‘దీన్ని చేయండి’
ఏప్రిల్ 5న యేసు మరణ జ్ఞాపకార్థాన్ని ఆచరిస్తాం
1. జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
1 ‘నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి.’ (లూకా 22:19) ఆ మాటలతో యేసు, తన త్యాగపూరితమైన మరణాన్ని జ్ఞాపకం చేసుకోమని తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. విమోచన క్రయధనం వల్ల కలిగిన ప్రయోజనాలన్నిటిని బట్టి చూస్తే, క్రైస్తవులకు వార్షిక జ్ఞాపకార్థ ఆచరణకన్నా ముఖ్యమైన రోజు మరొకటి లేదు. ఈ సంవత్సరం అది జరిగే తేదీ, అంటే ఏప్రిల్ 5 దగ్గరపడుతోంది కాబట్టి యెహోవా పట్ల మనకున్న కృతజ్ఞతను ఎలా చూపించవచ్చు?—కొలొ. 3:15.
2. జ్ఞాపకార్థ ఆచరణ పట్ల మన కృతజ్ఞతను చూపించడానికి వేటిని అధ్యయనం చేసి, ధ్యానించాలి?
2 సిద్ధపడండి: సాధారణంగా, ముఖ్యమైన విషయాలకు మనం ముందుగా సిద్ధపడతాం. యేసు భూమ్మీద జీవించిన చివరి రోజుల్లో జరిగిన సంఘటనల గురించి కుటుంబమంతా కలిసి అధ్యయనం చేసి, ధ్యానిస్తే జ్ఞాపకార్థ ఆచరణకు మన హృదయాలను సిద్ధం చేసుకోవచ్చు. వాటి గురించిన కొన్ని లేఖనాల లిస్టు క్యాలెండరులో, ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం అనే చిన్న పుస్తకంలో ఉంది. అయితే, మరిన్ని లేఖనాలు, వాటితోపాటు మహాగొప్ప మనిషి పుస్తకంలో వాటికి సంబంధించిన అధ్యాయాలు ఉన్న లిస్టు కావలికోట జనవరి - మార్చి, 2012 సంచికలోని 21-22 పేజీల్లో ఉంది.
3. జ్ఞాపకార్థ ఆచరణ పట్ల కృతజ్ఞత చూపించడానికి పరిచర్యలో మన వంతును ఎలా ఎక్కువ చేసుకోవచ్చు?
3 ప్రకటించండి: ప్రకటనా పనిలో వీలైనంత ఎక్కువ సమయం గడుపుతూ కూడా మన కృతజ్ఞతను చూపించవచ్చు. (లూకా 6:45) జ్ఞాపకార్థ ఆచరణకు ఇతరులను ఆహ్వానించే ప్రపంచవ్యాప్త ప్రచార కార్యక్రమం మార్చి 17, శనివారం రోజున మొదలౌతుంది. మీరు ఎక్కువగా పరిచర్య చేయగలిగేలా, వీలైతే సహాయ పయినీరు సేవ చేయగలిగేలా సర్దుబాట్లు చేసుకోగలరా? దాని గురించి తర్వాతి కుటుంబ ఆరాధనలో మీ కుటుంబంతో చర్చించండి.
4. జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవడం వల్ల మనమెలా ప్రయోజనం పొందుతాం?
4 ప్రతీ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవడం వల్ల మనమెంతో ప్రయోజనం పొందుతున్నాం. తన ఏకైక కుమారుణ్ణి విమోచన క్రయధనంగా ఇచ్చి యెహోవా ఎంతో ఉదారత చూపించాడు. దాని గురించి లోతుగా ఆలోచించడం వల్ల మన సంతోషం, ఆయన పట్ల మన ప్రేమ రెట్టింపవుతాయి. (యోహా. 3:16; 1 యోహా. 4:9, 10) అది, మన కోసం కాకుండా క్రీస్తు కోసం జీవించేలా మనల్ని పురికొల్పుతుంది. (2 కొరిం. 5:14, 15) అంతేకాదు, యెహోవాను బహిరంగంగా స్తుతించాలనే మన కోరికను పెంచుతుంది. (కీర్త. 102:19-21) ఏప్రిల్ 5న జ్ఞాపకార్థ ఆచరణ జరిగేటప్పుడు ‘ప్రభువు మరణాన్ని ప్రచురించే’ అవకాశం మనకు దొరుకుతుంది. మెప్పుదలతో నిండిన యెహోవా సేవకులు దాని కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తారు.—1 కొరిం. 11:26.