పరిశుభ్రత యెహోవాకు మహిమను తెస్తుంది
1 “పురుషులందరూ శుభ్రంగా ఉంటారు, టైలు కట్టుకుంటారు. స్త్రీలు నిరాడంబరంగానే ఉన్నప్పటికీ ఆకర్షణీయంగా వస్త్రాలు ధరిస్తారు.” సెక్యూరిటీ గార్డు అయిన మరో వ్యక్తి ఇలా అన్నాడు: “వారు చక్కగా ప్రవర్తిస్తారు, మర్యాదపూర్వకంగా నడుచుకుంటారు, శుచీ శుభ్రతా తెలిసిన ప్రజలు. నాకు కనిపిస్తున్నది ఎంతో రమ్యంగా ఉంది. అసహ్యకరమైన ఈ లోకంలో మీరు మురికిని నిర్మూలించగలిగారు.” ఈ వ్యాఖ్యానాలన్నీ ఏ గుంపు ప్రజలను వర్ణిస్తున్నాయి? ఒక రాజకీయ ర్యాలీనా? క్రికెట్ మాచ్నా? వివాహ వేడుకనా? ఎంతమాత్రం కాదు! ఈ వ్యాఖ్యానాలన్నీ గత సంవత్సరం జరిగిన ఒక పెద్ద జిల్లా సమావేశానికి హాజరైన సహోదర సహోదరీల గుంపును వర్ణిస్తున్నాయి.
2 మనకు ఎంత చక్కని ప్రశంసలు! మన సహోదరత్వం అంత ఉన్నతంగా ప్రశంసించబడుతున్నందుకు మనం కృతజ్ఞులం కామా? స్టేడియంను సిద్ధం చేయడంలో తమ పనితనం ద్వారా, మాదిరికరమైన తమ ప్రవర్తన ద్వారా గుంపులోని ప్రతి ఒక్కరూ మంచి రిపోర్టు వచ్చేందుకు దోహదపడ్డారు. మనం మన ప్రవర్తనా విధానం పూర్తి భిన్నంగా ఉన్నందుకు ప్రపంచవ్యాప్తంగా పేరొందాము. (మలా. 3:18) ఎందుకు? ఎందుకంటే “నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని” యెహోవా ఇచ్చిన ఆజ్ఞను మనం అనుసరిస్తాము కనుక.—1 పేతు. 1:14-16.
3 “అపరిశుద్ధమైన” దానిని పరిశుద్ధం చేయడమా? సమావేశాల కోసం మనం ఉపయోగించుకునే అద్దె భవనాలు సాధారణంగా అనేక సంవత్సరాలుగా ప్రజల దుర్వినియోగానికీ విధ్వంసకాండకూ చెత్తాచెదారం పేరుకుపోవడానికీ ఇతర విధాలైన దురవస్థలకూ గురై ఉన్నాయి. మూత్రశాలలు, గ్రీన్రూములు, ప్రక్కనే ఉండే ఇతర గదులు మన పరిశుద్ధ దేవుని ప్రమాణానికి ఎంతో తక్కువ స్థాయిలో ఉన్నాయి. వాస్తవానికి అవి ఈ యుగ సంబంధమైన “అపరిశుద్ధ” దేవతను చక్కగా ప్రతిబింబిస్తాయి. (2 కొరిం. 4:4) దీన్ని మార్చడానికి మనమేమి చేయవచ్చు?
4 చెన్నై, కొచ్చి, ముంబయి నగరాలు మునుపెన్నడూ చూడని విధంగా ఆ యా సమావేశ స్థలాలను సిద్ధం చేయడానికిగాను కార్యక్రమం ప్రారంభమవ్వడానికి రెండు లేదా మూడు రోజులు ముందు ఆ నగరాల్లో ఒక్కోదానిలో వెయ్యికి పైగా స్వచ్ఛంద సేవకులు అవసరమవుతారు. ఆ మూడు రోజుల్లోనూ మూత్రశాలలు శుభ్రం చేయడానికీ వరండాలు ఊడ్చడానికీ సీట్లు తుడవడానికీ అవసరమైన ఇతర పనులు చేయడానికీ ఇంకా అనేక వందలమంది నియమించబడతారు. మీరు కూడా యెహోవాను ఘనపరిచే ఈ ప్రత్యేక అవకాశంలో భాగం వహించేందుకు తగినవిధమైన పని దుస్తులు తీసుకుని రాగలిగేలా చూసుకోండి.
5 గతంలో మనం నేలను ఊడ్చడం, తడి గుడ్డలతో తుడవడం, కుర్చీలు కడగడం వంటి పనులు మాత్రమే చేసేవాళ్ళం. ఈ సంవత్సరం సమావేశ స్థలంలోని ప్రతి అంగుళం మన పరిశుభ్రమైన దేవుని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇందులో ప్రతి ఒక్కరూ భాగం వహించవచ్చు. చెత్త ఏదైనా కనిపిస్తే దాన్ని తీసుకువెళ్ళి చెత్త సంచుల్లో వేయడాన్ని పిల్లలకు నేర్పించవచ్చు. నేలమీద ఏమైనా ఒలికితే లేదా ఏదైనా విరిగిపోయి ఉంటే సరిచేయడానికి క్లీనింగ్ డిపార్ట్మెంట్కు చెప్పవచ్చు. స్నానాల గదులను మన సహోదరులు ఆసుపత్రి పరిశుభ్రతను ప్రతిబింబించేలా శుభ్రపరిచిన తర్వాత వాటిని అలాగే ఉంచడానికి మన వంతు మనం చేయవచ్చు.
6 వస్త్రధారణ, కేశాలంకరణ: ఇది దేన్ని సూచిస్తుంది? పరిశుభ్రంగా చక్కగా వస్త్రాలు ధరించడంలో మన సహోదర సహోదరీలు ప్రతి సంవత్సరం మంచి మాదిరిని ఉంచుతున్నారు. అందరూ సమావేశాలకు తమకున్నవాటిలో మంచి వస్త్రాలు ధరిస్తారు, మన సహోదరీలు చీరలే కట్టుకున్నా, సల్వార్-కమీజ్ లేదా స్కర్ట్ వేసుకున్నా వాటిని నిండుగా ధరించడాన్ని మనమెంతో ప్రశంసిస్తాము. ఈ లోకపు అత్యాధునిక స్టైల్ వస్త్రాలను ఎంపిక చేసుకోనందుకు యౌవనస్థులు కూడా ప్రశంసనీయులే. (రోమా. 12:2) ఇదే ప్రమాణాన్ని కాపాడుకోవడం ద్వారా మనం నిజంగా ‘దేవుని మహిమపరచాలని’ కోరుకుంటున్నామని సూచిస్తాము.—1 పేతు. 2:12.
7 వస్త్రధారణకు సంబంధించి, ముంబయిలో మేము కుర్చీలు ఏర్పాటు చేయడంలేదు కాబట్టి స్టేడియమ్ మెట్లపై కూర్చోడానికి అనువుగా ఉండేలాంటి వస్త్రాలు ధరించవలసిన అవసరం ఉంటుందని మనస్సులో ఉంచుకోండి. ఒక చాప గానీ చిన్న కుషన్గానీ తెచ్చుకోవడం మంచిది. కొచ్చిలో కూడా నాలుగు గోడల మధ్య చాలామంది కలిసి ఉండవలసి ఉంటుంది కాబట్టి, సౌకర్యంగా ఉండే వస్త్రాలు ధరించడం మంచిది.
8 ఈ సంవత్సరం “ఆసక్తిగల రాజ్య ప్రచారకులు” జిల్లా సమావేశంలో ‘మన దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమని’ నిరూపించుకోవడానికి మనం చేయగలిగినదంతా చేద్దాము. తత్ఫలితంగా ప్రజలకు ఏర్పడే మంచి అభిప్రాయం యెహోవాకు “కీర్తి ఘనత పేరు” వచ్చేలా చేస్తుంది.—ద్వితీ. 26:19.
[6వ పేజీలోని బాక్సు]
యెహోవాను మహిమపరచడమెలా:
◼ సమావేశ స్థలాన్ని శుభ్రం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వెళ్ళండి.
◼ మొత్తమంతా పరిశుభ్రంగా ఉంచడానికి సహకరించండి.
◼ దేవుని పరిచారకులకు తగిన విధంగా, సౌకర్యంగా ఉండే వస్త్రాలు ధరించండి