కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w23 మే పేజీలు 2-7
  • ప్రార్థన—దాన్ని మీరు ఇంకా బాగా చేయవచ్చు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రార్థన—దాన్ని మీరు ఇంకా బాగా చేయవచ్చు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసు ప్రార్థన చేయడానికి సమయాన్ని పక్కనపెట్టాడు
  • ప్రార్థనలో చేర్చాల్సిన ఐదు ముఖ్యమైన అంశాలు
  • ప్రార్థనను అమూల్యమైన వరంలా చూడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • ప్రార్థనలో దేవునికి సన్నిహితమవండి
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • ప్రార్థన అనే వరం
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • దేవునికి దగ్గరవ్వడానికి ప్రార్థన సహాయం చేస్తుంది
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
w23 మే పేజీలు 2-7

అధ్యయన ఆర్టికల్‌ 20

ప్రార్థన—దాన్ని మీరు ఇంకా బాగా చేయవచ్చు

“ఆయన ముందు మీ హృదయాలు కుమ్మరించండి.”—కీర్తన 62:8.

పాట 45 నా హృదయ ధ్యానం

ఈ ఆర్టికల్‌లో …a

చిత్రాలు: ఒక రోజులో చాలాసార్లు ప్రార్థన చేస్తున్న ఒక బ్రదర్‌. 1. పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత. 2. కుటుంబంతో భోజనం చేసే ముందు. 3. జూమ్‌లో ప్రీచింగ్‌ చేసే ముందు. 4. ఆరుబయట ప్రశాంతంగా ఉన్నప్పుడు. 5. రాత్రి పడుకునే ముందు.

మనం రోజూ ప్రార్థన చేస్తూ మన జీవితానికి సంబంధించిన దేనిగురించైనా, మొహమాటం లేకుండా యెహోవాను నిర్దేశం అడగొచ్చు (1వ పేరా చూడండి)

1. మనం ఏం చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు? (చిత్రం కూడా చూడండి.)

మనం బాధలో ఉన్నప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఎవరివైపు చూస్తాం? జవాబు మన అందరికి తెలుసు, ప్రార్థనలో యెహోవావైపు చూస్తాం. నిజానికి అలా చేయాలనే యెహోవా కోరుకుంటున్నాడు. మనం ఎన్నిసార్లంటే అన్నిసార్లు ప్రార్థన చేయవచ్చు. ఎందుకంటే “ఎప్పుడూ ప్రార్థించండి” అని బైబిలే చెప్తుంది. (1 థెస్స. 5:17) మన జీవితానికి సంబంధించి దేనిగురించైనా, మొహమాటం లేకుండా యెహోవాను నిర్దేశం అడగవచ్చు. (సామె. 3:5, 6) నాకు ఇన్నిసార్లే ప్రార్థన చేయాలి అనే హద్దులు ఏమీ యెహోవా పెట్టలేదు. ఎందుకంటే ఆయన మనసు చాలా పెద్దది.

2. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

2 ప్రార్థన చేయడం ఒక వరం. అది ఇచ్చినందుకు యెహోవాకు ఎంత థ్యాంక్స్‌ చెప్పినా తక్కువే. కానీ మన బిజీబిజీ బ్రతుకులో సమయం తీసుకుని ప్రార్థన చేయడం గగనమైపోయింది. అంతేకాదు, మన ప్రార్థనలు ఇంకా బాగా చేస్తే బాగుంటుందని మనందరికీ అనిపిస్తుంది. దాన్ని ఎలా చేయవచ్చో లేఖనాలు చెప్తున్నాయి. ఈ ఆర్టికల్‌లో యేసు ఉదాహరణను పరిశీలించి, ప్రార్థన చేయడానికి సమయాన్ని ఎలా పక్కనపెట్టవచ్చో చూస్తాం. అంతేకాదు, ఒక ఐదు అంశాల్ని చేర్చి మనం ఇంకా బాగా ఎలా ప్రార్థన చేయవచ్చో కూడా చర్చిస్తాం.

యేసు ప్రార్థన చేయడానికి సమయాన్ని పక్కనపెట్టాడు

3. ప్రార్థన గురించి యేసుకు ఏం తెలుసు?

3 యెహోవా మన ప్రార్థనలకు విలువిస్తాడని యేసుకు తెలుసు. ఎందుకంటే, భూమ్మీదకు రావడానికి చాలాకాలం ముందే ఎంతోమంది ప్రార్థనలకు యెహోవా జవాబివ్వడం ఆయన చూశాడు. ఉదాహరణకు హన్నా, దావీదు, ఏలీయా, ఇంకొంతమంది నమ్మకమైన సేవకులు చేసిన ప్రార్థనలకు యెహోవా జవాబిస్తున్నప్పుడు, యేసు పక్కనే ఉన్నాడు. (1 సమూ. 1:10, 11, 20; 1 రాజు. 19:4-6; కీర్త. 32:5) అందుకే తన శిష్యులు ఎన్నిసార్లంటే అన్నిసార్లు ప్రార్థన చేయవచ్చని, యెహోవా తప్పకుండా జవాబిస్తాడనే నమ్మకంతో ప్రార్థన చేయమని ఆయన నేర్పించాడు.—మత్త. 7:7-11.

4. యేసు చేసిన ప్రార్థనల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

4 భూమ్మీద ఉన్నప్పుడు ఆయన స్వయంగా యెహోవాకు ప్రార్థన చేయడం ద్వారా, యేసు తన శిష్యులకు ప్రార్థన ఎలా చేయాలో చూపించాడు. ఆయన తన పరిచర్య అంతటిలో లెక్కలేనన్నిసార్లు ప్రార్థన చేశాడు. ఆయన చుట్టూ ఎప్పుడూ జనాలు ఉండేవాళ్లు, ఊపిరాడనంత బిజీగా ఉండేవాడు కాబట్టి యేసు ప్రార్థన చేయడానికి కొంత సమయం పక్కనపెట్టాల్సి వచ్చింది. (మార్కు 6:31, 45, 46) అందుకే, ఆయన ఒంటరిగా ప్రార్థన చేయడానికి తెల్లవారుజామునే లేచేవాడు. (మార్కు 1:35) ఒకానొక సందర్భంలో, ఆయన ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ముందు, రాత్రంతా ప్రార్థన చేశాడు. (లూకా 6:12, 13) అంతేకాదు, ఆయన చనిపోవడానికి ముందురోజు రాత్రి చాలాసార్లు ప్రార్థన చేశాడు. ఎందుకంటే, తన మనసంతా భూమ్మీద ఆయన పూర్తి చేయబోయే కష్టమైన నియామకంతో నిండిపోయింది.—మత్త. 26:39, 42, 44.

5. యేసులాగే మనం ఎలా ప్రార్థించవచ్చు?

5 మనకు క్షణం తీరిక దొరకకపోయినా, ప్రార్థన చేయడానికి కొన్ని నిమిషాలైనా తీసుకోవాలని యేసు నుండి నేర్చుకోవచ్చు. అంటే మనం యేసులాగే పెందలాడే లేచి ప్రార్థన చేయవచ్చు. లేదా రాత్రి అందరూ పడుకున్నాక ఒంటరిగా ప్రార్థన చేసుకోవచ్చు. మనం అలా చేసినప్పుడు ప్రార్థన ఒక అరుదైన బహుమతి అని, దానికి మనం విలువిస్తున్నామని చూపిస్తాం. లీన్‌ అనే సిస్టర్‌, ప్రార్థన అనే వరం గురించి మొట్టమొదటిసారి విన్నప్పుడు, తనకు ఎలా అనిపించిందో గుర్తుచేసుకుంటూ ఇలా చెప్పింది: “నేను యెహోవాతో ఎప్పుడంటే అప్పుడు మాట్లాడవచ్చని తెలుసుకున్నాక, ఆయన్ని నా మనసుకు బాగా దగ్గరైన స్నేహితునిగా చూడగలిగాను. నా ప్రార్థనలు కూడా ఇంకా చక్కగా చేయాలనే కోరిక కలిగింది.” నిజమే మనలో చాలామందిమి అలానే కోరుకుంటాం. అయితే మన ప్రార్థనలో చేర్చాల్సిన ఐదు విషయాల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం.

ప్రార్థనలో చేర్చాల్సిన ఐదు ముఖ్యమైన అంశాలు

6. ప్రకటన 4:10, 11 ప్రకారం, యెహోవా దేనికి అర్హుడు?

6 యెహోవాను స్తుతించండి. అపొస్తలుడైన యోహాను ఆశ్చర్యకరమైన ఒక దర్శనంలో, 24 మంది పెద్దలు పరలోకంలో యెహోవాను ఆరాధించడం చూశాడు. యెహోవా “మహిమ, ఘనత, శక్తి పొందడానికి” అర్హుడని వాళ్లు గుర్తించి, ఆయన్ని స్తుతించారు. (ప్రకటన 4:10, 11 చదవండి.) నమ్మకమైన దేవదూతలు కూడా యెహోవాను స్తుతించడానికి, ఘనపర్చడానికి కారణాలు కోకొల్లలు. వాళ్లు పరలోకంలో ఆయనతోపాటు ఉన్నారు కాబట్టి ఆయన వాళ్లకు బాగా తెలుసు. వాళ్లు ఆయన లక్షణాల్ని, పనుల్ని దగ్గరగా చూశారు కాబట్టి ఆయన్ని స్తుతించకుండా ఉండలేకపోయారు.—యోబు 38:4-7.

7. ఏయే విషయాల్ని బట్టి మనం యెహోవాను స్తుతించవచ్చు?

7 మనం కూడా మన ప్రార్థనలో యెహోవాను స్తుతించవచ్చు. ఆయనలో మనకు ఏది బాగా నచ్చుతుందో, ఎందుకు నచ్చుతుందో చెప్పవచ్చు. బైబిల్ని చదువుతున్నప్పుడు, అధ్యయనం చేస్తున్నప్పుడు ఆయన చూపించిన లక్షణాల గురించి తెలుసుకుని, అందులో మీకు ఏది బాగా నచ్చుతుందో గుర్తించండి. (యోబు 37:23; రోమా. 11:33) ఆ తర్వాత, ఆ లక్షణాల గురించి మీకు ఏమనిపిస్తుందో యెహోవాకు చెప్పండి. మనకు, మన బ్రదర్స్‌, సిస్టర్స్‌కి అండగా ఉంటున్నందుకు యెహోవాను స్తుతించండి. ఆయన ఎప్పటికీ మనల్ని కంటికిరెప్పలా కాపాడుతూ సంరక్షిస్తున్నాడు.—1 సమూ. 1:27; 2:1, 2.

8. యెహోవాకు థ్యాంక్స్‌ చెప్పడానికి కొన్ని కారణాలు ఏంటి? (1 థెస్సలొనీకయులు 5:18)

8 యెహోవాకు థ్యాంక్స్‌ చెప్పండి. ప్రార్థనలో యెహోవాకు థ్యాంక్స్‌ చెప్పడానికి చాలా కారణాలున్నాయి. (1 థెస్సలొనీకయులు 5:18 చదవండి.) మన దగ్గరున్న మంచివాటన్నిటికీ ఆయనకు థ్యాంక్స్‌ చెప్పవచ్చు. ఎంతైనా మన దగ్గరున్న మంచివన్నీ ఆయన ఇచ్చినవే కదా! (యాకో. 1:17) ఉదాహరణకు భూమిని, ఈ విశ్వంలో ఉన్న వింతలు-విశేషాలు అన్నిటినీ అందంగా చెక్కినందుకు మనం థ్యాంక్స్‌ చెప్పవచ్చు. వీటితోపాటు జీవాన్ని, కుటుంబాన్ని, స్నేహితుల్ని, బ్రతకడానికి ఒక ఆశను ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్‌ చెప్పవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా, ఆయనతో ఒక మంచి స్నేహాన్ని కలిగి ఉండేలా సహాయం చేసినందుకు థ్యాంక్స్‌ చెప్పవచ్చు.

9. మనం యెహోవా మీద ఎందుకు కృతజ్ఞత పెంచుకుంటూ ఉండాలి?

9 మనం యెహోవాకు వేటినిబట్టి థ్యాంక్స్‌ చెప్పాలో సమయం తీసుకుని ఆలోచించాలి. ఎందుకంటే, కృతజ్ఞత కనుమరుగైన లోకంలో మనం జీవిస్తున్నాం. ప్రజలు ఎంతసేపూ తమకు ఏం కావాలో ఆలోచిస్తున్నారేగానీ, తమకు ఉన్నవాటినిబట్టి థ్యాంక్స్‌ చెప్పట్లేదు. ఒకవేళ మనం ఈ లోక మైకంలో పడిపోతే, మన ప్రార్థనలు కూడా కోరికల చిట్టాలా మిగిలిపోతాయి. అలా జరగకూడదంటే, యెహోవా మనకోసం ఏం చేశాడో ఆలోచిస్తూ థ్యాంక్స్‌ చెప్తూ ఉండాలి.—లూకా 6:45.

ఒక సిస్టర్‌ రాత్రి తన ఇంటి మిద్దెమీద కూర్చొని ప్రార్థన చేసుకుంటుంది. ఆమె పక్కన బైబిలు, ఒక పుస్తకం ఉంది.

యెహోవాకు థ్యాంక్స్‌ చెప్పినప్పుడు మనం కష్టాల్ని తట్టుకోగలుగుతాం (10వ పేరా చూడండి)

10. థ్యాంక్స్‌ చెప్పే అలవాటు ఉండడంవల్ల ఒక సిస్టర్‌ తన కష్టాల్ని ఎలా తట్టుకుంది? (చిత్రం కూడా చూడండి.)

10 మనకు థ్యాంక్స్‌ చెప్పే అలవాటు ఉంటే కష్టాల్ని తట్టుకోగలుగుతాం. 2015 జనవరి 15, కావలికోట పత్రికలో వచ్చిన క్యాంగ్‌-సూక్‌ అనే సిస్టర్‌ అనుభవాన్ని పరిశీలించండి. ఆమెకు తీవ్రమైన లంగ్‌ క్యాన్సర్‌ ఉందని డాక్టర్స్‌ చెప్పారు. “అది నేను ఊహించని ఎదురుదెబ్బ. జీవితమంతా శూన్యంగా అనిపించింది. నాకు చాలా భయమేసింది” అని ఆ సిస్టర్‌ చెప్పింది. మరి ఆ పరిస్థితిని తట్టుకోవడానికి ఆ సిస్టర్‌కి ఏది సహాయం చేసింది? ఆ సిస్టర్‌ ప్రతీరోజు రాత్రి పడుకోవడానికి ముందు, వాళ్ల ఇంటి డాబా పైకి వెళ్లి ఆ రోజు యెహోవాకు థ్యాంక్స్‌ చెప్పే ఐదు విషయాల గురించి గట్టిగా ప్రార్థన చేసేది. దానివల్ల ఆమె మనసు కుదుటపడేది, యెహోవా మీద ప్రేమ పెరిగేది. కష్టాల కడలిలో తన నమ్మకమైన సేవకులకు యెహోవా ఎలా సహాయం చేస్తాడో ఆమె రుచి చూసింది. అంతేకాదు, మన జీవితంలో కష్టాలు ఉండొచ్చేమోగానీ, అంతకుమించిన దీవెనలు కూడా ఉంటాయని ఆమె గుర్తించింది. ఆ సిస్టర్‌లాగే, మనం పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పటికీ యెహోవాకు థ్యాంక్స్‌ చెప్పడానికి చాలా కారణాలుంటాయి. ప్రార్థనలో థ్యాంక్స్‌ చెప్పడంవల్ల, మన కష్టాల్ని తట్టుకోగలుగుతాం. వాటికి అతిగా స్పందించకుండా కూడా ఉండగలుగుతాం.

11. యేసు పరలోకానికి వెళ్లిపోయిన తర్వాత శిష్యులకు ఎందుకు ధైర్యం అవసరమైంది?

11 ప్రీచింగ్‌ చేయడానికి కావల్సిన ధైర్యాన్ని ఇవ్వమని యెహోవాను అడగండి. యేసు పరలోకానికి వెళ్లే ముందు, తన శిష్యులకు ఇచ్చిన నియామకాన్ని గుర్తుచేస్తూ ఇలా అన్నాడు: “యెరూషలేములో, యూదయ అంతటిలో, సమరయలో, భూమంతటా మీరు నా గురించి సాక్ష్యమిస్తారు.” (అపొ. 1:8; లూకా 24:46-48) అలా చెప్పిన కొంతకాలానికే, యూదా నాయకులు అపొస్తలుడైన పేతురును, యోహానును అరెస్టు చేసి మహాసభ ముందుకు తీసుకొచ్చి, ప్రీచింగ్‌ చేయవద్దని, చేస్తే చంపేస్తామని బెదిరించారు. (అపొ. 4:18, 21) మరి పేతురు, యోహాను ఎలా స్పందించారు?

12. అపొస్తలుల కార్యాలు 4:29, 31 ప్రకారం, శిష్యులు ఏం చేశారు?

12 యూదా మతనాయకుల బెదిరింపులకు పేతురు, యోహానులు ఇలా అన్నారు: “దేవుని మాట కాకుండా మీ మాట వినడం దేవుని దృష్టిలో సరైనదేనా? మీరే ఆలోచించండి. మేమైతే చూసినవాటి గురించి, విన్నవాటి గురించి మాట్లాడకుండా ఉండలేం.” (అపొ. 4:19, 20) పేతురు, యోహానులు విడుదలైన తర్వాత, శిష్యులందరూ కలిసి యెహోవా ఇష్టం చేయడం మీద మనసుపెట్టేలా సహాయం చేయమని ప్రార్థన చేశారు. వాళ్లు ఇలా ప్రార్థించారు: “నీ దాసులు నీ వాక్యాన్ని పూర్తి ధైర్యంతో ప్రకటిస్తూ ఉండేలా సహాయం చేయి.” వాళ్లు నిజాయితీగా చేసిన ఆ ప్రార్థనకు యెహోవా జవాబిచ్చాడు.—అపొస్తలుల కార్యాలు 4:29, 31 చదవండి.

13. జిన్‌యుక్‌ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

13 ఒకవేళ అధికారులు మనల్ని ప్రీచింగ్‌ చేయొద్దని చెప్పినా, శిష్యుల్లాగే మనం ఆ పనిని ఆపం. ఉదాహరణకు, జిన్‌యుక్‌ అనే బ్రదర్‌ అనుభవాన్ని పరిశీలించండి. సైన్యంలో చేరనందుకు ఆయన్ని తీసుకెళ్లి జైల్లో వేశారు. జైల్లో మిగతా ఖైదీలకు ఆహారం పంచిపెట్టే పనిని ఆయనకు అప్పగించారు. ఆయన కేవలం ఆహారం మాత్రమే అందించాలి, బైబిలు గురించి ఏదీ మాట్లాడకూడదని అధికారులు ఆదేశించారు. ఆ బ్రదర్‌ బైబిలు గురించి మాట్లాడే ఏ అవకాశాన్ని వదులుకోకుండా ఉండే ధైర్యం, తెలివి ఇవ్వమని యెహోవాకు ప్రార్థించాడు. (అపొ. 5:29) ఆయన ఇలా అంటున్నాడు: “యెహోవా నా ప్రార్థన విన్నాడు. దానివల్ల నేను చాలామంది ఖైదీలతో ఐదు నిమిషాల్లోనే బైబిలు అధ్యయనం మొదలుపెట్టగలిగే ధైర్యం, తెలివి యెహోవా ఇచ్చాడు. ఆ తర్వాత, రాత్రి ఉత్తరాలు రాసేవాణ్ణి, తెల్లారాక వాళ్లకు వాటిని ఇచ్చేవాణ్ణి.” మనం కూడా ప్రీచింగ్‌ చేయడానికి కావల్సిన సహాయం యెహోవా తప్పకుండా చేస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. ఆ బ్రదర్‌లాగే మనం ధైర్యం, తెలివి కోసం యెహోవాకు ప్రార్థించవచ్చు.

14. సమస్యలతో ఎదురీదుతూ ఉన్నప్పుడు మనకు ఏది సహాయం చేస్తుంది? (కీర్తన 37:3, 5)

14 కష్టాల్ని గట్టెక్కడానికి యెహోవా సహాయం అడగండి. మనలో చాలామంది శారీరక లేదా మానసిక సమస్యలతో పోరాడుతున్నాం. మనం బాగా ప్రేమించేవాళ్లు చనిపోయి ఉండవచ్చు. కుటుంబంలో ఒక కష్టమైన పరిస్థితి ఉండవచ్చు. వ్యతిరేకత లేదా ఇంకేదైనా సమస్యతో మనం ఎదురీదుతూ ఉండవచ్చు. అంతేకాదు, ఉన్న సమస్యలు చాలదన్నట్టు మహమ్మారులు, యుద్ధాలు మనల్ని ఇంకా కష్టాల ఊబిలోకి నెట్టేశాయి. కాబట్టి మీ మనసులో ఉన్నవన్నీ యెహోవాకు చెప్పండి. ఒక ప్రాణ స్నేహితునికి మీ సమస్యను చెప్పుకున్నట్టే యెహోవాకు చెప్పుకోండి. యెహోవా మీ “తరఫున చర్య తీసుకుంటాడు” అనే భరోసాతో ఉండండి.—కీర్తన 37:3, 5 చదవండి.

15. కష్టాల్ని గట్టెక్కడానికి ప్రార్థన ఎలా సహాయం చేస్తుందో ఒక ఉదాహరణ చెప్పండి.

15 పట్టుదలగా ప్రార్థన చేయడంవల్ల మనం కష్టాల్ని తట్టుకోగలుగుతాం. (రోమా. 12:12) తన సేవకులు పడే ప్రతీ కష్టాన్ని యెహోవా చూస్తున్నాడు, “వాళ్లు పెట్టే మొరలు” ఆయన వింటున్నాడు. (కీర్త. 145:18, 19) క్రిస్టీ అనే 29 ఏళ్ల పయినీరు సిస్టర్‌, ఆ మాట నిజమని తెలుసుకుంది. తనకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావడంతో ఒక్కసారిగా తన జీవితం తలకిందులైంది. దానివల్ల ఆమె జీవితమంతా చీకటిమయంగా మారింది. ఎన్నో రోజులు గడవకముందే వాళ్ల అమ్మకు కూడా ప్రాణాంతకమైన జబ్బు ఉందని బయటపడింది. క్రిస్టీ ఇలా చెప్తుంది: “నా జీవితం క్షణమొక యుగంలా గడిచింది. కానీ ప్రతీరోజు నాకు కావల్సిన బలాన్ని ఇవ్వమని యెహోవాను పట్టుదలగా ప్రార్థనలో అడిగేదాన్ని. అంతేకాదు, యెహోవాకు దగ్గరచేసే పనులు అంటే మీటింగ్స్‌కి వెళ్లడం, వ్యక్తిగత అధ్యయనం చేయడం మానలేదు. చీకటిమయమైన నా జీవితంలో ప్రార్థన వెలుగును నింపింది. యెహోవా నా వెన్నంటే ఉన్నాడు అని తెలుసుకోవడం, నాలో కొండంత బలాన్ని నింపింది. నిజమే నాకున్న అనారోగ్య సమస్య రాత్రికిరాత్రే పోలేదు. కానీ ఇలాంటి పరిస్థితిలో కూడా ప్రశాంతంగా, మనశ్శాంతిగా ఉండేలా సహాయం చేయడం ద్వారా యెహోవా నా ప్రార్థనలకు జవాబిచ్చాడు.” కాబట్టి, యెహోవాకు “దైవభక్తిగల ప్రజల్ని కష్టాల నుండి ఎలా తప్పించాలో” బాగా తెలుసని మర్చిపోకండి.—2 పేతు. 2:9.

చిత్రాలు: ప్రలోభాలకు దూరంగా ఉండడానికి కావాల్సిన పనులు చేస్తున్న ఒక బ్రదర్‌. 1. పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాడు. 2. తన ట్యాబ్‌ నుండి ఒక యాప్‌ని డిలీట్‌ చేస్తున్నాడు. 3. బైబిలు చదువుతున్నాడు.

తప్పుడు కోరికల్ని తిప్పికొట్టాలంటే (1) సహాయం కోసం యెహోవాకు ప్రార్థించాలి, (2) ప్రార్థనలకు తగ్గట్టు పనులు చేయాలి, (3) యెహోవాతో మీకున్న బంధాన్ని బలపర్చుకోవాలి (16-17 పేరాలు చూడండి)

16. తప్పుడు కోరికల్ని తిప్పికొట్టడానికి యెహోవా సహాయం ఎందుకు అవసరం?

16 తప్పుడు కోరికల్ని తిప్పికొట్టడానికి యెహోవా సహాయం అడగండి. అపరిపూర్ణ మనుషులంగా మనం తప్పుడు కోరికలతో కనిపించని యుద్ధం చేస్తూనే ఉంటాం. ఆ యుద్ధాన్ని ఇంకా కష్టం చేయడానికి సాతాను విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. అలా చేసే ఒక విధానం ఏంటంటే, వినోదం మాటున విషాన్ని పెట్టి మన ఆలోచనల్ని కలుషితం చేయడం. అలాంటి దిగజారిన వినోదంతో మన వ్యక్తిత్వాన్ని పాడుచేసి, మనల్ని పాపంవైపు అడుగులు వేయిస్తున్నాడు.—మార్కు 7:21-23; యాకో. 1:14, 15.

17. తప్పుడు కోరికల్ని తిప్పికొట్టడానికి సహాయం అడిగాక, మనం ఏం చేయాలి? (చిత్రం కూడా చూడండి.)

17 మనం తప్పుడు కోరికల్ని తిప్పికొట్టాలంటే యెహోవా సహాయం అవసరం. అందుకే, యేసు ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తూ ఈ మాటల్ని కూడా చెప్పాడు: “మమ్మల్ని ప్రలోభానికి లొంగిపోనివ్వకు, దుష్టుని నుండి మమ్మల్ని కాపాడు.” (మత్త. 6:13) అవును, యెహోవా మనకు సహాయం చేయడానికి చెయ్యి చాపి ఉంచాడు. మనం చేయాల్సిందల్లా ఆయన సహాయం అడిగి, తన చెయ్యి అందుకోవడమే. మనం మన ప్రార్థనలకు తగ్గట్టుగా పనులు కూడా చేయాలి. దానికోసం ఈ సాతాను లోకంలో పేరుగాంచిన ఆలోచనలు, సిద్ధాంతాలు మన మనసుల్ని కప్పేయకూడదంటే మనం వాటిని చదవకూడదు, వినకూడదు. (కీర్త. 97:10) దానికి బదులుగా బైబిల్ని చదువుతూ, అధ్యయనం చేస్తూ మన మనసును మంచి ఆలోచనలతో నింపుకోవచ్చు. మీటింగ్స్‌కి వెళ్లడం, ప్రీచింగ్‌ చేయడంవల్ల మన ఆలోచనలకు కంచె వేసుకోవచ్చు. ఫలితంగా, మనం తట్టుకోగలిగే వాటికన్నా ఎక్కువ పరీక్షల్ని రానివ్వనని యెహోవా మాటిస్తున్నాడు.—1 కొరిం. 10:12, 13.

18. ప్రార్థన విషయంలో మనందరం ఏం చేయాలి?

18 ఈ కష్టమైన చివరిరోజుల్లో యెహోవాకు నమ్మకంగా ఉండడానికి ముందెప్పటికన్నా ఎక్కువసార్లు మనం ప్రార్థిస్తూ ఉండాలి. కాబట్టి, మీ మనసులో ఉన్నవన్నీ యెహోవాకు చెప్పడానికి రోజులో కొంత సమయాన్ని పక్కనపెట్టుకోండి. ప్రార్థనలో ‘ఆయన ముందు మన హృదయాల్ని ​కుమ్మరించాలని’ యెహోవా కోరుకుంటున్నాడు. (కీర్త. 62:8) యెహోవాను స్తుతించండి, ఆయన చేసినవాటన్నిటికీ థ్యాంక్స్‌ చెప్పండి. ప్రీచింగ్‌ చేయడానికి కావల్సిన ధైర్యం ఇవ్వమని అడగండి. మీ సమస్యలకు ఎదురీదడానికి, తప్పుడు కోరికల్ని తిప్పికొట్టడానికి సహాయం చేయమని వేడుకోండి. ప్రతీరోజు యెహోవాకు ప్రార్థించకుండా చేసే దేన్నీ లేదా ఎవర్నీ అనుమతించకండి. అయితే, యెహోవా మన ప్రార్థనకు ఎలా జవాబిస్తాడు? ఈ ముఖ్యమైన ప్రశ్న గురించి తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

మీరెలా జవాబిస్తారు?

  • ప్రార్థన చేయడం ప్రాముఖ్యమని యేసు ఎలా చూపించాడు?

  • మనం ప్రార్థనలో చేర్చాల్సిన కొన్ని అంశాలు ఏంటి?

  • మీ ప్రార్థనల విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు?

పాట 42 దేవుని సేవకుల ప్రార్థన

a మన ప్రార్థనలు మన ప్రాణ స్నేహితునితో మనసువిప్పి మాట్లాడినట్టు ఉండాలని కోరుకుంటాం. కానీ, ప్రతీసారి సమయం తీసుకుని ప్రార్థన చేయడం అంత ఈజీ కాకపోవచ్చు. అంతేకాదు, కొన్నిసార్లు దేనిగురించి ప్రార్థించాలో కూడా అర్థంకాకపోవచ్చు. ఈ రెండు ముఖ్యమైన విషయాల గురించి ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి