పాఠకుల ప్రశ్నలు
గ్రీకు పదమైన “టొʹటె” (అప్పుడు), తర్వాత వచ్చే దాన్ని పరిచయం చేసేందుకు ఉపయోగింపబడిందని నేను అర్థం చేసుకోగలను. మత్తయి 24:9, “అప్పుడు [“టొʹటె”] జనులు మిమ్మును శ్రమలపాలు” చేస్తారు అని చదవబడుతుండగా, లూకా 21:12నందలి దాని సమాంతర వృత్తాంతం “ఇవన్నియు జరుగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి, . . . హింసింతురు” అని ఎందుకు చెబుతోంది?
తర్వాత రాబోయే దాన్ని, వరుస క్రమంలోని తర్వాతి దాన్ని పరిచయం చేసేందుకు టొʹటెను ఉపయోగించవచ్చునన్న విషయం సరైనదే. అయితే ఆ పదం బైబిలులో అలా మాత్రమే ఉపయోగింపబడిందని మనం అర్థం చేసుకోవలసిన అవసరం లేదు.
బవర్, ఆర్నట్ మరియు గింగ్‌రిచ్‌లు రచించిన క్రొత్త నిబంధన మరియు ఇతర తొలి క్రైస్తవ ప్రచురణల గ్రీకు ఆంగ్ల నిఘంటువు (ఆంగ్లం) అనే ప్రచురణ, టొʹటె అనే పదం లేఖనాల్లో రెండు మూల భావాల్లో ఉపయోగింపబడిందని చూపుతోంది.
“ఆ సమయంలో” అనేది ఒక ఉపయోగం. ఇది “గతంలోని అప్పుడును” కూడా సూచించవచ్చు. ఇవ్వబడిన ఒక ఉదాహరణ ఏదంటే మత్తయి 2:17, NW వచనం, “అప్పుడు ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను.” ఇది పరంపరలోని దేనినో ఉదహరించడం లేదు అయితే గతంలోని ఒక ప్రత్యేక సమయాన్ని సూచిస్తుంది అంటే ఆ సమయంలో అని దాని భావము. అదే విధంగా, టొʹటెను “భవి[ష్యత్తు] నందలి అప్పుడు విషయంలో కూడా” ఉపయోగించవచ్చు. ఒక ఉదాహరణ 1 కొరింథీయులు 13:12నందు కనుగొనబడుతోంది: “ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము; అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును.” (ఇటాలిక్కులు మావి.) పౌలు ఇక్కడ టొʹటె అనే పదాన్ని ‘భవిష్యత్తు నందలి ఆ సమయం’ అనే భావంలో ఉపయోగించాడు.
ఈ నిఘంటువు ప్రకారం, టొʹటె యొక్క మరొక ఉపయోగం ఏమంటే “కాల క్రమేణా వచ్చేదాన్ని పరిచయం చేయటం.” యేసు ప్రత్యక్షతను గురించిన అపొస్తలుల ప్రశ్నలకు ఆయన ఇచ్చిన జవాబులున్న మూడు వృత్తాంతాల్లో కనుగొనబడే అనేక ఉదాహరణలను ఈ నిఘంటువు అందిస్తోంది.a “కాల క్రమేణా వచ్చేదాన్ని పరిచయం చేసేందుకై” టొʹటె యొక్క ఉపయోగాన్ని గూర్చిన ఉదాహరణలుగా ఆ నిఘంటువు మత్తయి 24:10, 14, 16, 30; మార్కు 13:14, 21; మరియు లూకా 21:20, 27లను సూచిస్తుంది. సందర్భాన్ని పరిశీలించడం, కాల క్రమేణా వచ్చే దానిగా దాన్ని అర్థం చేసుకోవడం ఎందుకు సరైనదో చూపుతుంది. భవిష్యత్ సంఘటనల అభివృద్ధిని గురించి ఉన్న యేసు ప్రవచనాల భావాన్ని పొందడంలో ఇది ఎంతో సహాయకరంగా ఉంటుంది.
అయితే, ఈ వృత్తాంతాల్లోని టొʹటె యొక్క ప్రతి సందర్భం, కాల క్రమేణా వచ్చే దాన్ని కచ్చితంగా పరిచయం చేయాలని మనం తీర్మానించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు, మత్తయి 24:7, 8 నందు, జనముమీదికి జనము లేచును మరియు అక్కడక్కడా కరవులును భూకంపములును కలుగునని యేసు ప్రవచించాడని మనం చదువుతాం. 9వ వచనం ఇలా కొనసాగుతుంది: “అప్పుడు జనులు మిమ్మును శ్రమలపాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.” (ఇటాలిక్కులు మావి.) హింస ప్రారంభం కాక ముందు, ప్రవచింపబడిన యుద్ధాలు, కరవులు మరియు భూకంపాలు అన్నీ సంభవిస్తాయని మరియు బహుశ ముగిసిపోతాయని అర్థం చేసుకోవడం తర్కసంగతంగా ఉంటుందా?
అది సహేతుకం కాదు, అంతేకాక మొదటి శతాబ్దపు నెరవేర్పును గురించి మనకు తెలిసిన విషయం దాన్ని ధృవపరచడం లేదు. దాదాపు క్రొత్త క్రైస్తవ సంఘ సభ్యులు ప్రకటించడం ప్రారంభించిన వెంటనే వారు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారని అపొస్తలుల కార్యముల పుస్తకంలోని వృత్తాంతం బయల్పరుస్తుంది. (అపొస్తలుల కార్యములు 4:5-21; 5:17-40) ఏ యుద్ధాలు, కరవులు మరియు భూకంపాల గురించి యేసు మాట్లాడాడో అవన్నీ కూడా ఆ తొలి హింసకు ముందే సంభవించాయని మనం ఎంతమాత్రం చెప్పలేము. దానికి భిన్నంగా, ముందే చెప్పబడిన అనేక ఇతర సంగతులకంటే ముందు ఆ వ్యతిరేకత వచ్చింది, అది “ఇవన్నియు జరుగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి, . . . హింసింతురు” అని లూకా విషయాలను అమర్చిన విధానానికి అనుగుణ్యంగా ఉంది. (లూకా 21:12, ఇటాలిక్కులు మావి.) మత్తయి 24:9 నందలి టొʹటె “ఆ సమయంలో” అనే భావాన్ని ఎక్కువగా ఇచ్చే విధంగా ఉపయోగింపబడిందని అది సూచిస్తుంది. యుద్ధాలు, కరవులు మరియు భూకంపాల సమయంలో లేక ఆ సమయంలో యేసు అనుచరులు హింసింపబడతారు.
[అధస్సూచీలు]
a మత్తయి, మార్కు మరియు లూకా పుస్తకాల్లోని ఈ సమాంతర వృత్తాంతాలు, ఫిబ్రవరి 15, 1994 కావలికోట నందలి 14, 15 పేజీల్లో గీతలతో విడదీసిన నిలువు వరుసలుగా ఉంచబడ్డాయి. “అప్పుడు” అని అనువదింపబడిన టొʹటె యొక్క సందర్భాలు లావుపాటి అచ్చులో ఉంటాయి.