విరామాన్ని సరైన స్థానంలో ఉంచండి
1 ఈ క్లిష్టమైన రోజుల్లో, మనందరికీ అప్పుడప్పుడు మార్పు అవసరం. కొంతమట్టుకు విరామ కార్యకలాపాలు మంచివే. అయినప్పటికీ, విరామానికి, వినోదానికి మరియు పార్టీలకు అధిక సమయం వెచ్చిస్తే, అది ఒక వ్యక్తిని ఆధ్యాత్మిక లక్ష్యాల కోసం అతి తక్కువ సమయం వెచ్చించేలా అచేతనావస్థలో పడేస్తుంది. మనం వినోదాన్ని సరైన స్థానంలో ఉంచాలి. (మత్త. 5:3, NW) ఇదెలా సాధ్యమవుతుంది? ఎఫెసీయులు 5:15-17లో లభించే సలహాను పాటించడం ద్వారా అది సాధ్యమవుతుంది.
2 పరిమితులను పెట్టుకోండి: క్రైస్తవులు తమ జీవితాలను ఎంత జ్ఞానవంతంగా గడుపుతున్నారో ‘జాగ్రత్తగా చూచుకోవడం’ వారి కర్తవ్యం అని పౌలు వ్రాశాడు. విరామ సమయాన్ని నిజంగా అవసరమైనంత వరకే పరిమితం చేయడానికి మిత స్వభావము, ఆశా నిగ్రహము అవసరము. మన ఖాళీ సమయాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నామనే దాని గురించి గంభీరంగా ఆలోచించడం యుక్తమైనదే. విరామ కార్యకలాపాల వలన, మన సమయం వ్యర్థమైందని లేక బాగా అలసిపోయామని అనిపించకుండా, అవి కొంతమేరకు ప్రయోజనకరమైన ఉద్దేశము కలిగివుండాలి. ఒకవేళ ఏదైనా వినోదంలో పాల్గొన్న తర్వాత నిష్ప్రయోజనం, అసంతృప్తి, ఓ మాదిరి అపరాధ భావం కలిగినట్లు అనిపిస్తే, మన సమయాన్ని వినియోగించడంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరముందని అది సూచిస్తోంది.
3 సహేతుకంగా ఉండండి: జీవితంలోని అతి ముఖ్యమైన విషయాల్లో ‘సమయమును పోనియ్యక సద్వినియోగము చేసుకోవాలి,’ “అవివేకులు” కాకూడదు అని పౌలు సలహా ఇచ్చాడు. సమర్పిత క్రైస్తవులు తమ జీవితాలు విరామ కార్యకలాపాలపైనే కేంద్రీకృతమవడానికి అనుమతించరు. విశ్రాంతి, వినోద కాలక్షేపం మనలను శారీరకంగా ఉత్తేజితులను చేయగలిగినా, ఆధ్యాత్మిక బలమిచ్చేది దేవుని చురుకైన శక్తే. (యెష. 40:29-31) ఆ ఆత్మను మనం బైబిలును అధ్యయనం చేయడం, కూటాలకు హాజరవడం, ప్రాంతీయ సేవలో పాల్గొనడంలాంటి దైవ పరిపాలన కార్యక్రమాల ద్వారా పొందుతామే తప్ప విరామ కార్యకలాపాల ద్వారా కాదు.
4 ప్రాధాన్యతలను నిర్ధారించుకోండి: “ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి” అని క్రైస్తవులను పౌలు ఆదేశించాడు. దేవుని రాజ్యాన్ని మన జీవితంలో ప్రధానమైనదిగా చేసుకొని దానికి తగిన విధంగా మన కార్యకలాపాలు ఉండాలని యేసు బోధించాడు. (మత్త. 6:33) యెహోవాకు చేసుకున్న మన సమర్పణకు అనుగుణంగా జీవించడానికి అనుకూలించే పనులను మనం మొదట చేయడం చాలా ముఖ్యం. దాని తర్వాత, విరామ సమయాన్ని సరైన స్థానంలో పెట్టాలి. అప్పుడు, అది ఆరోగ్యకరమైన ప్రభావం కలిగివుంటుంది, మనం వాటిని ఎక్కువగా ఆనందించగలం.—ప్రసం. 5:12.