పరిచర్య శిక్షణా పాఠశాల—ఫలవంతమైన సేవ చేయడానికి గొప్ప అవకాశం
1 యిర్మీయా ప్రవక్త ద్వారా యెహోవా భవిష్యత్తులో జరగబోయే దాని గురించి ఇలా చెప్పాడు: “నేను వాటిమీద [నా ప్రజల మీద] కాపరులను నియమించెదను; ఇకమీదట అవి భయపడకుండను బెదరి పోకుండను వాటిలో ఒకటైనను తప్పిపోకుండను వీరు నా గొఱ్ఱెలను మేపెదరు.” (యిర్మీ. 23:4) నేడు అలాంటి కాపరి పని అన్ని జనాంగాల ప్రజల మధ్య జరుగుతోంది. ఆ పనిని వేలాదిమంది సంఘపెద్దలు చేస్తున్నారు. వారితోపాటు మంచుబిందువుల్లా అధిక సంఖ్యలో ఉన్న యౌవనులు యెహోవాను సేవించడానికి తమను తాము ఇష్టపూర్వకంగా అర్పించుకున్నారు. (కీర్త. 110:3) వినయస్థులైన ఈ సహోదరులు దేవుని ప్రజల సంఘాలకు ఎంతటి చక్కని ఆశీర్వాదమో కదా! ఆధ్యాత్మికమైన సమకూర్పు పని కొనసాగుతుండగా తమ సహోదరులకు సేవ చేసేందుకు తమను తాము అందుబాటులో ఉంచుకోగల, అర్హులైన సహోదరుల అవసరత ఇంకా ఉంది.
2 అవివాహితులైన పెద్దలు, పరిచర్య సేవకులు ఎక్కువ బాధ్యతలను చేపట్టేందుకు శిక్షణ ఇవ్వడానికి పరిచర్య శిక్షణా పాఠశాల ఒక చక్కని ఏర్పాటు. ఈ పాఠశాల 1987లో ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 140 దేశాలకు చెందిన 22,000 కన్నా ఎక్కువమంది విద్యార్థులు 999 తరగతుల్లో ఈ శిక్షణ పొందారు. ఈ సహోదరులకు, ఆ పాఠశాల ‘ఫలవంతమైన సేవ చేయడానికి గొప్ప అవకాశం’ కల్పించింది.—1 కొరిం. 16:9, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.
3 పాఠశాల ఉద్దేశం: సంస్థలో ఎక్కడ అవసరం ఏర్పడినా అర్హతగల సహోదరులు బాధ్యతలు చేపట్టగలిగేలా వారికి శిక్షణ ఇవ్వడం, వారిని సన్నద్ధులను చేయడం పరిచర్య శిక్షణా పాఠశాల లక్ష్యం. సువార్త ప్రకటనా పనిలో నాయకత్వం వహించడం, మందను కాయడంలో భాగం వహించడం, సంఘంలో బోధించడం వంటి వాటిలో ఈ పాఠశాల ఆ సహోదరుల సామర్థ్యాలను పెంచుతుంది. పట్టభద్రులైన తర్వాత కొందరు విద్యార్థులు తమ స్వదేశంలో లేక విదేశాల్లో ప్రత్యేక పయినీర్లుగా లేక ప్రయాణ పైవిచారణకర్తలుగా నియమకాలు పొందుతారు. ఇతరులు తమ సొంత సంఘాల్లో లేక బ్రాంచి క్షేత్రంలోనే అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సేవ చేసేందుకు నియమకాలు పొందుతారు.
4 ఎనిమిది వారాల ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో విద్యార్థులు బైబిలును క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. వారు ఎన్నో బైబిలు బోధలనే కాక కాపరి బాధ్యతలను, క్రైస్తవ జీవితంలో ఎదురయ్యే సమస్యలతో వ్యవహరించేందుకు మార్గదర్శక సూత్రాలను కూడా శ్రద్ధగా పరిశీలిస్తారు. కార్యనిర్వహణా సంబంధిత, న్యాయసంబంధిత, సంస్థాగత విషయాల గురించి లేఖనాలు ఏమి బోధిస్తున్నాయో కూడా వారు తెలుసుకుంటారు. వారు బహిరంగంగా ప్రసంగించడంలో ప్రత్యేక శిక్షణ పొందడంతో పాటు తమ ఆధ్యాత్మిక అభివృద్ధిని వేగవంతం చేసుకోవడానికి వ్యక్తిగత సహాయం పొందుతారు.
