‘నమ్మకమైన దాసుడు’ మరియు అతని గవర్నింగ్ బాడి
“యజమానుడు తనయింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఎవడు?—మత్తయి 24:45.
1. యెహోవా అధికార ప్రాతినిధ్యమునివ్వ ఎందుకు ఇష్టపడుచున్నాడు, మరియు ప్రాథమికముగా ఆయన ఎవరియెడల యిలా జరిగించెను?
యెహోవా క్రమమునకు దేవుడైయున్నాడు. అలాగే ఆయన సమస్త న్యాయాధికారమునకు మూలాధారుడైయున్నాడు. తన నమ్మకమైన ప్రాణుల యథార్థతయందు నమ్మకముగలవానిగా, యెహోవా వారికి అధికార ప్రాతినిధ్యమును యివ్వ ఇష్టపడుచున్నాడు. ఆయన అందరికంటే ఎక్కువ అధికార ప్రాతినిధ్యమును తన కుమారుడైన, యేసు క్రీస్తుకు యిచ్చెను. అవును, దేవుడు “సమస్తమును ఆయన పాదముల క్రిందవుంచి సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.”—ఎఫెసీయులు 1:22.
2. క్రైస్తవ సంఘమును పౌలు ఏమని పిలిచెను, మరియు ఎవరికి క్రీస్తు అధికార ప్రాతినిధ్యమును యిచ్చెను?
2 క్రైస్తవ సంఘము “దేవుని యిల్లని,” యెహోవా దానిమీద తన నమ్మకమైన కుమారుని నియమించెనని అపొస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు. (1 తిమోతి 3:15 NW; హెబ్రీయులు 3:6) తిరిగి యేసు ఆ అధికారమునకు దేవుని యింటగలవారిని ప్రతినిధులుగా చేయుచున్నాడు. మత్తయి 24:45-47లో వ్రాయబడిన యేసు మాటలనుండి దీనిని మనము చూడగలము. అక్కడ ఆయనిట్లనెను: “యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తిమీద వానినుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”
మొదటి-శతాబ్దపు గృహపరిపాలకుడు
3. “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసునిగా” ఎవరు తయారగుదురు, మరియు ఆయావ్యక్తులుగా వారికి ఏ పదము అన్వయించును?
3 లేఖనములను మనము జాగ్రత్తగా చదువుటనుండి, ఆత్మాభిషక్తులైన దేవుని యింటి సభ్యులు ఏ సమయమందైనను, ఒక గుంపుగా “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు,” “గృహనిర్వాహకుడు,” లేక “గృహపరిపాలకునిగా” ఉన్నట్లు మనము తెలుసుకొందుము. ఆయావ్యక్తులుగా, యెహోవా యింటి సభ్యులు “యింటివారు” లేక “యింటి పనివారు” అని పిలువబడిరి.—మత్తయి 24:45; లూకా 12:42; రెఫరెన్సు బైబిలు, పాదవచనము.
4. తన మరణమునకు కొద్దికాలమునకుముందు, యేసు ఏ ప్రశ్నను లేవదీసెను, మరియు ఆయన తననెవరికి పోల్చుకొనెను?
4 తన మరణమునకు కొన్నినెలల ముందు, లూకా 12:42లో వ్రాయబడియున్న ఈ ప్రశ్నను యేసు లేవదీసెను: “తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు, యజమానుడు తన యింటి వారిమీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడెవడు?” ఆ పిమ్మట చనిపోవుటకు కొద్దిదినములముందు యేసు, దాసులను పిలిచి తన ఆస్తిని వారికప్పగించి దేశాంతరమునకు ప్రయాణమైవెళ్లిన ఒక మనుష్యునికి తనను పోల్చుకొనెను.—మత్తయి 25:14.
5. (ఎ) తన ఆస్తిని చూచుటకు యేసు ఎప్పుడు యితరులకు పని అప్పగించెను? (బి) తన సముదాయక గృహ పరిపాలకునిగా తయారగువారికి క్రీస్తు అదనముగా మరింకే పనిని అప్పగించెను?
5 తన ఆస్తిని చూడమని యేసు యితరులకు ఎప్పుడు పనిని అప్పగించెను? యిది ఆయన పునరుత్థానము తర్వాత జరిగినది. అందరికి తెలిసియున్న మత్తయి 28:19, 20లో కనుగొనబడు మాటలయందు, క్రీస్తు తన సముదాయక గృహనిర్వాహకునియందు భాగముగా తయారయ్యేవారికి బోధించు మరియు శిష్యులను తయారుచేయు పనినికూడా అప్పగించెను. ఆయావ్యక్తులుగా “భూదిగంతముల వరకు” సాక్ష్యమిచ్చుటద్వారా, ఈ యింటి పనివారు యేసు తన భూపరిచర్యయందు సాగుచేసిన మతప్రచార క్షేత్రమును విస్తరింపజేయుదురు. (అ.కార్యములు 1:8) దీనియందు వారు “క్రీస్తుకు రాయబారులుగా” పాత్రవహించుట యిమిడియుండెను. “దేవుని మర్మముల విషయములో గృహనిర్వాహకులుగా” వారు శిష్యులను చేయుదురు మరియు వారికి ఆత్మీయాహారమును పంచిపెట్టుదురు.—2 కొరింథీయులు 5:20; 1 కొరింథీయులు 4:1, 2.
గృహనిర్వాహక సభ
6. మొదటి శతాబ్దపు గృహనిర్వాహక తరగతి ఏమి దయచేయుటకు దైవికముగా ప్రేరేపింపబడిరి?
6 దేవుని యింటి ఆయా సభ్యులకు సమయానుకూలముగా ఆత్మీయాహారమును పంచిపెట్టుటకు పని అప్పగింపబడినవారిగా, ఆత్మాభిషేక క్రైస్తవులు ఒకగుంపుగా యజమాని గృహనిర్వాహకునిగా, లేక గృహపరిపాలకునిగా ఉండవలెను. సా.శ. 41 నుండి సా.శ. 98 సంవత్సరముల మధ్యకాలములో మొదటి శతాబ్ద గృహనిర్వాహక తరగతి సభ్యులు తమ సహోదరుల ప్రయోజనము కొరకు 5 చారిత్రక వృత్తాంతములను, 21 లేఖలను, ప్రకటన గ్రంథమును వ్రాయుటకు ప్రేరేపింపబడిరి. ఈ ప్రేరేపిత వ్రాతలు యింటివారికి అనగా, దేవునియింటి అభిషక్తుల ఆయావ్యక్తుల కొరకు శ్రేష్ఠమైన ఆత్మీయాహారమును కలిగియుండెను.
7. దాసుని తరగతినుండి ఏ సంకల్పముకొరకు క్రీస్తు కొద్దిమంది మనుష్యులను ఎంపికచేసుకొనెను?
7 అభిషక్తులందరు సముదాయకముగా దేవుని యింటిగాయున్నను, క్రీస్తు దృశ్య గవర్నింగ్ బాడిగా సేవచేయుటకు దాసుని తరగతిలోని కొద్దిమందిని ఎంపికచేసుకొనెననుటకు విస్తారముగా రుజువుకలదు. మత్తీయతో కలుపుకొని 12 మంది అపొస్తలులు మొదటి శతాబ్ద గవర్నింగ్ బాడికి పునాదిగా యుండిరని సంఘ తొలిచరిత్ర చూపుచున్నది. దీనిని అ.కార్యములు 1:20-26, NW మనకు సూచనప్రాయముగా తెలియజేయుచున్నది. యూదా ఇస్కరియోతు స్థానమును పూర్తిచేయు సందర్భమందు, “అతని పర్యవేక్షణా కర్తవ్యము” మరియు “పరిచర్య మరియు అపొస్తలత్వము” ప్రస్తావించబడెను.
8. మొదటి శతాబ్దపు గవర్నింగ్ బాడి బాధ్యతలయందు ఏమి చేరియుండెను?
8 అటువంటి పర్యవేక్షణా కర్తవ్యమందు, అపొస్తలులు యోగ్యతగలవారిని సేవాస్థానములలో నియమించుట మరియు పరిచర్యను వ్యవస్థీకరించుటవంటి బాధ్యత చేరియుండెను. దాని భావము మరి ఎక్కువనూ కలదు. దానియందు బోధించుట, సిద్ధాంతపరమైన అంశములను స్పష్టపరచుటయు యిమిడియుండెను. యోహాను 16:13లో వ్రాయబడియున్న యేసు వాగ్ధానమును నెరవేర్చుచు, “సత్యస్వరూపియైన ఆత్మ” క్రైస్తవ సంఘమును ప్రగతిపూర్వకముగా సమస్త సత్యమునకు నడిపించవలసియుండెను. ప్రారంభమునుండే, వాక్యమును అంగీకరించి, బాప్తిస్మము పుచ్చుకొని అభిషక్త క్రైస్తవులుగా తయారయినవారు “అపొస్తలుల బోధయందు” ఎడతెగకయుండిరి. వాస్తవానికి, “ఆ పన్నెండుమంది” ‘ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగకయుండ’ వీలగునట్లు, ఆ కారణముచేతనే వస్తుదాయక ఆహారము పంచిపెట్టు వ్యవహారమును చూచుటకు, ఏడుగురు మనుష్యులను నియమించ సిఫారసు చేయడమైనది.—అ.కార్యములు 2:42; 6:1-6.
9. తొలి గవర్నింగ్ బాడి 11 మంది సభ్యులకు ఎట్లు తగ్గింపబడెను, అయితే మరలా వెంటనే 12 మందికి సంఖ్యను తీసుకువచ్చుట ఎందుకు చేయబడలేదు?
9 గవర్నింగ్ బాడియందు మొదట కేవలము యేసు అపొస్తలులు మాత్రమే చేరియున్నట్లు కన్పించుచున్నది. అయితే అది అట్లే కొనసాగునా? సా.శ. 44 ఆ ప్రాంతములో హేరోదు అగ్రిప్ప I, యోహాను సహోదరుడైన అపొస్తలుడగు యాకోబును చంపించెను. (అ.కార్యములు 12:1, 2) యూదా విషయములో చేసినట్లు ఈయన స్థానమును పూర్తిచేయుటకు స్పష్టముగా ప్రయత్నమేమియు జరుగలేదు. ఎందుకు? ఎందుకంటే నిస్సందేహముగా అలాగే మరణించవలసిన 12మంది అపొస్తలులలోని మొదటివానిగా యాకోబు నమ్మకస్థునిగా మరణించెను. అయితే, ఆత్మీయ ఇశ్రాయేలు పునాదిరాళ్ల సంఖ్య 12ను సమముచేయుటకు దుష్టుడును దోషియునైన యూదా స్థానము పూర్తిచేయవలసి యుండెను.—ఎఫెసీయులు 2:20; ప్రకటన 21:14.
10. ఎప్పుడు మరియు ఎట్లు మొదటి శతాబ్దపు గవర్నింగ్ బాడి విస్తరింపబడెను, మరియు క్రీస్తు దేవుని యింటివారిని నడిపించుటకు దానిని ఎట్లు ఉపయోగించెను?
10 మొదటి శతాబ్ద గవర్నింగ్ బాడి ప్రారంభ సభ్యులు అపొస్తలులైయుండిరి, వీరు యేసుతోకూడా నడిచి ఆయన మరణ పునరుత్థానములకు సాక్షులైయుండిరి. (అ.కార్యములు 1:21, 22) అయితే ఈ పరిస్థితి మారనైయుండెను. సంవత్సరములు గడచుచుండగా, యితర క్రైస్తవ పురుషులు ఆత్మీయ పరిణతిని పొందినవారిగా యెరూషలేము సంఘములో పెద్దలుగా నియమింపబడిరి. సా.శ. 49 నాటికి మిగిలియున్న అపొస్తలులే కాకుండా, యెరూషలేములోని యితర పెద్దలును కొంతమంది చేరియుండులాగున గవర్నింగ్ బాడి విస్తరింపబడెను. (అ.కార్యములు 15:2) అలా గవర్నింగ్ బాడి అమరిక మార్చబడనిదిగా చేయబడలేదు, అయితే దేవుడు తన ప్రజల పరిస్థితులకు సరిపడు విధముగా స్పష్టముగా సంగతులుండుటకు నడిపించెను. అన్యులనుండి వచ్చిన క్రైస్తవులు సున్నతిపొందుట, మోషే ధర్మశాస్త్రమునకు లోబడుటవంటి ప్రాముఖ్యమైన సిద్ధాంతవిషయములను పరిష్కరించుటకు సంఘముయొక్క చురుకైన శిరస్సగు క్రీస్తు ఈ విస్తరింపబడిన గవర్నింగ్ బాడిని ఉపయోగించుకొనెను. దాని నిర్ణయమును వివరించుచు గవర్నింగ్ బాడి ఒక లేఖవ్రాసి, వారు పాటించవలసిన విధులను జారిచేసెను.—అ.కార్యములు 15:23-29.
గృహపరిపాలకుని పనివిషయమై లెక్కలుచూచు సమయము
11. గవర్నింగ్ బాడి స్థిర నాయకత్వమును సహోదరులు ప్రశంసించిరా, మరియు ఈ ఏర్పాటును యెహోవా దీవించెనని ఏమి చూపించుచున్నది?
11 గవర్నింగ్ బాడి బలముగా యిచ్చిన ఈ నడిపింపును ఆయావ్యక్తులుగా, సంఘములుగా తొలిక్రైస్తవులు ప్రశంసించిరి. గవర్నింగ్ బాడినుండి వచ్చిన లేఖ సిరియా అంతియొకయలో చదువబడగా, వారు ఆదరణకలిగి సంతోషించిరి. యితర సంఘములును ఆ వర్తమానమునుపొంది, దానివిధులను పాటించుచుండగా, “సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను.” (అ.కార్యములు 16:5) ప్రత్యక్ష్యదాయకముగా, దేవుడు ఈ ఏర్పాటును దీవించెను.—అ.కార్యములు 15:30, 31.
12, 13. మీనాలు మరియు తలాంతుల ఉపమానములయందు యేసు ముందుగనే ఏమి తెలియజేసెను?
12 అయితే ఈ ప్రాముఖ్యమైన విషయముయొక్క మరియొక ఆకృతిని మనము చూద్దాము. మీనాలనుగూర్చిన తన ఉపమానమందు, యేసు తనను రాజ్యము సంపాదించుకొని మరల రావలెనని దూరదేశమునకు ప్రయాణమై వెళ్లిన రాజకుమారునికి పోల్చుకొనెను. (లూకా 19:11, 12) సా.శ. 33లో తన పునరుత్థాన ఫలితముగా, యేసు దేవుని కుడిపార్శ్వమునకు ఎత్తబడి, అక్కడ దేవుడు తన శత్రువులను తన పాదపీఠముగాచేయు పర్యంతము కూర్చుండవలసియుండెను.—అ.కార్యములు 2:33-35.
13 దానికి సమాంతరముగా చెప్పిన తలాంతుల ఉపమానమందు, యేసు బహుకాలమైన తర్వాత యజమానుడు తన సేవకులతో లెక్కలు కుదుర్చుకొనుటకు వచ్చెనని తెల్పెను. నమ్మకస్థులని నిరూపించుకొనిన సేవకులతో యజమానుడు యిట్లనెను: “మీరు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటిరి. మిమ్ము అనేకమైనవాటిమీద నియమించెదను. నీ యజమానుని సంతోషములో పాలుపొందుము.” అయితే అపనమ్మకస్థుడైన దాసుని విషయమై ఆయనిట్లనెను: “లేనివానియొద్దనుండి వానికి కలిగినదంతయు తీసివేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలపటి చీకటిలోకి త్రోసివేయుడి.”—మత్తయి 25:21-23, 29, 30.
14. తన ఆత్మాభిషక్త దాసులనుండి యేసు ఏమి అపేక్షించెను?
14 చాలాకాలము—దాదాపు 19 శతాబ్దముల—తర్వాత అనగా “అన్యరాజుల కాలములు సంపూర్ణమైనప్పుడు,” క్రీస్తుకు 1914లో రాజ్యాధికారము యివ్వబడెను. (లూకా 21:24) దాని తర్వాత కొద్దికాలమునకే, ఆయన అభిషక్త క్రైస్తవులైయున్న తన దాసులతో “లెక్కచూచుటకు వచ్చెను.” (మత్తయి 25:19) ఆయావ్యక్తులుగా మరియు ఒక సమూహముగా వారినుండి యేసు ఏమి అపేక్షించెను? మొదటి శతాబ్దమునుండి ఉన్నట్లుగానే, గృహనిర్వాహకత్వపు పనిని అప్పగించుట కొనసాగెను. క్రీస్తు “ఎవని సామర్థ్యము చొప్పున వానికి”—ఆయావ్యక్తులకు తలాంతులను అప్పగించెను. కావున, యేసు తదనుగుణ్యమైన ఫలితములను వారినుండి అపేక్షించెను. (మత్తయి 25:15) “గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యకము” అని 1 కొరింథీయులు 4:2లో చెప్పబడిన నియమము యిక్కడ అన్వయింపును కలిగియున్నది. తలాంతులతో వ్యాపారముచేయుట అనగా శిష్యులనుచేయుచు వారికి ఆత్మీయసత్యములను అందజేయుచు, దేవుని రాయబారులుగా నమ్మకముగా పనిచేయుటయని దాని భావము.—2 కొరింథీయులు 5:20.
అంతము సమీపించుచుండగా “దాసుడు” అతని గవర్నింగ్ బాడి
15. (ఎ) తన సముదాయక గృహపరిపాలకునినుండి యేసు ఏమి అపేక్షించెను? (బి) తాను తనయింటిని పరీక్షించుటకు రాక ముందే దాసుని తరగతి దీనిని చేయుచుండవలెనని యేసు అపేక్షించెనని ఏది చూపించుచున్నది?
15 అభిషక్త క్రైస్తవులు ఒక గుంపుగా నమ్మకమైన గృహనిర్వాహకునిగా పనిచేయుచు యింటనుండు వారికి “తగిన కాలమున ప్రతివానికి ఆహారము” పెట్టుచున్నవారై యుండవలెనని యేసు అపేక్షించెను. (లూకా 12:42) లూకా 12:43 ప్రకారము, క్రీస్తు యిట్లనెను: “ఎవని ప్రభువు వచ్చి వాడు ఆలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు!” తన అభిషక్త సేవకులతో లెక్క చూచుటకు క్రీస్తు రావడానికి కొద్దికాలము ముందే దేవుని యిల్లగు క్రైస్తవ సంఘసభ్యులకు వారు ఆత్మీయాహారము పెట్టుచున్నవారై యుండవలెనని యిది సూచించుచున్నది. 1914లో రాజ్యాధికారమునకు వచ్చి, 1918లో దేవుని యింటిని పరీక్షించుటకు మొదలుపెట్టుచుండగా, క్రీస్తు అలా ఎవరు చేయుచున్నట్లు కనుగొనెను?—మలాకి 3:1-4; లూకా 19:12; 1 పేతురు 4:17.
16. దేవుని యింటిని 1918లో పరీక్షించుటకు క్రీస్తు వచ్చినప్పుడు, క్రీస్తుమత సామ్రాజ్య చర్చీలు తగినవేళ ఆత్మీయాహారమును అందించుటను ఆయన ఎందుకు కనుగొనలేదు?
16 యెహోవా కుడిపార్శ్వమున యేసు వేచియుండిన బహుకాలము ముగింపునకు వచ్చుచుండగా, 1914కు ముందే క్రీస్తు యింటివారలకు ఎవరు ఆత్మీయాహారమును పెట్టుచున్నారను విషయము క్రమేణి స్పష్టమాయెను. ఆపని చేయుచున్నది క్రీస్తుమత సామ్రాజ్య చర్చీలని మీరనుకుంటున్నారా? ఖచ్ఛితముగాకాదు, ఏలయనగా వారు అప్పటికే రాజకీయములలో బహుగా మునిగియుండిరి. వలసవిధానమును విస్తరింపజేయుటకు తాముగా యిష్టపూర్వక సాధనములుగా యుండి, తమ దేశభక్తిని రుజువు పరచుకొనుటకు ఒకరిని మించి ఒకరుండుటకు ప్రయత్నిస్తూ, అలా వారు జాతీయతను ప్రోత్సహించిరి. మరియు మొదటి ప్రపంచయుద్ధమందు చేరియున్న రాజకీయ ప్రభుత్వములకు వారు మద్దతునిచ్చుటతో, యిది త్వరలోనే వారిమీదకు బహు గొప్పనైన రక్తాపరాధమును తెచ్చినది. ఆత్మీయముగా, సనాతనవాదముద్వారా వారి విశ్వాసము బలహీనపడినది. వారి మతనాయకులనేకులు తీవ్రవిమర్శలకు పరిణామవాదమునకు సులభముగా దొరుకు ఎరగా తయారయినందున ఆత్మీయ విషమస్థితి ఏర్పడినది. క్రీస్తుమత సామ్రాజ్య మతనాయకులనుండి ఎలాంటి ఆత్మీయ పోషణను అపేక్షించలేని స్థితివచ్చెను!
17. క్రీస్తు ఎందుకు కొంతమంది అభిషక్తులను తిరస్కరించెను, కాగా వారికి ఏ పరిణామములు కలిగెను?
17 అదే ప్రకారముగా, ఎవరైతే యజమాని తలాంతుల పనికంటే తమ వ్యక్తిగత రక్షణయెడల ఎక్కువ శ్రద్ధగలవారైయుండిరో ఆ అభిషక్త క్రైస్తవులనుండియు పోషణార్థమైన ఆత్మీయాహారము అందజేయబడుచుండుటలేదు. యజమాని ఆస్తియెడల శ్రద్ధవహించుటకు అర్హత కోల్పోయిన వారిగా, వారు “సోమరులైరి.” అందువలన వారు, క్రీస్తుమత సామ్రాజ్య చర్చీలు ఇప్పటికిని ఉన్నచోటికి అనగా “వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడిరి.”—మత్తయి 25:24-30.
18. తగినవేళలో తనయింటివారికి ఎవరు ఆత్మీయాహారమును పెట్టుటను యజమానుడు కనుగొనెను, మరియు యిది ఏమి నిరూపించుచున్నది?
18 1918లో తన దాసులను పరీక్షించవచ్చినప్పుడు, యజమానియైన యేసు క్రీస్తు, తనయింటివారికి సరియైన సమయములో ఆహారము ఎవరు పెట్టుచున్నట్లుగా కనుగొనెను? అయితే, అప్పటికి సత్యాన్వేషకులకు విమోచనా బలినిగూర్చి, దైవనామమునుగూర్చి, క్రీస్తు సాన్నిధ్యముయొక్క అదృశ్యతనుగూర్చి, 1914యొక్క ప్రాముఖ్యతనుగూర్చి ఎవరు సరియైన అర్థమును చెప్పిరి? ఎవరు త్రిత్వమునుగూర్చిన, మానవ ఆత్మ అమర్త్యతనుగూర్చిన, నరకమునుగూర్చిన అబద్ధమును బయటపెట్టిరి? పరిణామము, అభిచారముల అపాయమునుగూర్చి ఎవరు హెచ్చరికచేసిరి? కావలికోట యెహోవా రాజ్యమును ప్రకటించుచున్నది అని ప్రస్తుతము పిలువబడుచున్న, జయన్స్ వాచ్‌టవర్ అండ్ హెరాల్డ్ ఆఫ్ క్రైస్ట్స్ ప్రెసెన్స్ పత్రిక ప్రకాశకులతో సహవాసముచేసిన అభిషక్త క్రైస్తవులని వాస్తవములు చూపుచున్నవి.
19. 1918కి ముందే ఎట్లు ఒక నమ్మకమైన దాసుని తరగతి ప్రదర్శితమైనది, అది దేనిమూలముగా ఆత్మీయాహారమును పంచిపెట్టెను, మరియు ఎప్పటినుండి?
19 1944 నవంబరు 1, సంచికలో వాచ్‌టవర్ యిట్లు చెప్పినది: “1918లో ప్రభువు ఆలయమునకు వచ్చుటకు నలభై సంవత్సరముల పూర్వమే అనగా 1878లో, క్రైస్తవమతాచార పరంపర మరియు మతనాయక వ్యవస్థలనుండి వైదొలగి క్రైస్తవత్వమును అభ్యసించుటకు వెదకిన నమ్మకమైన సమర్పిత క్రైస్తవతరగతి ఒకటివుండెను. . .ఆ తర్వాతి సంవత్సరము అనగా 1879 జూలైలో, క్రీస్తుద్వారా దేవుడు ‘తగినవేళ ఆహారమని’ దయచేసిన సత్యములను సమర్పిత పిల్లలగు ఆయన యింటివారికి క్రమముగా అందించుటకుగాను, వాచ్‌టవర్ అను ఈ పత్రిక ప్రచురించుటకు ఆరంభించబడెను.”
20. (ఎ) ఆధునిక-దిన గవర్నింగ్ బాడి దృశ్యములోనికి ఎట్లు వచ్చినది? (బి) గవర్నింగ్ బాడి సభ్యులు ఏపని చేయుచుండిరి, మరియు ఎవరి నడిపింపుక్రింద?
20 ఆధునిక-దిన గవర్నింగ్ బాడి క్రమావిర్భావమునుగూర్చి తెలియజేయుచు 1971 డిశంబరు 15, వాచ్‌టవర్ సంచిక యిలా వివరించినది: “ఐదు సంవత్సరముల తర్వాత [1884లో] జయన్స్ వాచ్‌టవర్ ట్రాక్ట్ సొసైటి చట్టబద్ధమైన సంస్థగా రూపొందించబడి, దేవుని ఎరుగుటకు మరియు ఆయన వాక్యమును అర్థముచేసుకొనుటకు నిష్కపటులైన వేలాదిమందికి ఆత్మీయాహారమును పంచుటకు ‘కార్యస్థానముగా’ పనిజేసినది. . .బాప్తిస్మము తీసుకొనిన, సమర్పిత అభిషక్త క్రైస్తవులు పెన్సిల్వేనియాలోని సంస్థ కేంద్రకార్యాలయముతో సహవసించిరి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో తామున్నను లేకున్నను వారు ‘నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుని’ తరగతియొక్క ప్రత్యేక పనికొరకు తమను లభ్యపరచుకొనిరి. దాసుని తరగతి పోషణయందు మరియు నిర్దేశకత్వమందు వారు సహాయపడిరి, ఆవిధముగా గవర్నింగ్ బాడి రూపుదిద్దుకొనినది. యిది సాక్ష్యాధారముగా యెహోవా అదృశ్య చురుకైన శక్తి లేక పరిశుద్ధాత్మ నడిపింపుక్రింద, మరియు క్రైస్తవసంఘమునకు శిరస్సయిన యేసు క్రీస్తు నిర్దేశకత్వమందు జరిగినది.”
21. (ఎ) ఆత్మీయాహారమును పంచిపెట్టుచున్నట్లుగా క్రీస్తు ఎవరిని కనుగొనెను, మరియు ఆయన వారికెట్లు ప్రతిఫలమిచ్చెను? (బి) నమ్మకమైన దాసుని అతని గవర్నింగ్ బాడి కొరకు ఏమి వేచియుండెను?
21 1918లో తన దాసులని చెప్పుకొనుచున్నవారిని యేసు క్రీస్తు పరీక్షించినప్పుడు, బైబిలు సత్యములను యిటు సంఘమందలి వారికొరకును, బయట ప్రకటించుపనియందు ఉపయోగించుట కొరకును ప్రచురించుచున్న ఒక అంతర్జాతీయ క్రైస్తవ గుంపును ఆయన కనుగొనెను. 1919లో “యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తిమీద వానినుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని క్రీస్తు ముందేచెప్పినట్లుగా ఉండెను. (మత్తయి 24:46, 47) ఈ నిజమైన క్రైస్తవులు యజమానుని సంతోషములో పాలుపంచుకొనిరి. “కొంచెములో” నమ్మకస్థులుగా ఉండుటవలన వారు, “అనేకమైన వాటిమీద” నియమింపబడిరి. (మత్తయి 25:21) మరింత గొప్పపనికి సిద్ధముగా, నమ్మకమైన దాసుడు మరియు అతని గవర్నింగ్ బాడి తగిన స్థానమందుండెను. యిదిలా వున్నందుకు మనమెంతగా సంతోషించవచ్చును! ఏలయనగా నమ్మకమైన దాసుని మరియు అతని గవర్నింగ్ బాడియొక్క అంకితభావ సేవనుండి భక్తులైన క్రైస్తవులు బహుగా ప్రయోజనము పొందుచున్నారు. (w90 3/15)
గుర్తుంచుకొనవలసిన ముఖ్యాంశములు
◻ దేవునియింటి శిరస్సు ఎవరైయున్నారు, మరియు ఆయన ఎవరికి అధికార ప్రాతినిధ్యమునిచ్చియున్నాడు?
◻ దాసుని తరగతికి క్రీస్తు ఏ సముదాయక పనిని అప్పగించియున్నాడు?
◻ దాసుని తరగతియందే ఏ సముదాయక సభ చేరియుండెను, దాని ప్రత్యేక విధులు ఏమైయుండెను?
◻ దేవునియింటిని క్రీస్తు పరీక్షించవచ్చినప్పుడు, దాని సభ్యులకు ఎవరు ఆత్మీయాహారమును పెట్టుచుండిరి?
◻ ఆధునిక-దిన గవర్నింగ్ బాడి ఎట్లు ప్రత్యక్ష్యమైనది?
[10వ పేజీలోని చిత్రాలు]
మొదటి శతాబ్ద “దాసుని” గవర్నింగ్ బాడినందు అపొస్తలులు మరియు యెరూషలేము సంఘ పెద్దలు ఉండిరి