“ఇవి జరుగవలసియున్నవి”
“యేసు వారితో ఇట్లనెను—. . . ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు.”—మత్తయి 24:4-6.
1. ఏ విషయాంశం మన ఆసక్తిని రేకెత్తించాలి?
నిస్సందేహంగా మీకు మీ జీవితంపైనా, మీ భవిష్యత్తుపైనా ఆసక్తివుంది. అయితే, వెనుకటికి 1877లో సి. టి. రసెల్ అవధానాన్ని ఆకట్టుకున్న ఒక విషయాంశంపై మీకు కూడా ఆసక్తి ఉండి ఉండాలి. అటు తర్వాత వాచ్ టవర్ సంస్థను స్థాపించిన రసెల్, ది ఆబ్జెక్ట్ అండ్ మ్యానర్ ఆఫ్ అవర్ లార్డ్స్ రిటర్న్ అన్న చిన్న పుస్తకాన్ని రాశాడు. ఆ 64 పేజీల చిన్న పుస్తకం యేసు తిరిగి రావడాన్ని గురించి లేక భావి రాకను గురించి చర్చించింది. (యోహాను 14:3) ఒక సందర్భంలో ఒలీవ కొండమీద ఉన్నప్పుడు అపొస్తలులు ఆ రాకను గురించి అడిగారు: “ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును [“ప్రత్యక్షతకును,” NW] ఈ యుగసమాప్తికిని సూచనలేవి?”—మత్తయి 24:3.
2. యేసు ప్రవచించిన దాని విషయంలో ఎందుకన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి?
2 యేసు ఇచ్చిన జవాబు ఏంటో మీకు తెలుసా? దాన్ని మీరు అర్థం చేసుకున్నారా? ఆ జవాబు మూడు సువార్త పుస్తకాలలో ఉంది. ప్రొఫెసర్ డి. ఎ. కార్సన్ ఇలా తెలియజేస్తున్నారు: “అనువాదకుల మధ్య మత్తయి 24వ అధ్యాయం విషయంలోనూ, దానికి సమాంతర వృత్తాంతాల్ని కల్గివున్న మార్కు 13, లూకా 21 అధ్యాయాల విషయంలోనూ ఉన్నన్ని భిన్నాభిప్రాయాలు దాదాపు బైబిల్లోని మరే ఇతర అధ్యాయాల విషయంలోనూ లేవు.” ఆ తర్వాత ఆయన తన సొంత అభిప్రాయాన్ని తెలియజేశాడు—అది పరస్పర విరుద్ధమైన మానవ అభిప్రాయాల్లో మరొకటి మాత్రమే. బహుశా గత శతాబ్దంలో అలాంటి అభిప్రాయాల్లో అనేకం విశ్వాసలేమిని ప్రతిబింబించాయి. వాటిని వ్యక్తపర్చిన వ్యక్తులు, సువార్తల్లో మనం చదువుతున్న వాటిని యేసు ఎన్నడూ చెప్పలేదన్న, ఆయన చెప్పిన విషయాలు అటు తర్వాత వక్రీకరించబడ్డాయన్న, లేక ఆయన ప్రవచనం విఫలమైందన్న అభిప్రాయాలను అంటే బైబిలు విమర్శకుల ఆలోచనా విధానంచే మలచబడిన అభిప్రాయాలను కల్గివుండేవారు. ఒక వ్యాఖ్యానకర్త, మార్కు సువార్తను ‘బౌద్ధుల మహాయాన అనే తత్త్వసిద్ధాంతపు దృక్కోణంలోంచి’ పరిశీలించాడు!
3. యేసు ప్రవచనాన్ని యెహోవాసాక్షులు ఏ దృక్కోణంలో నుంచి పరిశీలిస్తారు?
3 దానికి భిన్నంగా, యెహోవాసాక్షులు బైబిలు ప్రామాణికతనూ, విశ్వసనీయతనూ అంగీకరిస్తారు. అలాగే, యేసు తాను మరణించడానికి మూడు రోజులు ముందు ఒలీవ కొండపై తనతోపాటు ఉన్న నలుగురు అపొస్తలులకు చెప్పిన వాటి ప్రామాణికతనూ, విశ్వసనీయతనూ వారు అంగీకరిస్తారు. సి. టి. రసెల్ కాలంనాటి నుండీ దేవుని ప్రజలు, ఒలీవ కొండపై యేసు ఇచ్చిన ప్రవచనాన్ని గూర్చిన ఒక స్పష్టమైన అవగాహనను క్రమేణా పొందుతూనే ఉన్నారు. గత కొన్నేళ్లలో కావలికోట పత్రిక, ఆ ప్రవచనం విషయంలో దేవుని ప్రజలకున్న దృక్పథాన్ని మరింతగా స్పష్టపర్చింది. ఆ సమాచారాన్ని మీరు గ్రహించి, మీ జీవితాలపై దాని ప్రభావాన్ని చూస్తున్నారా?a మనమా సమాచారాన్ని పునఃసమీక్షిద్దాం.
