కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • cl అధ్యా. 2 పేజీలు 16-25
  • మీరు నిజంగా ‘దేవునికి దగ్గరవ్వవచ్చా’?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు నిజంగా ‘దేవునికి దగ్గరవ్వవచ్చా’?
  • యెహోవాకు దగ్గరవ్వండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాయే ఒక అడుగు ముందుకు వేశాడు
  • యెహోవా తన గురించి బైబిల్లో ఏం చెప్తున్నాడు?
  • ‘కుమారుడు తండ్రిని బయల్పర్చడానికి ఇష్టపడతాడు’
  • ఈ పుస్తకం మనకు ఎలా సహాయం చేస్తుంది?
  • ‘ఇదిగో మన దేవుడు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • మీరు యెహోవాకు స్నేహితులు అవ్వవచ్చు
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • దేవునికి, క్రీస్తుకు సంబంధించిన సత్యం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2020
  • మీరు దేవునికి దగ్గరగా ఎలా కాగలరు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
యెహోవాకు దగ్గరవ్వండి
cl అధ్యా. 2 పేజీలు 16-25
బైబిల్లో తను చదివిన విషయాల గురించి ఒకామె ధ్యానిస్తుంది.

అధ్యాయం 2

మీరు నిజంగా ‘దేవునికి దగ్గరవ్వవచ్చా’?

1, 2. (ఎ) చాలామందికి ఏ విషయం పగటి కలలా అనిపించవచ్చు? కానీ బైబిలు ఏ భరోసా ఇస్తుంది? (బి) యెహోవా అబ్రాహామును ఏమని పిలిచాడు? ఎందుకు?

ఆకాశాన్ని, భూమిని చేసిన సృష్టికర్త స్వయంగా మీ గురించి “తను నా ఫ్రెండ్‌” అని పరిచయం చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అది కలలోనే సాధ్యమౌతుంది అని చాలామంది అనుకుంటారు. మట్టిలో పుట్టిన ఒక మనిషి యెహోవా దేవునికి ఎలా ఫ్రెండ్‌ అవ్వగలడు? అసాధ్యం అనిపించినా, మనం నిజంగా దేవునికి దగ్గరవ్వవచ్చు అని బైబిలు బల్లగుద్ది మరీ చెప్తుంది.

2 ఉదాహరణకు, పూర్వకాలం నాటి అబ్రాహాము దేవునికి దగ్గరయ్యాడు. యెహోవా ఆయన్ని “నా స్నేహితుడు” అన్నాడు. (యెషయా 41:8) అవును, యెహోవా అబ్రాహామును ప్రాణ స్నేహితుడిలా చూశాడు. అబ్రాహాము “యెహోవా మీద విశ్వాసం ఉంచాడు” కాబట్టే ఆయనకు ఆ భాగ్యం దొరికింది. (యాకోబు 2:23) ఇప్పుడు కూడా, తనను ఆరాధించేవాళ్లకు దగ్గరి స్నేహితుడు అవ్వాలని, ‘వాళ్ల మీద ప్రేమ చూపించాలని’ యెహోవా కోరుకుంటున్నాడు. (ద్వితీయోపదేశకాండం 10:15) బైబిలు ఇలా ప్రోత్సహిస్తుంది: “దేవునికి దగ్గరవ్వండి, అప్పుడు ఆయన మీకు దగ్గరౌతాడు.” (యాకోబు 4:8) ఆ మాటల్లో ఒక ఆహ్వానం ఉంది, అలాగే ఒక అభయం కూడా ఉంది.

3. యెహోవా మనకు ఏ ఆహ్వానాన్ని, అభయాన్ని ఇస్తున్నాడు?

3 తనకు దగ్గరవ్వమని యెహోవా మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మనల్ని తన స్నేహితులుగా చేసుకోవాలని ఆయన తహతహలాడుతున్నాడు. అదే సమయంలో మనం ఆయనకు దగ్గరవ్వడానికి కృషిచేస్తే, ఆయన వైపునుండి ఆయన చేయాల్సింది చేస్తానని, అంటే మనకు దగ్గరౌతానని అభయం ఇస్తున్నాడు. అలా మనం ‘యెహోవాతో దగ్గరి స్నేహాన్ని’ అనుభవించవచ్చు. అది నిజంగా వెల కట్టలేనిది. (కీర్తన 25:14) ఇక్కడ చెప్తున్న ‘దగ్గరి స్నేహితుడు’ అంటే, మన సొంతవాళ్లతో కూడా చెప్పుకోలేని విషయాల్ని ఎవరితో చెప్పుకుంటామో ఆ స్నేహితుడు అని అర్థం.

4. దగ్గరి స్నేహితుడు అంటే ఎవరు? యెహోవా అలాంటి ఒక స్నేహితుడని ఎందుకు చెప్పవచ్చు?

4 మీరు ఏదైనా చెప్పుకోగలిగే దగ్గరి స్నేహితుడు మీకు ఉన్నాడా? అలాంటి స్నేహితుడు మిమ్మల్ని బాగా పట్టించుకుంటాడు. అతను అన్ని సమయాల్లో మిమ్మల్ని నమ్మకంగా అంటిపెట్టుకొని ఉన్నాడు కాబట్టి, మీరు అతన్ని నమ్ముతారు. మీ ఆనందాల్ని అతనితో పంచుకున్నప్పుడు అవి రెట్టింపు అవుతాయి. మీ బాధ చెప్పుకున్నప్పుడు అతను ఓపిగ్గా వింటాడు కాబట్టి, మీ గుండెల్లో ఉన్న భారమంతా దిగిపోతుంది. ఈ ప్రపంచం మొత్తం మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని మీకు అనిపించినా, అతను మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు. అదేవిధంగా, మీరు దేవునికి దగ్గరైతే మీకొక ప్రాణ స్నేహితుడు దొరికినట్టే. ఆయన మిమ్మల్ని విలువైనవాళ్లుగా చూస్తాడు, మిమ్మల్ని బాగా పట్టించుకుంటాడు, పూర్తిగా అర్థం చేసుకుంటాడు. (కీర్తన 103:14; 1 పేతురు 5:7) మీరు మనస్ఫూర్తిగా ఆయన్ని నమ్మవచ్చు, ఎందుకంటే విశ్వసనీయంగా ఉండేవాళ్లతో ఆయన విశ్వసనీయంగా ఉంటాడని మీకు తెలుసు. (కీర్తన 18:25) అయితే, దేవునికి స్నేహితులయ్యే గొప్ప భాగ్యం మనదాకా వచ్చిందంటే, అది కేవలం ఆయన వల్లే.

యెహోవాయే ఒక అడుగు ముందుకు వేశాడు

5. మనం తనకు దగ్గరవ్వగలిగేలా యెహోవా ఏం చేశాడు?

5 మనకై మనం ఎప్పటికీ దేవునికి దగ్గరవ్వలేం, ఎందుకంటే మనం పాపులం. (కీర్తన 5:4) “అయితే దేవుడు మనపట్ల తనకున్న ప్రేమను చూపిస్తున్నాడు. ఎలాగంటే మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మనకోసం చనిపోయాడు” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (రోమీయులు 5:8) “ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించడానికి” యెహోవా యేసును పంపించాడు. (మత్తయి 20:28) ఆ విమోచన క్రయధనం మీద విశ్వాసం ఉంచితే, మనం దేవునికి దగ్గరవ్వవచ్చు. దేవుడే “మొదట మనల్ని ప్రేమించాడు” కాబట్టి, తనతో మన స్నేహానికి తానే ఒక పునాది వేశాడు.—1 యోహాను 4:19.

6, 7. (ఎ) యెహోవా తన గురించి ఏ విషయం దాచిపెట్టట్లేదని మనకు ఎలా తెలుసు? (బి) ఆయన ఏయే విధాలుగా మనకు తన గురించి చెప్తున్నాడు?

6 యెహోవా ఇంకో అడుగు ముందుకు వేశాడు. ఆయన తన గురించి మనకు చెప్పాడు. ఏ స్నేహమైనా నిలబడాలంటే అవతలి వ్యక్తి ఎలాంటివాడో, అతని లక్షణాలేంటో, అతను ఎలా ప్రవర్తిస్తాడో తెలుసుకోవాలి. ఒకవేళ యెహోవా తన గురించి ఏమీ చెప్పకుండా అన్నీ దాచిపెట్టేస్తే, మనం ఎప్పటికీ ఆయనకు దగ్గరయ్యేవాళ్లం కాదు. కానీ ఆయన అలా దాచిపెట్టే బదులు, తన గురించి చాలా విషయాలు చెప్పాడు. (యెషయా 45:19) అంతేకాదు తన గురించి అందరూ, ఆఖరికి ఈ లోకం ఎవరినైతే తక్కువగా చూస్తుందో వాళ్లు కూడా తెలుసుకునేలా ఆ విషయాలన్నిటినీ వాళ్ల ముందు ఉంచాడు.—మత్తయి 11:25.

