నీ కుటుంబమును దేవుని నూతన లోకములోనికి కాపాడుకొనుటకు కృషిచేయుము
“యెహోవా, నీవు వారిని. . .కాపాడెదవు. ఈ తరమువారి చేతిలోనుండి వారిని నిత్యము రక్షించెదవు.”—కీర్తన 12:7 NW.
1, 2. (ఎ) కొన్ని కుటుంబములు ఎలా అంత్యదినముల వత్తిడులకులోనై జీవిస్తున్నవి? (బి) తప్పించుకొనుటకు క్రైస్తవ కుటుంబములు ఎలా పాటుపడవచ్చును?
“ఈరోజు నా హృదయము ఆనందముతో నిండుకొనివుంది,” అని జాన్ అనే క్రైస్తవ పెద్ద అన్నాడు. ఆ సంబరానికి కారణమేంటి? ఆయన ఇలా అంటున్నాడు: “నా 14 ఏండ్ల కుమారుడు, 12 ఏండ్ల కుమార్తె బాప్తిస్మము తీసుకున్నారు.” ఆయన సంతోషం అంతటితో ఆగిపోలేదు. “గడిచిన సంవత్సరములో నా 17 ఏండ్ల కుమారుడు, 16 ఏండ్ల కుమార్తె సహాయ పయినీర్లుగా పని చేశారని” కూడ ఆయన అంటున్నాడు.
2 బైబిలు సూత్రములను అన్వయించుకొనుచుండగా మనలో అనేక కుటుంబాలు అలాంటి మంచి ఫలితాలనే కలిగివున్నాయి. కాని, కొందరు సమస్యలతో సతమతమౌతున్నారు. క్రైస్తవ దంపతులు ఇలా వ్రాస్తున్నారు: “మాకు అయిదుగురు పిల్లలున్నారు, వారితో వ్యవహరించడం రోజురోజుకు కష్టమౌతుంది. ఇప్పటికే మా పిల్లలలో ఒకడు ఈ పాత విధానానికి బలైపోయాడు. ప్రస్తుతము యుక్త వయస్సులోనున్న మా చిన్నపిల్లలు సాతాను ముట్టడికి ముఖ్యగురిగా ఉన్నట్లున్నారు.” తీవ్రమైన వివాహ కలతను అనుభవించే దంపతులున్నారు. కొన్నిసార్లు ఇది విడాకులకు లేదా వేరుగా ఉండటానికి దారితీస్తుంది. అయినను, క్రైస్తవ లక్షణములను సాధకము చేసుకొనే కుటుంబములు ఒకవేళ “మహాశ్రమలను” తప్పించుకొని రానైయున్న దేవుని నూతన లోకములోనికి కాపాడబడవచ్చును. (మత్తయి 24:21; 2 పేతురు 3:13) కావున, నీ కుటుంబము నిశ్చయంగా రక్షించబడుటకు నీవేమి చేయవచ్చును?
పరస్పర సంభాషణను వృద్ధిచేసికొనుట
3, 4. (ఎ) కుటుంబజీవితములో పరస్పర సంభాషణ ఎంత ప్రాముఖ్యము, తరచుగా ఆ విషయంలో సమస్యలెట్లు ఉత్పన్నమవుతుంటాయి? (బి) భర్తలెందుకు బాగుగా వినే వారిగా వుండుటకు ప్రయత్నించాలి?
3 మంచి పరస్పర సంభాషణ ఆరోగ్యవంతమైన కుటుంబమునకు ప్రాణమిచ్చే రక్తమైయున్నది; అది లోపించినప్పుడు ఉద్రిక్తత, వత్తిడి పెరుగుతుంది. సామెతలు 15:22 “ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగున”ని చెబుతుంది. ఆసక్తిదాయకంగా ఒక వివాహ సలహాదారిణి ఇలా నివేదిస్తుంది: “నేను సలహా ఇచ్చినవారిలో ఎక్కువ మంది భార్యలు చేసే సుపరిచిత ఫిర్యాదేమంటే, ‘ఆయన నాతో మాట్లాడడు,’ ‘ఆయన నా మాట వినడు.’ మరి నేనూ ఈ ఫిర్యాదునుగూర్చే వారి భర్తలతో చెప్పినప్పుడు వారు నామాట కూడా వినరు.”
4 ఈ పరస్పర సంభాషణ లోపించడానికి కారణమేంటి? ఒక విషయమేమిటంటే, పురుషులు స్త్రీలు భిన్నంగా ఉంటారు. తరచు వారికి భిన్నమైన సంభాషణా ధోరణులుంటాయి. ఒక శీర్షిక చెప్పేదేమంటే భర్తయైతే తన సంభాషణలో “సూటిగా, ఆచరణాత్మకంగా ఉండేందుకు మొగ్గుచూపుతాడు. అయితే భార్య మాత్రము “అన్నిటికంటె ముఖ్యంగా సానుభూతితో వినేవారు కావాలని కోరుకుంటుంది.” నీ వివాహములోను ఇదే సమస్యయైతే పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. ఒక క్రైస్తవ భర్త బాగా వినేవానిగా ఉండటానికి ఎక్కువ కృషి చేయవలసిన అవసరముండవచ్చును. “ప్రతి మనుష్యుడు, వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడు”నై ఉండాలని యాకోబు చెబుతున్నాడు. (యాకోబు 1:19) నీ భార్యకు కేవలం “సహానుభూతే” అవసరమైతే నీవు ఆజ్ఞాపించడం, గద్దించడం, ఏకధాటిగా మాట్లాడటం మానుకోవడానికి నేర్చుకోవాలి. (1 పేతురు 3:8 NW) “మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు” అని సామెతలు 17:27 చెబుతుంది.
5. భర్తలు వారి ఆలోచనలను భావాలను వ్యక్తపరచుటలో అభివృద్ధిచెందగల కొన్ని మార్గాలేవి?
5 ఇంకోప్రక్క “మాటలాడుటకు సమయము” వున్నది గనుక, నీ తలంపులను, భావాలను నీవు తేటగా వ్యక్తపరచుటకు నేర్చుకొనవలసిన అవసరముండవచ్చును. (ప్రసంగి 3:7) ఉదాహరణకు, మీ భార్య నిర్వహించే మంచి పనులను పొగడగలిగే ధారాళమైన మనస్సు మీకుందా? (సామెతలు 31:28) ఇంటినిగూర్చి శ్రద్ధతీసుకుంటూ, మీకు సహాయంగా ఆమె కష్టపడిచేసే పనికి మీరు కృతజ్ఞతను వ్యక్తపరుస్తున్నారా? (కొలొస్సయులు 3:15ను పోల్చండి.) బహుశా మీరు మాటలద్వారా “వ్యక్తపరచే ప్రియమైన భావాల”ను తెలియజేయుటలో అభివృద్ధిచేసుకోవలసిన అవసరముండవచ్చు. (పరమగీతము 1:2 NW) అలా చేయటం మొదట్లో అంతబాగుండనట్లు కనిపించినను, మీ భార్య మీ ప్రేమలో సురక్షితంగా ఉందని భావించుకొనేలా చేయడానికి అది ఎంతో సహాయకరముగా ఉండగలదు.
6. పరస్పర సంభాషణలో కుటుంబము అభివృద్ధిచెందుటకు భార్యలు ఏమి చేయవచ్చును?
6 క్రైస్తవ భార్యల విషయమేమి? నేను ఆయనను మెచ్చుకొంటున్నట్లు నా భర్తకు తెలుసు. దానిని నేను ఆయనకు చెప్పాల్సిన అవసరమేమిలేదని ఒక భార్య అన్నట్లు పేర్కొనబడింది. అయిననూ పురుషులు కూడా మెప్పు, అభినందన, పొగడ్తను బట్టి బలపడతారు. (సామెతలు 12:8) ఈ రంగాలలో మీరు బాగా వ్యక్తపరచేవారిగా ఉండవలసిన అవసరముందా? లేక మీరు ఎలా వింటున్నారనే విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకొనవలసిన వారైయుండవచ్చును. నీ భర్తకు తన సమస్యలను, భయాలను, చింతలను దాచుకొనకుండా చర్చించటం కష్టంగావుంటే, ఆయన నీతో స్వేచ్ఛగా సంభాషించేలా దయగా, నేర్పుగా ఆయనను ఎలా కదలించాలో నీవు నేర్చుకున్నావా?
7. భార్యాభర్తల మధ్య జగడాలు పుట్టుటకు కారణమేమిటి, వాటిని ఎలా నిరోధించవచ్చును?
7 సాధారణంగా బాగా కలిసిమెలసి ఉండే దంపతుల్లో సహితం అప్పుడప్పుడు సంభాషణ కుంటుబడి పోవచ్చును. భావోద్రేకమనేది అసలు కారణాన్ని గమనించకుండేలా చేయవచ్చును. లేక నెమ్మదిగా మాట్లాడుకుంటున్న చర్చే అప్పటికప్పుడు పెద్ద వివాదంగా మారిపోవచ్చును. (సామెతలు 15:1) “అనేక విషయములలో మనందరము తప్పిపోవుచున్నాము.” భార్యభర్తలకు సంబంధించిన అల్పమైన కీచులాట వివాహ అంతమునకు సూచన కాదు. (యాకోబు 3:2) అయితే “అల్లరి, దూషణ” మాత్రము సముచితముకాదు. ఎందుకనగా అది ఎలాంటి బంధాన్నైనా నాశనము చేయగలదు. (ఎఫెసీయులు 4:31) గాయపరచే మాటలు మాట్లాడుకున్నప్పుడు సమాధానపడుటకు వెంటనే ప్రయత్నించండి. (మత్తయి 5:23, 24) ఎఫెసీయులు 4:26లోని “సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచియుండ కూడదు,” అను పౌలు మాటలను మీరిరువురు అన్వయించు కొన్నట్లయిన, తరచు జగడములను మొదట్లోనే నివారించవచ్చును. అవును, సమస్యలు చిన్నగా ఉన్నప్పుడే, పరిష్కరించుకొనగలిగిన స్థితిలో ఉన్నప్పుడే వాటిని బాహాటంగా మాట్లాడుకొనండి. నీ భావోద్రేకములు అకస్మాత్తుగా విరుచుకుపడేలా గూడు కట్టేంతవరకు వేచివుండవద్దు. ప్రతి దినము కొద్దినిముషములు అవసరమైన విషయాలను పరస్పరం చర్చించుకొంటే, సంభాషణను అభివృద్ధిపరచుకొనుటకు అవి బోలెడన్ని సంగతులై అపార్థాలను తొలగిస్తాయి.
‘యెహోవా ఇచ్చు మానసిక శిక్షణ’
8. కొంతమంది యౌవనులు ఎందుకు సత్యమునుండి తొలగిపోవచ్చును?
8 కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు సరియైన నడిపింపు లేకుండానే పెరుగుటకు వదలివేస్తూ తృప్తిచెందుతున్నట్లు కనిపిస్తుంది. పిల్లలు కూటములకు హాజరగుతూ, ప్రాంతీయ సేవలో కొంత వంతు కల్గేవుంటారు, కాని తరచు వారు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని నిర్మించుకొనుటలేదు. తగినకాలంలో అటువంటి యౌవనులలో అనేకులను, “శరీరాశ, నేత్రాశ” సత్యమునుండి దూరపరచగలవు. (1 యోహాను 2:16) తల్లిదండ్రులు ఆర్మగెద్దోనులో రక్షించబడి, గతంలో వారి నిర్లక్ష్యంవలన తమ పిల్లలను మరణానికి విడిచిపెట్టుట ఎంతటి విశాదకరము!
9, 10. (ఎ) పిల్లలను “యెహోవాయొక్క శిక్షలోను మరియు బోధలోను పెంచుటలో” ఏమి ఇమిడివున్నది? (బి) పిల్లలను తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచనివ్వడం ఎందుకు ప్రాముఖ్యము?
9 అందుకే పౌలు ఇలా వ్రాస్తున్నాడు: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువుయొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” (ఎఫెసీయులు 6:4) అలా చెయ్యాలంటే, మీ మట్టుకు మీరు యెహోవా ప్రామాణిక నియమాలతో బాగా పరిచయము కల్గియుండాలి. వినోదమును ఎంపిక చేసుకొనుట, వ్యక్తిగత పఠనము, కూటములకు హాజరగుట, ప్రాంతీయ సేవ మొదలగు విషయాలలో మంచి మాదిరి చూపుతూ ఉండాలి. పౌలు మాటలలో తల్లి లేక తండ్రి (1) తమ పిల్లలను వివేకముతో పరిశీలిస్తూ ఉండటం (2) వారితో పరస్పర సంభాషణ బాగుగా జరుగుతుండేలా చూడటం కూడ ఇమిడియున్నవి. అప్పుడు మాత్రమే వారికి “మానసిక-శిక్షణ” ఎక్కడ అవసరమో మీకు తెలుస్తుంది.
10 వయస్సులో పెరిగే పిల్లలు కొంత స్వాతంత్ర్యము కొరకు చూడడం సహజమే. ఏమైనను వారి మాటలు, ఆలోచన, దుస్తులు, కేశాలంకరణ, స్నేహితులను ఎంపిక చేసుకొనుట మొదలైన వాటిలో లోక ప్రభావపు స్పష్టమైన గుర్తులేమైనా ఉన్నవేమో గమనిస్తూ మీరు అప్రమత్తంగా ఉండాలి. వివేకముగల తండ్రి సామెతలు 23:26లో వ్రాయబడినట్లు “నా కుమారుడా, నీ హృదయము నాకిమ్మ”ని అన్నాడు. మీ పిల్లలు వారి తలంపులను, భావాలను మీతో చెప్పుకొనేందుకు మీయొద్దకు స్వేచ్ఛగా రావటానికి మనస్సు చూపుతుంటారా? మీ యొద్దకు వస్తే వెంటనే మీరు ఖండిస్తూ విమర్శిస్తారనే భయమే లేనట్లయిన పాఠశాలలోని విద్యాయేతర కార్యక్రమాలు, జతకట్టి చెట్టాపట్టాగా తిరుగుట, ఉన్నత విద్య లేదా బైబిలు సత్యము మొదలగువాటిని నిజంగా వారు ఎలా భావిస్తున్నారో బయల్పరచుటకు మక్కువ చూపుతారు.
11, 12. (ఎ) కుటుంబం పరస్పర సంభాషణను వృద్ధిచేసుకొనుటలో భోజనసమయాన్ని ఎలా వాడుకొనవచ్చును? (బి) తండ్రి తన పిల్లలతో పరస్పర సంభాషణను ఎక్కువ చేయుటకు ఎడతెగక ప్రయత్నించుట ద్వారా ఏ ఫలితం ప్రాప్తించును?
11 అనేక దేశాలలో కుటుంబమంతా కలిసి భోజనం చేయడం అలవాటు. కాబట్టి రాత్రిభోజన సమయం ప్రోత్సాహకరంగా సంభాషించుకోవటానికి కుటుంబ సభ్యులందరికి మంచి అవకాశాన్నిస్తుంది. ఎక్కువ తరచుగా టివి’ కార్యక్రమాన్నిబట్టో లేక ఇతర అంతరాయాల వలననో అందరూ కలిసి భోజనము చేయటం జరగదు. గంటల తరబడి దీర్ఘకాలము మీ పిల్లలు పాఠశాలలో గడుపుతూ లోక తలంపుల ప్రభావానికి గురవుతుంటారు. కావున భోజన సమయాలు పరస్పరం సంభాషించు కొనుటకు సరైన సమయము. ఒక తల్లి “మేము భోజన సమయాన్ని ఆరోజు జరిగిన సంగతులను మాట్లాడుకోవడానికి ఉపయోగిస్తుంటామని” అంటుంది. అయితే, భోజన సమయాలు క్రమశిక్షణా చర్యకు, ఒకరిని గూర్చి మరొకరు విమర్శించుకుంటూ మాట్లాడుకునే సమయంగా మారనవసరం లేదు. ఆ సందర్భాన్ని సరదాగా, ఆనందించటానికి అనువుగా చేసుకోండి.
12 మీ పిల్లలు మీతో స్వేచ్ఛగా మాట్లాడేలా చేయటం సవాలుతో కూడినదే, దానికి ఎంతో సహనం అవసరం కావచ్చు. అయితే సకాలంలో మీరు హృదయానందకరమైన ఫలితాలను చూడవచ్చు. ఒక శ్రద్ధగల తల్లి ఇలా అంటున్నది. “మా 14 ఏండ్ల కుమారుడు వ్యాకులముతో దూరమయ్యే వాడు.” అయితే “మా ప్రార్థనలు, పట్టుదల మూలంగా ఇప్పుడతడు మాతో స్వేచ్ఛగా ఏమి దాచుకోకుండ మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు.”
క్షేమాభివృద్ధికరమైన కుటుంబ పఠనము
13. పిల్లలకు చిన్నప్పటి నుండే తర్ఫీదు ఇవ్వడం ఎందుకు ఎంతో ప్రాముఖ్యము, మరి దానిని ఎలా చేయవచ్చును?
13 “మానసిక శిక్షణ”లో దేవుని వాక్యమును క్రమముగా ఉపదేశించడం కూడా ఇమిడివుంది. తిమోతికి ఇవ్వబడినట్లే, అలాంటి శిక్షణ “బాల్యమునుండే” ప్రారంభం కావాలి. (2 తిమోతి 3:15) బాల్యమునుండే ఇచ్చే శిక్షణ పిల్లలను ఆ తరువాత పాఠశాల కాలంలో ఎదుర్కొనబోయే—పుట్టుక దిన ఆచరణలు, దేశభక్తికి సంబంధించిన ఉత్సవాలు, లేక మతసంబంధమైన సెలవుదిన ఆచరణల వంటి విశ్వాస సంబంధమైన పరీక్షలకు తట్టుకొని నిలబడేలా బలపరుస్తాయి. అలాంటి పరీక్షలకు సిద్ధపాటు లేనట్లయితే, పిల్లవాని విశ్వాసము నలిగిపోవచ్చును. కాబట్టి పిల్లలకొరకై వాచ్‌టవర్ సొసైటి ప్రచురించే లిజనింగ్ టు ది గ్రేట్ టీచర్ మరియు మై బుక్ ఆఫ్ బైబిల్ స్టోరీస్ వంటి పుస్తకములను ప్రయోజనాత్మకంగా ఉపయోగించండి.a
14. కుటుంబ పఠనము క్రమముగా జరుగుటకు ఏమి చేయవచ్చును, మరియు క్రమమైన కుటుంబ పఠనమును కలిగియుండుటకు మీరు ఏమి చేశారు?
14 శ్రద్ధ తీసుకోవలసిన మరో రంగమేదనగా కుటుంబ పఠనము. ఇది చాలా సులభంగా అటు తల్లిదండ్రులకు ఇటు పిల్లలకు ఒక శోధనలా తయారై క్రమం తప్పటమో, మందకొడిగా జరగటమో, లేక యాంత్రికంగా జరిగేదానిలా మారిపోవడమో జరుగుతుంది. అలాంటి స్థితి సంభవించకుండా ఎలా సరిదిద్దగలవు? మొదట మీరు పఠనముకొరకు ‘సమయాన్ని సంపాదించుకోవాలి.’ అనగా టివి ప్రదర్శనలవల్లనో లేక ఇతర అంతరాయాలవల్లనో సమయం వృధా అయ్యేలా చేసుకొనకూడదు. (ఎఫెసీయులు 5:15-17) ఒక కుటుంబ యజమాని “మా కుటుంబ పఠనాన్ని క్రమంగా చేయటం చాలా కష్టంగా వుండేదని” ఒప్పుకున్నాడు. అయితే ఆయన అనేదేమంటే “సాయంకాలమైన కొద్దిసేపటి తర్వాతి సమయం పఠనానికి మాకు అనుకూల సమయంగా ఉన్నట్లు కనుగొనేంతవరకు మేము నానా సమయాల్లో ప్రయత్నించి చూశాము. ఇప్పుడు మా కుటుంబ పఠనము క్రమంగా సాగుతున్నది.”
15. మీ కుటుంబ అవసరాలకు తగినట్లుగా మీ కుటుంబ పఠనాన్ని ఎలా మలచగలరు?
15 మరోవిషయమేమంటే, మీ కుటుంబానికి కావలసిన ప్రత్యేక అవసరతలను పరిగణలోకి తీసుకొనుము. ఆయా వారం కొరకున్న కావలికోటను కుటుంబమంతా కలసి సిద్ధపడుటలో అనేక కుటుంబాలు ఆనందిస్తున్నాయి. అయినా అప్పుడప్పుడు పాఠశాలలో ఎదురయ్యే సమస్యలతో సహా చర్చించవలసిన ప్రత్యేక అంశాలుండవచ్చును. ఈ అవసరతలను ది కొశ్చన్స్ యంగ్ పీపుల్ ఆస్క్—ఆన్సర్స్ దట్ వర్క్ పుస్తకంగాని, కావలికోట లేక అవేక్! పత్రికలలోని శీర్షికలుగాని తీర్చవచ్చును. “మా పిల్లలలో దిద్దుబాటు అవసరమైన ఏదైన ఒక స్వభావమును మేము పసిగడితే,” “యంగ్ పీపుల్ ఆస్క్ పుస్తకములో ఆ విషయాన్ని వివరించే ప్రత్యేక అధ్యాయముపై దృష్టిసారిస్తామని” ఒక తండ్రి అంటున్నాడు. ఆయన భార్య కూడా “పరిస్థితికి అనుగుణ్యంగా మార్చుకొనే విధంగా ఉండటానికి మేము ప్రయత్నిస్తాము. పఠనము కొరకు ఒకదాన్ని ఏర్పాటుచేసుకున్నను, మరొకటి చర్చించవలసిన అవసరమొస్తే అప్పుడు మేము అవసరానికి తగినట్లు దాన్ని మార్చుకుంటాము.”
16. (ఎ) మీ పిల్లలు నేర్చుకుంటున్నదానిని వారు నిజంగా గ్రహిస్తున్నారని మీరు నిశ్చయంగా ఎలా తెలుసుకొనగలరు? (బి) కుటుంబ పఠనము చేస్తున్నప్పుడు సాధారణంగా దేనిని మానుకోవాలి?
16 మీ పిల్లలు నేర్చుకునే దానిని వారు నిజంగా గ్రహిస్తున్నారని మీకెలా నిశ్చయంగా తెలుస్తుంది? ప్రవీణుడైన బోధకుడగు యేసు “నీకేమి తోచుచున్నది?” అనేటటువంటి, అభిప్రాయమును వెలిబుచ్చే ప్రశ్నలడిగాడు. (మత్తయి 17:25) అలాగే మీరును చేసి, నిజంగా మీ పిల్లలు ఏమి తలస్తున్నారో తెలిసికొన ప్రయత్నించండి. ప్రతి బిడ్డను ఆమె లేక ఆయన స్వంత మాటలలో సమాధాన మిచ్చునట్లు ప్రోత్సహించండి. అయితే తమ తలంపులను వారు నిజాయితీగా వ్యక్తపరచినప్పుడు ఆ తలంపులనుబట్టి మీరు నిర్ఘాంతపోయి, కోపముతో స్పందిస్తే, మరోసారి మీకు నిజాయితీగా తమను వ్యక్తపరచుకోడానికి వారు వెనుకంజ వేస్తూ తడబడ వచ్చును. కుటుంబ పఠనమును చీవాట్లు పెట్టే సమయంగా మార్చవద్దు. అది ఆనందదాయకమైనదిగా, నిర్మాణాత్మకమైనదిగా ఉండాలి. “నా పిల్లల్లో ఎవరికైన ఏదైన సమస్య ఉన్నట్లు గమనిస్తే” “దాని సంగతి నేను ప్రత్యేకంగా విచారిస్తానని” ఒక తండ్రి అంటున్నాడు. తల్లి అనేదేమంటే, “కుటుంబ పఠనములో హెచ్చరించటం కంటే, ప్రత్యేకంగా ఒంటరిగా హెచ్చరించినప్పుడు పిల్లవాడు నొచ్చుకోకుండా స్వేచ్ఛగా మాట్లాడుటకు ఇష్టపడతాడు.”
17. కుటుంబ పఠనమును ఆసక్తికరంగా చేయుటకు ఏమిచేయవచ్చును, మీకుటుంబానికి ఏది బాగా పనిచేసింది?
17 వివిధ వయస్సులుగల పిల్లలతో కుటుంబ పఠనము నిర్వహిస్తున్నప్పుడు, వారిని దానిలో భాగం వహించేలా చేయడం సవాలుగానే ఉంటుంది. చిన్నపిల్లలు నిలకడలేకుండా అటుఇటు కదులుతుండడం, అలసిపోయినట్లుండటం, ఎక్కువసేపు మనస్సు నిలుపలేకపోవటం కనబడుతుంది. అయితే, మీరేమి చేయవచ్చును? పఠన వాతావరణము సరదాగా ఉండునట్లు చెయ్యండి. మీ పిల్లలు ఎక్కువసేపు అవధానము నిలుపలేకపోతుంటే, పఠన కార్యక్రమ నిడివి తగ్గించి, వాటిని పెక్కు పర్యాయములు నిర్వహించటానికి కృషిచేయండి. మీరు ఉత్సాహకరంగా ఉండటం కూడా సహాయకరంగా ఉంటుంది. “పై విచారణచేయువాడు జాగ్రత్తతో (ఉత్సాహంతో NW)” చేయవలెను. (రోమీయులు 12:8) అందరూ పాల్గొనేలా చేయండి. చిన్నపిల్లలు దృష్టాంతములపై వ్యాఖ్యానించటం లేక చిన్నచిన్న ప్రశ్నలకు సమాధానం చెప్పటం చేయవచ్చును. యౌవనులైనవారిని పరిశీలనచేయు అంశమును ఆచరణాత్మకమైన అన్వయింపులో పెట్టుకొనుటకు అదనపు పరిశోధన చేయుమని అడుగవచ్చును.
18. ప్రతి సందర్భమందును తల్లిదండ్రులు దేవునివాక్యమును ఎట్లు నాటగలరు, దాని ఫలితమేమి?
18 అయినను, ఆత్మీయ ఉపదేశమును వారమునకొక గంటకే పరిమితము చేయవద్దు. ప్రతి సందర్భములోను మీ పిల్లలలో దేవుని వాక్యమును నాటండి. (ద్వితీయోపదేశకాండము 6:7) వారు చెప్పేదానిని వినటానికి సమయము తీసుకొనండి. అవసరమైనప్పుడు బుద్ధిచెబుతూ, ఓదార్చండి. (1 థెస్సలొనీకయులు 2:11ను పోల్చండి.) కరుణా, వాత్సల్యమును ప్రదర్శించండి. (కీర్తన 103:13; మలాకీ 3:17) ఆలాగు చేసినట్లయిన, ‘నీ పిల్లలనుబట్టి నీవు సంతోషించి,’ వారు దేవుని నూతన లోకములోనికి కాపాడబడునట్లు మద్దతు ఇచ్చినవాడవగుదువు.—సామెతలు 29:17.
“నవ్వుటకు సమయము కలదు”
19, 20. (ఎ) కుటుంబ జీవితములో వినోదం కలిగించే కార్యక్రమాలు దేనిని నెరవేర్చును? (బి) తల్లిదండ్రులు తమ కుటుంబముకొరకు ఉల్లాసకరమైన కార్యక్రమాలను ఏ యే విధాలుగా ఏర్పాటుచేయవచ్చును?
19 “నవ్వుటకు . . . , నాట్యమాడుటకు” సమయము కలదు. (ప్రసంగి 3:4) “నవ్వుటకు” అను పదమునకు ఉపయోగింప బడిన హెబ్రీపదము “ఉత్సవము జరుపుకొనుట,” “ఆడుట,” “వినోదము కలిగించుట,” లేదా “ఆనందంగా సమయమును గడుపుట,” అని కూడా తర్జుమా చేయబడవచ్చును. (2 సమూయేలు 6:21; యోబు 41:5; న్యాయాధిపతులు 16:25; నిర్గమకాండము 32:6; ఆదికాండము 26:8) ఆట మంచి ప్రయోజనము నివ్వగలదు, అది పిల్లలకు, యౌవనులకు ప్రాముఖ్యమే. బైబిలు కాలాల్లో తల్లిదండ్రులు వినోదము, ఉల్లాసవంతమైన ఆటలను ఏర్పాటుచేశారు. (లూకా 15:25ను పోల్చండి.) మీరును అలాగే చేస్తారా?
20 “పబ్లిక్ పార్కుల కెళ్లి మేము ఆనందిస్తాము” అంటున్నాడు ఒక క్రైస్తవ భర్త. “మేము కొంతమంది యౌవనులైన సహోదరులను ఆహ్వానించి, బంతి ఆట ఆడి వనభోజనము చేస్తాము.” మరొక తండ్రి: “మేము మా మగపిల్లలతో కలిసి అనేక వినోదాలను ఏర్పరచుకొంటాము. ఈతకు వెళ్తాము, బంతి ఆట ఆడతాము, సెలవులకెళ్తాం. అయినా వినోదాన్ని దాని స్థానంలోనే ఉంచుతుంటాము. సమతూకమును కాపాడుకొనవలసిన అవసరతను నేనెప్పుడు నొక్కిచెబుతుంటాను.” జంతుప్రదర్శనశాల, మ్యూజియం మొదలగువాటికి వెళ్లడం లేక సముచితమైన కూడికలను ఏర్పాటు చేసుకోవడం వంటి యోగ్యమైన ఉల్లాసభరితమగు పనులు ఏర్పాటు చేసుకుంటే, ఒకడు లోకసంబంధమైన ఉల్లాసాలకు ఆకర్షించబడకుండ కాపాడబడుటకు అవెంతో తోడ్పడ గలవు.
21. లోక సంబంధమైన పర్వదినాలను జరుపుకొన నందున తమ పిల్లలు ఏదో కోల్పోతున్నట్లు భావించకుండా తల్లిదండ్రులు ఏమి చేయవచ్చును?
21 మీ పిల్లలు జన్మ దినాలను లేక క్రైస్తవేతర పండుగ దినాలను ఆచరించరు గనుక వారు ఏదో కోల్పోతున్నట్లు భావించుకొనకుండునట్లు చేయటం కూడా ప్రాముఖ్యమే. మీమట్టుకు మీరు కొంత క్రమబద్ధంగా ఉంటే సంవత్సరం పొడవున ఉల్లాసకరమైన సమయాలను ఏర్పాటుచేయవచ్చును. ఎందుకంటే, ఒక మంచి తండ్రికి తన ప్రేమను వస్తురూపంలో వ్యక్తంచేయుటకు ప్రత్యేక పర్వదినాలే అవసరంలేదు. ఆ తండ్రి తన పరలోకపు తండ్రివలెనే, తన పిల్లలు అడుగక ముందే ఆయన వారికి ‘మంచి బహుమతులన్విడం ఎరిగి వుంటాడు.’—మత్తయి 7:11.
మీ కుటుంబమునకు నిత్య భవిష్యత్తును సంపాదించుట
22, 23. (ఎ) మహాశ్రమలు సమీపించుచుండగా దైవ భయముగల కుటుంబములు ఏ నిశ్చయత కల్గివుండగలరు? (బి) దేవుని నూతన లోకములోనికి రక్షించబడేందుకు కృషిచేయుటకై కుటుంబములు ఏమిచేయవచ్చును?
22 గాయకుడు ఇలా ప్రార్థించాడు: “యెహోవా నీవు . . . [వారిని] కాపాడెదవు. ఈ తరమువారి చేతిలోనుండి వారిని నిత్యము రక్షించెదవు.” (కీర్తన 12:7) సాతాను నుండి వత్తిడి—ప్రత్యేకంగా యెహోవాసాక్షుల కుటుంబములపైన—నిశ్చయంగా పెరగనున్నది. అయినను అంతకంతకు అతడెక్కువచేసే వత్తిడులను ఎదుర్కొని నిలబడుట సాధ్యమే. యెహోవా సహాయము మరియు దృఢమైన తీర్మానముతోపాటు భర్తలు, భార్యలు, పిల్లలు, కుటుంబములు—అనగా మీకుటుంబముతో సహా—కష్టపడి పనిచేయడం ద్వారా మహాశ్రమల కాలములో రక్షించబడే నిరీక్షణను కలిగియుండ వచ్చును.
23 భార్యాభర్తలారా, దేవుడు మీకు నియమించిన పాత్రలను నిర్వహించుట ద్వారా మీ వివాహములో సమాధానమును, అనుగుణ్యతను నెలకొల్పండి. తల్లిదండ్రులారా మీ పిల్లలకు ఎంతో అవసరమైన తర్ఫీదును, క్రమశిక్షణను ఇచ్చేందుకు సమయమును సంపాదించుకొంటూ, మీ పిల్లలకు మంచి మాదిరికరంగా ఉండండి. వారితో మాట్లాడండి. వారు చెప్పేది వినండి. వారి ప్రాణములు అపాయములో ఉన్నవి! పిల్లలారా, మీ తల్లిదండ్రుల మాట విని వారికి లోబడియుండండి. యెహోవా సహాయము వలన విజయము సాధించి, మీకై మీరే రానైయున్న దేవుని నూతన లోకంలో నిత్య భవిష్యత్తును సంపాదించుకొనగలరు.
[అధస్సూచీలు]
a కొన్ని భాషలలో ఆడియో కేసెట్లు కూడా లభిస్తాయి.
మీకు జ్ఞాపకమున్నవా?
◻ భార్యా భర్తలు వారి పరస్పర సంభాషణను ఎలా వృద్ధిచేసికొనవచ్చును?
◻ తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా “యెహోవాయొక్క శిక్షలో” పెంచగలరు? (ఎఫెసీయులు 6:4)
◻ కుటుంబ పఠనమును క్షేమాభివృద్ధికరంగా, ఎంతో ఆసక్తిదాయకంగా చేయగల కొన్ని మార్గాలేమిటి?
◻ తమ పిల్లలకు వినోదాన్ని, ఉల్లాసాన్నికలిగించే ఆటపాటలను ఏర్పాటుచేయడంలో తల్లిదండ్రులు ఏమి చేయవచ్చును?
[16వ పేజీలోని బాక్సు]
సంగీతము—ఒక బలమైన ప్రభావము
పిల్లలను పెంచే విషయంపై వ్రాసిన ఒక పుస్తకంలో దాని రచయిత యిలా అంటున్నాడు: “నేను ప్రేక్షకుల ముందు నిలబడి . . .. మత్తుపానీయాలను తాగుట, కొకైన్ వాడుట, హుక్కాపీల్చుట, లేక మనోప్రేరేణ కలిగించే మందులనుగూర్చి ప్రచారంచేస్తే, అందరూ నిశ్చేష్టులై ఆశ్చర్యంతో చూస్తారు. . . .కానీ, తల్లిదండ్రులు మాత్రం తరచు అటువంటి వాటినే ప్రచారంచేసే రికార్డులను, కేసెట్ రికార్డింగ్‌లను కొనటానికి తమ పిల్లలకు డబ్బులిస్తుంటారు.” (రైజింగ్ పాజిటివ్ కిడ్స్ ఇన్ ఎ నెగటివ్ వరల్డ్, బై జిగ్ జిగ్లెర్) ఉదాహరణకు అమెరికాలో లైంగికతతోనిండిన రాప్ సంగీత పాటలు అనేకమంది యౌవనుల పెదవులపై దొర్లుతుంటాయి. మీరు మీ పిల్లలు సంగీతం విషయంలో ఎంపికచేసికొనే వారుగా ఉండునట్లు, తద్వారా అలాంటి దయ్యాల ఉరిలో పడకుండ సహాయపడుతుంటారా?
[15వ పేజీలోని చిత్రం]
భోజన సమయాలు కుటుంబ ఐక్యతను, పరస్పర సంభాషణను వృద్ధిచేసే సంతోషభరిత సందర్భాలు కావచ్చును