మీ గృహాన్ని అందుబాటులో ఉంచగలరా?
1 మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల్లో అనేకులు సంఘ కూటాలు జరుపుకోవడానికి తమ గృహాలను అందుబాటులో ఉంచారు. (1 కొరిం. 16:19; కొలొ. 4:15; ఫిలే. 1, 2) నేడు కొన్ని సంఘాల్లో, సంఘ పుస్తక అధ్యయన గుంపులు కలుసుకోవడానికి, క్షేత్ర పరిచర్య కూటాలు జరుపుకోవడానికి కావలసినన్ని స్థలాలు లేవు. తత్ఫలితంగా కొన్ని పుస్తక అధ్యయన గుంపుల్లో 30 కంటే ఎక్కువ మంది సభ్యులు ఉండవచ్చు, సాధారణంగా సిఫార్సు చేయబడే 15 మంది కంటే అది ఎంతో ఎక్కువ.
2 ఒక చక్కని ఆధిక్యత: సంఘ పుస్తక అధ్యయనం జరుపుకోవడానికి మీ గృహాన్ని అందుబాటులో ఉంచడం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దాని కోసం సరిపడేంత పరిమాణంలో, శుభ్రంగా, మంచి వెలుగుతో, తగినంత తాజా గాలితో ఉండే గది అయితే సరిపోతుంది. తన ప్రజలకు ఉపదేశించడానికి యెహోవా ఏర్పాటు చేసిన సంఘ కూటాల్లో పుస్తక అధ్యయనం కూడా ఒక భాగం కాబట్టి మీ గృహంలో పుస్తక అధ్యయనం జరగడమనేది ఒక చక్కని ఆధిక్యత. తమ గృహాన్ని ఈ విధంగా అందుబాటులో ఉంచడం ద్వారా తాము ఆధ్యాత్మికంగా ప్రయోజనం పొందామని చాలామంది తెలియజేస్తున్నారు.
3 మీ గృహం ఈ అవసరానికి సరిపోతుందని మీకు అనిపిస్తే, దయచేసి దాన్ని పెద్దలకు తెలియజేయండి. వాళ్ళు అదనపు స్థలాల కోసం వెదుకుతుండవచ్చు. మీ గృహంలో పుస్తక అధ్యయనం నిర్వహించడం సాధ్యం కాకపోతే, కనీసం క్షేత్ర సేవ కూటాలనైనా నిర్వహించవచ్చా? ప్రస్తుతం అవసరం లేకపోయినా, మీరు మీ గృహాన్ని అందుబాటులో ఉంచగలరని తెలుసుకొని పెద్దలు సంతోషిస్తారు. భవిష్యత్తులో మీరు ఆ ఆధిక్యతను పొందవచ్చు.
4 గౌరవపూర్వకంగా ప్రవర్తించడం: ఒక సహోదరుని గృహంలో కలుసుకుంటున్నప్పుడు హాజరయ్యేవారందరూ గౌరవపూర్వకంగా ఉండాలి. తమ పిల్లలు అధ్యయనం కోసం ఏర్పాటు చేయబడిన చోటే కూర్చొని ఉండేలా, గృహంలోని వ్యక్తిగత గదుల్లోకి వెళ్ళకుండా ఉండేలా తల్లిదండ్రులు నిశ్చయపరచుకోవాలి. పొరుగువారిని కూడా మనస్సులో ఉంచుకోవాలి, అనవసరంగా వారికి ఇబ్బంది కలుగజేయకుండా జాగ్రత్తపడాలి.—2 కొరిం. 6:3, 4; 1 పేతు. 2:12.
5 “ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికిష్టమైనవి” అని హెబ్రీయులు 13:16 మనలను ప్రోత్సహిస్తోంది. మీ గృహాన్ని సంఘ కూటం జరుపుకోవడానికి అందుబాటులో ఉంచడమనేది ఇతరులకు ఉపకారము చేయడానికి, ‘మీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను ఘనపరచడానికి’ ఒక మంచి మార్గం.—సామె. 3:9.