చిత్రాలు: యెహోవా తన గురించి చెప్పే కొన్ని విధానాలు. 1. ఒక పువ్వు, సీతాకోకచిలుక. 2. బీచ్‌లో సూర్యాస్తమయం. 3. తెరిచి ఉన్న బైబిలు.

యెహోవా సృష్టి ద్వారా, బైబిలు ద్వారా తన గురించి మనకు చెప్పాడు

7 యెహోవా మనకు తన గురించి ఎలా చెప్తున్నాడు? ఆయన చేసిన సృష్టిని చూస్తే, ఆయనకున్న కొన్ని లక్షణాలు తెలుస్తాయి. ఆయనకు కొండంత బలం ఉందని, సముద్రమంత తెలివి ఉందని, ఆకాశమంత ప్రేమ ఉందని అర్థమౌతుంది. (రోమీయులు 1:20) అయితే, యెహోవా కేవలం సృష్టి ద్వారానే కాదు, బైబిలు ద్వారా కూడా తన గురించి చెప్తున్నాడు. ఆయన మనతో మాట్లాడాలని అనుకుంటున్నాడు కాబట్టే, తన వాక్యమైన బైబిల్లో తన గురించి చాలా విషయాలు రాయించాడు.

యెహోవా తన గురించి బైబిల్లో ఏం చెప్తున్నాడు?

8. యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి స్వయంగా బైబిలే ఒక రుజువని ఎందుకు చెప్పవచ్చు?

8 యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి స్వయంగా బైబిలే ఒక రుజువు. బైబిల్లో, మనం అర్థం చేసుకునే పదాలతో యెహోవా తన గురించి చెప్పాడు. అది ఒక విషయాన్ని రుజువు చేస్తుంది, అదేంటంటే: ఆయన మనల్ని ప్రేమించడమే కాదు, మనం తనను తెలుసుకుని తిరిగి ప్రేమించాలని కూడా కోరుకుంటున్నాడు. బైబిలు అనే ఈ అమూల్యమైన పుస్తకం, ఆయనకు దగ్గరవ్వడానికి సహాయం చేస్తుంది. (కీర్తన 1:1-3) యెహోవా ఏయే విధాలుగా తన గురించి బైబిల్లో చెప్పాడో ఇప్పుడు చూద్దాం. అవి నిజంగా మన మనసుకు హత్తుకుంటాయి.

9. దేవుని లక్షణాల గురించి సూటిగా చెప్పే కొన్ని లేఖనాలు ఏంటి?

9 దేవుని లక్షణాల గురించి సూటిగా చెప్పే చాలా లేఖనాలు బైబిల్లో ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు చూడండి: “యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు.” (కీర్తన 37:28) “ఆయన ఎంతో శక్తిమంతుడు.” (యోబు 37:23) “‘నేను విశ్వసనీయుణ్ణి’ . . . అని యెహోవా ప్రకటిస్తున్నాడు.” (యిర్మీయా 3:12) “ఆయన తెలివిగలవాడు.” (యోబు 9:4) “ఆయన కరుణ, కనికరం గల దేవుడు; ఓర్పును, అపారమైన విశ్వసనీయ ప్రేమను చూపించే దేవుడు; ఎంతో సత్యవంతుడు.” (నిర్గమకాండం 34:6) “యెహోవా, నువ్వు మంచివాడివి, క్షమించడానికి సిద్ధంగా ఉంటావు.” (కీర్తన 86:5) అంతేకాదు, ముందటి అధ్యాయంలో చూసినట్టు “దేవుడు ప్రేమ.” (1 యోహాను 4:8) అది ఆయనలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆకట్టుకునే ఈ లక్షణాలన్నిటి గురించి ఆలోచించినప్పుడు, ఇంత మంచి దేవునికి దగ్గరవ్వాలని మీకు అనిపించట్లేదా?

10, 11. (ఎ) తను ఎలాంటివాడో మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి యెహోవా బైబిల్లో ఏమేం రాయించాడు? (బి) దేవుని శక్తిని ఊహించుకోవడానికి బైబిల్లో ఉన్న ఏ ఉదాహరణ మనకు సహాయం చేస్తుంది?

10 యెహోవా తనకు ఏ లక్షణాలు ఉన్నాయో చెప్పడమే కాదు, ఆ లక్షణాల్ని ఎలా చూపించాడో తెలిపే ఉదాహరణల్ని కూడా ప్రేమతో బైబిల్లో రాయించాడు. వాటిని చదివి ఊహించుకుంటే, యెహోవా మనస్తత్వంలోని వేర్వేరు కోణాల్ని ఇంకా బాగా అర్థం చేసుకుంటాం, అలా ఆయనకు దగ్గరౌతాం. ఒక ఉదాహరణ చూడండి.

యెహోవాకు దగ్గరవ్వడానికి బైబిలు సహాయం చేస్తుంది

11 దేవునికి “సంభ్రమాశ్చర్యాలు పుట్టించే బలం” ఉంది అని చదవడం ఒక ఎత్తు. (యెషయా 40:26) అయితే, ఆయన ఆ శక్తిని ఉపయోగించి ఇశ్రాయేలీయుల్ని ఎర్రసముద్రం గుండా ఎలా నడిపించాడో, తర్వాత 40 ఏళ్లపాటు ఎడారిలో వాళ్లను ఎలా కాపాడాడో చదవడం ఇంకో ఎత్తు. ఒకసారి దీన్ని ఊహించుకోండి: ఉధృతంగా ప్రవహిస్తున్న ఎర్రసముద్రం రెండు పాయలు అయిపోయింది. గడ్డ కట్టిన నీళ్లు అటుపక్క, ఇటుపక్క పెద్ద గోడల్లా నిలిచిపోయాయి. మధ్యలో ఆరిన నేల మీద దాదాపు 30 లక్షల మంది నడుచుకుంటూ వెళ్లారు. (నిర్గమకాండం 14:21; 15:8) ఎడారిలో కూడా దేవుడు తన శక్తిని ఉపయోగించి వాళ్లను ఎలా కాపాడాడో మీరు చూడవచ్చు. ఆయన బండ నుండి నీళ్లు రప్పించాడు. ఆకాశం నుండి తెల్లని గింజల్లాంటి ఆహారాన్ని నేల మీద కురిపించాడు. (నిర్గమకాండం 16:31; సంఖ్యాకాండం 20:11) యెహోవా ఇక్కడ తనకు శక్తి ఉందనే కాదు, దాన్ని తన ప్రజల కోసం వాడతాను అని కూడా చూపించాడు. “దేవుడే మన ఆశ్రయం, మన బలం, కష్టకాలాల్లో ఆయన ఎప్పుడూ సహాయం చేస్తాడు.” అలాంటి శక్తివంతమైన దేవుని దగ్గరికి మన ప్రార్థనలు చేరతాయని తెలుసుకోవడం మీకు సంతోషంగా అనిపించట్లేదా?—కీర్తన 46:1.

12. యెహోవా మనకు అర్థమయ్యే భాషలో తనను తాను ఎలా వర్ణించుకున్నాడు?

12 అదృశ్య వ్యక్తి అయిన యెహోవా, మనం తన గురించి తెలుసుకునేలా సహాయం చేయడానికి ఇంకా ఎక్కువే చేశాడు. మనుషులమైన మనం భౌతిక ప్రపంచంలో ఉన్నవే చూడగలం గానీ, పరలోక సంబంధమైనవి చూడలేం. ఒకవేళ దేవుడు తనను తాను పరలోక సంబంధమైన పదాలతో వర్ణించుకొని ఉంటే, అది పుట్టుకతోనే చూపు కోల్పోయిన వ్యక్తికి రంగుల గురించి వివరించినట్లు అవుతుంది. అందుకే యెహోవా దయతో, మనకు అర్థమయ్యే పదాలతో తనను వర్ణించుకున్నాడు. కొన్నిసార్లయితే, మనకు తెలిసిన వాటితో పోలుస్తూ ఆయన ఉదాహరణలు ఉపయోగించాడు. ఆఖరికి, మనుషులకు ఉండే రూపురేఖలు తనకు ఉన్నట్టుగా ఆయన వర్ణించుకున్నాడు.a

13. యెషయా 40:11 యెహోవాను ఎలా పోలుస్తుంది? దాన్నిబట్టి మీకు ఏమనిపిస్తుంది?

13 యెషయా 40:11 యెహోవా గురించి ఇలా చెప్తుంది: “గొర్రెల కాపరిలా ఆయన తన మంద బాగోగులు చూసుకుంటాడు. గొర్రెపిల్లల్ని ఆయన తన బాహువుతో సమకూరుస్తాడు, వాటిని తన గుండెల మీద మోస్తాడు.” ఈ లేఖనం, యెహోవాను ఒక గొర్రెల కాపరితో పోలుస్తుంది. ఆయన “తన బాహువుతో” గొర్రెపిల్లల్ని సమకూరుస్తాడు. దేవుడు తన ప్రజల్ని, మరిముఖ్యంగా బలహీనంగా ఉన్నవాళ్లను కాపాడగలడని, సంరక్షించగలడని ఇది చూపిస్తుంది. ఆయన బలమైన చేతుల్లో మనం హాయిగా ఉండవచ్చు. ఎందుకంటే, మనం ఆయనకు విశ్వసనీయంగా ఉంటే ఆయన మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. (రోమీయులు 8:38, 39) గొప్ప కాపరి అయిన యెహోవా, గొర్రెపిల్లల్ని “తన గుండెల మీద” మోస్తాడు. కొన్నిసార్లు, కాపరి అప్పుడే పుట్టిన గొర్రెపిల్లను తన పైవస్త్రపు మడతల్లో పెట్టుకొని మోస్తాడు. యెహోవా కూడా మనల్ని అంతే అపురూపంగా, ప్రేమగా చూసుకుంటాడని ఇది భరోసా ఇస్తుంది. అలాంటి దేవునికి దగ్గరవ్వాలని ఎవరు కోరుకోరు చెప్పండి?

