ప్రశ్నాభాగం
▪ ఆసక్తిగలవారితో ఏ రెండు పుస్తకాలు అధ్యయనం చేయాలి?
గృహ బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి, నిర్వర్తించడానికి మనం ఉపయోగించే ముఖ్య ఉపకరణం బైబిలు బోధిస్తోంది పుస్తకం. బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి తగిన కరపత్రం లాంటి వేరే ఏ సాహిత్యాన్ని ఉపయోగించినా తప్పేమీ లేదు, అయితే సాధ్యమైనంత త్వరగా బైబిలు బోధిస్తోంది పుస్తకంలో నుండే అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించాలి. అధ్యయనాలు ప్రారంభించడానికి బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఉపయోగించడం ద్వారా విశేషమైన ఫలితాలు లభించాయి.
బైబిలు బోధిస్తోంది పుస్తకం పూర్తై, విద్యార్థి ప్రగతి సాధిస్తున్నప్పుడు, దేవుణ్ణి ఆరాధించండి పుస్తకాన్ని అధ్యయనం చేయవచ్చు. (కొలొ. 2:6, 7) ఆ పుస్తకం యొక్క ఉద్దేశమేమిటో 2వ పేజీ ఇలా వివరిస్తుంది: “దేవుణ్ణి ప్రేమించేవారందరు ఆయన అమూల్యమైన సత్యాల ‘లోతును ఎత్తును గ్రహించాలని’ బైబిలు ఉద్బోధిస్తోంది. (ఎఫెసీయులు 3:18.) ఆ లక్ష్యం సాధించడానికే ఈ పుస్తకం తయారుచేయబడింది. మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి, దేవుని నీతియుక్త నూతనలోకానికి నడిపించే ఇరుకు మార్గంలో నడిచేందుకు మరింత సంసిద్ధులు కావడానికి ఈ పుస్తకం మీకు సహాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాము.”
రెండు పుస్తకాలు పూర్తవకముందే విద్యార్థి బాప్తిస్మం తీసుకోవడానికి అర్హుడైతే, రెండవ పుస్తకం పూర్తయ్యేంతవరకు అధ్యయనం కొనసాగించాలి. విద్యార్థి బాప్తిస్మం తీసుకున్నప్పటికీ, అధ్యయనాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి అధ్యయనం నిర్వహించిన సమయాన్ని, పునర్దర్శనాన్ని, బైబిలు అధ్యయనాన్ని రిపోర్టు చేయవచ్చు. నిర్వాహకునితోపాటు వెళ్ళి, అధ్యయనంలో పాల్గొనే ప్రచారకుడు కూడా సమయాన్ని రిపోర్టు చేయవచ్చు.