దేవుడు చర్య తీసుకున్నప్పుడు మీరు తప్పించబడతారా?
“ఆ దినములు తక్కువ చేయబడకపోయినయెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.”—మత్తయి 24:22.
1, 2. (ఎ) మన భవిష్యత్తు విషయమై ఆసక్తి కలిగి ఉండటం ఎందుకు సహజమే? (బి) ఏ ప్రాముఖ్యమైన ప్రశ్నల్లో సాధారణ ఆసక్తి ఇమిడి ఉండవచ్చు?
మీ ఎడల మీకు ఎంత ఆసక్తి ఉంది? అనేకులు నేడు స్వాభిమానులుగా స్వయం ఆసక్తిని మరీ విపరీతంగా కలిగి ఉంటారు. అయినప్పటికీ, మనల్ని ఏది ప్రభావితం చేస్తుందో ఆ విషయంలో సరైన ఆసక్తి కలిగి ఉండటాన్ని బైబిలు ఖండించడం లేదు. (ఎఫెసీయులు 5:33) మన భవిష్యత్తునందు ఆసక్తి కలిగి ఉండటం కూడా అందులో ఇమిడివుంది. కాబట్టి మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలని అనుకోవడం సహజమే. మీరు ఆసక్తి కలిగి ఉన్నారా?
2 యేసు అపొస్తలులు తమ భవిష్యత్తు ఎడల అలాంటి ఆసక్తినే కలిగి ఉండిరని మనం నిశ్చయత కలిగి ఉండవచ్చు. (మత్తయి 19:27) ఆ నలుగురు యేసుతోపాటు ఒలీవ కొండపై ఉన్నప్పుడు ఆ ప్రశ్నను అడిగేందుకు అదే కారణం కావచ్చు. వారిలా అడిగారు: “ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నియు నెరవేరబోవుకాలమునకు ఏ గురుతు కలుగును?” (మార్కు 13:4) భవిష్యత్తు ఎడల ఆసక్తి కలిగి ఉండటాన్ని యేసు అలక్ష్యం చేయలేదు—అందులో వారి ఆసక్తి మరియు మన ఆసక్తి కూడా ఇమిడివుంది. తన అనుచరులు ఎలా ప్రభావితం చేయబడతారు మరియు తుది ఫలితం ఏమై ఉంటుంది అనే విషయాలను ఆయన పదే పదే ఉన్నతపరిచాడు.
3. యేసు సమాధానాన్ని మనం మన కాలంతో ఎందుకు ముడిపెడతాము?
3 యేసు సమాధానం, మన కాలంలో విస్తృత నెరవేర్పును కలిగి వుండే ఒక ప్రవచనాన్ని తెలియజేసింది. మన శతాబ్దంలోని ప్రపంచ యుద్ధాలు మరియు ఇతర పోరాటాల నుండి, లెక్కలేనన్ని జీవితాలను అంతం చేసే భూకంపాలు, అనారోగ్యాన్ని మరియు మరణాన్ని తెచ్చే ఆహార కొరతలు, 1918లో వచ్చిన స్పానిష్ ఇన్ఫ్లుయెన్జా తెగులు మొదలుకొని ప్రస్తుతదిన ఎయిడ్స్ రోగం వరకూ ఉన్న మహమారుల నుండి మనం దీన్ని చూడవచ్చు. అయితే, సా.శ. 70లో రోమీయుల చేతిలో యెరూషలేము నాశనానికి దారి తీయడం మరియు నాశనం జరగడం ద్వారా యేసు సమాధానంలోని చాలా భాగం నెరవేరింది. యేసు తన శిష్యులను ఇలా హెచ్చరించాడు: “మిమ్మునుగూర్చి మీరే జాగ్రత్తపడుడి. వారు మిమ్మును సభల కప్పగించెదరు; మిమ్మును సమాజమందిరములలో కొట్టించెదరు; మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల యెదుటను రాజుల యెదుటను నా నిమిత్తము నిలువబడెదరు.”—మార్కు 13:9.
యేసు ప్రవచనం, అది నెరవేరిన విధానం
4. యేసు సమాధానంలో ఇమిడివున్న కొన్ని హెచ్చరికలు ఏవి?
4 తన శిష్యులతో ఇతరులు ఎలా వ్యవహరిస్తారు అనే విషయం కంటే యేసు ఎక్కువే ప్రవచించాడు. వారెలా ప్రవర్తించాలనే విషయంలో కూడా ఆయన వారిని జాగరూకులను చేశాడు. ఉదాహరణకు: “నాశకరమైన హేయవస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచునప్పుడు—చదువువాడు గ్రహించుగాక—యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను.” (మార్కు 13:14) “యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు” అని లూకా 21:20నందలి సమాంతర వృత్తాంతం చెబుతుంది. మొదటి నెరవేర్పులో అది కచ్చితమైనదానిగా ఎలా నిరూపించబడింది?
5. సా.శ. 66లో యూదయలో ఉండిన యూదులమధ్య ఏమి జరిగింది?
5 ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బైబిల్ ఎన్సైక్లోపీడియా (1982) మనకిలా చెబుతుంది: “యూదులు రోమా ఆధిపత్యంలో మరీ మూర్ఖంగా ఉండేవారు మరియు ప్రోక్యురేటర్లు చాలా దౌర్జన్యపూరితంగా, కఠినంగా మరియు అన్యాయం చేసే వారిగా ఉండేవారు. క్రీ.పూ. 66లో బహిరంగ తిరుగుబాటు మొదలైంది. . . . జీలట్లు మసాడాను ఆక్రమించి మెనాచెమ్ ఆధ్వర్యంలో యెరూషలేముపై దాడి చేసేందుకు బయల్దేరినప్పుడు యుద్ధం ప్రారంభమైంది. అదే సమయంలో, గవర్నరుకు సంబంధించిన నగరమైన కైసరయలోని యూదులు సంహరింపబడ్డారు, ఈ దారుణాన్ని గురించిన వార్తలు దేశమంతటా పాకిపోయాయి. తిరుగుబాటు జరిగిన సంవత్సరం 1నుండి సంవత్సరం 5వరకూ ప్రతి సంవత్సరం క్రొత్త నాణెములు ముద్రింపబడ్డాయి. ఆ నాణెములపై ఆ యా సంవత్సరాలు ముద్రింపబడ్డాయి.”
6. యూదా తిరుగుబాటు రోమీయుల్లో ఏ ప్రతిస్పందనను రేకెత్తించింది?
6 సెస్టియస్ గాలస్ ఆధిపత్యం క్రిందనున్న రోమీయుల పన్నెండవ లెజియను సిరియా నుండి దండయాత్ర చేసి, గలిలయ యూదయలను కొల్లగొట్టి, రాజధానిపై దాడి చేసి “పరిశుద్ధపట్టణమగు యెరూషలేము” ఎగువ భాగాన్ని కూడా ఆక్రమించుకుంది. (నెహెమ్యా 11:1; మత్తయి 4:5; 5:35; 27:53) ఆ మార్పుల గురించి, ద రోమన్ సీజ్ ఆఫ్ జెరూసలేమ్ (ఆంగ్లం) అనే గ్రంథం సంక్షిప్తంగా ఇలా చెబుతుంది: “ఐదు రోజులు రోమీయులు నిచ్చెనలతో గోడలను ఎక్కాలని ప్రయత్నించారు, ప్రతిసారీ నెట్టివేయబడే వారు. రక్షకులు చివరకు ఆయుధ దాడులకు తట్టుకోలేక లొంగిపోయారు. తమను తాము కాపాడుకునేందుకు తమ తలలపై ఢాలులను అమర్చుకునే పద్ధతైన టెస్ట్యుడో పద్ధతిని ఏర్పరచుకొని, రోమా సైనికులు గోడ క్రింద సొరంగం చేసి, ద్వారానికి నిప్పంటించాలని ప్రయత్నించారు. ఓ ఘోరమైన భయాందోళన యూదులను కమ్మేసింది.” నగరంలోని క్రైస్తవులు యేసు మాటలను జ్ఞాపకం చేసుకుని, ఓ హేయవస్తువు పరిశుద్ధస్థలంలో ఉందని గ్రహించవచ్చు.a అయితే నగరం ముట్టడివేయబడి ఉండటంతో, యేసు సలహా ఇచ్చిన విధంగా అలాంటి క్రైస్తవులు ఎలా పారిపోగలరు?
7. సా.శ. 66లో, విజయం సమీపంలో ఉన్నప్పుడు రోమీయులు ఏమి చేశారు?
7 చరిత్రకారుడైన ఫ్లేవియస్ జోసీఫస్ ఇలా చెబుతున్నాడు: “ముట్టడింపబడిన వారి నిస్సహాయత గురించి మరియు ప్రజల భావాలను గురించి ఎంతమాత్రం తెలియని సెస్టియస్ [గాలస్] అకస్మాత్తుగా తన సైనికులను వెనుదిరిగి రమ్మని చెప్పాడు, తాను ఎలాంటి అపజయాన్ని అనుభవించకపోయినా ఆశలు వదులుకున్నాడు, సహేతుకతకు పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తూ ఆ నగరం నుండి వెళ్లిపోయాడు.” (యూదా యుద్ధం, II, 540 [xix, 7]) గాలస్ ఎందుకు వెనుదిరిగాడు? కారణం ఏదైనప్పటికీ, అతను వెనుదిరిగి వెళ్లడం క్రైస్తవులు యేసు ఆజ్ఞకు విధేయత చూపేందుకు మరియు కొండల్లో భద్రత పొందడానికి పారిపోయేందుకు వీలు కలిగించింది.
8. యెరూషలేముకు విరుద్ధంగా రోమీయులు చేసిన రెండవ ప్రయత్నం ఏమిటి మరియు తప్పించుకుని సజీవంగా మిగిలి ఉండిన వారు ఏమి అనుభవించారు?
8 విధేయత జీవాన్ని కాపాడేదైవుండింది. కొంత కాలానికే రోమీయులు తిరుగుబాటును అణచివేసేందుకు వచ్చారు. జనరల్ టైటస్ ఆధ్వర్యంలోని పోరాటం, సా.శ. 70లో ఏప్రిల్ నుండి ఆగస్టు వరకూ యెరూషలేమును ముట్టడించడంతో ముగిసింది. యూదులు ఎలా కష్టాన్ని అనుభవించారనే విషయాన్ని గురించిన జోసీఫస్ వివరణను చదివితే మనం భయభ్రాంతులమౌతాం. రోమీయులతో పోరాడుతూ మరణించిన వారుకాక, యూదుల తిరుగుబాటు దండ్ల ద్వారా ఇతర యూదులు చంపబడ్డారు, మరి ఆకలితోమాడటం నరభక్షణకు దారితీసింది. రోమీయులు విజయం సాధించే సమయానికల్లా, 11,00,000 మంది యూదులు మరణించారు.b సజీవంగా మిగిలిన 97,000 మందిలో, కొందరు సత్వరంగా ఉరితీయబడ్డారు; ఇతరులు బానిసలు చేయబడ్డారు. జోసీఫస్ ఇలా చెబుతున్నాడు: “పదిహేడేళ్లకంటే ఎక్కువ వయస్సున్న వారు సంకెళ్లు వేయబడి ఐగుప్తులో కఠోరపరిశ్రమ చేసేందుకు పంపబడ్డారు, మరి టైటస్ అధిక శాతంమందిని థియేటర్లో ఖడ్గం ద్వారా లేక క్రూర మృగాల ద్వారా నాశనమయ్యేందుకు ప్రావిన్సులకు పంపించాడు.” ఇలా విభజించే ఈ ప్రక్రియ జరుగుతున్నప్పటికీ 11,000 మంది ఖైదీలు ఆకలి చావులకు గురయ్యారు.
9. యూదులు అనుభవించిన ప్రతిఫలాన్ని క్రైస్తవులు ఎందుకు అనుభవించలేదు, అయితే ఏ ప్రశ్నలకు సమాధానం రావలసి ఉంది?
9 తాము ప్రభువు హెచ్చరికకు విధేయత చూపి, రోమా సైన్యం తిరిగి రాకముందే నగరంనుండి పారిపోయామని క్రైస్తవులు కృతజ్ఞత కలిగివుండవచ్చు. అలా, యెరూషలేముపై ‘లోకారంభము నుండి అప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు’ అని యేసు పిలిచిన దాని యొక్క కొంత భాగం నుండి వారు తప్పింపబడ్డారు. (మత్తయి 24:21) యేసు ఇంకా ఇలా చెప్పాడు: “ఆ దినములు తక్కువ చేయబడక పోయినయెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.” (మత్తయి 24:22) అది అప్పుడు ఏ అర్థాన్ని కలిగి ఉంది మరియు అది ఇప్పుడు ఏ భావాన్ని కలిగి ఉంది?
10. గతంలో మత్తయి 24:22ను మనము ఎలా వివరించేవారము?
10 ‘తప్పించుకొనే శరీరులు’ అంటే సా.శ. 70లో యెరూషలేముపై వచ్చిన శ్రమను తప్పించుకుని సజీవంగా మిగిలిన యూదులని గతంలో వివరించబడేది. క్రైస్తవులు పారిపోయారు, కాబట్టి రోమీయులు త్వరగా నాశనం తెచ్చేందుకు దేవుడు వారిని అనుమతించవచ్చు. వేరే మాటల్లో చెప్పాలంటే, ‘ఏర్పరచబడినవారు’ ప్రమాదాన్ని తప్పించుకున్నారు అనే విషయాన్నిబట్టి, కొంతమంది యూదా ‘శరీరులు’ తప్పించుకునేందుకు అనుమతిస్తూ, శ్రమ దినాలు తక్కువ చేయబడవచ్చు. సజీవంగా మిగిలిన యూదులు మన కాలంలో వచ్చే మహాశ్రమను తప్పించుకుని సజీవంగా ఉండే వారికి ముంగుర్తుగా ఉన్నారని భావించబడింది.—ప్రకటన 7:14.
11. మత్తయి 24:22 యొక్క వివరణను పునఃపరిశీలించాలని ఎందుకు అనిపిస్తుంది?
11 అయితే, సా.శ. 70లో జరిగిన దానికి ఆ వివరణ అనుగుణ్యంగా ఉందా? శ్రమ నుండి మానవ ‘శరీరులు’ “తప్పింప”బడాలని యేసు చెప్పాడు. 97,000 మందిలోని వేలమంది త్వరలోనే ఆకలి చావులకు గురయ్యారు లేక ఓ థియేటర్లో చంపబడ్డారు అనే వాస్తవం దృష్ట్యా, సజీవంగా మిగిలిన వారిని వివరించేందుకు ‘తప్పింపబడ్డారు’ అనే పదాన్ని మీరు ఉపయోగిస్తారా? కైసరయ నందలి ఒక థియేటర్‌ను గురించి జోసీఫస్ ఇలా చెబుతున్నాడు: “క్రూర మృగాలతో పోరాడటం ద్వారా లేక ఒకరితోఒకరు పోరాడటం ద్వారా లేక సజీవంగా దహింపబడటం ద్వారా నాశనమైన వారి సంఖ్య 2,500కు మించిపోయింది.” వారు ఆ ముట్టడి సమయంలో మరణించకపోయినా, వారు వాస్తవానికి ‘తప్పించబడ’లేదు. యేసు వీరిని రాబోయే “మహాశ్రమ” నుండి తప్పించుకుని సజీవంగా సంతోషంగా మిగిలి ఉండే వారితో సమానంగా చూస్తాడా?
శరీరులు తప్పింపబడుట—ఎలా?
12. దేవుడు ఆసక్తి కలిగి ఉన్న మొదటి శతాబ్దపు ‘ఏర్పరచబడిన వారు’ ఎవరు?
12 సా.శ. 70 కల్లా, దేవుడు సహజ యూదులను తాను ఏర్పరచుకున్న ప్రజలుగా దృష్టించడం మానేశాడు. దేవుడు ఆ జనాంగాన్ని విడనాడాడని మరియు దాని రాజధాని నగరం, దేవాలయం మరియు ఆరాధనావ్యవస్థ అంతమయ్యేందుకు అనుమతిస్తాడని యేసు చూపించాడు. (మత్తయి 23:37–24:2) దేవుడు ఒక క్రొత్త జనాంగాన్ని, ఆత్మీయ ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 15:14; రోమీయులు 2:28, 29; గలతీయులు 6:16) అది అన్ని జనాంగముల నుండి ఏర్పరచుకొనబడి, పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకింపబడిన స్త్రీపురుషులతో కూడినదై ఉంటుంది. (మత్తయి 22:14; యోహాను 15:19; అపొస్తలుల కార్యములు 10:1, 2, 34, 35, 44, 45) సెస్టియస్ గాలస్ దాడి చేయడానికి కొన్ని సంవత్సరాల ముందు, ‘తండ్రియైన దేవుని భవిష్యత్ జ్ఞానమునుబట్టి, ఆత్మవలని పరిశుద్ధత పొందినవారైన . . . ఏర్పరచబడిన వారికి’ పేతురు వ్రాశాడు. ఆత్మాభిషేకం పొందిన అలాంటి వారు “ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధజనమును” అయ్యున్నారు. (1 పేతురు 1:1, 2; 2:9, ఇటాలిక్కులు మావి.) యేసుతోపాటు పరిపాలించేందుకు దేవుడు అలాంటి ఏర్పరచబడిన వారిని పరలోకానికి తీసుకుంటాడు.—కొలొస్సయులు 1:1, 2; 3:12; తీతు 1:1; ప్రకటన 17:14.
13. మత్తయి 24:22 నందలి యేసు మాటలకు ఏ భావం ఉండి ఉంటుంది?
13 “ఏర్పరచబడినవారి నిమిత్తము” శ్రమ దినములు తక్కువ చేయబడతాయని యేసు ముందే చెప్పాడు గనుక, ఏర్పరచబడిన వారిని ఇలా గుర్తించడం సహాయకరంగా ఉంటుంది. “నిమిత్తము” అని అనువదింపబడిన గ్రీకు పదాన్ని “కొరకు” అని కూడా అనువదించవచ్చు. (మార్కు 2:27; యోహాను 12:30; 1 కొరింథీయులు 8:11; 9:10, 23; 11:9; 2 తిమోతి 2:10; ప్రకటన 2:3) కాబట్టి, ‘ఆ దినములు తక్కువ చేయబడక పోయినయెడల ఏ శరీరియు తప్పించుకొనడు. వాస్తవానికి, ఏర్పరచబడినవారి కొరకు ఆ దినములు తక్కువ చేయబడును’ అని యేసు చెప్పి ఉండవచ్చు.c (మత్తయి 24:22) యెరూషలేములో ఇరుక్కుపోయి ఉన్న ఏర్పరచబడిన క్రైస్తవుల ‘కొరకు’ లేక వారికి ప్రయోజనం కలిగించినది ఏదైనా జరిగిందా?
14. సా.శ. 66లో రోమా సైన్యాలు యెరూషలేము నుండి అనుకోని రీతిలో వెనక్కి వెళ్లినప్పుడు ‘శరీరులు’ ఎలా తప్పింపబడ్డారు?
14 సా.శ. 66లో రోమీయులు దేశంలో ప్రవేశించి, ఎగువ యెరూషలేమును ఆక్రమించి, గోడక్రింద సొరంగం చేయడం ప్రారంభించారని జ్ఞాపకంచేసుకోండి. జోసీఫస్ ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “అతను ఇంకొంత సేపు ముట్టడించేందుకు ప్రయత్నించి ఉంటే, అతను వెంటనే నగరాన్ని చెరపట్టగలిగే వాడే.” ‘శక్తివంతమైన రోమా సైన్యం తన పోరాటాన్ని అకస్మాత్తుగా ఆపి, “సహేతుకతకు పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తూ” ఎందుకు వెనుదిరుగుతుంది?’ అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. సైనిక చరిత్రను వివరించడంలో నిపుణుడైన రూపెర్ట్ ఫెర్నో ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “గాలస్ తీసుకున్న విచిత్రమైన మరియు విపత్కరమైన నిర్ణయానికిగల తగినంత కారణాన్ని అందించడంలో ఏ చరిత్రకారుడూ సఫలం కాలేదు.” కారణం ఏదైనప్పటికీ, దాని ఫలితం ఏమంటే శ్రమ తక్కువ చేయబడింది. రోమీయులు వెనుదిరిగారు, వారు వెళ్లిపోతుండగా యూదులు వారిపై దాడి చేశారు. చిక్కుకుపోయి ఉన్న “ఏర్పరచబడిన” అభిషిక్త క్రైస్తవుల విషయమేమిటి? ముట్టడి వేయడం ఆపబడిందంటే, శ్రమ సమయంలో వారికి వాటిల్లగల ఎలాంటి ముప్పునుండి కూడా వారు తప్పింపబడ్డారని అర్థం. కాబట్టి, సా.శ. 66లోని శ్రమను తక్కువ చేయడం ద్వారా ప్రయోజనం పొందిన ఆ క్రైస్తవులే, మత్తయి 24:22 నందు ప్రస్తావించబడిన తప్పించబడిన ‘శరీరులు.’
మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది?
15. మత్తయి 24వ అధ్యాయం ఎడల మన కాలంలో ప్రాముఖ్యంగా ఆసక్తి కలిగి ఉండాలని మీరు ఎందుకు అంటారు?
15 ‘యేసు మాటల యొక్క విశదీకరింపబడిన ఈ అవగాహనలో నేను ప్రత్యేకంగా ఎందుకు ఆసక్తి కలిగి ఉండాలి?’ అని కొందరు అడుగవచ్చు. సా.శ. 70తో సహా అప్పటి వరకూ జరిగినది మాత్రమే కాక యేసు ప్రవచనం విస్తృత పరిధిలో నెరవేర్పును కలిగివుంటుందని తీర్మానించి చెప్పేందుకు తగినంత ఆధారం ఉంది.d (మత్తయి 24:7, 8; లూకా 21:10, 11; ప్రకటన 6:2-8 పోల్చండి.) త్వరలోనే విస్తృత పరిధిలో “మహాశ్రమలు” వస్తాయని మనం అపేక్షించవచ్చని మన కాలంలో జరుగుతున్న ముఖ్య నెరవేర్పు నిరూపిస్తుందని యెహోవాసాక్షులు దశాబ్దాలుగా ప్రకటించారు. ఆ సమయంలో, మత్తయి 24:22 నందలి ప్రవచనార్థక మాటలు ఎలా నెరవేరుతాయి?
16. రాబోతున్న మహాశ్రమ గురించి ప్రకటన ఏ ప్రోత్సాహకరమైన వాస్తవాన్ని అందిస్తుంది?
16 యెరూషలేముపై శ్రమ వచ్చిన దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అపొస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథాన్ని వ్రాశాడు. మహాశ్రమ త్వరలో రాబోతుందని అది నిశ్చయపరిచింది. మనల్ని వ్యక్తిగతంగా ఏది ప్రభావితం చేస్తుందనే విషయంలో ఆసక్తి కలిగి ఉంటూ, రాబోయే ఈ మహాశ్రమను మానవ శరీరులు తప్పించుకుంటారని ప్రకటన ప్రవచనార్థకంగా నిశ్చయతనిస్తుందని తెలుసుకుని మనం ఊరటపొందవచ్చు. ‘ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చే గొప్పసమూహము’ గురించి యోహాను ముందే ప్రవచించాడు. వారెవరు? పరలోకంనుండి ఒక స్వరము ఇలా సమాధానం చెబుతుంది: “వీరు మహాశ్రమలనుండి వచ్చిన వారు.” (ప్రకటన 7:9, 14) అవును, వారు తప్పించుకుని సజీవంగా ఉంటారు! రాబోయే మహాశ్రమల్లో సంగతులు ఎలా వృద్ధి చెందుతాయనే విషయంలో మరియు మత్తయి 24:22 ఎలా నెరవేరుతుందనే విషయంలో కూడా ప్రకటన మనకు అంతర్దృష్టినిస్తుంది.
17. మహాశ్రమ యొక్క ప్రారంభ భాగంలో ఇంకా ఏమి ఇమిడి ఉంటుంది?
17 ఈ శ్రమ యొక్క ప్రారంభభాగం, “మహాబబులోను” అని పిలువబడే సూచనార్థక వేశ్యపై దాడియై ఉంటుంది. (ప్రకటన 14:8; 17:1, 2) అది అబద్ధ మత సామ్రాజ్యాన్ని ప్రతిబింబిస్తుంది, అందులో క్రైస్తవమత సామ్రాజ్యం ప్రముఖ నిందార్హురాలు. ప్రకటన 17:16-18 యొక్క మాటల ప్రకారం, ఈ సూచనార్థక వేశ్యపై దాడి చేయాలన్న తలంపును దేవుడు రాజకీయ విభాగాల హృదయంలో కలిగిస్తాడు.e దేవుని అభిషిక్తులైన “ఏర్పరచుకొనబడిన” వారికి మరియు వారి సహవాసులైన “గొప్ప సమూహము”నకు అది ఎలా కనిపిస్తుందో ఆలోచించండి. మతంపైని వినాశనకరమైన ఈ దాడి కొనసాగుతుండగా, అన్ని మత సంస్థలతో సహా ఇది యెహోవా ప్రజలను కూడా తుడిచి పెడుతుందనిపించవచ్చు.
18. మహాశ్రమ యొక్క ప్రారంభ భాగంలో ఏ ‘శరీరియు’ తప్పింపబడడని ఎందుకు అనిపిస్తుంది?
18 మత్తయి 24:22 నందు కనుగొనబడే యేసు మాటలు ఈ తరుణంలోనే విస్తృత పరిధిలో నెరవేరుతాయి. యెరూషలేములో ప్రమాదంలో ఉండిన ఏర్పరచబడిన వారి వలెనే, ఆ దాడి దేవుని ప్రజలైన ‘శరీరుల’నందరినీ తుడిచి పెడుతుందేమో అన్నట్లు, మతంపై ఆ దాడి జరుగుతున్న సమయంలో యెహోవా సేవకులు నిర్మూలమయ్యే ప్రమాదంలో ఉన్నట్లు వారికి తోచవచ్చు. అయినప్పటికీ, పూర్వం సా.శ. 66లో ఏమి సంభవించిందో మనస్సులో ఉంచుకుందాము. రోమీయులు కలిగించిన శ్రమ తక్కువ చేయబడింది, అది దేవుని అభిషిక్తులైన ఏర్పరచబడిన వారు తప్పించుకుని, సజీవంగా మిగిలి ఉండేందుకు వీలు కలిగించింది. అలా, మతంపైన చేయబడే ఆ వినాశకరమైన దాడి, సత్యారాధికుల భౌగోళిక సంఘాన్ని నిర్మూలించేందుకు అనుమతింపబడదని మనం నిశ్చయతను కలిగి ఉండవచ్చు. ‘ఒక్క దినములో’ అన్నంత త్వరగా అది ముందుకుసాగుతుంది. అయితే, ఏదో విధంగా అది తక్కువ చేయబడుతుంది, దేవుని ప్రజలు “తప్పించు”కొనగలిగేలా, అది తన కార్యాన్ని తుదముట్టించేందుకు అనుమతింపబడదు.—ప్రకటన 18:8.
19. (ఎ) మహాశ్రమ యొక్క మొదటి భాగం తర్వాత, ఏది స్పష్టమౌతుంది? (బి) ఇది దేనికి దారి తీస్తుంది?
19 అపవాదియగు సాతాను యొక్క భూ సంస్థలోని ఇతర భాగాలు, తమ పాత మతపర వేశ్యతో తాము కలిగి ఉండిన సంబంధాలను పోగొట్టుకున్నందుకు విలపిస్తూ, దాని తర్వాత కొంతకాలం కొనసాగుతాయి. (ప్రకటన 18:9-19) దేవుని నిజ సేవకులు, ‘ప్రాకారములులేని గ్రామములుగల దేశములో నిర్భయముగా నివసించుచున్న వారిగా’ ఉన్నారని మరియు సులభంగా అందగల ఆహారమై ఉన్నారని ఒకానొక సమయంలో వారు గమనిస్తారు. వారి కొరకై ఎంతటి ఆశ్చర్యకరమైన విషయం వేచి ఉందో! తన సేవకులకు విరుద్ధంగా జరిగే నిజమైన లేక సంభావ్య దాడికి ప్రతిగా ప్రతిస్పందిస్తూ, మహాశ్రమల చివరి భాగంలో తన శత్రువులకు తీర్పు తీర్చేందుకు దేవుడు చర్య గైకొంటాడు.—యెహెజ్కేలు 38:10-12, 14, 18-23.
20. మహాశ్రమ యొక్క రెండవ భాగం దేవుని ప్రజలను ప్రమాదంలో ఎందుకు పడవేయదు?
20 మహాశ్రమల ఆ రెండవ భాగం, సా.శ. 70లో రోమీయులు చేసిన రెండవ దాడిలో యెరూషలేముకు, దాని వాస్తవ్యులకు సంభవించిన దానితో సమాంతరంగా ఉంటుంది. ‘లోకారంభము నుండి [అప్పటి] వరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోనిదిగా’ అది నిరూపించబడుతుంది. (మత్తయి 24:21) అయితే, దేవుని యొక్క ఏర్పరచబడిన వారు మరియు వారి సహవాసులు చంపబడగల ముప్పులో, ప్రమాదం కలిగే ప్రాంతంలో ఉండరని మనం నిశ్చయతను కలిగి ఉండవచ్చు. ఓహ్, వారు ఒక భౌగోళిక ప్రాంతానికి పారిపోయి ఉండరు. యెరూషలేములో ఉండిన మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఆ నగరంనుండి యొర్దానుకు అవతలనున్న పెల్లా వంటి కొండ ప్రాంతాలకు పారిపోగలిగారు. అయితే, భవిష్యత్తులో దేవుని నమ్మకస్థులైన సాక్షులు భూగోళమంతటా వ్యాపించి ఉంటారు, కాబట్టి భద్రత మరియు కాపుదల అనేది భౌగోళిక ప్రాంతంపై ఆధారపడి ఉండదు.
21. చివరి యుద్ధంలో ఎవరు పోరాడతారు, ఏ ఫలితం వస్తుంది?
21 నాశనమనేది రోమా సైన్యాల ద్వారా లేక ఏ ఇతర మానవ ఏజెన్సీల ద్వారా రాదు. బదులుగా, తీర్పు అమలు చేసే శక్తులు పరలోకంనుండి వచ్చేవని ప్రకటన గ్రంథం వర్ణిస్తుంది. అవును, మహాశ్రమల చివరిభాగం ఏ మానవ సైన్యం ద్వారానూ కాక, పునరుత్థానం చేయబడిన అభిషిక్త క్రైస్తవులతో సహా “పరలోకమందున్న సేనలు” మరియు “దేవుని వాక్యము” అయిన రాజగు యేసుక్రీస్తుకు మద్దతునిస్తుండగా ఆయన ద్వారా జరుగుతుంది. “రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును” అయిన వాడు, సా.శ. 70లో రోమీయులు చేసిన దానికంటే కూడా ఎంతో సమగ్రంగా దాడి కొనసాగిస్తాడు. దేవున్ని వ్యతిరేకించే వారందరినీ అంటే రాజులను, సహస్రాధిపతులను, స్వతంత్రులను, దాసులను, కొద్దివారిని మరియు గొప్పవారిని అది నిర్మూలిస్తుంది. సాతాను ప్రపంచం యొక్క మానవ సంస్థలు కూడా అంతమైపోతాయి.—ప్రకటన 2:26, 27; 17:14; 19:11-21; 1 యోహాను 5:19.
22. ‘శరీరులు’ ఏ అదనపు భావంలో తప్పింపబడతారు?
22 శ్రమ యొక్క మొదటి భాగంలోనే మహాబబులోను త్వరగా మరియు సంపూర్ణంగా నాశనమైనప్పుడు, అభిషిక్త శేషం మరియు “గొప్పసమూహ”మైన ‘శరీరు’లందరూ ఇది వరకే తప్పించుకున్నారని జ్ఞాపకం చేసుకోండి. అదే విధంగా, శ్రమ యొక్క చివరి భాగంలో, యెహోవా వైపున చేరిన ‘శరీరులు’ తప్పించుకుంటారు. సా.శ. 70లోని తిరుగుబాటు దారులైన యూదులకు జరిగిన దానితో ఇది ఎంత వ్యత్యాసం కలిగి ఉంటుందో కదా!
23. సజీవంగా మిగిలిన ‘శరీరులు’ దేని కొరకు ఎదురుచూడగలరు?
23 మీ స్వంత భవిష్యత్తులో మరియు మీకు ప్రియమైన వారి భవిష్యత్తులో కలిగివుండగల సాధ్యతలను గురించి ఆలోచిస్తూ, ప్రకటన 7:16, 17నందు ఏమి వాగ్దానం చేయబడిందో గమనించండి: “వారికి ఇకమీదట ఆకలియైనను దాహమైనను ఉండదు, సూర్యుని యెండయైనను ఏ వడగాలియైనను వారికి తగులదు, ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొఱ్ఱెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును.” అది తప్పకుండా, అద్భుతమైన నిరంతర భావంలో వాస్తవంగా ‘తప్పింపబడటం.’
[అధస్సూచీలు]
a 1996, జూన్ 1, కావలికోట 14-19 పేజీలను చూడండి.
b జోసీఫస్ ఇలా చెబుతున్నాడు: “టైటస్ లోపలికి ప్రవేశించినప్పుడు నగరం యొక్క పటిష్ఠతను చూసి ఆశ్చర్యపోయాడు . . . అతను ఆశ్చర్యంతో బిగ్గరగా ఇలా అన్నాడు: ‘దేవుడు మన వైపున్నాడు; ఈ పటిష్ఠమైన దుర్గం నుండి యూదులను క్రిందికి దింపినది దేవుడే; అలాంటి దుర్గాలకు విరుద్ధంగా మానవ హస్తాలు లేక పరికరాలు ఏమి చేయగలవు?’”
c మత్తయి 24:22ను గురించిన షెమ్-టోబ్ యొక్క పాఠ్యభాగం అ·వుర్ʹ అనే హెబ్రీ పదాన్ని ఉపయోగించిందన్నది ఆసక్తికరమైన విషయం, దానికి “కొరకు, నిమిత్తము, కొరకై” అనే భావాలు ఉన్నాయి.—దీనికి ముందున్న శీర్షికలోని 13వ పేజీని చూడండి.
d 1994, ఫిబ్రవరి 15, కావలికోట యొక్క 11 మరియు 12 పేజీలను మరియు మత్తయి 24వ అధ్యాయం, మార్కు 13వ అధ్యాయం మరియు లూకా 21వ అధ్యాయాలందు కనుగొనబడే యేసు ప్రవచనార్థక సమాధానాన్ని సమాంతర కాలమ్‌లలో పొందుపర్చబడి ఉన్న 14, 15 పేజీలలో కనుగొనబడే చార్టును చూడండి.
e వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు 1994లో ప్రచురించిన ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! నందలి 235-58 పేజీలు చూడండి.
మీరెలా సమాధానం ఇస్తారు?
◻ రోమా సైన్యాలు యెరూషలేమును ఏ రెండు దశలుగా ముట్టడించారు?
◻ సా.శ. 70లో తప్పించుకుని సజీవంగా మిగిలిన 97,000 మంది యూదులు, మత్తయి 24:22 నందు ప్రస్తావించబడిన ‘శరీరులు’ ఎందుకు కారు?
◻ యెరూషలేము యొక్క శ్రమ దినాలు ఎలా తక్కువ చేయబడ్డాయి, అలా ‘శరీరులు’ ఎలా తప్పించుకున్నారు?
◻ రాబోతున్న మహాశ్రమలో, దినాలు ఎలా తక్కువ చేయబడతాయి మరియు ‘శరీరులు’ ఎలా తప్పించబడతారు?
[16వ పేజీలోని చిత్రం]
తిరుగుబాటు తర్వాత ముద్రింపబడిన యూదా నాణెం. హెబ్రీ అక్షరాలు “సంవత్సరం రెండు” అని చెబుతున్నాయి, అంటే సా.శ. 67, అది వారి స్వయంపాలనలోని రెండవ సంవత్సరం
[క్రెడిట్ లైను]
Pictorial Archive (Near Eastern History) Est.
[17వ పేజీలోని చిత్రం]
సా.శ. 71లో ముద్రింపబడిన రోమా నాణెం. ఎడమ వైపు సాయుధుడైన రోమీయుడు; కుడి వైపు విలపిస్తున్న యూదురాలు. యూదైయా కాప్టా అనే పదాల భావం “బందీయైన యూదయ”
[క్రెడిట్ లైను]
Pictorial Archive (Near Eastern History) Est.