కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 2/1 పేజీలు 4-7
  • సత్యం ద్వారా స్వతంత్రులమయ్యాము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సత్యం ద్వారా స్వతంత్రులమయ్యాము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మృతులను గురించిన భయం నుండి స్వాతంత్ర్యం
  • భవిష్యత్తును గురించిన భయం నుండి స్వాతంత్ర్యం
  • మనుష్యుల భయం నుండి స్వాతంత్ర్యం
  • మీరు సత్యం ద్వారా స్వతంత్రులు కాగలరు
  • “మరణము మ్రింగివేయబడెను”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • మరణించిన మీ ప్రియమైనవారు—వారిని మీరు మరలా చూడగలరా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • మరణించిన మన ప్రియమైనవారికి ఏమి సంభవిస్తుంది?
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
  • “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”
    “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 2/1 పేజీలు 4-7

సత్యం ద్వారా స్వతంత్రులమయ్యాము

అమెరికాలో, పది లక్షలకంటే ఎక్కువమంది ప్రజలు చెరసాలల్లో బంధీలైయున్నారు. వారిలో దాదాపు మూడు వేలమందికి మరణశిక్ష విధించబడింది. మిమ్మల్ని మీరు ఆ పరిస్థితిలో ఊహించుకోండి. మీరెలా భావిస్తారు? వాస్తవానికి ఆ తలంపే చాలా విషాదకరం. అయితే, ఒక భావంలో, మానవులు అందరూ అదే విధమైన పరిస్థితిలో ఉన్నారు. బైబిలు ఇలా చెబుతుంది: “అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.” (రోమీయులు 3:23) అవును, ఆదాము సంతతిగా మనం పాపభరిత స్థితిలో “బంధింపబడి” ఉన్నాము. (రోమీయులు 5:12) “వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచు కొనుచున్నది” అని వ్రాసిన క్రైస్తవ అపొస్తలుడైన పౌలు వలె మనం బంధీలుగా ఉండటం యొక్క ప్రభావాన్ని ప్రతిరోజూ అనుభవిస్తాము.—రోమీయులు 7:23.

మన పాపభరిత ప్రవృత్తి ఫలితంగా, మనలో ప్రతి ఒక్కరం మరణశిక్ష విధింపపడి ఉన్నామని చెప్పవచ్చు, ఎందుకంటే బైబిలు ఇలా పేర్కొంటుంది: “పాపమువలన వచ్చు జీతము మరణము.” (రోమీయులు 6:23) కీర్తనల గ్రంథకర్తయైన మోషే మన పరిస్థితినిలా చక్కగా వర్ణించాడు: “మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు. అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.”—కీర్తన 90:10; యాకోబు 4:14 పోల్చండి.

మానవజాతి పాప మరణాలకు బానిస అయి ఉండటాన్ని గురించి తన మనస్సులో ఉంచుకుని, యేసు తన అనుచరులకు ఇలా చెప్పాడు: ‘సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.’ (యోహాను 8:32) ఆ మాటలతో, యేసు తన అనుచరులకు రోమా పరిపాలన నుండి స్వాతంత్ర్యంకంటే ఎంతో గొప్ప దాన్ని గూర్చిన నిరీక్షణనిస్తున్నాడు, వాస్తవానికి ఆయన వారికి పాపంనుండి క్షమాపణను, మరణం నుండి విడుదలను అందిస్తున్నాడు! ఇది వారికెలా అనుగ్రహించబడుతుంది? “కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు” అని యేసు వారికి చెప్పాడు. (యోహాను 8:36) అవును, ‘కుమారుడైన’ యేసు, తన జీవాన్ని అర్పించడం ద్వారా ఆదాము పోగొట్టుకున్న దాన్ని తిరిగి కొనేందుకు ఒక ప్రాయశ్చిత్త బలిగా పని చేశాడు. (1 యోహాను 4:10) పాప మరణాలకు బంధీగా ఉన్న విధేయతగల మానవజాతి అంతా విడిపింపబడేందుకు ఇది మార్గాన్ని తెరిచింది. తన “యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు” దేవుని అద్వితీయ కుమారుడు మరణించాడు.—యోహాను 3:16.

కాబట్టి, మనలను స్వతంత్రులను చేయగల సత్యము యేసుక్రీస్తుపై కేంద్రీకరించబడింది. ఆయన అడుగుజాడలను అనుసరించే వారికి, దేవుని రాజ్యం భూమ్మీది వ్యవహారాలను అదుపు చేసేటప్పుడు పాప మరణాల నుండి స్వేచ్ఛను పొందే నిరీక్షణ ఉంటుంది. ఇప్పుడు కూడా, దేవుని వాక్య సత్యాన్ని అంగీకరించే వారు నిజమైన స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తారు. ఏ విధాల్లో?

మృతులను గురించిన భయం నుండి స్వాతంత్ర్యం

నేడు కోట్లాదిమంది మృతులను గురించిన భయంతో జీవిస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే మరణమందు ఒక ప్రాణము శరీరాన్ని వదిలి ఆత్మల లోకంలోకి తరలి వెళ్తుందని వారి మతాలు వారికి బోధించాయి. అందుకనే, కొన్ని దేశాల్లో మృతుల బంధువులు అనేక రాత్రింబగళ్లు జాగారం చేయడం సాంప్రదాయం. ఇందులో తరచూ బిగ్గరగా పాడటం, డప్పులు వాయించడం ఇమిడి ఉంటాయి. శోకించేవారు ఇది మృతుని శాంతింపజేస్తుందని, సజీవులను వెంటాడేందుకు అతడి ఆత్మ తిరిగి రాకుండా నివారిస్తుందని విశ్వసిస్తారు. మృతులను గురించిన క్రైస్తవమత సామ్రాజ్య అబద్ధ బోధలు ఈ ఆచారాన్ని కొనసాగింపజేసేందుకే పని చేశాయి.

అయితే మృతుల పరిస్థితిని గురించి బైబిలు సత్యాన్ని బయల్పరుస్తుంది. మీ ప్రాణము అంటే మీరే, మరణం తర్వాత జీవించి ఉండే మీలోని ఏదో రహస్యమైన భాగం కాదని అది స్పష్టంగా పేర్కొంటుంది. (ఆదికాండము 2:7; యెహెజ్కేలు 18:4, NW) అంతేకాకుండా, మృతులు వేడిగల నరకంలో హింసింపబడటం లేదు లేక సజీవులను ప్రభావితం చేయగల ఆత్మల లోకంలో వారు ఒక భాగం ఎంతమాత్రం కాదు. “చచ్చినవారు ఏమియు ఎరుగరు . . . నీవు పోవు పాతాళము [సమాధి] నందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు” అని బైబిలు చెబుతుంది.—ప్రసంగి 9:5, 10.

ఈ బైబిలు సత్యాలు అనేకమంది ప్రజలను మృతులను గురించిన భయంనుండి విడుదల చేశాయి. తమ పూర్వికులను శాంతపర్చేందుకు ఖరీదైన బలులను వారిక ఎంతమాత్రం అర్పించరు, లేక తమ ప్రియమైన వారు తమ పాపాల విషయమై నిర్దాక్షిణ్యంగా హింసింపబడుతున్నారని వారిక ఎంతమాత్రం చింతించరు. మరణించిన వారికి బైబిలు ఒక అద్భుతమైన నిరీక్షణను అందిస్తోందని వారు తెలుసుకున్నారు, ఎందుకంటే దేవుని నియమిత సమయంలో, “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగ బోవుచున్నదని” అది మనకు చెబుతుంది. (అపొస్తలుల కార్యములు 24:14, 15; యోహాను 5:28, 29) కాబట్టి, మృతులు ఇప్పుడు కేవలం విశ్రాంతి తీసుకుంటున్నారు, అంటే మంచి నిద్రలో ఉన్నట్టు ఉన్నారు.—యోహాను 11:11-14 పోల్చండి.

మృతుల పరిస్థితిని గురించిన సత్యము మరియు పునరుత్థాన నిరీక్షణ, మరణం తనతో తీసుకురాగల క్షోభనుండి మనలను విడిపించగలవు. అమెరికాలోని ఒక వివాహిత జంట, వారి నాలుగేళ్ల కుమారుడు ప్రమాదంలో చనిపోయినప్పుడు వారిని ఈ నిరీక్షణయే కాపాడింది. “పునరుత్థానం ద్వారా మేము మా కుమారున్ని తిరిగి చూసేంత వరకూ మా జీవితాల్లో ఏర్పడిన వెలితి పూరించబడదు. అయితే, యెహోవా మా దుఃఖపు ఛాయలను తుడిచి వేస్తానని వాగ్దానం చేస్తున్నాడు గనుక మా బాధ కేవలం తాత్కాలికమేనని మాకు తెలుసు” అని అతడి తల్లి అంటోంది.—ప్రకటన 21:3, 4.

భవిష్యత్తును గురించిన భయం నుండి స్వాతంత్ర్యం

భవిష్యత్తులో ఏమి రానైయుంది? మన భూమి అణ్వాయుధాల మారణహూమంలో కాలిపోతుందా? భూమి యొక్క పర్యావరణం నాశనమవ్వడం మన గ్రహాన్ని జీవించనయోగ్యంగా చేస్తుందా? నైతికత క్షీణించడం అరాచకానికి విపత్తుకు దారి తీస్తుందా? ఇవి నేడు అనేకులకు నిజంగా భయాన్ని కలిగిస్తున్నాయి.

అయితే బైబిలు అలాంటి హానికరమైన భయాలనుండి స్వాతంత్య్రాన్ని అందిస్తుంది. “భూమియొకటే యెల్లప్పుడును నిలుచునది” అని అది మనకు నిశ్చయతనిస్తుంది. (ప్రసంగి 1:4) బాధ్యతారహితులైన మానవులు మన గ్రహాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకునేందుకు యెహోవా దాన్ని సృష్టించలేదు. (యెషయా 45:18) బదులుగా, ఐక్య మానవ కుటుంబానికి పరదైసు గృహంగా ఉండేందుకు యెహోవా భూమిని సృష్టించాడు. (ఆదికాండము 1:27, 28) ఆయన సంకల్పం మారలేదు. దేవుడు “భూమిని నశింపజేయువారిని నశింపజే”స్తాడని బైబిలు మనకు చెబుతుంది. (ప్రకటన 11:18) ఆ తర్వాత, “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహు క్షేమము కలిగి సుఖించెదరు” అని బైబిలు చెబుతుంది.—కీర్తన 37:11.

దేవుడు అబద్ధమాడడు గనుక ఈ వాగ్దానం నమ్మదగినది. యెహోవా తన ప్రవక్తయైన యెషయా ద్వారా ఇలా పేర్కొన్నాడు: “నా నోటనుండి వచ్చు వచనము . . . నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలముచేయును.” (యెషయా 55:10, 11; తీతు 1:1) కాబట్టి, 2 పేతురు 3:13 నందు బైబిలులో వ్రాయబడి ఉన్న దేవుని వాగ్దాన నెరవేర్పు కొరకు మనం నమ్మకంతో ఎదురు చూడగలము, అది ఇలా ఉంది: “మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.”

మనుష్యుల భయం నుండి స్వాతంత్ర్యం

దేవుని ఎడల తాము కలిగివున్న భక్తి విషయంలో నిర్భయాన్ని ప్రదర్శించిన స్త్రీపురుషుల మహత్తరమైన మాదిరులను బైబిలు మనకు అందిస్తోంది. వీరిలో గిద్యోను, బారాకు, దెబోరా, దానియేలు, ఎస్తేరు, యిర్మీయా, అబీగయీలు మరియు యాయేలు ఉన్నారు, అవి కేవలం కొన్ని పేర్లు మాత్రమే. ఈ నమ్మకస్థులైన స్త్రీపురుషులు కీర్తనల గ్రంథకర్త దృక్పథాన్ని ప్రదర్శించారు, ఆయనిలా వ్రాశాడు: “నేను దేవునియందు నమ్మికయుంచి యున్నాను నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు?”—కీర్తన 56:11.

మొదటి శతాబ్దంలో, ప్రకటించడాన్ని ఆపివేయమని మతాధికారులు అపొస్తలులైన పేతురు యోహానులకు ఆజ్ఞాపించినప్పుడు, వారు అలాంటి ధైర్యాన్నే ప్రదర్శించారు. “మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని” వారు సమాధానమిచ్చారు. తమ దృఢ నిశ్చయం మూలంగా పేతురు యోహానులు తర్వాత చెరసాలలో వేయబడ్డారు. వారు అద్భుత రీతిలో విడిపించబడిన తర్వాత, వారు మళ్లీ వెళ్లి “దేవుని వాక్యమును ధైర్యముగా బోధిం”చడం కొనసాగించారు. త్వరలోనే పేతురు, ఇతర అపొస్తలులు యూదుల న్యాయసభ ఎదుటకు తీసుకు రాబడ్డారు. “మీరు ఈ నామమునుబట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి”యున్నారని ప్రధానయాజకుడు వారితో అన్నాడు. పేతురు, ఇతర అపొస్తలులు ఇలా సమాధానమిచ్చారు: “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను.”—అపొస్తలుల కార్యములు 4:16, 17, 19, 20, 31; 5:18-20, 27-29.

దేవుని రాజ్యాన్ని గురించిన సువార్తను ప్రకటించే తమ పనిలో, యెహోవాసాక్షులు నేడు మొదటి శతాబ్దపు క్రైస్తవుల ఆసక్తిని అనుకరించడానికి కృషి చేస్తున్నారు. వారిలోని యౌవనులు కూడా, తమ విశ్వాసాన్ని గురించి ఇతరులతో మాట్లాడటం ద్వారా తాము నిర్భయంగా ఉన్నామని తరచూ నిరూపించుకుంటారు. కొన్ని ఉదాహరణలను పరిశీలించండి.

స్టేసీ అనే యౌవనురాలు స్వతహాగానే బిడియస్థురాలు. ఫలితంగా, ఇతరులతో తన విశ్వాసాన్ని గురించి మాట్లాడటం ఆమెకు మొదట్లో ఒక సవాలువలె ఉండేది. తన బిడియాన్ని అధిగమించేందుకు ఆమె ఏమి చేసింది? “నేను బైబిలును చదివి ఏ విషయాన్ని గురించి మాట్లాడబోతున్నానో దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలని కృషి చేశాను. అది నా పనిని సులభం చేసింది, మరి నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది” అని ఆమె చెబుతుంది. స్టేసీకున్న మంచి పేరును గురించి ఒక ప్రాంతీయ వార్తాపత్రికలో నివేదించబడింది. ఆమె పాఠశాలలోని ఒక ఉపాధ్యాయిని రచించిన ఆ శీర్షిక ఇలా వ్యాఖ్యానించింది: “[స్టేసీ యొక్క] విశ్వాసం, అనేకమంది యౌవనస్థులు అనుభవించే అనేక ఒత్తిడులకు విరుద్ధంగా పోరాడేందుకు అవసరమైన శక్తిని ఆమెకు ఇచ్చిందనిపిస్తుంది. . . . దేవునికి చేసే సేవ తన మనస్సులో అత్యంత ప్రధానమైనదై ఉండాలని ఆమె భావిస్తుంది.”

టామీ తనకు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడే తన తలిదండ్రుల నుండి బైబిలు గురించి నేర్చుకున్నాడు. చాలా చిన్న వయస్సులోనే, అతడు సత్యారాధన విషయంలో ధైర్యంగా నిర్ణయాన్ని తీసుకున్నాడు. అతని తోటి విద్యార్థులు పండుగ దినాల చిత్రాలు గీస్తుంటే, టామీ దేవుడు వాగ్దానం చేసిన పరదైసు చిత్రాలు గీశాడు. యెహోవాసాక్షుల నమ్మకాల గురించి అనేకమంది విద్యార్థులకు తెలియదని ఒక యౌవనస్థునిగా టామీ గమనించాడు. భయంతో వెనక్కి తగ్గే బదులు, తాను తన తరగతిలోని వారి ప్రశ్నలకు అన్నింటికీ ఒకేసారి సమాధానం ఇవ్వగలిగేలా తాను ప్రశ్నా-జవాబుల చర్చను నిర్వహించవచ్చా అని అతడు తన ఉపాధ్యాయున్ని అడిగాడు. దానికి అనుమతి లభించడంతో, చక్కని సాక్ష్యం ఇవ్వబడింది.

మార్కీటకు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు, తన విశ్వాసాన్ని గురించి తన తరగతి వారితో మాట్లాడేందుకు చక్కని అవకాశాన్ని ఆమె కనుగొన్నది. “మాకు ప్రసంగాలు నిర్వహించబడ్డాయి. యౌవనస్థులు అడిగే ప్రశ్నలు—ఆచరణయోగ్యమైన సమాధానాలు (ఆంగ్లం) అనే పుస్తకంలోనుండి నేను నా అంశాన్ని ఎన్నుకున్నాను.a నేను ఆ పుస్తకంలో నుండి ఐదు అధ్యాయాలను ఎంపిక చేసుకుని, వాటి శీర్షికలను బ్లాక్‌బోర్డ్‌పై వ్రాశాను. ఆ ఐదింటిలో అత్యంత ప్రాముఖ్యమైనవని తాము భావిస్తున్న వాటి వరుసక్రమాన్ని తెలియజేయమని నేను తరగతిలోని వారిని అడిగాను.” తరగతిలోని వారు పాల్గొనగా చర్చ కొనసాగింది. “నేను ఆ పుస్తకాన్ని తరగతిలోని వారికి చూపాను, అనేకమంది విద్యార్థులు ఒక ప్రతి కావాలన్నారు. తనకు ఒక ప్రతి కావాలని మా ఉపాధ్యాయిని కూడా అడిగిందని” చెబుతూ మార్కీట ముగించింది.

మీరు సత్యం ద్వారా స్వతంత్రులు కాగలరు

మనం చూసిన విధంగా, బైబిలునందున్న సత్యం దాన్ని చదివి దాని వర్తమానాన్ని హృదయంలోకి తీసుకునే అన్ని వయస్సుల వారికి స్వేచ్ఛనివ్వగల ప్రభావాన్ని కలిగివుంది. అది మృతులను గురించిన భయం, భవిష్యత్తును గురించిన భయం మరియు మనుష్యుల భయం నుండి వారికి స్వేచ్ఛనందిస్తుంది. తుదకు, యేసు విమోచన విధేయులైన మానవజాతిని పాప మరణాల నుండి స్వతంత్రులను చేస్తుంది. మనం సంతరించుకున్న పాపభరిత పరిస్థితికి మనం బంధీలమై ఉండకుండా, పరదైసు భూమిపై నిరంతరమూ జీవించగలగడం ఎంత ఆనందదాయకంగా ఉంటుందో కదా!—కీర్తన 37:29.

దేవుడు వాగ్దానం చేసిన దీవెనల గురించి మీరు ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని ఇష్టపడుతున్నారా? అలాగైతే, మీరేమి చేయాలి? యేసు ఇలా అన్నాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:3) కాబట్టి యేసు తన శిష్యులకు వాగ్దానం చేసిన స్వేచ్ఛను మీరు అనుభవించాలనుకుంటే, మీరు యెహోవా దేవుని గురించి, ఆయన కుమారుని గురించి నేర్చుకోవాలి. దేవుని చిత్తమేమిటో తెలుసుకుని, దాన్ని చేయాలి, ఎందుకంటే బైబిలు ఇలా చెబుతుంది: “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.”—1 యోహాను 2:17.

[అధస్సూచీలు]

a వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ న్యూయార్క్‌ వారు ప్రచురించినది.

[7వ పేజీలోని చిత్రం]

దేవుని రాజ్యం క్రింద, మానవులందరూ తుదకు పాప మరణాల నుండి స్వతంత్రులౌతారు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి