లోక పాలకుని ముసుగు తొలగిపోయింది
ఒక సందర్భంలో యేసు ప్రజలతో ఇలా అన్నాడు: “ఈ లోకాధికారిని బయటకు తరిమివేసే సమయం వచ్చింది.” ఆ తర్వాత, ‘ఈ లోకాధికారి నన్నేమీ చేయలేడు,’ ‘ఈ లోకాధికారి తీర్పు పొందాడు’ అని కూడా ఆయన అన్నాడు. (యోహాను 12:31; 14:30, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్; యోహాను 16:9-11) ఇంతకీ యేసు ఎవరి గురించి మాట్లాడాడు?
“ఈ లోకాధికారి” గురించి యేసు చెప్పిన మాటల్ని బట్టి చూస్తే, ఆయన మాట్లాడింది తన తండ్రి అయిన యెహోవా గురించి కాదని స్పష్టమౌతోంది. మరైతే “ఈ లోకాధికారి” ఎవరు? అతను ఎలా ‘తరిమివేయబడతాడు’? ఎలా ‘తీర్పు పొందాడు’?
తనెవరో ‘ఈ లోకాధికారే’ చెప్పుకున్నాడు
నేర సామ్రాజ్య నాయకుడు తన శక్తి గురించి ఎప్పుడూ గర్వంతో గొప్పలు చెప్పుకున్నట్టే అపవాది కూడా దేవుని కుమారుడైన యేసును శోధించినప్పుడు గొప్పలు చెప్పుకున్నాడు. ‘లోక రాజ్యాలన్నిటినీ’ యేసుకు చూపించిన తర్వాత సాతాను ఈ ప్రతిపాదన చేశాడు: ‘ఈ అధికారమంతటినీ, ఈ రాజ్యాల మహిమను నీకు ఇస్తాను, అది నాకు అప్పగించబడింది, అదెవనికి నేను ఇవ్వగోరతానో వానికి ఇస్తాను. కాబట్టి నువ్వు నాకు మొక్కితే ఇదంతా నీదవుతుంది.’—లూకా 4:5-7.
కొంతమంది అనుకున్నట్టు, అపవాది ఒక నిజమైన వ్యక్తి కాకపోతే ఆ శోధనను ఎలా అర్థంచేసుకోవాలి? యేసు చెడు ఆలోచనతో లేక బాప్తిస్మం తర్వాత ఏదో మానసిక సంఘర్షణతో శోధించబడ్డాడా? అలాగైతే ‘ఆయనలో పాపమేమీ లేదు’ అని ఎలా చెబుతాం? (1 యోహాను 3:5) మానవజాతి మీద అపవాది అధికారం చెలాయిస్తున్నాడనే విషయాన్ని యేసు కాదనలేదు కానీ, అతడిని “ఈ లోకాధికారి” అంటూ ఆ విషయాన్ని బలపరుస్తున్నాడు. అంతేకాదు అపవాదిని “నరహంతకుడు,” “అబద్ధికుడు” అని కూడా ఆయన అన్నాడు.—యోహాను 14:30; 8:44.
అపవాది క్రీస్తును శోధించిన దాదాపు 70 సంవత్సరాలకు, అతడు ఎంతగా ప్రభావం చూపిస్తున్నాడో క్రైస్తవులకు చెబుతూ అపొస్తలుడైన యోహాను ఇలా అన్నాడు: “ప్రపంచమంతా సైతాను ఆధీనంలో ఉంది.” అంతేకాదు, అతడు ‘సర్వ లోకాన్ని మోసగిస్తున్నాడు’ అని కూడా అన్నాడు. (1 యోహాను 5:19, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్; ప్రకటన 12:9) “ఈ లోకాధికారి” ఒక అదృశ్య వ్యక్తి అని బైబిలు చెబుతోంది. అయితే అతడు లోకాన్ని ఎలా పరిపాలిస్తున్నాడు?
లోకాధికారి తన సహచరులకు అధికారమిచ్చాడు
విశ్వాసం కోసం క్రైస్తవులు చేసే పోరాటం గురించి అపొస్తలుడైన పౌలు వివరిస్తున్నప్పుడు వాళ్ల బద్ధ శత్రువులు ఎవరో స్పష్టం చేశాడు. ఆయన ఇలా అన్నాడు: ‘మనం పోరాడేది శరీరులతో కాదుగానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో, ఆకాశమండలంలో ఉన్న దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం.’ (ఎఫెసీయులు 6:12) మనం ‘మానవులతో కాదు’ కానీ ‘దురాత్మలతో’ పోరాడాలి కాబట్టి అపవాది మన చుట్టూ ఉన్న చెడు కాదనీ, తిరుగుబాటుదారులైన దేవదూతలతో కలిసి అధికారం చెలాయిస్తున్నాడనీ తెలుస్తోంది. వీళ్లు పరలోకంలో ఉన్న ‘తమ నివాస స్థలాన్ని’ విడిచిపెట్టారు.—యూదా 6.
