2015 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల చక్కగా బోధించేందుకు సహాయం చేస్తుంది
1 “యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక” అని కీర్తనకర్త దావీదు రాశాడు. (కీర్త. 19:14) యెహోవాకు ఇష్టమైన మాటలు మాట్లాడాలని మనం కూడా కోరుకుంటాం. ఎందుకంటే సంఘంలో, పరిచర్యలో దేవుని గురించి మాట్లాడే అవకాశాన్ని విలువైనదిగా చూస్తాం. యెహోవా మనల్ని తీర్చిదిద్దే ఒక మార్గం దైవపరిపాలనా పరిచర్య పాఠశాల. ప్రపంచమంతటా 1,11,000కు పైగా ఉన్న సంఘాల్లో ఈ పాఠశాల జరుగుతుంది. ఒప్పించేలా, నొప్పించకుండా ధైర్యంగా సువార్తను ప్రకటించడానికి అన్ని దేశాల నుండి అన్ని పరిస్థితుల నుండి వచ్చిన సహోదరసహోదరీలకు ఇది సహాయం చేసింది.—అపొ. 19:8; కొలొ. 4:6.
2 2015 పాఠశాలలో చర్చనీయ బైబిలు అంశాలు, దేవుని వాక్యంలో ఏముందో తెలుసుకోండిలో అంశాలను పరిశీలిస్తాం. బైబిలు ముఖ్యాంశాలు, 1వ విద్యార్థి ప్రసంగం కోసం కేటాయించిన సమయాల్లో మార్పులు చేశారు. ఆ మార్పులను, ప్రసంగాలను ఇచ్చే విషయంలో సలహాలను తర్వాతి పేరాల్లో చూస్తాం.
3 బైబిలు ముఖ్యాంశాలు: ఇది చేసే సహోదరులు ఆ వారం బైబిలు పఠనం నుండి ఒక ఆసక్తికరమైన, ఉపయోగపడే లేఖన విషయంపై రెండు నిమిషాలు ప్రసంగిస్తారు. చక్కగా సిద్ధపడితే సంఘానికి ఉపయోగపడే మంచి విషయాన్ని ఇచ్చిన సమయంలో చెబుతాం. ఆ తర్వాత ఎప్పటిలాగే ఆరు నిమిషాలు సంఘంలో వాళ్లు ఆ వారం బైబిలు పఠనం నుండి నేర్చుకున్న ఆసక్తికరమైన అంశాలను 30 సెకన్లు లేదా తక్కువ సమయంలో చెబుతారు. 30 సెకన్లలోపే ఒక మంచి అంశాన్ని చెప్పడానికి క్రమశిక్షణతో చక్కగా సిద్ధపడాలి. అప్పుడు మనం ఇంకా బాగా బోధించగలం. అంతేకాదు నేర్చుకున్న, పరిశోధించిన విషయాల గురించి చెప్పడానికి వేరేవాళ్లకు కూడా సమయం ఉంటుంది.
4 1వ విద్యార్థి ప్రసంగం: బైబిలు చదవాల్సిన ఈ ప్రసంగాన్ని మూడు లేదా అంతకన్నా తక్కువ నిమిషాలకు తగ్గించారు, చదవాల్సిన భాగం కూడా తక్కువే ఉంటుంది. అందులో సమాచారం అందరికీ అర్థమయ్యేలా తప్పులు లేకుండా, అనర్గళంగా చదవడం కోసం ముందే చాలాసార్లు గట్టిగా బయటకు చదువుకోవాలి. మన ఆరాధనలో చదవడం ఎంతో ముఖ్యమైనది కాబట్టి యెహోవా ప్రజలందరం చక్కగా చదవడానికి ప్రయత్నించాలి. మనలో చాలామంది పిల్లలు చక్కగా చదువుతుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది, పిల్లలు అలా చక్కగా చదివేందుకు ప్రేమగా సహాయం చేస్తున్న తల్లిదండ్రులందర్నీ మెచ్చుకోవాల్సిందే.
5 2వ విద్యార్థి ప్రసంగం: సహోదరి చేస్తారు. కేటాయించిన సమయం ఐదు నిమిషాలు. ప్రసంగ అంశం గురించే చర్చించాలి. దేవుని వాక్యంలో ఏముందో తెలుసుకోండి, చర్చనీయ బైబిలు అంశాలు నుండి ఇస్తే, పరిచర్యలో మన ప్రాంతానికి సరిపోయేలా, ఉపయోగపడేలా చెప్పాలి. బైబిల్లోని ఒక వ్యక్తి గురించి ఇస్తే, ఇచ్చిన వచనాలను చదివి, ఏ వచనాలు చదవాలో ఎంచుకోవాలి, ఆ వ్యక్తి నుండి ఏమి నేర్చుకోవచ్చో చెప్పాలి. ఇచ్చిన అంశానికి సరిపోయే ఇతర వచనాల్ని కూడా ఉపయోగించవచ్చు. పాఠశాల పర్యవేక్షకుడు ఒక సహాయకురాలిని నియమిస్తాడు.
6 3వ విద్యార్థి ప్రసంగం: సహోదరుడుగానీ సహోదరిగానీ చేస్తారు. కేటాయించిన సమయం ఐదు నిమిషాలు. సహోదరి చేసేటప్పుడు 2వ విద్యార్థి ప్రసంగంలానే చేయాలి. బైబిల్లో ఒక వ్యక్తి గురించిన అంశాన్ని సహోదరునికి ఇచ్చినప్పుడు, అతను ప్రేక్షకులను మనసులో ఉంచుకుని ప్రసంగంగా ఇవ్వాలి. ఇచ్చిన అంశాన్ని వివరిస్తూ, తగిన వచనాల్ని ఉపయోగిస్తూ, ఆ వ్యక్తి నుండి ఏమి నేర్చుకోవచ్చో చెప్పాలి.
7 3వ విద్యార్థి ప్రసంగంలో సహోదరుల కోసం ఒక కొత్త మార్పు: దేవుని వాక్యంలో ఏముందో తెలుసుకోండి, చర్చనీయ బైబిలు అంశాలు నుండి ఇస్తే, కుటుంబ ఆరాధన లేదా పరిచర్య చేస్తున్నట్లు ప్రదర్శన చేయాలి. సాధారణంగా పాఠశాల పర్యవేక్షకుడు సహాయకున్ని, సన్నివేశాన్ని ఇస్తాడు. ప్రసంగిస్తున్న సహోదరుని కుటుంబ సభ్యున్ని లేదా సంఘంలో సహోదరున్ని సహాయకులుగా ఇవ్వవచ్చు. అంశానికి సంబంధించిన బైబిలు సూత్రాల్ని వివరించే ఇతర వచనాల్ని కూడా ఉపయోగించవచ్చు. అప్పుడప్పుడు, సంఘ పెద్దలకు కూడా ఈ ప్రసంగం ఇవ్వవచ్చు. సహాయకున్ని, సన్నివేశాన్ని ఆ సంఘపెద్ద చూసుకోవచ్చు. కుటుంబ సభ్యునితో, సహోదరునితో మాట్లాడుతూ పెద్దలు చక్కగా బోధించడం చూసి సంఘమంతా ఎంతో నేర్చుకుంటుంది, ప్రోత్సాహం పొందుతుంది.
సలహాల్ని తీసుకుని పాటిస్తూ ప్రగతి సాధించండి
8 సలహా: ప్రతీ ప్రసంగం అయిపోయాక మెచ్చుకోవడానికి, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి పుస్తకం నుండి సలహాలు ఇవ్వడానికి పాఠశాల పర్యవేక్షకుడు రెండు నిమిషాలు ఉపయోగిస్తాడు. విద్యార్థి ఏ ప్రసంగ లక్షణం మీద పని చేస్తున్నాడో ప్రసంగానికి ముందు చెప్పడు. ప్రతీ ప్రసంగం అయిపోయాక విద్యార్థిని నిజాయితీగా మెచ్చుకుంటాడు, ఏ ప్రసంగ లక్షణం మీద పని చేస్తున్నాడో చెప్తాడు, విద్యార్థి ఆ లక్షణం మీద ఎంత బాగా పనిచేశాడో చెప్తాడు లేదా ఆ లక్షణాన్ని ఇంకా మెరుగుపర్చుకోవడం ఎందుకు అవసరమో దయగా చెప్తాడు.
9 పరిచర్య పాఠశాల పుస్తకం 79-81 పేజీల్లో సలహా పత్రం ఉంది. మీటింగ్స్ అయిపోయిన తర్వాత పాఠశాల పర్యవేక్షకుడు ఇచ్చిన సలహాలో అభ్యాసం చేశాడో విద్యార్థిని ఒంటరిగా అడుగుతాడు, అతని పుస్తకంలో సలహా పత్రం పేజీల్లో అవసరమైన వివరాలు నింపుతాడు. మీటింగ్ తర్వాత లేదా వేరే సమయంలో విద్యార్థిని మెచ్చుకుని, ఏమైనా సలహాలు అవసరమైతే ఇవ్వవచ్చు. పాఠశాలలో మనకు ఇచ్చే ప్రతీ సలహా ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయం చేస్తుందని గుర్తుంచుకోవాలి.—1 తిమో. 4:15.
10 ఒకవేళ విద్యార్థి ఇచ్చిన సమయం కన్నా ఎక్కువ తీసుకుంటుంటే, పాఠశాల పర్యవేక్షకుడు లేదా అతని సహాయకుడు బెల్ కొట్టిగానీ, చిన్న శబ్దం చేసిగానీ సమయం అయిపోయిందని విద్యార్థికి నేర్పుగా తెలియజేయాలి. విద్యార్థి చెబుతున్న మాటను వెంటనే ముగించి వచ్చేయాలి.—పరిచర్య పాఠశాల పుస్తకం, 282వ పేజీ, 4వ పేరా.
11 అర్హత ఉన్న ప్రతీ ఒక్కరు పాఠశాలలో చేరాలని ప్రోత్సహిస్తున్నాం. (పరిచర్య పాఠశాల పుస్తకం, 282వ పేజీ, 6వ పేరా.) రాజ్యసువార్తను ధైర్యంగా, మర్యాదగా, ప్రేమగా చెప్పడానికి, నేర్పించడానికి ఈ పాఠశాల యెహోవా ప్రజలకు సహాయం చేసింది. ఈ పాఠశాల నుండి నేర్చుకుంటూ యెహోవాను స్తుతించే ప్రతీ ఒక్కర్ని చూసి యెహోవా ఎంతో ఆనందిస్తున్నాడు.—కీర్త. 148:12, 13; యెష. 50:4.