కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lr అధ్యా. 9 పేజీలు 52-56
  • తప్పు చేయాలనే కోరికకు లొంగిపోకూడదు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తప్పు చేయాలనే కోరికకు లొంగిపోకూడదు
  • గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసులా ప్రలోభాల్ని తిప్పికొట్టండి
    యేసే మార్గం, సత్యం, జీవం
  • అపవాది యేసును పరీక్షిస్తాడు
    నా బైబిలు పుస్తకం
  • యేసుకు కలిగిన శోధనలనుండి నేర్చుకొనుట
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • యేసులా ‘అపవాదిని ఎదిరించండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
మరిన్ని
గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
lr అధ్యా. 9 పేజీలు 52-56

9వ అధ్యాయం

తప్పు చేయాలనే కోరికకు లొంగిపోకూడదు

మీకు తప్పని తెలిసిన దానిని చేయమని ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా అడిగారా?— దమ్ముంటే చెయ్యమని సవాల్‌ చేశారా? లేదా, అది సరదాగా ఉంటుందని, అదంత తప్పేమీ కాదని చెప్పారా?— ఎవరైనా అలా చెప్తున్నారంటే, వాళ్లు మనతో తప్పు చేయించాలని చూస్తున్నట్లే.

ఎవరైనా అలా చేస్తుంటే మనం ఏంచేయాలి? మనం వాళ్ల మాటలు విని తప్పు చెయ్యాలా?— అలా చేయడం యెహోవా దేవునికి ఇష్టం ఉండదు. కానీ ఎవరు సంతోషిస్తారో తెలుసా?— సరిగ్గా చెప్పారు, అపవాదియైన సాతాను సంతోషిస్తాడు.

సాతాను దేవుని శత్రువు, అతను మనకు కూడా శత్రువే. అతను ఆత్మప్రాణి కాబట్టి మనం అతణ్ణి చూడలేం. కానీ అతను మనల్ని చూడగలడు. ఒకరోజు అపవాది మన గొప్ప బోధకుడైన యేసుతో మాట్లాడుతూ ఆయనతో తప్పు చేయించాలని చూశాడు. అప్పుడు యేసు ఏంచేశాడో తెలుసుకుందాం. అది తెలుసుకుంటే, ఎవరైనా మనతో తప్పు చేయించాలని చూసినప్పుడు ఏమి చేయాలో అర్థమౌతుంది.

[52వ పేజీలోని చిత్రం]

బాప్తిస్మం తీసుకున్న తర్వాత యేసుకు ఏ విషయాలు గుర్తువచ్చి ఉంటాయి?

యేసు ఎప్పుడూ దేవునికి ఇష్టమైనదే చేయాలనుకున్నాడు. అందుకే ఆయన యొర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత సాతాను ఆయనతో తప్పు చేయించాలని చూశాడు. యేసు బాప్తిస్మం తీసుకోగానే “ఆకాశము తెరవబడెను” అని బైబిలు చెప్తోంది. (మత్తయి 3:16) అంటే బహుశా అప్పుడు యేసుకు, తాను పరలోకంలో దేవునితోపాటు ఉన్నప్పుడు జరిగినవన్నీ గుర్తువచ్చి ఉంటాయి.

యేసు బాప్తిస్మం తీసుకున్న తర్వాత, తనకు గుర్తొచ్చిన విషయాల గురించి ఆలోచించడానికి అరణ్యంలోకి వెళ్లాడు. నలభై రోజులు, నలభై రాత్రులు అక్కడే గడిపాడు. అన్ని రోజులపాటు ఆయన ఏమీ తినలేదు, అందువల్ల ఆయన అప్పుడు బాగా ఆకలితో ఉన్నాడు. అప్పుడే సాతాను యేసుతో తప్పు చేయించాలని చూశాడు.

[53వ పేజీలోని చిత్రం]

రాళ్లను ఉపయోగించి, యేసుతో తప్పు చేయించాలని అపవాది ఎలా ప్రయత్నించాడు?

అపవాది ఆయనతో, ‘నువ్వు దేవుని కుమారుడివైతే ఈ రాళ్లు రొట్టెలవ్వాలని ఆజ్ఞాపించు’ అన్నాడు. అంత ఆకలితో ఉన్నప్పుడు తినడానికి రొట్టెలుంటే ఎంత బాగుంటుందో కదా! కానీ యేసు రాళ్లను రొట్టెలుగా చేయగల్గేవాడా?— చేయగల్గేవాడు. ఎలా చేయగల్గేవాడు? దేవుని కుమారుడైన యేసుకు అద్భుతాలు చేసే శక్తి ఉంది కాబట్టి చేయగలిగేవాడు.

రాళ్లను రొట్టెలుగా చేసుకోమని అపవాది మీకే గనుక చెప్పివుంటే మీరు అలా చేసి ఉండేవాళ్లా?— యేసు అప్పుడు ఆకలితో ఉన్నాడు. అందుకని, ఆ ఒక్కసారికి అలా చేస్తే ఫర్వాలేదా?— తనకున్న శక్తుల్ని అలా ఉపయోగించడం తప్పని యేసుకు తెలుసు. యెహోవా దేవుడు ప్రజల్ని తన దగ్గరకు నడిపించడానికి యేసుకు ఆ శక్తుల్ని ఇచ్చాడు. అంతేకానీ యేసు వాటిని తన కోసం ఉపయోగించుకోవడానికి ఇవ్వలేదు.

అందుకే యేసు, ‘మనిషి రొట్టెవల్ల మాత్రమే కాదుగానీ యెహోవా నోటినుండి వచ్చే ప్రతీమాట వల్ల జీవిస్తాడు’ అని బైబిల్లో ఉన్న మాటల్ని సాతానుతో అన్నాడు. తినడానికి ఏదైనా సంపాదించుకోవడంకన్నా యెహోవాకు ఇష్టమైన పనులు చేయడమే ప్రాముఖ్యమని యేసుకు తెలుసు.

కానీ అపవాది అంతటితో వదిలిపెట్టలేదు. యేసును యెరూషలేముకు తీసుకువెళ్లి, దేవాలయంలోని ఎత్తైన చోట నిలబెట్టాడు. అక్కడ సాతాను ఆయనతో, ‘నీవు దేవుని కుమారుడివైతే కిందకు దూకు. నీకు దెబ్బ తగలకుండా దేవదూతలు కాపాడతారని రాయబడివుంది కదా’ అన్నాడు.

సాతాను ఎందుకలా అన్నాడు?— యేసును రెచ్చగొట్టి ఆయనతో తెలివితక్కువ పని చేయించాలనే సాతాను అలా అన్నాడు. ఈసారి కూడా యేసు సాతాను మాట వినలేదు. ఆయన సాతానుతో, ‘నీ దేవుడైన యెహోవాను శోధించకూడదని రాయబడివుంది’ అని చెప్పాడు. ప్రాణంమీదకు వచ్చే సాహసాలు చేసి యెహోవాను పరీక్షించడం తప్పని యేసుకు తెలుసు.

అయినా సాతాను వదల్లేదు. తర్వాత అతను యేసును ఎత్తైన కొండమీదికి తీసుకెళ్లాడు. అక్కడ అతను యేసుకు మొత్తం లోక రాజ్యాలను అంటే ప్రభుత్వాలను, వాటి గొప్పతనాన్ని చూపించాడు. ‘నీవు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే, వీటన్నిటినీ నీకిస్తాను’ అని యేసుతో అన్నాడు.

అపవాది ఏమి ఇస్తానంటున్నాడో ఒకసారి ఆలోచించండి. ఈ రాజ్యాలన్నీ అంటే ప్రభుత్వాలన్నీ నిజంగా అతనివేనా?— అవి సాతానువి కాదని యేసు అనలేదు. ఒకవేళ అవి సాతానువి కాకపోతే యేసు ఆ విషయం చెప్పివుండేవాడు. కాబట్టి, నిజంగా సాతానే ఈ లోక రాజ్యాలన్నిటికీ పరిపాలకుడు. అందుకే బైబిలు అతణ్ణి, “ఈ లోకాధికారి” అని పిలుస్తోంది.—యోహాను 12:31.

[55వ పేజీలోని చిత్రం]

ఈ రాజ్యాలన్నీ ఇస్తానని సాతాను యేసుతో ఎందుకు చెప్పగలిగాడు?

తనను ఆరాధిస్తే మీకేదైనా ఇస్తానని అపవాది మీతో అన్నాడనుకోండి, మీరేమి చేస్తారు?— అపవాదిని ఆరాధించడం వల్ల ఎంత గొప్ప బహుమతి దొరికేలా ఉన్నా సరే, అలా చేయడం తప్పని యేసుకు తెలుసు. అందుకే యేసు, ‘సాతానా, పో! నీ దేవుడైన యెహోవాను మొక్కి ఆయనను మాత్రమే సేవించాలని బైబిలు చెప్తోంది’ అన్నాడు.—మత్తయి 4:1-10; లూకా 4:1-13.

[56వ పేజీలోని చిత్రం]

తప్పు చేయాలనిపించే పరిస్థితులు వస్తే మీరేమి చేస్తారు?

మనకు కూడా తప్పు చేసేలాంటి పరిస్థితులు రావచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో అలా జరగవచ్చో చెప్పగలరా?— ఒక పరిస్థితి గురించి చూద్దాం. భోజనం అయిన తర్వాత తినడానికి అమ్మ ఏదైనా స్వీటు చేసిందనుకోండి. భోజనం అయ్యేవరకు దానిని ముట్టకూడదని చెప్పింది. కానీ మీకేమో బాగా ఆకలేయడంవల్ల అది తినాలనిపిస్తోంది. మీరు అమ్మ చెప్పింది విని, దాన్ని ముట్టకుండా ఉంటారా?— మీరు అమ్మ చెప్పింది వినకూడదని సాతాను కోరుకుంటున్నాడు.

యేసు ఏమి చేశాడో గుర్తుచేసుకోండి. ఆయన కూడా అప్పుడు చాలా ఆకలితో ఉన్నాడు. అయినా, తినడంకన్నా దేవునికి ఇష్టమైనది చేయడమే ముఖ్యమని ఆయనకు తెలుసు. అమ్మ చెప్పిన మాట వింటే మీరు కూడా యేసులా ఉన్నట్లు చూపిస్తారు.

ఒకవేళ మీ తోటి పిల్లలు ఎవరైనా మీకు ఏదైనా పొడిలాంటిది ఇచ్చారనుకోండి. దాన్ని వాడితే హాయిగా అనిపిస్తుందని వాళ్లు చెప్పవచ్చు. కానీ నిజానికి అది మత్తుపదార్థం (డ్రగ్స్‌) అయ్యుండవచ్చు. అది వాడితే మీ ఆరోగ్యం పాడై, చివరకు మీరు చనిపోవచ్చు కూడా. లేదా మీకు ఎవరైనా సిగరెట్టు ఇచ్చి దమ్ముంటే కాల్చమని రెచ్చగొట్టారనుకోండి. అప్పుడు మీరేమి చేస్తారు?—

యేసు విషయం గుర్తుంది కదా. యేసు ఆలయం మీద నుండి దూకి, ప్రాణానికి హాని తెచ్చుకునేలా చేయాలని సాతాను ప్రయత్నించాడు. కానీ యేసు అలా చేయలేదు. ఏదైనా ప్రమాదకరమైన పని చేయమని ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొడితే మీరేం చేస్తారు?— యేసు సాతాను మాట వినలేదు. చెడ్డపనులు చేయమని ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొడితే మీరు కూడా అలాంటివాళ్ల మాట వినకూడదు.

[56వ పేజీలోని చిత్రం]

ఆరాధించడానికి విగ్రహాలవంటి వేటినైనా ఉపయోగించడం ఎందుకు తప్పు?

విగ్రహాలనుగానీ మరివేటినైనాగానీ ఆరాధించకూడదని బైబిలు చెప్తోంది. (నిర్గమకాండము 20:4, 5) కానీ స్కూల్లో జరిగే ఒక కార్యక్రమంలో మిమ్మల్ని అలాంటిదేదైనా చేయమని చెప్పారనుకుందాం. అలా చేయకపోతే స్కూల్లో నుండి తీసేస్తామని కూడా మిమ్మల్ని బెదిరించారనుకుందాం. అప్పుడు మీరేమి చేస్తారు?—

అందరూ సరైనదే చేస్తుంటే మనం కూడా అలా చేయడం సులభమే. కానీ వేరేవాళ్లు మనతో తప్పు చేయించాలని చూస్తున్నప్పుడు సరైనది చేయడం చాలా కష్టం. తాము చేస్తున్నది నిజంగా పెద్ద తప్పేమీ కాదని వాళ్లు అంటుండవచ్చు. కానీ ఆ విషయం గురించి దేవుడు ఏమి చెప్తున్నాడన్నదే ముఖ్యం. ఆయన చెప్పేదే సరైనది.

కాబట్టి వేరేవాళ్లు ఏమి చెప్పినా సరే, దేవుడు తప్పు అని చెప్పినవాటిని మనం ఎప్పుడూ చేయకూడదు. అప్పుడు మనం సాతాను ఇష్టపడేది కాదుగానీ దేవునికి సంతోషం కలిగించేదే ఎప్పుడూ చేస్తాం.

తప్పు చేయాలనే కోరికకు లొంగిపోకుండా ఉండాలంటే ఏమి చేయాలో తెలుసుకోవడానికి, కీర్తన 1:1, 2; సామెతలు 1:10, 11; మత్తయి 26:41; 2 తిమోతి 2:22 వచనాలను చదవండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి