జీవము కొరకు పరుగుపందెములో నీవెట్లు పరుగెత్తుచున్నావు?
“పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురు గాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి.”—1 కొరింథీయులు 9:24.
1. మన క్రైస్తవ విధానమును బైబిలు దేనికి పోల్చుచున్నది?
నిత్యజీవము కొరకైన మన అన్వేషణను బైబిలు పరుగు పందెముతో పోలుస్తున్నది. తన జీవిత చివరి దినములలో, అపొస్తలుడైన పౌలు తననుగూర్చి ఇలా చెప్పాడు: “మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.” తన తోటి విశ్వాసులును ఆలాగే చేయవలెనని వేడుకొంటూ ఆయనిట్లన్నాడు: “మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, . . . మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.”—2 తిమోతి 4:7; హెబ్రీయులు 12:1.
2. జీవము కొరకైన పరుగులో ఎటువంటి ప్రోత్సాహకరమైన ప్రారంభమును మనము చూస్తున్నాము?
2 పరుగు పందెములో ఒక ఆరంభము, ఒక నియమిత విధానము మరియు ముగింపు రేఖ లేదా గమ్యము ఉండును గనుక, ఈ పోలిక సరియైనదే. జీవము కొరకు మన ఆత్మీయాభివృద్ధి విధానముకూడా అంతే. మనము చూసినట్లుగా, ప్రతి సంవత్సరము లక్షలాదిమంది ప్రజలు జీవము కొరకైన పరుగును చక్కగా ఆరంభిస్తున్నారు. ఉదాహరణకు, గడచిన ఐదు సంవత్సరాలలో సమర్పణ మరియు నీటి బాప్తిస్మము ద్వారా 13,36,429 మంది వ్యక్తులు క్రమబద్ధంగా పరుగు ప్రారంభించారు. అటువంటి శక్తిపూర్వక ప్రారంభము ప్రోత్సాహకరమైనదే. అయితే పందెములో కడవరకు పరుగులో నిలిచియుండుట ప్రాముఖ్యమైన సంగతియై యున్నది. నీవు దీనిని చేస్తున్నావా?
జీవము కొరకు పరుగు
3, 4. (ఎ) పరుగు పందెములో వేగమును కాపాడుకొను ప్రాముఖ్యతను పౌలు ఎట్లు సూచించెను? (బి) పౌలు సలహాను లక్ష్యపెట్టుటలో కొందరెట్లు తప్పిపోయిరి?
3 పరుగులో నిలిచియుండు ప్రాముఖ్యతను నొక్కితెల్పుటకు, పౌలు ఈ సలహానిచ్చాడు: “పందెపు రంగమందు పరుగెత్తువారందరు పరుగెత్తుదురు గాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి.”—1 కొరింథీయులు 9:24.
4 నిజమే, ప్రాచీనకాల ఆటల్లో కేవలము ఒకడు మాత్రమే బహుమతి పొందేవాడు. అయితే, జీవము కొరకైన పరుగులో, ప్రతివారు బహుమతి కొరకు అర్హులే. కడదాకా పరుగులో నిలిచియుండుట మాత్రం అవసరం. సంతోషకరమైన విషయమేమనగా, అనేకమంది అపొస్తలుడైన పౌలు వలెనే, తమ జీవితపు చివరి నిమిషము వరకు విశ్వాసముతో పరుగెత్తారు. లక్షలాదిమంది ఇంకను పరుగులో కొనసాగుచున్నారు. అయితే కొంతమంది గమ్యంవైపు పురోగమించుటలో విఫలులయ్యారు. దానికి బదులు, వారు తాము పరుగులో పడిపోవునట్లు లేదా మధ్యలోనే అనర్హులగునట్లు ఇతర విషయాలు తమను అడ్డుకొనుటకు అనుమతించారు. (గలతీయులు 5:7) ఇది మనమందరము జీవము కొరకైన పరుగు పందెములో ఎట్లు పరుగెత్తుచున్నామో పరీక్షించుకొనునట్లు చేయవలెను.
5. పౌలు జీవము కొరకైన పరుగును పోటీగల ఆటతో పోల్చెనా? వివరింపుము.
5 “ఒక్కడే బహుమానము పొందునని” పౌలు చెప్పినప్పుడు ఆయన మనస్సులో ఏమి కలిగియుండెను? అనే ప్రశ్న రావచ్చును. ముందే గమనించినట్లుగా, జీవము కొరకు పరుగెత్త నారంభించిన వారిలో, కేవలము ఒకడు మాత్రమే నిత్యజీవమను బహుమతిని పొందునని ఆయన భావము కాదు. స్పష్టముగా విషయమది కానేరదు, ఏలయనగా ఆయన అనేకమార్లు అన్ని తరగతుల ప్రజలు రక్షింపబడుటే దేవుని చిత్తమని స్పష్టీకరించాడు. (రోమీయులు 5:18; 1 తిమోతి 2:3, 4; 4:10; తీతు 2:11) జీవము కొరకు పరుగు ఒక పోటీయని అందులో పాల్గొను ప్రతివాడు మిగతా వారందరిని ఓడించుటకు ప్రయత్నించునని ఆయన చెప్పుటలేదు. ఆ కాలములో ఒలింపిక్ ఆటలకంటే మరెంతో ప్రతిష్ఠాకరమైనవని చెప్పబడిన వారి ఇస్మియన్ ఆటలలో పోటీపడువారిలో ఉండు పోటీస్ఫూర్తి ఆ కొరింథీయులకు బాగా తెలుసు. కాబట్టి, పౌలు మనస్సులో ఏమి ఉండెను?
6. పరుగెత్తువాడు, పరుగు పందెమని పౌలు చేసిన చర్చను గూర్చిన సందర్భము ఏమి వెల్లడిచేస్తున్నది?
6 పరుగెత్తువాని దృష్టాంతమును ఎత్తిచూపుటలో, పౌలు ప్రాథమికముగా రక్షణ కొరకైన తన స్వంత ఉత్తరాపేక్షలను చర్చించాడు. పై వచనములలో, ఆయన కష్టపడి పనిచేస్తూ, అనేక విధాలుగా తానెట్లు పోరాడెనో వర్ణించి చెప్పాడు. (1 కొరింథీయులు 9:19-22) ఆ తరువాత 23వ వచనములో ఆయనిట్లన్నాడు: “నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దానికొరకే సమస్తమును చేయుచున్నాను.” ఒక అపొస్తలునిగా తాను ఎంపిక చేసికొనబడినందున లేదా ఇతరులకు ప్రకటించుటలో తాననేక సంవత్సరాలు గడిపినంత మాత్రాన రక్షణ తనకు నిశ్చయము కాదని ఆయన గ్రహించాడు. సువార్త ఆశీర్వాదములలో భాగము వహించుటకుగాను, తన శక్తినంతా ఉపయోగించి సువార్త విషయమై తాను చేయగలిగినంతా ఆయన ఎడతెగక చేస్తూనే యుండాలి. కేవలము “ఒక్కడే బహుమానము పొందు” ఇస్మియన్ ఆటలలోని పరుగు పందెమందు పరుగెత్తుచున్నట్లుగా ఆయన బహుమతి పొందాలనే ఉద్దేశముతో శ్రమించి గట్టి ప్రయత్నంతో పరుగెత్తాలి.—1 కొరింథీయులు 9:24.
7. “బహుమానము పొందునట్లుగా పరుగెత్తుటకు” ఏమి అవసరము?
