యేసు—‘పురాతన కాలం నుండి ఆరంభం’ కలిగివున్న పరిపాలకుడు
ఎంతో కాలంపాటు మీరు కలవని ఒక బంధువు వస్తున్నాడని తెలిసినప్పుడు మీరు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. చివరకు మీరు ఆయనని కలుసుకుని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానిస్తారు. మిమ్మల్ని దర్శించేందుకు ఆయన తండ్రి ఆయనను ఎందుకు పంపించాడో చెబుతుంటే మీరు శ్రద్ధగా వింటారు. తర్వాత ఆయన ఇంటికి వెళ్లిపోయే సమయం త్వరగా వచ్చేస్తుంది. మీరు ఎంతో బాధగా ఆయనకు వీడుకోలు చెబుతారు. ఆయన వెళ్లిపోయినప్పుడు కలిగిన వెలితి, ఆయన క్షేమంగా ఇల్లు చేరాడన్న వార్త మీకు అందినప్పుడు పూరించబడుతుంది.
తర్వాత, కొన్ని పాత కాగితాలను వెదుకుతుంటే, మీ బంధువు మిమ్మల్ని కలిసేందుకు ప్రయాణం ప్రారంభించడానికి ఎంతో కాలం ముందు ఆయన చేసిన ఘనకార్యాలను గురించి క్లుప్తంగా ప్రస్తావించిన ఉత్తరాలను చూస్తారు. ఆ ఉత్తరాలు ఆయన పూర్వ చరిత్రను గురించి ఆసక్తికరమైన విషయాలను మీకు తెలియజేస్తాయి ఇంకా అవి ఆయన సందర్శనం, ఆయన ప్రస్తుత పని విషయంలో మీ మెప్పుకోలును వృద్ధి చేస్తాయి.
“పురాతన కాలం నుండి”
మొదటి శతాబ్దపు యూదులకు అందుబాటులో ఉన్న పాత కాగితాల్లో, అప్పటికి దాదాపు 700 సంవత్సరాల పూర్వం దేవుని ప్రవక్త అయిన మీకా నమోదు చేసిన వ్రాతలు ఉన్నాయి. అవి మెస్సీయ జన్మ స్థలాన్ని గురించి చెబుతాయి. “బేత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదాలో అతి చిన్న గ్రామానివి. నీ వంశం లెక్కపెట్టటానికి కూడా అతి చిన్నది. అయినప్పటికీ, నీ నుండే నా “ఇశ్రాయేలు పాలకుడు” వస్తాడు. ఆయన ఆరంభం (ఉనికి) పురాతన కాలం నుండి, ఆద్యంతములు లేని రోజులనుండి ఉంటూవుంది.” (మీకా 5:2, పరిశుద్ధ బైబల్) ఆ మాటలకు తగిన విధంగానే, ఇప్పుడు సా.శ.పూ. 2వ సంవత్సరం అని మనం పిలుస్తున్న సంవత్సరంలో యేసు యూదా గ్రామమైన బేత్లెహేములో జన్మించాడు. అయితే ఆయన ఆరంభము ‘పురాతన కాలం నుండి’ ఎలా ఉండగలదు?
యేసు మానవపూర్వ ఉనికిని కలిగి ఉన్నాడు. కొలొస్సయులకు వ్రాసిన తన ఉత్తరంలో, యేసు “అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు” అని అపొస్తలుడైన పౌలు వర్ణించాడు. (ఇటాలిక్కులు మావి.)—కొలొస్సయులు 1:15.
జ్ఞానానికి మూలమైన యెహోవా, తన మొదటి కుమారుణ్ని, అంటే సామెతల గ్రంథంలో రాజైన సొలొమోను రికార్డు చేసిన ప్రేరేపిత వ్యక్తీకరణను ఉపయోగించి చెప్పాలంటే, తన ‘కార్యములలో ప్రథమమైన’ వానిగా ఆయనను సృష్టించాడు. యేసు భూమి మీదకు వచ్చిన తర్వాతా, పరలోకానికి తిరిగి వెళ్లినప్పుడూ, తాను వాస్తవంగా “దేవుని సృష్టికి ఆదియైనవాడిన”ని యేసు సాక్ష్యమిచ్చాడు. జ్ఞానానికి వ్యక్తి రూపం ఇవ్వబడినవానిగా, “[యెహోవా] ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు . . . నేనక్కడ నుంటిని” అని మానవపూర్వ యేసు ప్రకటించాడు.—సామెతలు 8:22, 23, 27; ప్రకటన 3:14.
