సామరస్యంతో ఐక్యమై ఉండండి
1 ఎంతో నైపుణ్యంతో రూపొందించబడిన మానవ శరీరాన్ని చూసి మీరు ఎంత తరచుగా ఆశ్చర్యపోతుంటారు? (కీర్త. 139:14) శరీరంలోని ప్రతి అవయవం ఇతర అవయవాలతో పొందికగా పనిచేస్తుంది. క్రైస్తవ సంఘాన్ని, చక్కని సమన్వయంగల శరీరంతో దేవుని వాక్యం పోల్చింది. సంఘంలోని సభ్యులందరూ శిరస్సైన క్రీస్తు క్రింద “చక్కగా అమర్చబడి, . . . ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి” ఉన్నారు. (ఎఫె. 4:16) కాబట్టి యెహోవా, అద్భుతమైన పనులను సాధించడానికి, ఐక్యపర్చబడిన తన ప్రజలను ఉపయోగించుకోగలుగుతున్నాడు.
2 మొదటి శతాబ్దపు సంఘంలోని సభ్యులు, ఇతరుల ఆధ్యాత్మిక, వస్తుదాయక అవసరాల పట్ల శ్రద్ధ వహించడంలో ‘ఏకమనస్కులై’ పని చేశారు. (అపొ. 2:44-47) వారు తీవ్రమైన వ్యతిరేకతను యెహోవా మద్దతుతో ఐక్యంగా ఎదుర్కొన్నారు, దాన్ని అధిగమించారు. (అపొ. 4:24-31) తాము ఎక్కడికి వెళ్తే అక్కడ రాజ్య సందేశాన్ని ప్రకటించి, అప్పట్లో తమకు తెలిసిన భూభాగాన్ని వారు సువార్తతో నింపారు. (కొలొ. 1:23) ఆధునిక కాలాల్లో, క్రైస్తవ సంఘం ఐకమత్యంతో వీటిని మరింత విస్తృత పరిధిలో సాధించింది. ఇలా ఐక్యతను సాధించడానికి ఏ అంశాలు సహాయపడతాయి?
3 దైవిక బోధ ద్వారా సన్నిహితులమయ్యాము: భూవ్యాప్తంగా, మనం మన ఆరాధన ద్వారా ఐక్యపర్చబడ్డాము. ఇదెలా సాధ్యం? “తగినవేళ” ఆధ్యాత్మిక “అన్నము పెట్టుటకు” యెహోవా ఉపయోగిస్తున్న దృశ్యమైన మాధ్యమాన్ని మనం గుర్తించాము. (మత్త. 24:45) సంఘంలో బోధకులుగా ఉండడానికి ఆయన అనుగ్రహించిన ‘మనుష్యులలో ఈవులను’ మనం ఎంతో విలువైనవారిగా ఎంచుతాము. మనల్ని ఆధ్యాత్మికంగా పోషించడానికి యెహోవా చేసిన ఏర్పాట్లను వినయంగా స్వీకరిస్తే, దేవుని వాక్యం విషయంలో మనకున్న అవగాహన అధికమవుతుంది, యేసు శిష్యులుగా ఆయనను అనుకరించాలనే కోరిక మనందరిలో కలుగుతుంది. ‘విశ్వాసవిషయములో ఏకత్వము పొందడానికి’ హృదయపూర్వకంగా కృషి చేస్తూ, మనం దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడంలో కొనసాగాలి. (ఎఫె. 4:8, 11-13) బైబిలును ప్రతిదినం చదవడం ద్వారా మీరు మన ఆధ్యాత్మిక ఐకమత్యాన్ని పెంపొందింపజేస్తున్నారా?
4 క్రైస్తవ సహవాసం ద్వారా ఐక్యపర్చబడ్డాము: ప్రేమ, క్రైస్తవ కూటాల వద్ద మనందరినీ సన్నిహిత సహవాసంలో దగ్గరకు చేరుస్తుంది. ఈ కూటాల వద్ద మనం ‘ఒకరి గురించి ఒకరం శ్రద్ధ కలిగివుంటాము.’ (హెబ్రీ. 10:24, 25, NW) అలా చేయడంలో, కేవలం బాహ్య రూపాలను చూడడం కాకుండా మన సహోదరులను నిజంగా తెలుసుకొని, వారిని యెహోవా చూస్తున్నట్టు విలువైనవారిగా చూడడం ఇమిడివుంది. (హగ్గ. 2:7) వారు తమ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు మనం వింటే వారిపట్ల మన ప్రేమ ప్రగాఢమవుతుంది, మన ఐక్యత బలపడుతుంది. క్రమంగా సంఘ కూటాలకు హాజరవుతారన్న పేరు మీకుందా?
5 క్షేత్రంలో తోటి పనివారు: తోటి విశ్వాసులతో కలిసి సువార్త ప్రకటించడం, దేవుని చిత్తం చేయడంలో మనలను ఐక్యపరుస్తుంది. ‘దేవుని రాజ్యము నిమిత్తము తన జత పనివారిగా’ ఉన్న వారిని పౌలు విలువైనవారిగా ఎంచాడు. (కొలొ. 4:11) అనుభవాలను పంచుకోవడం, పరిచర్యలో ఉన్నప్పుడు ఒకరితో ఒకరు సహకరించుకోవడం, మన క్రైస్తవ విధిని నెరవేర్చడానికి సహాయపడతాయి, అంతేకాక మన ఐక్యతా బంధాన్ని బలపరుస్తాయి.—కొలొ. 3:14.
6 పరిశుద్ధాత్మకున్న ఐక్యపరిచే ప్రభావం: మనం శ్రద్ధగా యెహోవా చిత్తాన్ని చేస్తూ ఉంటే, ఆయన మనకు తన ఆత్మను అనుగ్రహిస్తాడు. మన మధ్య ఉన్న అభిప్రాయభేదాలను తగ్గించి మనమందరం ఐక్యతతో కలిసి ఉండేందుకు అది సహాయపడుతుంది. (కీర్త. 133:1) ‘సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనడానికి’ అది మనలను కదిలిస్తుంది. (ఎఫె. 4:1) ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఆత్మ ఫలాలను కనబర్చడం ద్వారా మనలో ప్రతి ఒక్కరం దేవుని ప్రజల మధ్య ఉన్న ఐక్యతకు మద్దతునివ్వగలము.—గల. 5:22-24.
7 క్రీస్తు శిరస్సత్వం క్రింద ఐక్యంగా కలిసి సేవచేయడం, ‘ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేస్తుంది.’ (ఎఫె. 4:16) అంతేకాక, అది ‘సమాధాన కర్తయగు దేవుడైన’ యెహోవాను మహిమపరుస్తుంది.—రోమా. 16:20.