6వ అధ్యాయం
సంఘ పరిచారకులు విలువైన సేవలు అందిస్తారు
అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలోని సంఘానికి ఇలా రాశాడు: “ఫిలిప్పీలోని క్రీస్తుయేసు శిష్యులైన పవిత్రులందరికీ, అలాగే పర్యవేక్షకులకు, సంఘ పరిచారకులకు క్రీస్తుయేసు దాసులైన పౌలు, తిమోతి రాస్తున్న ఉత్తరం.” (ఫిలి. 1:1) ఆయన “సంఘ పరిచారకుల” గురించి ప్రస్తావించాడని గమనించండి. అప్పట్లో ఈ సహోదరులు సంఘ పెద్దలకు ఎంతో సహకరించి ఉంటారని ఆ మాటల్నిబట్టి తెలుస్తుంది. మన కాలంలో కూడా ఇది నిజం. సంఘ పరిచారకులు చేసే పనులు పర్యవేక్షకులకు సహాయకరంగా ఉంటాయి, సంఘం క్రమపద్ధతిగా ఉండడానికి దోహదపడతాయి.
2 మీ సంఘంలో సంఘ పరిచారకులు ఎవరో మీకు తెలుసా? మీ ప్రయోజనం కోసం, సంఘమంతటి ప్రయోజనం కోసం వాళ్లు ఎలాంటి పనులు చేస్తారో మీకు తెలుసా? వాళ్లు చేస్తున్న కృషిని యెహోవా ఖచ్చితంగా విలువైనదిగా ఎంచుతాడు. పౌలు ఇలా రాశాడు: “చక్కగా పరిచారం చేసే పురుషులు మంచిపేరు సంపాదించుకుంటారు, క్రీస్తుయేసుకు సంబంధించిన విశ్వాసం గురించి ఎంతో ధైర్యంగా మాట్లాడగలుగుతారు.”—1 తిమో. 3:13.
సంఘ పరిచారకులకు ఉండాల్సిన లేఖన అర్హతలు
3 సంఘ పరిచారకులు ఆదర్శవంతులైన క్రైస్తవులుగా జీవించాలి; బాధ్యతగా నడుచుకోవాలి; ఇచ్చిన పనుల్ని సక్రమంగా చేయాలి. పౌలు తిమోతికి రాసిన ఉత్తరంలో, సంఘ పరిచారకులకు ఉండాల్సిన అర్హతల గురించి ఏమి చెప్పాడో పరిశీలిస్తే ఆ విషయం మనకు అర్థమౌతుంది. ఆయన ఇలా రాశాడు: “అలాగే సంఘ పరిచారకులు కూడా బాధ్యతగా నడుచుకునేవాళ్లు అయ్యుండాలి; వాళ్లకు రెండు నాలుకల ధోరణి ఉండకూడదు; వాళ్లు మితిమీరి మద్యం సేవించేవాళ్లు గానీ, అక్రమ లాభాన్ని ఆశించేవాళ్లు గానీ అయ్యుండకూడదు; వాళ్లు స్వచ్ఛమైన మనస్సాక్షితో విశ్వాసానికి సంబంధించిన పవిత్ర రహస్యాన్ని అంటిపెట్టుకునేవాళ్లు అయ్యుండాలి. అంతేకాదు, వాళ్లు అర్హులో కాదో ముందుగా పరీక్షించబడాలి; వాళ్ల మీద ఏ నిందా లేకపోతే సంఘ పరిచారకులుగా సేవచేయవచ్చు. సంఘ పరిచారకుడికి ఒకే భార్య ఉండాలి; అతను తన పిల్లలకు, ఇంటివాళ్లకు చక్కగా నాయకత్వం వహించేవాడై ఉండాలి.” (1 తిమో. 3:8-10, 12) సహోదరుల్ని సంఘ పరిచారకులుగా సిఫారసు చేసే ముందు వాళ్లు ఆ లేఖన అర్హతల్ని చేరుకున్నారో లేదో పెద్దలు నిర్ధారించుకోవాలి. అప్పుడు, ప్రత్యేక బాధ్యతలు అప్పగించబడిన వ్యక్తిని బట్టి ఇతరులు సంఘాన్ని నిందించకుండా ఉంటారు.
4 సంఘ పరిచారకులు యువకులైనా, వృద్ధులైనా ప్రతీ నెల పరిచర్యలో చురుగ్గా పాల్గొంటారు. వాళ్లు యేసును అనుకరిస్తూ పరిచర్య పట్ల ఉత్సాహం చూపిస్తారు. అలా, మనుషుల రక్షణ విషయంలో యెహోవాకున్న ఆసక్తిని వాళ్లు చూపిస్తారు.—యెష. 9:7.
5 సంఘ పరిచారకులు తాము వేసుకునే బట్టలు, కనబడేతీరు, మాటలు, ఆలోచనా విధానం, ప్రవర్తన వంటి విషయాల్లో కూడా మంచి ఆదర్శం ఉంచుతారు. వాళ్లు మంచి వివేచన చూపిస్తారు కాబట్టి ఇతరుల గౌరవాన్ని పొందుతారు. అంతేకాదు, యెహోవాతో తమకున్న సంబంధాన్ని, సంఘంలో తమ సేవావకాశాల్ని చాలా గంభీరమైనవిగా చూస్తారు.—తీతు 2:2, 6-8.
6 ఈ సహోదరులు ‘అర్హులో కాదో ముందే పరీక్షించబడ్డారు.’ సంఘ పరిచారకులుగా నియమించబడకముందే, వాళ్లు నిజంగా అంకిత భావంతో పనిచేసే పురుషులని నిరూపించుకున్నారు. వాళ్లు, తమ జీవితంలో రాజ్య సంబంధ విషయాలకు మొదటి స్థానం ఇస్తామని చూపించారు. అంతేకాదు, తమకు అందుబాటులో ఉండే ఏ సేవావకాశాలకైనా అర్హులవ్వడానికి కృషి చేస్తున్నారని చూపించారు. నిజానికి, వాళ్లు సంఘంలోని ఇతరులకు ఆదర్శంగా ఉన్నారు.—1 తిమో. 3:10.
వాళ్లు ఎలాంటి సేవలు అందిస్తారు?
7 సంఘ పరిచారకులు సహోదరసహోదరీలకు ఎన్నో విధాలుగా సేవలు అందిస్తారు. దానివల్ల బోధనా పని, కాపరి పని చేయడానికి పర్యవేక్షకులు ఎక్కువ సమయం వెచ్చించగలుగుతారు. పెద్దల సభ సంఘ పరిచారకులకు నియామకాలు ఇచ్చే ముందు వాళ్ల సామర్థ్యాల్ని, సంఘ అవసరాల్ని మనసులో ఉంచుకుంటుంది.
సంఘ పరిచారకులు సహోదరసహోదరీలకు ఎన్నో విధాలుగా సేవలు అందిస్తారు. దానివల్ల బోధనా పని, కాపరి పని చేయడానికి పర్యవేక్షకులు ఎక్కువ సమయం వెచ్చించగలుగుతారు
8 వాళ్లు చేసే కొన్ని పనుల్ని పరిశీలించండి: సాహిత్యాన్ని చూసుకునే పనికి ఒక సంఘ పరిచారకుణ్ణి నియమించవచ్చు. దానివల్ల మన కోసం, పరిచర్య కోసం కావాల్సిన ప్రచురణలు మనం తీసుకోగలుగుతాం. మరికొంతమంది సంఘ అకౌంట్స్‌ను లేదా టెరిటరీ రికార్డులను చూసుకుంటారు. ఇంకొంతమంది సంఘ పరిచారకులు మైకులను-సౌండ్ సిస్టమ్‌ని చూసుకోవడానికి, అటెండెంట్లుగా సేవచేయడానికి, ఇతర విధాల్లో పెద్దలకు సహాయం చేయడానికి నియమించబడతారు. రాజ్యమందిరాన్ని శుభ్రం చేయడానికి, దాన్ని మంచిస్థితిలో ఉంచడానికి చాలా పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి, ఆ పనులకు సహాయం చేయడానికి తరచూ సంఘ పరిచారకులు నియమించబడతారు.
9 కొన్ని సంఘాల్లో, ఒక్కో పనిని ఒక్కో సంఘ పరిచారకునికి అప్పగించే వీలుంటుంది. ఇంకొన్ని సంఘాల్లో అయితే, ఒక్క సంఘ పరిచారకుడే చాలా పనులు చూసుకోవాల్సి రావచ్చు. మరికొన్ని సందర్భాల్లో, ఒకే పనిని ఒకరి కన్నా ఎక్కువమంది సంఘ పరిచారకులు చూసుకుంటుండవచ్చు. ఆ పనుల్ని చేయడానికి సరిపడా సంఘ పరిచారకులు లేకపోతే, పెద్దల సభ బాప్తిస్మం తీసుకున్న ఆదర్శవంతులైన సహోదరులకు ఆ పనుల్ని అప్పగించవచ్చు. అలా చేయడంవల్ల వాళ్లు ఆ పనిలో అనుభవం సాధిస్తారు. వాళ్లు సంఘ పరిచారకులుగా అర్హులైనప్పుడు ఆ అనుభవం ఉపయోగపడుతుంది. ఒకవేళ సహోదరులు ఎవరూ లేకపోతే, కొన్ని పనులు చేయడానికి ఆదర్శవంతురాలైన ఒక సహోదరి సహాయం తీసుకోవచ్చు. అలాగని ఆమెను సంఘ పరిచారకురాలిగా నియమించరు. ఒక వ్యక్తి ప్రవర్తన, ఆరాధన ఇతరులు చూసి నేర్చుకునే విధంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆదర్శవంతుడని చెప్పవచ్చు. అతను లేదా ఆమె క్రమంగా కూటాలకు వెళ్లే విషయంలో, పరిచర్యలో భాగం వహించే విషయంలో అలాగే కుటుంబ జీవితం, వినోదం, బట్టలు, కనబడే తీరు వంటి విషయాల్లో ఇతరులకు మంచి ఆదర్శంగా ఉంటారు.
10 ఒకవేళ సంఘంలో తక్కువమంది పెద్దలు ఉంటే, బైబిలు సిద్ధాంతాలకు సంబంధించిన బాప్తిస్మ ప్రశ్నల్ని అడగడానికి, సమర్థులైన సంఘ పరిచారకులను ఉపయోగించుకోవచ్చు. ఆ ప్రశ్నలు అనుబంధంలోని “1వ భాగం: క్రైస్తవ నమ్మకాలు” కింద ఉన్నాయి. “2వ భాగం: క్రైస్తవ జీవితం.” ఈ భాగంలో సున్నితమైన వ్యక్తిగత విషయాలు ఉంటాయి కాబట్టి దాన్ని సంఘ పెద్ద మాత్రమే వాళ్లతో చర్చించాలి.
11 సరైన కారణం ఉందనుకుంటే, పెద్దల సభ సంఘ పరిచారకులకు అప్పగించిన పనుల్ని అప్పుడప్పుడు మార్చడం ప్రయోజనకరంగా ఉండవచ్చు. అయితే, ఆ సహోదరులను కొంతకాలం పాటు ఒకే విభాగంలో ఉంచడం చాలా మంచిది. దానివల్ల వాళ్లు ఆ పనిలో అనుభవం, నైపుణ్యం సాధిస్తారు.
12 స్థానిక పరిస్థితుల్ని బట్టి మరికొన్ని బాధ్యతల్ని, తమ “ప్రగతి అందరికీ స్పష్టంగా” కనిపించే సంఘ పరిచారకులకు అప్పగించవచ్చు. (1 తిమో. 4:15) సంఘంలో సరిపడా పెద్దలు లేకపోతే, గుంపు పర్యవేక్షకునికి సహాయకునిగా ఓ సంఘ పరిచారకుణ్ణి నియమించవచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో, పెద్దల పర్యవేక్షణలో పనిచేసే గుంపు సేవకునిగా అతన్ని నియమించవచ్చు. సంఘ పరిచారకులకు క్రైస్తవ జీవితం, పరిచర్య కూటంలో కొన్ని నిర్దిష్ట భాగాలు నియమించవచ్చు. అవసరాన్ని బట్టి సంఘ బైబిలు అధ్యయనం లేదా బహిరంగ ప్రసంగాలు నియమించవచ్చు. ఏదైనా ఒక నిర్దిష్టమైన అవసరం ఏర్పడితే, ఆ పనికి సరిపోయే అర్హతలున్న సంఘ పరిచారకులకు ఆ బాధ్యతల్ని అప్పగించవచ్చు. (1 పేతు. 4:10) పెద్దలకు సహాయంచేసే విషయంలో సంఘ పరిచారకులు ఇష్టపూర్వకంగా ముందుకు రావాలి.
13 సంఘ పరిచారకులు చేసే పనులు పెద్దలు చేసే పనుల్లాంటివి కాకపోయినా, అవి కూడా దేవుని పవిత్ర సేవలో భాగమే. సంఘంలో అన్నీ సజావుగా జరగడానికి అవి ప్రాముఖ్యం. కొంతకాలానికి, సంఘ పరిచారకులు తమ విధుల్ని చక్కగా నిర్వహిస్తూ కాపరులుగా, బోధకులుగా సేవ చేయడానికి అర్హులైతే, సంఘ పెద్దలుగా సేవ చేసేందుకు వాళ్లను సిఫారసు చేయవచ్చు.
14 మీరు టీనేజీ సహోదరుడైతే లేదా కొత్తగా బాప్తిస్మం తీసుకున్న సహోదరుడైతే, సంఘ పరిచారకులకు ఉండాల్సిన అర్హతలు సంపాదించడానికి కృషి చేస్తున్నారా? (1 తిమో. 3:1) ప్రతీ సంవత్సరం ఎంతోమంది సత్యంలోకి వస్తున్నారు, కాబట్టి సంఘ బాధ్యతలు చూసుకోవడానికి అర్హులైన ఆధ్యాత్మిక సహోదరుల అవసరం ఎంతో ఉంది. ఇతరులకు సహాయం చేయాలనే కోరికను పెంపొందించుకోవడం ద్వారా మీరు సంఘ పరిచారకుడవ్వడానికి కృషి చేయవచ్చు. అందుకు ఓ మార్గం, యేసు ఉంచిన చక్కని ఆదర్శం గురించి ధ్యానించడం. (మత్త. 20:28; యోహా. 4:6, 7; 13:4, 5) ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని చవిచూసే కొద్దీ, ఇతరులకు సహాయం చేయాలనే మీ కోరిక మరింత బలపడుతుంది. (అపొ. 20:35) కాబట్టి ఇతరులకు అవసరమైన సహాయం చేయడానికి ముందుకు రండి. అలాగే, రాజ్యమందిరాన్ని సరైన స్థితిలో ఉంచడానికి సహాయం చేయండి. లేదా క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌లో విద్యార్థి నియామకాలు ఉన్నవాళ్లెవరైనా రాకపోతే ఆ భాగాన్ని చేయడానికి సిద్ధంగా ఉండండి. అంతేకాదు, చక్కని అధ్యయన అలవాట్లు కలిగివుంటూ ఆధ్యాత్మిక లక్షణాలు పెంపొందించుకోండి. (కీర్త. 1:1, 2; గల. 5:22, 23) సంఘ పరిచారకుడు అవ్వడానికి అర్హత సాధిస్తున్న సహోదరుడు, సంఘంలో నియామకాలను నిజాయితీగా, నమ్మకంగా చేస్తాడు.—1 కొరిం. 4:2.
15 సంఘ ప్రయోజనం కోసం, సంఘ పరిచారకులు పవిత్రశక్తి ద్వారా నియమించబడతారు. వాళ్లు తమ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నప్పుడు, సంఘంలోని సహోదర సహోదరీలందరూ సహకరించడం ద్వారా సంఘ పరిచారకులు చేస్తున్న కృషిపట్ల కృతజ్ఞత చూపించవచ్చు. అలా, అన్నీ పద్ధతి ప్రకారం జరగడానికి యెహోవా చేసిన ఏర్పాటుపట్ల సంఘం కృతజ్ఞత చూపిస్తుంది.—గల. 6:10.