దేవుని సేవకులు—సంస్థీకరించబడిన, సంతోషదాయకమైన ప్రజలు
“యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు.”—కీర్తన 144:15.
1, 2. (ఎ) యెహోవా తన సేవకులకు ప్రమాణాలను పెట్టే హక్కును ఎందుకు కల్గియున్నాడు? (బి) మనం ప్రాముఖ్యంగా అనుకరించాలనుకునే యెహోవా లక్షణాల్లో రెండు ఏమిటి?
యెహోవా విశ్వసర్వాధిపతి, సర్వశక్తిగల దేవుడు మరియు సృష్టికర్తయైయున్నాడు. (ఆదికాండము 1:1; కీర్తన 100:3) అందుకే, ఆయన తన సేవకులకు అవసరమైనదేదో ఎరిగినవాడుగా, వారి ప్రవర్తనకు సంబంధించిన ప్రమాణాలను పెట్టే హక్కు ఆయనకుంది. (కీర్తన 143:8) వారు అనుకరించాల్సిన మాదిరికర్తగా ఆయన వున్నాడు. “మీరు ప్రియమైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొను”డని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు.—ఎఫెసీయులు 5:1.
2 దేవుని అనుకరించాల్సిన లక్షణాల్లో ఒకటి సంస్థీకరణతో సంబంధాన్ని కల్గివుంది. ఆయన ‘అల్లరికి కర్తయైన దేవుడు కాడు.’ (1 కొరింథీయులు 14:33) దేవుడు సృష్టించినదాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, విశ్వంలో ఆయన ఒక మంచి క్రమమైన ఏర్పాటుగల వ్యక్తి అని మనం ఒప్పుకోక తప్పదు. అయినను, ఆయన తన సేవకులు అనుకరించాలని కోరే మరొక లక్షణమేమంటే ఆయన సంతోషం, ఎందుకంటే ఆయన ‘సంతోషంగల దేవుడు.’ (1 తిమోతి 1:11) కాబట్టి, ఆయన సంస్థీకరణకు సంబంధించిన సామర్థ్యం సంతోషంతో సమతుల్యం చేయబడింది. ఒక లక్షణం మరొకదానికంటే అద్వితీయమైంది కాదు.
3. సంస్థీకరించడంలోగల దేవుని సామర్థ్యాన్ని నక్షత్రాలతో నిండిన ఆకాశం ఎలా ప్రదర్శిస్తుంది?
3 యెహోవా క్రమంగల దేవుడనే ఆధారం, ఆయన సృష్టించిన వాటన్నిటిలో పెద్దవాటిలోను చిన్నవాటిలోనూ మనకు కన్పిస్తుంది. ఉదాహరణకు, మనకు కన్పించే విశ్వాన్ని పరిశీలించండి. దానిలో కోటాను కోట్ల నక్షత్రాలున్నాయి. అయితే యివి క్రమరహితంగా వెదజల్లబడలేదు. జార్జ్ గ్రీన్స్టిన్ అనే ఆస్ట్రోఫిజీసిస్ట్ పరిశీలించినట్లుగా “నక్షత్రాలు అమర్చబడివున్న విధానంలో క్రమమనేది” ఉంది. అవి నక్షత్రవీధులని పిలువబడే గుంపులుగా అమర్చబడ్డాయి, వాటిలో కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలను కల్గివున్నాయి. అటువంటివి వందల కోట్ల నక్షత్రవీధులున్నట్లుగా అంచనా వేయబడింది. ఆ నక్షత్రవీధులు కూడా క్రమంగా అమర్చబడ్డాయి, వాటిలో అనేకం (కొన్నింటినుండి అనేక వేల వరకు) నక్షత్రవీధుల పుంజాలుగా విభాగించబడ్డాయి. నక్షత్రవీధుల పుంజాలు సూపర్క్లస్టర్లని పిలువబడే మరింకా పెద్దవైన సమూహాలుగా అమర్చబడ్డాయని తలస్తున్నారు.—కీర్తన 19:1; యెషయా 40:25, 26.
4, 5. భూమిపైనున్న జీవించు ప్రాణుల్లోగల క్రమమైన అమరికను గూర్చిన ఉదాహరణలివ్వండి.
4 కేవలం మనకు కన్పించే ఆకాశంలోనే కాకుండా వేవేల జీవులతో నిండివున్న భూమిపై కూడా, ప్రతిచోటా దేవుని సృష్టిలో గొప్ప క్రమమైన అమరిక అనేది కనబడుతుంది. వీటన్నింటిని గూర్చి, భౌతికశాస్త్రంలో పండితుడైన పాల్ డేవీస్ వ్రాసిందేమంటే “భౌతిక ప్రపంచంయొక్క గొప్పతనాన్ని, సంక్లిష్టమైన క్రమ అమరికనుబట్టి” దానిని పరిశీలించినవారు “భయబ్రాంతుల”య్యారు.—కీర్తన 104:24.
5 జీవించు ప్రాణుల్లోగల “సంక్లిష్ట క్రమ అమరిక”ను గూర్చిన కొన్ని ఉదాహరణలు పరిశీలించండి. జోసఫ్ ఇవాన్స్ అనే న్యూరోసర్జన్ మానవుని మెదడు, వెన్నుపామును గూర్చి యిలా చెప్పాడు: “గొప్ప క్రమంలోని నిజత్వం దాదాపు ప్రబలమైనదిగావుంది.” హెచ్. జె. షాగ్నెస్సీ అనే బాక్టీరియోలజిస్ట్ ఒక సూక్ష్మజీవ కణాన్నిగూర్చి యిలా చెప్పాడు: “సూక్ష్మజీవిజాలంయొక్క అందమైన క్రమము, సంక్లిష్టత ఎంతో అద్భుతంగా నిర్మించబడ్డాయి, దాంతో అది దైవికంగా నియమించబడిన వ్యవస్థలో అవి ఒక భాగంలా కన్పిస్తుంది.” జీవ పరమాణుశాస్త్రవేత్తైన మైకెల్ డెంటన్ ఒక కణంలోని జన్యురచనను గూర్చి (డిఎన్ఎ) యిలా చెప్పాడు: యిది ఎంత సామర్థ్యంగలదంటే, . . . ఈ గ్రహంపై ఉనికిలో వున్న మొత్తం జీవజాతులన్నింటి యొక్క నిర్మాణాన్ని గుర్తించడానికి అవసరమైన . . . సమాచారాన్ని ఒక టీస్పూన్లో యిమిడ్చవచ్చును, అంతేకాకుండా మొత్తం పుస్తకాలన్నింటిలోనూ వున్న సమాచారమంతటి కొరకు యింకనూ స్థలముంటుంది.”—కీర్తన 139:16 చూడండి.
6, 7. ఆత్మీయ ప్రాణుల్లో ఎలాంటి సంస్థీకరణ వుంది, మరి వారు తమ సృష్టికర్తయెడల మెప్పును ఎలా వ్యక్తంచేస్తారు?
6 యెహోవా భౌతిక సంబంధమైన సృష్టిని సంస్థీకరించడమే కాకుండా ఆయన తన ఆత్మీయ సృష్టిని కూడా సంస్థీకరిస్తాడు. దేవదూతలు ‘వేవేల కొలది, కోట్లకొలది యెహోవా ఎదుట నిలిచిరని’ దానియేలు 7:10 మనకు చెబుతుంది. ఒక పది కోట్ల బలవంతులైన ఆత్మీయ ప్రాణులు హాజరయ్యారు, ప్రతి ఒక్కరికీ తగిన పని అప్పగింపబడింది! అలాంటి అపరిమితమైన సంఖ్యలోనున్న వారిని సంస్థీకరించడానికి అవసరమైన నిపుణతనుగూర్చి ఆలోచించడం ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. తగినట్లుగానే, బైబిలు యిలా చెబుతుంది: “యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా [దూతల] సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరు ఆయనను సన్నుతించుడి.”—కీర్తన 103:20, 21; ప్రకటన 5:11.
7 సృష్టికర్త కార్యాలు ఎంత మహత్తరంగా సంస్థీకరింపబడి, నైపుణ్యత గలవో! విధేయతతోను, దైవభీతితోనూ పరలోకమందలి బలీయమైన ప్రాణులు యీ విధంగా ప్రకటించడంలో ఆశ్చర్యంలేదు: ‘ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవు.’—ప్రకటన 4:11.
8. భూమిపైవున్న తన సేవకులను యెహోవా సంస్థీకరిస్తాడని ఏ ఉదాహరణలు చూపెడుతున్నాయి?
8 యెహోవా భూమిపై తన సేవకులను కూడా సంస్థీకరిస్తాడు. నోవహు దినములలో సా.శ.పూ. 2370లో ఆయన జలప్రళయం రప్పించినప్పుడు, నోవహు మరి ఏడుగురు ఒక కుటుంబ సంస్థగా ఆ జలప్రళయంనుండి రక్షింపబడ్డారు. సా.శ.పూ. 1513లో అరణ్యప్రయాణమందు, యెహోవా అనేక లక్షలమంది ప్రజలను ఐగుప్తు దాస్యంలోనుండి బయటకు రప్పించి, తమ అనుదిన కార్యకలాపాలను, ఆరాధనను సంస్థీకరించుకోడానికి సవివరమైన ధర్మశాస్త్ర నియమాలను వారికిచ్చాడు. ఆ తర్వాత, వాగ్దాన దేశంలో, దేవాలయంలో ప్రత్యేక సేవకొరకు వారిలో వేవేలమంది సంస్థీకరింపబడ్డారు. (1 దినవృత్తాంతములు 23:4, 5) మొదటి శతాబ్దంలో, క్రైస్తవ సంఘాలు దైవిక నడిపింపు క్రింద సంస్థీకరించబడ్డాయి: “పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు . . . పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.”—ఎఫెసీయులు 4:13.
ఆధునిక దిన సేవకులు కూడ సంస్థీకరించబడ్డారు
9, 10. మన కాలంలో యెహోవా తన ప్రజలను ఎలా సంస్థీకరించాడు?
9 అదే రీతిలో, యెహోవా తన ఆధునిక దిన సేవకులను కూడ సంస్థీకరించాడు, తద్వారా వారు మన దినాలకు సంబంధించిన ఆయన పనిని, అంటే ప్రస్తుత భక్తిహీన విధానాన్ని అంతమొందించే ముందు ఆయన రాజ్య సువార్తను ప్రకటించడాన్ని ప్రభావవంతంగా చేయగల్గుతున్నారు. (మత్తయి 24:14) ఈ భూవ్యాపిత పనిలో ఏమి యిమిడివున్నదో, మంచి సంస్థీకరణ అనేది ఎంత ప్రాముఖ్యమైనదో పరిశీలించండి. లక్షల కొలది పురుషులు, స్త్రీలు, పిల్లలు బైబిలు సత్యాలను యితరులకు బోధించడానికి తర్ఫీదు పొందుతున్నారు. ఈ తర్ఫీదుకు మద్దతునివ్వడానికి పెద్ద మొత్తాలలో బైబిళ్లు, బైబిలు ఆధారిత సాహిత్యాలు ముద్రించబడుతున్నాయి. అంతెందుకు, ప్రస్తుతం కావలికోట ప్రతి సంచిక 160 లక్షలకంటే ఎక్కువ ప్రతులు, 118 భాషలలో ముద్రించబడుతున్నాయి, తేజరిల్లు! పత్రికలు దాదాపు 130 లక్షలు 73 భాషల్లో ప్రచురించబడుతున్నాయి. దాదాపు అన్ని సంచికలు ఏకకాలంలోనే ముద్రించబడుతున్నాయి గనుక నిజంగా యెహోవా సేవకులందరూ ఒకే సమయంలో ఒకే రకమైన ఆత్మీయాహారాన్ని పొందుతున్నారు.
10 దీనితోపాటు, ప్రపంచవ్యాప్తంగా 73,000 కంటే ఎక్కువ యెహోవాసాక్షుల సంఘాలు బైబిలు ఉపదేశాల కొరకు క్రమంగా కూడుకోవడానికి సంస్థీకరించబడ్డాయి. (హెబ్రీయులు 10:24, 25) ప్రతి సంవత్సరం—వేల కొలదిగా పెద్ద సమావేశాలు అనగా ప్రాంతీయ సమావేశాలు, జిల్లా సమావేశాలు కూడా జరుపబడుతున్నాయి. క్రొత్త రాజ్యమందిరాలు, సమావేశ మందిరాలు, బేతేలు గృహాలు నిర్మించడం లేదా బాగుచేయడం, బైబిలు సాహిత్యాలను ముద్రించడానికి సదుపాయాలు కల్పించడం అనేవి ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. బైబిలు ఉపదేశకుల కొరకు మేలైన తర్ఫీదునివ్వడానికి, మిషనరీల కొరకు వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్, పయినీర్ సర్వీస్ స్కూల్వంటివి భూవ్యాప్తంగా అనేక దేశాల్లో నిర్వహించబడుతున్నాయి.
11. ప్రస్తుతం మంచి క్రమాన్ని నేర్చుకోవడాన్నిబట్టి భవిష్యత్తులో ఎలాంటి ప్రయోజనముంటుంది?
11 తనను సేవిస్తున్న దేవదూతల సహాయంతో ‘తమ పరిచర్యను సంపూర్ణంగా నెరవేర్చడానికి’ తన ప్రజలను యెహోవా ఎంత చక్కగా సంస్థీకరించాడో! (2 తిమోతి 4:5; హెబ్రీయులు 1:13, 14; ప్రకటన 14:6) మంచి క్రమమైన పద్ధతిలో ప్రస్తుతం తన సేవకులకు ఉపదేశించడం ద్వారా, దేవుడు మరోదాన్ని సాధిస్తున్నాడు. ఈ విధానాంతాన్ని దాటిన తర్వాత, వారు నూతనలోకంలో జీవించేందుకు సంస్థీకరించబడి ఉండడానికి ఆయన తన సేవకులను బాగా సిద్ధపరుస్తున్నాడు. తర్వాత, సంస్థీకరించబడిన రీతిలో యెహోవా నడిపింపుక్రింద, వారు భూవ్యాప్త పరదైసును నిర్మించడం ఆరంభిస్తారు. జీవించడానికి కావల్సిన సవివరమైన దేవుని నియమాలను మరణం నుండి పునరుత్థానం గావించబడే కోట్లాది ప్రజలకు బోధించడానికి కూడ వారు బాగా సిద్ధపడి ఉంటారు.—యెషయా 11:9; 54:13; అపొస్తలుల కార్యములు 24:15; ప్రకటన 20:12, 13.
సంస్థీకరింపబడినా సంతోషభరితులే
12, 13. యెహోవా తన ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడని మనమెందుకు చెప్పగలం?
12 యెహోవా అద్భుతమైన పనివాడు, గొప్ప క్రమం గలవాడైనప్పటికి, ఆయన భావాలులేనటువంటి, కర్కషమైన లేదా అనాలోచితమైనవాడు కాదు. బదులుగా ఎంతో ఆప్యాయతగలవాడై, మన సంతోషంయెడల శ్రద్ధగల సంతోషంగల వ్యక్తైయున్నాడు. “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు” అని 1 పేతురు 5:7 తెలియజేస్తుంది. ఆయన మానవులకు చేసినదాన్నిబట్టి, ఆయన తన సేవకులయెడలగల శ్రద్ధను, వారు సంతోషంగా ఉండాలనే కోరికను మనం చూడగలం. ఉదాహరణకు, దేవుడు పరిపూర్ణ స్త్రీ పురుషులను సృష్టించినప్పుడు, ఆనందంతో కూడిన పరదైసులో వారిని ఉంచాడు. (ఆదికాండము 1:26-31; 2:8, 9) సంపూర్ణ సంతోషవంతులను చేయడానికి ఆయన వారికి కావలసిన సమస్తమును దయచేశాడు. కాని వారు అవిధేయత ద్వారా వాటన్నింటిని కోల్పోయారు. వారి పాపం ఫలితంగా, మనం అపరిపూర్ణతను, మరణాన్ని సంక్రమించుకున్నాము.—రోమీయులు 3:23; 5:12.
13 ప్రస్తుతం మనం అపరిపూర్ణులమైనప్పటికి, మానవులమైన మనం దేవుడు చేసినదాన్నిబట్టి యింకనూ సంతోషాన్ని పొందగలం. మనకు సంతోషాన్ని తెచ్చేవి అనేకమున్నాయి—వైభవోపేతమైన పర్వతాలు; అందమైన సరస్సులు, నదులు, సముద్రాలూ సముద్ర తీరాలు; సువాసనతో కూడిన రంగురంగుల పుష్పాలు, అనేక రకాలైన మరితర మొక్కలు; సమృద్ధిగావున్న రుచికరమైన ఆహారాలు; చూడడానికి మనమెన్నడూ అలసట చెందని వేడుకతో కూడిన సూర్యాస్తమయాలు; రాత్రులందు తిలకించి ధ్యానిస్తూ ఆనందించడానికి నక్షత్రమయమైన ఆకాశం; తమ ఆటల హాస్యాలతో మనస్సునాకట్టే కూనలతో వున్న రకరకాల జంతు సృష్టి; ఉత్తేజకరమైన సంగీతం; ఆసక్తితో కూడిన ఉపయోగకరమైన పనులు; మంచి స్నేహితులు. అలాంటి వాటిని ఏర్పాటు చేసినవాడు, యితరులను ఆనందింపజేసి ఆనందించే సంతోషదాయకమైన వ్యక్తియనేది సుస్పష్టమౌతుంది.
14. ఆయనను అనుకరించడంలో మనమెలాంటి సమతుల్యాన్ని కల్గివుండాలని యెహోవా మననుండి కోరుతున్నాడు?
14 ఆవిధంగా, కేవలం క్రమాన్నే యెహోవా కోరడంలేదు. ఆయన యేవిధంగా సంతోషంగా వున్నాడో అలాగే ఆయన తన సేవకులు సంతోషంగా ఉండాలని కూడ కోరుతున్నాడు. తమ సంతోషానికి ముప్పువాటిల్లేలా అమితమైన పట్టుదలతో సంస్థీకరింపబడాలని ఆయన వారిని కోరడంలేదు. ఆయన చేసినట్లుగానే, దేవుని సేవకులు సంస్థాపరమైన నిపుణతలను సంతోషంతో సమతుల్యం చేసుకోవాలి, ఎందుకంటే, ఆయన శక్తివంతమైన పరిశుద్ధాత్మ ఎక్కడ ఉందో, అక్కడ ఆనందముంటుంది. నిజంగా, తన ప్రజలపై పనిచేస్తున్న దేవుని పరిశుద్ధాత్మ ఫలాల్లో రెండవది “సంతోషము” అని గలతీయులు 5:22 చూపుతుంది.
ప్రేమ సంతోషాన్ని ఉత్పత్తిచేస్తుంది
15. మన సంతోషానికి ప్రేమ ఎందుకంత ప్రాముఖ్యమైనదైవుంది?
15 “దేవుడు ప్రేమాస్వరూపి” అని బైబిలు చెప్పడం చాలా ఆసక్తికరమైనది. (1 యోహాను 4:8, 16) “దేవుడు సంస్థయైవున్నాడు” అని అది ఎన్నడూ చెప్పడంలేదు. ప్రేమ అనేది దేవుని ముఖ్య లక్షణమైయుంది, అది ఆయన సేవకులచే అనుకరించబడాలి. అందుకే గలతీయులు 5:22లో దేవుని పరిశుద్ధాత్మ ఫలాల్లో మొదట “ప్రేమ,” తర్వాత “సంతోషము” వివరించబడ్డాయి. ప్రేమ సంతోషాన్ని ఉత్పత్తిచేస్తుంది. ఇతరులతో మనం వ్యవహరించుటలో యెహోవా ప్రేమను మనం అనుకరించినప్పుడు, సంతోషం దాన్ని వెంబడిస్తుంది, ఎందుకంటే ప్రేమగల వారు సంతోషంగల ప్రజలు.
16. ప్రేమ యొక్క ప్రాముఖ్యతను యేసు ఎలా ప్రదర్శించాడు?
16 దైవిక ప్రేమను అనుకరించాల్సిన అవసరత యేసు బోధలలో ప్రాముఖ్యంగా చెప్పబడింది. ఆయన యిలా చెప్పాడు: ‘తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాను.’ (యోహాను 8:28) ప్రాముఖ్యంగా యేసు నేర్చుకొని, యితరులకు బోధించినదేమిటి? అదేమంటే దేవుని ప్రేమించాలని, పొరుగువారిని ప్రేమించాలనే రెండు ముఖ్యమైన ఆజ్ఞలు. (మత్తయి 22:36-39) యేసు అలాంటి ప్రేమను చూపడంలో మాదిరికరంగా ఉన్నాడు. “నేను తండ్రిని ప్రేమించుచున్నానని” ఆయన చెప్పి, మరణం వరకూ దేవుని చిత్తం చేయడంద్వారా దాన్ని నిరూపించాడు. మరియు ఆయన ప్రజల కొరకు చనిపోవడంద్వారా తన ప్రేమను కనబర్చాడు. ఎఫెసులోని క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు యిలా చెప్పాడు: “క్రీస్తు మిమ్మును ప్రేమించి, తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను.” (యోహాను 14:31; ఎఫెసీయులు 5:2) ఆవిధంగా, యేసు తన అనుచరులకు యిలా చెప్పాడు: “నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీ రొకని నొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ.”—యోహాను 15:12, 13.
17. ఇతరులయెడల ప్రేమను వ్యక్తంచేయడం ప్రాముఖ్యమని పౌలు ఎలా చూపాడు?
17 ఈ దైవిక ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనదో ఈ విధంగా చెప్పడం ద్వారా పౌలు వ్యక్తం చేశాడు: “మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను. బీదలపోషణకొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు. . . . కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.”—1 కొరింథీయులు 13:1-3, 13.
18. మన సంతోషానికి దోహదపడే దేనిని మనం యెహోవానుండి ఆశించగలం?
18 మనం దేవుని ప్రేమను అనుకరించినప్పుడు, మనం పొరపాట్లు చేసినప్పుడు కూడా, మనయెడల ఆయన ప్రేమ ఉంటుందని, నమ్మకం కల్గియుండగలం, ఎందుకంటే ఆయన ‘కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడు.’ (నిర్గమకాండము 34:6) మనం పొరపాట్లు చేసినప్పుడు యథార్థంగా పశ్చాత్తాపపడితే, దేవుడు వీటిని లెక్కించడుగాని ప్రేమపూర్వకంగా మనల్ని క్షమిస్తాడు. (కీర్తన 103:1-3) ఔను, “ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడు.” (యాకోబు 5:11) దీనిని తెలిసికోవడం మన ఆనందానికి దోహదపడుతుంది.
ప్రస్తుతం పరిమితమైన సంతోషం
19, 20. (ఎ) పరిపూర్ణ సంతోషం ప్రస్తుతం ఎందుకు సాధ్యంకాదు? (బి) ఈ కాలంలో మనం పరిమితమైన సంతోషాన్ని పొందగలమని బైబిలెలా చూపెడుతుంది?
19 అయినను, సాతాను ఆధీనంలో నేరంతో నిండి, దౌర్జన్యం, అవినీతితో కూడి, మనం ఎల్లప్పుడూ వ్యాధి, మరణాన్ని ఎదుర్కోవలసిన లోకంలోని చివరి దినాల్లో జీవిస్తున్న మనం సంతోషంగా ఉండడం సాధ్యమేనా? నిజమే, దేవుని నూతన లోకంలో ఉండేటంత స్థాయిలో సంతోషాన్ని ప్రస్తుతం మనం అనుభవించలేం, ఆయన వాక్యమిలా ముందుగానే చెబుతుంది: “ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి.”—యెషయా 65:17, 18.
20 దేవుని సేవకులు ప్రస్తుతం యితరులతో పోల్చితే కొంతవరకు ఎక్కువ సంతోషాన్నే పొందగలరు, ఎందుకంటే వారికి ఆయన చిత్తము తెలుసు, ఆలాగే ఆయన పరదైసుతో కూడిన నూతన లోకంలో రాబోయే అద్భుతమైన ఆశీర్వాదాలను గూర్చిన కచ్చితమైన జ్ఞానము వారికుంది. (యోహాను 17:3; ప్రకటన 21:4) అందుకే బైబిలు ఈ విధంగా చెప్పగలదు: “సైన్యములకధిపతివగు యెహోవా, నీయందు నమ్మికయుంచువారు ధన్యులు,” “యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరు ధన్యులు,” “సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.” (కీర్తన 84:12; 128:1; మత్తయి 5:5) అందువల్ల, ప్రస్తుతం మనకు కష్టతరమైన పరిస్థితులున్నప్పటికి కూడ, కొంతమట్టుకు ఎక్కువ ఆనందాన్నే పొందగలం. మనకు చెడు సంభవించినప్పుడు కూడ, యెహోవాను ఎరుగనివారివలె, నిత్యజీవ నిరీక్షణలేని వారివలె మనం దుఃఖించము.—1 థెస్సలొనీకయులు 4:13.
21. తమ్మును తాము యితరులకు అందుబాటులో ఉంచుకోవడమనేది యెహోవా సేవకుల సంతోషానికి ఎలా దోహదపడుతుంది?
21 యెహోవా సేవకులకు సంతోషము కల్గించే మరొక విషయమేమంటే, వారు సమయము, శక్తి, సంపదలను యితరులకు, ప్రాముఖ్యంగా సాతాను లోకంలో జరుగుతున్న ‘హేయకృత్యములనుగూర్చి మూల్గు లిడుచు ప్రలాపించుచున్న’ ప్రజలకు బైబిలు సత్యాలను బోధించడంలో వినియోగిస్తారు. (యెహెజ్కేలు 9:4) బైబిలు యిలా చెబుతుంది: “బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రదికించును. భూమిమీద వాడు ధన్యుడగును.” (కీర్తన 41:1, 2) యేసు చెప్పినట్లుగా, “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.”—అపొస్తలుల కార్యములు 20:35.
22. (ఎ) సంతోషానికి సంబంధించి, దేవుని సేవకులను ఆయనను సేవించనివారితో పోల్చండి. (బి) ఏ ప్రత్యేక కారణాన్నిబట్టి మనం సంతోషంగా ఉండడానికి ఆశిస్తాము?
22 కాబట్టి ప్రస్తుత కాలంలో దేవుని సేవకులు పూర్తి స్థాయిలో సంతోషాన్ని పొందలేక పోయినప్పటికి, దేవుని సేవించనివారు అనుభవించలేని ఆనందాన్ని వారు పొందగలరు. యెహోవా యిలా చెబుతున్నాడు: “నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరుగాని మీరు చింతాక్రాంతులై యేడ్చెదరు. మనోదుఃఖముచేత ప్రలాపించెదరు.” (యెషయా 65:14) అంతేకాకుండా, దేవుని సేవిస్తున్నవారు ప్రస్తుతం సంతోషించడానికి ఒక ప్రత్యేక కారణముంది—“దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన” పరిశుద్ధాత్మ వారికి కలదు. (అపొస్తలుల కార్యములు 5:32) దేవుని ఆత్మ ఉన్నచోట సంతోషముంటుందన్న విషయాన్ని జ్ఞాపకముంచుకోండి.—గలతీయులు 5:22.
23. మన తదుపరి పఠనంలో మనం దేనిని పరిశీలిస్తాము?
23 ఈనాడు దేవుని సేవకుల సంస్థలో, యెహోవా సేవకుల సంతోషానికి దోహదపడుతూ, సంఘాలను నడిపించే సంఘపెద్దలైన “పెద్దలు,” ఒక ప్రాముఖ్యమైన పాత్రవహిస్తారు. (తీతు 1:5) ఈ పెద్దలు తమ బాధ్యతలను, తమ ఆత్మీయ సహోదర సహోదరీలతోగల సంబంధాన్ని ఎలా దృష్టించాలి? మా తదుపరి శీర్షిక దీనిని చర్చిస్తుంది.
మీరెలా జవాబిస్తారు?
◻ యెహోవా క్రమ పద్ధతిని కల్గివున్నాడని సృష్టి ఎలా సాక్ష్యమిస్తున్నది?
◻ పూర్వము, ప్రస్తుతము యెహోవా ఎలా తన సేవకులను సంస్థీకరించాడు?
◻ మనమెలాంటి సమతుల్యాన్ని కల్గివుండాలని యెహోవా కోరుతున్నాడు?
◻ మన సంతోషానికి ప్రేమ ఎంత ప్రాముఖ్యమైవుంది?
◻ మన కాలంలో ఏవిధమైన సంతోషాన్ని ఆశించగలం?
[10వ పేజీలోని చిత్రసౌజన్యం]
Top: Courtesy of ROE/Anglo-Australian Observatory, photograph by David Malin