కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 మే పేజీలు 8-13
  • యెహోవా మిమ్మల్ని ఖచ్చితంగా ఓదారుస్తాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా మిమ్మల్ని ఖచ్చితంగా ఓదారుస్తాడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా కరుణతో మనల్ని క్షమిస్తాడు
  • యెహోవా మనలో ఆశను నింపుతాడు
  • యెహోవా మన భయాల్ని తీసేస్తాడు
  • యెహోవా “విరిగిన హృదయంగల వాళ్లను” బాగుచేస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • మనకు తెలియనివి తెలీదని ఒప్పుకోవాలంటే వినయం కావాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • మనం అస్సలు ఒంటరివాళ్లం కాదు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
    2025-2026 ప్రాంతీయ సమావేశ కార్యక్రమం, ప్రాంతీయ పర్యవేక్షకునితో
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 మే పేజీలు 8-13

అధ్యయన ఆర్టికల్‌ 20

పాట 7 యెహోవా, మన బలం

యెహోవా మిమ్మల్ని ఖచ్చితంగా ఓదారుస్తాడు

“దేవుడు స్తుతించబడాలి. ఆయన ఎంతో కరుణగల తండ్రి, ఎలాంటి పరిస్థితిలోనైనా ఓదార్పును ఇచ్చే దేవుడు.”—2 కొరిం. 1:3.

ముఖ్యాంశం

బబులోనుకు బందీలుగా వెళ్లిన యూదుల్ని యెహోవా ఎలా ఓదార్చాడో, దాన్నుండి మనమేం నేర్చుకోవచ్చో చూస్తాం.

1. బబులోనుకు బందీలుగా వెళ్లిన యూదుల పరిస్థితిని వివరించండి.

బబులోనుకు బందీలుగా వెళ్లిన యూదులకు ఎలా అనిపించిందో ఒకసారి ఊహించుకోండి. వాళ్ల కళ్లముందే వాళ్ల దేశం నేలమట్టమైంది. వాళ్ల పూర్వీకులు చేసిన పాపాలవల్ల వాళ్లను వేరేదేశానికి బందీలుగా తీసుకెళ్లారు. (2 దిన. 36:15, 16, 20, 21) నిజమే బబులోనులో బందీలుగా ఉన్నప్పటికీ, రోజూవారీ పనులు చేసుకోవడానికి వాళ్లకు కాస్త స్వేచ్ఛ ఉంది. (యిర్మీ. 29:4-7) కానీ వాళ్ల జీవితమేమీ పూలబాటలా లేదు, వాళ్లు కోరుకున్న జీవితం అదికాదు. మరి వాళ్లకు ఎలా అనిపించింది? అక్కడున్న వాళ్లలో ఒకరు ఇలా చెప్పారు: “మనం బబులోను నదుల పక్కన కూర్చుని ఉన్నప్పుడు, సీయోనును గుర్తుచేసుకుంటూ ఏడ్చాం.” (కీర్త. 137:1) నిరాశలో మునిగిపోయిన ఆ యూదులకు ఓదార్పు అవసరమైంది. మరి అది వాళ్లకు ఎక్కడ దొరుకుతుంది?

2-3. (ఎ) బందీలుగా వెళ్లిన యూదుల కోసం యెహోవా ఏం చేశాడు? (బి) ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

2 యెహోవా “ఓదార్పును ఇచ్చే దేవుడు.” (2 కొరిం. 1:3) ఆయనకు తన ప్రజలంటే చాలా ఇష్టం, వాళ్లను ఓదార్చాలని ఆయన కోరుకుంటున్నాడు. బందీలుగా వెళ్లిన కొంతమంది యూదులు తను ఇచ్చే క్రమశిక్షణను తీసుకుంటారని, మళ్లీ తన దగ్గరికి తిరిగొస్తారని యెహోవాకు తెలుసు. (యెష. 59:20) అందుకే వాళ్లు బందీలుగా వెళ్లడానికన్నా దాదాపు 100 సంవత్సరాల ముందే, యెహోవా యెషయా ప్రవక్తను ప్రేరేపించి ఒక పుస్తకాన్ని రాయించాడు. ఆ పుస్తకం ఉద్దేశం ఏంటి? యెషయా ఇలా రాశాడు: “‘ఓదార్చండి, నా ప్రజల్ని ఓదార్చండి’ అని మీ దేవుడు అంటున్నాడు.” (యెష. 40:1) అలా, యెషయా పుస్తకం ద్వారా బందీలుగా వెళ్లిన యూదులకు అవసరమైన ఓదార్పును యెహోవా ఇచ్చాడు.

