పరిచర్యపట్ల మన ఉత్సాహం తగ్గకుండా చూసుకుందాం
1 ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షులు 1992 నుండి ప్రతీ సంవత్సరం ఉత్సాహంగా రాజ్య ప్రకటనా పని చేయడంలో, శిష్యులను చేయడంలో 100 కోట్లకన్నా ఎక్కువ గంటలు వెచ్చిస్తున్నారు. అంత గొప్ప లక్ష్యాన్ని చేరుకోవడంలో మనం కూడా చిన్న పాత్ర పోషించగలిగినందుకు మనమెంత సంతోషిస్తున్నామో కదా!—మత్త. 28:19, 20.
2 అయితే, ఈ ‘అపాయకరమైన కాలాల్లో’ మనం పరిచర్య చేస్తుండగా మనకు తోడైవున్న యెహోవాకే ఆ ఘనతంతా దక్కుతుంది. (2 తిమో. 3:1) ఈ ప్రాముఖ్యమైన పనిని ఉత్సాహంగా చేస్తూనే ఉండడానికి మన వంతుగా మనమేమి చేయాలి?
3 ఉత్సాహానికి కారణం: దేవునిపట్ల, పొరుగువారిపట్ల ఉన్న ప్రగాఢమైన ప్రేమ, మన సమర్పణకు అనుగుణంగా జీవించాలనే హృదయపూర్వక కోరిక, రాజ్య సేవలో పాల్గొనేలా మనల్ని పురికొల్పుతాయి. (మత్త. 22:37-39; 1 యోహా. 5:3) మనం ప్రకటనా పనిలో పూర్తిగా భాగం వహించేందుకు త్యాగాలు చేసేలా కూడా ప్రేమ మనల్ని కదిలిస్తుంది.—లూకా 9:23.
4 ఉత్సాహాన్ని నీరుగారకుండా చూసుకోండి: పరిచర్యపట్ల మనకున్న ఉత్సాహాన్ని నీరుగార్చడానికి మన విరోధియైన అపవాది ఏ అవకాశాన్నీ వదలడు. మనల్ని నిరుత్సాహపర్చడానికి క్షేత్రంలోని ప్రజల ఉదాసీనతను, లోకపరమైన ప్రలోభాలను, అనుదిన జీవితంలోని ఒత్తిళ్లను, ఆరోగ్య సమస్యల గురించిన చింతనేకాక అలాంటి ఇతర విషయాలను అతను ఉపయోగిస్తాడు.
5 కాబట్టి, మనం మన ఉత్సాహం కనబరుస్తూనే ఉండడానికి కృషిచేయాలి. “మొదట [మన]కుండిన ప్రేమను” ఇంకా పెంచుకోవడం ప్రాముఖ్యం. అలా పెంచుకోవడానికి, మనం క్రమంగా దేవుని వాక్యమైన బైబిలును చదివి, ధ్యానించడంతోపాటు మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ ద్వారా యెహోవా చేసిన ఆధ్యాత్మిక ఏర్పాట్లన్నిటినుండి ప్రయోజనం పొందాలి.—ప్రక. 2:4; మత్త. 24:45; కీర్త. 119:97.
6 బైబిలు ప్రవచనాలు స్పష్టంగా సూచిస్తున్నట్లుగా, భక్తిహీనులు నాశనం చేయబడే యెహోవా దినం చాలా దగ్గరపడుతోంది. (2 పేతు. 2:3; 3:10) దానిని స్పష్టంగా మనసులో ఉంచుకుని, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజ్య ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో పూర్తిగా భాగం వహిస్తూ పరిచర్యలో మనం ఉత్సాహం కనబరుస్తూనే ఉండడానికి కృషిచేద్దాం!