16వ అధ్యాయం
అపవాదిని, అతడి కుతంత్రాలను ఎదిరించండి
“అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.” —యాకోబు 4:7.
1, 2. కొత్తవారు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఎవరెవరు సంతోషిస్తారు?
మీరెంతో కాలంగా యెహోవా సేవ చేస్తుంటే, ఎన్నోసార్లు సమావేశాల్లో బాప్తిస్మ ప్రసంగాలు వినేవుంటారు. అయినా, బాప్తిస్మం కోసం ముందు వరుసలో కూర్చున్నవాళ్లు లేచి నిలబడడం చూసిన ప్రతీసారి మీలో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఆ క్షణంలో అందరిలో ఒక రకమైన ఉత్సాహం నిండిపోయి సంతోషంతో చప్పట్లు కొడతారు. యెహోవావైపు నిలబడాలని నిర్ణయించుకున్న అంతమంది ప్రియమైన సహోదర సహోదరీలను చూసినప్పుడు మీ కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అలాంటి సమయాల్లో మనమెంత పులకించిపోతామో కదా!
2 ఆ అవకాశం మనకు సంవత్సరానికి రెండు మూడుసార్లే దొరికితే, పరలోకంలో ఉన్న దేవదూతలకు మాత్రం అది చాలాసార్లు లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీవారం వేలాదిమంది యెహోవా సంస్థలోకి అడుగుపెడుతుంటే ‘పరలోకంలో’ దేవదూతలకు ఎంత “సంతోషము” కలుగుతుందో ఊహించగలరా? (లూకా 15:7, 10) దేవుని సంస్థలో జరుగుతున్న ఈ అభివృద్ధిని చూసి వారు ఖచ్చితంగా ఉప్పొంగిపోతారు.—హగ్గయి 2:7.
అపవాది ‘గర్జించు సింహంలా తిరుగుతున్నాడు’
3. సాతాను ఎందుకు “గర్జించు సింహమువలె” తిరుగుతున్నాడు? చివరికి అతడు ఏమి సాధించాలనుకుంటున్నాడు?
3 మరోవైపున అలాంటి సందర్భాల్లో, ఈ భ్రష్టలోకాన్ని అన్ని వేలమంది విడిచివెళ్లిపోతున్నందుకు సాతాను, అతని దయ్యాలు కోపంతో రగిలిపోతున్నాయి. మనుష్యులు యెహోవాను నిజమైన ప్రేమతో సేవించట్లేదు, శ్రమలొస్తే వారు ఆయనకు నమ్మకంగా ఉండరు అని గర్వంతో చెప్పిన సాతానుకు మరి కోపంకాకపోతే ఇంకేం వస్తుంది? (యోబు 2:4, 5 చదవండి.) మానవుల్లో ఒకరు యెహోవాకు సమర్పించుకున్న ప్రతీసారి సాతాను అబద్ధికుడని రుజువౌతోంది. అంటే ప్రతీవారం కొన్ని వేలమంది సాతానుకు చెంపపెట్టులాంటి జవాబు ఇస్తున్నారు. అందుకే అతడు “గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.” (1 పేతురు 5:8) ఈ “సింహము” దేవునితో మనకున్న సంబంధాన్ని పాడుచేయాలని, వీలైతే మనల్ని దేవునికి పూర్తిగా దూరం చేయాలని ప్రయత్నిస్తున్నాడు.—కీర్తన 7:1, 2; 2 తిమోతి 3:12.
మానవుల్లో ఒకరు యెహోవాకు సమర్పించుకున్న ప్రతీసారి సాతాను అబద్ధికుడని రుజువౌతోంది
4, 5. (ఎ) యెహోవా ఏ రెండు ముఖ్యమైన విషయాల్లో సాతానును కట్టడి చేశాడు? (బి) నిజ క్రైస్తవులకు ఏ హామీ ఉంది?
4 మన శత్రువు అంత క్రూరుడైనా మనం భయంతో వణకిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే యెహోవా దేవుడు రెండు ముఖ్యమైన విషయాల్లో సాతానును కట్టడి చేశాడు. ఏంటవి? ఒకటేంటంటే, మొత్తం యెహోవా సేవకుల్ని అతనేమీ చేయలేడు. ఎందుకంటే యెహోవా దేవుడు చాలా కాలం ముందే నిజ క్రైస్తవుల్లోని “గొప్ప సమూహము” “మహాశ్రమలనుండి” తప్పించుకుంటుంది అని చెప్పాడు. (ప్రకటన 7:9, 14) ఆయన ప్రవచనాలు విఫలమయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి దేవుని ప్రజలందరినీ తప్పుదారి పట్టించడం తనవల్ల కాదని సాతానుకు తెలుసు.
5 దేవుణ్ణి నమ్మకంగా సేవించిన ఒక వ్యక్తి చాలాకాలం క్రితం చెప్పిన మాటల్లో రెండవ విషయం తెలుస్తుంది. ప్రవక్తయైన అజర్యా రాజైన ఆసాతో, “మీరు యెహోవా పక్షపువారైనయెడల ఆయన మీ పక్షమున నుండును” అని చెప్పాడు. (2 దినవృత్తాంతములు 15:2; 1 కొరింథీయులు 10:13) దేవునికి సన్నిహితులుగా ఉన్న ఆయన సేవకుల్ని గతంలో కూడా సాతాను ఏమీ చేయలేకపోయాడు అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. (హెబ్రీయులు 11:4-40) నేడు కూడా దేవునితో దగ్గరి సంబంధాన్ని కలిగివుండే క్రైస్తవులు అపవాదిని ఎదిరించి, అతడిపై విజయం సాధించవచ్చు. దేవుని వాక్యంలో మనకు ఈ హామీ ఉంది: “అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.”—యాకోబు 4:7.
మనం ‘దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం’
6. సాతాను క్రైస్తవులతో ఎలా పోరాడతాడు?
6 మనం సాతానుతో చేసే పోరాటంలో అతడు గెలవలేడు కానీ మనం జాగ్రత్తగా ఉండకపోతే మనల్ని గాయపరుస్తాడు. మనల్ని యెహోవాకు దూరం చేయగలిగితే సులభంగా మ్రింగేయవచ్చని సాతానుకు తెలుసు. సాతాను ఎలా మనల్ని దేవునికి దూరం చేస్తాడు? ఇంకా ఎక్కువగా దాడి చేస్తూ, మనలో ఒక్కొక్కరితో పోరాడుతూ, కుయుక్తితో పడగొట్టాలని చూస్తున్నాడు. సాతాను వాడే ఈ మూడు పన్నాగాల గురించి మనం ఇప్పుడు పరిశీలిద్దాం.
7. సాతాను ఎందుకు యెహోవా ప్రజలపై ఇంకా ఎక్కువగా దాడి చేస్తున్నాడు?
7 ఇంకా ఎక్కువగా దాడి చేస్తాడు. “లోకమంతయు దుష్టుని యందున్నది” అని అపొస్తలుడైన యోహాను చెప్పాడు. (1 యోహాను 5:19) ఈ మాటల్లో నిజ క్రైస్తవులందరికీ ఒక హెచ్చరిక ఉంది. దైవభయం లేని లోక ప్రజలనంతా సాతాను ఇప్పటికే తనవైపు తిప్పేసుకున్నాడు కాబట్టి ఇప్పటివరకూ తననుండి తప్పించుకున్న యెహోవా ప్రజలపైకి దృష్టి మళ్లించి దాడుల్ని ఎక్కువ చేస్తాడు. (మీకా 4:1; యోహాను 15:19; ప్రకటన 12:12, 17) తనకు సమయం చాలా తక్కువగా ఉందని తెలిసి అతడి కోపం నాషాళానికెక్కింది. అందుకే నేడు మనపై అతడు చివరి ప్రయత్నంగా అతి క్రూరంగా దాడి చేస్తున్నాడు.
8. అపొస్తలుడైన పౌలు మనం దుష్టాత్మలతో “పోరాడుచున్నాము” అని ఎందుకు అన్నాడు?
8 మనలో ఒక్కొక్కరితో పోరాడతాడు. ‘మనము ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము’ అని అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవులను హెచ్చరించాడు. (ఎఫెసీయులు 6:12) పౌలు ఎందుకు “పోరాడుచున్నాము” అనే పదం ఉపయోగించాడు? ఎందుకంటే ఆ పదం ముఖాముఖిగా పోరాడడాన్ని సూచిస్తుంది. కాబట్టి పౌలు ఇక్కడ ఆ పదాన్ని ఉపయోగించి, మనలో ప్రతీ ఒక్కరం వ్యక్తిగతంగా దుష్టాత్మలతో పోరాడుతున్నామని చూపించాడు. మనం నివసించే ప్రాంతంలో దయ్యాలున్నాయని నమ్మినా, నమ్మకపోయినా యెహోవాకు సమర్పించుకున్నప్పుడే మనంతట మనం వాటితో పోరాటానికి దిగామని మరిచిపోకూడదు. సమర్పించుకున్న తర్వాత ప్రతీ క్రైస్తవుడు ఖచ్చితంగా ఆ పోరాటం చేయాల్సి ఉంటుంది. అందుకే పౌలు ఎఫెసులోని క్రైస్తవులకు ఒకటికన్నా ఎక్కువసార్లు స్థిరంగా నిలబడి ఎదిరించమని చెప్పాడు.—ఎఫెసీయులు 6:11, 13, 14.
9. (ఎ) సాతాను, అతడి దయ్యాలు వేర్వేరు “తంత్రములను” ఎందుకు ఉపయోగిస్తారు? (బి) సాతాను ఏ విధంగా మన ఆలోచనా విధానాన్ని పాడుచేయడానికి చూస్తాడు? మనమెలా అతడి ప్రయత్నాలను తిప్పికొట్టవచ్చు? (220-221 పేజీల్లోని బాక్సు చూడండి.) (సి) ఇప్పుడు మనం ఏ కుతంత్రం గురించి చూడబోతున్నాం?
9 కుయుక్తితో పడగొట్టాలని చూస్తున్నాడు. సాతాను ‘తంత్రాలకు’ పడిపోకూడదని పౌలు క్రైస్తవుల్ని హెచ్చరించాడు. (ఎఫెసీయులు 6:11) పౌలు ఇక్కడ “తంత్రములు” అని బహువచనం ఉపయోగించాడని గమనించారా? దుష్టాత్మలు మనల్ని పడగొట్టడానికి ఒకటి కాదు ఎన్నో రకాల తంత్రాలను ఉపయోగిస్తాయి. కొందరు విశ్వాసులు ఒకరకమైన తంత్రాన్ని ధైర్యంగా ఎదిరించినా మరోదానికి పడిపోయారు. కాబట్టి సాతాను, అతడి దయ్యాలు మన బలహీనతల్ని కనిపెట్టడానికి మనల్ని గమనిస్తూవుంటారు. బలహీనతలేవైనా కనబడితే వాటిని ఉపయోగించి మనల్ని యెహోవాకు దూరం చేయడానికి చూస్తారు. సంతోషకరమైన విషయమేమిటంటే, అపవాది ఉపయోగించే తంత్రాల్లో చాలావాటిని మనం గుర్తుపట్టవచ్చు ఎందుకంటే వాటి గురించి బైబిల్లో ఉంది. (2 కొరింథీయులు 2:11) ముందటి అధ్యాయాల్లో ధనాపేక్ష, చెడు స్నేహం, లైంగిక దుర్నీతి లాంటి పన్నాగాల గురించి చూశాం. ఇప్పుడు సాతాను కుతంత్రాల్లో మరొకదాని గురించి చర్చించుకుందాం.
భూతప్రేత వ్యవహారాల్లో పాల్గొనడం దేవునికి ద్రోహం చేయడంతో సమానం
10. (ఎ) భూతప్రేత వ్యవహారాలు అంటే ఏమిటి? (బి) యెహోవా వాటినెలా దృష్టిస్తాడు? మీరెలా దృష్టిస్తారు?
10 భూతప్రేత వ్యవహారాల్లో పాల్గొనడం అంటే దుష్టాత్మలతో సంప్రదింపులు జరపడం అని అర్థం. సోదె, శకునాలు చెప్పడం, జ్యోతిష్యం, ఇంద్రజాలం, చేతబడి, కర్ణపిశాచిని అడగడం లాంటివన్నీ భూతప్రేత వ్యవహారాలే. ఇవన్నీ యెహోవాకు “హేయము.” (ద్వితీయోపదేశకాండము 18:10-12; ప్రకటన 21:8) మనం కూడా ‘చెడ్డవాటిని అసహ్యించుకోవాలి’ కాబట్టి దుష్టాత్మలతో ఎలాంటి సంబంధమూ పెట్టుకోకూడదు. (రోమీయులు 12:9) అలాంటి హేయకరమైనవాటిలో పాల్గొంటే మన పరలోక తండ్రియైన యెహోవాకు నమ్మకద్రోహం చేసినట్లే అవుతుంది.
11. మనల్ని భూతప్రేత వ్యవహారాల్లో పాల్గొనేలా నడిపిస్తే సాతానుకు విజయం దక్కినట్లే అని ఎందుకు చెప్పవచ్చు? ఉదాహరణతో చెప్పండి.
11 భూతప్రేత వ్యవహారాల్లో పాల్గొంటే యెహోవాకు ద్రోహం చేసినట్లు అవుతుంది కాబట్టే సాతాను మనతో వాటిని చేయించాలని చూస్తున్నాడు. ఎంతమంది క్రైస్తవుల్ని అలా చేయడానికి నడిపిస్తే సాతానుకు అన్నిసార్లు విజయం దక్కినట్లు. ఎందుకలా అంటున్నాం? ఈ ఉపమానం చూడండి. శత్రువులు ఒక సైనికుణ్ణి తెలివిగా తమవైపుకు తిప్పుకోగలిగితే శత్రు సైన్యాధికారి చాలా సంతోషిస్తాడు. ఆ సైన్యాధికారి ఈ సైనికుణ్ణి విజయసంకేతంలా చూపిస్తూ అవతలి సైన్యాధికారిని ఎగతాళి చేస్తాడు. అలాగే ఒక క్రైస్తవుడు భూతప్రేత వ్యవహారాల్లో పాల్గొంటే అతడు కావాలనే యెహోవాను విడిచి సాతాను పక్షాన చేరతాడు. సాతాను అతడ్ని యెహోవాకు చూపిస్తూ తాను విజయం సాధించానని ఎంత వికటాట్టహాసం చేస్తాడో ఊహించండి. మనలో ఎవరమైనా అపవాదికి అలాంటి విజయం ఇవ్వాలనుకుంటామా? ఖచ్చితంగా అనుకోం! మనం నమ్మకద్రోహులం కాదు.
సందేహాలను పుట్టించే ప్రశ్నలు
12. భూతప్రేత వ్యవహారాల విషయంలో మన ఆలోచనా విధానాన్ని మార్చడానికి సాతాను ఏమి చేస్తాడు?
12 భూతప్రేత వ్యవహారాల్లో పాల్గొననంతవరకు సాతాను మనల్ని ఏమీ చేయలేడు. కాబట్టి ముందు మన ఆలోచనా విధానాన్ని మార్చాలని అతడికి తెలుసు. ఎలా మారుస్తాడు? “కీడు మేలనియు మేలు కీడని” అనుకునేంతగా క్రైస్తవుల్ని అయోమయంలో పడేయాలని ప్రయత్నిస్తాడు. (యెషయా 5:20) దానికి అతడు చాలాకాలంగా ఎంతోమందిపై ప్రయోగించి విజయం సాధించిన ఒక పద్ధతిని ఉపయోగిస్తాడు. అదేమిటంటే సందేహాలను పుట్టించే ప్రశ్నలు వేయడం.
13. సాతాను గతంలో సందేహాలను పుట్టించడానికి ప్రశ్నలు వేసే పద్ధతిని ఎలా ఉపయోగించాడు?
13 పూర్వం సాతాను ఆ పద్ధతిని ఎలా ఉపయోగించాడో గమనించండి. ఏదెను తోటలో సాతాను హవ్వను ఇలా అడిగాడు: “ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?” యోబు కాలంలో, పరలోకంలో సమావేశం జరుగుతుండగా సాతాను ఇలా ప్రశ్నించాడు: “యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా?” యేసు భూపరిచర్య ప్రారంభంలో సాతాను ఆయనపై ఈ సవాలు విసిరాడు: “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు.” ఒక్కసారి ఆలోచించండి, అప్పటికి ఆరు వారాల క్రితం యెహోవాయే స్వయంగా “ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను” అని అన్న మాటల్నే ఆధారం చేసుకుని యెహోవాను ఎగతాళి చేయడానికి ప్రయత్నించాడు.—ఆదికాండము 3:1; యోబు 1:9; మత్తయి 3:17; 4:3.
14. (ఎ) భూతప్రేత వ్యవహారాల్లో పాల్గొనే విషయంలో సందేహాలు పుట్టించే పద్ధతిని సాతాను ఎలా ఉపయోగిస్తున్నాడు? (బి) మనమిప్పుడు ఏమి పరిశీలిస్తాం?
14 భూతప్రేత వ్యవహారాల్లో పాల్గొనడం తప్పో కాదో అర్థం చేసుకోలేని పరిస్థితిని సృష్టించడానికి అపవాది నేడు అదే పద్ధతిని ఉపయోగిస్తున్నాడు. విచారకరంగా, కొంతమంది విశ్వాసుల మనసుల్లో అలాంటి సందేహాలు పుట్టించగలిగాడు. అలాంటి కొన్ని పనులు నిజంగానే చెడ్డవా అని కొంతమంది ప్రశ్నించడం మొదలుపెట్టారు. (2 కొరింథీయులు 11:3) అలాంటివారు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవడానికి మనమెలా సహాయం చేయవచ్చు? సాతాను కుతంత్రానికి లొంగిపోకుండా మనమెలా జాగ్రత్తపడవచ్చు? సాతాను తెలివిగా ఏ రెండు రంగాల్లో భూతప్రేత వ్యవహారాల్ని ప్రవేశపెట్టాడో తెలుసుకుంటే వాటికి జవాబులు తెలుస్తాయి. ఒకటి వినోదం, రెండవది వైద్యం.
మన అవసరాల్నిబట్టి, కోరికల్నిబట్టి మోసం చేస్తాడు
15. (ఎ) పాశ్చాత్య దేశాల్లో చాలామంది భూతప్రేత వ్యవహారాల్ని ఎలా దృష్టిస్తారు? (బి) కొంతమంది క్రైస్తవులు ఎలా లోకస్థుల్లా ఆలోచించడం మొదలుపెట్టారు?
15 పాశ్చాత్య దేశాల్లో భూతప్రేత వ్యవహారాలు అంత ప్రమాదకరమైనవి కావనుకుంటారు. సినిమాలు, పుస్తకాలు, టీవీ కార్యక్రమాలు, కంప్యూటర్ గేములు మొదలైనవాటిలో భూతప్రేత వ్యవహారాలు సరదా కోసం చేసేవి, తెలివైనవాళ్లు చేసేవి, వాటిలో ఏ హానీ లేదన్నట్లు చూపిస్తారు. అలాంటి కథలతో వచ్చే సినిమాలు, పుస్తకాలు ఎంత ప్రసిద్ధికెక్కాయంటే వాటికోసం అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి. నిజంగానే, వాటిలో అంతగా హాని లేదని ప్రజల్ని నమ్మించడంలో దయ్యాలు విజయం సాధించాయి. క్రైస్తవులు కూడా అలా ఆలోచించడం మొదలుపెట్టారా? కొంతమంది అలా ఆలోచిస్తున్నారు. మచ్చుకు ఒక ఉదాహరణ చూడండి. భూతప్రేతాలకు సంబంధించిన ఒక సినిమా చూసిన ఒక క్రైస్తవుడు ఇలా అన్నాడు: “నేను సినిమా చూశాను కానీ వాటిని చేయలేదు కదా.” అలా ఆలోచించడం ప్రమాదకరం. ఎందుకు?
16. భూతప్రేత వ్యవహారాలను చూపించే, వర్ణించే వినోదాన్ని ఎంచుకోవడం ఎందుకు ప్రమాదకరం?
16 భూతప్రేత వ్యవహారాలను చూడడానికి, వాటిని చేయడానికి తేడా ఉన్నప్పటికీ, చూస్తే ఏ ప్రమాదం లేదనుకోకూడదు. ఎందుకు? సాతానుగానీ, అతడి దయ్యాలుగానీ మన మనసుల్ని చదవలేరని దేవుని వాక్యం చెబుతోంది.a ముందే చూసినట్లుగా మనం దేని గురించి ఆలోచిస్తామో, మన బలహీనతలేమిటో కనిపెట్టడానికి సాతాను, అతడి దయ్యాలు మనల్ని గమనిస్తారు. అంటే మనమెలాంటి వినోదాన్ని ఎంచుకుంటామో కూడా చూస్తారు. భూతప్రేత వ్యవహారాలు, దయ్యం పట్టడం, మ్యాజిక్ ఇతరత్రా సీన్లు ఉండే సినిమాలు, పుస్తకాల్లాంటి వాటిని ఒక క్రైస్తవుడు ఇష్టపడుతున్నాడని చూపిస్తే దయ్యాలకు సందేశం పంపినట్లే. నాలో ఈ బలహీనత ఉందని వాటికి చూపించినట్లే. అప్పుడవి ఆయనతో ఇంకా ఎక్కువగా పోరాడి చివరకు ఓడించేస్తాయి. అలాంటివాటిని సరదా కోసం చూడడం మొదలుపెట్టిన వాళ్లు భూతప్రేత వ్యవహారాల్లో ఆసక్తి పెంచుకుని చివరకు వాటిలో పాల్గొనే స్థితికి చేరుకున్నారు.—గలతీయులు 6:7 చదవండి.
అనారోగ్యంగా ఉన్నప్పుడు యెహోవా నుండి సహాయం పొందండి
17. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని సాతాను ఏ కుతంత్రంతో తప్పుదారిపట్టించే అవకాశం ఉంది?
17 వినోదాన్నే కాదు వైద్య అవసరాలను కూడా సాతాను సొమ్ము చేసుకుంటాడు. ఎలా? అనారోగ్యంతో బాధపడుతున్న ఒక క్రైస్తవుడు, ఎన్ని మందులు వాడి ఎంతమంది డాక్టర్లకు చూపించుకున్నా నయం కాకపోతే ఎంతో నిరాశ చెందుతాడు. (మార్కు 5:25, 26) ఆయనను పడగొట్టడానికి సాతానుకు, అతడి దయ్యాలకు అదొక మంచి అవకాశంగా కనిపిస్తుంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ‘మానవాతీత శక్తులను ఆశ్రయించే’ వైద్య చికిత్సలకు ఒప్పుకునేలా అవి క్రైస్తవుల్ని మభ్యపెడతాయి. (యెషయా 1:13, NW) నిజానికది చాలా ప్రమాదకరం. దయ్యాలు ఉపయోగించిన ఆ కుతంత్రానికి పడిపోతే ఆ వ్యక్తి దేవునికి దూరమైపోతాడు. ఎలా?
18. క్రైస్తవులు ఎలాంటి చికిత్సలకు ఒప్పుకోరు, ఎందుకు?
18 ‘మానవాతీత శక్తులను ఆశ్రయించిన’ ఇశ్రాయేలీయులను యెహోవా ఇలా హెచ్చరించాడు: “మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను.” (యెషయా 1:15) కాబట్టి యెహోవా మన ప్రార్థనలు వినాలంటే, ఆయన మనకు సహాయం చేయాలంటే ఎల్లప్పుడూ చివరకు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా మనం అలాంటి వాటికి దూరంగా ఉండాలి. (కీర్తన 41:3) ఒకవేళ ఏదైనా రోగ నిర్ధారణ పద్ధతిలో, చికిత్సా పద్ధతిలో భూతప్రేత వ్యవహారాలు ఉన్నట్లనిపిస్తే నిజ క్రైస్తవులు వాటిని ఖచ్చితంగా నిరాకరించాలి.b (మత్తయి 6:13) అలాచేస్తే వారికి యెహోవా తప్పకుండా సహాయం చేస్తాడు.—222వ పేజీలోని “ఇది నిజంగా భూతప్రేత వ్యవహారాలకు సంబంధించినదేనా?” అనే బాక్సు చూడండి.
దయ్యాల కథలు
19. (ఎ) అపవాది తన శక్తి విషయంలో అనేకమందిని ఎలా మోసం చేస్తున్నాడు? (బి) నిజక్రైస్తవులు ఎలాంటి కథలకు దూరంగా ఉండాలి?
19 కొన్ని పాశ్చాత్య దేశాల్లో సాతానుకు అంత శక్తి లేదని కొట్టి పారేసినా, ఇతర దేశాల్లో అతడు చాలా శక్తివంతుడని నమ్ముతారు. అలాంటిచోట్ల అపవాది తనకు లేని శక్తిని ఉన్నట్లుగా చూపించి అనేకమందిని మోసం చేస్తున్నాడు. కొంతమంది అనుక్షణం ఆ భయంతోనే బ్రతుకుతారు. అలాంటి చోట్ల దయ్యాల కథలెన్నో ప్రచారంలో ఉన్నాయి. అలాంటి కథలను ఎంతో ఉత్సాహంతో చెబుతారు, వినేవాళ్లూ అంతే కుతూహలంతో వింటారు. అలాంటి కథలను మనం కూడా వ్యాప్తి చేయవచ్చా? చేయకూడదు. సత్య దేవుని సేవకులు రెండు కారణాలను బట్టి అలా చేయరు.
20. ఒక వ్యక్తి ఏ విధంగా తనకు తెలియకుండానే సాతాను ఆలోచనల్ని వ్యాప్తి చేసే అవకాశముంది?
20 మొదటిది, దయ్యాల కథల్ని వ్యాప్తి చేస్తే సాతాను కోసం పనిచేసినవారవుతారు. ఎలా? సాతానుకు అద్భుతాలు చేసే శక్తి ఉందని బైబిలు ఒప్పుకుంటూనే అతడు ‘అబద్ధ విషయమైన సూచకక్రియలను, మోసాన్ని’ ఉపయోగిస్తాడని హెచ్చరిస్తుంది. (2 థెస్సలొనీకయులు 2:9, 10) సాతాను పెద్ద మోసగాడు, కాబట్టి భూతప్రేత వ్యవహారాల్లో ఆసక్తి చూపించేవారి మనసుల్ని ఎలా మళ్ళించాలో, లేనివి ఉన్నట్లు ఎలా నమ్మించాలో అతడికి తెలుసు. అలాంటి వాళ్ళు అమాయకంగా తాము నిజంగానే ఏదో చూసేశాం, ఏదో వినేశాం అని భ్రమపడి వేరేవాళ్ళకు చెబుతుంటారు. అది ఒకరినుండి ఒకరికి ప్రాకి గోరంతలు కొండంతలవుతుంది. ఒక క్రైస్తవుడు అలాంటి కథల్ని వ్యాప్తిచేస్తే అతడు ‘అబద్ధానికి జనకుడైన’ అపవాది ఉద్దేశాలను నెరవేరుస్తాడు. సాతాను ఆలోచనల్ని వ్యాప్తి చేసినట్లు అవుతుంది.—యోహాను 8:44; 2 తిమోతి 2:16.
21. మనం వేటి గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలి?
21 రెండవది, ఒక క్రైస్తవుడు గతంలో నిజంగానే దుష్టాత్మల బారిన పడినా లేదా భూతప్రేత వ్యవహారాల్లో పాల్గొన్నా, ఇప్పుడు తోటి విశ్వాసులతో ఆ కథల్ని మాటిమాటికీ చెప్పకూడదు. ఎందుకు? మనం “విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు” చూడాలని బైబిలు చెబుతుంది. (హెబ్రీయులు 12:1, 2) మనం ఆలోచించాల్సింది, మాట్లాడుకోవాల్సింది క్రీస్తు గురించే గానీ సాతాను గురించి కాదు. సాతాను ఏమి చేయగలడు, ఏమి చేయలేడు అనే విషయాల గురించి ఎంతో చెప్పగలిగినా యేసు తన శిష్యులకు దుష్టాత్మలకు సంబంధించిన కథలు చెప్పలేదు. బదులుగా యేసు రాజ్య సందేశాన్ని ప్రకటించడానికే ప్రాముఖ్యతనిచ్చాడు. కాబట్టి మనం కూడా యేసు ఆయన అపొస్తలుల్లాగే “దేవుని గొప్పకార్యముల” గురించే ఎక్కువగా మాట్లాడుకోవాలి.—అపొస్తలుల కార్యములు 2:11; లూకా 8:1; రోమీయులు 1:11, 12.
22. పరలోకంలో “సంతోషము” కలుగుతూ ఉండడానికి మనమేమి చేయవచ్చు?
22 యెహోవాతో మనకున్న సంబంధాన్ని పాడుచేయడానికి సాతాను భూతప్రేత వ్యవహారాలతో సహా ఎన్నో రకాల తంత్రాలను ఉపయోగిస్తాడన్నది నిజమే. కానీ చెడ్డదాన్ని అసహ్యించుకుంటూ మంచిదాన్ని ప్రేమిస్తే అన్నిరకాల భూతప్రేత వ్యవహారాలకు దూరంగా ఉండాలన్న మన నిర్ణయాన్ని అపవాది ఏమాత్రం మార్చలేడు. (ఎఫెసీయులు 4:27 చదవండి.) అపవాది నాశనం అయ్యేంతవరకు అతని ‘తంత్రములను ఎదిరిస్తూ’ స్థిరంగా నిలబడితే పరలోకంలో ఎంత “సంతోషము” కలుగుతుందో ఊహించండి!—ఎఫెసీయులు 6:11.
a సాతానుకు ఇవ్వబడిన ఏ పేర్లైనా (విరోధి, కొండెములు చెప్పువాడు, వంచకుడు, శోధకుడు, అబద్ధికుడు) అతడికి మన మనసులను చదివే సామర్థ్యం ఉందని చూపించడంలేదు. కానీ బైబిలు, యెహోవా “హృదయ పరిశోధకుడు” అని, యేసు “అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు” అని చెబుతోంది.—సామెతలు 17:3; ప్రకటన 2:23.
b మరింత సమాచారం కోసం కావలికోట డిసెంబరు 15, 1994 సంచికలోని 19-22 పేజీల్లోవున్న, “మీకొక ఆరోగ్య పరీక్షా?” అనే ఆర్టికల్‌ను, సెప్టెంబరు 1, 2003 “కష్టకాలాల్లో యెహోవామీద సంపూర్ణ నమ్మకం ఉంచండి” అనే ఆర్టికల్‌లో 12-14 పేరాలను చూడండి.