7 దీనినుండి మనము నేర్చుకొనగలిగినది ఎంతైనావుంది. పరుగు పందెములో పాల్గొను ప్రతివాడు బహుమతి పొందాలని కోరుకొన్నను, బహుమతి పొందాలని సంపూర్ణముగా తీర్మానించుకొనిన వారికి మాత్రమే అలా పొందగల ఉత్తరాపేక్ష ఉంటుంది. కాబట్టి, మనమెలాగూ పరుగు పందెములో చేరాముకదాని సంతృప్తి పడకూడదు. మనము ‘సత్యమందున్నాము’ కాబట్టి ప్రతిదీ చక్కగా సాఫీగా సాగిపోవునని భావించకూడదు. మనము క్రైస్తవులమనే పేరు ధరించి యుండవచ్చు, అయితే క్రైస్తవులమని నిరూపించగల నిదర్శనమును మనము కలిగియున్నామా? ఉదాహరణకు, ఒక క్రైస్తవుడు చేయాలని మనమెరిగియున్న పనులను—క్రైస్తవ కూటములకు హాజరగుట, ప్రాంతీయ పరిచర్యలో భాగము వహించుట వగైరా పనులు మనము చేస్తున్నామా? అట్లయిన, అది మెచ్చుకోదగినదే, మరియు మనము అటువంటి చక్కని అలవాట్లయందు పట్టుదల కలిగియుండడానికి కృషిచేయాలి. అయితే మనము చేయుదానినుండి మరియెక్కువ ప్రయోజనం పొందగలమా? ఉదాహరణకు, కూటములలో భాగము వహించుటకు మనమన్ని సమయాలలో సిద్ధముగా ఉందుమా? మనము నేర్చుకొనిన దానిని మన వ్యక్తిగత జీవితములో అన్వయించుటకు మనము కృషిచేస్తున్నామా? ప్రాంతీయ సేవలో మనమెన్ని అడ్డంకులెదుర్కొనినను మనము సంపూర్ణముగా సాక్ష్యమివ్వగలుగునట్లు మన నైపుణ్యతలను వృద్ధిచేసికొనుటయెడల మనము శ్రద్ధవహిస్తున్నామా? ఆసక్తి చూపిన వారిని తిరిగి కలిసికొని, గృహ బైబిలు పఠనములు నిర్వహించు సవాలును అంగీకరించుటకు మనం ఇష్టపడుచున్నామా? “మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి” అని పౌలు ఉద్భోదించాడు.—1 కొరింథీయులు 9:24.
సమస్త విషయములందు ఆశానిగ్రహము పాటించుము
8. ‘అన్ని విషయములందు మితముగా’ ఉండుడని, తోటి క్రైస్తవులను వేడుకొనుటకు ఏది పౌలును పురికొల్పి యుండవచ్చును?
8 తన జీవిత కాలములో, అనేకమంది క్రమేపి తగ్గిపోవడం, క్రమేపి కొట్టుకొనిపోవడం, లేదా జీవము కొరకు పరుగును విరమించు కోవడాన్ని పౌలు చూశాడు. (1 తిమోతి 1:19, 20; హెబ్రీయులు 2:1) అందుకే ఆయన అనేకమార్లు వారు గట్టిదైన, కొనసాగే పోటీలో ఉన్నారని తన తోటి విశ్వాసులకు గుర్తుచేశాడు. (ఎఫెసీయులు 6:12; 1 తిమోతి 6:12) ఆయన పరుగెత్తువాని దృష్టాంతమును ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్లి ఇలా అన్నాడు: “పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును.” (1 కొరింథీయులు 9:25) దీనిని చెప్పుటలో పౌలు కొరింథు క్రైస్తవులకు బాగుగా తెలిసిన విషయాన్ని అనగా ఇస్మియన్ ఆటలలో పాల్గొను పోటీదారులు అనుసరించు తీక్షణమైన శిక్షణను ఆయన సూచిస్తున్నాడు.
9, 10. (ఎ) ఇస్మియన్ ఆటలలోని పోటీదారులను ఒక గ్రంథమూలము ఎట్లు వర్ణించినది? (బి) ఆ వర్ణనలో ప్రత్యేకముగా ఏ విషయము గమనార్హమై యున్నది?
9 శిక్షణలోవున్న ఒక పోటీదారుని విశదమైన వర్ణన ఇక్కడ ఇవ్వబడింది:
“తన పదినెలల శిక్షణకు సంబంధించిన నియమ నిబంధనలకు, ఏ మాత్రము సణుగుకొనకుండ, సంతృప్తిగా అతడు లోబడును. ఆ శిక్షణ లేకుండా అతడు పోటీలో పాల్గొనకపోవచ్చు. . . . తనకు కలిగే ఇబ్బంది, కష్టము, లేమి విషయములో అతడు గర్విస్తూ, తన విజయావాకాశాన్ని వీసమంతైనను బలహీనపరచు దేనినైనను విసర్జించుటకు అతడు సగర్వంగా వెనుదీయడు. తను చెమట కారుస్తూ తీవ్రముగా శరీరాభ్యాసము చేయుచుండగా ఇతరులు చక్కగా భోజనము చేయుటకు వెళ్లుట, విలాసవంతముగా స్నానం చేయుట, హాయిగా జీవితము ననుభవించుట చూస్తుంటాడు, అయినను అతడు ఏ మాత్రం ఈర్ష్యచెందడు, ఎందుకంటె ఆయన హృదయము బహుమతిపై కేంద్రీకరించబడినది, మరియు ఆ తీవ్రమైన శిక్షణ అతనికి అనివార్యము. ఆ తీవ్రమైన శిక్షణ విడిచి ఎక్కడైనను, ఏ సందర్భములోనైనను విశ్రమించాడా తాను గెలిచే అవకాశాలు పోతాయని అతనికి తెలుసు.”—ది ఎక్స్పోజిటర్స్ బైబిల్, సంపుటి 5, పుట 674.
10 ఇక్కడ ప్రత్యేకముగా గమనించదగిన ఆసక్తికరమైన విషయమేమంటే, శిక్షణలో ఉన్న వ్యక్తి ఎంతో స్వయం-త్యాగంతో కూడిన తీవ్రమైన శిక్షణావాడుకను “గర్వించదగిన విషయముగా ఎంచును.” వాస్తవానికి, ఇతరులు సుఖంగావుండి హాయి ననుభవించుట తాను చూచినను “అతడు ఏ మాత్రం ఈర్ష్యచెందడు.” దీనినుండి మనమేమైనా నేర్చుకొనగలమా? అవును, మనం నిజంగా నేర్చుకొనగలం.
11. జీవము కొరకు పరుగులో ఉన్నప్పుడు మనమే తప్పుడు దృక్పధము యెడల జాగ్రత్తగా ఉండవలెను?
11 “నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై యున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే” అని యేసుచెప్పిన మాటలు గుర్తుతెచ్చుకొనుము. (మత్తయి 7:13, 14) నీవు ‘ఇరుకు ద్వారమున’ పోవుటకు కృషిచేయుచుండగా, వేరొక ద్వారమున పోవువారు అనుభవిస్తున్నట్లు కన్పించు స్వాతంత్ర్యము, సుఖమునుబట్టి నీవు ఈర్ష్య చెందుదువా? అంతచెడుగా కన్పించని, ఇతరులు అనుభవించు వాటిని నీవునూ అనుభవించ లేకపోవుచున్నావని బాధపడుదువా? ఈ పద్ధతిని మనము అనుసరించుటకుగల కారణమును మనస్సులో ఉంచుకొనుటకు తప్పిపోయినట్లయితే మనమీ విధముగా బాధపడుట సులభమే. “వారు క్షయమగు కిరీటమును పొందుటకును; మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకును మితముగా ఉన్నామని” పౌలు చెప్పెను.—1 కొరింథీయులు 9:25.
12. ప్రజలు పొందాలని ప్రయత్నించిన మహిమ, కీర్తి ఇస్మియన్ ఆటలలో బహుకరించబడిన క్షయమగు కిరీటమును పోలియున్నదని ఎందుకు చెప్పవచ్చును?
12 ఇస్మియన్ ఆటలలో గెలుపొందిన విజేతకు ఇస్మియన్ పైన్ లేదా అటువంటిదే మరొక మొక్కతో చేయబడిన మాల వేయబడేది, అది బహుశ కొన్ని దినాలలోనే లేక వారములలోనే వాడిపోయేది. అయితే త్వరగా వాడిపోయే మాల కొరకు కాదుగాని దానితోపాటు వచ్చు మహిమ, ఘనత, పేరుప్రతిష్టల కొరకు క్రీడాకారులు పోటీపడేవారు. విజేత ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, అతన్ని విజయుడై వస్తున్న వీరునివలె స్వాగతించేవారని ఒక గ్రంథమూలము వివరించుచున్నది. అతన్ని ఊరేగిస్తూ ఆ ఊరేగింపు వెళ్లుటకు వీలుగా తరచు గోడలు పడగొట్టడం, అతని గౌరవార్థం అతని ప్రతిమలు నిలబెట్టడం జరిగేది. ఇంతచేసినా అతని మహిమ క్షయమైనదే. ఈనాడు విజేతలైన ఆ వీరులెవరో కేవలము కొద్దిమందికి మాత్రమే తెలిసి యుండవచ్చును, నిజానికి అనేకులు ఆ విషయాన్ని లెక్కచేయరు. దేవునియెడల సంపన్నులై యుండకుండా, ఈ లోకంలో అధికారాన్ని, కీర్తిని, ధనాన్ని సంపాదించుటకు తమ సమయాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని, చివరకు కుటుంబ సంతోషాన్ని త్యాగంచేసే వారు, వారి వస్తుదాయక “కిరీటము” వారి జీవితాల వలెనే కేవలము సమసిపోవును.—మత్తయి 6:19, 20; లూకా 12:16-21.
13. జీవము కొరకు పరుగులోవున్న ఒక వ్యక్తి జీవన విధానము ఒక క్రీడాకారుని జీవన విధానమునకు ఎట్లు భిన్నమై యున్నది?
13 ఒక క్రీడలో పాల్గొను పోటీదారులు పైన వర్ణించబడినటువంటి తీవ్రమైన శిక్షణా నియమాలను కేవలము పరిమిత కాలము కొరకు మాత్రమే అంగీకరించుటకు ఇష్టపడవచ్చును. అట్టి ఆటలు ముగిసిన వెంటనే, వారు తమ సాధారణ జీవితములోనికి వెళ్లిపోవుదురు. వారి నైపుణ్యాలను కాపాడుకొనుటకు వారింకా అప్పుడప్పుడు అభ్యాసము చేయవచ్చును, అయితే వారు కనీసం తర్వాతి పోటీవరకు, ఇక ఎంతమాత్రము తీవ్రమైన స్వయం-త్యాగం విధానమును అనుసరించరు. జీవము కొరకు పరుగులో ఉన్నవారి విషయములో అలాకాదు. వారి విషయంలో శిక్షణ, స్వయం-త్యాగం వారి జీవిత విధానమై యుండాలి.—1 తిమోతి 6:6-8.
14, 15. జీవము కొరకు పరుగులోవున్న వ్యక్తి ఆశానిగ్రహము నెందుకు ఎడతెగక కలిగియుండాలి?
14 “నన్ను వెంబండింప గోరువాడు తన్నుతాను ఉపేక్షించుకొని (లేదా, “అతడు తనకుతాను ‘కాదు’ అని చెప్పుకొనవలెను,” చార్లెన్ బి. విలియమ్స్) తన సిలువయెత్తికొని (ఎడతెగక) నన్ను వెంబడింపవలెను.” (మార్కు 8:34) ఈ ఆహ్వానమును మనమంగీకరించినప్పుడు, స్వయం-త్యాగమందు ఏదో ప్రత్యేక అర్హత ఉండుటనుబట్టి కాదుగాని, క్షణికమైన బుద్ధిహీనతతెచ్చు ప్రమాదమునుబట్టి మనము “ఎడతెగక” అలా చేయుటకు సిద్ధపడవలెను. మంచి సమాలోచనయందు ఒక్కసారి తప్పిపోవుట, అప్పటివరకు జరిగిన అభివృద్ధిని పాడుచేయవచ్చును, ఆలాగే మన నిత్య సంక్షేమమును ప్రమాదములో పడవేయవచ్చును. ఆత్మీయాభివృద్ధి సాధారణముగా నెమ్మదిగానే జరుగును, కానీ మనము ఎడతెగక జాగ్రత్త వహించనట్లయిన అది ఎంత త్వరగా నిరర్థకమగును!
15 అంతేకాకుండ, మనము “అన్ని విషయములయందు” ఆశానిగ్రహాన్ని కలిగియుండాలని పౌలు ఉద్భోదించాడు, అనగా జీవిత ప్రతి ఆకృతిలోను మనమలా ఎడతెగక చేయవలెను. దీనియందు మంచి భావము కలదు ఎందుకంటె శిక్షణపొందువాడు అదుపుతప్పి విచ్చలవిడిగా జీవించినట్లయితే, అతడు శరీర బాధలకోర్చుకొని ఎంత శ్రమిస్తే మాత్రం ఏమిలాభం? అదే ప్రకారం జీవం కొరకు మన పరుగు పందెంలో, మనమన్ని విషయాలలో ఆశానిగ్రహాన్ని కలిగియుండాలి. ఒక వ్యక్తి త్రాగుడు, వ్యభిచారం విషయములో తనను అదుపులో ఉంచుకొన్నను, అతడు అహంకారి, జగడమాడు వాడయినట్లయిన అది అతని విలువను తగ్గించును. లేదా ఒకడు దీర్ఘశాంతము గలవానిగా, ఇతరులయెడల దయగలవానిగా ఉన్నను, అతడు తన వ్యక్తిగత జీవితమందు రహస్యముగా పాపము చేస్తున్నట్లయిన లాభమేమి? ఆశానిగ్రహము పూర్తి ప్రయోజనమివ్వాలంటే, “అన్ని విషయములయందు” దానిని పాటించవలెను.—యాకోబు 2:10, 11 పోల్చుము.
“గురి చూడనివానివలె” పరుగెత్తకుము
16. “గురి చూడనివానిగా” పరుగెత్తకుండుట అనగా దాని భావమేమి?
16 జీవము కొరకు పరుగు పందెములో గెలుపొందుటకు అవసరమైన తీవ్ర ప్రయత్నములను చూచి, పౌలు ఇంకనూ ఇట్లన్నాడు: “నేను గురి చూడనివానివలె పరుగెత్తు వాడను కాదు, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు.” (1 కొరింథీయులు 9:26) “గురి చూడనివానివలె” అను పదానికి అక్షరార్థముగా “అస్పష్టముగా” (కింగ్డం ఇంటర్లీనియర్), “అగోచరముగా, గురిలేకుండా” (లాంజి‘స్ కామెంటరీ) అని అర్థము. కాబట్టి, “గురి చూడనివానివలె” పరుగెత్తుట లేదు అనగా చూచే ప్రతివ్యక్తికి పరుగెత్తువాడు ఎక్కడికి పరుగెత్తుచున్నాడో బహుస్పష్టముగా కనబడునని దాని భావము. ది ఆంకర్ బైబిల్ దీనిని “వంకరటింకరగా పరుగెత్తుటలేదు” అని అనువదించు చున్నది. సముద్రపు ఒడ్డున అడుగు జాడలు వంకరటింకరగా ఉన్నట్లు, గుండ్రంగా తిరిగినట్లు, కొన్నిసార్లు వెనుకకు నడిచినట్లు ఉండటం మీరు చూచినప్పుడు ఆ వ్యక్తి అసలు పరుగెత్తాడని మీరనుకోరు, ఆలాగే అతడు ఎటువైపు వెళ్లాలనుకున్నాడో చెప్పడంకూడ కష్టం. అయితే తిన్నగా ప్రతి అడుగు సరియైన నిడివితో ముందుకు వెళ్లినట్లున్న అడుగుజాడలు మీరు చూసినప్పుడు, అవి అతనెక్కడికి వెళ్లుచున్నాడో కచ్ఛితంగా తెలిసిన వ్యక్తికి సంబంధించిన అడుగుజాడలేనని మీరు తేల్చిచెప్ప గలరు.
17. (ఎ) తాను “గురి చూడనివానిగా” పరుగెత్తలేదని పౌలు ఎట్లు చూపించెను? (బి) ఈ విషయములో మనమెట్లు పౌలును అనుకరించగలం?
17 తాను “గురి చూడనివానివలె” పరుగెత్త లేదని పౌలు జీవితము స్పష్టముగా చూపిస్తున్నది. తానొక క్రైస్తవ పరిచారకుడని, అపొస్తలుడని నిరూపించుకొనుటకు ఆయనయొద్ద కావలసినంత సాక్ష్యముండెను. అయితే ఆయనొక ఉద్దేశమును కలిగియుండి, దానిని సాధించుటకు తన జీవితమంతా తీవ్రముగా పోరాడెను. ఆయన బహుశ వీటిలో దేనినైనను సాధించగలిగి యుండినను, ఆయనెన్నడును కీర్తి, అధికారము, ధనము లేదా సుఖమువంటి వాటి ధ్యాసలో పడలేదు. (అపొ. కార్యములు 20:24; 1 కొరింథీయులు 9:2; 2 కొరింథీయులు 3:2, 3; ఫిలిప్పీయులు 3:8, 13, 14) నీ జీవిత పద్ధతిని ఒకసారి వెనుకకు తిరిగిచూసుకుంటే నీవెటువంటి విధానమును చూచెదవు? స్పష్టమైన గమ్యముతో తిన్నని విధానమా లేక అగమ్యముగా తిరుగులాడు విధానమా? జీవము కొరకు పరుగు పందెములో నీవు పోరాడుచున్నావనుటకు రుజువున్నదా? కేవలము నిస్తేజముతో నడచుటకు కాదుగాని, గమ్యము చేరుటకు మనమీ పరుగు పందెములో ఉన్నాము.
18. (ఎ) మన విషయంలో “గాలిని కొట్టినట్టుగా” ఏది పోల్చబడును? (బి) ఆ విధానము ననుసరించుట ఎందుకు ప్రమాదకరము?
18 మరొక క్రీడను సమాంతరముగా చూపుచు, పౌలు ఇంకను ఇట్లనెను: “గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు.” (1 కొరింథీయులు 9:27) జీవము కొరకైన మన పోరాటములో సాతాను, లోకము, మన స్వంత అసంపూర్ణతతో సహా మనకెంతోమంది శత్రువులు ఉన్నారు. ప్రాచీనకాల ముష్టియుద్ధ యోధునివలె మనము, చక్కని గురిగల ముష్టిఘాతాలతో వారిని పడగొట్టగలవారమై యుండవలెను. సంతోషకరమైన విషయమేమంటే, యెహోవా దేవుడు మనకీ పోరాటములో సహాయము చేయుచు మనకు శిక్షణనిస్తున్నాడు. ఆయన తన వాక్యములో, బైబిలు ఆధారిత ప్రచురణలలో, క్రైస్తవ కూటములలో మనకు ఉపదేశము ననుగ్రహిస్తున్నాడు. అయితే, మనము బైబిలును, ప్రచురణలను చదువుతు, కూటములకు హాజరవుతున్నను, మనము నేర్చుకొనిన వాటిని అభ్యసించనట్లయితే మన ప్రయత్నాలను నిరర్థకము చేస్తూ “గాలిని కొట్టు” వారివలె ఉండమా? అలాచేయుట మనలను బహు ప్రమాదకరమైన స్థితిలో పడవేయును. మనము పోరాడుచున్నామని తలస్తూ, అలా మనము మోసకరమైన భద్రతాభావముతో ఉంచవచ్చు, కానీ మనము మన శత్రువులను జయించుట లేదు. అందుకే శిష్యుడైన యాకోబు ఇలా సలహానిచ్చాడు: “మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి.” “గాలిని కొట్టినట్టు” కొట్టుట మన శత్రువులను పడద్రోయదు, లేక కేవలము “వినువారు మాత్రమైయుండుట” మనము దేవుని చిత్తాన్ని చేయుచున్నామనుటను రూఢిపరచదు.—యాకోబు 1:22; 1 సమూయేలు 15:22; మత్తయి 7:24, 25.
19. ఏదోరీతిలో భ్రష్టులము కాకుండుటకు మనమెట్లు నిశ్చయపరచుకొనగలం?
19 చివరకు, పౌలు విజయానికున్న రహస్యాన్ని మనకు ఇలా చెప్పాడు: “ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.” (1 కొరింథీయులు 9:27) మన అసంపూర్ణ శరీరము మనపై అధికారము చేయుటకు అనుమతించే బదులు మనము కూడ పౌలు వలెనే దానిని లోపరచుకొనవలెను. మనము మన శరీరాశలను, కోరికలను, తృష్ణలను పెకిలించివేయు అవసరత కలదు. (రోమీయులు 8:5-8; యాకోబు 1:14, 15) “నలగగొట్టి” అని అనువదించబడిన మాటకు అక్షరార్థముగా ‘కంటి క్రింద గుద్దుట’ (కింగ్డం ఇంటర్లీనియర్) అను అర్థమున్నది గనుక, అలాచేయుట బాధగానే ఉండగలదు. కాబట్టి, అసంపూర్ణ శరీరాశలకులోనై మరణించుటకంటె కమిలిన కంటితో అన్నట్లు బాధననుభవించుట మేలు కదా?—పోల్చుము మత్తయి 5:28, 29; 18:9; 1 యోహాను 2:15-17.
20. జీవము కొరకైన పరుగులో మనమెలా పరుగెత్తుచున్నామని పరీక్షించుకొనుట ప్రత్యేకంగా ఇప్పుడు ఎందుకు అత్యవసరం?
20 నేడు మనమా గమ్యమునకు చేరువవుతున్నాము. బహుమతులందజేయు సమయము ఆసన్నమయినది. అభిషక్తులైన క్రైస్తవులకది “క్రీస్తుయేసు నందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమై” యున్నది. (ఫిలిప్పీయులు 3:14) గొప్పసమూహానికది, పరదైసు భూమిలో నిత్యజీవమై యున్నది. దీనిలో ఇంత ఇమిడియున్నందున, “భ్రష్టులము” కాకుండునట్లు, పౌలువలెనే మనలో ప్రతి ఒక్కరము, “మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి” అనే ఆజ్ఞను మనం కూడ హృదయానికి తీసికొనుటకు తీర్మానించుకుందాం.—1 కొరింథీయులు 9:24, 27. (w92 8/1)
మీరు గుర్తుతెచ్చుకొందురా?
◻ క్రైస్తవుని జీవితమును పరుగు పందెమునకు పోల్చుట ఎందుకు సరియైయున్నది?
◻ జీవము కొరకైన పరుగు మామూలు పరుగునకు ఎట్లు భిన్నమైయున్నది?
◻ “అన్ని విషయములయందు” మనమెందుకు ఆశానిగ్రహాన్ని కలిగియుండాలి?
◻ “గురి చూడనివానివలె” ఒకడు ఎలా పరుగెత్తును?
◻ కేవలము “గాలిని కొట్టుట” ఎందుకు ప్రమాదకరము?
[16వ పేజీలోని చిత్రాలు]
ఛాంపియన్ మాల, ఆలాగే మహిమ, ఘనత వాడిపోవునవై యున్నవి