అందరూ పరస్పరం ప్రోత్సహించుకోవడం
1. ప్రయాణ పైవిచారణకర్తల సందర్శనాలద్వారా ఎలాంటి ప్రత్యేకావకాశాలు మనకు దొరకుతాయి?
1 అపొస్తలుడైన పౌలు రోమాలోని సంఘానికి ఇలా రాశాడు: “మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత, అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణ [“ప్రోత్సాహం,” NW] పొందవలెనని ఆత్మసంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను.” (రోమా. 1:11, 12) మన కాలంలో ప్రయాణ పైవిచారణకర్తల సందర్శనాలద్వారా ఒకరినొకరు ప్రోత్సహించుకునే అలాంటి అవకాశాలే మనకు దొరకుతాయి..
2. ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శనం గురించి ముందే ఎందుకు తెలియజేస్తారు?
2 సంఘం: సాధారణంగా, ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శనం గురించి దాదాపు మూడు నెలల ముందే సంఘానికి తెలియజేస్తారు. దీనివల్ల, సందర్శనం నుండి పూర్తి ప్రయోజనం పొందేలా ముందుగానే పథకం వేసుకొనేందుకు మనకు తగినంత సమయముంటుంది. (ఎఫె. 5:15, 16) మీరు ఉద్యోగస్థులైతే ఆ వారం క్షేత్ర సేవలో పాల్గొనేందుకు బహుశా ముందే సెలవు కోసం అడగవచ్చు. కొందరు ఆ నెలలో సహాయ పయినీరు సేవ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. మీరు సందర్శనా వారంలోనే వేరే ఊరికి వెళ్ళాలనుకున్నట్లయితే, సందర్శనా వారంలో ఉండేలా మీ ప్రణాళికలను మార్చుకోగలరా?
3. సందర్శనా వారంలో ప్రోత్సాహం పొందడానికి వ్యక్తిగతంగా మనమేమి చేయవచ్చు?
3 క్షేత్ర సేవలో వ్యక్తిగత ప్రోత్సాహం, శిక్షణ ఇవ్వడానికే ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శిస్తాడు. ప్రాంతీయ పైవిచారణకర్తను, ఆయన వివాహితుడైతే ఆయన భార్యను మీతో కలిసి పనిచేయమని అడగగలరా? పరిచర్యలో అంతగా అనుభవం లేనివారితో లేదా పరిచర్యలో నైపుణ్యాన్ని మరింతగా పెంచుకోవాలనుకునే వారితోపాటు వివిధ ప్రచారకులతో కలిసి పనిచేయడానికి ప్రాంతీయ పైవిచారణకర్తలు ఇష్టపడతారు. క్షేత్రసేవలో ఆయన మాట్లాడే విధానం నుండి అందరూ నేర్చుకొని ప్రేమతో ఆయనిచ్చే ఏ సూచనలనైనా పాటించవచ్చు. (1 కొరిం. 4:16, 17) ఆయనను భోజనానికి ఆహ్వానించడం ద్వారా ఆయనతో ప్రోత్సహకరమైన సహవాసం చేసేందుకు మీకు మరింత అవకాశం దొరుకుతుంది. (హెబ్రీ. 13:1) ఆయనిచ్చే ప్రసంగాలు సంఘ అవసరాలకు తగ్గట్టు ఉంటాయి కాబట్టి వాటిని శ్రద్ధగా వినండి.
4. మన ప్రాంతీయ పైవిచారణకర్తను మనమెలా ప్రోత్సహించవచ్చు?
4 ప్రాంతీయ పైవిచారణకర్త: అపొస్తలుడైన పౌలు తాను సందర్శించిన సంఘాల్లోని సహోదరులవంటి వాడే. ఆయన కూడా సవాళ్ళను ఎదుర్కొన్నాడు, బాధలను అనుభవించాడు. ఆయనకూ ప్రోత్సాహం అవసరమైంది, అలా ప్రోత్సహం లభించినప్పుడు ఆయన కృతజ్ఞతలను తెలియజేశాడు. (2 కొరిం. 11:26-28) ఇప్పుడు ఖైదీగావున్న పౌలు చివరిసారి అక్కడికి వస్తున్నాడని రోమాలోని సంఘం తెలుసుకున్నప్పుడు కొందరు ఆయనను కలుసుకోవడానికి 74 కిలోమీటర్లు ప్రయాణంచేసి అప్పీయా సంతపేట వరకు వెళ్ళారు. “పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను.” (అపొ. 28:15) మీరూ మీ ప్రాంతీయ పైవిచారణకర్తను అలాగే ప్రోత్సహించవచ్చు. ఆయన సందర్శనా సమయంలో ఉత్సాహంగా సహకరించడం ద్వారా ఆయనకు “రెట్టింపు సన్మానము” ఇవ్వండి. (1 తిమో. 5:17) మీ కోసం ఆయన చేస్తున్న కృషికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయండి. ఆయనా, ఆయన భార్యా, మీరు కనబరిచే విశ్వాసాన్ని, ప్రేమను, సహనాన్ని చూసి సంతోషిస్తారు.—2 థెస్స. 1:3, 4.
5. నేడు మనందరికీ ప్రోత్సాహం ఎందుకవసరం?
5 ఈ “అపాయకరమైన కాలములో” మనలో ప్రోత్సహం ఎవరికి అవసరముండదు? (2 తిమో 3:1) ప్రాంతీయ పైవిచారణకర్తతో, ఆ వారంలో జరిగే ప్రత్యేక కార్యకలాపాలలో పూర్తిగా పాల్గొనాలని ఇప్పుడే నిర్ణయించుకోండి. ప్రయాణ పైవిచారణకర్తలతో సహా, సంఘంలోని ప్రచారకులందరూ, సంతోషంగా ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి తమవంతు కృషిచేయవచ్చు. ఈ విధంగా కూడా మనం ‘ఒకరినొకరం ఆదరించుకుంటూ క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటూ’ ఉంటాం.—1 థెస్స. 5:11.