బైబిలు అధ్యయనాలు నిర్వహించేందుకు “దేవుని ప్రేమ” పుస్తకాన్ని ఎలా ఉపయోగించాలి?
1. “దేవుని ప్రేమ” పుస్తకం ఎందుకు రూపొందించబడింది?
1 “పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తోంది” అనే జిల్లా సమావేశంలో ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ అనే కొత్త పుస్తకం అందుకుని మనమెంత సంతోషించామో కదా! మనం సమావేశంలో విన్నట్లుగా ప్రవర్తన విషయంలో యెహోవా నియమాలేమిటో తెలుసుకొని, వాటిని ఇష్టపూర్వకంగా పాటించడానికి ఈ పుస్తకం రూపొందించబడిందే గానీ ప్రాథమిక బైబిలు సిద్ధాంతాలను బోధించడానికి కాదు. కాబట్టి ఇంటింటి పరిచర్యలో ఈ పుస్తకాన్ని మనం గృహస్థులకు ఇవ్వకూడదు.
2. ఈ పుస్తకాన్ని ఎలా ఉపయోగించాలి, ఎవరికి మాత్రమే ఉపయోగించాలి?
2 ఒక విద్యార్థితో బైబిలు బోధిస్తోంది పుస్తకం పూర్తిచేసిన తర్వాత, ఆయనతో అధ్యయనం చేయడానికి రెండవ పుస్తకంగా దీనిని ఉపయోగించాలి. అందరూ ఆధ్యాత్మికంగా ఒకే విధంగా పరిణతి చెందరు. కాబట్టి ఆ విద్యార్థి గ్రహించగలినంత మేరకే అధ్యయనం చేయాలి. చేసిన అధ్యయన భాగం విద్యార్థికి స్పష్టంగా అర్థమయ్యేలా చూడాలి. గతంలో చాలా పుస్తకాలు అధ్యయనం చేసినా, నేర్చుకున్న బైబిలు సత్యాలకు అనుగుణంగా తమ జీవితాలను సరిదిద్దుకోవడానికి ఇష్టపడకుండా, సంఘ కూటాలకు హాజరవకుండా ఉన్నవారితో అధ్యయనం చేయడానికి ఈ పుస్తకం ఉపయోగించకూడదు.
3. ప్రస్తుతం, దేవుణ్ణి ఆరాధించండి పుస్తకం అధ్యయనం చేస్తుంటే మనమేమి చేయవచ్చు?
3 ప్రస్తుతం, దేవుణ్ణి ఆరాధించండి పుస్తకంలో చివరి అధ్యాయాలు మిగిలివుంటే మీరు ఆ పుస్తకం పూర్తి చేయాలనుకోవచ్చు, అదే సమయంలో “దేవుని ప్రేమ” పుస్తకాన్ని సొంతగా చదవమని విద్యార్థిని ప్రోత్సహించవచ్చు. లేదా ఆ పుస్తకాన్ని అక్కడే నిలిపేసి ఈ కొత్త పుస్తకంలో నుండి అధ్యయనం చేయడం ప్రారంభించవచ్చు. బైబిలు బోధిస్తోంది పుస్తకంలోలాగే అనుబంధంలోని విషయాలు చర్చించాలో వద్దో సొంతగా నిర్ణయించుకోవచ్చు.
4. బైబిలు బోధిస్తోంది, “దేవుని ప్రేమ” పుస్తకాలు రెండూ పూర్తికాకముందే విద్యార్థి బాప్తిస్మం తీసుకుంటే మనమేమి చేయాలి?
4 రెండు పుస్తకాలు పూర్తవక ముందే విద్యార్థి బాప్తిస్మం తీసుకుంటే, “దేవుని ప్రేమ” పుస్తకం పూర్తయ్యేవరకు ఆ అధ్యయనం కొనసాగాలి. ఆ విద్యార్థి బాప్తిస్మం తీసుకున్నా కూడా మీరు సమయాన్ని, పునర్దర్శనాన్ని, స్టడీని రిపోర్టు చేయవచ్చు. మీతో పాటు వచ్చి అధ్యయనంలో భాగం వహించిన ప్రచారకులు కూడా ఆ సమయాన్ని రిపోర్టు చేయవచ్చు.
5. కొంతకాలంగా ప్రకటనా పనిలో నిష్క్రియుడిగా ఉన్న వ్యక్తికి సహాయం చేయడానికి “దేవుని ప్రేమ” పుస్తకాన్ని ఎలా ఉపయోగించవచ్చు?
5 సంఘ సేవా కమిటీలోని ఒక సహోదరుడు, ప్రకటనా పనిలో నిష్క్రియుడైన వ్యక్తితో “దేవుని ప్రేమ” పుస్తకంలోని కొన్ని నిర్దిష్ట అధ్యాయాలను పరిశీలించమని మిమ్మల్ని అడగవచ్చు. అలాంటి అధ్యయనాలను ఎక్కువకాలం నిర్వహించాల్సిన అవసరం లేదు. “దేవుని ప్రేమలో” స్థిరంగా ఉండేందుకు మనకు సహాయం చేయడానికి ఈ కొత్త పుస్తకం మనకెంత మంచి ఉపకరణమో కదా!—యూదా 20, 21.