“చదువువాడు గ్రహించుగాక”
“నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానే . . . యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను.”—మత్తయి 24:15, 16.
1. లూకా 19:43, 44లలో ఉన్న, యేసు ఇచ్చిన హెచ్చరికకు ఎలాంటి ప్రతిస్పందన లభించింది?
సమీపిస్తున్న విపత్తు విషయంలో మనం హెచ్చరించబడడం, ఆ విపత్తు నుండి మనం తప్పించుకొనేలా సహాయం చేయగలదు. (సామెతలు 22:3) కాబట్టి సా.శ. 66లో రోమన్లు దాడి చేసిన తర్వాత యెరూషలేములో ఉన్న క్రైస్తవుల పరిస్థితిని ఊహించండి. యెరూషలేము నగరం దండ్లచేత చుట్టబడి నాశనం చేయబడుతుందని యేసు హెచ్చరించాడు. (లూకా 19:43, 44) అనేకమంది యూదులు ఆయన హెచ్చరికను అలక్ష్యంచేశారు. కానీ ఆయన శిష్యులు ఆయన హెచ్చరికను లక్ష్యపెట్టారు. తత్ఫలితంగా, వాళ్లు సా.శ. 70లో వచ్చిన విపత్తు నుండి రక్షించబడ్డారు.
2, 3. మత్తయి 24:15-21లలో రాయబడిన యేసు ప్రవచనంలో మనం ఎందుకు ఆసక్తిని కల్గివుండాలి?
2 నేడు మనకు కూడా అన్వర్తించే వాటిని కల్గివున్న ఒక ప్రవచనంలో యేసు యుద్ధాలు, కరువులు, భూకంపాలు, తెగుళ్లు, దేవుని రాజ్యాన్ని గూర్చి ప్రకటించే క్రైస్తవుల్ని హింసించడం, వంటివి చేరివున్న ఒక సంయుక్త సూచన గురించి తెలియజేశాడు. (మత్తయి 24:4-14; లూకా 21:10-19) అంతం సమీపించిందని తెలుసుకునేలా తన శిష్యులకు సహాయపడగల ఒక సంకేతాన్ని అంటే ఒక ‘నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలబడడాన్ని’ గురించి యేసు తెలియజేశాడు కూడా. (మత్తయి 24:15) ఆ అర్థవంతమైన మాటలు మన జీవితాలను ఇప్పుడూ, భవిష్యత్తులోనూ ఎలా ప్రభావితం చేయగలవో గ్రహించేందుకు మనం వాటిని పునఃపరిశీలిద్దాం.
3 ఆ సంయుక్త సూచనను గురించి తెలియజేసిన తర్వాత, యేసు ఇలా అన్నాడు: “ప్రవక్తయైన దానియేలుద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానే—చదువువాడు గ్రహించుగాక—యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను, మిద్దెమీద ఉండువాడు తన యంటిలోనుండి ఏదైనను తీసికొని పోవుటకు దిగకూడదు; పొలములో ఉండువాడు, తన బట్టలు తీసికొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు.”—మత్తయి 24:15-21.
4. మత్తయి 24:15 మొదటి శతాబ్దంలో ఒక నెరవేర్పును కల్గివుందని ఏది సూచిస్తోంది?
4 మార్కు, లూకా సువార్త వృత్తాంతాలు దానికి అదనపు వివరణలను ఇస్తున్నాయి. “పరిశుద్ధస్థలమందు నిలుచుట” అని మత్తయి ఉపయోగించిన పదబంధం స్థానే మార్కు 13:14 “నిలువరాని స్థలమందు నిలుచుట” అనే పదబంధాన్ని ఉపయోగిస్తోంది. లూకా 21:20 యేసు మాటలను ఇంకా ఇలా తెలియజేస్తోంది: “యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి.” అది, మొదటి నెరవేర్పులో యెరూషలేముపైనా, దాని ఆలయంపైనా అంటే యూదులకే పరిశుద్ధ స్థలంగా ఉండి, యెహోవా దృష్టిలో ఇక ఎంత మాత్రం పరిశుద్ధ స్థలంగాలేని యెరూషలేము ఆలయంపైనా రోమన్లు చేసిన దాడి చేరివుందని గ్రహించేలా మనకు సహాయపడుతుంది. ఆ దాడి సా.శ. 66లో ఆరంభమైంది. సా.శ. 70లో రోమన్లు ఆ నగరాన్నీ, ఆలయాన్నీ రెండింటినీ నాశనం చేసినప్పుడు పూర్తి నాశనం జరిగింది. అయితే అప్పట్లో “హేయవస్తువు” ఏమైవుంది? అది ఎలా ‘పరిశుద్ధస్థలమందు నిలుచుంది’? ఆ ప్రశ్నలకు జవాబులు, ఆధునిక కాల నెరవేర్పును స్పష్టంచేసుకోవడానికి సహాయపడతాయి.
5, 6. (ఎ) దానియేలు 9వ అధ్యాయాన్ని చదివేవారికి గ్రహణశక్తి ఎందుకు అవసరం? (బి) ‘హేయవస్తువును’ గూర్చిన యేసు ప్రవచనం ఎలా నెరవేరింది?
5 చదువువారిని తమ గ్రహణశక్తిని ఉపయోగించమని యేసు ఉద్బోధించాడు. దేన్ని చదివేవారు? బహుశా, దానియేలు 9వ అధ్యాయాన్ని అయ్యుండవచ్చు. అక్కడ, మెస్సీయా ఎప్పుడు కనిపిస్తాడో సూచించే, అటు తర్వాత మూడున్నర సంవత్సరాలకు ఆయన “నిర్మూలము” చేయబడతాడని ముందుగా తెలియజేసే ఒక ప్రవచనాన్ని మనం చూస్తాం. ఆ ప్రవచనమిలా అంటోంది: “హేయమైనది నిలుచువరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావలెనని నిర్ణయంచిన నాశనము ముగించువరకు ఈలాగున జరుగును.”(ఇటాలిక్కులు మావి.)—దానియేలు 9:26, 27; దానియేలు 11:31; 12:11 కూడా చూడండి.
6 యేసు ఆ మాటల్ని చెప్పిననాటికి దాదాపు 200 ఏండ్ల క్రితం అంటియొకస్ IV ఆలయాన్ని అపవిత్రపర్చినప్పుడు, అది అన్వయించబడిందని యూదులు తలంచారు. అయితే యేసు గ్రహించమని ఉద్బోధిస్తూ ఆ లేఖన భాగాన్ని మరోవిధంగా అన్వయించాడు, ఎందుకంటే “హేయవస్తువు” భవిష్యత్తులో కన్పించి, “పరిశుద్ధస్థలమందు” నిలబడనైవుంది. సా.శ. 66లో విలక్షణమైన పతాకాలతో రానైవున్న రోమా సైన్యాన్ని యేసు సూచిస్తున్నాడన్న విషయం సుస్పష్టం. దీర్ఘకాలంగా ఉపయోగంలో ఉన్న అలాంటి పతాకాలు ఒక విధమైన విగ్రహాలుగా పరిగణించబడేవి. వాటిని యూదులు హేయమైనవిగా దృష్టించేవారు.a అయితే, వాళ్లు ఎప్పుడు ‘పరిశుద్ధస్థలమందు నిలుచుంటారు’? యూదులు పరిశుద్ధమైనదిగా పరిగణించిన యెరూషలేముపైనా, దాని ఆలయంపైనా రోమా సైన్యం తమ పతాకాలతో వచ్చి దాడిచేసినప్పుడు అది జరిగింది. రోమా సైన్యాలు ఆలయ ప్రాంతపు గోడక్రింద భాగాన్ని తొలచనారంభించారు కూడా. నిజమే, ఎంతో కాలం నుండి హేయమైనదిగా ఉన్నది ఇప్పుడు పరిశుద్ధస్థలమందు నిలిచింది!—యెషయా 52:1; మత్తయి 4:5; 27:53; అపొస్తలుల కార్యములు 6:13.
ఆధునిక దిన “హేయవస్తువు”
7. యేసు చెప్పిన ఏ ప్రవచనం మనకాలంలో నెరవేరుతూ ఉన్నది?
7 మత్తయి 24వ అధ్యాయంలో రాయబడివున్న యేసు ఇచ్చిన సూచన, మొదటి ప్రపంచయుద్ధకాలం నుండీ విస్తృతంగా నెరవేరుతుండడాన్ని మనం చూస్తున్నాం. అయినప్పటికీ, ఆయన మాటల్ని జ్ఞప్తికి తెచ్చుకోండి: “నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానే . . . యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను.” (మత్తయి 24:15, 16) ప్రవచనంలోని ఈ భాగం, మన కాలంలో కూడా ఒక నెరవేర్పును కల్గివుండాలి.
8. సంవత్సరాలుగా, ఆధునికకాలంలోని ‘హేయవస్తువు’ను యెహోవాసాక్షులు ఎలా బయల్పరిచారు?
8 ఆ ప్రవచనం నెరవేరుతుందన్న యెహోవా సేవకుల నమ్మకాన్ని ప్రదర్శిస్తూ మధ్య ప్రాచ్యదేశాల్లో జరుగుతున్న పురోభివృద్ధులకు సంబంధించిన దానిపై జనవరి 1, 1921నాటి కావలికోట (ఆంగ్లం) కేంద్రీకరించింది. అటు తర్వాత డిసెంబరు 15, 1929నాటి కావలికోట (ఆంగ్లం) సంచిక 374వ పేజీలో నిర్ద్వంద్వంగా ఇలా తెలియజేసింది: “నానాజాతి సమితి యొక్క యావత్ ఉద్దేశం ఏమిటంటే ప్రజలను దేవుని నుండీ, క్రీస్తునుండీ దూరం చేయాలన్నదే, కాబట్టి అది సాతాను ఉత్పత్తిచేసిన ఒక హేయవస్తువు, దేవుని దృష్టికి అసహ్యకరమైనది.” అలా 1919లో ‘హేయవస్తువు’ కన్పించింది. కాలక్రమేణా, నానాజాతి సమితి స్థానంలోకి ఐక్యరాజ్య సమితి వచ్చింది. ఈ మానవ శాంతి సంస్థలు దేవుని దృష్టిలో హేయవస్తువులని యెహోవాసాక్షులు ఎంతో కాలం క్రిందటే బయల్పరిచారు.
9, 10. మహాశ్రమను గురించిన తొలి అవగాహన, ‘హేయవస్తువు’ పరిశుద్ధస్థలమందు నిలబడే సమయాన్ని గురించిన మన దృక్కోణాన్ని ఎలా ప్రభావితం చేసింది?
9 దీనికి ముందున్న శీర్షిక, మత్తయి 24, 25 అధ్యాయాల్లోని అనేక భాగాలకు సంబంధించి స్పష్టపర్చబడిన దృక్కోణాన్ని సంక్షిప్తంగా తెలియజేసింది. ‘పరిశుద్ధస్థలమందు హేయవస్తువు నిలబడడాన్ని’ గురించి కొంత స్పష్టపర్చడం సముచితమేనా? సముచితమే. యేసు ప్రవచనం, ‘పరిశుద్ధస్థలమందు నిలబడడాన్ని’ ముందుగా చెప్పబడిన “మహా శ్రమ” ఆకస్మిక ఆరంభంతో సన్నిహితంగా ముడిపెడుతోంది. కాబట్టి, “హేయవస్తువు” ఎప్పటినుండో ఉనికిలో ఉన్నప్పటికీ, అది ‘పరిశుద్ధస్థలమందు నిలబడడానికీ,’ మహాశ్రమకూ మధ్యనున్న సంబంధం మన ఆలోచనను ప్రభావితం చేయాలి. ఏ విధంగా?
10 మహాశ్రమ మొదటి దశ 1914లో ప్రారంభమైందనీ, దాని చివరి దశ అర్మగిద్దోను యుద్ధమందు వస్తుందనీ దేవుని ప్రజలు ఒకప్పుడు అర్థంచేసుకున్నారు. (ప్రకటన 16:14, 15; పోల్చండి కావలికోట (ఆంగ్లం) ఏప్రిల్ 1, 1939, పేజీ 110.) కాబట్టి, మొదటి ప్రపంచ సంగ్రామం తర్వాత త్వరలోనే ఆధునికకాల “హేయవస్తువు” పరిశుద్ధస్థలమందు నిలబడివుండాలని ఒకప్పుడు ఎందుకు తలంచడం జరిగిందో మనం అర్థంచేసుకోవచ్చు.
11, 12. మహాశ్రమకు సంబంధించి సవరించబడిన ఏ దృక్కోణం 1969లో ఇవ్వబడింది?
11 అయితే, తర్వాతి సంవత్సరాల్లో విషయాలు అందుకు భిన్నంగా ఉన్నట్టు మనం చూశాం. న్యూయార్క్ నగరంలో జరిగిన “భూమిపై సమాధానము” అనే అంతర్జాతీయ సమావేశంలో 1968 జూలై 10, గురువారంనాడు, వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ అప్పటి ఉపాధ్యక్షుడైన ఎఫ్. డబ్ల్యు. ఫ్రాన్జ్ శక్తివంతమైన ఒక ప్రసంగాన్ని ఇచ్చారు. యేసు ప్రవచనానికి సంబంధించి మునుపున్న అవగాహనను పునఃసమీక్షిస్తూ, సహోదరుడు ఫ్రాన్జ్ ఇలా అన్నారు: “‘మహాశ్రమ’ సా.శ. 1914లో ప్రారంభమైందనీ, పూర్తిస్థాయిలో తన ప్రభావాన్ని చూపించేలా దాన్ని అనుమతించడానికి బదులు దేవుడు 1918 నవంబరులో మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఆపుచేశాడనీ వివరించడం జరిగింది. అప్పటినుండీ దేవుడు, అర్మగిద్దోను యుద్ధంలో ‘మహా శ్రమ’ యొక్క చివరి దశ పునఃప్రారంభమవ్వడానికి తాను అనుమతించే ముందు, ఏర్పర్చబడిన క్రైస్తవుల అభిషిక్త శేషము యొక్క కార్యకలాపాల కోసం ఒక విరామాన్ని అనుమతించాడు.”
12 అప్పుడు, సవరించబడిన ఒక ప్రాముఖ్యమైన వివరణ ఇవ్వబడింది: “మొదటి శతాబ్దంలో జరిగిన సంఘటనలకు సరిపోయే విధంగా ఉండేందుకుగాను . . . సాదృశ్య ‘మహా శ్రమ’ 1914లో ప్రారంభంకాలేదు. బదులుగా, యెరూషలేముకు ఆధునిక సాదృశ్యమైయున్న దాని విషయంలో, . . . 1914-1918 కాలమందు జరిగినది ‘వేదనలకు ప్రారంభం’ మాత్రమే. ఇక ఎప్పుడూ కలుగబోనటువంటి ‘మహా శ్రమ’ ముందున్నది, ఎందుకంటే అది (క్రైస్తవమత సామ్రాజ్యంతోసహా) ప్రపంచ అబద్ధమత సామ్రాజ్య వినాశనమై ఉంటుంది, తదనంతరం . . . అర్మగిద్దోనునందు “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము” జరుగుతుంది. అంటే దాని భావం మహాశ్రమ అంతా ముందున్నదనే.
13. ‘హేయవస్తువు’ భవిష్యత్తులో ‘పరిశుద్ధస్థలమందు నిలుచుంటుందని’ చెప్పడం ఎందుకు సహేతుకమైనది?
13 ‘హేయవస్తువు’ పరిశుద్ధస్థలమందు ఎప్పుడు నిలువబడుతుందనేది గ్రహించడంపై అది ప్రత్యక్ష ప్రభావాన్ని కల్గివుంది. మొదటి శతాబ్దంలో జరిగినదాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. రోమా సైన్యం సా.శ. 66లో యెరూషలేముపై దాడిచేసినా, వాళ్లు ఆకస్మికంగా విరమించుకొని వెనుదిరిగిపోయారు. అలా వెనక్కి వెళ్లిపోవడం, ‘శరీరులు’ అంటే క్రైస్తవులు తప్పించబడడానికి వీలు కల్పించింది. (మత్తయి 24:22) అదే విధంగా, మహాశ్రమ త్వరలోనే ప్రారంభమౌతుందనీ, అయితే దేవుడు ఏర్పర్చుకున్నవారి నిమిత్తం ఆ దినములు తక్కువచేయబడతాయనీ మనం ఎదురుచూస్తాం. ఈ కీలకమైన విషయాన్ని గమనించండి: ఆ ప్రవచన మొదటి నెరవేర్పులో ‘పరిశుద్ధస్థలమందు నిలుచున్న హేయవస్తువు,’ సా.శ. 66లో జనరల్ గాలస్ ఆధ్వర్యంలో జరిగిన రోమన్లదాడికి ముడిపెట్టబడింది. ఆ దాడికి ఆధునికకాల సమాంతరం, అంటే మహాశ్రమ ప్రారంభం ఇంకా ముందుంది. కాబట్టి 1919 నుండీ ఉనికిలో ఉన్న ‘నాశనకరమైన హేయవస్తువు,’ పరిశుద్ధస్థలమందు నిలువనైవుందని రుజువవుతుంది.b అదెలా జరుగుతుంది? మనమెలా ప్రభావితమౌతాం?
భవిష్యత్తులో జరగబోయే దాడి
14, 15. అర్మగిద్దోనుకు నడిపించే సంఘటనల్ని అర్థంచేసుకునేందుకు ప్రకటన 17వ అధ్యాయం మనకు ఎలా సహాయం చేస్తుంది?
14 ప్రకటన గ్రంథం, భవిష్యత్తులో అబద్ధమతంపై జరగబోయే ఒక వినాశనకరమైన దాడిని గురించి వర్ణిస్తోంది. 17వ అధ్యాయం, “వేశ్యలకు . . . తల్లియైన మహా బబులోను”కు అంటే ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యానికి దేవుడు తీర్చిన తీర్పును గురించి తెలియజేస్తోంది. క్రైస్తవమత సామ్రాజ్యం ఒక ముఖ్యమైన పాత్రను నిర్వహిస్తూ, దేవునితో ఒక నిబంధన సంబంధాన్ని కల్గివున్నానని చెప్పుకుంటోంది. (పోల్చండి యిర్మీయా 7:4.) క్రైస్తవమత సామ్రాజ్యంతోపాటు అబద్ధమతాలు “భూరాజుల”తో దీర్ఘకాలంగా అక్రమ సంబంధాల్ని కల్గివున్నాయి. అయితే, ఆ మతాలు నాశనమవ్వడంతో ఆ సంబంధం అంతమవుతుంది. (ప్రకటన 17:2, 5) ఎవరి చేతుల్లో నాశనమవుతుంది?
15 కొంతకాలంపాటు ఉండి, కనుమరుగైపోయి మరలా వచ్చే “ఎఱ్ఱని మృగము”ను గురించి ప్రకటన గ్రంథం వర్ణిస్తోంది. (ప్రకటన 17:3, 8) ఆ మృగానికి ప్రపంచ నేతల మద్దతు ఉంటుంది. ఆ సూచనార్థక మృగం, 1919లో [ఒక ‘హేయవస్తువు’ అయిన] నానాజాతి సమితిగా ఉనికిలోనికి వచ్చి, ఇప్పుడు ఐక్యరాజ్య సమితిగా చెలామణి అవుతున్న ఒక శాంతి సంస్థ అని గుర్తించేందుకు ప్రవచనంలో ఇవ్వబడిన వివరాలు మనకు సహాయపడతాయి. దేవుడు, ఆ ‘మృగము’లో ప్రముఖులైన కొంతమంది మానవ నేతలకు ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యాన్ని నాశనం చేయాలన్న బుద్ధిపుట్టించనై ఉన్నాడని ప్రకటన 17:16, 17లు చూపిస్తున్నాయి. ఆ దాడి, మహాశ్రమ ఆరంభానికి గుర్తుగా ఉంటుంది.
16. మతానికి సంబంధించి గమనించదగిన ఏ పురోభివృద్ధులు జరుగుతున్నాయి?
16 మహాశ్రమ భవిష్యత్తులో ఆరంభంకానైవుంది గనుక, ‘పరిశుద్ధస్థలమందు నిలబడడం’ ఇంకా భవిష్యత్తులో జరుగనైవుందా? అవునని స్పష్టమౌతుంది. ఈ శతాబ్దపు ఆరంభంలో ‘హేయవస్తువు’ కన్పించి, మరి ఆ విధంగా దశాబ్దాలుగా ఉనికిలో ఉన్నప్పటికీ, అది సమీప భవిష్యత్తులో ‘పరిశుద్ధస్థలమందు’ అసమానమైన రీతిలో నిలబడుతుంది. ‘పరిశుద్ధస్థలమందు నిల్చోవడం’ ఎలా పురోభివృద్ధిచెందుతుందన్న విషయాన్ని చూడడానికి మొదటి శతాబ్దంలోని క్రీస్తు అనుచరులు ఎంతో అప్రమత్తంగా ఉన్నట్టుగానే, ఆధునికకాలంలోని క్రైస్తవులు కూడా అప్రమత్తంగా ఉంటారు. నిజమే, వివరాలన్నింటినీ తెలుసుకోవడానికి మనం వాస్తవమైన నెరవేర్పు జరిగేంతవరకూ వేచివుండాలని ఒప్పుకోవాల్సిందే. అయినప్పటికీ, కొన్ని దేశాల్లో మతంపట్ల ఇప్పటికే స్పష్టమైన అసహనం పెరిగిపోతుండడం గమనించదగిన విషయం. నిజ విశ్వాసాన్నుండి వైదొలగిపోయిన మునుపటి క్రైస్తవులతో జతగూడి కొన్ని రాజకీయ శక్తులు, సామాన్యంగా మతానికి వ్యతిరేకంగా, ప్రత్యేకంగా చెప్పాలంటే నిజ క్రైస్తవులకు వ్యతిరేకంగా విద్వేషాన్ని రేకెత్తిస్తున్నాయి. (కీర్తన 94:20, 21; 1 తిమోతి 6:20, 21) తత్ఫలితంగా, రాజకీయ శక్తులు ఇప్పుడు కూడా “గొఱ్ఱెపిల్లతో యుద్ధము” చేస్తున్నాయి. ప్రకటన 17:14 సూచిస్తున్నట్లుగా, ఆ యుద్ధం తీవ్రతరమౌతుంది. అవి అక్షరార్థంగా తమ చేతుల్ని దేవుని గొఱ్ఱెపిల్లపైకి అంటే ఉన్నతపర్చబడిన, మహిమపర్చబడిన స్థితిలో ఉన్న యేసుక్రీస్తుపైకి ఎత్తలేకపోయినప్పటికీ, దేవుని సత్యారాధకులపై, మరి ముఖ్యంగా ఆయన “పరిశుద్ధు”లపై తమ వ్యతిరేకతను మరింతగా వ్యక్తపరుస్తాయి. (దానియేలు 7:25; పోల్చండి రోమీయులు 8:27; కొలొస్సయులు 1:2; ప్రకటన 12:17.) గొఱ్ఱెపిల్లా, ఆయనతో ఉన్నవారూ విజేతలౌతారనే దైవిక అభయం మనకుంది.—ప్రకటన 19:11-21.
17. మనం పిడివాదులుగా ఉండకుండా, ‘హేయవస్తువు’ పరిశుద్ధస్థలమందు ఎలా నిలబడుతుందనేదాని గురించి మనమేమి చెప్పవచ్చు?
17 అబద్ధ మతానికి నాశనం వేచివుందని మనకు తెలుసు. మహా బబులోను “పరిశుద్ధుల రక్తము”ను త్రాగి, మహారాణిలా ప్రవర్తించినా, దాని నాశనం మాత్రం తథ్యం. భూరాజులపై అది చూపించిన అపవిత్రమైన ప్రభావం నాటకీయంగా మారనైవుంది. వాళ్లమధ్యనున్న ఆ సంబంధం ‘పది కొమ్ములుగల మృగము’ చూపించే హింసాపూరిత విద్వేషంగా మారుతుంది. (ప్రకటన 17:6, 16; 18:7, 8) ‘ఎఱ్ఱని మృగము’ మత వేశ్యపై దాడిచేసినప్పుడు, క్రైస్తవమత సామ్రాజ్యపు నామకార్థ పరిశుద్ధస్థలమందు ‘హేయవస్తువు’ భయంకరమైన రీతిలో నిలబడుతుంది.c కాబట్టి, తననుతాను పరిశుద్ధమైనదాన్నిగా చిత్రించుకుంటున్న విశ్వాసంలేని క్రైస్తవమత సామ్రాజ్యానికి వినాశనం ఆరంభమౌతుంది.
‘పారిపోవడం’—ఎలా?
18, 19. ‘కొండలకు పారిపోవడం’ అంటే మతాన్ని మార్చుకోవడంకాదని చూపించడానికి ఏ కారణాలు ఇవ్వబడ్డాయి?
18 ‘హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలబడడాన్ని’ గురించి ప్రవచించిన తర్వాత, గ్రహించగల వ్యక్తులను చర్య తీసుకోమని యేసు హెచ్చరించాడు. ‘హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలువబడే’ ఆ ఆఖరి క్షణంలో అనేకమంది ప్రజలు అబద్ధ మతాన్ని విడిచి పారిపోయి, సత్యారాధనను చేపడతారని ఆయన చెబుతున్నాడా? కానేకాదు. మొదటి నెరవేర్పును పరిశీలించండి. యేసు ఇలా అన్నాడు: “యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; మిద్దెమీద ఉండువాడు ఇంటిలోనుండి ఏదైనను తీసికొనిపోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు; పొలములో ఉండువాడు తన వస్త్రము తీసికొనిపోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికిని శ్రమ. అది చలికాలమందు సంభవింపకుండవలెనని ప్రార్థించుడి.”(ఇటాలిక్కులు మావి.)—మార్కు 13:14-18.
19 యూదా ఆరాధనా కేంద్రస్థానం నుండి వాళ్లు వెళ్లిపోవాల్సి ఉందని చెప్తున్నట్టుగా, ఆయన యెరూషలేములో ఉన్న ప్రజలు మాత్రమే తరలిపోవాల్సి ఉందని చెప్పడంలేదు; లేక ఆయన చేసిన హెచ్చరిక అబద్ధ మతాన్ని విడిచి పారిపోయి సత్యమైన మతాన్ని చేపట్టాలనే మత మార్పిడిని గురించి ప్రస్తావించడంలేదు. ఒక మతం నుండి మరో మతానికి పారిపోవడం గురించి యేసు శిష్యులకు ఏ విధమైన హెచ్చరికా అవసరం లేదన్నది ఖచ్చితం. వాళ్లు అప్పటికే నిజ క్రైస్తవులయ్యారు. సా.శ. 66లో జరిగిన దాడి, యెరూషలేములోనూ, యూదయ ప్రాంతమంతటిలోనూ ఉన్న యూదా మతస్థులను ఆ మతాన్ని విడనాడి క్రైస్తవత్వాన్ని అంగీకరించేలా ప్రేరేపించలేదు. పారిపోతున్న రోమన్లను తరుముకుంటూ వెళ్లిన వారు నగరానికి తిరిగి వచ్చారని ప్రొఫెసర్ హైన్‌రిక్ గ్రెట్స్ ఇలా అంటున్నారు: “యూదా తిరుగుబాటుదార్లు, (అక్టోబరు 8న) బిగ్గరగా విజయోత్సాహంతో జయ గీతాల్ని పాడుకుంటూ యెరూషలేముకు తిరిగి వచ్చారు, స్వేచ్ఛా స్వాతంత్ర్యపు ఆనందమయ నిరీక్షణతో వాళ్ల హృదయాలు ఉప్పొంగాయి. . . . వారి పితరులకు సహాయం చేసినట్టుగానే దేవుడు వారికి దయాపూర్వకంగా సహాయంచేయలేదా? తిరుగుబాటుదార్లు భవిష్యత్తు గురించి బొత్తిగా భయపడలేదు.”
20. ‘కొండలకు పారిపొమ్మని’ యేసు ఇచ్చిన హెచ్చరికకు తొలి శిష్యులు ఎలా ప్రతిస్పందించారు?
20 అయితే, సంఖ్యాపరంగా చూస్తే తక్కువమందే ఉన్న ఆ కాలంనాటి ఏర్పర్చబడినవారు యేసు సలహాకు అనుగుణంగా ఎలా పనిచేశారు? యూదాను విడిచిపెట్టి యొర్దానుకు అవతలవున్న కొండలకు పారిపోవడం ద్వారా, వాళ్లు తాము రాజకీయంగానైనా, మతపరంగానైనా యూదా విధానంలో భాగంకామని చూపించుకున్నారు. వాళ్లు పొలాల్నీ, ఇళ్లనూ విడిచిపెట్టారు. తమ ఇళ్లల్లో నుండి తమకున్న వాటిని తీసుకొనివెళ్లడానికి కూడా వాళ్లు ప్రయత్నించలేదు. యెహోవా దేవుని కాపుదల, మద్దతులపై నమ్మకముంచి, వాళ్లు ప్రాముఖ్యమైందిగా కన్పించే వేటికన్నా ఆయన ఆరాధనకే ప్రథమస్థానం ఇచ్చారు.—మార్కు 10:29, 30; లూకా 9:57-62.
21. ‘హేయవస్తువు’ దాడి చేస్తున్నప్పుడు, ఏం జరుగుతుందని మనం ఎదురుచూడాల్సిన అవసరంలేదు?
21 ఇప్పుడు, విస్తృత నెరవేర్పును గురించి పరిశీలించండి. అబద్ధ మతాన్ని విడిచి, సత్యారాధనను చేపట్టమని అనేక దశాబ్దాలుగా మనం ప్రజలకు ఉద్బోధిస్తున్నాం. (ప్రకటన 18:4, 5) లక్షలాదిమంది అలా చేశారు. ఒక్కసారి మహాశ్రమ ఆరంభంకాగానే ప్రజలు పెద్ద సంఖ్యలో పరిశుద్ధారాధనవైపుకు మరలుతారని యేసు ప్రవచనం సూచించడం లేదు; సా.శ. 66లో నిశ్చయంగా ప్రజలు పెద్ద ఎత్తున మతమార్పిడి చేసుకోలేదు. అయినప్పటికీ, యేసు ఇచ్చిన హెచ్చరికను అన్వయించుకొని, పారిపోవడానికి నిజ క్రైస్తవులు గొప్ప ప్రేరణను కల్గివుంటారు.
22. కొండలకు పారిపొమ్మన్న యేసు సలహాను మనం అన్వయించుకోవడంలో ఏం చేరివుండవచ్చు?
22 మహాశ్రమను గురించి మనం ప్రస్తుతం పూర్తి వివరాలను పొందలేము. కానీ యేసు చెప్పిన పారిపోవడం అనేది మన విషయంలో, భౌగోళికంగా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పారిపోవడంకాదనే ముగింపుకు మనం సహేతుకంగా రావచ్చు. దేవుని ప్రజలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, చెప్పాలంటే ప్రతీ ప్రాంతంలోనూ ఉన్నారు. అయితే, పారిపోవడం ఆవశ్యకమైనప్పుడు, క్రైస్తవులు తమకూ, అబద్ధ మత సంస్థలకూ మధ్య ఒక స్పష్టమైన తేడాను చూపించడంలో కొనసాగాల్సిందే. వస్త్రాల్నిగానీ, ఇతర వస్తువుల్నిగానీ తీసుకోవడానికి ఒకడు తన ఇంట్లోకి తిరిగి వెళ్లకూడదని యేసు హెచ్చరించడం కూడా గమనార్హమైన విషయం. (మత్తయి 24:17, 18) మనం వస్తుదాయక సంపదను ఎలా దృష్టిస్తామనే విషయంలో మనకు పరీక్షలు ఎదురు కావచ్చు; అవి అత్యంత ప్రాముఖ్యమా, లేక దేవుని పక్షాన ఉన్న వారందరికీ రానైవున్న రక్షణ అత్యంత ప్రాముఖ్యమా? అవును, మనం పారిపోవడంలో, కొన్ని కష్టనష్టాలు చేరివుండవచ్చు. యూదానుండి యొర్దానుకు అవతలవున్న పెరియాకు పారిపోయిన మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు చేసినట్టుగానే మనం కూడా ఆవశ్యకమైన దేన్నైనా చేయడానికి సంసిద్ధంగా ఉండాలి.
23, 24. (ఎ) ఎక్కడ మాత్రమే మనం కాపుదలను పొందగలం? (బి) ‘హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలువబడడాన్ని’ గురించిన యేసు హెచ్చరిక మనపై ఏ ప్రభావాన్ని చూపించాలి?
23 యెహోవా, ఆయన కొండలాంటి సంస్థా మన ఆశ్రయ దుర్గంగా కొనసాగుతారని మనం నిశ్చయత కల్గి ఉండవచ్చు. (2 సమూయేలు 22:2, 3; కీర్తన 18:2; దానియేలు 2:35, 44) అక్కడే మనం కాపుదలను పొందగలం! ‘కొండ గుహలలోనికి’ పారిపోయి ‘బండల సందులలో’ దాక్కొనే అంటే మహా బబులోను నాశనమైన తర్వాత అతి తక్కువ కాలంపాటు ఉనికిలో ఉండే మానవ సంస్థలలోనికి, వ్యవస్థలలోనికి పారిపోయి దాక్కొనే ప్రజలను మనం అనుకరించకుందాం. (ప్రకటన 6:15; 18:9-11) నిజమే, యూదయలో నుండి పారిపోయిన గర్భిణీ స్త్రీల విషయంలోనైనా లేక చలితోకూడిన వర్షాకాలపు వాతావరణంలో ప్రయాణించాల్సిన ఎవరి విషయంలోనైనా సరే సా.శ. 66లో కాలాలు ఎంత కష్టతరంగా ఉన్నాయో మన విషయంలో కూడా అంతే కష్టతరంగా ఉండవచ్చు. అయితే, మనం తప్పించుకోవడాన్ని దేవుడు సాధ్యపరుస్తాడనే నిశ్చయతను మనం కల్గివుండవచ్చు. యెహోవాపైనా, ఆయన రాజ్యానికి రాజుగా ఇప్పుడు పరిపాలిస్తున్న ఆయన కుమారునిపైనా మన నమ్మకాన్ని మరింత దృఢపర్చుకుందాం.
24 భవిష్యత్తులో ఏం జరగనైవుందనే భయంతో మనం జీవించాల్సిన అవసరమేమీలేదు. ఆ కాలంనాటి తన శిష్యులు భయకంపితులై ఉండాలని యేసు కోరుకోలేదు, ఆయన ఇప్పుడుగానీ లేక రానైవున్న దినాల్లోగానీ మనం భయకంపితులమై ఉండాలని ఆయన కోరుకోవడంలేదు. మన హృదయాల్నీ, మనస్సుల్నీ సంసిద్ధంచేసుకునేలా ఆయన మనల్ని అప్రమత్తుల్ని చేశాడు. అంతెందుకు, అబద్ధ మతంపైకీ, మిగిలిన ఈ దుష్టవిధానంపైకీ నాశనం వచ్చినప్పుడు విధేయులైన క్రైస్తవులు శిక్షించబడరు. వాళ్లు ‘హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలువబడడాన్ని’ గురించిన హెచ్చరికను గ్రహించి, లక్ష్యపెడతారు. తమ అచంచలమైన విశ్వాసం ఆధారంగా వాళ్లు నిర్ణయాత్మకంగా చర్య తీసుకుంటారు. యేసు వాగ్దానంచేసిన ఈ విషయాన్ని మనమెన్నటికీ మర్చిపోకుందముగాక: “అంతమువరకు సహించినవాడే రక్షణ పొందును.”—మార్కు 13:13.
[అధస్సూచీలు]
a రోమా పటాల పతాకాలను రోములో ఉన్న దేవాలయాల్లో మతపరమైన భక్తితో కాపలా కాసేవారు; . . . ఇతర దేశాలపై వాళ్లు సాధిస్తున్న విజయాలకు అనుగుణంగానే వాటి పట్ల వాళ్లకున్న పూజ్యనీయ భావమూ పెరుగుతూ వచ్చింది. . . . [సైనికులకైతే అదే] బహుశా భూమిపైనున్న అత్యంత పవిత్రమైన వస్తువు. రోమా సైనికుడు తన పతాకంపై ప్రమాణంచేస్తాడు.”—ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా, 11వ సంపుటి.
b సా.శ. 66-70 సంవత్సరాల్లో జరిగిన యేసు మాటల నెరవేర్పు, ఆ మాటలు మహాశ్రమ సమయంలో ఎలా నెరవేరనైవున్నాయో గ్రహించడానికి మనకు సహాయపడగల్గినా ఆ రెండు నెరవేర్పులూ విభిన్నమైన నేపథ్యాల్లో నెరవేరతాయి గనుక అవి రెండూ ఖచ్చితంగా సమాంతరంగా ఉండకపోవచ్చు.
c కావలికోట (ఆంగ్లం) డిసెంబరు 15, 1975, పేజీలు 741-4 చూడండి.
మీరు జ్ఞప్తికి తెచ్చుకుంటారా?
◻ ‘నాశనకరమైన హేయవస్తువు’ మొదటి శతాబ్దంలో తననుతాను ఎలా కనపర్చుకుంది?
◻ ఆధునికకాల ‘హేయవస్తువు,’ భవిష్యకాలంలో పరిశుద్ధస్థలమందు నిలబడుతుందని ఆలోచించడం ఎందుకు సహేతుకమైనది?
◻ ‘హేయవస్తువు’ చేసే ఏ దాడి ప్రకటన గ్రంథంలో ప్రవచించబడింది?
◻ మన విషయంలో ఇంకా ఏ రకమైన ‘పారిపోవడం’ అవసరమై ఉండవచ్చు?
[16వ పేజీలోని చిత్రం]
మహా బబులోను ‘వేశ్యలకు తల్లి’ అని పిలువబడింది
[17వ పేజీలోని చిత్రం]
ప్రకటన 17వ అధ్యాయంలోని ‘ఎఱ్ఱని మృగమే,’ యేసు సూచించిన ‘హేయవస్తువు’
[18వ పేజీలోని చిత్రం]
ఆ ఎఱ్ఱని మృగము, మతంపైకి వినాశనకరమైన దాడిని తీసుకువస్తుంది