‘కుమారుడు తండ్రిని బయల్పర్చడానికి ఇష్టపడతాడు’

14. యెహోవా తన గురించి స్పష్టంగా చెప్పడానికి యేసును ఎందుకు ఉపయోగించుకున్నాడు?

14 బైబిల్లో, యెహోవా తన ప్రియ కుమారుడైన యేసు ద్వారా తన గురించి స్పష్టంగా తెలియజేశాడు. దేవుని ఆలోచనల్ని, ఫీలింగ్స్‌ని అచ్చుగుద్దినట్టు చూపించి, ఆయన గురించి చక్కగా వివరించేవాళ్లు ఎవరైనా ఉన్నారు అంటే అది యేసే. యేసుకన్నా బాగా ఎవరూ అలా చేయలేరు. ఎందుకంటే, ఆయన సృష్టిలో మొట్టమొదట పుట్టినవాడు. మిగతా దేవదూతల్ని, విశ్వాన్ని తయారు చేయకముందు యేసు తన తండ్రితో పాటు కలిసి ఉన్నాడు. (కొలొస్సయులు 1:15) యేసుకు యెహోవా గురించి పూర్తిగా తెలుసు. అందుకే ఆయన ఇలా అనగలిగాడు: “కుమారుడు ఎవరో తండ్రికి తప్ప ఎవరికీ తెలీదు. అలాగే తండ్రి ఎవరో కుమారుడికీ, ఆ కుమారుడు తండ్రిని ఎవరికి బయల్పర్చడానికి ఇష్టపడతాడో వాళ్లకూ తప్ప ఇంకెవరికీ తెలీదు.” (లూకా 10:22) యేసు భూమ్మీద ఉన్నప్పుడు, రెండు ముఖ్యమైన విధాలుగా తన తండ్రి గురించి చెప్పాడు.

15, 16. యేసు ఏ రెండు విధాలుగా తన తండ్రి గురించి చెప్పాడు?

15 మొదటిగా, యేసు తన బోధల ద్వారా తండ్రి గురించి చెప్పాడు. ఆయన మన మనసుకు హత్తుకునేలా యెహోవా గురించి వివరించాడు. ఉదాహరణకు, యేసు తప్పిపోయిన కుమారుని కథ చెప్పాడు. అందులో కుమారుడు తిరిగి రావడం తండ్రి దూరం నుండి చూసి, పరిగెత్తుకుంటూ వెళ్లి హత్తుకుని, ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటాడు. యెహోవా కూడా పశ్చాత్తాపపడి తిరిగొచ్చే పాపుల్ని అంతే క్షమిస్తాడని, అంతే కనికరంతో తిరిగి చేర్చుకుంటాడని యేసు వివరించాడు. (లూకా 15:11-24) యెహోవా దేవుడు మంచి మనసున్న ప్రజల్ని తనవైపుకు ‘ఆకర్షించుకుంటాడని’ యేసు చెప్పాడు. ఆయన వాళ్లను ఒక గుంపుగా కాదుగానీ, ఒక్కొక్కరిగా ప్రేమిస్తాడని అది చూపిస్తుంది. (యోహాను 6:44) ఒక చిన్న పిచ్చుక నేల మీద పడినా కూడా ఆయనకు తెలిసిపోతుంది అని చెప్తూ, యేసు ఇలా అన్నాడు: “భయపడకండి; మీరు చాలా పిచ్చుకల కన్నా విలువైనవాళ్లు.” (మత్తయి 10:29, 31) అంత బాగా పట్టించుకునే దేవునికి దగ్గరవ్వకుండా ఉంటామా?

16 రెండోదిగా, యెహోవా ఎలాంటివాడో యేసు తన పనుల ద్వారా చూపించాడు. ఆయన వందకు వంద శాతం తన తండ్రి లక్షణాల్ని చూపించాడు కాబట్టి, ఇలా అనగలిగాడు: “నన్ను చూసిన వ్యక్తి తండ్రిని కూడా చూశాడు.” (యోహాను 14:9) కాబట్టి సువార్త పుస్తకాల్లో యేసు గురించి, అంటే ఆయన చూపించిన లక్షణాల గురించి, ప్రజలతో ఆయన ప్రవర్తించిన తీరు గురించి చదువుతున్నప్పుడు యెహోవాను కళ్లారా చూస్తున్నట్టు అనిపిస్తుంది. యెహోవా తన లక్షణాల గురించి చెప్పడానికి ఇంతకన్నా మంచి దారి ఉంటుందా? ఉండదు. అలాగని ఎందుకు చెప్పవచ్చు?

17. యెహోవా తను ఎలాంటివాడో మనకు అర్థమయ్యేలా చెప్పడానికి ఏం చేశాడు?

17 ఉదాహరణకు, మీరు ఒకాయనకి “దయ” అంటే ఏంటో వివరిస్తున్నట్టు ఊహించుకోండి. దాని అర్థాన్ని మీరు మాటలతో చెప్పారు. కానీ ఎవరైనా ఒక దయగల పని చేస్తున్నప్పుడు, మీరు దాన్ని చూపించి ‘ఇదిగో! ఇదే దయ అంటే’ అని చెప్పారనుకోండి. “దయ” అంటే ఏంటో ఆయనకు ఇంకా బాగా అర్థమౌతుంది, గుర్తుండిపోతుంది. యెహోవా కూడా అదే చేశాడు. తన గురించి మాటలతో వివరించడమే కాకుండా, తన కుమారుడైన యేసు ద్వారా తను ఎలాంటివాడో మనకు కళ్లకుకట్టినట్టు చూపించాడు. యేసులో, దేవునికున్న లక్షణాలన్నీ కొట్టొచ్చినట్టు కనిపించాయి. సువార్త పుస్తకాల్లో యేసు గురించి చదువుతున్నప్పుడు, ఒకవిధంగా యెహోవా “ఇదిగో! నేను ఇలా ఉంటాను” అని మనకు చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఇంతకీ, యేసు భూమ్మీద గడిపిన జీవితం గురించి బైబిలు ఏం చెప్తుంది?

18. యేసు శక్తిని, న్యాయాన్ని, తెలివిని ఎలా చూపించాడు?

18 దేవునికున్న నాలుగు ముఖ్యమైన లక్షణాల్ని యేసు అద్భుతంగా చూపించాడు. ఆయన శక్తిని ఉపయోగించి రోగాల్ని నయం చేశాడు, ఆకలితో ఉన్నవాళ్లకు ఆహారం పెట్టాడు, చనిపోయినవాళ్లను కూడా లేపాడు. స్వార్థపరులైతే వాళ్ల సొంత ప్రయోజనం కోసం, వేరేవాళ్లకు హాని చేయడం కోసం వాళ్ల శక్తిని లేదా అధికారాన్ని తప్పుగా ఉపయోగిస్తారు. కానీ, అద్భుతాలు చేసే శక్తిని యేసు ఒక్కసారి కూడా స్వార్థానికి వాడుకోలేదు. (మత్తయి 4:2-4) ఆయన న్యాయాన్ని ప్రేమించాడు. కొంతమంది వ్యాపారులు అన్యాయంగా జనాల్ని దోచుకుంటున్నప్పుడు, ఆయన కోపంతో రగిలిపోయాడు. (మత్తయి 21:12, 13) ఆయన పేదవాళ్లను, అణచివేతకు గురైన వాళ్లను చిన్నచూపు చూడలేదు గానీ, “సేదదీర్పు” పొందేలా వాళ్లకు సహాయం చేశాడు. (మత్తయి 11:4, 5, 28-30) ఆయన అద్భుతమైన తెలివితో బోధించాడు. నిజం చెప్పాలంటే, యేసు “సొలొమోను కన్నా గొప్పవాడు.” (మత్తయి 12:42) అయితే, యేసు ఎప్పుడూ తన తెలివిని గొప్పగా చూపించుకోలేదు. ఆయన మాటలు సామాన్య ప్రజల హృదయాల్ని కూడా చేరుకున్నాయి. ఎందుకంటే ఆయన స్పష్టంగా, తేలిగ్గా బోధించడమే కాకుండా వాళ్లకు ఉపయోగపడే విషయాల్ని కూడా చెప్పాడు.

19, 20. (ఎ) ప్రేమకు ఒక గొప్ప ఉదాహరణ యేసు అని ఎందుకు చెప్పవచ్చు? (బి) యేసు గురించి చదివి ధ్యానిస్తున్నంత సేపు మనం ఏం గుర్తుంచుకోవాలి?

19 ప్రేమకు గొప్ప ఉదాహరణ యేసే. ఆయన పరిచర్య అంతటిలో ప్రేమను, అందులో ఉన్న ఎన్నో కోణాల్ని అంటే తదనుభూతిని, కనికరాన్ని చూపిస్తూనే ఉన్నాడు. ఎవరైనా బాధ పడుతుంటే, ఆయన అస్సలు చూడలేకపోయేవాడు. వాళ్లమీద జాలిపడి ఏదోక విధంగా వాళ్లకు సహాయం చేసేవాడు. (మత్తయి 14:14) నిజమే, ఆయన రోగుల్ని బాగుచేశాడు, ఆకలితో ఉన్నవాళ్లకు ఆహారం పెట్టాడు. కానీ అంతకంటే ముఖ్యంగా మనుషులకు శాశ్వత ప్రయోజనాలు తెచ్చే దేవుని రాజ్యం గురించి ప్రకటించడం ద్వారా కనికరం చూపించాడు. రాజ్యం గురించిన సత్యాన్ని ప్రజలు తెలుసుకునేలా, నమ్మేలా, ప్రేమించేలా ఆయన సహాయం చేశాడు. (మార్కు 6:34; లూకా 4:43) వీటన్నిటికి మించి, ఆయన మనుషుల కోసం ప్రాణం పెట్టడం ద్వారా గొప్ప స్థాయిలో ప్రేమ చూపించాడు.—యోహాను 15:13.

20 ఇంత ప్రేమ, ఆప్యాయత, కనికరం ఉన్న వ్యక్తికి అన్ని వయసుల వాళ్లు, అన్ని రకాల ప్రజలు దగ్గరవ్వడంలో ఏదైనా ఆశ్చర్యం ఉందా? (మార్కు 10:13-16) అయితే యేసు గురించి చదివి ధ్యానిస్తున్నంత సేపు, ఆ కుమారుడిలో తండ్రిని చూస్తున్నాం అని మర్చిపోవద్దు. ఎందుకంటే, యేసు దేవునికి అచ్చమైన ప్రతిరూపం.—హెబ్రీయులు 1:3.

ఈ పుస్తకం మనకు ఎలా సహాయం చేస్తుంది?

21, 22. యెహోవాను వెదకడం అంటే ఏంటి? ఈ పుస్తకం మనకు ఎలా సహాయం చేస్తుంది?

21 యెహోవా తన వాక్యమైన బైబిల్లో తన గురించి స్పష్టంగా చెప్పాడు. కాబట్టి, మనం తనకు దగ్గరవ్వాలనే కోరిక ఆయనకు ఉందని తెలిసిపోతుంది. అయితే, తనతో స్నేహం చేయమని ఆయన మనల్ని బలవంతపెట్టట్లేదు. “యెహోవా దొరికే సమయంలో” మనం ఆయన్ని వెదుకుతామా లేదా అనేది మన చేతుల్లోనే ఉంది. (యెషయా 55:6) యెహోవాను వెదకడం అంటే బైబిల్లో ఆయన లక్షణాల గురించి, ఆయన పనితీరు గురించి తెలుసుకుంటూ ఉండడం. ఇప్పుడు మీరు చదువుతున్న ఈ పుస్తకం, మీకు ఆ విషయంలో సహాయం చేస్తుంది.

22 మీరు చూసే ఉంటారు, ఈ పుస్తకంలో యెహోవాకున్న నాలుగు ముఖ్యమైన లక్షణాల్ని చర్చించే నాలుగు సెక్షన్లు ఉన్నాయి: అవి శక్తి, న్యాయం, తెలివి, ప్రేమ. ప్రతీ సెక్షన్‌లో, మొదటి అధ్యాయం ఆ లక్షణం గురించి వివరిస్తుంది. తర్వాతి కొన్ని అధ్యాయాలు, యెహోవా వేర్వేరు విధాలుగా ఆ లక్షణాన్ని ఎలా చూపించాడో చెప్తాయి. ఆ తర్వాతి అధ్యాయం, యేసు ఆ లక్షణాన్ని ఎలా చూపించాడో చర్చిస్తుంది. అలాగే చివర్లో, మనం ఆ లక్షణాన్ని ఎలా చూపించాలో వివరించే అధ్యాయం కూడా ఉంటుంది.

23, 24. (ఎ) “ధ్యానించడానికి ప్రశ్నలు” అనే బాక్సు గురించి వివరించండి. (బి) ధ్యానించడం వల్ల మనం దేవునికి ఎలా దగ్గరౌతాం?

23 ఈ అధ్యాయంతో మొదలుపెట్టి, ప్రతీ అధ్యాయంలో “ధ్యానించడానికి ప్రశ్నలు” అనే బాక్సు ఉంటుంది. ఉదాహరణకు 24వ పేజీలో ఉన్న బాక్సు చూడండి. అక్కడున్న లేఖనాలు, ప్రశ్నలు ఆ అధ్యాయంలో ఏం నేర్చుకున్నామో గుర్తు చేసుకోవడానికి కాదుగానీ, ఆ అంశానికి సంబంధించిన వేరే విషయాల గురించి ధ్యానించడానికి తయారు చేసినవి. వాటిని మీరు ఎలా చక్కగా ఉపయోగించవచ్చు? అక్కడున్న ప్రతీ లేఖనాన్ని బైబిలు తెరిచి చూడండి, వచనాల్ని జాగ్రత్తగా చదవండి. తర్వాత ఆ లేఖనం పక్కన ఉన్న ప్రశ్నను చూడండి. దానికి జవాబు ఏంటో ఆలోచించండి. మీరు కావాలనుకుంటే కొంత పరిశోధన చేయవచ్చు. ఇంకా కొన్ని అదనపు ప్రశ్నలు వేసుకోండి: ‘ఇది యెహోవా గురించి నాకు ఏం నేర్పిస్తుంది? దీన్ని నేను ఎలా పాటించవచ్చు? వేరేవాళ్లకు సహాయం చేయడానికి దీన్ని ఎలా ఉపయోగించవచ్చు?’

24 అలా ధ్యానించడం వల్ల మనం యెహోవాకు ఇంకా దగ్గరౌతాం. అలాగని ఎందుకు చెప్పవచ్చు? బైబిలు, ధ్యానించడాన్ని హృదయంతో ముడిపెడుతుంది. (కీర్తన 19:14) మనం దేవుని గురించి నేర్చుకున్న విషయాల్ని లోతుగా ఆలోచించినప్పుడు, అవి మన హృదయ లోతుల్లోకి ఇంకిపోతాయి. అక్కడ అవి మన ఆలోచనల్ని మలుస్తాయి, మన ఫీలింగ్స్‌ని తట్టి లేపుతాయి, చివరిగా మనం చర్య తీసుకునేలా కదిలిస్తాయి. అలా దేవుని మీద మనకు ప్రేమ పెరుగుతుంది. ఆ ప్రేమ వల్ల, మన ప్రియాతి ప్రియమైన స్నేహితుడిని సంతోషపెట్టాలనే కోరిక కూడా ఎక్కువౌతుంది. (1 యోహాను 5:3) యెహోవాకు మనం అలాంటి ఫ్రెండ్‌ అవ్వాలంటే ఆయన లక్షణాల గురించి, పనితీరు గురించి తెలుసుకోవాలి. ముందుగా, ఆయన స్వభావంలో ఒక లక్షణమైన పవిత్రత గురించి చూద్దాం. ఆ లక్షణం గురించి తెలుసుకుంటే ఎవరికైనా ఆయనకు దగ్గరవ్వాలి అనిపిస్తుంది.

a ఉదాహరణకు దేవునికి ముఖం, కళ్లు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్లు ఉన్నట్టు బైబిలు మాట్లాడుతుంది. (కీర్తన 18:15; 27:8; 44:3; యెషయా 60:13; మత్తయి 4:4; 1 పేతురు 3:12) యెహోవా “బండరాయి” లేదా “డాలు” అని బైబిలు చెప్తున్నప్పుడు ఎలాగైతే వాటిని అక్షరార్థంగా తీసుకోకూడదో, అలాగే వీటిని కూడా మనం అక్షరార్థంగా తీసుకోకూడదు.—ద్వితీయోపదేశకాండం 32:4, అధస్సూచి; కీర్తన 84:11.

ధ్యానించడానికి ప్రశ్నలు

  • కీర్తన 15:1-5 తన స్నేహితులు ఎలా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు?

  • కీర్తన 34:1-18 యెహోవా ఎవరికి దగ్గరగా ఉంటాడు? వాళ్లు ఏ నమ్మకంతో ఉండవచ్చు?

  • కీర్తన 145:18-21 యెహోవాకు దగ్గరవ్వడానికి మనవైపు నుండి మనం ఏం చేయాలి?

  • 2 కొరింథీయులు 6:14–7:1 యెహోవాతో స్నేహాన్ని నిలుపుకోవాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి