కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w07 3/15 పేజీలు 26-30
  • దయ్యాలను మనమెలా ఎదిరించవచ్చు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దయ్యాలను మనమెలా ఎదిరించవచ్చు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సాతాను, దయ్యాలు ఎలా ఉనికిలోకి వచ్చారు?
  • సాతాను ఎంత శక్తిమంతుడు?
  • మనకెలాంటి కాపుదల ఉంది?
  • ‘స్థిరంగా నిలబడడం’​—ఎలా?
  • ‘ప్రతి సమయమందు ప్రార్థన చేస్తూవుండండి’
  • “దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • దేవదూతల గురించిన సత్యం
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • ‘ప్రభువునందు బలవంతులై యుండుడి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • దైవిక బోధకు దయ్యాల బోధలకు మధ్య పోరాటం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
w07 3/15 పేజీలు 26-30

దయ్యాలను మనమెలా ఎదిరించవచ్చు?

“తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాసస్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటికచీకటిలో నిత్యపాశములతో ఆయన [దేవుడు] బంధించి భద్రముచేసెను.”​—యూదా 6.

1, 2. అపవాదియగు సాతాను గురించి, దయ్యాల గురించి ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి?

“ని బ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు” అని అపొస్తలుడైన పేతురు హెచ్చరిస్తున్నాడు. (1 పేతురు 5:8) దయ్యాల గురించి అపొస్తలుడైన పౌలు ఇలా చెబుతున్నాడు: “మీరు దయ్యములతో పాలివారవుట నాకిష్టము లేదు. మీరు ప్రభువు పాత్ర లోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్లమీద ఉన్న దానిలోను దయ్యముల బల్లమీద ఉన్న దానిలోను కూడ పాలుపొందనేరరు.”​—1 కొరింథీయులు 10:20, 21.

2 ఈ అపవాదియగు సాతాను, దయ్యాలు ఎవరు? వారెలా, ఎప్పుడు ఉనికిలోకి వచ్చారు? దేవుడు వారిని సృష్టించాడా? మానవులపై వారి ప్రభావమెంత బలంగా ఉంది? వారినుండి మనకెలాంటి కాపుదల ఉంది?

సాతాను, దయ్యాలు ఎలా ఉనికిలోకి వచ్చారు?

3. ఒక దేవదూత అపవాదియగు సాతాను ఎలా అయ్యాడు?

3 మానవ చరిత్రారంభంలో, మానవులు ఏదెను తోటలో ఉంచబడినప్పుడు, ఒక దేవదూత తిరుగుబాటుదారుడయ్యాడు. ఎందుకు? ఎందుకంటే అతడు యెహోవా పరలోక ఏర్పాటులో తన పాత్రతో సంతృప్తిపడలేదు. ఆదాము హవ్వలు సృష్టించబడినప్పుడు, వారి విధేయతను, ఆరాధనను సత్యదేవుని నుండి ప్రక్కకు మళ్లించే అవకాశాన్ని అతను చూశాడు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటుచేసి, ఆ మొదటి మానవ జంట పాపభరిత విధానాన్ని అనుసరించేలా వారిని ప్రేరేపించడం ద్వారా ఆ దేవదూత తానుగా అపవాదియగు సాతాను అయ్యాడు. కొంతకాలానికి, ఇతర దేవదూతలు కూడా తిరుగుబాటుచేసి అతనితో చేతులుకలిపారు. ఎలా?​—ఆదికాండము 3:1-6; రోమీయులు 5:12; ప్రకటన 12:9.

4. నోవహు కాలంనాటి జలప్రళయానికి ముందు తిరుగుబాటు చేసిన కొందరు దేవదూతలు ఏమిచేశారు?

4 నోవహు కాలంలో సంభవించిన మహా జలప్రళయానికి కొంతకాలం ముందు, కొందరు దేవదూతలు భూమ్మీదున్న స్త్రీలపై విపరీతమైన మక్కువ చూపించడం ఆరంభించారని ప్రేరేపిత లేఖనాలు మనకు చెబుతున్నాయి. చెడు ఉద్దేశంతో ఆ “దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి” అని బైబిలు చెబుతోంది. వీరి సంయోగం ప్రకృతి విరుద్ధమైనది కావడంతో వారు నెఫీలులు అనే సంకరజాతి సంతానాన్ని కన్నారు. (ఆదికాండము 6:2-4) ఆ విధంగా దేవునికి అవిధేయులైన ఆత్మప్రాణులు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటుచేసి సాతాను పక్షం వహించారు.

5. మహా జలప్రళయం ద్వారా యెహోవా నాశనం రప్పించినప్పుడు ఆ తిరుగుబాటుదారులకు ఏమి సంభవించింది?

5 మానవులమీదికి యెహోవా జలప్రళయం రప్పించినప్పుడు, ఆ నెఫీలులు, వారి తల్లులు నాశనమయ్యారు. తిరుగుబాటు చేసిన ఆ దూతలు గత్యంతరంలేని పరిస్థితుల్లో తమ మానవ శరీరాలు మార్చుకుని ఆత్మజగత్తుకు తిరిగివెళ్లారు. అయితే వారు దేవుని దగ్గర “తమ ప్రధానత్వమును” తిరిగి పొందలేకపోయారు. బదులుగా, వారు టార్టారస్‌ అనబడే “[ఆధ్యాత్మిక] కటికచీకటిలో” బంధించబడ్డారు.​—యూదా 6; 2 పేతురు 2:4.

6. దయ్యాలు ప్రజల్నెలా మోసం చేస్తున్నారు?

6 ఆ దుష్టదూతలు తమ “ప్రధానత్వము” పోగొట్టుకున్న దగ్గరనుండి, వారు సాతానుకు దయ్యపు సహచరులుగా ఉంటూ అతని దుష్టాలోచనలకు మద్దతిస్తున్నారు. ఇక అప్పటినుండి ఆ దయ్యాలు మానవ శరీరాలు ధరించే తమ శక్తిని కోల్పోయారు. అయితే వారు వివిధరకాల లైంగిక అసభ్యక్రియల్లో పాల్గొనేలా స్త్రీపురుషులను ప్రలోభపెట్టగలరు. అలాగే దయ్యాలు అభిచారం ద్వారా కూడా మానవాళిని బహుగా మోసగిస్తున్నారు, దానిలో మంత్రవిద్యలు, ఊడూ, కర్ణపిశాచాలు వంటివి ఇమిడివున్నాయి. (ద్వితీయోపదేశకాండము 18:10-13; 2 దినవృత్తాంతములు 33:6) ఈ దుష్టదూతలకు కూడా అపవాదికి పట్టే గతే పడుతుంది, అంటే నిత్యనాశనమే. (మత్తయి 25:41; ప్రకటన 20:10) అయితే ఈలోగా మనం వారికి వ్యతిరేకంగా స్థిరంగా నిలబడాలి. సాతాను ఎంత శక్తిమంతుడో, అతణ్ణి అతని దయ్యాలను మనమెలా విజయవంతంగా నిరోధించగలమో మనం పరిశీలించడం జ్ఞానయుక్తం.

సాతాను ఎంత శక్తిమంతుడు?

7. లోకంపై సాతానుకు ఎలాంటి అధికారముంది?

7 సాతాను చరిత్రంతటిలో యెహోవాను నిందించాడు. (సామెతలు 27:11) అతను మానవుల్లో అధికశాతం మందిపై ప్రభావం చూపించాడు. “లోకమంతయు దుష్టుని యందున్నదని” 1 యోహాను 5:19 చెబుతోంది. అందుకే అపవాది “భూలోకరాజ్యములన్నిటి” అధికారాన్ని, మహిమను ఇవ్వజూపుతూ యేసును శోధించగలిగాడు. (లూకా 4:5-7) సాతాను గురించి అపొస్తలుడైన పౌలు ఇలా చెబుతున్నాడు: “మా సువార్త మరుగుచేయబడిన యెడల నశించుచున్నవారి విషయములోనే మరుగుచేయబడియున్నది. దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.” (2 కొరింథీయులు 4:3, 4) సాతాను “అబద్ధికుడు అబద్ధమునకు జనకుడు,” కానీ “తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు.” (యోహాను 8:44; 2 కొరింథీయులు 11:14) లోక పరిపాలకుల, వారి ప్రజల మనో నేత్రాలకు గ్రుడ్డితనం కలిగించేందుకు అవసరమైన పద్ధతులు, శక్తి అతనికున్నాయి. తప్పుడు సమాచారంతో, మతసంబంధ కట్టుకథలతో, అబద్ధాలతో అతడు మానవులను మోసగించాడు.

8. సాతాను ప్రభావం గురించి బైబిలు ఏమి సూచిస్తోంది?

8 మన సామాన్య శకానికి దాదాపు ఐదు శతాబ్దాల పూర్వం, దానియేలు కాలంలో సాతానుకున్న శక్తి, ప్రభావం స్పష్టమయ్యాయి. దానియేలుకు ప్రోత్సాహకరమైన సందేశాన్ని ఇచ్చేందుకు యెహోవా ఒక దూతను పంపించినప్పుడు, “పారసీకుల [ఆత్మ] రాజ్యాధిపతి” ఆ దేవదూతను నిరోధించాడు. చివరకు “ప్రధానాధిపతులలో మిఖాయేలు” వచ్చి తనకు సహాయం చేసేవరకు ఆ నమ్మకమైన దేవదూత అలా దాదాపు 21 దినములు నిరోధించబడ్డాడు. అదే వృత్తాంతం “గ్రేకేయుల దేశముయొక్క [దయ్యపు] అధిపతి” గురించి కూడా మాట్లాడుతోంది. (దానియేలు 10:12, 13, 20) ప్రకటన 13:1, 2 లో సాతాను “తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును” రాజకీయ క్రూరమృగానికి ఇస్తున్న “ఘటసర్పము”గా వర్ణించబడ్డాడు.

9. క్రైస్తవులు ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు?

9 కాబట్టి అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాయడంలో ఆశ్చర్యం లేదు: “మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.” (ఎఫెసీయులు 6:12) నేడు కూడా, దయ్యాల సమూహాలు అపవాదియగు సాతాను అధీనంలో అదృశ్యంగా పనిచేస్తూ, మానవ పరిపాలకులను, మానవాళిని ప్రభావితం చేస్తూ చెప్పనలవికాని రీతిలో జాతినిర్మూలనకు, ఉగ్రవాదానికి, హత్యలకు పాల్పడేందుకు వారిని పురికొల్పుతున్నాయి. ఈ బలమైన ఆత్మ సమూహాలను విజయవంతంగా ఎలా ఎదిరించవచ్చో మనమిప్పుడు పరిశీలిద్దాం.

మనకెలాంటి కాపుదల ఉంది?

10, 11. సాతానును, అతని దుష్టదూతలను మనమెలా ఎదిరించవచ్చు?

10 సాతానును అతని దుష్టదూతలను మనం మన సొంత శారీరక లేదా మానసిక బలంతో ఎదిరించలేం. పౌలు మనకిలా ఉపదేశిస్తున్నాడు: “ప్రభువుయొక్క మహా శక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి.” కాపుదల కోసం మనం దేవునిపై ఆధారపడాలి. పౌలు ఇంకా ఇలా చెబుతున్నాడు: “అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి. . . . మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి.”​—ఎఫెసీయులు 6:10, 11, 13.

11 “దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి” అని పౌలు రెండుసార్లు తోటి క్రైస్తవులకు ఉద్బోధించాడు. “సర్వాంగ” అనే పదం దయ్యాల ముట్టడులను ఎదిరించేందుకు అర్ధహృదయ ప్రయత్నం సరిపోదనే భావాన్నిస్తుంది. కాబట్టి, దయ్యాలను ఎదిరించేందుకు ఆధ్యాత్మిక కవచంలో ఏ ప్రాముఖ్యమైన భాగాలు నేడు క్రైస్తవులకు అత్యవసరం?

‘స్థిరంగా నిలబడడం’​—ఎలా?

12. క్రైస్తవులు సత్యాన్ని తమ నడుముకు ఎలా కట్టుకోగలరు?

12 పౌలు ఇలా వివరిస్తున్నాడు: “మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని . . . [‘స్థిరంగా,’ NW] నిలువబడుడి.” (ఎఫెసీయులు 6:14-15) ఇక్కడ దట్టి, మైమరువు అనేరెండు భాగాలు ప్రస్తావించబడ్డాయి. సైనికుడు తన నడుముకు రక్షణగా, తన ఖడ్గాన్ని పెట్టుకునేందుకు దట్టిని గట్టిగా కట్టుకోవాలి. అదే విధంగా, మనం బైబిలు సత్యానికి అనుగుణంగా జీవించేలా అది ఆ దట్టిలాగే మనల్ని గట్టిగా చుట్టుకొని ఉండాలి. ప్రతీదినం బైబిలును చదివే సమయపట్టిక మనకుందా? కుటుంబమంతా దానిలో పాల్గొంటుందా? కుటుంబమంతా కలిసి క్రమంగా దినవచనం చదివే అలవాటు మనకుందా? అంతేకాక, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” అందిస్తున్న ప్రచురణల్లోని వివరాలను ఎప్పటికప్పుడు చదివి తెలుసుకుంటున్నామా? (మత్తయి 24:45) అలా చేస్తే, మనం పౌలు ఇచ్చిన ఉపదేశాన్ని అన్వయించుకునేందుకు ప్రయత్నిస్తున్నవారిగా ఉంటాం. లేఖనాధార నిర్దేశమిచ్చే వీడియోలు, డీవీడీలు కూడా మనకున్నాయి. సత్యానికి అంటిపెట్టుకొని ఉండడం జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకునేందుకు సహాయం చేయడమేకాక, తప్పుదోవ పట్టకుండా మనల్ని కాపాడుతుంది.

13. మన అలంకార హృదయాన్ని మనమెలా కాపాడుకోవచ్చు?

13 అక్షరార్థమైన మైమరువు సైనికుని ఛాతిని, గుండెను ఇతర ప్రాణాధార అవయవాలను కాపాడుతుంది. క్రైస్తవుడు దేవుని నీతిపట్ల ప్రేమను వృద్ధిచేసుకొని, యెహోవా నీతి ప్రమాణాలకు అంటిపెట్టుకుని ఉండడం ద్వారా తన అలంకార హృదయాన్ని అంటే అంతరంగ పురుషుణ్ణి కాపాడుకోవచ్చు. దేవుని వాక్యాన్ని నీరుగార్చకుండా ఉండేలా అలంకార మైమరువు మనల్ని కాపాడుతుంది. మనం “కీడును ద్వేషించి మేలును ప్రేమి[స్తూ]” ఉన్నప్పుడు, మనం “దుష్టమార్గములన్నిటిలో నుండి” మన పాదాలను తొలగించుకుంటాం.​—ఆమోసు 5:15; కీర్తన 119:101.

14. మన “పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడు” తొడుగుకోవడం అంటే అర్థమేమిటి?

14 రోమా సామ్రాజ్యమంతటా వందల మైళ్ళు వ్యాపించివున్న ప్రధాన రహదారులపై నడిచేందుకు తగిన జోళ్లను రోమా సైనికులు తొడుగుకొనేవారు. “పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడు” అనే పదబంధం క్రైస్తవులకు ఏ భావాన్నిస్తోంది? (ఎఫెసీయులు 6:15) అంటే మనం చర్య తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అర్థం. యుక్తమైన ప్రతీ సందర్భంలో దేవుని రాజ్యసువార్తను ప్రకటించేందుకు మనం సిద్ధంగా ఉన్నాం. (రోమీయులు 10:13-15) క్రైస్తవ పరిచర్యలో చురుకుగా ఉండడం సాతాను “తంత్రముల” నుండి మనల్ని కాపాడుతుంది.​—ఎఫెసీయులు 6:11.

15. (ఎ) విశ్వాసమనే డాలు చాలా ప్రాముఖ్యమని ఏది చూపిస్తోంది? (బి) ఏ “అగ్నిబాణములు” మన విశ్వాసంపై వినాశనకర ప్రభావం చూపించగలవు?

15 “ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు” అని పౌలు చెబుతున్నాడు. (ఎఫెసీయులు 6:16) విశ్వాసమనే డాలు పట్టుకొనుమనే సలహా “ఇవన్నియుగాక” అనే మాటతో పరిచయం చేయబడడం, కవచంలోని ఈ భాగం చాలా ప్రాముఖ్యమైనదని సూచిస్తోంది. మన విశ్వాసం ఏ మాత్రం కొదువగా ఉండకూడదు. రక్షణనిచ్చే పెద్ద డాలులా అది సాతాను “అగ్నిబాణములన్నిటి” నుండి మనల్ని కాపాడుతుంది. ఇవి నేడు దేనికి ప్రతీకగా ఉన్నాయి? అవి మన విశ్వాసాన్ని బలహీనపర్చేందుకు శత్రువులు, మతభ్రష్టులు ప్రచారంచేసే అత్యంత బాధాకరమైన దూషణలను, అబద్ధాలను, అర్ధసత్యాలను సూచించగలవు. అలాగే ఈ “బాణములు” అనేక వస్తువులను కొనడంలో మునిగిపోయేలాచేసే ఐశ్వర్యాసక్తి సంబంధమైన, డాంబికమైన జీవనశైలిలో పడిపోయినవారితో పోటీపడేందుకు ప్రేరేపించే శోధనలైకూడా ఉండవచ్చు. బహుశా వారు పెద్దవైన, మరింత మెరుగైన ఇళ్లకు, వాహనాలకు లేదా ఖరీదైన తమ ఆభరణాలను డాంబికంగా చూపించేందుకు, అధునాతన ఫ్యాషన్‌ దుస్తులకు పెట్టుబడిపెట్టి ఉండవచ్చు. ఇతరులు ఏమిచేసినా ఈ “అగ్నిబాణముల” నుండి వైదొలిగేందుకు సరిపోయేంత విశ్వాసం మనకుండాలి. బలమైన విశ్వాసాన్ని మనమెలా వృద్ధిచేసుకుని కాపాడుకోగలం?​—1 పేతురు 3:3-5; 1 యోహాను 2:15-17.

16. బలమైన విశ్వాసాన్ని వృద్ధిచేసుకునేందుకు మనకేది సహాయం చేయగలదు?

16 క్రమమైన వ్యక్తిగత బైబిలు అధ్యయనం ద్వారా, మనఃపూర్వక ప్రార్థనల ద్వారా మనం దేవునికి సన్నిహితం కాగలం. బలమైన విశ్వాసం కోసం మనం యెహోవాకు ప్రార్థించి, ఆ ప్రార్థనలకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకు, మనం ప్రతీవారం కావలికోట అధ్యయనంలో భాగంవహించాలనే ఉద్దేశంతో జాగ్రత్తగా సిద్ధపడుతున్నామా? బైబిలును, బైబిలు ఆధారిత ప్రచురణలను అధ్యయనం చేసినప్పుడు మన విశ్వాసం బలంగా ఉంటుంది.​—హెబ్రీయులు 10:38, 39; 11:6.

17. మనమెలా ‘రక్షణయను శిరస్త్రాణమును ధరించుకోవచ్చు’?

17 పౌలు, ఆధ్యాత్మిక సర్వాంగ కవచాన్ని గురించిన వర్ణనను ఈ ఉపదేశంతో ముగిస్తున్నాడు: “రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి.” (ఎఫెసీయులు 6:17) శిరస్త్రాణం నిర్ణయాలు తీసుకునే కేంద్రమైన సైనికుని తలను, మెదడును కాపాడుతుంది. అదే విధంగా, మన క్రైస్తవ నిరీక్షణ మన మానసిక సామర్థ్యాలను కాపాడుతుంది. (1 థెస్సలొనీకయులు 5:8) లౌకిక లక్ష్యాలతో, ఐశ్వర్యాసక్తి స్వప్నాలతో మన మనసులను నింపుకోవడానికి బదులు, యేసులాగే మన ఆలోచనలను దేవుడిచ్చిన నిరీక్షణపై కేంద్రీకరిద్దాం.​—హెబ్రీయులు 12:1-2.

18. మన క్రమ బైబిలు పఠన కార్యక్రమాన్ని మనమెందుకు నిర్లక్ష్యం చేయకూడదు?

18 సాతాను అతని దయ్యాల ప్రభావం నుండి మనల్ని కాపాడే చివరి ఆయుధం బైబిల్లో వ్రాయబడిన దేవుని వాక్యం లేదా సందేశమే. క్రమంగా బైబిలు చదివే మన కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయకూడదనేందుకు అది మరో కారణం. సాతాను అబద్ధాల నుండి, దయ్యాల, మతభ్రష్టుల ప్రతీకార దుష్ప్రచారం నుండి మనల్ని దేవునివాక్య ప్రామాణిక జ్ఞానం కాపాడుతుంది.

‘ప్రతి సమయమందు ప్రార్థన చేస్తూవుండండి’

19, 20. (ఎ) సాతానుకు అతని దయ్యాలకు ఏమి వేచివుంది? (బి) ఏది మనల్ని ఆధ్యాత్మికంగా బలపర్చగలదు?

19 సాతానును, అతని దయ్యాలను ఈ దుష్టలోకాన్ని తొలగించే సమయం దగ్గరైంది. “తనకు సమయము కొంచెమే” ఉందని సాతానుకు తెలుసు. అతడు క్రోధంతో “దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవా[రిపై]” యుద్ధం చేస్తున్నాడు. (ప్రకటన 12:12, 17) మనం సాతానును, అతని దయ్యాలను ఎదిరించడం ఆవశ్యకం.

20 దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించమనే ఉపదేశానికి మనమెంత కృతజ్ఞులమో కదా! ఆధ్యాత్మిక కవచాన్ని గురించిన తన చర్చను పౌలు ఈ ఉపదేశంతో ముగిస్తున్నాడు: “ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.” (ఎఫెసీయులు 6:18) ప్రార్థన మనల్ని ఆధ్యాత్మికంగా బలపర్చి, మెలకువగా ఉండేందుకు మనకు సహాయం చేస్తుంది. సాతానును, అతని దయ్యాలను ఎదిరించేందుకు ప్రార్థన మనకు సహాయం చేస్తుంది కాబట్టి, పౌలు మాటలు మనల్ని ప్రభావితం చేసేందుకు అనుమతిద్దాం.

మీరేమి తెలుసుకున్నారు?

• సాతాను, అతని దయ్యాలు ఎలా ఉనికిలోకి వచ్చారు?

• అపవాదికి ఎంత అధికారముంది?

• సాతానుకు, అతని దయ్యాలకు వ్యతిరేకంగా మనకెలాంటి కాపుదల ఉంది?

• దేవుడిచ్చు సర్వాంగకవచాన్ని మనమెలా ధరించుకోవచ్చు?

[26వ పేజీలోని చిత్రాలు]

‘దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూశారు’

[28వ పేజీలోని చిత్రం]

మన ఆధ్యాత్మిక కవచంలోని ఆరు భాగాలను మీరు వివరించగలరా?

[29వ పేజీలోని చిత్రాలు]

ఈ కార్యకలాపాల్లో భాగం వహించడం సాతాను నుండి, అతని దయ్యాల నుండి మనల్నెలా కాపాడతాయి?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి