సంతోష హృదయంతో జ్ఞాపకార్థ ఆచరణకు సిద్ధపడండి
1. జ్ఞాపకార్థ ఆచరణ కాలాన్ని ఎలా ప్రత్యేకమైనదిగా చేసుకోవచ్చు?
1 మార్చి 26, మంగళవారం రోజు జరిగే జ్ఞాపకార్థ ఆచరణ, మనల్ని రక్షించడానికి యెహోవా చేసిన ఏర్పాటునుబట్టి సంతోషించేందుకు మంచి అవకాశాన్నిస్తుంది. (యెష. 61:10) అయితే, ఆచరణ జరిగే ముందు రోజుల్లో కూడా మనం అంతే సంతోషంగా ఉంటే దానికోసం చక్కగా సిద్ధపడగలుగుతాం. అదెలా?
2. జ్ఞాపకార్థ ఆచరణకు మనమెలా సిద్ధపడతాం?
2 ఆచరణకు ఎలా సిద్ధపడాలి? జ్ఞాపకార్థ ఆచరణ చాలా ప్రాముఖ్యమైనది. అయినా, దాన్ని మనం ఆర్భాటంగా చేసుకోం. అయితే, ముందుగా ప్రణాళిక వేసుకుంటే, ముఖ్యమైన పనులు మర్చిపోకుండా ఉంటాం. (సామె. 21:5) ఆచరణ జరిగే సమయాన్ని, అనువైన స్థలాన్ని ముందే చూసి పెట్టుకోవాలి. సరైన జ్ఞాపకార్థ చిహ్నాలను ఏర్పాటు చేసుకోవాలి. ఆచరణ జరిగే స్థలాన్ని శుభ్రం చేసి, సిద్ధంగా ఉంచాలి. ప్రసంగం ఇచ్చే సహోదరుడు జాగ్రత్తగా సిద్ధపడాలి. చిహ్నాలను అందించేవాళ్లకు, అటెండెంట్లకు స్పష్టమైన నిర్దేశాలు ఇవ్వాలి. వాటిలో చాలా పనులను మీరు ఇప్పటికే చేసి ఉంటారు. విమోచన క్రయధనంవల్ల కలిగే రక్షణ పట్ల కృతజ్ఞతతో ఈ పవిత్ర ఆచరణకు చక్కగా సిద్ధపడతాం.—1 పేతు. 1:8, 9.
3. ప్రభువు రాత్రి భోజనం కోసం మన హృదయాన్ని ఎలా సిద్ధం చేసుకోవచ్చు?
3 హృదయాన్ని సిద్ధం చేసుకోండి: జ్ఞాపకార్థ ఆచరణ ప్రాముఖ్యతను పూర్తిగా అర్థంచేసుకునేలా, మన హృదయాన్ని సిద్ధం చేసుకోవడం కూడా చాలా అవసరం. (ఎజ్రా 7:10) అంటే, జ్ఞాపకార్థ ఆచరణ కోసం ఇచ్చిన బైబిలు భాగాన్ని చదవడానికి, యేసు భూజీవితంలోని చివరి రోజుల గురించి ధ్యానించడానికి మనం కొంత సమయం వెచ్చించాలి. యేసు చూపించిన స్వయంత్యాగ స్ఫూర్తిని ధ్యానించడం, ఆయన అడుగుజాడల్లో నడిచేలా మనల్ని పురికొల్పుతుంది.—గల. 2:20.
4. విమోచన క్రయధనం వల్ల వచ్చే ప్రయోజనాల్లో ఏది మీకు ఎక్కువ సంతోషాన్నిస్తుంది?
4 క్రీస్తు మరణం, యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థిస్తుంది. మనల్ని పాపమరణాల నుండి విడిపిస్తుంది. (1 యోహా. 2:2) అలాగే, దేవునితో సమాధానపడడానికి, నిత్యజీవం పొందడానికి మార్గం సుగమం చేస్తుంది. (కొలొ. 1:21, 22) సమర్పణకు తగినట్లు జీవించాలనే మన నిశ్చయాన్ని బలపర్చుకోవడానికీ, క్రీస్తు శిష్యులుగా స్థిరంగా కొనసాగడానికీ అది మనకు సహాయం చేస్తుంది. (మత్త. 16:24) రాబోయే జ్ఞాపకార్థ ఆచరణకు సిద్ధపడుతున్నప్పుడు, హాజరౌతున్నప్పుడు మీ సంతోషం అధికమవ్వాలని ఆశిస్తున్నాం!