కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w98 3/15 పేజీలు 12-17
  • సమర్పణ మరియు ఎంపిక చేసుకునే స్వాతంత్ర్యము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సమర్పణ మరియు ఎంపిక చేసుకునే స్వాతంత్ర్యము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘ఇశ్రాయేలీయుల దేవునికి’ సమర్పణ
  • “దేవుని ఇశ్రాయేలు” యొక్క సమర్పణ
  • దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించడం
  • దాసునిగా ఉండడానికి ఎంపిక చేసుకోవడము, ఎవరికి?
  • మనకు మనమే ప్రయోజనం పొందడాన్ని నేర్చుకోవడం
  • వారు దేవుడు ఏర్పరచుకున్న జనాంగ సభ్యులుగా జన్మించారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • మీరు మీ సమర్పణకు తగ్గట్టు జీవిస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • “ప్రతిదినము” మన సమర్పణకు తగినట్లు జీవించుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • మీరు యెహోవాకు ఎందుకు సమర్పించుకోవాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
w98 3/15 పేజీలు 12-17

సమర్పణ మరియు ఎంపిక చేసుకునే స్వాతంత్ర్యము

“ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు.”—గలతీయులు 5:1.

1. “సమర్పణ,” “ప్రతిష్ఠాపన,” లేక “అర్పణ” అని అనువదించబడిన హెబ్రీ, గ్రీకు పదాలు ప్రాముఖ్యంగా దేనికి వర్తిస్తాయి?

ఏదైనా ఒక పవిత్రమైన సంకల్పం నిమిత్తం వేర్పరచబడడం, లేక ప్రత్యేకపర్చబడడం అనే తలంపును వ్యక్తం చేయడానికి, బైబిలును వ్రాసినవారు కొన్ని హెబ్రీ, గ్రీకు పదాలను ఉపయోగించారు. ఇంగ్లీషు బైబిళ్లలో ఈ పదాలు “సమర్పణ,” “ప్రతిష్ఠాపన,” లేక “అర్పణ” అనే భావంగల పదాలతో అనువదించబడ్డాయి. కొన్నిసార్లు ఈ పదాలు భవనాలకు సంబంధించి—సామాన్యంగా ప్రాచీన యెరూషలేములోని దేవుని ఆలయానికి సంబంధించి, అక్కడ జరిగే ఆరాధనకు సంబంధించి ఉపయోగించబడ్డాయి. లౌకిక విషయాలకు సంబంధించి ఈ పదాలు చాలా అరుదుగా ఉపయోగించబడ్డాయి.

‘ఇశ్రాయేలీయుల దేవునికి’ సమర్పణ

2. యెహోవా న్యాయయుక్తంగానే ‘ఇశ్రాయేలీయుల దేవుడు’ అని ఎందుకు పిలువబడగలడు?

2 సా.శ.పూ. 1513లో, దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తీయుల దాస్యము నుండి విడిపించాడు. అటుతర్వాత కొద్దికాలానికి, ఆయన వారిని తనతోపాటు ఒక నిబంధన సంబంధంలోనికి తీసుకుంటూ, వారిని తన ప్రత్యేక ప్రజగా వేర్పర్చాడు. వారికిలా చెప్పాడు: “మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు.” (నిర్గమకాండము 19:5; కీర్తన 135:4) ఇశ్రాయేలీయులను తన స్వకీయ సంపాద్యముగా చేసుకున్నందున, యెహోవా న్యాయయుక్తంగానే ‘ఇశ్రాయేలీయుల దేవుడు’ అని పిలువబడగలడు.—యెహోషువ 24:23.

3. యెహోవా ఇశ్రాయేలును తన ప్రజలుగా ఎంపిక చేసుకోవడం పక్షపాతం చూపిస్తున్నట్లు ఎందుకు కాదు?

3 ఇశ్రాయేలీయులను తన సమర్పిత ప్రజలుగా చేసుకోవడంలో యెహోవా పక్షపాతం చూపించాడని కాదు, ఎందుకంటే ఆయన ఇశ్రాయేలీయులు కానివారి విషయంలో కూడా ప్రేమపూర్వకంగా శ్రద్ధను కనబరచాడు. ఆయన తన ప్రజలకు ఇలా నిర్దేశాలను ఇచ్చాడు: “మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించునప్పుడు వానిని బాధింపకూడదు, మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింపవలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులై యుంటిరి; నేను మీ దేవుడనైన యెహోవాను.” (లేవీయకాండము 19:33, 34) శతాబ్దాల తర్వాత, దేవుని దృక్పథం అపొస్తలుడైన పేతురు మనస్సులో బలంగా నాటబడింది, ఆయన దాన్నిలా అంగీకరించాడు: “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.”—అపొస్తలుల కార్యములు 10:34, 35.

4. దేవునికి, ఇశ్రాయేలుకు మధ్యగల సంబంధానికి షరతులు ఏమిటి, ఇశ్రాయేలీయులు వాటికి తగ్గట్టుగా జీవించారా?

4 దేవుని సమర్పిత ప్రజలుగా ఉండడం షరతులపై ఆధారపడి ఉండేదని కూడా గమనించండి. దేవునికి కచ్చితంగా విధేయత చూపిస్తేనే, ఆయన నిబంధనను పాటిస్తేనే వారు ఆయన ‘స్వకీయ సంపాద్యముగా’ ఉంటారు. విచారకరంగా, ఇశ్రాయేలీయులు ఈ ఆవశ్యకతలను నెరవేర్చడంలో విఫలమైపోయారు. సా.శ. మొదటి శతాబ్దంలో దేవుడు పంపించిన మెస్సీయను వారు తృణీకరించిన తర్వాత ఆధిక్యతగల తమ స్థానాన్ని వాళ్లు కోల్పోయారు. యెహోవా ఇక ఎంతమాత్రం ‘ఇశ్రాయేలీయుల దేవునిగా’ లేడు. అంతేగాక సహజ ఇశ్రాయేలీయులు ఇక ఎంతమాత్రం దేవుని సమర్పిత ప్రజలుగా లేరు.—పోల్చండి మత్తయి 23:23.

“దేవుని ఇశ్రాయేలు” యొక్క సమర్పణ

5, 6. (ఎ) మత్తయి 21:42, 43లో నమోదు చేయబడివున్న ప్రవచనాత్మక మాటలను యేసు ఏ ఉద్దేశంతో పలికాడు? (బి) “దేవుని ఇశ్రాయేలు” ఎప్పుడు, ఎలా ఉనికిలోనికి వచ్చింది?

5 దీనర్థం ఇప్పుడు యెహోవా, తనకు ఒక సమర్పిత జనము అంటూ లేకుండా ఉన్నాడనా? కాదు. కీర్తన గ్రంథకర్తను ఉల్లేఖిస్తూ, యేసుక్రీస్తు ఇలా ముందే చెప్పాడు: “ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువు [“యెహోవా,” NW] వలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను.”—మత్తయి 21:42, 43.

6 ‘దాని ఫలమిచ్చు జనులు,’ క్రైస్తవ సంఘమని రుజువైంది. తాను భూమిపై నివాసము చేసిన కాలంలో యేసు, దానిలో తొలి సభ్యులుగా ఉండబోయేవారిని ఎంపిక చేశాడు. కానీ సా.శ. 33లో పెంతెకొస్తు దినాన, యెహోవా దేవుడు తానుగా ఇంచుమించు 120 మందిగావున్న ఆ తొలి సభ్యులపై తన పరిశుద్ధాత్మను కుమ్మరించడం ద్వారా క్రైస్తవ సంఘాన్ని స్థాపించాడు. (అపొస్తలుల కార్యములు 1:15; 2:1-4) అపొస్తలుడైన పేతురు అటుతర్వాత వ్రాసినట్లుగా, క్రొత్తగా ఏర్పడిన ఈ సంఘము ఆ విధముగా, “ఏర్పరచబడిన [“ఎంపిక చేయబడిన,” NW] వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలు”ను అయ్యారు. ఏ కారణం నిమిత్తం ఎంపిక చేయబడ్డారు? వారు, “చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి [వారిని] పిలిచినవాని గుణాతిశయములను ప్రచురము” చేయడానికే. (1 పేతురు 2:9) క్రీస్తు అనుచరులు, దేవుని ఆత్మతో అభిషేకించబడినవారై, ఇప్పుడు ఒక సమర్పిత జనాంగముగా, “దేవుని ఇశ్రాయేలు”గా అయ్యారు.—గలతీయులు 6:16.

7. దేవుని ఇశ్రాయేలులోని సభ్యులు దేనిని అనుభవించవలసి ఉన్నారు, అందుకు వారు దేనిలో చిక్కుకోకూడదని చెప్పబడింది?

7 ఈ పరిశుద్ధ జనాంగములోని సభ్యులు ‘ఒక స్వకీయ సంపాద్యముగా’ ఉన్నప్పటికీ, వారేమీ బానిసలుగా చేయబడరు. దానికి భిన్నంగా, వారు సమర్పిత సహజ ఇశ్రాయేలు జనాంగము అనుభవించినదానికన్నా ఎంతో గొప్ప స్వాతంత్ర్యాన్ని అనుభవించవలసి ఉన్నారు. ఈ క్రొత్త జనాంగములో సభ్యులుగా ఉండబోయేవారికి యేసు, “మీరు . . . సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని” వాగ్దానం చేశాడు. (యోహాను 8:31, 32) క్రైస్తవులు ధర్మశాస్త్ర నిబంధనలోని కట్టడలనుండి స్వతంత్రులయ్యారని అపొస్తలుడైన పౌలు చూపించాడు. ఈ విషయమై ఆయన గలతీయలోని తోటి విశ్వాసులకు ఇలా ఉద్బోధించాడు: “ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు. కాబట్టి, మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కుకొనకుడి.”—గలతీయులు 5:1.

8. క్రైస్తవ ఏర్పాటు ధర్మశాస్త్ర నిబంధన క్రిందకన్నా మరింత గొప్ప స్వాతంత్ర్యాన్ని ఏయే రీతుల్లో అందిస్తుంది?

8 ప్రాచీనకాలంలోని సహజ ఇశ్రాయేలీయులకు భిన్నంగా, దేవుని ఇశ్రాయేలు నేటివరకూ కూడా తన సమర్పణకు ఆవశ్యకమైనవాటిని కచ్చితంగా చేస్తూ వచ్చింది. దీంట్లో మనం ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు, ఎందుకంటే విధేయత కనపరుస్తామని దాని సభ్యులు స్వేచ్ఛగా ఎంపిక చేసుకున్నారు. సహజ ఇశ్రాయేలీయులు పుట్టుకతోనే సమర్పిత వ్యక్తులయ్యారు, అయితే దేవుని ఇశ్రాయేలులోని సభ్యులు ఎంపిక ద్వారా సమర్పిత వ్యక్తులయ్యారు. ఆ విధంగా, ఎంపిక చేసుకునే స్వాతంత్ర్యాన్ని ఇవ్వకుండా సమర్పణను వ్యక్తులపై విధించిన యూదా ధర్మశాస్త్ర నిబంధనకు క్రైస్తవ ఏర్పాటు భిన్నంగా ఉంది.

9, 10. (ఎ) సమర్పణకు సంబంధించి ఒక మార్పు వస్తుందని యిర్మీయా ఎలా సూచించాడు? (బి) నేడు సమర్పిత క్రైస్తవులు అందరూ దేవుని ఇశ్రాయేలులోని సభ్యులుకారని మీరెందుకు చెబుతారు?

9 ప్రవక్తైన యిర్మీయా సమర్పణ విషయంలో సంభవించబోయే మార్పును చెబుతూ ముందే ఇలా వ్రాశాడు: “ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనైయుందును వారు నాకు జనులగుదురు.”—యిర్మీయా 31:31-34.

10 దేవుని ధర్మవిధి “వారి మనస్సులలో,” ఒక విధంగా చెప్పాలంటే “వారి హృదయముమీద” వ్రాయబడి ఉంటుంది గనుక, దేవుని ఇశ్రాయేలులోని సభ్యులు తమ సమర్పణకు తగ్గట్టుగా జీవించాలని కదిలించబడ్డారు. ఎంపికద్వారా కాక పుట్టుకద్వారా సమర్పితులైన ఆ సహజ ఇశ్రాయేలీయులకన్నా వీరి ప్రేరణాశక్తి బలంగా ఉంటుంది. నేడు, దేవుని చిత్తాన్ని చేయాలన్న బలమైన ప్రేరణాశక్తి, దేవుని ఇశ్రాయేలు ప్రదర్శించినట్లు, ప్రపంచవ్యాప్తంగా యాభై లక్షలకుపైగా ఉన్న వారి తోటి ఆరాధకులు ప్రదర్శిస్తున్నారు. వారు కూడా అదే విధంగా యెహోవా చిత్తాన్ని చేయడానికే తమ జీవితాలను సమర్పించుకున్నారు. ఈ వ్యక్తులకు దేవుని ఇశ్రాయేలు సభ్యులకు ఉన్నట్లుగా పరలోక నిరీక్షణ లేకపోయినప్పటికీ, వీరు దేవుని పరలోక రాజ్య పరిపాలన క్రింద భూమిపైన నిరంతరమూ జీవించే ఉత్తరాపేక్షనుబట్టి ఆనందిస్తున్నారు. “చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి [తమను] పిలిచినవాని గుణాతిశయములను ప్రచురము” చేసే నియామకాన్ని నెరవేర్చడంలో, ఆధ్యాత్మిక ఇశ్రాయేలువారిలోని శేషించిన కొద్దిమంది సభ్యులకు చురుకైన మద్దతు నివ్వడంద్వారా వీరు వారిపట్ల మెప్పుదలను కనపరుస్తున్నారు.

దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించడం

11. మానవుడు ఏ సామర్థ్యంతో సృష్టించబడ్డాడు, దాన్ని ఏ రీతిలో ఉపయోగించుకోవల్సి ఉంది?

11 స్వాతంత్ర్యాన్ని అమూల్యమైనదిగా ఎంచే విధంగా దేవుడు మానవుల్ని సృష్టించాడు. ఆయన వారికి స్వేచ్ఛాచిత్తాన్ని కలిగివుండే సామర్థ్యాన్ని అనుగ్రహించాడు. మొదటి మానవ దంపతులు ఎంపిక చేసుకునే తమ స్వాతంత్ర్యాన్ని ఉపయోగించుకున్నారు. అయితే వారు అజ్ఞానంగా, ప్రేమరహితంగా చేసుకున్న ఎంపిక వారికీ, వారి సంతానానికీ నాశనకరమైనదిగా పరిణమించింది. అయినప్పటికీ, తమ ఆంతరంగిక ప్రేరణలకూ లేక కోరికలకూ విరుద్ధంగా నడవమని యెహోవా తన బుద్ధిగల ప్రాణులను ఎన్నడూ బలవంతం చేయడని ఇది స్పష్టంగా రుజువు చేస్తుంది. అంతేగాక, “దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును” గనుక, ఆయనకు అంగీకారయోగ్యమైన సమర్పణ ప్రేమ మీద ఆధారపడినదైవుంది, ఉత్సాహంతో, ఇష్టపూర్వకంగా చేసుకున్నదైవుంది, ఎంపిక చేసుకునే స్వాతంత్ర్యంపైన ఆధారపడినదైవుంది. (2 కొరింథీయులు 9:7) వేరే ఏ ఇతర సమర్పణ అయినా అనంగీకారమైనదే.

12, 13. సరియైన శిశు శిక్షణ కొరకు తిమోతి ఒక నమూనాగా ఎలా ఉన్నాడు, ఆయన మాదిరి అనేకమంది యౌవనస్థులను ఎటువైపు నడిపించింది?

12 యెహోవాసాక్షులు ఈ ఆవశ్యకతను పూర్తిగా గుర్తిస్తూ, ఒకవ్యక్తి తనను తాను దేవునికి సమర్పించుకోవడాన్ని సమర్థిస్తారు, అంతేగాని వారు అటువంటి సమర్పణ చేసుకోవడానికి ఎవరినీ బలవంతపెట్టరు, చివరికి తమ స్వంత పిల్లల్ని కూడా. వ్యక్తిగత ఎంపికతో నిమిత్తం లేకుండా తమ పిల్లల్ని సమర్పణలోనికి బలవంతంగా నెట్టడం సాధ్యమన్నట్టు, సాక్షులు వారు శిశువులుగా ఉన్నప్పుడు వారికి బాప్తిస్మం ఇవ్వరు, ఈ విషయంలో సాక్షులు అనేక చర్చీలకు భిన్నంగా ఉన్నారు. సరైన మాదిరిని లేఖనాలు చూపిస్తున్నాయి. యౌవనుడైన తిమోతి అనుసరించినది ఆ విధానాన్నే. పెద్దవాడైనప్పుడు ఆయనకు అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములను బాల్యమునుండి నీవెరుగుదువు గనుక, నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము.”—2 తిమోతి 3:14, 15.

13 తిమోతికి పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి నేర్పించబడ్డాయి గనుక, ఆయనకు వాటి గురించి తెలుసన్న విషయం గమనార్హము. క్రైస్తవ బోధలు నమ్మడానికి ముందు ఆయన అమ్మా అమ్మమ్మల ద్వారా రూఢిపర్చుకున్నాడు, అంతేగాని వారిచేత బలవంతపెట్టబడలేదు. (2 తిమోతి 1:5) తత్ఫలితంగా, తిమోతి క్రీస్తు అనుచరునిగా అవ్వడం జ్ఞానయుక్తమైనదని గ్రహించి, క్రైస్తవ సమర్పణ అనే వ్యక్తిగత ఎంపిక చేసుకున్నాడు. ఆధునిక కాలాల్లో, యెహోవాసాక్షులైన తలిదండ్రులుగల వేలాదిమంది యువతీ యువకులు ఈ మాదిరిని అనుసరించారు. (కీర్తన 110:3) ఇతరులు అనుసరించలేదు. ఇది వ్యక్తిగత ఎంపికకు సంబంధించిన విషయం.

దాసునిగా ఉండడానికి ఎంపిక చేసుకోవడము, ఎవరికి?

14. రోమీయులు 6:16 సంపూర్ణ స్వాతంత్ర్యం గురించి ఏమి చెబుతుంది?

14 ఏ మానవుడూ సంపూర్ణంగా స్వతంత్రుడు కాడు. ప్రతి ఒక్కరూ గురుత్వాకర్షణ శక్తివంటి భౌతిక నియమాలచేత తమ స్వాతంత్ర్యం విషయంలో నిర్బంధించబడివున్నారు. ఆ నియమాలను కాదని వాటి దుష్పరిణామాలను తప్పించుకోవడం కుదరదు. ఆధ్యాత్మిక భావంలో కూడా ఏ ఒక్కరూ పూర్తిగా స్వతంత్రులు కారు. పౌలు ఇలా తర్కించాడు: “లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావునిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా?”—రోమీయులు 6:16.

15. (ఎ) దాసులుగా ఉండే విషయం గురించి ప్రజలు ఎలా భావిస్తారు, కానీ అధిక సంఖ్యాకులు చివరికి ఏమి చేస్తుంటారు? (బి) ఏ యుక్తమైన ప్రశ్నలు మనకు మనం వేసుకోవచ్చు?

15 ఒకరికి దాసునిగా ఉండడమన్న తలంపే చాలామందికి చేదుగా రుచిస్తుంది. అయితే వాస్తవం ఏమిటంటే నేటి లోకంలో, ప్రజలు తరచూ ఎన్నెన్ని రీతుల్లో మోసపోవడానికీ, ప్రభావితం కావడానికీ తమను తాము అనుమతించుకుంటున్నారంటే, చివరికి ఇతరులు తమను కోరేవాటినే అనైచ్ఛికంగా చేసేస్తుంటారు. ఉదాహరణకు, వాణిజ్య ప్రకటనల పరిశ్రమా, వినోద ప్రపంచమూ ప్రజలను ఒక చట్రంలో బిగించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తాయి, వారు అనుసరించడానికి ప్రమాణాలను స్థాపిస్తాయి. ఎల్లప్పుడూ ఒప్పింపజేసే వాదనలతో కాక, ఏకత్వం అనీ లేక యథార్థత అనీ చెబుతూ రాజకీయ సంస్థలూ, మత సంస్థలూ తమ ఆలోచనలకూ, లక్ష్యాలకూ ప్రజలు మద్దతునిచ్చేలా చేస్తాయి. ‘మనము ఎవరికి లోబడతామో వారికే మనం దాసులమవుతామని’ పౌలు అన్నాడు గనుక, మనలో ప్రతి ఒక్కరమూ, ‘నేను ఎవరికి దాసుడిని? నా నిర్ణయాలపైనా, నా జీవిత విధానంపైనా ఎవరు అత్యంత గొప్ప ప్రభావం చూపిస్తున్నారు? మత గురువులా, రాజకీయ నాయకులా, గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలా, లేక వినోద పరిశ్రమ ఏలికలా? నేను ఎవరికి లోబడతాను—దేవునికా లేక మనుష్యులకా?’ అని ప్రశ్నించుకోవడం యుక్తం.

16. క్రైస్తవులు ఏ భావంలో దేవునికి దాసులు, అటువంటి దాసత్వం పట్ల కలిగివుండవలసిన సరియైన దృష్టికోణం ఏమిటి?

16 దేవునికి చూపించాల్సిన విధేయతను క్రైస్తవులు తమ వ్యక్తిగత స్వాతంత్ర్యంపై అసహేతుకమైన అతిక్రమణగా దృష్టించరు. వారు తమ వ్యక్తిగత కోరికలనూ, ప్రాధాన్యతలనూ దేవుని చిత్తానికి అనుగుణ్యంగా మలచుకుంటూ, తమ స్వాతంత్ర్యాన్ని ఇష్టపూర్వకంగా తమ మాదిరికర్త అయిన యేసుక్రీస్తు వలెనే ఉపయోగించుకుంటారు. (యోహాను 5:30; 6:38) వారు “క్రీస్తు మనస్సు”ను పెంపొందించుకుంటూ, సంఘ శిరస్సుగా ఆయనకు తమను తాము లోబరుచుకొంటారు. (1 కొరింథీయులు 2:14-16; కొలొస్సయులు 1:15-18) ఇది, తను ప్రేమించిన పురుషుడ్ని పెండ్లి చేసుకుని, ఇష్టపూర్వకంగా ఆయనతో సహకరించే స్త్రీలాగా ఉంది. నిజానికి, అభిషిక్త క్రైస్తవుల సమూహమంతా, క్రీస్తుకు పెండ్లికియ్యడానికి వాగ్దానం చేయబడిన ఒక పవిత్రురాలైన కన్యగా చెప్పబడింది.—2 కొరింథీయులు 11:2; ఎఫెసీయులు 5:23, 24; ప్రకటన 19:7, 8.

17. యెహోవాసాక్షులందరూ ఏమి అవ్వడానికి ఎంపిక చేసుకున్నారు?

17 యెహోవాసాక్షుల్లో ప్రతి ఒక్కరూ—వారికి పరలోక నిరీక్షణ ఉన్నా లేక భూనిరీక్షణ ఉన్నా—దేవుని చిత్తాన్ని చేయడానికీ, పరిపాలకునిగా ఆయనకు విధేయత చూపడానికీ దేవునికి వ్యక్తిగతంగా సమర్పణ చేసుకున్నారు. మనుష్యులకు దాసునిగా మిగిలిపోవడంకన్నా దేవునికి దాసునిగా అవ్వడం మేలని నిర్ణయించుకున్న ప్రతి సాక్షికి సమర్పణ అనేది వ్యక్తిగత ఎంపిక అయివుంది. అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఈ సలహాకు ఇది అనుగుణ్యంగా ఉంది: “మీరు విలువపెట్టి కొనబడినవారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి.”—1 కొరింథీయులు 7:23.

మనకు మనమే ప్రయోజనం పొందడాన్ని నేర్చుకోవడం

18. సాక్షికాదగ్గ ఒక వ్యక్తి బాప్తిస్మానికి ఎప్పుడు అర్హుడు అవుతాడు?

18 ఒక వ్యక్తి యెహోవాసాక్షి అయ్యేందుకు యోగ్యుడవ్వడానికి ముందు ఆ వ్యక్తి లేఖనాధార అర్హతలను సంపాదించుకోవాలి. సాక్షి కాబోయే వ్యక్తి క్రైస్తవ సమర్పణలో ఇమిడివున్న విషయాలను నిజంగా అర్థంచేసుకున్నాడా లేదాయన్నది నిర్ధారించడంలో పెద్దలు ఎంతో జాగ్రత్తవహిస్తారు. ఆయన నిజంగా తాను ఒక యెహోవాసాక్షి కావాలనుకుంటున్నాడా? అందుకు తగ్గట్టుగా జీవించడానికి ఇష్టపడుతున్నాడా? లేనట్లయితే, ఆ వ్యక్తి బాప్తిస్మానికి అనర్హుడు.

19. దేవునికి సమర్పించుకున్న సేవకునిగా అవ్వడానికి నిర్ణయించుకున్న వ్యక్తిని విమర్శించడానికీ ఏ కారణమూ లేదు, ఎందుకని?

19 అయితే, ఎవరికైనా అర్హతలన్నీ ఉన్నట్లయితే దేవునిద్వారా, ఆయన ప్రేరేపిత వాక్యంద్వారా ప్రభావితం కావడానికి స్వచ్ఛందంగా వ్యక్తిగత నిర్ణయం తీసుకున్నందుకు ఇక ఆయనను విమర్శించడం దేనికి? మనుష్యులచేత ప్రభావితం కావడం అంగీకారయుక్తం అని పరిగణించబడుతున్నప్పుడు, దేవునిచేత ప్రభావితం కావడం మాత్రం అంగీకారయుక్తం కాదా? ఆయన ప్రభావం ఏమన్నా తక్కువ ప్రయోజనకరమైనదా? యెహోవాసాక్షులు అలా అనుకోరు. వారు యెషయా వ్రాసిన దేవుని మాటలతో పూర్ణహృదయంతో ఏకీభవిస్తారు: “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.”—యెషయా 48:17.

20. బైబిలు సత్యముచే ప్రజలు ఏయే విధాలుగా స్వతంత్రులు అవుతారు?

20 బైబిలు సత్యము, నరకాగ్నిలో నిత్య హింసవంటి అబద్ధ మత సిద్ధాంతాలను నమ్మడం నుండి ప్రజలను స్వతంత్రులను చేస్తుంది. (ప్రసంగి 9:5, 10) బదులుగా, మరణించిన వారి విషయమై నిజమైన నిరీక్షణ ఉన్నందుకు—యేసుక్రీస్తు విమోచన క్రయధన బలి ఆధారంగా సాధ్యంకాగల పునరుత్థానమనే నిరీక్షణ ఉన్నందుకు అది వారి హృదయాలను కృతజ్ఞతతో నింపుతుంది. (మత్తయి 20:28; అపొస్తలుల కార్యములు 24:15; రోమీయులు 6:23) బైబిలు సత్యము, నిత్య వైఫల్యాలకు గురయ్యే రాజకీయ నాయకుల వాగ్దానాలను నమ్ముకుని, చివరికి నిరాశకు గురికావడం నుండి ప్రజలను స్వతంత్రులను చేస్తుంది. అందుకు భిన్నంగా అది, యెహోవా రాజ్యము ఇప్పటికే పరలోకంలో పరిపాలిస్తుందనీ, అది త్వరలోనే భూమియంతటిపైనా పరిపాలిస్తుందనీ తెలుసుకోవడంతో వచ్చే ఆనందంతో వారి హృదయాలు ఉప్పొంగేలా చేస్తుంది. కొన్ని అలవాట్లు తుచ్ఛమైన శరీరానికి ఆహ్లాదకరంగా అన్పించినా, అవి దేవుడ్ని అగౌరవపరుస్తాయి, వాటివలన సంబంధాలు తెగిపోవడం, వ్యాధులు, అకాల మరణాలు సంభవించడం వంటివాటి రూపంలో గొప్ప మూల్యాన్ని చెల్లించాల్సివస్తుంది, బైబిలు సత్యము అలాంటి అలవాట్ల నుండి ప్రజల్ని స్వతంత్రులను చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మనుష్యులకు దాసునిగా ఉండడంకన్నా దేవునికి దాసునిగా ఉండడం చాలా చాలా ప్రయోజనకరము. నిజానికి, దేవునికి సమర్పించుకుంటే “ఇప్పుడు ఇహమందు” ప్రయోజనాలు పొందుతారు, అంతేగాక “రాబోవు లోకమందు నిత్యజీవమును” పొందుతారు.—మార్కు 10:29, 30.

21. దేవునికి సమర్పించుకోవడాన్ని యెహోవాసాక్షులు ఎలా దృష్టిస్తారు, వారి కోరిక ఏమిటి?

21 ప్రాచీన ఇశ్రాయేలీయుల విషయంలో జరిగినట్లుగా, నేడు యెహోవాసాక్షులు పుట్టుకతోనే ఒక సమర్పిత జనాంగంలో భాగంకావడం లేదు. సాక్షులు సమర్పిత క్రైస్తవుల సంఘంలో ఒక భాగమై ఉన్నారు. బాప్తిస్మం పొందిన ప్రతి సాక్షి, సమర్పణ చేసుకోవడంలో వ్యక్తిగతంగా ఎంపిక చేసుకునే స్వాతంత్ర్యాన్ని ఉపయోగించుకుని సమర్పిత క్రైస్తవుడు అయ్యాడు. నిజానికి, యెహోవాసాక్షులకు సమర్పణ అనేది దేవునితో ఒక ప్రేమపూర్వకమైన వ్యక్తిగత సంబంధానికి నడిపిస్తుంది, ఆయనకు చేసే ఇష్టపూర్వకమైన సేవ ఆ సంబంధానికి చిహ్నంగా ఉంటుంది. యేసుక్రీస్తు తమను దేనికి స్వతంత్రులను చేశాడో దానికి నిరంతరమూ అంటిపెట్టుకుని ఉండాలని కోరుకుంటూ, ఆనందకరమైన ఈ సంబంధాన్ని వారు కొనసాగించాలని మనస్ఫూర్తిగా వాంఛిస్తారు.

మీరెలా జవాబిస్తారు?

◻ ఇశ్రాయేలును తన ‘స్వకీయ సంపాద్యముగా’ ఉండడానికి ఎంపిక చేసుకోవడంలో దేవుడు పక్షపాతంతో వ్యవహరించడం లేదు, ఎందుకని?

◻ క్రైస్తవ సమర్పణకు స్వాతంత్ర్యాన్ని కోల్పోవడం అవసరం లేదని మీరెందుకు చెబుతారు?

◻ యెహోవా దేవునికి సమర్పించుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి?

◻ మనుష్యులకు దాసులుగా ఉండడంకన్నా యెహోవాకు సేవకులుగా ఉండడం ఎందుకు ఉత్తమం?

[15వ పేజీలోని చిత్రం]

ప్రాచీన ఇశ్రాయేలులో, దేవునికి సమర్పణ అనేది పుట్టుకపైన ఆధారపడి ఉండేది

[16వ పేజీలోని చిత్రం]

క్రైస్తవ సమర్పణ ఎంపికపై ఆధారపడివుంది

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి