యెహోవా మార్గంలో నడుస్తూనే ఉండండి
“యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము, ఆయన మార్గము ననుసరించుము. భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును.”—కీర్తన 37:34.
1, 2. రాజైన దావీదు విషయంలో యెహోవా మార్గంలో నడవడం అంటే ఏమి ఇమిడివుంది, నేడు మన విషయంలో ఏమి అవసరమౌతుంది?
“నీ వైపు నా మనస్సు నే నెత్తికొనుచున్నాను. నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము.” (కీర్తన 143:8) రాజైన దావీదు వ్యక్తం చేసిన ఆ భావాల్ని నేటి క్రైస్తవులు కూడా హృదయపూర్వకంగా వెలిబుచ్చుతారు. వారు పూర్ణ మనస్సుతో యెహోవాను ప్రీతిపర్చాలనీ ఆయన మార్గంలో నడవాలనీ కోరుకుంటారు. అందులో ఏమి ఇమిడివుంది? దావీదు విషయంలో చూస్తే, ఆయన దేవుని ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోవడం అందులో ఇమిడివుంది. ఇతర జనాంగాలతో కలిసి ఏర్పడిన కూటముల్లో నమ్మకం ఉంచడం బదులు యెహోవా మీద నమ్మకం ఉంచడం అందులో ఇమిడివుంది. అవును, చుట్టుప్రక్కల ఉన్న ప్రజల దేవుళ్ళను కాక యెహోవాకు యథార్థతతో సేవచేయడమని దానర్థం. క్రైస్తవుల విషయానికి వస్తే, యెహోవా మార్గంలో నడవడం అంటే అందులో చాలా ఇమిడివుంది.
2 అన్నింటికన్నా ముందుగా, నేడు యెహోవా మార్గంలో నడవడమంటే, యేసుక్రీస్తు విమోచన క్రయధన బలి అర్పణపై విశ్వాసం ఉంచడం, ఆయనే “మార్గమును, సత్యమును, జీవమును” అని గుర్తించడం అని అర్థం. (యోహాను 3:16; 14:6; హెబ్రీయులు 5:9) దానర్థం, “క్రీస్తు నియమమును” నెరవేర్చడం అని కూడాను. ఆ నియమంలో ఒకరిపట్ల ఒకరు ప్రాముఖ్యంగా యేసు అభిషిక్త సహోదరులపట్ల ప్రేమను ప్రదర్శించడం ఇమిడివుంది. (గలతీయులు 6:2; మత్తయి 25:34-40) యెహోవా మార్గంలో నడిచేవారు ఆయన సూత్రాలనూ ఆజ్ఞలనూ ప్రేమిస్తారు. (కీర్తన 119:97; సామెతలు 4:5, 6) క్రైస్తవ పరిచర్యలో భాగం వహించడం అనే అమూల్యమైన ఆధిక్యతను వారు కాపాడుకోవాలనుకుంటారు. (కొలొస్సయులు 4:17; 2 తిమోతి 4:5) వారి జీవితాల్లో ప్రార్థన ఒక క్రమమైన భాగంగా ఉంటుంది. (రోమీయులు 12:12) వారు ‘అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూసుకుంటారు.’ (ఎఫెసీయులు 5:15) తాత్కాలికమైన వస్తుసంబంధ ప్రయోజనాల కోసమో లేదా అక్రమ శారీరక కోర్కెలను తీర్చుకోవడం కోసమో వారు ఆధ్యాత్మిక సిరులను నిశ్చయంగా త్యాగం చేయరు. (మత్తయి 6:19, 20; 1 యోహాను 2:15-17) అంతేగాక, యెహోవాపట్ల యథార్థతతో ఉండడం, ఆయన మీద నమ్మకం ఉంచడం కీలకం. (2 కొరింథీయులు 1:9; 10:5; ఎఫెసీయులు 4:24) ఎందుకు? మన పరిస్థితికీ ప్రాచీన ఇశ్రాయేలీయుల పరిస్థితికీ చాలా దగ్గరి పోలిక ఉంది కాబట్టి.
నమ్మకం, యథార్థతల అవసరం
3. మనం యెహోవా మార్గంలోనే నడవడానికి యథార్థత, విశ్వాసం, నమ్మకం ఎందుకు సహాయం చేస్తాయి?
3 విగ్రహ దేవుళ్ళ ఆరాధనలో లైంగిక విచ్ఛలవిడితనంతో కూడిన ఆచారాలు పాటించిన శత్రుభావంగల పొరుగువారు చుట్టూవున్నారు, వీరి మధ్య ఉన్న ఇశ్రాయేలీయులది చాలా చిన్న దేశం. (1 దినవృత్తాంతములు 16:26) కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే ఒకే ఒక్క సత్య దేవుడూ అదృశ్యుడూ అయిన యెహోవాను సేవించారు. వారు అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను పాటించాలని ఆయన కోరాడు. (ద్వితీయోపదేశకాండము 6:4) నేడు కూడా అదే విధంగా, కేవలం కొన్ని లక్షల మంది మాత్రమే యెహోవాను ఆరాధిస్తున్నారు. వీరు తమ ప్రమాణాలకూ, మత దృష్టికోణానికీ పూర్తి వేరుగా ఉన్న ప్రమాణాలూ, మతపరమైన దృష్టికోణమూ కలిగివున్న దాదాపు ఆరు వందల కోట్ల ప్రజల మధ్య జీవిస్తున్నారు. మనం ఆ లక్షల సంఖ్యలో ఉన్న ప్రజల్లోని వారమైతే, మనం తప్పు మార్గంలో నడిచేలా ప్రభావితం చెందకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎలా? యెహోవా దేవునిపట్ల యథార్థంగా ఉండడం, ఆయనపై విశ్వాసం ఉంచడం, ఆయన తన వాగ్దానాలను నెరవేరుస్తాడన్న స్థిరమైన నమ్మకం మనకు సహాయం చేస్తాయి. (హెబ్రీయులు 11:6) ఇది ఈ లోకం వేటిమీద ఆశలు పెట్టుకుంటుందో వాటిమీద మనం నమ్మకం ఉంచకుండా ఉండేలా మనల్ని నివారిస్తుంది.—సామెతలు 20:22; 1 తిమోతి 6:17.
4. ఈ అన్యజనులు ఎందుకు “అంధకారమైన మనస్సుగలవారై” ఉన్నారు?
4 ఈ లోకానికి క్రైస్తవులు ఎంత వేరుగా ఉండాలో అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాస్తూ చూపించాడు: “కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయకాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.” (ఎఫెసీయులు 4:17, 18) యేసు “నిజమైన వెలుగు.” (యోహాను 1:9) ఆయన్ను తృణీకరించేవారు, లేదా ఆయనలో నమ్మకం ఉంచుతున్నామని చెప్పుకుంటూనే “క్రీస్తు నియమము”నకు విధేయత చూపనివారు “అంధకారమైన మనస్సుగలవారై” ఉన్నారు. యెహోవా మార్గంలో నడవకపోగా, వారు “దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై” ఉన్నారు. ఈ లోకరీత్యా తామెంత జ్ఞానులమని తలంచినా, జీవానికి నడిపించే ఒకే ఒక్క జ్ఞానానికి సంబంధించి, అంటే యెహోవా దేవుణ్ని గూర్చిన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానానికి సంబంధించి ‘వారిలో అజ్ఞానమే’ ఉంది.—యోహాను 17:3; 1 కొరింథీయులు 3:19.
5. సత్యపు వెలుగు ఈ లోకంలో ప్రకాశిస్తున్నప్పటికీ, అనేకమైన హృదయాలు ఎందుకు కఠినంగా ఉంటున్నాయి?
5 అయినప్పటికీ, సత్యపు వెలుగు ఈ లోకంలో ప్రకాశిస్తూనే ఉంది! (కీర్తన 43:3; ఫిలిప్పీయులు 2:16) “[నిజమైన] జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది.” (సామెతలు 1:20) గత సంవత్సరం యెహోవాసాక్షులు తమ పొరుగువారికి యెహోవా దేవుణ్ని గురించీ యేసుక్రీస్తు గురించీ చెబుతూ వంద కోట్లకు పైగా గంటలను వెచ్చించారు. లక్షలాదిమంది ప్రతిస్పందించారు. ఇతరులు అనేకమంది ప్రతిస్పందించలేదెందుకని మనం ఆశ్చర్యపోవాలా? అక్కర్లేదు. పౌలు ‘వారి హృదయకాఠిన్యం’ గురించి మాట్లాడాడు. కొందరిలో స్వార్థం మూలంగా లేదా ధనాపేక్ష మూలంగా స్పందించని హృదయాలు ఉన్నాయి. ఇతరులు అబద్ధ మతం మూలంగా లేదా నేడు ఎంతో విస్తరించివున్న లౌకిక దృష్టికోణం మూలంగా ప్రభావితం అవుతున్నారు. జీవితంలోని కఠిన అనుభవాలు దేవుణ్ని విసర్జించడానికి చాలామందికి కారణమైనాయి. ఇతరులు యెహోవా ఉన్నత ప్రమాణాలను పాటించడానికి నిరాకరిస్తారు. (యోహాను 3:20) యెహోవా మార్గంలో నడుస్తున్న వ్యక్తి హృదయం అలాంటి వాటినిబట్టి కఠినం అవ్వగలదా?
6, 7. ఇశ్రాయేలీయులు యెహోవా దేవుని ఆరాధకులైనప్పటికీ వారు ఏ సందర్భాల్లో వైదొలగిపోయారు, ఎందుకు?
6 పౌలు చూపించినట్లుగా ప్రాచీన ఇశ్రాయేలులో అలాగే జరిగింది. ఆయనిలా వ్రాశాడు: “వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి.—జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి. మరియు వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే యిరువది మూడువేలమంది కూలిరి.”—1 కొరింథీయులు 10:6-8.
7 పౌలు మొదట, సీనాయి పర్వతపాదం వద్ద ఇశ్రాయేలీయులు ఒక బంగారు దూడను ఆరాధించిన సందర్భాన్ని సూచిస్తున్నాడు. (నిర్గమకాండము 32:5, 6) ఇది, తాము కేవలం కొద్ది వారాల మునుపు విధేయత చూపుతామని ఒప్పుకున్న దైవిక ఆజ్ఞకు ప్రత్యక్షంగా చూపించిన అవిధేయతయై ఉంది. (నిర్గమకాండము 20:4-6; 24:3) తర్వాత పౌలు, ఇశ్రాయేలీయులు మోయాబు కుమార్తెలతోపాటు బయలుకు నమస్కరించినప్పటి సందర్భాన్ని సూచిస్తున్నాడు. (సంఖ్యాకాండము 25:1-9) దూడ ఆరాధనలో ఘోరమైన రీతిలో ఆత్మ సంతృప్తిని పొందడం, ‘ఆడడం’ అనేవి ప్రధాన లక్షణాలుగా ఉన్నాయి.a బయలు ఆరాధనలో విచ్ఛలవిడితనంతో కూడిన లైంగిక అనైతికత ఇమిడివుండేది. (ప్రకటన 2:14) ఇశ్రాయేలీయులు ఈ పాపాలను ఎందుకు చేశారు? ఎందుకంటే వారు తమ హృదయాలు ‘చెడ్డవాటిని ఆశించేలా’—అవి విగ్రహారాధనయైనా లేదా దానితోకూడా ఉన్న విచ్ఛలవిడితనంతో కూడిన లైంగిక అభ్యాసాలైనా—అనుమతించారు.
8. ఇశ్రాయేలీయుల అనుభవాలనుండి మనం ఏమి నేర్చుకోగలం?
8 మనం ఈ సంఘటనల నుండి నేర్చుకోవల్సింది ఉందని పౌలు సూచించాడు. ఏమి నేర్చుకోవాలి? ఒక క్రైస్తవుడు ఏదో బంగారు దూడకు గానీ లేదా ప్రాచీన మోయాబు దేవతకు గానీ నమస్కరిస్తాడని మనం అనుకోము. కానీ అనైతికత విషయమేమిటి, లేదా విశృంఖలమైన రీతిలో ఆత్మ సంతృప్తిని పొందడం విషయమేమిటి? ఇవి నేడు సర్వసాధారణమైపోయాయి, మన హృదయంలో వాటిపట్ల వాంఛ అభివృద్ధిచెందేలా మనం అనుమతిస్తే, అవి మనకూ యెహోవాకూ మధ్య గోడలా ఏర్పడతాయి. దాని ఫలితం మనం విగ్రహారాధన చేయడంతో సమానం—దానర్థం మనం దేవుని నుండి వైదొలగిపోవడమనే. (పోల్చండి కొలొస్సయులు 3:5; ఫిలిప్పీయులు 3:19.) నిజానికి, తోటి విశ్వాసులను ఈ విధంగా పురికొల్పుతూ పౌలు ఆ సంఘటనల గురించిన తన చర్చను ముగిస్తున్నాడు: “విగ్రహారాధనకు దూరముగా పారిపొండి.”—1 కొరింథీయులు 10:14.
దేవుని మార్గంలో నడవడానికి సహాయం
9. (ఎ) మనం యెహోవా మార్గంలోనే నడుస్తూ ఉండడానికి ఏ సహాయాన్ని మనం పొందుతున్నాము? (బి) మనకు ‘వెనుక నుండి ఒక శబ్దము’ వినబడే ఒక మార్గం ఏమిటి?
9 మనం యెహోవా మార్గంలో నడవాలని కృత నిశ్చయంతో ఉన్నట్లైతే మనకు సహాయం లేకుండా పోలేదు. యెషయా ఇలా ప్రవచించాడు: “మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను—ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.” (యెషయా 30:21) ‘వెనుక నుండి ఒక శబ్దము’ ‘మన చెవులకు’ ఎలా వినబడుతుంది? నేడు దేవుని నుండి అక్షరార్థమైన స్వరం ఎవరికీ వినబడదు, లేదా దేవుని నుండి వ్యక్తిగతమైన సందేశాన్ని ఎవరూ పొందరు. మనకు వినబడే “శబ్దము” మనందరికీ ఒకే మార్గంలో వస్తుంది. మొట్టమొదటిగా అది దేవుని తలంపులున్న, మానవులతో ఆయన వ్యవహారాలను గూర్చిన నివేదికలున్న ప్రేరేపిత లేఖనాలైన బైబిలు ద్వారా వస్తుంది. “దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై[న]” వ్యక్తుల నుండి వచ్చే ప్రచారం ప్రతిరోజు మనపై దాడి చేస్తుంది కాబట్టి, మంచి ఆధ్యాత్మిక ఆరోగ్యం కోసం మనం బైబిలును క్రమంగా చదువుతూ దానిపై ధ్యానించాల్సిన అవసరం ఉంది. ఇలా చేయడం, మనం “వ్యర్థమైనవాటిని” విడిచి, ‘సన్నద్ధులమై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండుటకు’ మనకు సహాయం చేస్తుంది. (అపొస్తలుల కార్యములు 14:14, 15; 2 తిమోతి 3:16, 17) అలా చేయడం మనల్ని బలపరుస్తుంది, దృఢపరుస్తుంది, మన ‘మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించడానికి’ సహాయం చేస్తుంది. (యెహోషువ 1:7, 8) అందుకని, యెహోవా వాక్యం ఇలా ఉద్బోధిస్తుంది: “కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి నా మార్గముల ననుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దాని నవలంబించి జ్ఞానులై యుండుడి.”—సామెతలు 8:32, 33.
10. ‘వెనుక నుండి ఒక శబ్దమును’ మనం వినే రెండవ మార్గం ఏది?
10 ‘వెనుక నుండి ఒక శబ్దము,’ మనకు ‘తగినవేళ అన్నము పెట్టే’ ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ ద్వారా కూడా వస్తుంది. (మత్తయి 24:45-47) ఈ ఆహారాన్ని అందించే ఒక విధానం ఏమిటంటే, బైబిలు ఆధారిత ప్రచురణలను ముద్రించడం ద్వారానే, ఇటీవలి కాలాల్లో ఈ ఆహార సరఫరా ఎంతో సమృద్ధిగా ఉంది. ఉదాహరణకు, కావలికోట పత్రిక ద్వారా, ప్రవచనాల విషయంలో మన అవగాహన అంతకంతకూ మెరుగులు అద్దుకుంది. ప్రజలలో ఉదాసీనత పెరుగుతున్నప్పటికీ, ప్రకటనా పనిలోనూ శిష్యుల్ని చేసే పనిలోనూ నిర్విరామంగా కొనసాగమని ఈ పత్రిక ద్వారా ప్రోత్సహించబడుతున్నాము. మోసకరమైన ఊబుల్లో కూరుకుపోకుండా జాగ్రత్త వహించేలా మనకు సహాయం అందుతూ ఉంది. చక్కని క్రైస్తవ గుణాలను పెంపొందించుకోవాలని మనం పురికొల్పబడుతున్నాం. తగినవేళకు లభించే ఇటువంటి ఆహారాన్ని మనం ఎంత విలువైనదిగా ఎంచుతాము!
11. ‘వెనుక నుండి ఒక శబ్దమును’ మనం వినగల మూడవ మార్గం గురించి వివరించండి.
11 నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు మనకు ఆహారాన్ని క్రమమైన కూటాల ద్వారా కూడా అందజేస్తున్నాడు. ఇందులో స్థానిక సంఘ కూటాలు, ఆరు నెలలకొకసారి జరిగే సమావేశాలు, ఇంకా పెద్దస్థాయిలోని వార్షిక సమావేశాలు కూడా ఉన్నాయి. ఇటువంటి సమావేశాల్ని విశ్వసనీయుడైన ఏ క్రైస్తవుడు మాత్రం అమూల్యంగా ఎంచడు? యెహోవా మార్గంలో నడిచేలా మనకు మద్దతునిచ్చేందుకు అవి చాలా కీలకమైన సహాయకాలు. చాలామంది పనిస్థలంలో, స్కూల్లో తమ విశ్వాసానికి భిన్నమైన విశ్వాసాల్ని కలిగివున్నవారితో ఎంతో సమయాన్ని గడపాల్సి వస్తుంది గనుక క్రమమైన క్రైస్తవ సహవాసం నిజంగా ప్రాణాల్ని రక్షించేటువంటిదే. ‘ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పుకోవడానికి’ కూటాలు మనకు చక్కని అవకాశాన్నిస్తాయి. (హెబ్రీయులు 10:24, 25) మనం మన సహోదరులను ప్రేమిస్తాము, వారితో సహవసించడానికి ఎంతో ఇష్టపడతాము.—కీర్తన 133:1.
12. యెహోవాసాక్షులకు ఎటువంటి కృత నిశ్చయం ఉంది, వారు దాన్ని ఇటీవల ఎలా వ్యక్తం చేశారు?
12 అటువంటి ఆధ్యాత్మిక ఆహారంతో బలంపొంది, దాదాపు 60 లక్షలమంది నేడు యెహోవా మార్గంలో నడుస్తున్నారు, లక్షలాదిమంది ఇతరులు అలా ఎలా నడవాలో నేర్చుకోవడానికి బైబిలును పఠిస్తున్నారు. భూమ్మీది వందల కోట్ల సంఖ్యలో ఉన్న జనాభాతో సంఖ్యాపరంగా పోల్చిచూస్తే తాము ఎంతో తక్కువగా ఉన్నామని వారు నిరుత్సాహం చెందుతున్నారా లేదా బలహీనమౌతున్నారా? ఎంతమాత్రం కాదు! వారు తమ ‘వెనుక నుండి ఒక శబ్దము’ వస్తుంటే దాని ప్రకారం నడుచుకోవాలనీ, యథార్థతతో యెహోవా చిత్తాన్ని చేయాలనీ కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ కృత నిశ్చయానికి బహిరంగ ప్రకటనగా 1998/99 కాలంలో “దైవిక జీవిత మార్గము” అనే జిల్లా, అంతర్జాతీయ సమావేశాల్లో హాజరైన ప్రతినిధులు తమ హృదయపూర్వక స్థానాన్ని వ్యక్తంచేస్తూ ఒక తీర్మానాన్ని స్వీకరించారు. ఆ తీర్మానం ఈ క్రింద ఉంది.
తీర్మానం
13, 14. యెహోవాసాక్షులు మానవ సమాజాన్ని గూర్చిన ఏ వాస్తవికమైన దృష్టికోణాన్ని కలిగివున్నారు?
13 “‘దైవిక జీవిత మార్గము’ సమావేశంలో హాజరైన యెహోవాసాక్షులమైన మనము, దేవుని మార్గమే అతి శ్రేష్ఠమైన మార్గమని హృదయపూర్వకంగా అంగీకరిద్దాము. అయితే, నేడు మానవజాతిలో అధిక శాతం మంది వేరే విధంగా భావిస్తున్నారని మనము గుర్తిద్దాము. అతి శ్రేష్ఠమైన జీవితం వేటిపై రూపొందించబడుతుందో అన్న దానిపై ఆధారపడి మానవ సమాజం అసంఖ్యాకమైన భావనలతోనూ, తత్త్వాలతోనూ, మతపరమైన తలంపులతోనూ ప్రయోగాలు చేస్తున్నది. మానవ చరిత్రనూ, నేటి ప్రపంచ పరిస్థితులనూ నిష్కపటంగా పరిశీలించి చూస్తే యిర్మీయా 10:23లోని దైవిక ప్రకటనలో ఉన్న సత్యం వెల్లడి అవుతుంది: ‘మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదు.’
14 “ఆ మాటల్లోని సత్యాన్ని నిర్ధారిస్తున్న సాక్ష్యాధారాల్ని మనం ప్రతిరోజూ చూస్తున్నాము. మానవ సమాజంలో అధిక శాతం దేవుని జీవిత మార్గాన్ని ఉపేక్షిస్తుంది. ప్రజలు తమ దృష్టికి ఏది సరి అన్పిస్తుందో దాన్నే వెంబడిస్తున్నారు. దాని ఫలితాలు ఘోరంగా ఉన్నాయి—కుటుంబ జీవితాలు విచ్ఛిన్నం కావడం, పిల్లలకు నడిపింపు నివ్వకుండా వారిమానాన వారిని విడిచిపెట్టడం; వస్తుసంపదలను సంపాదించుకోవడం కోసం వెంపర్లాడడం, చివరికి మిగిలేది శూన్యం, ఆశాభంగం; అసంఖ్యాకమైన ప్రాణాల్ని బలిగొంటున్న అర్థరహితమైన నేరాలు, హింసలు; ఘోరమైన సంఖ్యలో ప్రజల ప్రాణాల్ని తీస్తున్న జాతి విద్వేషాలూ, యుద్ధాలు; ప్రబలిపోతున్న లైంగిక అనైతికత, దీని మూలంగా లైంగికంగా సంక్రమించే వ్యాధులు పెచ్చుపెరిగిపోవడం. ఇవన్నీ సంతోషమూ, శాంతీ, భద్రతల కోసం చేసే వెదుకులాటను అడ్డగించే గొప్ప సంఖ్యలోని సంక్లిష్టమైన సమస్యల్లో కేవలం కొన్ని మాత్రమే.
15, 16. దైవిక జీవిత మార్గం విషయమై ఆ తీర్మానంలో ఎటువంటి కృత నిశ్చయం వ్యక్తపర్చబడింది?
15 “మానవజాతి యొక్క దుఃఖకరమైన స్థితి దృష్ట్యా, అర్మగిద్దోను అని పిలువబడిన ‘సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము’ (ప్రకటన 16:14-16) సమీపంగా ఉన్న దృష్ట్యా, యెహోవాసాక్షులుగా మనము ఈ విధంగా తీర్మానించుకుందాము.
16 “మొదటిగా: మనల్ని మనము యెహోవా దేవునికి చెందినవారముగా దృష్టించుకుందాము, ఒక్కొక్కరుగా మనము ఆయనకు బేషరతుగా మనల్ని మనము సమర్పించుకున్నాము, తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా యెహోవా చేసిన విమోచన క్రయధన ఏర్పాటులో అచంచలమైన విశ్వాసాన్ని చూపిస్తూ ఉందాము. మనము ఆయన సాక్షులుగా సేవచేస్తూ, యేసుక్రీస్తు పరిపాలనద్వారా వ్యక్తమౌతున్న ఆయన సర్వాధికారానికి విధేయత చూపుతూ దైవిక జీవిత మార్గంలో నడవాలని కృత నిశ్చయం చేసుకుందాము.
17, 18. నైతిక ప్రమాణాలకు సంబంధించి, క్రైస్తవ సహోదరత్వానికి సంబంధించి యెహోవాసాక్షులు ఏ స్థానాన్ని కాపాడుకుంటూ ఉంటారు?
17 “రెండవదిగా: మనము బైబిలులోని ఉన్నతమైన నైతిక, ఆధ్యాత్మిక ప్రమాణాలకు అంటిపెట్టుకోవడంలో కొనసాగుదాము. మనము అంధకారమైన మనస్సుతో అన్యజనులు నడుచుకునే మార్గం నుండి దూరంగా ఉండాలని నిర్ధారణ చేసుకుందాము. (ఎఫెసీయులు 4:17-19) యెహోవా ఎదుట పవిత్రమైన, ఈ లోకం సంబంధంగా నిష్కళంకమైన జీవితం గడపాలన్నది మన తీర్మానం.—యాకోబు 1:27.
18 “మూడవదిగా: ఒక ప్రపంచవ్యాప్త క్రైస్తవ సహోదరత్వంగా ఉన్న మనము లేఖనాధార స్థానాన్ని అంటిపెట్టుకుని ఉందాము. వర్ణాల సంబంధంగాను, జాతీయపరంగాను, లేదా జాతిపరంగాను ఉండే ద్వేషాలనూ విభజనలనూ అనుమతించకుండా మనము దేశాల మధ్య లేక జనాంగాల మధ్య క్రైస్తవ తటస్థతను కాపాడుకుందాము.
19, 20. (ఎ) క్రైస్తవ తల్లిదండ్రులు ఏమి చేస్తారు? (బి) నిజ క్రైస్తవులందరూ తమను తాము క్రీస్తు శిష్యులుగా ఎలా గుర్తింపజేసుకుంటూ ఉంటారు?
19 “నాల్గవదిగా: తల్లిదండ్రులమైన మనం మన పిల్లల మనసుల్లో దేవుని మార్గాన్ని నాటుదాము. మనము క్రమమైన బైబిలు పఠనము, కుటుంబ పఠనము, క్రైస్తవ సంఘంలోనూ క్షేత్ర పరిచర్యలోనూ పూర్ణమనస్సుతో భాగం వహించడము ఇమిడివున్న క్రైస్తవ జీవనంలో చక్కని మాదిరిని ఉంచుదాము.
20 “ఐదవదిగా: మన సృష్టికర్తలో ఉన్నటువంటి దైవిక లక్షణాలను పెంపొందింపచేసుకునేలా మనమంతా కృషిచేద్దాము, యేసు చేసినట్లుగానే మనము ఆయన వ్యక్తిత్వాన్నీ, ఆయన మార్గాలనూ అనుసరించడానికి గట్టి ప్రయత్నం చేద్దాము. (ఎఫెసీయులు 5:1) మనము చేసే కార్యాలన్నీ ప్రేమతో చేయడం ద్వారా మనల్ని మనము క్రీస్తు శిష్యులముగా గుర్తింపజేసుకోవడానికి తీర్మానం చేసుకుందాము.—యోహాను 13:35.
21-23. యెహోవాసాక్షులు ఏ పనిలో కొనసాగుతారు, దేని విషయంలో వారు ఒప్పించబడ్డారు?
21 “ఆరవదిగా: ఏమాత్రం వెనక్కు తగ్గకుండా మనము దేవుని రాజ్య సువార్తను ప్రకటించడంలోను, శిష్యుల్ని చేయడంలోను కొనసాగుదాము. మనము ఆ క్రొత్త శిష్యులకు దైవిక జీవిత మార్గాన్ని ఉపదేశిద్దాము, వారు సంఘ కూటాల్లో అదనపు శిక్షణను పొందేలా సహాయపడదాము.—మత్తయి 24:14; 28:19, 20; హెబ్రీయులు 10:24, 25.
22 “ఏడవదిగా: ఒక్కొక్కరుగానూ, అలాగే ఒక మత సంస్థగానూ మనము దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో మొదట ఉంచుతూ ముందుకు సాగుదాము. ఆయన వాక్యమైన బైబిలును మన నిర్దేశకంగా ఉపయోగిస్తూ మనము కుడికి గాని ఎడమకు గాని మరలకుందాము, తద్వారా ఈ లోక మార్గాలకన్నా దైవిక జీవిత మార్గం ఎంతో అత్యుత్తమమైనదని నొక్కిచెబుదాము. మనము దైవిక జీవిత మార్గాన్ని వెంబడించాలని కృత నిశ్చయంతో ఉందాము—స్థిరంగాను యథార్థంగానూ, ఇప్పుడూ నిరంతరమూ!
23 “మనము ఇలా తీర్మానించుకోవడానికి కారణం, దేవుని చిత్తాన్ని చేసేవాడు నిరంతరము నిలుస్తాడన్న యెహోవా వాగ్దానం మీద మనము పూర్ణ నమ్మకాన్ని ఉంచడమే. మనము ఇలా తీర్మానించుకోవడానికి కారణం, లేఖనాధార సూత్రాలు, సలహాలు, హెచ్చరికలకు అనుగుణ్యంగా జీవించడం, నేడు శ్రేష్ఠమైన జీవితాన్ని ఏర్పరుస్తుందనీ, వాస్తవమైన జీవితంపైన గట్టి పట్టును సాధించేలా భవిష్యత్తు కోసం చక్కని పునాదిని వేస్తుందనీ మనము ఒప్పించబడటమే. (1 తిమోతి 6:19; 2 తిమోతి 4:7బి, 8) అన్నింటికీ మిన్నగా, మనము ఇలా తీర్మానించుకోవడానికి కారణం, మనము యెహోవా దేవుణ్ని పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలంతో ప్రేమించడమే!
24, 25. ప్రతిపాదించబడిన తీర్మానానికి ఎటువంటి ప్రతిస్పందన వచ్చింది, యెహోవా మార్గంలో నడుచుకునే వారి కృత నిశ్చయం ఏమిటి?
24 “ఈ సమావేశంలో హాజరైవున్న వారందరిలో ఈ తీర్మానాన్ని స్వీకరించడానికి సుముఖంగా ఉన్నవారందరు దయచేసి అవును అనండి.”
25 ప్రపంచం నలుమూలలా ఈ సమావేశాలకు హాజరైన వారందరూ మేఘగర్జనలా “అవును!” అని జవాబివ్వగా వందలకొలది ఎరీనాలు, స్టేడియంలు ప్రతిధ్వనించాయి. తాము యెహోవా మార్గంలో నడుస్తూ కొనసాగుతామన్న దానిలో యెహోవాసాక్షులకు ఎటువంటి సందేహమూ లేదు. వారికి యెహోవా మీద పూర్ణ నమ్మకం ఉంది, ఆయన తన వాగ్దానాలను నెరవేరుస్తాడన్న విశ్వాసం ఉంది. వారు ఆయనపట్ల యథార్థతతో కొనసాగుతారు, ఏమి వచ్చినా సరే. వారు ఆయన చిత్తాన్ని చేయాలని కృత నిశ్చయంతో ఉన్నారు.
‘దేవుడు మన పక్షముగానున్నాడు’
26. యెహోవా మార్గంలో నడుస్తున్న వారి సంతోషకరమైన పరిస్థితి ఏమిటి?
26 యెహోవాసాక్షులు కీర్తనల గ్రంథకర్త చేసిన ఉద్బోధను జ్ఞాపకం చేసుకుంటున్నారు: “యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము, ఆయన మార్గము ననుసరించుము. భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును.” (కీర్తన 37:34) వారు పౌలు చెప్పిన ప్రోత్సాహకరమైన మాటల్ని మర్చిపోరు: “దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు? తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?” (రోమీయులు 8:31, 32) అవును, మనం యెహోవా మార్గంలో నడుస్తూ ముందుకు సాగితే, ఆయన “సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా” దయచేస్తాడు. (1 తిమోతి 6:17) మనం ఇప్పుడున్న శ్రేష్ఠమైన చోటుకన్నా—అంటే మన అనుంగు సహోదర సహోదరీలతో యెహోవా మార్గంలో నడవడం కన్నా శ్రేష్ఠమైన చోటు ఇంకెక్కడుంది! యెహోవా మనతోకూడ ఉండగా, తను చేసిన ప్రతి వాగ్దానాన్నీ ఆయన యుక్తకాలంలో నెరవేర్చడాన్ని మనం చూస్తామన్న సంపూర్ణ నమ్మకంతో, మనం ఆ శ్రేష్ఠమైన స్థలంలోనే నిలిచివుందామనీ, అంతం వరకూ సహిద్దామనీ నిశ్చయించుకుందాము.—తీతుకు 1:2.
[అధస్సూచీలు]
a “ఆడుటకు లేచిరి” అని అనువదించబడిన గ్రీకు పదాన్ని సూచిస్తూ ఒక వ్యాఖ్యానకర్త, అన్యుల పండుగల్లో జరిగిన నృత్యాలను ఆ పదం సూచిస్తుందని చెప్పి, ఇంకా ఇలా జతచేస్తున్నాడు: “ఈ నృత్యాల్లో చాలామట్టుకు సర్వత్రా తెలిసినట్లే, అత్యంత తీవ్రమైన లైంగిక కోర్కెలను రేకెత్తించడానికి రూపొందించబడ్డాయి.”
మీకు జ్ఞాపకం ఉందా?
◻ యెహోవా మార్గంలో నడవడానికి ఒక క్రైస్తవునికి ఏమి అవసరం?
◻ యెహోవా మీద నమ్మకాన్నీ, ఆయనపట్ల యథార్థతనూ మనం పెంపొందించుకోవల్సిన అవసరం ఎందుకు ఉంది?
◻ మనం యెహోవా మార్గంలో నడుస్తుండగా మనకు ఎటువంటి సహాయం అందుబాటులో ఉంది?
◻ “దైవిక జీవిత మార్గము” సమావేశాల్లో స్వీకరించిన తీర్మానంలోని కొన్ని ఉన్నతాంశాల్ని పేర్కొనండి.
[18వ పేజీలోని చిత్రాలు]
“దైవిక జీవిత మార్గము” జిల్లా, అంతర్జాతీయ సమావేశాల్లో ఒక ప్రాముఖ్యమైన తీర్మానం స్వీకరించబడింది