కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w23 నవంబరు పేజీలు 8-13
  • ఒకరి మీద ఒకరు ప్రేమను పెంచుకుంటూ ఉండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఒకరి మీద ఒకరు ప్రేమను పెంచుకుంటూ ఉండండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనం ఒకరిమీద ఒకరం ఎందుకు ప్రేమ చూపించుకోవాలి?
  • మనం ఒకరిమీద ఒకరం ఎలా ప్రేమ చూపించుకోవాలి?
  • ఒకరి మీద ఒకరం ఎలా ప్రేమను పెంచుకుంటూ ఉండాలి?
  • ఈరోజుల్లో ప్రేమ ఎందుకు అవసరం?
  • “ప్రేమతో నడుచుకుంటూ ఉండండి”
    యెహోవాకు దగ్గరవ్వండి
  • ‘అన్నిటికంటె ముఖ్యముగా ఒకరియెడల ఒకరు మిక్కటమైన ప్రేమగలవారై ఉండండి’
    అప్రమత్తంగా ఉండండి!
  • మీ ప్రేమను చల్లారనివ్వకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • ప్రేమతో బలపర్చబడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
w23 నవంబరు పేజీలు 8-13

అధ్యయన ఆర్టికల్‌ 47

ఒకరి మీద ఒకరు ప్రేమను పెంచుకుంటూ ఉండండి

“మనం ఒకరినొకరం ప్రేమిస్తూనే ఉందాం; ఎందుకంటే ప్రేమకు మూలం దేవుడు.”—1 యోహా. 4:7.

పాట 109 మనస్ఫూర్తిగా ప్రగాఢమైన ప్రేమ చూపించండి

ఈ ఆర్టికల్‌లో …a

1-2. (ఎ) అపొస్తలుడైన పౌలు ప్రేమే “అన్నిటికన్నా గొప్పది” అని ఎందుకు అన్నాడు? (బి) మనం ఇప్పుడు ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?

అపొస్తలుడైన పౌలు విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు, “వీటిలో అన్నిటికన్నా గొప్పది ప్రేమే” అని అన్నాడు. (1 కొరిం. 13:13) ఆయన ఎందుకలా అన్నాడు? ఎందుకంటే, భవిష్యత్తులో కొత్తలోకం గురించి దేవుడిచ్చిన మాట మీద విశ్వాసం, నిరీక్షణ ఉంచాల్సిన అవసరం ఇక ఉండదు. అవి అప్పటికే మన కళ్లముందు జరిగిపోయి ఉంటాయి. కానీ ప్రేమ అలాకాదు. అప్పుడు కూడా మనం యెహోవా మీద, మనుషుల మీద ప్రేమ చూపిస్తూనే ఉండాలి. నిజం చెప్పాలంటే, వాళ్లమీద ఉన్న ఆ ప్రేమ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది.

2 మనం ఎప్పుడూ ప్రేమ చూపిస్తూనే ఉండాలి కాబట్టి, ఇప్పుడు మూడు ప్రశ్నల్ని చూద్దాం. ఒకటి, మనం ఒకరిమీద ఒకరం ఎందుకు ప్రేమ చూపించుకోవాలి? రెండు, ఆ ప్రేమను ఎలా చూపించుకోవాలి? మూడు, ఆ ప్రేమను ఎలా పెంచుకుంటూ ఉండాలి?

మనం ఒకరిమీద ఒకరం ఎందుకు ప్రేమ చూపించుకోవాలి?

3. మనం ఒకరిమీద ఒకరం ప్రేమ చూపించుకోవడం ఎందుకంత ప్రాముఖ్యం?

3 మనం ఒకరిమీద ఒకరం ప్రేమ చూపించుకోవడం ఎందుకంత ప్రాముఖ్యం? చాలా కారణాలే ఉన్నాయి. దాంట్లో ఒక కారణం ఏంటంటే, ప్రేమ నిజక్రైస్తవుల గుర్తింపు. యేసు తన అపొస్తలులతో ఇలా చెప్పాడు: “మీ మధ్య ప్రేమ ఉంటే, మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది.” (యోహా. 13:35) ఇంకో కారణం ఏంటంటే, ప్రేమ మనల్ని ఐక్యం చేస్తుంది. అందుకే పౌలు, ప్రేమ “పూర్తిస్థాయిలో ఐక్యం చేస్తుంది” అని అన్నాడు. (కొలొ. 3:14) అయితే, ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే, మనం ఒకరిమీద ఒకరం ప్రేమ చూపించుకుంటే దేవుని మీద ప్రేమ ఉందని చూపిస్తాం. అపొస్తలుడైన యోహాను తన తోటి క్రైస్తవులకు ఇలా రాశాడు: “దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి తన సహోదరుణ్ణి కూడా ప్రేమించాలి.”—1 యోహా. 4:21.

4-5. మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ని ప్రేమిస్తే యెహోవాను ప్రేమించినట్టు ఎలా అవుతుందో ఉదాహరణతో చెప్పండి.

4 మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ మీద చూపించే ప్రేమ దేవుని మీద చూపించే ప్రేమతో ఎలా ముడిపడివుంది? ఈ ఉదాహరణ గమనించండి. మన గుండెకి, మన శరీరంలో ఉన్న ఇతర అవయవాలకి సంబంధం ఉంటుంది. ఒక డాక్టరు మన నాడిని చూసి మన గుండె బలంగా ఉందో, బలహీనంగా ఉందో కొంతవరకు చెప్పగలుగుతాడు. ఈ విషయాన్ని ప్రేమకు ఎలా అన్వయించవచ్చు?

5 మన నాడిని చూసి, మన గుండె ఎలా ఉందో డాక్టరు కొంతవరకు చెప్పగలిగినట్టే, మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ మీద మనకున్న ప్రేమను చూసి, యెహోవా మీద మనకెంత ప్రేమ ఉందో చెప్పవచ్చు. ఒకవేళ బ్రదర్స్‌-సిస్టర్స్‌ మీద మనకున్న ప్రేమ తగ్గితే దేవుని మీద మనకున్న ప్రేమ కూడా తగ్గుతుందని అర్థం. కానీ బ్రదర్స్‌-సిస్టర్స్‌ మీద మనం ఎప్పటికీ ప్రేమ చూపిస్తూ ఉంటే, దేవుని మీద మనకున్న ప్రేమ చాలా బలంగా ఉందని అర్థం.

6. బ్రదర్స్‌-సిస్టర్స్‌ మీద మన ప్రేమ తగ్గిపోతుంటే, అది ఎందుకు ఆలోచించాల్సిన విషయం? (1 యోహాను 4:7-9, 11)

6 బ్రదర్స్‌-సిస్టర్స్‌ మీద మన ప్రేమ తగ్గిపోతుందంటే, అది మనం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే, అది యెహోవాతో మనకున్న బంధాన్ని తెంచేస్తుంది. అందుకే అపొస్తలుడైన యోహాను సూటిగా ఇలా చెప్పాడు: “తాను చూసే సహోదరుణ్ణి ప్రేమించని వ్యక్తి, తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు.” (1 యోహా. 4:20) మనకేంటి పాఠం? యెహోవా మనల్ని ఇష్టపడాలంటే, మనం ‘ఒకరినొకరం ప్రేమించుకోవాల్సిందే.’—1 యోహాను 4:7-9, 11 చదవండి.

మనం ఒకరిమీద ఒకరం ఎలా ప్రేమ చూపించుకోవాలి?

7-8. ఒకరిమీద ఒకరం ప్రేమ చూపించుకోవడానికి కొన్ని మార్గాలేంటి?

7 “ఒకరినొకరు ప్రేమించుకోవాలి” అని బైబిలు పదేపదే చెప్తుంది. (యోహా. 15:12, 17; రోమా. 13:8; 1 థెస్స. 4:9; 1 పేతు. 1:22; 1 యోహా. 4:11) అయితే, ప్రేమ అనే లక్షణం మన హృదయం లోపల ఉంటుంది. హృదయాన్ని ఏ మనిషి చూడలేడు కదా, మరి మన ప్రేమను అందరికీ కనిపించేలా ఎలా చేయవచ్చు? మన మాటల ద్వారా, పనుల ద్వారా అలా చేయవచ్చు.

8 బ్రదర్స్‌-సిస్టర్స్‌ మీద ప్రేమ ఉందని చూపించడానికి చాలా మార్గాలే ఉన్నాయి. వాటిలో కొన్ని ఏంటంటే: “ఒకరితో ఒకరు నిజమే” మాట్లాడండి. (జెక. 8:16) “ఒకరితో ఒకరు శాంతిగా మెలగండి.” (మార్కు 9:50) “ఒకరినొకరు ఘనపర్చుకునే విషయంలో ముందుండండి.” (రోమా. 12:10) “ఒకరినొకరు స్వీకరించండి.” (రోమా. 15:7) “మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండండి.” (కొలొ. 3:13) “ఒకరి భారం ఒకరు మోసుకుంటూ” ఉండండి. (గల. 6:2) “ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉండండి.” (1 థెస్స. 4:18) “ఒకరినొకరు బలపర్చుకుంటూ ఉండండి.” (1 థెస్స. 5:11) “ఒకరి కోసం ఒకరు ప్రార్థించండి.”—యాకో. 5:16.

చిత్రాలు: 1. ఒక సిస్టర్‌ ప్రార్థన చేస్తుంది. 2. ఇంకో సిస్టర్‌ మాట్లాడుతుంటే ఆమె వింటుంది. 3. ఆరోగ్యం బాలేని ఒక పెద్ద వయసు సిస్టర్‌కి ఆమె వీడియో కాల్‌ చేస్తుంది. 4. ఒక గిఫ్ట్‌తో పాటు చిన్న ఉత్తరం కూడా రాస్తుంది. 5. చేతికి పట్టి వేసుకుని ఉన్న ఒక సిస్టర్‌కి వంట చేసి పెట్టి, తనతో కలిసి భోజనం చేస్తుంది.

బ్రదర్స్‌-సిస్టర్స్‌ కష్టాల్లో కూరుకుపోయినప్పుడు వాళ్లకు మనమెలా సహాయం చేయవచ్చు? (7-9 పేరాలు చూడండి)

9. ఇతరుల్ని ఓదార్చడం ప్రేమ చూపించినట్టు ఎలా అవుతుంది? (చిత్రం కూడా చూడండి.)

9 ప్రేమ చూపించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని ముందు పేరాలో చూశాం. ఇప్పుడు అందులో ఒక మార్గాన్ని చూద్దాం. “ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉండండి” అని పౌలు అన్నాడు. అయితే ఒకవ్యక్తిని ఓదారిస్తే, అతన్ని ప్రేమిస్తున్నట్టు ఎలా అవుతుంది? ఒక బైబిలు రెఫరెన్స్‌ చెప్తున్నట్టు, పౌలు ఇక్కడ “ఓదార్చడం” అని ఉపయోగించిన పదం “ఒకవ్యక్తిని కష్టాలు చుట్టుముట్టినప్పుడు అతని పక్కనే ఉండి భుజం తట్టడం” అనే అర్థాన్నిస్తుంది. కాబట్టి కష్టాల్లో కూరుకుపోయిన మన తోటి బ్రదర్‌ని లేదా సిస్టర్‌ని ఓదారిస్తే, వాళ్లను ఆ కష్టాల నుండి పైకెత్తి, జీవమార్గంలో అడుగులు వేయించిన వాళ్లమౌతాం. బ్రదర్స్‌-సిస్టర్స్‌ కన్నీళ్లు తుడిచిన ప్రతీసారి వాళ్ల మీద మనకున్న ప్రేమ చూపించినట్టే!—2 కొరిం. 7:6, 7, 13.

10. కనికరం, ఓదార్పు ఒకదానితో ఒకటి ఎలా పెనవేసుకొని ఉన్నాయి?

10 కనికరం, ఓదార్పు అనే లక్షణాలు ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. ఎలా? ఒక వ్యక్తి వేరేవాళ్లను ఓదార్చాలంటే ముందు అతనిలో కనికరం ఉండాలి. కాబట్టి మనలో కనికరం ఉంటేనే వేరేవాళ్లను ఓదారుస్తాం. యెహోవా కూడా అంతే. పౌలు యెహోవా గురించి ఇలా అంటున్నాడు: “ఆయన ఎంతో కరుణగల తండ్రి, ఎలాంటి పరిస్థితిలోనైనా ఓదార్పును ఇచ్చే దేవుడు.” (2 కొరిం. 1:3) ఇక్కడ “ఎంతో కరుణగల” అని అంటున్నప్పుడు అది ఇతరుల మీద కనికరం చూపించడం గురించి చెప్తుంది. యెహోవాకి చాలా కనికరం ఉంది కాబట్టే ఆయన్ని “కరుణగల తండ్రి” అని పౌలు అంటున్నాడు. ఆ కనికరం వల్ల ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన “మనల్ని ఓదారుస్తాడు.” (2 కొరిం. 1:4) దాహంగా ఉన్న వ్యక్తికి మంచినీళ్లు దొరికినప్పుడు ఎంత హాయిగా అనిపిస్తుందో, కృంగిపోయిన వాళ్లకు యెహోవా ఇచ్చే ఓదార్పు కూడా అలాగే ఉంటుంది. మనం యెహోవాలా ఎలా ఉండవచ్చు? వేరేవాళ్లను ఓదార్చడానికి సహాయం చేసే లక్షణాల్ని ముందు మనలో పెంచుకుంటూ ఉండాలి. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటి?

11. కొలొస్సయులు 3:12 అలాగే 1 పేతురు 3:8 ప్రకారం, ఇతరుల్ని ప్రేమించడానికి, ఓదార్చడానికి ఎలాంటి లక్షణాలు పెంచుకోవాలి?

11 మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ మీద ప్రతీరోజు ప్రేమ చూపించడానికి, “ఒకరినొకరు ఓదార్చుకుంటూ” ఉండడానికి ఏం సహాయం చేస్తుంది? దానికోసం మనం సహానుభూతిని, సహోదర అనురాగాన్ని, కనికరాన్ని పెంచుకోవాలి. (కొలొస్సయులు 3:12; 1 పేతురు 3:8 చదవండి.) ఈ లక్షణాల్ని పెంచుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? ఆ లక్షణాలు మన హృదయంలో పాతుకుపోతే, మనం బ్రదర్స్‌-సిస్టర్స్‌ కష్టాల్ని తీర్చలేకపోవచ్చు గానీ వాళ్లను ఓదార్చవచ్చు. యేసు ఇలా అన్నాడు: “హృదయం నిండా ఏముంటే నోరు అదే మాట్లాడుతుంది. మంచి వ్యక్తి తన హృదయమనే మంచి ఖజానాలో నుండి మంచివాటిని బయటికి తెస్తాడు.” (మత్త. 12:34, 35) కాబట్టి మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ని ఓదార్చడమే, వాళ్లను ప్రేమిస్తున్నామని చూపించే ఒక ముఖ్యమైన మార్గం.

ఒకరి మీద ఒకరం ఎలా ప్రేమను పెంచుకుంటూ ఉండాలి?

12. (ఎ) మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? (బి) ఇప్పుడు ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?

12 మనం “ఒకరినొకరం ప్రేమిస్తూనే” ఉండాలనుకుంటాం. (1 యోహా. 4:7) అయితే, యేసు ముందు జాగ్రత్తగా ఇలా చెప్పాడు, “ఎక్కువమంది ప్రేమ చల్లారిపోతుంది.” (మత్త. 24:12) అలాగని తన శిష్యుల మధ్య ప్రేమ పూర్తిగా కనుమరుగైపోతుందని యేసు చెప్పట్లేదు. అయితే, మనం ప్రేమ కరువైన లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మన చుట్టూ ఉన్నవాళ్ల ఆలోచనను ఒంటపట్టించుకోకూడదు. దాన్ని మనసులో ఉంచుకొని ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న గురించి చూద్దాం. అదేంటంటే, బ్రదర్స్‌-సిస్టర్స్‌ మీద మనకు ఎంత ప్రేమ ఉందో ఎలా తెలుసుకోవచ్చు?

13. బ్రదర్స్‌-సిస్టర్స్‌ మీద మనకు ఎంత ప్రేమ ఉందో ఎలా తెలుస్తుంది?

13 కొన్ని పరిస్థితుల్లో మనం ఎలా స్పందిస్తాం అనే దాన్నిబట్టి మనకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. (2 కొరిం. 8:8) అలాంటి ఒక పరిస్థితి గురించి అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు: “అన్నిటికన్నా ముఖ్యంగా, ఒకరి మీద ఒకరు ప్రగాఢమైన ప్రేమ కలిగివుండండి. ఎందుకంటే ప్రేమ చాలా పాపాల్ని కప్పుతుంది.” (1 పేతు. 4:8) కాబట్టి బ్రదర్స్‌-సిస్టర్స్‌ ఏదైనా పొరపాటు చేసినప్పుడు లేదా మన మనసు గాయపర్చినప్పుడు, మనమెలా స్పందిస్తాం అనేదాన్ని బట్టి వాళ్లమీద మనకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది.

14. మొదటి పేతురు 4:8 ప్రకారం, మనం ఎలాంటి ప్రేమను చూపించాలి? ఒక ఉదాహరణ చెప్పండి.

14 పేతురు మాటల్ని కాస్త లోతుగా ఆలోచిద్దాం. 8వ వచనం మొదటి భాగం ప్రకారం, మనకు “ప్రగాఢమైన ప్రేమ” ఉండాలి. ఇక్కడ పేతురు రాసిన “ప్రగాఢమైన” అనే పదానికి అక్షరార్థంగా “పరచడం” అని అర్థం. ఆ వచనంలోని రెండో భాగం ప్రకారం, ప్రగాఢమైన ప్రేమ ఉండడం వల్ల ఏం జరుగుతుంది? అది మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ పాపాల్ని కప్పుతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి, గీతలు పడ్డ ఒక టేబుల్‌ని ఊహించుకోండి. ఒక క్లాత్‌ పెద్దగా పరిచి ఆ టేబుల్‌ మీద కప్పినప్పుడు, అది ఒకట్రెండు గీతల్ని కాదుగానీ గీతలన్నిటినీ కప్పేస్తుంది. అదేవిధంగా, మనకు బ్రదర్స్‌-సిస్టర్స్‌ మీద ప్రగాఢమైన ప్రేమ ఉంటే అది ఒకట్రెండు కాదుగానీ “చాలా పాపాల్ని కప్పుతుంది.” ఇక్కడ “కప్పడం” అంటే క్షమించడం అని అర్థం.

15. బ్రదర్స్‌-సిస్టర్స్‌ మీద మనకు ఎంత ప్రేమ ఉండాలి? (కొలొస్సయులు 3:13)

15 బ్రదర్స్‌-సిస్టర్స్‌ మీద మనకు ఎంత ప్రేమ ఉండాలంటే వాళ్లు చేసిన పొరపాట్లను క్షమించడానికి మనకు మనసు రాకపోయినా వాళ్లను క్షమించాలి. (కొలొస్సయులు 3:13 చదవండి.) అలా క్షమిస్తే మనకు వాళ్లమీద ఎంత ప్రేముందో చూపిస్తాం, యెహోవాను సంతోషపెడతాం. అయితే, మనకు చిరాకు తెప్పించే వాళ్ల పనుల్ని, పొరపాట్లను క్షమించడానికి ఇంకా ఏది సహాయం చేస్తుంది?

సర్కిల్‌లో ఉన్న చిత్రంలో, బ్రదర్స్‌-సిస్టర్స్‌ దిగిన ఫోటోల్లో కొన్నింటిని తన ఫోన్‌ నుండి డిలీట్‌ చేస్తున్న ఒక బ్రదర్‌. అందులో ఒక ఫోటో ప్రింట్‌ తీయించి, ఫ్రేమ్‌ కట్టించి టేబుల్‌ మీద పెట్టుకున్నాడు.

మంచి ఫోటోల్ని ఉంచుకొని బాలేని ఫోటోల్ని ఎలాగైతే డిలీట్‌ చేస్తామో, అలాగే మన బ్రదర్స్‌-సిస్టర్స్‌తో మనకున్న మధుర క్షణాలను గుర్తుంచుకొని బాధపెట్టిన క్షణాల్ని డిలీట్‌ చేయాలి (16-17 పేరాలు చూడండి)

16-17. బ్రదర్స్‌-సిస్టర్స్‌ చేసే చిన్నచిన్న పొరపాట్లను మనమేం చేయాలి? ఒక ఉదాహరణతో చెప్పండి. (చిత్రం కూడా చూడండి.)

16 బ్రదర్స్‌-సిస్టర్స్‌ లోపాల్ని కాకుండా, వాళ్లలో ఉన్న మంచిని చూడండి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ గమనించండి. ఒక సందర్భంలో మీరు, కొంతమంది బ్రదర్స్‌-సిస్టర్స్‌తో కలిసి ఒక గ్రూప్‌ ఫోటో దిగారు అనుకోండి. ఒకటి బాగోకపోతే ఇంకోటైనా బాగుంటుంది కదా అని రెండుమూడు ఫోటోలు దిగారు. అయితే, అందులో ఒక ఫోటోలో ఒక బ్రదర్‌ నవ్వట్లేదని మీరు గమనించారు. అప్పుడు మీరేం చేస్తారు? ఆ ఫోటోను డిలీట్‌ చేసేసి, ఆ బ్రదర్‌తో సహా అందరూ నవ్వుతున్న ఫోటోను మీ దగ్గర ఉంచుకుంటారు.

17 ఈ ఫోటోలను, మన మనసులో గుర్తుపెట్టుకునే విషయాలతో పోల్చవచ్చు. సాధారణంగా మనందరికి మన బ్రదర్స్‌-సిస్టర్స్‌తో గడిపిన ఎన్నో మధుర క్షణాలు గుర్తుంటాయి. కానీ ఏదోక సందర్భంలో ఒక బ్రదరో సిస్టరో మనల్ని నొప్పిస్తే, వాటిని గుర్తుపెట్టుకుంటామా లేక సరిగ్గా రాని ఫోటోలా డిలీట్‌ చేసేస్తామా? (సామె. 19:11; ఎఫె. 4:32) అవును, డిలీట్‌ చేసేయాలి! ఎందుకంటే వాళ్లతో గడిపిన మధుర క్షణాలు మనకెన్నో ఉన్నాయి. అవి మనకు ఎంతో విలువైనవి కాబట్టి వాటినే గుర్తుంచుకోవాలి.

ఈరోజుల్లో ప్రేమ ఎందుకు అవసరం?

18. ఈ ఆర్టికల్‌ నుండి ఏం నేర్చుకున్నాం?

18 ఒకరిమీద ఒకరం ఎందుకు ప్రేమ చూపించుకోవాలి? మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ని ప్రేమిస్తే, యెహోవాను ప్రేమిస్తున్నామని చూపిస్తాం. మరి, ఆ ప్రేమను ఎలా చూపించుకోవాలి? దానికొక మార్గం ఏంటంటే, ఇతరుల్ని ఓదార్చడం. మనకు కనికరం ఉంటే “ఒకరినొకరం ఓదార్చుకుంటూ ఉంటాం.” అయితే, ఒకరిమీద ఒకరం ప్రేమను ఎలా పెంచుకోవచ్చు? ఇతరుల్ని క్షమించడానికి మనసు రాకపోయినా వాళ్లను క్షమించడానికి శతవిధాల ప్రయత్నించాలి.

19. ఒకరిమీద ఒకరు ప్రేమ చూపించుకోవడం ఈరోజుల్లో ఎందుకంత ప్రాముఖ్యం?

19 ఒకరిమీద ఒకరం ప్రేమ చూపించుకోవడం ఈరోజుల్లో ఎందుకంత ప్రాముఖ్యం? దానికిగల కారణాన్ని పేతురు చెప్తున్నాడు, “అన్నిటి అంతం దగ్గరపడింది. కాబట్టి . . . ఒకరి మీద ఒకరు ప్రగాఢమైన ప్రేమ కలిగివుండండి.” (1 పేతు. 4:7, 8) ఈ దుష్టలోక అంతం దగ్గరపడుతుండగా, మనం దేని కోసం ఎదురు చూడొచ్చు? తన శిష్యులకు ఏం జరుగుతుందో యేసు ముందే ఇలా చెప్పాడు: “మీరు నా శిష్యులుగా ఉన్నందుకు అన్నిదేశాల ప్రజలు మిమ్మల్ని ద్వేషిస్తారు.” (మత్త. 24:9) అయితే, ఆ ద్వేషాన్ని తట్టుకుని నిలబడాలంటే, మనందరం కలిసికట్టుగా ఉండాలి. అలా ఉంటే, సాతాను మనల్ని విడగొట్టడానికి చేసే ప్రయత్నాల్ని తిప్పికొట్టిన వాళ్లమౌతాం. కాబట్టి, ప్రేమ మనల్ని “పూర్తిస్థాయిలో ఐక్యం” చేయనిద్దాం!—కొలొ. 3:14; ఫిలి. 2:1, 2.

మీరెలా జవాబిస్తారు?

  • బ్రదర్స్‌-సిస్టర్స్‌ని మనం ఎందుకు ప్రేమించాలి?

  • ఆ ప్రేమను ఎలా చూపించవచ్చు?

  • క్షమించడానికి మనం సిద్ధంగా ఉంటే ప్రేమ చూపించినట్లు ఎలా అవుతుంది?

పాట 130 క్షమిస్తూ ఉండండి

a ముందెప్పటికన్నా ఇప్పుడు మన బ్రదర్స్‌-సిస్టర్స్‌ మీద ప్రేమ చూపించడం చాలా ప్రాముఖ్యం. దాన్ని ఎందుకు చూపించాలో, ఎలా చూపించాలో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి