యెహోవాకు సన్నిహితమవండి పుస్తక అధ్యయనం నుండి ప్రయోజనం పొందండి
1 “ఆసక్తిగల రాజ్య ప్రచారకులు” జిల్లా సమావేశంలో దేవునికి సన్నిహితమవండి పుస్తకాన్ని పొందినప్పుడు మనం ఎంతో పులకించిపోయాం. చాలామంది ఆ పుస్తకాన్ని వెంటనే చదివారు. ఇంకా అనేకమంది ఆ పుస్తకాన్ని చదివేందుకు పురికొల్పబడి ఉంటారనడంలో సందేహం లేదు, ఎందుకంటే 2003 సంవత్సరపు వార్షిక వచనం ఇలా చెబుతోంది, “దేవునికి సన్నిహితమవండి, అప్పుడాయన మీకు సన్నిహితమవుతాడు.”—యాకో. 4:8, NW.
2 మార్చి నెలలో మనం దేవునికి సన్నిహితమవండి పుస్తకాన్ని సంఘ పుస్తక అధ్యయనంలో పరిశీలించడం ప్రారంభిస్తాం. మన అధ్యయనం నుండి మనం అత్యధిక ప్రయోజనాన్ని ఎలా పొందవచ్చు? దీనికి సిద్ధపాటు అత్యావశ్యం. ఒక్కొక్క అధ్యాయానికి రెండు వారాలు కేటాయించబడతాయి, ప్రతీ వారం అధ్యయనానికి దాదాపు కొన్ని పేరాలే ఉంటాయి. ఇది మీరు ఆయా వారపు సమాచారంపై చేసిన అధ్యయనం, ధ్యానం ఆధారంగా హృదయపూర్వక వ్యాఖ్యానాలు చేసేందుకు కావలసిన సమయాన్నిస్తుంది. అంతేకాదు, అధ్యాయంలోని ముగింపు భాగం సమీక్షించే వారంలో చాలా తక్కువ పేరాలే పరిశీలించబడతాయి, ఇది పుస్తకంలోని ఒక ప్రత్యేక శీర్షికను ఉపయోగించేందుకు సమయాన్ని ఇస్తుంది.
3 రెండవ అధ్యాయం మొదలుకొని, ప్రతి అధ్యాయం చివరిలో “ధ్యానించడానికి ప్రశ్నలు” అనే బాక్సు కనబడుతుంది. అధ్యాయంలోని చివరి పేరా పరిశీలించిన తర్వాత, పుస్తక అధ్యయన పైవిచారణకర్త ఆ బాక్సులోని విషయాలను గుంపుతో చర్చిస్తాడు. గుంపులోని సభ్యులు లేఖనాలపై ధ్యానించడం వల్ల పొందిన మంచి ఫలితాలను ఆయన రాబడతాడు. (సామె. 20:5) బాక్సులో ఇవ్వబడిన ప్రశ్నలతోపాటు అప్పుడప్పుడు ఈ క్రింది ప్రశ్నలు కూడా ఆయన అడుగుతుండవచ్చు: “ఈ సమాచారం మీకు యెహోవా గురించి ఏమి చెబుతోంది? ఇది మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఇతరులకు సహాయం చేయడానికి ఈ సమాచారాన్ని మీరెలా ఉపయోగించగలరు?” ఆయన లక్ష్యమల్లా హృదయపూర్వక వ్యాఖ్యానాలను రాబట్టడానికే కానీ చిన్న చిన్న వివరాలు అడిగి గుంపును పరీక్షించడానికి మాత్రం కాదు.
4 దేవునికి సన్నిహితమవండి పుస్తకం విశిష్టమైనది. “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” అందిస్తున్న ప్రచురణలన్నీ యెహోవాను మహిమపరుస్తున్నప్పటికీ, ఈ పుస్తకం ఆసాంతం యెహోవా లక్షణాల గురించే చర్చిస్తుంది. (మత్త. 24:45-47) మన ఎదుట ఎంతటి పరవశింపజేసే అవకాశం ఉందో కదా! యెహోవా వ్యక్తిత్వంపై లోతైన అధ్యయనం ద్వారా మనం ఎంతో ప్రయోజనం పొందుతాం. మనం మన పరలోకపు తండ్రికి దగ్గరయ్యేందుకు, ఇతరులు కూడా ఆయనకు దగ్గరయ్యేందుకు సహాయపడడంలో మనం మరింత సమర్థవంతులం అయ్యేందుకు ఈ అధ్యయనం మనకు సహాయపడునుగాక.