5 అర్హతలు: సహేతుకంగానే ఈ పాఠశాలకు హాజరవడానికి కావలసిన అర్హతలు ఎక్కువగానే ఉన్నాయి. దరఖాస్తు చేసేవారు పెద్దలుగా లేక పరిచర్య సేవకులుగా రెండు సంవత్సరాలైనా సేవ చేసి ఉండాలి. వారు 23 నుండి 50 సంవత్సరాల వయస్సున్న అవివాహితులై ఉండాలి. దరఖాస్తు చేసేవారు ఇంగ్లీషు స్పష్టంగా చదవగలగాలి, రాయగలగాలి, మాట్లాడగలగాలి, వారు మంచి ఆరోగ్యంతో ఉండాలి, వారికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవలసిన అవసరమో లేక ప్రత్యేకమైన ఆహారం తీసుకోవలసిన అవసరమో ఉండకూడదు. క్రమ పయినీరు సేవ చేస్తున్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
6 పరిచర్య శిక్షణా పాఠశాలకు హాజరుకావడానికి దరఖాస్తు చేసేవారు సహోదరులపట్ల ప్రేమతో, వారికి సేవ చేయాలనే కోరికతో ముందుకు రావాలే తప్ప ప్రాముఖ్యత లేక ప్రత్యేక హోదా పొందాలనే కోరికతో కాదు. అంతటి చక్కని శిక్షణ పొందిన తర్వాత, పట్టభద్రులైనవారు తాము నేర్చుకున్న వాటిని ఇతరులకు ప్రయోజనం చేకూరే విధంగా అన్వయించుకోవాలి.—లూకా 12:48.
7 ప్రయోజనాలు: ఎనిమిది వారాల తీక్షణమైన శిక్షణ సమయంలో పట్టభద్రులు ‘విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములతో పెంపారుతారు.’ (1 తిమో. 4:6) తాము నియమించబడిన సంఘాల్లో, సర్క్యూట్లలో ఇతరులకు సహాయం చేసేందుకు, ప్రోత్సహించేందుకు ఇది వారిని యోగ్యులను చేస్తుంది. పరిచర్య శిక్షణా పాఠశాల నుండి పట్టభద్రులైనవారు నియామకం పొందిన చాలా ప్రాంతాల్లో పరిచర్య అధికం అయింది, ప్రత్యేకంగా యౌవనులు పయినీరు సేవ చేయడానికి ప్రోత్సాహం పొందారు, దేవుని ప్రజలతో సహవసిస్తున్న అనేకమంది క్రొత్త వారిపట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపించబడింది.
8 మీరు 23 నుండి 50 సంవత్సరాల వయస్సున్న అవివాహిత పెద్ద లేక పరిచర్య సేవకులా? అయితే పరిచర్య శిక్షణా పాఠశాల కోసం దరఖాస్తు వేయడం గురించి మీరు ఎందుకు ఆలోచించకూడదు? మీరు యెహోవా సేవలో దీర్ఘకాల లక్ష్యాల గురించి ఆలోచిస్తున్న ఒక యౌవన సహోదరులా? ‘ఫలవంతమైన సేవ చేయడానికి గొప్ప అవకాశాన్ని’ పొందగలిగేలా మీ జీవితాన్ని నిరాడంబరంగా, ఏ అవరోధాలు లేకుండా ఎందుకు చేసుకోకూడదు? అలా చేస్తే మీకు మరింత ఆనందం, సంతృప్తి లభించవచ్చు. పరిచర్య శిక్షణా పాఠశాల, దానినుండి పట్టభద్రులైన వారికే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని ప్రజల సంఘాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉంది.
[6వ పేజీలోని బాక్సు]
ఈ శిక్షణ నుండి వారు ఎలా ప్రయోజనం పొందారు?
“ఈ శిక్షణ నా పరిచర్యను నిజంగా మెరుగుపరిచింది, లేఖనాలను ఉపయోగించి జ్ఞానంతో మందను కాసే నా సామర్థ్యాన్ని పెంచింది.”
“సంఘంలో నాకున్న అనేక బాధ్యతలను నిర్వహించడానికి ఈ పాఠశాల నాకు ఎంతో ఆత్మ విశ్వాసాన్నిచ్చింది.”
“నా జీవితంలోని ప్రతీ అంశాన్ని ఇది మార్చింది, దేవుని పరిపాలన గురించి, దేవుని సంస్థ గురించి నాకున్న భావాలను కూడా అది మార్చింది.”
“నేను పొందిన ఈ శిక్షణ, అవసరం ఎక్కువగా ఉన్న చోట నన్ను నేను అందుబాటులో ఉంచుకోవలసిన అవసరాన్ని గ్రహించేందుకు నాకు సహాయం చేసింది.”