3 బందీలుగా వెళ్లిన యూదుల్లాగే మనకు కూడా అప్పుడప్పుడు ఓదార్పు అవసరం. యెహోవా వాళ్లను ఓదార్చిన మూడు విధానాల గురించి ఈ ఆర్టికల్‌లో చూస్తాం. అవేంటంటే: (1) పశ్చాత్తాపపడిన వాళ్లను క్షమిస్తానని మాటివ్వడం, (2) తన ప్రజల్లో ఆశను నింపడం, (3) వాళ్ల భయాల్ని తీసేయడం. అలాగే, ఈరోజుల్లో కూడా యెహోవా మనల్ని ఎలా ఓదారుస్తున్నాడో తెలుసుకుంటాం.

యెహోవా కరుణతో మనల్ని క్షమిస్తాడు

4. యెహోవా కరుణగల దేవుడని ఎలా చూపించాడు? (యెషయా 55:7)

4 యెహోవా “ఎంతో కరుణగల తండ్రి.” (2 కొరిం. 1:3) బందీలుగా ఉన్న యూదులు పశ్చాత్తాపం చూపించినప్పుడు, వాళ్లను క్షమిస్తానని మాటివ్వడం ద్వారా ఆయన కరుణ చూపించాడు. (యెషయా 55:7 చదవండి.) ఆయనిలా అన్నాడు: “శాశ్వతమైన విశ్వసనీయ ప్రేమతో నీ మీద కరుణ చూపిస్తాను.” (యెష. 54:8) మరి యెహోవా వాళ్లమీద కరుణ ఎలా చూపించాడు? అవిధేయత వల్ల ఆ యూదులు బందీలుగా ఉండాల్సి వచ్చింది. అయినా వాళ్లు ఎప్పటికీ అక్కడే ఉండిపోరని యెహోవా మాటిచ్చాడు. (యెష. 40:2) ఆ మాటలు విన్నప్పుడు, పశ్చాత్తాపం చూపించి యెహోవాను సంతోషపెట్టాలి అనుకున్న యూదుల మనసుకు ఎంత హాయిగా అనిపించి ఉంటుందో కదా!

5. యెహోవా మనల్ని ఖచ్చితంగా క్షమిస్తాడని యూదులకన్నా మనం ఎందుకు ఎక్కువగా నమ్మవచ్చు?

5 మనమేం నేర్చుకుంటాం? తన సేవకుల్ని పెద్ద మనసుతో క్షమించడానికి యెహోవా సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయాన్ని నమ్మడానికి అప్పుడున్న యూదులకన్నా మన దగ్గరే చాలా పెద్ద కారణం ఉంది. ఏంటా కారణం? యెహోవా మన పాపాల్ని క్షమించడానికి ఏం చేశాడో మనకు తెలుసు. యెషయా ప్రవచించిన వందల సంవత్సరాల తర్వాత, యెహోవా తన ప్రియ కుమారుణ్ణి ఈ భూమ్మీదికి పంపించి పశ్చాత్తాపం చూపించే పాపులందరి కోసం విమోచన క్రయధనాన్ని అర్పించాడు. ఆ త్యాగం ఆధారంగానే ఆయన మన పాపాలన్నిటినీ పూర్తిగా ‘తుడిచేస్తున్నాడు.’ (అపొ. 3:19, అధస్సూచి; యెష. 1:18; ఎఫె. 1:7) కరుణ చూపించే విషయంలో మన దేవునికి ఎవ్వరూ సాటిరారు!