సమీప భవిష్యత్తులో ఒక విషాదకరమైన నెరవేర్పు
4. అపొస్తలులు యేసును భవిష్యత్తు గురించి ఎందుకు అడిగి ఉండవచ్చు?
4 యేసే మెస్సీయా అని అపొస్తలులకు తెలుసు. కాబట్టి ఆయన తన మరణ పునరుత్థానాలను గురించీ, తిరిగి రావడం గురించీ ప్రస్తావించడాన్ని విన్నప్పుడు వాళ్లు, ‘యేసు మరణించి వెళ్లిపోతే, మెస్సీయా నెరవేరుస్తాడని ఎదురుచూస్తున్న అద్భుతకరమైన వాటిని ఆయన ఏ విధంగా నెరవేర్చగలడు?’ అని అనుకొనివుంటారు. అంతేగాక, యేసు యెరూషలేము నాశనాన్ని గురించీ, దాని ఆలయ నాశనాన్ని గురించీ మాట్లాడాడు. ‘అది ఎప్పుడు జరుగుతుంది? ఎలా జరుగుతుంది?’ అని కూడా అపొస్తలులు అనుకొని ఉంటారు. వాటిని అర్థంచేసుకోవడానికి ప్రయత్నించడంలో భాగంగా అపొస్తలులు, “ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నియు నెరవేరబోవుకాలమునకు ఏ గురుతు కలుగును?” అని ప్రశ్నించారు.—మార్కు 13:4; మత్తయి 16:21, 27, 28; 23:37–24:2.
5. యేసు ఇచ్చిన జవాబు మొదటి శతాబ్దంలో ఎలా నెరవేరింది?
5 యుద్ధాలూ, కరవులూ, తెగుళ్లూ, భూకంపాలూ, క్రైస్తవుల్ని హింసించి ద్వేషించడం, అబద్ధ మెస్సీయాలూ, రాజ్య సువార్తను విస్తృతంగా ప్రకటించడం వంటివాటిని గురించి యేసు ప్రవచించాడు. ఆ తర్వాతే అంతం రావాలి. (మత్తయి 24:4-14; మార్కు 13:5-13; లూకా 21:8-19) సా.శ. 33వ సంవత్సరం తొలినాళ్లలో దాని గురించి యేసు చెప్పాడు. తర్వాతి దశాబ్దాల్లో జాగరూకులైన ఆయన శిష్యులు, ప్రవచించబడిన విషయాలు నిజానికి ఒక ప్రత్యేకమైన విధంగా నెరవేరుతున్నాయని గుర్తించగలిగారు. అవును, ఆ దశాబ్దాల కాలంలో ఆ సూచన లేక గురుతు, సా.శ. 66-70 సంవత్సరాల్లో రోమన్ల చేతుల్లో యూదా విధానాన్ని ముగింపుకు నడిపిస్తూ ఒక నెరవేర్పును కల్గివుందని చరిత్ర రుజువుచేస్తోంది. ఆ విధానాంతం ఎలా జరిగింది?
6. సా.శ. 66లో యూదులకూ, రోమన్లకూ మధ్య ఏ పరిస్థితి తలెత్తింది?
6 సా.శ. 66 యూదాదేశపు మండు వేసవికాలంలో తిరుగుబాటు చేస్తున్న యూదులు యెరూషలేములోని ఆలయానికి సమీపానగల కోటలో ఉన్న రోమా సైనికులపై దాడిచేశారు, దానితో ఆ దేశంలో అక్కడక్కడా హింస చెలరేగింది. యూదుల చరిత్ర (ఆంగ్లం) అనే పుస్తకంలో ప్రొఫెసర్ హైన్రిక్ గ్రెట్స్ ఇలా తెలియజేస్తున్నాడు: “సిరియా గవర్నరుగా రోమా సైనిక ప్రతిష్ఠను కాపాడవలసిన . . . బాధ్యతవున్న ఆ సెస్టియస్ గాలస్ తన చుట్టూ చెలరేగుతున్న తిరుగుబాటు తీవ్రతను అణచివేయ ప్రయత్నించకుండా ఇక ఎంతమాత్రం ఉపేక్షించలేకపోయాడు. ఆయన తన సైన్యాలను సమకూర్చాడు, పొరుగు రాష్ట్రాల అధికారులు స్వచ్ఛందంగా తమ సైన్యాల్ని పంపించారు.” మొత్తం 30,000 మంది సైనికులున్న ఆ సైన్యం యెరూషలేమును చుట్టుముట్టింది. కొన్ని రోజులపాటు పోరాటం సాగించిన తర్వాత యూదులు, ఆలయానికి సమీపంలో ఉన్న గోడల వెనక్కి వెళ్లిపోయారు. “రోమన్లు ఐదు రోజులపాటు ఏకధాటిగా గోడలపై దాడి చేసినా, వాళ్లు యూదుల శరాఘాతాల ఎదుట ప్రతీసారీ తలొంచక తప్పలేదు. వాళ్లు ఆలయానికి ముందున్న ఉత్తరపు గోడలో కొంత భాగాన్ని క్రిందనుండి తొలచివేయడంలో సఫలీకృతులయ్యింది ఆరవరోజునే.”
7. అనేకమంది యూదులకు భిన్నంగా యేసు శిష్యులు విషయాలను ఎందుకు దృష్టించగలిగాతారు?
7 దేవుడు తమనూ, తమ పవిత్ర నగరాన్నీ కాపాడతాడని యూదులు ఎంతో కాలం నుండి భావించేవారు గనుక వాళ్లెంత గందరగోళానికి గురైవుంటారో ఒక్కసారి ఊహించండి! అయితే, యెరూషలేముకు విపత్తు రానైవుందని యేసు శిష్యులు ముందుగానే హెచ్చరించబడ్డారు. యేసు ఇలా ప్రవచించాడు: “నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతో కూడ నిన్ను నేల కలిపి నీలో రాతిమీద రాయ నిలిచియుండనియ్యని దినములు వచ్చు[ను].” (లూకా 19:43, 44) అయితే దానర్థం సా.శ. 66లో యెరూషలేములోపల ఉన్న క్రైస్తవులకు మరణమనా?
8. ఏ విషాదకర సంఘటనను యేసు ముందుగానే ప్రవచించాడు, ఎవరికోసమైతే ఆ శ్రమ దినాలు తక్కువ చేయబడతాయో ఆ ‘ఏర్పర్చబడినవారు’ ఎవరు?
8 ఒలీవ కొండమీద అపొస్తలులకు జవాబు ఇస్తున్నప్పుడు, యేసు ఇలా ప్రవచించాడు: “అవి శ్రమగల దినములు; దేవుడు సృజించిన సృష్ట్యాదినుండి ఇదివరకు అంత శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడును కలుగబోదు. ప్రభువు ఆ దినములను తక్కువచేయనియెడల ఏ శరీరియు తప్పించుకొనక పోవును; ఏర్పరచబడినవారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకొనిన వారినిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను.” (మార్కు 13:19, 20; మత్తయి 24:21, 22) కాబట్టి ఆ దినములు తక్కువ చేయబడతాయి, ‘ఏర్పరచబడినవారు’ తప్పించుకుంటారు. వాళ్లెవరు? యెహోవాను ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూ ఆయన కుమారుని తిరస్కరించిన తిరుగుబాటుదారులైన యూదులు మాత్రం కాదు. (యోహాను 19:1-7; అపొస్తలుల కార్యములు 2:22, 23, 36) ఆ కాలంలో నిజంగా ఏర్పరచబడినవారెవరంటే, మెస్సీయగానూ, రక్షకునిగానూ యేసునందు విశ్వాసాన్ని చూపించిన యూదులూ, యూదామతేతరులే. దేవుడు అలాంటి వారినే ఏర్పర్చుకున్నాడు. సా.శ. 33 పెంతెకొస్తునాడు, ఆయన వారిని “దేవుని ఇశ్రాయేలు” అనే ఒక క్రొత్త ఆధ్యాత్మిక జనాంగంగా రూపొందించాడు.—గలతీయులు 6:16; లూకా 18:7; అపొస్తలుల కార్యములు 10:34-45; 1 పేతురు 2:9.
9, 10. రోమా సైనిక దాడి జరిగిన దినాలు ఎలా ‘తక్కువ చేయబడ్డాయి,’ ఏ ఫలితంతో?
9 ఆ శ్రమ దినాలు ‘తక్కువ చేయబడి,’ యెరూషలేములో ఉన్న ఏర్పర్చబడినవారు తప్పించుకున్నారా? ప్రొఫెసర్ గ్రెట్స్ ఇలా సూచిస్తున్నారు: “సైనికులకు కావల్సిన వాటిని అందకుండా బహుశా ఆటంకం కల్గించగల శరదృతువు వర్షాలు త్వరలో కురవనైవున్న ఆ కాలంలో, . . . దీర్ఘకాలంపాటు సమరోచిత ఔత్సాహికులపై యుద్ధాన్ని సాగిస్తూ, సైనిక శిబిరాన్ని వేయడం సముచితమైనదని [సెస్టియస్ గాలస్] ఎంచలేదు. ఆ సందర్భంలో తాను వెనుదిరిగి పోవడమే ఎంతో వివేకవంతమైన పనని బహుశా అతడు తలంచి ఉంటాడు.” సెస్టియస్ గాలస్ ఏమని తలంచినప్పటికీ, రోమా సైన్యాలు యూదులపై చేసిన దాడి మూలంగా కల్గిన భారీ నష్టాలతో ఆ నగరం నుండి వెనక్కి తిరిగి వెళ్లిపోయాయి.
10 అలా రోమా సైన్యాలు ఆశ్చర్యకరమైన రీతిలో వెనక్కి తిరిగి వెళ్లిపోవడం, “శరీరి,” అంటే యెరూషలేము లోపల ప్రాణాపాయంలో ఉన్న యేసు శిష్యులు తప్పించుకోవడానికి వీలుకల్పించింది. అవకాశమనే ఆ గవాక్షం తెరుచుకున్నప్పుడు, క్రైస్తవులు కొండలకు పారిపోయారని చరిత్ర నివేదిస్తోంది. భవిష్యత్తును ముందుగా తెలుసుకొని, తన ఆరాధకులు కచ్చితంగా తప్పించుకునేలా చూడగల దేవుని సామర్థ్యం ఎంత గొప్పగా బయల్పర్చబడిందో గదా! అయినప్పటికీ, యెరూషలేములోనూ, యూదయలోనూ ఉండిపోయిన అవిశ్వాసులైన యూదుల సంగతేంటి?
సమకాలీనులు దాన్ని చూస్తారు
11. “ఈ తరము” గురించి యేసు ఏమి చెప్పాడు?
11 ఆలయం కేంద్రంగా గల తమ ఆరాధనా విధానం నిరంతరం నిలుస్తుందని అనేకమంది యూదులు తలంచారు. అయితే యేసు ఇలా చెప్పాడు: “అంజూరపు చెట్టును చూచి . . . నేర్చుకొనుడి. అంజూరపుకొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంత కాలము యంక సమీపముగా ఉన్నదని మీకు తెలియును. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారముదగ్గరనే యున్నాడని తెలిసికొనుడి. ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.”(ఇటాలిక్కులు మావి.)—మత్తయి 24:32-35.
12, 13. “ఈ తరము” అని యేసు చెప్పినదాన్ని ఆయన శిష్యులు ఎలా అర్థంచేసుకొని ఉంటారు?
12 సా.శ. 66కు ముందున్న సంవత్సరాల్లో క్రైస్తవులు, సంయుక్త సూచనలోని ప్రారంభ భాగాలైన యుద్ధాలూ, కరువులూ, రాజ్య సువార్త విస్తృతంగా ప్రకటించబడడం వంటివాటిలో అనేకం నెరవేరడాన్ని చూసివుంటారు. (అపొస్తలుల కార్యములు 11:28; కొలొస్సయులు 1:23) అయితే, అంతం ఎప్పుడు వస్తుంది? ‘ఈ తరము [గ్రీకు, యెనెయా] గతింపదు’ అని యేసు చెప్పినప్పుడు ఆయన భావమేమై ఉంటుంది? యూదా మత నాయకులతోపాటు, వ్యతిరేకించిన సమకాలీన యూదా సమూహాల్ని యేసు తరచుగా “వ్యభిచారులైన చెడ్డ తరమువారు” అని పిలిచాడు. (మత్తయి 11:16; 12:39, 45; 16:4; 17:17; 23:36) కాబట్టి ఆయన ఒలీవ కొండపై మరలా ‘ఈ తరాన్ని’ గురించి మాట్లాడినప్పుడు, ఆ తరం చరిత్రయందంతటిలో ఉన్న యావత్ యూదా జాతి అన్నది ఆయన ఉద్దేశంకాదనీ లేక తన అనుచరులు ‘ఏర్పరచబడిన వంశము’నకు చెందినవారే అయినప్పటికీ వారు కాదనీ రుజువవుతుంది. (1 పేతురు 2:9) “ఈ తరము” కొంత నిడివిగల కాలమని కూడా యేసు చెప్పడంలేదు.