ఆరంభం నుండి, దేవుని కుమారుడు ఒక ప్రత్యేకమైన నియామకాన్ని అందుకున్నాడు; అది తన తండ్రి ప్రక్కన “ప్రధానశిల్పి”గా ఉండటమే. ఇది యెహోవాకు ఎంతో ఆనందాన్ని తీసుకు వచ్చింది! “నా మూలంగా యెహోవా ప్రతి రోజూ సంతోషించాడు. ఆయన ముందు నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాను” అని సామెతలు 8:30 పేర్కొంటోంది. (పరిశుద్ధ బైబల్)
తర్వాత మానవులను సృష్టించే పనిలో తనతో భాగం వహించమని యెహోవా తన ఈ జ్యేష్ఠ కుమారుణ్ని ఆహ్వానించాడు. “మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము” అని ఆయన ప్రకటించాడు. (ఆదికాండము 1:26) దాని ఫలితంగా, మరొక అనుబంధం పెరిగింది. “నరులను చూచి ఆనందించుచునుంటిని” అని మానవపూర్వపు యేసు వివరించాడు. (సామెతలు 8:31) తన సువార్త ప్రారంభంలో, అపొస్తలుడైన యోహాను సృష్టి కార్యంలో మానవపూర్వపు యేసు యొక్క పాత్రను ఇలా గుర్తించాడు: “సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.”—యోహాను 1:2, 3.
యెహోవా ప్రతినిధి
యోహాను మాటలు దేవుని కుమారుని మరొక ఆధిక్యత వైపుకు అంటే ఒక ప్రతినిధిగా ఉండే ఆధిక్యత వైపుకు మన అవధానాన్ని మళ్లిస్తున్నాయి. మొదటి నుండీ ఆయన వాక్యముగా పని చేశాడు. అలా, యెహోవా ఆదాముతో మాట్లాడినప్పుడు తర్వాత ఆదామూ హవ్వలతో మాట్లాడినప్పుడు బహుశ ఆ వాక్యము ద్వారానే మాట్లాడి ఉంటాడు. మరి మానవుని సంక్షేమం కొరకైన దేవుని ఉపదేశాలను వారి పట్ల ఆప్యాయతగల వ్యక్తి కంటే మరింకెవరు చక్కగా అందించగలరు?—యోహాను 1:1, 2.
మొదట హవ్వా తర్వాత ఆదాము తమ సృష్టికర్తకు అవిధేయత చూపినప్పుడు అది వాక్యముకు ఎంత బాధ కలిగించి ఉంటుందో కదా! వారి అవిధేయత వారి పిల్లలపై తెచ్చిన కష్టాలను తీసి వేయాలని ఆయన ఎంతగా పరితపించి ఉంటాడో కదా! (ఆదికాండము 2:15-17; 3:6, 8; రోమీయులు 5:12) తిరుగుబాటు చేయమని హవ్వను ప్రోద్బలపరచిన సాతానుతో మాట్లాడుతూ యెహోవా ఇలా ప్రకటించాడు: “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను.” (ఆదికాండము 3:15) ఏదెనులో ఏమి సంభవించిందో చూసిన వాడై, స్త్రీ “సంతానము”లోని ప్రాథమిక భాగంగా తాను తీవ్రమైన ద్వేషానికి గురౌతానని వాక్యం గుర్తించాడు. సాతాను నరహంతకుడని ఆయనకు తెలుసు.—యోహాను 8:44.
తర్వాత, నమ్మకస్థుడైన యోబు యథార్థతను సాతాను ప్రశ్నించినప్పుడు, తన తండ్రికి విరుద్ధంగా చేయబడిన అబద్ధ నేరారోపణలను బట్టి వాక్యము ఎంతో తీవ్రంగా ఆగ్రహించి ఉంటాడు. (యోబు 1:6-10; 2:1-4) వాస్తవానికి, ప్రధాన దూతగా తన పాత్రలో, వాక్యము మిఖాయేలు అని పిలువబడ్డాడు, మరి ఆ పేరు యొక్క అర్థం “దేవుని వంటి వాడు ఎవడు?” మరి దేవుని సర్వాధిపత్యాన్ని ఎదిరించాలని అనుకునే వాళ్లందరికీ విరుద్ధంగా ఆయన యెహోవాను ఎలా సమర్థిస్తాడనే దాన్ని ఆ పేరు సూచిస్తుంది.—దానియేలు 12:1; ప్రకటన 12:7-10.
ఇశ్రాయేలీయుల చరిత్ర అభివృద్ధి చెందుతున్న కొలదీ, మానవులను పవిత్రారాధన నుండి దూరం చేయాలన్న సాతాను ప్రయత్నాలను వాక్యము గమనించాడు. ఐగుప్తు నుండి వాళ్లు బయటకు వచ్చిన తర్వాత, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు: “ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగానుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు; మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది.” (నిర్గమకాండము 23:20, 21) ఈ దేవదూత ఎవరు? మానవపూర్వపు యేసే అయి ఉండవచ్చు.
విశ్వసనీయమైన విధేయత
మోషే సా.శ.పూ. 1473లో మరణించాడు, ఆయన శరీరాన్ని ‘బెత్పయోరు యెదుట మోయాబు దేశములోనున్న లోయలో పాతిపెట్టారు.’ (ద్వితీయోపదేశకాండము 34:5, 6) సాతాను ఆ శవాన్ని బహుశ విగ్రహారాధనను ప్రేరేపించేందుకు ఉపయోగించాలని అనుకున్నాడని అర్థమౌతుంది. మిఖాయేలు దీన్ని అడ్డుకున్నాడు అయితే తన తండ్రి అయిన యెహోవా అధికారానికి లోబడ్డాడు. ‘అపవాదితో వాదించుచు దూషించి తీర్పుతీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక’ అని మిఖాయేలు సాతానును హెచ్చరించాడు.—యూదా 9.
ఇశ్రాయేలు జనాంగం తర్వాత వాగ్దాన దేశమైన కనానును జయించడం మొదలైంది. యెరికో పట్టణం దగ్గర్లో, వాక్యము ఆ జనాంగాన్ని ఎడతెగకుండా పర్యవేక్షిస్తున్నాడనే నిశ్చయతను యెహోషువ అందుకున్నాడు. అక్కడ దూసిన కత్తి చేతపట్టుకుని ఉన్న ఒక వ్యక్తిని ఆయన కలిశాడు. యెహోషువ ఆ అపరిచయస్థుడి వద్దకు వెళ్లి, “నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధులపక్షముగా నున్నవాడవా?” అని అడిగాడు. “కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చియున్నాన”ని చెబుతూ ఆ అపరిచయస్థుడు తానెవరో తెలియజేసినప్పుడు యెహోషువకు ఎంత ఆశ్చర్యం కలిగి ఉంటుందో ఊహించండి. తర్వాత “అభిషిక్తుడగు అధిపతి”గా కాబోయే మానవపూర్వ యేసు అయిన యెహోవా యొక్క ఉన్నతపర్చబడిన ఈ ప్రతినిధి ఎదుట యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కరించాడంటే అందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదు.—యెహోషువ 5:13-15; దానియేలు 9:25.
దేవుని ప్రవక్త అయిన దానియేలు దినాల్లో సాతాను మళ్లీ ఎదిరించాడు. ఈ సందర్భంలో, పారసీకుల దుష్ట రాజ్యాధిపతి మూడు వారాలు ‘ఎదిరించినప్పుడు’ మిఖాయేలు తన తోటి దూతకు మద్దతు నిచ్చాడు. ఆ దూత ఇలా వివరించాడు: “ఇంక పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను.”—దానియేలు 10:13, 21.
మానవపూర్వ మహిమ మరియు మానవుడిగా ఉన్నప్పటి మహిమ
యూదా రాజైన ఉజ్జియా మరణించిన సంవత్సరమైన సా.శ.పూ. 778లో, దేవుని ప్రవక్త అయిన యెషయా యెహోవా తన అత్యున్నత సింహాసనంపైన ఆసీనుడై ఉన్న దర్శనాన్ని చూశాడు. “నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని” యెహోవా అడిగాడు. (ఇటాలిక్కులు మావి.) నేను పోతానని యెషయా ముందుకొచ్చాడు, అయితే ఆయన ప్రకటనలకు ఆయన తోటి ఇశ్రాయేలీయులు ప్రతిస్పందించరని యెహోవా ఆయనను హెచ్చరించాడు. అపొస్తలుడైన యోహాను మొదటి శతాబ్దానికి చెందిన అపనమ్మకస్థులైన యూదులను యెషయా కాలంలోని ప్రజలకు పోల్చుతూ, ఇలా పేర్కొన్నాడు: “యెషయా ఆయన మహిమను చూచినందున ఆయననుగూర్చి ఈ మాటలు చెప్పెను.” ఎవరి మహిమ? యెహోవా మహిమనూ మరియు పరలోక సభలో ఆయన ప్రక్కన ఉన్న మానవపూర్వపు యేసు మహిమనూ చూశాడు.—యెషయా 6:1, 8-10; యోహాను 12:37-41.
కొన్ని శతాబ్దాల తర్వాత, అప్పటి వరకూ యేసుకు లభించిన నియామకాల్లో అతి గొప్పది వచ్చింది. యెహోవా తన ప్రియ కుమారుని జీవాన్ని పరలోకం నుండి మరియ గర్భంలోకి మార్చాడు. తొమ్మిది నెలల తర్వాత ఆమె మగ శిశువు యేసుకు జన్మనిచ్చింది. (లూకా 2:1-7, 21) అపొస్తలుడైన పౌలు దాని గురించి ఇలా చెప్పాడు: “అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీయందు పు[ట్టెను].” (గలతీయులు 4:4, 5) అదే విధంగా, అపొస్తలుడైన యోహాను ఇలా అంగీకరించాడు: “ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.”—యోహాను 1:14.
మెస్సీయా ప్రత్యక్షమవ్వడం
కేవలం 12 సంవత్సరాల వయస్సులోనే, తాను తన పరలోక తండ్రి వ్యవహారాన్ని చూడటంలో పని రద్దీ కలిగి ఉండాలనే వాస్తవాన్ని యౌవనస్థుడైన యేసు గ్రహించాడు. (లూకా 2:48, 49) దాదాపు 18 సంవత్సరాల తర్వాత, యేసు బాప్తిస్మమిచ్చు యోహాను వద్దకు యొర్దాను నది దగ్గరకు వచ్చాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. యేసు ప్రార్థిస్తుండగా, పరలోకం తెరువబడింది, పరిశుద్ధాత్మ ఆయనపై వచ్చి వాలింది. తన తండ్రి ప్రక్కన లెక్కించలేనన్ని వేల లక్షల సంవత్సరాల పాటూ ఆయన ప్రధానశిల్పిగా, ప్రతినిధిగా, దేవుని సేనాధిపతిగా, మరియు మిఖాయేలను ప్రధాన దూతగా ఆయన సేవ చేయడాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటుండగా ఆ స్మృతులు వెల్లువలా ఆయన మనస్సులోకి రావడాన్ని ఊహించండి. తర్వాత “ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నా[ను]” అని బాప్తిస్మమిచ్చు యోహానుకు చెబుతున్న తన తండ్రి స్వరాన్ని వినే ఉత్తేజకరమైన సమయం వచ్చింది.—మత్తయి 3:16, 17; లూకా 3:21, 22.
బాప్తిస్మమిచ్చు యోహాను యేసు యొక్క మానవపూర్వ ఉనికిని ఏ మాత్రమూ సందేహించలేదు. యేసు ఆయనను సమీపిస్తుండగా, యోహాను ఆయననుగూర్చి ఇలా సాక్ష్యమిచ్చాడు: “ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.” ఆయన ఇంకా ఇలా జత చేశాడు: “ఈయన గురించి నేను యిదివరకే ఈ విధంగా చెప్పాను, ‘నా తర్వాత రానున్నవాడు నాకన్నా ముందు నుండి ఉన్నవాడు. కనుక ఆయన నాకన్నా గొప్పవాడు.’” (ఇటాలిక్కులు మావి.) (యోహాను 1:15, పరిశుద్ధ బైబల్, 29, 30) అపొస్తలుడైన యోహానుకు కూడా యేసు యొక్క మానవపూర్వ ఉనికిని గురించి తెలుసు. “పైనుండి వచ్చువాడు అందరికి పైనున్నవాడు” అని ఆయన వ్రాశాడు, మరియు: “పరలోకమునుండి వచ్చువాడు అందరికి పైగానుండి తాను కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సాక్ష్యమిచ్చును.” (ఇటాలిక్కులు మావి.)—యోహాను 3:31, 32.
దాదాపు సా.శ. 61వ సంవత్సరంలో, మెస్సీయా భూమిపైకి రావడం యొక్క మరియు ప్రధాన యాజకునిగా ఆయన పని యొక్క పూర్తి ప్రాముఖ్యతను గుణగ్రహించాలని అపొస్తలుడైన పౌలు హెబ్రీ క్రైస్తవులను పురికొల్పాడు. ప్రతినిధిగా యేసు పాత్ర వైపుకు అవధానాన్ని మళ్లిస్తూ, పౌలు ఇలా వ్రాశాడు: “దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. . . . ఆయనద్వారా ప్రపంచములను నిర్మించెను.” ఇది సృష్టి సమయంలో “ప్రధానశిల్పి”గా యేసు పాత్రను సూచిస్తున్నా లేక మానవున్ని సమాధానపర్చడం విషయంలో దేవుని పురోభివృద్ధికరమైన ఏర్పాట్లలో ఆయన ఇమిడి ఉండటాన్ని గురించైనా కూడా, పౌలు ఇక్కడ యేసు యొక్క మానవపూర్వ ఉనికి గూర్చిన తన సాక్ష్యాన్నిస్తున్నాడు.—హెబ్రీయులు 1:1-6; 2:9.
“పురాతన కాలం” నుండి యథార్థత
ఫిలిప్పీలోని మొదటి శతాబ్దపు క్రైస్తవులకు, పౌలు ఈ పురికొల్పునిచ్చాడు: “క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదుగాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొనెను.” (ఫిలిప్పీయులు 2:5-8) యేసు యొక్క యథార్థ ప్రవర్తనకు, ఆయనను పునరుత్థానం చేయడం ద్వారా మరియు పరలోకానికి తిరిగి ఇంటికి ఆహ్వానించడం ద్వారా యెహోవా ప్రేమపూర్వకంగా ప్రతిస్పందించాడు. కోట్లాది సంవత్సరాల తరబడి యేసు యథార్థతను చూపడం ద్వారా మనకు ఎంత చక్కని మాదిరిని ఉంచాడో కదా!—1 పేతురు 2:21.
యేసు యొక్క మానవపూర్వ ఉనికిని గురించి బైబిలు మనకు అందించిన విషయాలనుబట్టి మనం ఎంత కృతజ్ఞులమై ఉన్నాము! యథార్థమైన సేవ విషయంలో ఆయన చూపిన మాదిరిని మనం అనుకరించేందుకు అవి మన తీర్మానాన్ని తప్పకుండా బలపర్చుతాయి, ప్రాముఖ్యంగా దేవుని మెస్సీయ రాజ్యానికి రాజుగా ఆయన ఇప్పుడు పరిపాలిస్తున్నందున మనం తప్పకుండా ఆయనను అనుకరించాలి. ‘పురాతన కాలం నుండి ఆరంభం’ కలిగివున్న పరిపాలకుడు మరియు రాజు అయిన “సమాధానకర్తయగు అధిపతి”యగు క్రీస్తుయేసును మనం ఘనపర్చుదాము!—యెషయా 9:6; మీకా 5:2, పరిశుద్ధ బైబల్.
[24వ పేజీలోని బాక్సు]
మానవపూర్వ ఉనికికి సాక్ష్యాధారం
క్రింద పేర్కొనబడిన విధంగా, యేసు యొక్క స్వంత మాటలు, ఆయన మానవ పూర్వ ఉనికికి తగినన్ని సాక్ష్యాధారాలను ఇస్తున్నాయి:
◻ “పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.”—యోహాను 3:13.
◻ “పరలోకమునుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకను గ్రహించుచున్నాడు. పరలోకమునుండి దిగి వచ్చి, లోకమునకు జీవము నిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమై యున్న[ది] . . . నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని.”—యోహాను 6:32, 33, 38.
◻ “పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును.”—యోహాను 6:50, 51.
◻ “ఆలాగైతే మనుష్యకుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచినయెడల ఏమందురు?”—యోహాను 6:62.
◻ “నేను ఎక్కడనుండి వచ్చితినో యెక్కడికి వెళ్లుదునో నేనెరుగుదును . . . మీరు క్రిందివారు, నేను పైనుండువాడను; మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోకసంబంధుడను కాను.”—యోహాను 8:14, 23.
◻ “దేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చి యున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను.”—యోహాను 8:42.
◻ “అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా[ను].”—యోహాను 8:58.
◻ “తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమపరచుము. తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడ ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించితివి.”—యోహాను 17:5, 24.
[23వ పేజీలోని చిత్రం]
యెహోషువ యెహోవా సైన్యాధిపతిని కలుసుకుంటాడు