ప్రాచీన కాలాల నుండి, ఈ “లోకనాథులు” లోకం మీద ఎలా అధికారం చెలాయిస్తున్నారో బైబిల్లోని దానియేలు అనే ప్రవచన పుస్తకం తెలియజేస్తోంది. దాదాపు క్రీ.పూ. 537లో బబులోను చెర నుండి యెరూషలేముకు తిరిగి వెళ్లిన తోటి యూదుల గురించి ఆందోళనపడుతూ దానియేలు ప్రవక్త వాళ్ల తరఫున మూడు వారాలు ప్రార్థించాడు. ఆయనకు ధైర్యాన్ని ఇవ్వడానికి దేవుడు ఒక దేవదూతను పంపించాడు. తను రావడం ఎందుకు ఆలస్యమైందో చెబుతూ ఆ దేవదూత ఇలా వివరించాడు: ‘పారసీకుల రాజ్యాధిపతి ఇరవై ఒక్క దినాలు నన్ను ఎదిరించాడు.’—దానియేలు 10:2, 13.
ఈ ‘పారసీకుల అధిపతి’ ఎవరు? ఆ దూత ఖచ్చితంగా పారసీక రాజైన కోరెషు అయ్యుండడు. ఎందుకంటే అప్పట్లో ఆయన దానియేలు మీద, ఆయన ప్రజల మీద దయ చూపించాడు. అంతేకాదు, ఒక్క దేవదూత ఒకే రాత్రిలో 1,85,000 మంది యోధులను చంపాడు. అలాంటి ఓ దేవదూతను మానవ మాత్రుడైన రాజు మూడు వారాలు ఎదిరించడం సాధ్యమేనా? (యెషయా 37:36) ‘పారసీకుల అధిపతి’ అయిన ఈ శత్రువు అపవాది సహచరుడే అయ్యుంటాడు, అంటే పారసీక సామ్రాజ్యం మీద ఆధిపత్యం దొరికిన దయ్యం (దుష్ట దూత) అయ్యుంటాడు. ఆ తర్వాతి వచనాల్లో, తను మరోసారి ‘పారసీకుల అధిపతితో,’ అలాగే ‘గ్రీకు దేశపు అధిపతి’ అయిన మరో దయ్యంతో పోరాడాల్సి ఉందని ఆ దేవదూత చెప్పాడు.—దానియేలు 10:20.
దీన్నుండి మనం ఏ ముగింపుకు రావచ్చు? నిజంగా అదృశ్యమైన “లోకనాథులు” ఉన్నారని, అపవాది అయిన సాతాను అనే తమ ప్రధాన నాయకుని అధికారం కింద వాళ్లు పనిచేస్తున్నారని మనకు తెలుస్తోంది. అయితే, మొదటి నుండి వాళ్ల లక్ష్యమేమిటి?
లోకాధికారి నిజ స్వరూపం బయటపడింది
ప్రధాన దూతయైన మిఖాయేలుగా యేసు అపవాదిని అతడి దయ్యాలను ఎలా ఓడించి, పరలోకం నుండి కిందకు పడద్రోశాడో బైబిల్లోని చివరి పుస్తకంలో అపొస్తలుడైన యోహాను చెప్పాడు. అలా పడద్రోయడం వల్ల ఎలాంటి చెడు పర్యవసానాలు చోటుచేసుకుంటాయో కూడా చెబుతూ ఆయన ఇలా అన్నాడు: ‘భూమికి శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధంతో మీ వద్దకు దిగివచ్చాడు.’—ప్రకటన 12:9, 12.
అపవాది ఆ కోపాన్ని ఎలా వెళ్లగక్కాడు? నేర సామ్రాజ్య నాయకులు, ‘పాలించు లేదా నాశనం చెయ్’ అనే పద్ధతి పాటించినట్లే, అపవాది అతడి దయ్యాలు కలిసి భూమినీ దానిమీదున్న ప్రజలనూ తమతోపాటు నాశనం చేయాలని తీర్మానించుకున్నారు. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని తన గుప్పిట్లో ఉన్న, మానవ సమాజంలోని ఒక ప్రధాన రంగాన్ని అంటే వ్యాపార రంగాన్ని ఒక ఆయుధంలా వాడుకుంటున్నాడు. అలా, ఎక్కువ వస్తువులను కొనాలన్న వెర్రి స్ఫూర్తిని ప్రజల్లో కలిగిస్తున్నాడు. అందుకే సహజ వనరులు అంతరించిపోతున్నాయి, ప్రపంచ పర్యావరణానికి హాని కలుగుతోంది, చివరికి మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతోంది.—ప్రకటన 11:18; 18:11-17.
మానవ చరిత్ర ఆరంభం నుండి అపవాదికున్న అధికార దాహాన్ని రాజకీయాల్లో, మతంలో కూడా చూస్తాం. రాజకీయ శక్తులను క్రూరమృగంతో పోలుస్తూ దానికి అపవాది తన ‘గొప్ప అధికారం’ ఇచ్చాడని ప్రకటన పుస్తకం చెబుతోంది. మతం రాజకీయాలతో పొత్తు పెట్టుకోవడం నీచమైనదని, అది ఆధ్యాత్మిక వ్యభిచారమని కూడా చెబుతోంది. (ప్రకటన 13:1, 2; 17:1, 2) శతాబ్దాలుగా ఉన్న అణచివేత, బానిసత్వం, యుద్ధాలు, జాతుల మధ్య పోరాటాలు కోట్లాదిమందిని పొట్టనబెట్టుకున్నాయి. మానవ చరిత్ర పుటలను మలినం చేసిన విభ్రాంతికరమైన, ఘోరమైన సంఘటనలను చూస్తే అవి మనుషులు స్వతహాగా చేసే పనులని నిజంగా ఎవరైనా అనగలరా? లేదా అదృశ్యమైన దుష్ట దూతలు వెనకవుండి అలాంటి ఘోరమైన పనులు చేయిస్తున్నారా?
మానవ నాయకులను, ప్రపంచ ఆధిపత్యాలను గుప్పిట్లో పెట్టుకున్న వ్యక్తి ఎవరో బైబిలు సరిగ్గా గుర్తించింది, అతడి ముసుగు తీసేసింది. తెలిసో తెలియకో మానవ సమాజం దాని అధిపతి లక్షణాలను, వైఖరిని చూపిస్తోంది. ‘పాలించు లేదా నాశనం చెయ్’ అనే అతడి పద్ధతిని అవలంబిస్తోంది. అయితే, అపవాది ఆధిపత్యం కింద మానవులు ఇంకా ఎంతకాలం మగ్గాలి?
అపవాది ఎప్పుడు నాశనమౌతాడు?
మొదటి శతాబ్దంలో క్రీస్తు భూమ్మీద చేసిన పనులు చూస్తే అపవాది, అతడి దయ్యాలు త్వరలోనే నాశనం అవుతారని తెలుస్తోంది. యేసు శిష్యులు తాము దయ్యాలను ఎలా వెళ్లగొట్టారో ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన, ‘సాతాను మెరుపులా ఆకాశము నుండి పడడం చూశాను’ అని అన్నాడు. (లూకా 10:18) తను ప్రధాన దూతయైన మిఖాయేలుగా పరలోకానికి వెళ్లాక లోకాధికారి మీద సాధించబోయే విజయం గురించి ఆయన సంతోషిస్తున్నాడని ఆ మాటల్లో తెలుస్తోంది. (ప్రకటన 12:7-9) 1914లో లేదా తర్వాత కొంతకాలానికి, పరలోకంలో యేసు ఆ విజయం సాధించాడని బైబిలు ప్రవచనాలను జాగ్రత్తగా అధ్యయనం చేస్తే తెలుస్తుంది.a
అప్పటినుండి, తను నాశనమయ్యే రోజు దగ్గరపడిందని అపవాదికి తెలుసు. ‘లోకమంతా అతడి అధికారం కింద’ ఉన్నా, ప్రజలను తన చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి అతడు శతవిధాలా ప్రయత్నించినా నేడు లక్షలాదిమంది అతడి వలలో పడలేదు. ఎందుకంటే వాళ్లు బైబిలు సహాయంతో అతడి నిజ స్వరూపాన్ని, పన్నాగాలను తెలుసుకోగలిగారు. (2 కొరింథీయులు 2:11) ‘సమాధానకర్తయైన దేవుడు సాతానును మీ కాళ్ల కింద శీఘ్రంగా చితుక త్రొక్కిస్తాడు’ అని తోటి క్రైస్తవులకు పౌలు రాసిన మాటలు వాళ్లకు ఊరటనిస్తున్నాయి.b—రోమీయులు 16:20.
త్వరలో అపవాది అశక్తుడౌతాడు! క్రీస్తు ప్రేమపూర్వక పరిపాలనలో నీతిమంతులు భూమిని ఒక అందమైన తోటగా మారుస్తారు. దౌర్జన్యం, ద్వేషం, దురాశ ఇక ఎప్పటికీ ఉండవు. గతంలో జరిగిన విషయాలు ‘మరువబడతాయి’ అని బైబిలు చెబుతోంది. (యెషయా 65:17) ఈ లోకాన్ని ఏలుతున్న రహస్య అధిపతి నుండి, అతడి పరిపాలన నుండి విముక్తులమైనప్పుడు నిజంగా ఎంత ఉపశమనం పొందుతామో! (w11-E 09/01)
[అధస్సూచీలు]
a ఈ విషయం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? 215-218 పేజీలు చూడండి.
b పౌలు రాసిన ఆ మాటలు బైబిల్లోని మొదటి ప్రవచనాన్ని గుర్తుచేస్తాయి. ఆదికాండము 3:15 లో ఉన్న ఆ ప్రవచనం, అపవాది చివరకు నాశనం అవుతాడని చెబుతుంది.
[29వ పేజీలోని బ్లర్బ్]
క్రీస్తు ప్రేమపూర్వక పరిపాలనలో నీతిమంతులు భూమిని ఒక అందమైన తోటగా మారుస్తారు