ఏదైనా ఆధ్యాత్మిక బలహీనత ఉంటే దాన్ని గుర్తించి అధిగమించడం ఎలా?
గ్రీకుల పురాణం ప్రకారం ట్రాయ్ నగరంపై చేసిన ట్రోజన్ యుద్ధంలోని గ్రీకు యోధులందర్లో అత్యంత సాహసియైనవాడు అఖీలిస్. పురాణగాథ ప్రకారం ఈ అఖీలిస్ శిశువుగా ఉన్నప్పుడు ఆయన తల్లి వాడి మడిమె పట్టుకుని స్టిక్స్ నదీజలాల్లో ముంచింది, ఆ విధంగా ఆ తల్లి తన బిడ్డను పట్టుకున్న కాలిమడిమె దగ్గర తప్ప మిగతా శరీరమంతా వజ్రకాయంలా తయారైంది. సరిగ్గా అక్కడే ట్రాయ్ దేశపు రాజైన ప్రయిమ్ కుమారుడైన పారిస్ వదిలిన బాణం తగిలి అఖీలిస్ చనిపోయాడు.
క్రైస్తవులు క్రీస్తు సైనికులు, ఒక ఆధ్యాత్మిక యుద్ధంలో పోరాడుతున్నారు. (2 తిమోతి 2:3) “మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము” అని అపొస్తలుడైన పౌలు వివరిస్తున్నాడు. అవును, మన శత్రువులు అపవాదియైన సాతాను, వాని దయ్యాలే.—ఎఫెసీయులు 6:12.
“యుద్ధశూరుడు” అని వర్ణించబడిన యెహోవా దేవుని నుండి మనం పొందే సహాయమే గనుక లేకపోయుండుంటే ఇది స్పష్టంగా ఏకపక్ష యుద్ధమే అయ్యుండేది. (నిర్గమకాండము 15:3) దుష్ట శత్రువులనుండి మనల్ని మనం కాపాడుకోవడానికి మనకు ఒక ఆధ్యాత్మిక సర్వాంగ కవచం ఇవ్వబడింది. అందుకనే అపొస్తలుడు ఇలా ప్రోద్బలపర్చాడు: “మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.”—ఎఫెసీయులు 6:11.
యెహోవా దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచం నిస్సందేహంగా ఎంతో పటిష్ఠమైనది, ఎటువంటి ఆధ్యాత్మిక దాడి జరిగినా నిలద్రొక్కుకోవడానికి సామర్థ్యం గలది. పౌలు ఇచ్చిన పట్టికను కాస్త చూడండి: సత్యము అనే దట్టి, నీతి అనే మైమరువు, సువార్త అనే జోళ్లు, విశ్వాసము అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణము, ఆత్మ అనే ఖడ్గము. ఇంతకంటే గొప్ప కవచం ఏమి అవసరం ఉంటుంది? ఇటువంటి సర్వాంగ కవచం ధరించుకుని ఎంతటి ప్రతికూల పరిస్థితులున్నా, క్రైస్తవ యోధుడు విజయాన్ని సాధించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి.—ఎఫెసీయులు 6:13-17.
యెహోవా ఇస్తున్న ఆధ్యాత్మిక సర్వాంగ కవచం ఎంతో పటిష్ఠమైనప్పటికీ, మన భద్రతకొక మూలాధారమైనప్పటికీ మనం విషయాలను తక్కువగా అంచనా వేయకూడదు. అజేయునిగా ఉండాల్సిన అఖీలిస్ను దృష్టిలో ఉంచుకుని, అఖీలిస్ మడిమెలా మనలో కూడా ఏదో బలహీనమైన ప్రాంతం ఉండే అవకాశం ఉందా? మనం అప్రమత్తంగా లేకపోతే అది ప్రాణాంతకం కాగలదు.
మీ ఆధ్యాత్మిక కవచాన్ని పరీక్షించుకోండి
ఒలింపిక్ క్రీడల్లో రెండుసార్లు బంగారు పతకాల్ని సాధించిన ఒక ఐస్ స్కేటర్, పైకి ఎంతో ఆరోగ్యవంతునిగా ఉన్నట్లు కన్పించినా, ఒక అభ్యాస తరగతిలో అకస్మాత్తుగా కూలబడిపోయి మరణించాడు. అటుతర్వాత కొద్దికాలానికి ద న్యూయార్క్ టైమ్స్‌లోని ఒక శీర్షికలో ఈ గంభీరమైన వార్త నివేదించబడింది: “ప్రతి సంవత్సరం గుండెపోటుకు గురయ్యే 6,00,000 మంది అమెరికన్లలో సగంమందికి, గుండెపోటు రావడానికి ముందు రోగలక్షణాలు కన్పించడంలేదు.” దీన్నిబట్టి చూస్తే, కేవలం మన ఒంట్లో ఎలావుందన్నదాన్నిబట్టి మన ఆరోగ్యస్థితిని నిర్ధారించలేమన్నది స్పష్టం.
మన ఆధ్యాత్మిక ఆరోగ్యం విషయంలో కూడా అదే వాస్తవం. బైబిలు ఇచ్చే సలహా ఏమిటంటే: “తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.” (1 కొరింథీయులు 10:12) మన ఆధ్యాత్మిక కవచం అత్యంత శ్రేష్ఠమైనదైనప్పటికీ బలహీనత అభివృద్ధి చెందగలదు. ఎందుకంటే మనం పాపంలో జన్మించాము, దేవుని చిత్తాన్ని చేయాలన్న మన తీర్మానాన్ని పాపభరితమైన అపరిపూర్ణమైన మన స్వభావం చాలా సులభంగా అణగద్రొక్కగలదు. (కీర్తన 51:5) మనకు సదుద్దేశాలే ఉన్నప్పటికీ, మోసకరమైన మన హృదయం కుతర్కాల్ని చేస్తూ కుంటిసాకులు చెబుతూ మన బలహీనతని చాలా సులభంగా ఉపేక్షించేలా చేసి, మన ఆధ్యాత్మిక స్థితి బాగానే ఉందని అనుకునేలా మోసం చేస్తుంది.—యిర్మీయా 17:9; రోమీయులు 7:21-23.
దానికితోడు, తప్పేంటో ఒప్పేంటో అనేవి అస్పష్టంగా తయారైన లేదా వక్రీకరించబడిన లోకంలో మనం జీవిస్తున్నాము. ఫలాని విషయం తప్పా లేక ఒప్పా అనేది దాని విషయమై ఒకరు ఎలా భావిస్తున్నారన్నదాని ఆధారంగా నిర్ధారించబడవచ్చు. ఈ రకమైన ఆలోచనా విధానం వాణిజ్య ప్రకటనల్లోను, ప్రజాదరణపొందిన వినోదాల్లోను, వార్తామాధ్యమాల్లోను బాగా ప్రోద్బలపర్చబడుతుంది. మనం గనుక జాగ్రత్తగా లేకపోతే, మనలో ఆ విధమైన ఆలోచనా విధానం జొరబడగలదు, తద్వారా మన ఆధ్యాత్మిక సర్వాంగ కవచం నెమ్మదిగా బలహీనం కాగలదు.
అటువంటి ప్రమాదకరమైన పరిస్థితిలో పడడానికి బదులుగా, మనం ఈ బైబిలు సలహాని పాటించాలి: “మీరు విశ్వాసముగలవారైయున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి.” (2 కొరింథీయులు 13:5) మనమలా చేసినప్పుడు, మనలో ఏవైనా బలహీనతలు అభివృద్ధి చెందినప్పుడు వాటిని గుర్తించి, మన శత్రువులు వాటిని పసిగట్టి వాటిపైకి దాడి చేయక ముందే వాటిని సరిచేసుకోవడానికి మనం అవసరమైన చర్యలు గైకొంటాము. అయితే, మనం అటువంటి పరీక్షను ఎలా చేసుకోగలము? ఈ ఆత్మపరిశీలనలో మనం గమనించాల్సిన రోగలక్షణాలు కొన్ని ఏమైవున్నాయి?
రోగలక్షణాలను గుర్తించడం
మన ఆధ్యాత్మిక బలహీనతను సూచించగల ఒక సామాన్యమైన లక్షణం ఏమిటంటే, మన వ్యక్తిగత పఠన అలవాట్లలో మందకొడిగా తయారుకావడం. కొంతమంది తాము బైబిలు సాహిత్యాలను ఎక్కువగా చదవాలి అని భావించినా దానికి అవసరమైన ప్రయత్నాన్ని చేస్తున్నట్టు కన్పించదు. ఆధునిక జీవనంలోని పనిరద్దీలో అటువంటి దుస్థితిలో పడిపోవడం చాలా సులభం. అయితే, కొంతమంది తమ పరిస్థితి మరీ అంత హీనంగా ఏమీ లేదనీ, ఎందుకంటే తమకు సాధ్యమైనప్పుడల్లా బైబిలు ప్రచురణలను చదువుతామనీ, కొన్ని క్రైస్తవ కూటాలకు హాజరుకాగల్గుతున్నామనీ తరచూ తర్కించడం దానికన్నా ఘోరమైన విషయం.
అటువంటి తర్కం చేయడం ఒక రకంగా తమను తాము మోసం చేసుకోవడమే. అదెలా ఉందంటే, కుదురుగా కూర్చుని సరిపడినంత భోజనం చేయడానికి కూడా సమయం లేదని భావిస్తూ, ఇక్కడొక ముద్ద అక్కడొక ముద్ద తిని, ఒకచోటినుండి మరోచోటికి హడావిడిగా పరిగెత్తే మనిషిలా ఉంది. ఆ వ్యక్తి ఆకలిబాధకు గురికాకపోయినా, ఎప్పుడో ఒకప్పుడు ఆరోగ్య సమస్యలు మాత్రం తలెత్తగలవు. అదే విధంగా, పోషణనిచ్చే ఆధ్యాత్మిక ఆహారాన్ని ఒక క్రమమైన పద్ధతిలో తీసుకోకపోతే, మన ఆధ్యాత్మిక కవచంలో కొన్ని బలహీన ప్రాంతాలు త్వరలోనే పుట్టుకొస్తాయి. ఈ లోక ప్రచారమూ, దృక్పథాలూ అదే పనిగా దాడిచేస్తుండగా, మనం ప్రాణాంతకమైన సాతాను దాడులకు సులభంగా కుప్పకూలిపోతాము.
ఆధ్యాత్మిక బలహీనతకు మరో లక్షణం ఏమిటంటే, మన ఆధ్యాత్మిక యుద్ధంలో ఇమిడివున్న అత్యవసరభావం కోల్పోవడం. శాంతి సమయంలో సైనికుడు యుద్ధంలో ఉండే ఉద్వేగాన్నీ, యుద్ధప్రమాదాన్నీ అనుభవించకపోవచ్చు. ఆ విధంగా ఆయన సిద్ధంగా ఉండాల్సిన అత్యవసరతను గుర్తించడు. అకస్మాత్తుగా యుద్ధానికి రమ్మని పిలుపు వచ్చినప్పుడు ఆయన సంసిద్ధంగా ఉండకపోవచ్చు. ఆధ్యాత్మికంగా కూడా అదే వాస్తవం. మన అత్యవసర భావాన్ని నెమ్మదిగా కోల్పోతే, మనం కూడా మనపై రాగల దాడుల్ని త్రిప్పికొట్టడానికి సంసిద్ధులముగా ఉండము.
మనం అటువంటి పరిస్థితిలో పడిపోయామో లేదో ఎలా చెప్పగలము? మన అసలు స్థితిని వెల్లడిచేసే కొన్ని ప్రశ్నలను మనకుగా మనం ప్రశ్నించుకోవచ్చు: నేను ఒక పిక్నిక్కి వెళ్ళడానికి చూపేంత సంసిద్ధతను పరిచర్య చేసేందుకు చూపిస్తానా? నేను షాపింగ్ చేయడానికో లేక టీవీ చూడడానికో ఇష్టపూర్వకంగా వెచ్చించేంత సమయాన్ని కూటాలకు సిద్ధపడడానికి వెచ్చించాలనుకుంటానా? నేను క్రైస్తవుడినైనప్పుడు నేను విడిచిపెట్టుకున్న వ్యాపకాలను గురించి లేదా అవకాశాల గురించి నేనిప్పుడు మరల ఆలోచిస్తున్నానా? ఇతరులు అనుభవించే మిథ్యా జీవితానందాల్ని చూసి నేను అసూయపడుతున్నానా? ఇవి ఆలోచనని రేకెత్తించే ప్రశ్నలు, కానీ అవి మన ఆధ్యాత్మిక సర్వాంగ కవచంలోని ఏవైనా బలహీనతలు ఉంటే వాటిని గుర్తించడానికి సహాయం చేస్తాయి.
మనల్ని కాపాడే కవచం ఆధ్యాత్మికమైనది కాబట్టి మన జీవితాల్లో దేవుని ఆత్మ స్వేచ్ఛగా ప్రవహించడం ప్రాముఖ్యం. మన కార్యకలాపాలన్నింటిలో దేవుని ఆత్మ ఫలాలు ఎంతమేరకు స్పష్టంగా కన్పిస్తున్నాయన్నదానిలో ఇది ప్రతిబింబిస్తుంది. ఇతరులు మీకు ఇష్టంలేనివి అన్నప్పుడో లేదా చేసినప్పుడో మీరు ఊరకనే చిరాకుపడటం లేదా చిర్రుబుర్రులాడటం చేస్తున్నారా? సలహాను స్వీకరించడం మీకు కష్టంగా ఉన్నట్లు భావిస్తారా, లేదా ఇతరులు ఎప్పుడు చూసిన మిమ్మల్నే విమర్శిస్తున్నట్లు అన్పిస్తుందా? ఇతరులు అనుభవిస్తున్న ఆశీర్వాదాల్ని చూసి లేదా వారు సాధించిన వాటిని చూసి మీరు అసూయతో రగిలిపోతారా? మీరు ఇతరులతో సర్దుకుపోవడం కష్టంగా ఉంటున్నట్లు భావిస్తారా, ప్రాముఖ్యంగా మీ తోటివయస్కులవారితో? నిజాయితీగా ఆత్మపరిశీలన చేసుకోవడం, మన జీవితం దేవుని ఆత్మ ఫలాలతో నిండివుందో లేక శరీర కార్యాలు నెమ్మదిగా మనలో ప్రవేశిస్తున్నాయో చూసుకోవడానికి మనకు సహాయపడుతుంది.—గలతీయులు 5:22-26; ఎఫెసీయులు 4:22-27.
ఆధ్యాత్మిక బలహీనతను అధిగమించడానికి అవసరమైన చర్యలు
ఆధ్యాత్మిక బలహీనత లక్షణాలను గుర్తించడం ఒక ఎత్తు; వాటిని ఎదుర్కొని సరిచేయడానికి చర్యలు తీసుకోవడం మరో ఎత్తు. విచారకరమైన విషయం ఏమిటంటే, చాలామంది ఏవో సాకులు చెప్పడమో, సమర్థింపుగా తర్కించడమో, సమస్యని తక్కువచేయడమో, లేక అసలు సమస్యే లేదని నిరాకరించడమో చేస్తున్నట్లుగా కన్పిస్తుంది. అదెంత ప్రమాదకరం—సర్వాంగ కవచంలోని కొన్ని భాగాలు లేకుండా యుద్ధానికి వెళ్లడంలా ఉంది ! అలా చేయడం సాతాను దాడులకు మనం గురయ్యేలా చేస్తుంది. దానికి బదులుగా మనం గమనించిన ఏవైనా లోపాల్ని సరిదిద్దుకోవడానికి అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలి. మనం ఏమి చేయగలం?—రోమీయులు 8:13; యాకోబు 1:22-25.
క్రైస్తవుని మనస్సూ హృదయమూ వశంలో ఉంచుకోవడం కూడా చేరివున్న ఆధ్యాత్మిక సమరంలో మనం పోరాడుతున్నాము గనుక మనం మన అవయవాలన్నింటినీ సంరక్షించుకోవడానికి సాధ్యమైనదంతా చేయాలి. మన ఆధ్యాత్మిక కవచంలో మన హృదయాన్ని కాపాడే “నీతి అనే మైమరువు,” మన మనస్సును కాపాడే “రక్షణ అనే శిరస్త్రాణము” ఉన్నట్లు జ్ఞప్తికి తెచ్చుకోండి. వాటిని ప్రభావవంతంగా ఉపయోగించుకోవడం ఉపయోగించుకోకపోవడానికి, జయాపజయాలకు మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉంది.—ఎఫెసీయులు 6:14-17; సామెతలు 4:23; రోమీయులు 12:2.
“నీతి అనే మైమరువు” ధరించడానికి, మనం నీతిని ఎంతగా ప్రేమిస్తున్నాము, అవినీతిని ఎంతగా ద్వేషిస్తున్నాము అనేవి ఎడతెగక పరిశీలించుకోవడం అవసరం. (కీర్తన 45:7; 97:10; ఆమోసు 5:15) మన ప్రమాణాలు లోక ప్రమాణాల స్థాయికి దిగజారాయా? ఒకప్పుడు మనల్ని దిగ్భ్రాంతిపర్చిన లేదా అభ్యంతరపర్చిన విషయాలు, నిజజీవితంలోనైనా లేక టీవీలో, సినిమాల్లో, పుస్తకాల్లో పత్రికల్లోనైనా సరే ఇప్పుడు మనల్ని వినోదపరుస్తున్నట్టు కనుగొంటున్నామా? స్వాతంత్ర్యం అనీ పురోభివృద్ధిచెందడం అనీ లోకం ఆకాశానికి ఎత్తుతున్న విషయాలు, నిజానికి విశృంఖలత్వమూ, ముసుగులోవున్న మోసమూ అని గ్రహించడానికి నీతిపట్ల మనకున్న ప్రేమ సహాయం చేస్తుంది.—రోమీయులు 13:13, 14; తీతుకు 2:12.
“రక్షణ అనే శిరస్త్రాణము” ధరించడంలో, ఈ లోకంలోని తళుకుబెళుకులు మనల్ని దారితప్పేలా చేయడానికి అనుమతించకుండా మనముందున్న అత్యద్భుతమైన ఆశీర్వాదాలను మనస్సుల్లో తేటగా ఉంచుకోవడం ఇమిడివుంది. (హెబ్రీయులు 12:2, 3; 1 యోహాను 2:16) ఈ విధమైన మనోవైఖరి ఉంచుకోవడం, మనం వస్తుసంపదలు కూడబెట్టుకోవడం కన్నా స్వంత లాభం పొందడంకన్నా, ఆధ్యాత్మిక ఆసక్తులను ముందుంచడానికి సహాయం చేస్తుంది. (మత్తయి 6:33) అందుకని, సర్వాంగ కవచంలోని ఈ భాగం మన శరీరంపై ఉన్నదని నిశ్చయపర్చుకోవడానికి, మనల్ని మనం ఇలా నిజాయితీగా ప్రశ్నించుకోవాలి: నేను నా జీవితంలో దేని వెనుక పరిగెడుతున్నాను? నాకు స్పష్టమైన ఆధ్యాత్మిక లక్ష్యాలు ఉన్నాయా? వాటిని చేరుకోవడానికి నేనేం చేస్తున్నాను? శేషించిన అభిషిక్తుల్లో సభ్యులమైనా, పెద్ద సంఖ్యలోని “గొప్ప సమూహము”లోని వారమైనా మనం పౌలును అనుకరించాలి, ఆయనిలా అన్నాడు: “నేనిదివరకే పట్టుకొనియున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురియొద్దకే పరుగెత్తుచున్నాను.”—ప్రకటన 7:9; ఫిలిప్పీయులు 3:13, 14.
ఆధ్యాత్మిక సర్వాంగ కవచాన్ని గురించిన పౌలు వర్ణన ఈ ప్రబోధంతో ముగుస్తుంది: “ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.” (ఎఫెసీయులు 6:18) ఏదైనా ఆధ్యాత్మిక బలహీనతను అధిగమించడానికి లేక నివారించడానికి మనం తీసుకోగల రెండు యుక్తమైన చర్యల్ని అది సూచిస్తుంది: మొదటిది, దేవునితో మంచి సంబంధాన్ని అభివృద్ధిచేసుకోవడం, రెండవది తోటి క్రైస్తవులతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పర్చుకోవడం.
“ప్రతి విధమైన” ప్రార్థనలతో (మన పాపాల్ని ఒప్పుకోవడం, క్షమాపణ కోసం విన్నవించుకోవడం, నడిపింపును కోరడం, ఆశీర్వాదాలిచ్చినందుకు కృతజ్ఞతలు తెల్పడం, హృదయపూర్వకంగా స్తుతులు చెల్లించడం), “ప్రతి సమయమునందు” (బహిరంగంగా, ఆంతరంగికంగా, ఒంటరిగా, సహజసిద్ధంగా) చేసే ప్రార్థనలతో యెహోవావైపుకి తిరిగే అలవాటు మనకు ఉంటే మనం యెహోవాతో ఆంతరంగిక సంబంధాన్ని పెంపొందించుకుంటాము. మనకు లభించగల అత్యంత శ్రేష్ఠమైన కాపుదల అదే.—రోమీయులు 8:31; యాకోబు 4:7, 8.
మరోవైపున, “సమస్త పరిశుద్ధుల నిమిత్తము,” అంటే మన తోటి క్రైస్తవుల నిమిత్తము ప్రార్థన చేయుమని ప్రబోధించబడ్డాము. సుదూర ప్రాంతాల్లో హింసల్నీ లేదా మరితర కష్టాల్నీ అనుభవిస్తున్న మన ఆధ్యాత్మిక సహోదరుల్ని మన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే మనం ప్రతిదినం కలిసి పనిచేసే సహవసించే క్రైస్తవుల సంగతేమిటి? వారి నిమిత్తం కూడా ప్రార్థించడం యుక్తమైనదే, యేసు కూడా తన శిష్యుల కోసం ప్రార్థన చేశాడు. (యోహాను 17:9; యాకోబు 5:16) అటువంటి ప్రార్థనలు మనల్ని దగ్గరకు చేరుస్తాయి, “దుష్టుని” దాడుల్ని తట్టుకునేలా మనల్ని బలపరుస్తాయి.—2 థెస్సలొనీకయులు 3:1-3, అధఃస్సూచి.
చివరిగా, అపొస్తలుడైన పేతురు ఇచ్చిన ప్రబోధాన్ని మనస్సుల్లో స్థిరంగా ఉంచుకోండి: “అన్నిటి అంతము సమీపమైయున్నది. కాగా మీరు స్వస్థబుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.” (1 పేతురు 4:7, 8) మానవ అపరిపూర్ణతలు—ఇతరులవీ మనవీ—మన హృదయాల్లోకీ మనస్సుల్లోకీ చొచ్చుకొనిపోయేలా, అటుతర్వాత అవి అవాంతరాలుగా, అభ్యంతరాలకు కారణాలుగా తయారయ్యేలా అనుమతించడం చాలా సులభం. మానవునికున్న ఈ బలహీనత గురించి సాతానుకు బాగా తెలుసు. విభజించి, పాలించు అనేది వాడి జిత్తులమారితనంతో కూడిన కుయుక్తుల్లో ఒకటి. అందుకని మనం అటువంటి పాపాల్ని ఒకరిపట్ల ఒకరికి ఉండే మిక్కటమైన ప్రేమతో త్వరితంగా కప్పేసి ‘అపవాదికి చోటియ్యకుండా’ ఉండాలి.—ఎఫెసీయులు 4:25-27.
ఇప్పుడే ఆధ్యాత్మికంగా బలంగా ఉండండి
మీ జుత్తు చెరిగిపోయిందనో లేక మీ టై వంకరగా ఉందనో మీరు గమనిస్తే, మీరేం చేస్తారు? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సరిచేసుకుంటారు. అటువంటి అల్పమైన విషయాల్ని అంతగా పట్టించుకోవల్సిన అవసరం లేదని ఎవరూ అలాగే వదిలేయరు. మన ఆధ్యాత్మిక బలహీనతల విషయానికి వచ్చినప్పుడు మనం కూడా అంతే త్వరగా ప్రతిస్పందిద్దాము. శారీరక లోపాల్ని చూసి ఇతరులు ముఖం చిట్లించుకోవచ్చు, కానీ ఆధ్యాత్మిక లోపాల్ని సరిచేసుకోకపోతే దాని ఫలితంగా యెహోవా తిరస్కారాన్నే అనుభవించాల్సిరావచ్చు.—1 సమూయేలు 16:7.
ఏవైనా ఆధ్యాత్మిక బలహీనతలు ఉంటే వాటిని కూకటి వ్రేళ్ళతో తీసివేసుకుని ఆధ్యాత్మికంగా బలంగా తయారుకావడంలో సహాయపడడానికి కావల్సినవన్నీ యెహోవా ప్రేమపూర్వకంగా మనకు ఇచ్చాడు. క్రైస్తవ కూటాలద్వారా, బైబిలు ప్రచురణల ద్వారా, పరిణతిచెందిన శ్రద్ధను చూపే తోటి క్రైస్తవుల ద్వారా ఆయన మనం ఏమి చేయాలో చెప్పడానికి నిరంతరాయంగా జ్ఞాపికల్నీ నిర్దేశాల్నీ ఇస్తున్నాడు. వాటిని స్వీకరించి అన్వయించుకోవడం మనపై ఉంది. అందుకు ప్రయత్నం, మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకోవడం అవసరం. కానీ అపొస్తలుడైన పౌలు నిజాయితీగా ఏమి చెప్పాడో జ్ఞాపకం చేసుకోండి: “నేను గురి చూడనివానివలె పరుగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోపరచుకొనుచున్నాను.”—1 కొరింథీయులు 9:26, 27.
అప్రమత్తంగా ఉండండి, సూచనార్థకమైన అఖీలిస్ మడిమె ఎన్నడూ ఏర్పడకుండా చూసుకోండి. దానికి బదులుగా నమ్రతతో ధైర్యంతో, మనకు ఉన్న ఏదైనా ఆధ్యాత్మిక బలహీనతను గుర్తించడానికీ, దాన్ని అధిగమించడానికీ ఇప్పుడు అవసరమైనది చేద్దాము.
[19వ పేజీలోని చిత్రం]
“మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి.”—2 కొరింథీయులు 13:5.
[21వ పేజీలోని చిత్రం]
“ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైనప్రేమగలవారై యుండుడి.”—1 పేతురు 4:7, 8.
[20వ పేజీలోని బాక్సు]
మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి . . .
◆ నేను షాపింగ్ చేయడానికో లేక టీవీ చూడడానికో ఇష్టపూర్వకంగా వెచ్చించేంత సమయాన్ని కూటాలకు సిద్ధపడడానికి వెచ్చించాలనుకుంటానా?
◆ ఇతరులు అనుభవించే మిథ్యా జీవితానందాల్ని చూసి నేను అసూయపడుతున్నానా?
◆ ఇతరులు నాకు ఇష్టంలేనివి అన్నప్పుడో లేదా చేసినప్పుడో నేను ఊరకనే చిరాకుపడుతున్నానా?
◆ సలహాను స్వీకరించడం నాకు కష్టంగా ఉన్నట్లు భావిస్తున్నానా, లేదా ఇతరులు ఎప్పుడు చూసినా నన్నే విమర్శిస్తున్నట్లు నేను భావిస్తున్నానా?
◆ ఇతరులతో సర్దుకుపోవడం కష్టంగా ఉన్నట్లు భావిస్తున్నానా?
◆ నా ప్రమాణాలు లోక ప్రమాణాలస్థాయికి దిగజారిపోయాయా?
◆ నాకు స్పష్టమైన ఆధ్యాత్మిక లక్ష్యాలు ఉన్నాయా?
◆ నా ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవడానికి నేనేం చేస్తున్నాను?
[18వ పేజీలోని చిత్రసౌజన్యం]
Achilles: From the book Great Men and Famous Women; Roman soldiers and page 21: Historic Costume in Pictures/Dover Publications, Inc., New York