13 బదులుగా, యేసు మనస్సులో ఉన్నది తాను తెలియజేసిన సూచన నెరవేర్పును చవిచూడబోయే ఆ కాలంనాటి వ్యతిరేకించిన యూదులే. లూకా 21:32లో ఉన్న “ఈ తరము” అన్న రిఫరెన్సు గురించి ప్రొఫెసర్ జోయల్ బి. గ్రీన్ ఇలా పేర్కొంటున్నారు: “మూడవ సువార్తలో ‘ఈ తరము’ (అలాగే దాని సంబంధిత పదబంధాలు), దేవుని సంకల్పాన్ని అడ్డగించే ప్రజలకు చెందిన ఒక వర్గాన్ని క్రమంగా సూచించింది. . . . దైవిక సంకల్పం విషయంలో మొండిగా తమ ముఖాలను త్రిప్పుకునే ప్రజలను [అది సూచిస్తుంది].”b
14. ఆ “తరము” దేన్ని చవిచూసింది, క్రైస్తవులు ఏ విధంగా ఒక భిన్నమైన ప్రతిఫలాన్ని పొందారు?
14 సూచన నెరవేరుతుండడాన్ని గమనించే యూదా వ్యతిరేకుల దుష్ట తరము, యూదా విధానాంతాన్ని కూడా చవిచూస్తుంది. (మత్తయి 24:6, 13, 14) వాళ్లు చవిచూశారు కూడా! సా.శ. 70లో వెస్పాసియన్ చక్రవర్తి కుమారుడైన టైటస్ నాయకత్వంలో రోమా సైన్యాలు తిరిగి వచ్చాయి. నగరంలోనే మరలా దిగ్బంధానికి గురైన యూదులు అనుభవించిన బాధ నమ్మశక్యంకానిది.c రోమన్లు ఆ నగరాన్ని నేలమట్టంచేసే నాటికి, దాదాపు 11,00,000 మంది యూదులు మరణించారు, దాదాపు లక్షమంది ఖైదీలుగా కొనిపోబడ్డారు, అటు తర్వాత వారిలో అనేకమంది ఆకలితో అలమటించో లేక రోమన్ థియేటర్లలోనో తమ ప్రాణాల్ని ఘోరంగా పోగొట్టుకున్నారని ప్రత్యక్షసాక్షి ఫ్లేవియస్ జోసీఫస్ నివేదిస్తున్నాడు. నిజంగా, సా.శ. 66-70 సంవత్సరాలలో వచ్చిన ఆ శ్రమ, యెరూషలేమూ, యూదా విధానమూ ఎన్నడూ అనుభవించనంత లేక ఇక ఎన్నడూ అనుభవించబోనంత గొప్పది. యేసు ప్రవచనాత్మక హెచ్చరికను లక్ష్యపెట్టి, సా.శ. 66లో రోమా సైన్యం వెనక్కి వెళ్లిపోయిన తర్వాత యెరూషలేమును విడిచివెళ్లిన క్రైస్తవులు ఎంత భిన్నమైన ప్రతిఫలం పొందారో కదా! ‘ఏర్పర్చబడిన’ అభిషిక్త క్రైస్తవులు సా.శ. 70లో ‘తప్పించబడ్డారు’ లేక సురక్షితంగా భద్రపర్చబడ్డారు.—మత్తయి 24:16, 22.
మరో నెరవేర్పు జరగనైవుంది
15. సా.శ. 70 తర్వాత యేసు ప్రవచనం ఒక విస్తృత నెరవేర్పును కల్గివుంటుందని మనమెలా నిశ్చయపర్చుకోగల్గుతాం?
15 అయితే, అది మాత్రమే చిట్టచివరిది కాదు. ఆ నగరం నాశనమైన తర్వాత, తాను యెహోవా నామం పేరిట వస్తానని యేసు మునుపు సూచించాడు. (మత్తయి 23:38, 39; 24:2) తర్వాత, ఒలీవ కొండపై తాను ప్రవచించిన ప్రవచనంలో ఆయన దాన్ని స్పష్టపర్చాడు. రానైవున్న “మహా శ్రమ”ను గురించి ప్రస్తావించిన తర్వాత, అబద్ధ క్రీస్తులు వస్తారనీ, దీర్ఘకాలంపాటు యెరూషలేము అన్యజనులచేత త్రొక్కబడుతుందనీ ఆయన చెప్పాడు. (మత్తయి 24:20, 21, 23-28; లూకా 21:24) మరో నెరవేర్పు అంటే ఒక గొప్ప నెరవేర్పు జరగనైవుందని దాని అర్థమా? వాస్తవాలు అవునని జవాబిస్తున్నాయి. (సా.శ. 70లో యెరూషలేములో శ్రమ ముగిసిన తర్వాత రాయబడిన) ప్రకటన 6:2-8లను మత్తయి 24:6-8లతోనూ, లూకా 21:10, 11లతోనూ మనం పోల్చిచూస్తే, విస్తృత పరిధిలో యుద్ధాలూ, క్షామమూ, తెగుళ్లూ సంభవించనైవున్నాయని మనం గ్రహిస్తాం. యేసు మాటలకు సంబంధించిన ఆ గొప్ప నెరవేర్పు, 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైననాట నుండీ నెరవేరుతూనే ఉంది.
16-18. ఏం జరగనైవుందని మనం ఎదురు చూస్తాం?
16 ఆ సూచన యొక్క ప్రస్తుత నెరవేర్పు, “మహా శ్రమ” ఇంకా రానైవుందన్న విషయాన్ని రుజువుచేస్తోందని యెహోవాసాక్షులు ఇప్పటికి అనేక దశాబ్దాలుగా బోధిస్తున్నారు. ఆ శ్రమను ప్రస్తుత దుష్ట “తరము” చూస్తుంది. సా.శ. 66లో గాలస్ యెరూషలేముపై దాడికి మార్గాన్ని తెరిచినట్టుగానే, మరలా (అబద్ధ మతాలన్నింటిపైనా దాడి) అంటే శ్రమ యొక్క మొదటి దశ ఉన్నట్టు కన్పిస్తుంది.d అప్పుడు అంటే అనిర్ణయిత కాల విరామానంతరం అంతం వస్తుంది, అంటే సా.శ. 70కి సారూప్యంగావున్న ఒక ప్రపంచవ్యాప్త నాశనం వస్తుంది.
17 మన ముందున్న ఆ శ్రమను సూచిస్తూ, యేసు ఇలా అన్నాడు: “ఆ దినముల శ్రమ ముగిసిన [అబద్ధ మత వినాశనం జరిగిన] వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు.”—మత్తయి 24:29, 30.
18 ఆ విధంగా యేసు, “ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే” అంతరిక్షంలో ఏదో ఒక విధమైన సంభ్రమాశ్చర్యకర సంఘటన జరుగుతుందని చెబుతున్నాడు. (పోల్చండి యోవేలు 2:28-32; 3:15.) అది అవిధేయులైన మానవులను ‘రొమ్ము కొట్టుకునేంతగా’ భయంకంపితుల్ని చేసి, దిగ్భ్రాంతి కలిగిస్తుంది. అనేకమంది “లోకము మీదికి రాబోవుచున్న వాటివిషయమై భయము కలిగి, . . . ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు.” అయితే, నిజ క్రైస్తవుల విషయంలో సంగతి అదైవుండదు! వాళ్లు తమ ‘తలలను ఎత్తుకొంటారు, ఎందుకంటే వారి విడుదల సమీపించింది.’—లూకా 21:25, 26, 28.
తీర్పు ముందున్నది!
19. మేకలు గొఱ్ఱెలను గూర్చిన ఉపమానం ఎప్పుడు నెరవేరుతుందో మనమెలా చెప్పవచ్చు?
19 మత్తయి 24:29-31లు (1) మనుష్యకుమారుడు వస్తున్నాడనీ, (2) మహా మహిమతో వస్తాడనీ, (3) ఆయనతోపాటు దేవదూతలు ఉంటారనీ, (4) భూమిమీదనున్న సకల గోత్రములవారు ఆయనను చూస్తారనీ ప్రవచించడాన్ని గమనించండి. గొఱ్ఱెలు, మేకలను గూర్చిన తన ఉపమానంలో యేసు వాటిని పునరుద్ఘాటిస్తున్నాడు. (మత్తయి 25:31-46) కాబట్టి, ఆ ఉపమానం, శ్రమ యొక్క మొదటి దశ ప్రారంభమైన తర్వాత యేసు తన దూతలతో వచ్చి తీర్పుతీర్చడానికి తన సింహాసనంపై కూర్చొనబోయే సమయంతో వ్యవహరిస్తుందనే ముగింపుకు మనం రావొచ్చు. (యోహాను 5:22; అపొస్తలుల కార్యములు 17:31; పోల్చండి 1 రాజులు 7:7, IBL; దానియేలు 7:10, 13, 14, 22, 26; మత్తయి 19:28.) ఎవరికి తీర్పు తీర్చబడుతుంది, ఏ ప్రతిఫలంతో? తన అంతరిక్ష సింహాసనం ఎదుట జనాంగాలన్నీ సమకూడాయన్నట్టుగా యేసు అన్నిజనాంగాలపైనా అవధానాన్ని నిలుపుతాడు.
20, 21. (ఎ) యేసు ఉపమానంలోని గొఱ్ఱెలకు ఏమి జరగనైవుంది? (బి) మేకలు భవిష్యత్తులో ఏం అనుభవిస్తారు?
20 గొఱ్ఱెల్లాంటి స్త్రీ, పురుషులు అనుగ్రహ స్థానమైన యేసు కుడివైపునకు వేరుపర్చబడతారు. ఎందుకు? ఎందుకంటే వాళ్లు ఆయన సహోదరులకు—క్రీస్తు పరలోక రాజ్యమందు భాగంవహించబోయే అభిషిక్త క్రైస్తవులకు మంచిని చేయడంలో తమకున్న అవకాశాల్ని సద్వినియోగపర్చుకున్నారు. (దానియేలు 7:27; హెబ్రీయులు 2:9–3:1) ఆ ఉపమానానికి అనుగుణంగా, లక్షలాదిమంది గొఱ్ఱెల్లాంటి క్రైస్తవులు యేసు ఆధ్యాత్మిక సహోదరులను గుర్తించి, వారికి మద్దతునిచ్చేందుకు కృషిచేస్తున్నారు. తత్ఫలితంగా, “మహాశ్రమల” నుండి తప్పించుకొని, ఆ తర్వాత దేవుని రాజ్యపు భూపరిధియైన పరదైసులో నిరంతరమూ జీవించే బైబిలు ఆధారిత నిరీక్షణ ‘గొప్పసమూహానికి’ ఉంది.—ప్రకటన 7:9, 14; 21:3, 4; యోహాను 10:16.
21 మేకల కోసం వేచివున్న ప్రతిఫలం ఎంత భిన్నమైందో కదా! యేసు వచ్చినప్పుడు వాళ్లు ‘రొమ్ము కొట్టుకుంటారని’ మత్తయి 24:30లో వర్ణించబడింది. వాళ్లు రొమ్ముకొట్టుకోవాల్సిందే, ఎందుకంటే రాజ్య సువార్తను తిరస్కరించారన్న, యేసు శిష్యుల్ని వ్యతిరేకించారన్న, గతించిపోతున్న లోకాన్నే ఇష్టపడుతున్నారన్న చరిత్రను వాళ్లు నిర్మించుకుంటారు. (మత్తయి 10:16-18; 1 యోహాను 2:15-17) ఎవరు మేకలు అన్న విషయాన్ని యేసే నిర్ణయిస్తాడుగాని, భూమ్మీద ఉన్న ఆయన శిష్యుల్లో ఏ ఒక్కరూ కాదు. కానీ వారి గురించి ఆయన ఇలా అంటున్నాడు: “వీరు నిత్యశిక్షకు . . . పోవుదురు.”—మత్తయి 25:46.
22. యేసు ప్రవచనంలోని ఏ భాగం మన అదనపు పరిశీలనకు యోగ్యమైనది?
22 మత్తయి 24, 25 అధ్యాయాల్లో ఉన్న ప్రవచనాన్ని అర్థంచేసుకోవడంలో మనం సాధించిన పురోభివృద్ధి పులకరింతను కలుగజేస్తున్నది. అయినప్పటికీ, మనం మరింత అవధానం ఇవ్వాల్సిన మరొక భాగం యేసు ప్రవచనంలో ఉంది. అది ‘నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచోవడం.’ దీన్ని గ్రహించమనీ, చర్య తీసుకోవడానికి సంసిద్ధంగా ఉండమనీ యేసు తన అనుచరులకు ఉద్బోధించాడు. (మత్తయి 24:15, 16) ఈ “హేయవస్తువు” ఏమిటి? పరిశుద్ధస్థలమందు అది ఎప్పుడు నిలుస్తుంది? మన ప్రస్తుత, భావి జీవిత ఉత్తరాపేక్షలు ఎలా చేరివున్నాయి? వాటిని దీని తర్వాతి శీర్షిక చర్చిస్తుంది.
[అధస్సూచీలు]
a కావలికోట ఫిబ్రవరి 15, 1994; అక్టోబరు 15, నవంబరు 1, 1995; ఆగస్టు 15, 1996 సంచికలలోని పఠన శీర్షికలను చూడండి.
b బ్రిటిష్ పండితుడు జి. ఆర్. బీజ్లీమరీ ఇలా పేర్కొన్నారు: “‘ఈ తరము’ అన్న పదబందం, భాష్యకారులకు భాష్యంచెప్పడానికి కష్టమైన పదంకాకూడదు. నిజమే తొలి గ్రీకులో యెనెయా అంటే జన్మించడం, సంతతి అని అర్థం, కాబట్టి ఒకే మూల పురుషుని నుండి వచ్చిన సంతతి అనే భావంలో జాతి అని అర్థం, [గ్రీకు సెప్టాజింట్]లో వయస్సు, మానవజాతి వయస్సు, లేక సమకాలీనులు అనే భావంలో తరము అని అర్థంగల హెబ్రీ పదమైన దొర్ను అనువదించడానికి అది అతి తరచుగా ఉపయోగించబడింది. . . . యేసు చెప్పినవని చెప్పబడుతున్న మాటల్లో ఆ పదానికి రెండు విధాలైన భావం ఉన్నట్టు సూచిస్తుంది: ఒకవైపున అది ఎల్లప్పుడూ ఆయన సమకాలీనులను చూపిస్తుంది, మరోవైపున అది ఎల్లప్పుడూ నర్మగర్భితమైన విమర్శను సూచిస్తుంది.”
c రోమన్లు కొన్నిసార్లు రోజుకు 500 మంది ఖైదీలను కొఱత వేసేవారని ప్రొఫెసర్ గ్రెట్స్ యూదుల చరిత్రలో (ఆంగ్లం) చెబుతున్నారు. బంధించబడిన ఇతర యూదుల చేతులను నరికివేసి, వాళ్లను వెనక్కి తమ నగరానికి పంపించేసేవారు. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? “డబ్బు దాని విలువను కోల్పోయింది, అది రొట్టె ముక్కను కొనుక్కోడానికి కూడా పనికిరాకుండాపోయింది. గుప్పెడు ఎండుగడ్డి, చిన్న చర్మపు ముక్క, లేక కుక్కలకు పడవేసే కుళ్లిన మాంసం వంటి ఎంతో జుగుప్సాకరమైన, అసహ్యకరమైన ఆహారం కోసం మనుష్యులు వీధుల్లో తీవ్రంగా దెబ్బలాడుకునేవారు. . . . కప్పిపెట్టకుండా వదిలివేయబడిన శవాల సంఖ్య అంతకంతకూ పెరిగిపోయి, మండు వేసవిలో వీచే వడ గాలిని అవి మరణాంతకమైనదిగా చేశాయి. ప్రజలు రోగాలకూ, క్షామానికీ, ఖడ్గానికీ గురయ్యారు.”
d భవిష్యత్తులో రానైవున్న శ్రమకు సంబంధించిన ఆ అంశాన్ని దీని తర్వాతి శీర్షిక చర్చిస్తుంది.
మీరు జ్ఞప్తికి తెచ్చుకుంటారా?
◻ మత్తయి 24:4-14లు మొదటి శతాబ్దంలో ఏ నెరవేర్పును కల్గివున్నాయి?
◻ మత్తయి 24:21, 22లలో ప్రవచించినట్టుగా అపొస్తలుల కాలంలో దినములు తక్కువచేయబడడం, శరీరి తప్పించుకోవడం ఎలా నెరవేరుతుంది?
◻ మత్తయి 24:34లో ప్రస్తావించబడిన “తరము”ను ఏది సూచించింది?
◻ ఒలీవ కొండపై ఇవ్వబడిన ప్రవచనం మరొక నెరవేర్పును అంటే ఒక గొప్ప నెరవేర్పును కల్గివుందని మనకెలా తెలుసు?
◻ గొఱ్ఱెలు, మేకలను గూర్చిన ఉపమానం ఎప్పుడు, ఎలా నెరవేరుతుంది?
[12వ పేజీలోని చిత్రం]
రోములోని టైటస్ మందసంపై ఉన్న వివరణ, యెరూషలేము నాశన సమయంలో దక్కిన దోపిడి సొమ్మును చూపిస్తోంది
[క్రెడిట్ లైను]
Soprintendenza Archeologica di Roma