6. యెహోవా కరుణ గురించి ఆలోచించినప్పుడు మనకు ఎందుకు ఓదార్పుగా అనిపిస్తుంది? (చిత్రం కూడా చూడండి.)

6 ఒకప్పుడు మనం చేసిన తప్పుల విషయంలో పశ్చాత్తాపపడిన తర్వాత కూడా, ఇంకా ఆ బాధ మనల్ని వెంటాడుతుంటే యెషయా 55:7 లో ఉన్న యెహోవా మాటలు మనకు ఓదార్పును ఇస్తాయి. చేసిన తప్పు వల్ల, మనం చేదు ఫలితాలు అనుభవిస్తూ ఉంటే ఆ బాధ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే తప్పుల్ని ఒప్పుకుని, ఆ తప్పుచేయడం ఆపేసివుంటే, యెహోవా మనల్ని క్షమించాడని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. యెహోవా మనల్ని ఒక్కసారి క్షమించాడంటే, మన పాపాన్ని ఇక ఆయన ఎన్నడూ గుర్తుచేసుకోడు. (యిర్మీయా 31:34 పోల్చండి.) మనం ఎప్పుడో చేసిన పాపాల గురించి యెహోవాయే ఆలోచించనప్పుడు, మనం ఎందుకు ఆలోచించాలి. ఒకప్పుడు మనం చేసిన తప్పులు కాదుగానీ, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నదే యెహోవాకు ముఖ్యం. (యెహె. 33:14-16) అంతేకాదు చేసిన తప్పుల వల్ల మనం అనుభవిస్తున్న వాటన్నిటి నుండి, కరుణగల మన తండ్రి త్వరలోనే మనల్ని పూర్తిగా విడుదల చేస్తాడు.

ఒక బ్రదర్‌ ధైర్యంగా ముందుకెళ్తున్నాడు. చిత్రాలు: ఒక వైపు చిత్రాల్లో ఆయన ఏం చేసేవాడో చూపిస్తున్నారు, మరో వైపు ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూపించారు. ఆయన గతంలో చేసిన తప్పులు: 1. హింసతో కూడిన ఒక వీడియో గేమ్‌ ఆడాడు. 2. మద్యాన్ని అతిగా తాగాడు, సిగరెట్‌ కాల్చాడు. 3. కంప్యూటర్‌లో చూడకూడనివి చూశాడు. ఆయన ఇప్పుడు చేస్తున్నవి: 1. రాజ్యమందిరాన్ని శుభ్రం చేస్తున్నాడు. 2. వయసు పైబడిన ఒక సిస్టర్‌తో మాట్లాడుతున్నాడు. 3. ప్రీచింగ్‌ చేస్తున్నాడు.

ఒకప్పుడు మనం చేసిన తప్పులు కాదుగానీ, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నదే యెహోవాకు ముఖ్యం (6వ పేరా చూడండి)


7. ఘోరమైన పాపం చేసి దాన్ని దాచిపెట్టి ఉంటే, పెద్దలతో మాట్లాడేలా మనల్ని ఏది కదిలిస్తుంది?

7 ఘోరమైన పాపాన్ని దాచిపెట్టడం వల్ల మన మనస్సాక్షి మనల్ని వేదిస్తుంటే అప్పుడేం చేయాలి? పెద్దల సహాయం తీసుకోమని బైబిలు చెప్తుంది. (యాకో. 5:14, 15) అయితే చేసిన తప్పును ఒప్పుకోవడం అంత తేలికేమీ కాదు. కానీ మనం పశ్చాత్తాపం చూపిస్తే, యెహోవా అలాగే ఆయన నియమించిన పురుషులు మనకు ప్రేమతో, కరుణతో సహాయం చేయడానికే ఉన్నారని గుర్తిస్తే ఆ నమ్మకమైన పెద్దలతో వెళ్లి మాట్లాడేలా కదిలించబడతాం. చేసిన తప్పుకు కుమిలిపోతున్నప్పుడు యెహోవా చూపించిన కరుణ వల్ల ఆర్థర్‌ a అనే బ్రదర్‌ ఎలా ఓదార్పు పొందాడో గమనించండి. ఆర్థర్‌ ఇలా అంటున్నాడు: “దాదాపు సంవత్సరం పాటు నేను అశ్లీల చిత్రాలు చూశాను. అయితే మనస్సాక్షి గురించి ఒక ప్రసంగం విన్న తర్వాత నేను చేసిన తప్పు గురించి నా భార్యకు, పెద్దలకు చెప్పాను. ఆ తర్వాత నాకు ప్రశాంతంగా అనిపించింది. కానీ తప్పు చేశాననే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. అప్పుడు యెహోవా నాతో ఇంకా స్నేహం చేయాలనుకుంటున్నాడని పెద్దలు గుర్తుచేశారు. యెహోవా మనల్ని సరిదిద్దుతున్నాడంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని దానర్థం. వాళ్ల దయగల మాటలు నా హృదయాన్ని తాకాయి. సరిగ్గా ఆలోచించడానికి నాకు సహాయం చేశాయి.” ఇప్పుడు ఆర్థర్‌ క్రమ పయినీరుగా, సంఘ పరిచారకుడిగా సేవచేస్తున్నాడు. మనం పశ్చాత్తాపపడితే చాలు, యెహోవా కరుణ చూపించడానికి రెడీగా ఉన్నాడని తెలుసుకోవడం మన మనసులో ఉన్న బరువును దించేస్తుంది కదా!

యెహోవా మనలో ఆశను నింపుతాడు

8. (ఎ) బందీలుగా ఉన్న యూదుల్లో యెహోవా ఎలాంటి ఆశను నింపాడు? (బి) యెషయా 40:29-31 ప్రకారం, ఆ ఆశ వల్ల పశ్చాత్తాపపడిన యూదులకు ఎలా అనిపించి ఉంటుంది?

8 తమ దేశానికి తిరిగెళ్లడం అసాధ్యమని యూదులకు అనిపించివుంటుంది. ఎందుకంటే ప్రపంచాధిపత్యమైన బబులోను తమ బందీలను విడుదల చేసినట్టు చరిత్రలోనే లేదు. (యెష. 14:17) కానీ యెహోవా తన ప్రజల్లో ఆశను నింపాడు. తన ప్రజల్ని విడిపించి వాళ్ల దేశానికి తీసుకెళ్తానని ఆయన మాటిచ్చాడు, ఆ మాట నెరవేరకుండా ఆయన్ని ఎవ్వరూ ఆపలేరు. (యెష. 44:26; 55:12) యెహోవా దృష్టిలో బబులోను, ఉఫ్‌ అంటే ఎగిరిపోయే దుమ్ము లాంటిది. (యెష. 40:15) యెహోవా ఇచ్చిన మాటవల్ల ఆ యూదులకు ఎలా అనిపించి ఉంటుంది? వాళ్లకు ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించి ఉంటుంది. అంతేకాదు యెషయా ఇలా రాశాడు: “యెహోవా మీద ఆశపెట్టుకున్న వాళ్లు కొత్త బలం పొందుతారు.” (యెషయా 40:29-31 చదవండి.) కాబట్టి యెహోవా ఇచ్చిన ఆశతో “గద్దలా రెక్కలు చాపి వాళ్లు పైకి ఎగురుతారు.”

9. తను ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనడానికి యెహోవా యూదులకు ఏ రుజువుల్ని ఇచ్చాడు?

9 తను ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేరుస్తాడు అనడానికి యెహోవా ఆ యూదులకు రుజువుల్ని కూడా ఇచ్చాడు. ఏంటవి? అప్పటికే నెరవేరిన ప్రవచనాలు. యెహోవా ముందే చెప్పినట్టు, ఇశ్రాయేలు పదిగోత్రాల రాజ్యాన్ని అష్షూరీయులు జయించారని, ఆ ప్రజల్ని బందీలుగా తీసుకెళ్లారని యూదులకు తెలుసు. (యెష. 8:4) బబులోనీయులు యెరూషలేమును నాశనం చేసి, అక్కడ ఉంటున్న వాళ్లను బందీలుగా తీసుకెళ్లడం వాళ్లు కళ్లారా చూశారు. (యెష. 39:5-7) సిద్కియా రాజుని గుడ్డివాడిగా చేసి, బబులోనుకు బందీగా తీసుకెళ్లారనే సంగతి కూడా వాళ్లకు తెలుసు. (యిర్మీ. 39:7; యెహె. 12:12, 13) యెహోవా చెప్పిన ప్రతీది పొల్లుపోకుండా నిజమైంది. (యెష. 42:9; 46:10) దీనంతటిని బట్టి యెహోవా వాళ్లను విడిపిస్తాడని ఇచ్చిన మాట కూడా, ఖచ్చితంగా నిజమౌతుందనే వాళ్ల నమ్మకం గట్టిగా బలపడి ఉంటుంది.

10. ఈ చివరి రోజుల్లో భవిష్యత్తు మీదున్న ఆశ బలపడుతూ ఉండడానికి మనకేం సహాయం చేస్తుంది?

10 మనమేం నేర్చుకుంటాం? మనం డీలాపడిపోయినప్పుడు భవిష్యత్తు మీద ఆశ మనల్ని ఓదారుస్తుంది, మనకు కొత్త బలాన్నిస్తుంది. మనం చాలా కష్టమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాం, పెద్దపెద్ద శత్రువులతో పోరాడుతున్నాం. కానీ మనకు ఏ దారీ లేదని కాదు. యెహోవా మనకు నిజమైన శాంతిభద్రతలతో శాశ్వతకాలం జీవిస్తామనే అద్భుతమైన ఆశను ఇచ్చాడు. ఆ ఆశను మన మనసులో బలపర్చుకుంటూ ఉండాలి. లేకపోతే ఏం జరగవచ్చు? ఈ ఉదాహరణ గురించి ఆలోచించండి. మీ కిటికీ బయట అందమైన చెట్లు, పువ్వులు, కొండలు ఉన్నాయి. కానీ మురికి పట్టిన కిటికీ నుండి చూస్తే అవేవీ స్పష్టంగా కనిపించవు. అయితే మనం ఆ కిటికీని శుభ్రం చేస్తే సరిగ్గా చూడగలుగుతాం. అదేవిధంగా మన ఆశను బలంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? కొత్తలోకంలో జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో మనం ఎప్పటికప్పుడు ఊహించుకుంటూ ఉండాలి. దానికోసం భవిష్యత్తులో ఉన్న ఆశకు సంబంధించి ఆర్టికల్‌ చదవచ్చు, వీడియోలు చూడవచ్చు, పాటలు వినవచ్చు. అంతేకాదు యెహోవా మాటిచ్చిన వాటిలో మనం దేనికోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నామో ఆయనకు ప్రార్థనలో చెప్పవచ్చు.

11. పెద్దపెద్ద అనారోగ్య సమస్యలున్న ఒక సిస్టర్‌కి ఏది కొత్త బలాన్ని ఇచ్చింది?

11 జోయ్‌ అనే సిస్టర్‌కి పెద్దపెద్ద అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అయితే భవిష్యత్తు మీద ఆశ తనకు ఎలా ఓదార్పును ఇచ్చిందో, తనలో కొత్త బలాన్ని ఎలా నింపిందో గమనించండి. ఆమె ఇలా చెప్తుంది: “కష్టాల వల్ల నేను ఉక్కిరిబిక్కిరి అయినప్పుడు యెహోవా నన్ను అర్థం చేసుకుంటాడు కాబట్టి, నా మనసులో ఉన్నదంతా ఆయనకు చెప్పేస్తాను. అలా చెప్పిన తర్వాత యెహోవా నాకు ‘అసాధారణ శక్తిని’ ఇచ్చాడు.” (2 కొరిం. 4:7) అంతేకాదు కొత్త లోకంలో, “నాకు ఒంట్లో బాలేదు” అని ఎవ్వరూ అనని పరిస్థితుల్లో ఉన్నట్టు జోయ్‌ ఊహించుకుంటుంది. (యెష. 33:24) మనం కూడా మన మనసును యెహోవా ముందు కుమ్మరించి భవిష్యత్తు మీద మనకున్న ఆశపై మనసుపెడితే కొత్త బలాన్ని పొందవచ్చు.

12. భవిష్యత్తు విషయంలో యెహోవా మాటిచ్చినవి నెరవేరతాయి అనడానికి మనకు ఏ రుజువులు ఉన్నాయి? (చిత్రం కూడా చూడండి.)

12 తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు అనడానికి బబులోనులో ఉన్న యూదులకు యెహోవా ఎన్నో రుజువులు ఇచ్చినట్టే, మనకు కూడా ఇస్తున్నాడు. మన కళ్లముందే నెరవేరుతున్న ప్రవచనాల గురించి ఆలోచించండి. ఉదాహరణకు, “ఒక విషయంలో బలంగా మరో విషయంలో బలహీనంగా” ఉన్న ప్రపంచాధిపత్యాన్ని మనం చూస్తున్నాం. (దాని. 2:42, 43) ‘ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో . . . భూకంపాలు వస్తున్నాయి’ అని మనం వింటున్నాం. అలాగే “అన్నిదేశాల ప్రజలకు” మంచివార్త ప్రకటించబడుతోంది. (మత్త. 24:7, 14) ఈ ప్రవచనాలు, అలాగే ఇలాంటి ఎన్నో ప్రవచనాలు మన కళ్లముందే నెరవేరడం చూసి, భవిష్యత్తు విషయంలో యెహోవా మాటిచ్చినవి కూడా ఖచ్చితంగా నెరవేరుతాయనే మన విశ్వాసం బలపడుతుంది.

ఒక సిస్టర్‌ బైబిలు ప్రవచనాలను చదివి, ధ్యానిస్తుంది. చిత్రాలు: 1. ఒక జంట కార్ట్‌ పక్కన నిలబడి ఒకతనితో మాట్లాడుతున్నారు. 2. ప్రకృతి విపత్తు వల్ల నేలమట్టం అయిన తమ ప్రాంతాన్ని తండ్రికొడుకులు చూస్తున్నారు. 3. దానియేలు 2వ అధ్యాయంలో చెప్పినట్టు నెబుకద్నెజరుకు వచ్చిన కలలోని ప్రతిమను ఒక రాయి ఢీకొడుతుంది. 4. పరదైసు భూమ్మీద ప్రజలు జీవితాన్ని ఆనందిస్తున్నారు.

మన కళ్లముందే నెరవేరుతున్న ప్రవచనాలు, భవిష్యత్తు విషయంలో యెహోవా మాటిచ్చినవి ఖచ్చితంగా నెరవేరుతాయనే మన విశ్వాసాన్ని మరింత బలపరుస్తాయి (12వ పేరా చూడండి)


యెహోవా మన భయాల్ని తీసేస్తాడు

13. (ఎ) బబులోను నుండి వచ్చేస్తున్నప్పుడు యూదులకు ఎలాంటి ఆటుపోట్లు ఎదురౌతాయి? (బి) యెషయా 41:10-13 ప్రకారం, ఆ యూదుల్ని యెహోవా ఎలా ఓదార్చాడు?

13 బందీలుగా ఉన్న యూదుల్ని యెహోవా ఓదార్చి వాళ్లలో ఆశను నింపినా, అక్కడనుండి వచ్చేసేటప్పుడు వాళ్లకు కొన్ని ఆటుపోట్లు ఎదురౌతాయని ఆయనకు తెలుసు. బబులోను, దాని చుట్టూవున్న దేశాల్ని ఒక శక్తివంతమైన రాజు దాడిచేసి ఆక్రమించుకుంటాడని ఆయన ముందే చెప్పాడు. (యెష. 41:2-5) ఈ విషయం తెలుసుకుని యూదులు భయపడాల్సిన అవసరం ఉందా? అది జరగడానికి చాలా ఏళ్ల ముందే యెహోవా తన ప్రజల్ని ఓదారుస్తూ ఇలా అన్నాడు: “భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆందోళనపడకు, ఎందుకంటే నేను నీ దేవుణ్ణి.” (యెషయా 41:10-13 చదవండి.) “నేను నీ దేవుణ్ణి” అని అన్నప్పుడు యెహోవా ఉద్దేశం ఏంటి? యూదులు తనను ఆరాధించాలని యెహోవా గుర్తుచేయట్లేదు, ఎందుకంటే అది తెలిసిన విషయమే. బదులుగా ఆయన వాళ్ల పక్కనే ఉన్నాడని, వాళ్లకు ఎప్పుడూ తోడుగా ఉన్నాడని గుర్తుచేస్తున్నాడు.—కీర్త. 118:6.

14. ఆ యూదుల్లో ఉన్న భయాన్ని తీసేయడానికి యెహోవా ఇంకా ఏం చేశాడు?

14 తనకున్న అంతులేని శక్తిని, జ్ఞానాన్ని గుర్తుచేయడం ద్వారా కూడా ఆ యూదుల్లో ఉన్న భయాన్ని యెహోవా తీసేశాడు. తమ కళ్లు పైకెత్తి నక్షత్రాలు నిండిన ఆకాశాన్ని చూడమని ఆయన చెప్పాడు. నక్షత్రాల్ని సృష్టించడమే కాదు, వాటన్నిటి పేర్లు కూడా ఆయనకు తెలుసని చెప్పాడు. (యెష. 40:25-28) ఆయనకు ప్రతీ నక్షత్రం పేరు తెలుసంటే, తన సేవకుల్లో ప్రతీఒక్కరి పేరు తెలుసు అనడంలో సందేహమే లేదు! అంతేకాదు నక్షత్రాల్ని సృష్టించే శక్తి యెహోవాకు ఉందంటే, తన ప్రజల్ని కాపాడే శక్తి కూడా ఆయనకు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి బందీలుగా ఉన్న యూదులకు కంగారుపడాల్సిన, భయపడాల్సిన అవసరమే లేదు.

15. అక్కడి నుండి వచ్చేసేటప్పుడు యెహోవా ఆ యూదులకు ముందే ఎలా సహాయం చేశాడు?

15 తన ప్రజలు అక్కడి నుండి వచ్చేసేటప్పుడు ఏం చేయాలో కూడా యెహోవా ముందే చెప్పాడు. యెషయా పుస్తకంలో యెహోవా తన ప్రజలకు ఇలా చెప్పాడు: “లోపలి గదుల్లోకి ప్రవేశించి తలుపులు వేసుకోండి. దేవుని కోపం దాటివెళ్లే వరకు కాసేపు దాక్కోండి.” (యెష. 26:20) కోరెషు రాజు బబులోను మీద దాడిచేసినప్పుడు ఈ మాటలు ముందుగా నెరవేరి ఉండవచ్చు. ప్రాచీన కాలంలోని ఒక గ్రీకు చరిత్రకారుడు ఏమంటున్నాడంటే, రాజైన కోరెషు బబులోనులోకి వచ్చినప్పుడు “బయట కనిపించిన వాళ్లందర్ని చంపేయమని [తన సైనికులకు] ఆజ్ఞ ఇచ్చాడు.” బబులోనులో ఉంటున్నవాళ్లు భయంతో ఎంతలా వణికిపోయుంటారో ఒక్కసారి ఊహించుకోండి. మరోవైపు యెహోవా ఇచ్చిన నిర్దేశాలు పాటించిన యూదులు ఆ పరిస్థితిని తప్పించుకుని ఉంటారు.

16. మహాశ్రమ సమయంలో మన పరిస్థితి ఏంటా అని మనం ఎందుకు భయపడాల్సిన అవసరంలేదు? (చిత్రం కూడా చూడండి.)

16 మనమేం నేర్చుకుంటాం? ఎప్పుడూ చూడని మహాశ్రమను త్వరలో మనం ఎదుర్కోబోతున్నాం. అది మొదలైనప్పుడు లోకంలో ఉన్న ప్రజలు భయంతో వణికిపోతూ అయోమయంలో ఉంటారు. కానీ యెహోవా ప్రజలు అలా ఉండరు. యెహోవా మన దేవుడని మనకు తెలుసు. కాబట్టి ‘[మన] విడుదల దగ్గరపడిందని’ మనం ధైర్యంగా ఉంటాం. (లూకా 21:28) దేశాల గుంపు మనమీద దాడి చేసినప్పుడు కూడా మనం ధైర్యంగా ఉంటాం. ఆ సమయంలో యెహోవా మనల్ని దేవదూతల ద్వారా కాపాడతాడు అలాగే మన ప్రాణాల్ని కాపాడడానికి నిర్దేశాలు ఇస్తాడు. మరి ఆ నిర్దేశాలు మనకెలా తెలుస్తాయి? ఇప్పుడైతే మనం ఖచ్చితంగా చెప్పలేం. బహుశా సంఘాల ద్వారానే ఇస్తాడేమో. ఒకరకంగా ఆ సంఘాలే మనం సురక్షితంగా ఉండే “లోపలి గదులై” ఉండవచ్చు. భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయే వాటికి ఎలా సిద్ధపడవచ్చు? మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి మనం ఇంకా దగ్గరవ్వాలి, సంస్థ ఇచ్చే నిర్దేశాలకు ఇష్టంగా లోబడాలి అలాగే సంస్థను యెహోవాయే నడిపిస్తున్నాడనే విషయంలో మనకు ఏ సందేహం ఉండకూడదు.—హెబ్రీ. 10:24, 25; 13:17.

మహాశ్రమ సమయంలో బ్రదర్స్‌సిస్టర్స్‌ కలిసి ఒక గదిలో రాత్రిపూట బైబిలు చదువుతున్నారు. ఒక బ్రదర్‌ కిటికీ నుండి ఆకాశం వైపు చూపిస్తుండగా మిగతావాళ్లు చూస్తున్నారు.

యెహోవా శక్తి గురించి, మనల్ని కాపాడే ఆయన సామర్థ్యం గురించి ధ్యానిస్తే మనం మహాశ్రమ సమయంలో అతిగా ఆందోళనపడం (16వ పేరా చూడండి)b


17. యెహోవా మనల్ని ఓదారుస్తాడని గుర్తుంచుకోవడానికి ఏం చేయాలి?

17 బబులోనులో బందీలుగా ఉన్న యూదులు కష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినా వాళ్లకు అవసరమైన ఓదార్పును యెహోవా ఇచ్చాడు. మనకు కూడా ఇస్తాడు. కాబట్టి రేపన్న రోజు ఏం జరిగినా యెహోవా ఖచ్చితంగా మిమ్మల్ని ఓదారుస్తాడని గుర్తుంచుకోండి. తన సేవకుల్ని పెద్దమనసుతో ఆయన క్షమిస్తాడని నమ్మండి. భవిష్యత్తు మీద మీకున్న ఆశను బలంగా ఉంచుకోండి. యెహోవా మీ దేవుడిగా ఉండగా మీరు దేనికి భయపడాల్సిన అవసరంలేదని ఎప్పుడూ మర్చిపోకండి!

ఈ లేఖనాలు మీకెలా ఓదార్పునిస్తాయి?

  • యెషయా 55:7

  • యెషయా 40:29-31

  • యెషయా 41:10-13

పాట 3 మా బలం, మా నిరీక్షణ, మా ధైర్యం

a కొన్ని పేర్లను మార్చాం.

b చిత్రాల వివరణ: బ్రదర్స్‌సిస్టర్స్‌ ఒక చిన్న గుంపుగా కలుసుకున్నారు. భూమ్మీద తన ప్రజలు ఎక్కడున్న యెహోవాకు వాళ్లను కాపాడే శక్తి, సామర్థ్యం ఉన్నాయని వాళ్లు నమ్ముతున్నారు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి