మీ సమయాన్ని జ్ఞానవంతంగా ఉపయోగించండి
1 యెహోవాను సంతోషపెట్టాలనే మన కోరిక, ఆధ్యాత్మిక కార్యకలాపాల చుట్టూ జీవితాలను నిర్మించుకోవడానికి మనల్ని పురికొల్పుతుంది. ‘ఆయన రాజ్యాన్ని వెదకమని,’ “శ్రేష్ఠమైన కార్యములను వివేచింప[మని]” దేవుని వాక్యం ఉపదేశిస్తోంది. (మత్త. 6:33; ఫిలి. 1:9) రాజ్య సంబంధ విషయాల కోసం మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అంత ప్రాముఖ్యంకాని విషయాలకు తర్వాతి స్థానం ఎలా ఇవ్వవచ్చు?—ఎఫె. 5:15-17.
2 రాజ్య కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వండి: మీ సమయాన్ని అనవసరమైన విషయాలతో వృథా కాకుండా ఉండేందుకు కాలపట్టిక వేసుకోండి. కొందరు క్షేత్రసేవ కోసం వెచ్చించాలనుకుంటున్న నిర్దిష్ట సమయాలను తమ క్యాలెండర్లో గుర్తు పెట్టుకోవడం ద్వారా ప్రతీ నెలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆ ప్రణాళికలకు వేరే విషయాలు ఆటంకం కాకుండా జాగ్రత్తపడతారు. కూటాలు, వ్యక్తిగత అధ్యయనం, సమావేశాల విషయంలో కూడా మనమలాగే సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. చాలామందికి బైబిలు పఠనంతో ప్రారంభమయ్యే లేక ముగిసే కాలపట్టిక ఉంది. ప్రతీ ప్రాముఖ్యమైన పనికి నిర్దిష్ట సమయాన్ని కేటాయించండి, ఇతర విషయాలు అనవసరంగా వాటికి ఆటంకం కానివ్వకండి.—ప్రసం. 3:1; 1 కొరిం. 14:39.
3 లోకాన్ని పరిమితంగా అనుభవించండి: కొన్ని దేశాల్లో క్రీడలు, వినోదం, ఉల్లాస కార్యకలాపాలు, అభిరుచులు, ఇతర కార్యకలాపాలు సులభంగా అందుబాటులో ఉంటాయి. చాలామంది టీవీ చూడడంలో లేదా కంప్యూటర్లను ఉపయోగించడంలో చాలా సమయాన్ని వెచ్చిస్తారు. అయితే, ఈ లోకం అందించే కాలక్షేప కార్యకలాపాల్లో, సరిక్రొత్త పరికరాల మోజులో మునిగిపోతే అది తప్పక నిరాశకు దారితీస్తుంది. (1 యోహా. 2:15-17) అందుకే లోకాన్ని ఎక్కువగా అనుభవించవద్దని బైబిలు మనకు ఉద్బోధిస్తోంది. (1 కొరిం. 7:31) ఆ జ్ఞానయుక్త హితవును లక్ష్యపెట్టడం ద్వారా మీరు మీ జీవితంలో ఆయన ఆరాధనకు మొదటిస్థానం ఇస్తున్నారని యెహోవాకు చూపించవచ్చు.—మత్త. 6:19-21.
4 ఈ ప్రస్తుత విధానానికి చాలా తక్కువ సమయం మిగిలి ఉంది. రాజ్య సంబంధ విషయాలకు మొదటిస్థానం ఇచ్చేవారు సంతోషంగా ఉంటారు, దేవుని అనుగ్రహాన్ని సంపాదించుకుంటారు. (సామె. 8:32-35; యాకో. 1:25) కాబట్టి, మనం ఎంతో విలువైన మన సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకుందాం.