మీ బోధ ఒప్పించేలా ఉండాలి
1 అపొస్తలుడైన పౌలుకు తెలిసినట్లే, ‘సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించడానికి,’ పరిశుద్ధ లేఖనాల్ని ఎత్తి చెప్పడం మాత్రమే సరిపోదని సమర్థవంతులైన పరిచారకులకు కూడా తెలుసు. (2 తిమో. 2:15) కాబట్టి దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తూ మనం ‘ఒప్పించేలా’ ఎలా బోధించవచ్చు?—అపొ. 28:23.
2 దేవుని వాక్యాన్ని చూపించండి: మొదటిగా, బైబిల్లో దేవుని జ్ఞానం ఉందని ఇంటివారు గ్రహించి, దానిని గౌరవించేందుకు సహాయం చేయండి. దేవుని వాక్యంలో మనకున్న నమ్మకం, మనం చదువుతున్న వచనాన్ని వాళ్లు మరింత శ్రద్ధగా వినేలా చేయవచ్చు. (హెబ్రీ. 4:12) “ఈ విషయంలో దేవుని అభిప్రాయమేమిటో తెలుసుకోవడం నాకు ప్రయోజనకరంగా అనిపించింది. ఆయన వాక్యం ఏమి చెబుతోందో చూడండి” అని వాళ్లతో అనవచ్చు. వీలైనప్పుడల్లా, దేవుని వాక్యం నుండి నేరుగా చదవండి.
3 రెండవదిగా, చదివిన వచనాన్ని వివరించండి. వచనం చదవగానే అర్థం చేసుకోవడం చాలామందికి కష్టం. కాబట్టి మనం దానిని ఎందుకు చదివామో వివరించాల్సి ఉంటుంది. (లూకా 24:26, 27) దానిలో ముఖ్య విషయానికి సంబంధించిన పదాలను చూపించండి. వాళ్ళకు విషయం స్పష్టంగా అర్థమైందో లేదో తెలుసుకునేందుకు ఒక ప్రశ్న అడగవచ్చు.—సామె. 20:5; అపొ. 8:30.
4 లేఖనాలను ఉపయోగిస్తూ తర్కబద్ధంగా మాట్లాడండి: మూడవదిగా, ఇంటివారు చర్య తీసుకునేలా ప్రోత్సహించడానికి ప్రయత్నించండి. ఆ వచనాన్ని తామెలా అన్వయించుకోవచ్చో గ్రహించేందుకు సహాయం చేయండి. లేఖనాలను ఉపయోగిస్తూ తర్కబద్ధంగా మాట్లాడడం, తమ అభిప్రాయాన్ని మార్చుకునేలా వాళ్లను ఒప్పిస్తుంది. (అపొ. 17:2-4; 19:8) ఉదాహరణకు, కీర్తన 83:18 చదివిన తర్వాత, ఎవరితోనైనా వ్యక్తిగతంగా మంచి సంబంధం ఏర్పర్చుకోవాలంటే ఆ వ్యక్తి పేరు తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యమో వివరించవచ్చు. ఆ తర్వాత మనం, “దేవుని పేరు తెలుసుకోవడం వల్ల మీ ప్రార్థనలు మెరుగౌతాయని మీకు అనిపిస్తోందా?” అని అడగవచ్చు. ఈ విధంగా బైబిలు వచనాన్ని ఇంటివారికి అన్వయిస్తూ మాట్లాడితే, అది తమకెందుకు ప్రయోజనకరమో వాళ్లకు తెలుస్తుంది. అలా దేవుని వాక్యం నుండి ఒప్పించేలా బోధించినప్పుడు, మంచి హృదయం గలవారు సజీవుడును, సత్యదేవుడునైన యెహోవా ఆరాధనవైపు ఆకర్షితులౌతారు.—యిర్మీ. 10:10.
[అధ్యయన ప్రశ్నలు]
1. పరిచర్యలో దేవుని వాక్యాన్ని సమర్థవంతంగా ఉపయోగించాలంటే ఏమిచేయాలి?
2. దేవుని వాక్యాన్ని గౌరవించేలా ప్రజలకు ఎలా సహాయం చేయవచ్చు?
3. ఒక వచనం చదివిన తర్వాత, దాని అర్థం గ్రహించడానికి ఇంటివారికి ఎలా సహాయం చేయవచ్చు?
4. ఒప్పించేలా బోధించడానికి మనం చివరగా ఏమిచేయాలి?