అధ్యాయం పన్నెండు
మీ బాప్తిస్మం యొక్క భావం
1. నీటి బాప్తిస్మం మనలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఎందుకు ఆసక్తికరంగా ఉండాలి?
సామాన్య శకం 29వ సంవత్సరంలో, బాప్తిస్మమిచ్చే యోహాను యొర్దాను నదిలో యేసును నీటిలోముంచి బాప్తిస్మమిచ్చాడు. ఆ సంఘటనను స్వయంగా చూసిన యెహోవా తన ఆమోదాన్ని తెలిపాడు. (మత్తయి 3:16, 17) ఆ విధంగా యేసు తన శిష్యులందరూ పాటించవలసిన ప్రమాణం ఏర్పరచాడు. మూడున్నర సంవత్సరాల తర్వాత యేసు తన శిష్యులకు ఈ ఆదేశాలు ఇచ్చాడు: ‘పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమియ్యుడి.’ (మత్తయి 28:18, 19) అక్కడ యేసు నిర్దేశించిన ప్రకారం మీరు బాప్తిస్మం పొందారా? లేనట్లయితే అలా పొందడానికి మీరు సిద్ధపడుతున్నారా?
2. బాప్తిస్మానికి సంబంధించి ఏ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవలసిన అవసరముంది?
2 మీరు బాప్తిస్మం పొందినా లేక దానికి సిద్ధపడుతున్నా, యెహోవాను సేవించాలని ఆయన నీతియుక్త నూతనలోకంలో జీవించాలని కోరుకునే ప్రతి ఒక్కరికి బాప్తిస్మం గురించి స్పష్టమైన అవగాహన ఉండడం ప్రాముఖ్యం. సమాధానాలు తెలుసుకోవలసిన ప్రశ్నల్లో ఇవి కొన్ని: నేటి క్రైస్తవ బాప్తిస్మానికి, యేసు బాప్తిస్మానికి ఉన్న భావమే ఉందా? “తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములో” బాప్తిస్మం పొందడం అంటే దాని భావమేమిటి? క్రైస్తవ నీటి బాప్తిస్మం సూచించేదానికి అనుగుణంగా జీవించడంలో ఏమి చేరివుంది?
యోహాను ఇచ్చిన బాప్తిస్మాలు
3. యోహాను బాప్తిస్మం ఎవరికి మాత్రమే పరిమితం చేయబడింది?
3 యేసు బాప్తిస్మం పొందడానికి దాదాపు ఆరునెలల ముందు, బాప్తిస్మమిచ్చే యోహాను యూదయ అరణ్యములో ఇలా ప్రకటించాడు: ‘పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందండి.’ (మత్తయి 3:1, 2) ప్రజలు యోహాను చెప్పింది విని, దానిని లక్ష్యపెట్టారు. వారు తమ పాపములను బహిరంగంగా ఒప్పుకొని, పశ్చాత్తాపపడి, ఆ తర్వాత యొర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మం పొందడానికి ఆయన వద్దకు వచ్చారు. అది యూదులు మాత్రమే తీసుకోవలసిన బాప్తిస్మం.—లూకా 1:13-16; అపొస్తలుల కార్యములు 13:23, 24.
4. మొదటి శతాబ్దంలోని యూదులు అత్యవసరంగా పశ్చాత్తాపపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
4 ఆ యూదులకు అత్యవసరంగా పశ్చాత్తాపపడవలసిన అవసరం ఏర్పడింది. సా.శ.పూ. 1513వ సంవత్సరంలో సీనాయి పర్వతమువద్ద వారి పితరులు, ఒక జనాంగంగా యెహోవా దేవునితో నిబంధన చేసుకున్నారు, అంటే ఒక అధికారిక, గంభీరమైన ఒప్పందం చేసుకున్నారు. కాని వారు ఘోరమైన పాపాలు చేయడంతో ఆ నిబంధన క్రింద తమ బాధ్యతలకు అనుగుణంగా జీవించలేదు, ఆ కారణంగా వారు ఆ నిబంధన చేత దోషులుగా ప్రకటించబడ్డారు. యేసు కాలానికల్లా వారి పరిస్థితి ప్రమాదస్థాయికి చేరింది. మలాకీ ప్రవచించిన “యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము” సమీపించింది. సా.శ. 70వ సంవత్సరంలో రోమా సైన్యాలు యెరూషలేమును, దాని దేవాలయమును, పదిలక్షల కంటే ఎక్కువ మంది యూదులను నాశనం చేసినప్పుడు ఆ “దినము” వచ్చింది. ఆ నాశనానికి ముందు ‘యెహోవా కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై’ సత్యారాధన కోసం అత్యంతాసక్తిగల బాప్తిస్మమిచ్చు యోహాను పంపించబడ్డాడు. వారు మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేసిన పాపాల విషయమై పశ్చాత్తాపపడి, వారి కోసం యెహోవా పంపబోయే దేవుని కుమారుడైన యేసును అంగీకరించేందుకు సిద్ధపడాలి.—మలాకీ 4:4-6; లూకా 1:17; అపొస్తలుల కార్యములు 19: 4.
5. (ఎ) యేసు బాప్తిస్మం పొందడానికి వచ్చినప్పుడు, యోహాను దానిని ఎందుకు ప్రశ్నించాడు? (బి) యేసు నీటి బాప్తిస్మం దేనిని సూచించింది?
5 బాప్తిస్మం పొందడానికి యోహాను వద్దకు వచ్చినవారిలో యేసు కూడా ఉన్నాడు. కానీ ఎందుకు? ఒప్పుకునేందుకు యేసు ఏ పాపం చేయలేదని తెలిసిన యోహాను ఇలా అన్నాడు: “నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చుచున్నావా?” కాని యేసు బాప్తిస్మం మరో విషయాన్ని సూచించనుంది. అందుకే యేసు ఇలా సమాధానమిచ్చాడు: “ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది.” (మత్తయి 3:13-15) యేసులో ఎలాంటి పాపమూ లేదు కాబట్టి ఆయన బాప్తిస్మం పాప ప్రాయశ్చిత్తాన్ని సూచించలేదు; ఆయన అప్పటికే యెహోవాకు సమర్పించుకున్న జనాంగంలోని సభ్యుడు కాబట్టి, తనను తాను దేవునికి సమర్పించుకోవలసిన అవసరం కూడా లేదు. బదులుగా 30వ యేట ఆయన పొందిన బాప్తిస్మం ఆయనకు విలక్షణమైనది, తన పరలోకపు తండ్రి భావిచిత్తాన్ని నెరవేర్చడానికి తనను తాను ఆయనకు సమర్పించుకోవడాన్ని అది సూచించింది.
6. తన కోసమైన దేవుని చిత్తం చేసే విషయాన్ని యేసు ఎంత గంభీరంగా తీసుకున్నాడు?
6 క్రీస్తు యేసు కోసమైన దేవుని చిత్తంలో రాజ్యానికి సంబంధించిన పని చేరివుంది. (లూకా 8: 1) విమోచన క్రయధనముగా, ఒక క్రొత్త నిబంధనకు ఆధారంగా ఆయన తన పరిపూర్ణ మానవ జీవితమును బలిగా అర్పించడం కూడా దానిలో చేరివుంది. (మత్తయి 20:28; 26:26-28; హెబ్రీయులు 10:5-10) యేసు తన నీటి బాప్తిస్మం సూచించిన విషయాన్ని ఎంతో గంభీరంగా తీసుకున్నాడు. తన అవధానం ఇతర విషయాలపైకి మళ్ళేందుకు ఆయన అనుమతించలేదు. భూమిపై తన జీవితం ముగిసే వరకు ఆయన ప్రకటనా పనినే తన ముఖ్యమైన పనిగా చేసుకొని నమ్మకంగా దేవుని చిత్తం చేశాడు.—యోహాను 4:34.
క్రైస్తవ శిష్యుల నీటి బాప్తిస్మం
7. సా.శ. 33 నుండి బాప్తిస్మానికి సంబంధించి ఏమి చెయ్యాలని క్రైస్తవులకు చెప్పబడింది?
7 యేసు మొదటి శిష్యులు యోహాను ద్వారా నీటి బాప్తిస్మం పొంది, పరలోక రాజ్యపు భావి సభ్యులుగా యేసు వద్దకు నడిపించబడ్డారు. (యోహాను 3:25-30) యేసు నిర్దేశం ప్రకారం ఆ శిష్యులు కూడా కొందరికి బాప్తిస్మమిచ్చారు, వారిచ్చిన బాప్తిస్మానికి యోహాను ఇచ్చిన బాప్తిస్మానికివున్న ప్రాముఖ్యత ఒకటే. (యోహాను 4:1-3) అయితే సా.శ. 33 పెంతెకొస్తు నుండి వారు “తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి” బాప్తిస్మమివ్వాలనే ఆజ్ఞను నెరవేర్చడం ప్రారంభించారు. (మత్తయి 28:19) దాని భావమేమిటో సమీక్షించడం ఎంతో ప్రయోజనకరమని మీరు తెలుసుకుంటారు.
8. ‘తండ్రి నామములో’ బాప్తిస్మం పొందడం అంటే దాని భావమేమిటి?
8 ‘తండ్రి నామములో’ బాప్తిస్మం పొందడం అంటే దాని భావమేమిటి? అంటే ఆయన నామాన్ని, ఆయన స్థానాన్ని, ఆయన అధికారాన్ని, ఆయన సంకల్పాన్ని, ఆయన నియమాలను అంగీకరించడమని దాని భావం. దానిలో ఏమి చేరివుందో పరిశీలించండి. (1) ఆయన నామము గురించి కీర్తన 83: 18 ఇలా చెబుతోంది: “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవు.” (2) ఆయన స్థానం గురించి యిర్మీయా 10: 10 ఇలా చెబుతోంది: “యెహోవాయే నిజమైన దేవుడు.” (3) ఆయన అధికారం గురించి ప్రకటన 4: 10, 11 మనకు ఇలా చెబుతోంది: “ప్రభువా [యెహోవా] మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు.” (4) యెహోవా మన జీవదాత అని కూడా అంగీకరించాలి, ఆయన మనలను పాపమరణాల నుండి కాపాడడానికి సంకల్పించాడు: “రక్షణ యెహోవాది.” (కీర్తన 3: 8; 36: 9) (5) యెహోవా సర్వోన్నత న్యాయాధిపతి అని మనం అంగీకరించాలి: “యెహోవా మనకు న్యాయాధిపతి యెహోవా మన శాసనకర్త యెహోవా మన రాజు.” (యెషయా 33:22) ఆయనకు ఆ స్థానాలన్ని ఉన్నాయి కాబట్టి మనకు ఇలా ఉద్బోధించబడింది: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును [యెహోవాను] ప్రేమింపవలెను.”—మత్తయి 22:37.
9. ‘కుమారుని నామములో’ బాప్తిస్మం పొందడం అంటే దాని భావమేమిటి?
9 ‘కుమారుని నామములో’ బాప్తిస్మం పొందడం అంటే దాని భావమేమిటి? అంటే యేసు పేరును, ఆయన స్థానాన్ని, ఆయన అధికారాన్ని గుర్తించడమని దాని భావం. యేసు అనే ఆయన పేరుకు “యెహోవాయే రక్షణ” అని అర్థం. ఆయన దేవుని అద్వితీయ కుమారుడు, సర్వసృష్టికి ఆదిసంభూతుడు అనే వాస్తవం ఆయన స్థానాన్ని తెలియజేస్తుంది. (మత్తయి 16:16; కొలొస్సయులు 1:15, 16) ఈ కుమారుని గురించి యోహాను 3: 16 మనకు ఇలా చెబుతోంది: “దేవుడు లోకమును [విమోచింపదగిన మానవాళిని] ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” యేసు నమ్మకస్థుడిగా మరణించాడు కాబట్టి దేవుడు ఆయనను మృతులలో నుండి పునరుత్థానం చేసి ఆయనకు మరింత అధికారాన్నిచ్చాడు. అపొస్తలుడైన పౌలు ప్రకారం, దేవుడు విశ్వంలో ‘ఆయనను [యేసును] అధికముగా హెచ్చించాడు’ అంటే యెహోవా తర్వాతి స్థానాన్నిచ్చాడు. అందుకే ‘ప్రతివాని మోకాలును యేసునామమున వంగాలి, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకోవాలి.’ (ఫిలిప్పీయులు 2:9-11) అంటే స్వయంగా యెహోవా నుండి వచ్చే యేసు ఆజ్ఞలను పాటించాలి.—యోహాను 15:10.
10. ‘పరిశుద్ధాత్మ నామములో’ బాప్తిస్మం పొందడం అంటే దాని భావమేమిటి?
10 ‘పరిశుద్ధాత్మ నామములో’ బాప్తిస్మం పొందడం అంటే దాని భావమేమిటి? అంటే పరిశుద్ధాత్మ పాత్రను, కార్యకలాపాలను గుర్తించడమని దాని భావం. పరిశుద్ధాత్మ అంటే ఏమిటి? అది యెహోవా చురుకైన శక్తి, ఆయన దానిని ఉపయోగించి తన సంకల్పాలను నెరవేరుస్తాడు. యేసు తన అనుచరులకు ఇలా చెప్పాడు: “నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును.” (యోహాను 14:16, 17) అది వారేమి చేయడానికి శక్తినిస్తుంది? యేసు వారికి ఇంకా ఇలా చెప్పాడు: “పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు.” (అపొస్తలుల కార్యములు 1: 8) పరిశుద్ధాత్మ ద్వారా యెహోవా బైబిలు వ్రాయబడేలా కూడా ప్రేరేపించాడు: “ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.” (2 పేతురు 1:21) కాబట్టి మనం బైబిలును అధ్యయనం చేసినప్పుడు పరిశుద్ధాత్మ పాత్రను అంగీకరిస్తాం. పరిశుద్ధాత్మను అంగీకరించడానికి మరొక మార్గం, ‘ఆత్మ ఫలాన్ని’ అంటే “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము”లను ఫలింపజేసేందుకు మనకు సహాయం చేయమని యెహోవాను వేడుకోవడం.—గలతీయులు 5:22.
11. (ఎ) బాప్తిస్మానికి నేడు ఎలాంటి నిజమైన ప్రాముఖ్యత ఉంది? (బి) బాప్తిస్మం తీసుకోవడం ఏ భావంలో మరణించి, తిరిగి సజీవులవడం వంటిది?
11 యేసు ఆదేశాలకు అనుగుణంగా బాప్తిస్మం పొందిన మొదటివారు యూదులు, యూదామత ప్రవిష్టులు, వారు సా.శ. 33వ సంవత్సరం నుండి బాప్తిస్మం పొందడం ఆరంభించారు. తర్వాత కొంతకాలానికి క్రైస్తవ శిష్యులుగా ఉండే ఆధిక్యత సమరయులకు లభించింది. ఆ తర్వాత సా.శ. 36 లో ఆ ఆహ్వానం సున్నతి పొందని అన్యులకు కూడా విస్తరింపజేయబడింది. సమరయులు, అన్యులు బాప్తిస్మం పొందే ముందు యెహోవా కుమారుని శిష్యులుగా సేవచేయడానికి ఆయనకు వ్యక్తిగతంగా సమర్పించుకోవాలి. నేటి వరకు క్రైస్తవ నీటి బాప్తిస్మానికి అదే ప్రాముఖ్యత ఉంది. బాప్తిస్మం సూచనార్థకంగా పాతిపెట్టడం వంటిది కాబట్టి ఈ వ్యక్తిగత సమర్పణకు నీటిలో పూర్తిగా మునగడం సరైన చిహ్నంగా ఉంటుంది. బాప్తిస్మపు నీటిలో మీరు మునగడం, మీ పాత జీవిత విధానం విషయంలో మరణించడాన్ని సూచిస్తుంది. ఆ నీటి నుండి పైకి రావడం, దేవుని చిత్తం చేయడానికి మీరు సజీవులు కావడాన్ని సూచిస్తుంది. నిజ క్రైస్తవులుగా మారిన వారందరికి ఈ “బాప్తిస్మ మొక్కటే” అన్వయిస్తుంది. బాప్తిస్మం పొందినప్పుడు వారు యెహోవాకు క్రైస్తవ సాక్షులుగా, దేవుని నియమిత పరిచారకులుగా తయారవుతారు.—ఎఫెసీయులు 4: 5; 2 కొరింథీయులు 6: 3, 4.
12. క్రైస్తవ నీటి బాప్తిస్మం దేనికి సాదృశ్యంగా ఉంది, ఎలా?
12 అలాంటి బాప్తిస్మానికి దేవుని దృష్టిలో గొప్ప రక్షణ విలువ ఉంది. ఉదాహరణకు అపొస్తలుడైన పేతురు, జలప్రళయం వచ్చినప్పుడు నోవహు, ఆయన కుటుంబం కాపాడబడిన ఓడ నిర్మాణం గురించి ప్రస్తావించిన తర్వాత ఇలా వ్రాశాడు: “దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది; అదేదనగా శరీరమాలిన్యము తీసివేయుట కాదుగాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.” (ఇటాలిక్కులు మావి.) (1 పేతురు 3:21) దేవుడు నియమించిన పనిని నోవహు నమ్మకంగా చేశాడనడానికి ఆ ఓడ స్పష్టమైన నిదర్శనం. ఓడ పని పూర్తయిన తర్వాత, ‘అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించింది.’ (2 పేతురు 3: 6) కాని నోవహు ఆయన కుటుంబము ‘అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందారు.’—1 పేతురు 3:19, 20.
13. ఒక క్రైస్తవుడు నీటి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా దేనినుండి రక్షించబడతాడు?
13 నేడు, పునరుత్థానుడైన యేసుపై విశ్వాసం ఆధారంగా యెహోవాకు తమను తాము సమర్పించుకున్నవారు, ఆ సమర్పణకు సూచనగా బాప్తిస్మం పొందుతారు. మన కాలానికి సంబంధించి దేవుని చిత్తం చేస్తూ వారు ప్రస్తుత దుష్టలోకం నుండి రక్షించబడతారు. (గలతీయులు 1:3, 4) ప్రస్తుత దుష్ట విధానంతోపాటు వారు ఎంతమాత్రం నాశనం చేయబడరు. వారు ఆ నాశనం నుండి రక్షించబడతారు, వారికి దేవుడు మంచి మనస్సాక్షిని అనుగ్రహిస్తాడు. అపొస్తలుడైన యోహాను దేవుని సేవకులకు ఇలా హామీ ఇస్తున్నాడు: “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.”—1 యోహాను 2:17.
మన బాధ్యతలకు తగినట్లు జీవించడం
14. బాప్తిస్మం పొందడమంటే రక్షించబడినట్లే అని ఎందుకు అనుకోకూడదు?
14 బాప్తిస్మం పొందడమంటే తప్పకుండా రక్షించబడినట్లే అని ఓ నిర్ధారణకు రావడం పొరపాటు. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ద్వారా తనను తాను యెహోవాకు నిజంగా సమర్పించుకొని, తదనంతరం అంతం వరకు నమ్మకంగా ఉంటూ దేవుని చిత్తం చేసినప్పుడే ఆ బాప్తిస్మానికి విలువ ఉంటుంది. “అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును.”—మత్తయి 24:13.
15. (ఎ) బాప్తిస్మం పొందిన క్రైస్తవులకు నేడు దేవుని చిత్తమేమిటి? (బి) క్రైస్తవ శిష్యులుగా ఉండడం మన జీవితాల్లో ఎంత ప్రాముఖ్యమైనదిగా ఉండాలి?
15 యేసుకు సంబంధించి దేవుని చిత్తంలో, ఆయన మానవునిగా తన జీవితాన్ని ఎలా గడిపాడు అనే విషయం కూడా చేరివుంది. ఆయన మరణించి తన జీవితాన్ని ఒక బలిగా అర్పించాలి. మన విషయంలోనైతే, మనం మన శరీరాలను దేవునికి సమర్పించి ఆయన చిత్తం చేయడం ద్వారా స్వయంత్యాగపూరిత జీవితం గడపాలి. (రోమీయులు 12:1, 2) మనం అప్పుడప్పుడు ఉద్దేశపూర్వకంగా మన చుట్టూవున్న లోకంలోని ప్రజలవలే ప్రవర్తిస్తే లేదా దేవునికి కేవలం నామకార్థంగా సేవచేస్తూ స్వార్థపూరిత లక్ష్యాల చుట్టు మన జీవితాలను నిర్మించుకుంటే మనం ఖచ్చితంగా దేవుని చిత్తం చేసేవారిగా ఉండము. (1 పేతురు 4:1-3; 1 యోహాను 2:15, 16) ఒక యూదుడు తాను నిత్యజీవము పొందడానికి ఏమి చేయాలి అని అడిగినప్పుడు, యేసు నైతికంగా పరిశుభ్రమైన జీవితం గడపడంలోని ప్రాముఖ్యతను అతనికి గుర్తుచేశాడు. కాని ఆ తర్వాత ఆయన మరింత ప్రాముఖ్యమైన విషయాన్ని సూచించాడు: ఒక వ్యక్తి క్రైస్తవ శిష్యునిగా అంటే యేసు అనుచరునిగా ఉండాలి. అదే జీవితంలో ప్రధానమైనదిగా ఉండాలి. భౌతిక లక్ష్యాల కారణంగా దానికి రెండవ స్థానమివ్వకూడదు.—మత్తయి 19:16-21.
16. (ఎ) రాజ్యానికి సంబంధించి క్రైస్తవులందరికి ఎలాంటి బాధ్యతవుంది? (బి) 116, 117 పేజీలలో సూచించబడినట్లు, రాజ్య పని చేసేందుకు కొన్ని సమర్థవంతమైన మార్గాలేవి? (సి) సాక్ష్యపు పనిలో మనం హృదయపూర్వకంగా పాల్గొంటే, అది దేనికి నిదర్శనంగా ఉంటుంది?
16 యేసు కోసమైన దేవుని చిత్తంలో, దేవుని రాజ్యానికి సంబంధించిన అవశ్యమైన కార్యకలాపాలు చేరివున్నాయని మళ్ళీ నొక్కిచెప్పుకోవాలి. యేసు రాజుగా అభిషేకించబడ్డాడు. కాని ఆయన భూమిపై ఉన్నప్పుడు, ఆయన కూడా ఆ రాజ్యం గురించి అత్యంతాసక్తితో సాక్ష్యమిచ్చాడు. మనం కూడా అదేవిధమైన సాక్ష్యపు పని చెయ్యాలి, ఆ పనిలో హృదయపూర్వకంగా పాల్గొనడానికి మనకు ఎన్నో కారణాలున్నాయి. అలాచేయడం ద్వారా మనం యెహోవా సర్వాధిపత్యంపట్ల మన కృతజ్ఞతను, తోటిమానవులపట్ల మన ప్రేమను వ్యక్తంచేయవచ్చు. (మత్తయి 22:36-40) ప్రపంచవ్యాప్తంగా ఉన్న తోటి ఆరాధకులతో మనం ఐక్యంగా ఉన్నామని కూడా మనం చూపిస్తాం, వారందరూ రాజ్య ప్రచారకులే. ప్రపంచవ్యాప్తంగా ఐక్యంగావున్న మనందరం ఆ రాజ్యానికి చెందిన భూపరిధిలో నిత్యం జీవించే లక్ష్యం వైపు ముందుకు సాగుదాం.
పునఃసమీక్షా చర్చ
• యేసు బాప్తిస్మానికి, నేటి నీటి బాప్తిస్మానికి మధ్య ఎలాంటి పోలికలు, తేడాలు ఉన్నాయి?
• “తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములో” బాప్తిస్మం పొందడమంటే దాని భావమేమిటి?
• క్రైస్తవ నీటి బాప్తిస్మానికి తగినట్లు జీవించడంలో ఏమి చేరివుంది?
[116, 117వ పేజీలోని చిత్రాలు]
రాజ్యాన్ని ప్రకటించేందుకు కొన్ని మార్గాలు
బంధువులకు
తోటి ఉద్యోగస్థులకు
తోటి విద్యార్థులకు
వీధులలో
ఇంటింటికి వెళ్ళడం
ఆసక్తిగలవారిని సందర్శించేందుకు తిరిగి వెళ్ళడం
గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహించడం