారిని ప్రోత్సహించాలి. వారు చాలాకాలం నుండి సంఘంతో సహవసించని వారైతే, వారు అర్హులో కాదో నిర్ణయించేందుకు ఇద్దరు పెద్దలు మొదట వారితో మాట్లాడాలి.—km-TU 11/00 3వ పేజీ.
11 జ్ఞాపకార్థ ఆచరణకు సిద్ధపడండి: విమోచన క్రయధనం “దేవుని కృపకు” గొప్ప నిదర్శనం. (అపొ. 20:24) కృతజ్ఞతాభావంగల లక్షలాదిమంది మార్చి 22 శనివారం సూర్యాస్తమయం తర్వాత క్రీస్తు మరణ జ్ఞాపకార్థాన్ని ఆచరించడానికి ప్రపంచవ్యాప్తంగా కూడుకుంటారు. మానవులపట్ల యెహోవా చూపించిన కృపకు నిదర్శనంగావున్న ఈ ప్రాముఖ్యమైన సంఘటనకు యథార్థ హృదయులందరిని ఆహ్వానించడమే కాదు, హాజరయ్యేలా వారికి సహాయం చేయాలని కూడా మనం కోరుకుంటాం.
12 ఆహ్వానించాలనుకుంటున్న వారందరి పేర్లను రాసిపెట్టుకోండి. బంధువుల, పొరుగువారి, ఉద్యోగస్థలంలోని లేదా స్కూల్లోని పరిచయస్థుల, ఒకప్పటి బైబిలు విద్యార్థుల, ప్రస్తుతపు బైబిలు విద్యార్థుల, మీరు క్రమంగా కలుసుకొనే వారందరి పేర్లను రాసిపెట్టుకోవాలి. మీరు ఆహ్వానించిన వారిలో ఎవరికైనా జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే బైబిలు బోధిస్తోంది పుస్తకంలోని అనుబంధంలో 206-8 పేజీల్లోవున్న ప్రభువు రాత్రి భోజనం అనే ఆర్టికల్ మీకు సహాయకరంగా ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో బైబిలు అధ్యయనాలను నిర్వహించడానికి మనం ఉపయోగిస్తున్న ప్రచురణను వారికి పరిచయం చేసే మంచి అవకాశం దొరుకుతుంది కాబట్టి మీరు బైబిలు అధ్యయనం ప్రారంభించగలుగుతారు.
13 ఒక సహోదరి 48 కుటుంబాలను ఆహ్వానించాలని లిస్టు రాసిపెట్టుకుంది. ఆమె ఆహ్వానించినవారి పేర్లను కొట్టివేసి, వారిని ఎప్పుడు ఆహ్వానించిందో రాసిపెట్టుకుంది. ఆమె ఆహ్వానించిన వారిలో 26 మంది జ్ఞాపకార్థ ఆచరణకు రావడం ఆమెను ఎంత సంతోషపరచి ఉంటుందో కదా! సొంత షాపున్న ఒక సహోదరుడు తన దగ్గర పనిచేసే ఒక వ్యక్తిని ఆహ్వానించాడు. ఆ వ్యక్తి ఒకప్పుడు మతగురువుగా పనిచేసేవాడు. ఆ వ్యక్తి ఆచరణకు హాజరైన తర్వాత ఇలా అన్నాడు: “నేను 30 సంవత్సరాలు క్యాథలిక్ చర్చిలో నేర్చుకున్న దానికంటే ఇక్కడ ఒక్క గంటలో బైబిలు గురించి ఎక్కువగా తెలుసుకున్నాను.” జ్ఞాపకార్థ ఆచరణ అయిపోయిన వెంటనే ఆయన బైబిలు బోధిస్తోంది పుస్తకంనుండి అధ్యయనం చేయడానికి అంగీకరించాడు.
14 ప్రచార కార్యక్రమం: ప్రపంచవ్యాప్తంగా, మార్చి 1 మొదలుకొని మార్చి 22 వరకు జ్ఞాపకార్థ ఆచరణ కోసం ప్రత్యేక ఆహ్వానప్రతులు పంచిపెట్టబడతాయి. మనమందరం ఈ ప్రాముఖ్యమైన ప్రచార కార్యక్రమంలో పూర్తిగా భాగం వహించాలని కోరుకుంటాము. ఆహ్వానప్రతిని తలుపు దగ్గర విడిచిపెట్టడంకన్నా గృహస్థుని చేతికి ఇవ్వడం మంచిది. అయితే, మీకు క్షేత్రం ఎక్కువగావుంటే తాళం వేసివున్న ఇళ్ల దగ్గర ఆహ్వానప్రతులు బయటకు కనిపించకుండా పెట్టాలని పెద్దలు నిర్ణయించవచ్చు. వారాంతాల్లో ఆహ్వానప్రతులతోపాటు తాజా పత్రికలను కూడా అందిస్తాం.
15 ఆహ్వానప్రతులను పంచిపెట్టడానికి మనకు సమయం కొద్దిగానే ఉంటుంది కాబట్టి మన అందింపు క్లుప్తంగా ఉంటే మంచిది. స్నేహపూర్వకంగా, ఉత్సాహంగా ఉండండి. గృహస్థునికి మన సందేశంపట్ల ఆసక్తి ఉందో లేదో మీరు గ్రహించిన తర్వాత, మీరిలా చెప్పవచ్చు: “మార్చి 22న జరగబోయే ప్రాముఖ్యమైన సంఘటనకు మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు తప్పకుండా రావాలని ఆహ్వానిస్తున్నాము. ఇది మీకోసం, తీసుకోండి. వివరాలు ఇందులో ఉన్నాయి.” గృహస్థునికి ఏవైనా సందేహాలు ఉండవచ్చు. లేక ఆహ్వానప్రతిని తీసుకుని తాను హాజరౌతానని కూడా చెప్పవచ్చు. ఆసక్తి కనబరచిన వారి వివరాలను రాసిపెట్టుకొని వారిని మళ్ళీ కలుసుకునే ఏర్పాట్లు చేసుకోండి.
16 గత సంవత్సరం ఒక సైనికునికి తన ఇంటి గుమ్మం దగ్గర జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానప్రతి కనిపించింది. దానికి అతను హాజరవ్వాలి అనుకున్నాడు గానీ దానికి అతను తన పై అధికారి దగ్గర అనుమతి తీసుకోవాలి. అతను తన పై అధికారికి ఆ ఆహ్వానప్రతిని చూపించినప్పుడు ఆయన కొంతసేపు మౌనంగా ఉండి, తర్వాత తన తల్లిదండ్రులు సాక్షులని, తాను ఒకప్పుడు వారితోపాటు కూటాలకు హాజరయ్యేవాడినని చెప్పాడు. పై అధికారి ఆ సైనికునికి జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడానికి అనుమతి ఇవ్వడమే కాదు, అతనితోపాటు ఆయన కూడా హాజరయ్యాడు!
17 కృతజ్ఞత చూపించండి: 2008 జ్ఞాపకార్థ ఆచరణ దగ్గరపడుతుండగా, మనపట్ల యెహోవా చూపించిన కృప గురించి మనలో ప్రతిఒక్కరం ధ్యానించాలి. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసికొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము.” (2 కొరిం. 6:1) మనం దేవుని కృపను వ్యర్థము చేయలేదని మనమెలా చూపించవచ్చు? పౌలు ఇలా రాశాడు: “మేము అన్ని విషయాలలో దేవుని సేవకులమని రుజువు చేసుకుంటున్నాము.” (2 కొరిం. 6:4, ఈజీ-టు-రీడ్ వర్షన్) కాబట్టి, మనం మంచి ప్రవర్తనద్వారా, సువార్తను ఆసక్తితో ప్రకటించడం ద్వారా యెహోవా మనకిచ్చిన బహుమానంపట్ల కృతజ్ఞతను చూపిస్తాం. పరిచర్యలో ఎక్కువగా పాల్గొనడానికి, సువార్త గురించి సాక్ష్యమివ్వడానికి ఈ జ్ఞాపకార్థ ఆచరణ కాలం ఎంతో అనువైన సమయం.
[అధ్యయన ప్రశ్నలు]
1. మనం ఎలాంటి సువార్తను తెలియజేస్తున్నాం?
2. సువార్త ప్రకటించడానికి జ్ఞాపకార్థ ఆచరణ కాలం ఎంతో అనువైనదని ఎందుకు చెప్పవచ్చు?
3. కుటుంబపరంగా పరిచర్యలో ఎక్కువగా భాగం వహించడానికి ఏది మనకు సహాయపడుతుంది?
4. మనం ఉద్యోగస్థులమైతే సహాయ పయినీరు సేవ చేయడానికి మనమెలా సర్దుబాట్లు చేసుకోవచ్చు?
5. వయోజనులు, అస్వస్థులు సహాయ పయినీరు సేవ చేయడానికి మీరెలా వారికి సహాయం చేయవచ్చు?
6. ఇప్పటికే బాప్తిస్మం తీసుకొని, స్కూల్లో చదువుకుంటున్న యౌవనులు సహాయ పయినీరు సేవను ఎలా చేయగలరు?
7. జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో పరిచర్యపట్ల ఉత్సాహాన్ని పెంచడానికిగాను పెద్దలు ఏమి చేయవచ్చు?
8. ఒక సంఘ అనుభవం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
9. అర్హులైనవారు సువార్తను ప్రకటించడానికి జ్ఞాపకార్థ ఆచరణ కాలం ఎందుకు చక్కని సమయం?
10. చాలా కాలంగా సంఘంతో సహవసించని వారికి సహాయం చేయడానికి పెద్దలు ఏమి చేయవచ్చు?
11. “దేవుని కృపకు” గొప్ప నిదర్శనమేమిటి?
12. జ్ఞాపకార్థ ఆచరణకు మనం ఎవరెవర్ని ఆహ్వానించవచ్చు?
13. జ్ఞాపకార్థ ఆచరణకు ఇతరులను ఆహ్వానించాలని నిర్ణయించుకున్న ఇద్దరు ప్రచారకుల ప్రయత్నాలను యెహోవా ఎలా ఆశీర్వదించాడు?
14. మార్చి 1 మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రచార కార్యక్రమం ప్రారంభం కానుంది?
15. జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానప్రతిని మనమెలా అందివ్వవచ్చు?
16. క్షేత్రంలోవున్న ప్రజలను జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించడానికి మనం చేసే ప్రచార కార్యక్రమానికున్న విలువేమిటో తెలియజేసే ఒక అనుభవాన్ని చెప్పండి?
17. దేవుని కృపను మనం వ్యర్థము చేయలేదని మనమెలా చూపించవచ్చు?
[Box on page 7]
ఎవరెవరు సహాయ పయినీరు సేవ చేయగలరు?
▪ కుటుంబాలు
▪ ఉద్యోగస్థులు
▪ వయోజనులు, అనారోగ్యంతోవున్నవారు
▪ స్కూల్లో చదువుకుంటున్నవారు
[Box on page 8]
జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానప్రతులను పంచిపెడుతున్నప్పుడు:
▪ తక్కువగా, ఉత్సాహంగా మాట్లాడండి
▪ ఆసక్తి ఉన్నవారి వివరాలను రాసిపెట్టుకొని వారిని తిరిగి కలుసుకోండి
▪ వారాంతాల్లో పత్రికలను అందించండి