యౌవనస్థులారా—లోకాత్మను ఎదిరించండి
“మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము.”—1 కొరింథీయులు 2:12.
1, 2. (ఎ) లోకంలోని యౌవనస్థులకు, యెహోవాసాక్షుల సంఘాల్లోని యౌవనస్థులకు మధ్య ఎటువంటి తేడాను గమనించగలము? (బి) యెహోవాసాక్షులైన యౌవనస్థుల్లోని అత్యధికులను ఏమని హృదయపూర్వకంగా మెచ్చుకోవచ్చును?
“మన యువతరంలో స్ఫూర్తి నశించింది, అది తిరస్కృతికి గురైంది, తిరుగుబాటు చేస్తోంది.” ఆస్ట్రేలియా వార్తాపత్రిక అయిన ద సన్-హెరాల్డ్ అలా ప్రకటించింది. అది ఇంకా ఇలా అంటోంది: “దౌర్జన్యాలు చేశారన్న దోషారోపణలు చేయబడిన యౌవనస్థుల సంఖ్యలో [గత సంవత్సరం కన్నా] 22 శాతం పెరుగుదల ఉందని కోర్టు రికార్డులు చూపిస్తున్నాయి . . . 60లలో కన్నా మూడింతలు ఎక్కువమంది యౌవనస్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు . . . తరాల మధ్య అంతరం ఒక పెద్ద అగాధంలా మారడంతో అధిక సంఖ్యలో యౌవనస్థులు మాదకద్రవ్యాలు, మత్తుపానీయాలు, ఆత్మహత్యలతో ప్రజల స్మృతి పథంలోనుండి కనుమరుగైపోతున్నారు.” అయితే ఈ పరిస్థితి ఏ ఒక్క దేశానికీ పరిమితమై లేదు. లోకమంతటా ఎక్కడ చూసినా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మానసిక-ఆరోగ్య నిపుణులు యౌవనస్థుల స్థితిని చూసి ఆందోళన చెందుతున్నారు.
2 నేటి యౌవనస్థుల్లో అనేకులకూ, యెహోవాసాక్షుల సంఘాల్లో కనిపించే ఆరోగ్యకరమైన యౌవనస్థులకూ మధ్య ఎంత గొప్ప తేడావుంది! వారు పరిపూర్ణులని కాదు. వారు కూడా “యౌవనేచ్ఛల”తో పోరాడవలసి ఉంటుంది. (2 తిమోతి 2:22) కానీ ఒక గుంపుగా, ఈ యౌవనస్థులు సరైనది చేయటానికి ధైర్యంగా నిశ్చయించుకున్నారు, ఈ లోక ఒత్తిళ్ళకు లొంగిపోవడానికి తిరస్కరించారు. సాతాను “తంత్రముల”కు విరుద్ధంగా చేసే యుద్ధంలో విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగిపోతున్న యౌవనస్థులైన మిమ్మల్నందరినీ మేము హృదయపూర్వకంగా మెచ్చుకుంటున్నాము! (ఎఫెసీయులు 6:11) అపొస్తలుడైన యోహానులా, మేము కూడా ఇలా అనకుండా ఉండలేకపోతున్నాము: “యౌవనస్థులారా, మీరు బలవంతులు, దేవునివాక్యము మీయందు నిలుచుచున్నది; మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను.”—1 యోహాను 2:14.
3. “ఆత్మ” అనే పదానికి ఏమని అర్థం చెప్పవచ్చు?
3 అయితే, దుష్టునికి విరుద్ధంగా మీరు చేసే యుద్ధంలో జయిస్తూనే ఉండటానికి మీరు, “లౌకికాత్మ” అని బైబిలు పిలిచేదాన్ని యథాశక్తి ఎదిరిస్తూ ఉండాలి. (1 కొరింథీయులు 2:12) ఒక గ్రీకు భాషా అధికారిక గ్రంథం ప్రకారం, “ఆత్మ” అని అనువదించబడిన గ్రీకు పదం, “ఒక వ్యక్తిలో నిండుకొని, ఆయన్ని నడిపించే వైఖరి లేదా స్ఫూర్తి” అనే అర్థాన్నివ్వగలదు. ఉదాహరణకు, ఎవరైనా జగడాలమారిని చూసినప్పుడు గ్రీకులో ఆయనకు చెడ్డ “ఆత్మ” ఉందని, అంటే చెడ్డ స్వభావం ఉందని అనవచ్చును. మీ “ఆత్మ”—అంటే మీ స్వభావం లేదా మీ మానసిక వైఖరి—మీరు చేసే ఎంపికలను ప్రభావితం చేస్తుంది; అది మీ చర్యలనూ మీ మాటలనూ నడిపిస్తుంది. ఆసక్తికరంగా, ప్రజలు అటు వ్యక్తిగతంగాను ఇటు ఒక గుంపుగాను ఒక విధమైన “ఆత్మ”ను ప్రదర్శించగలరు. అపొస్తలుడైన పౌలు ఒక క్రైస్తవుల సమూహానికి ఇలా వ్రాశాడు: “మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై యుండును గాక.” (ఫిలేమోను 25) కాబట్టి, ఈ లోకం ప్రదర్శించే ఆత్మ ఏమిటి? “లోకమంతయు దుష్టుని యందు” అంటే అపవాదియైన సాతాను వశములో ఉన్నది గనుక, ఈ లోకాత్మ ఆరోగ్యకరమైనది అయివుండదు, అవునా?—1 యోహాను 5:19.
లోకాత్మను గుర్తించటం
4, 5. (ఎ) క్రైస్తవులు కాకమునుపు ఎఫెసు సంఘంలోనివారిని ఏ ఆత్మ ప్రభావితం చేసింది? (బి) “వాయుమండల సంబంధమైన అధికారానికి అధిపతి” ఎవరు, ‘వాయుమండలం’ ఏమిటి?
4 పౌలు ఇలా వ్రాశాడు: “మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను. మీరు వాటిని చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని, [“వాయుమండల సంబంధమైన అధికారానికి అధిపతిని,” NW] అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమవారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైయుంటిమి.”—ఎఫెసీయులు 2:1-3.
5 క్రైస్తవ మార్గాన్ని కనుగొనక మునుపు ఎఫెసులోని క్రైస్తవులు తమకు తెలియకుండానే “వాయుమండల సంబంధమైన అధికారానికి అధిపతిని” అంటే అపవాదియైన సాతానును అనుసరించారు. ఆ ‘వాయుమండలం’ సాతానూ, వాని దయ్యాలూ నివసించే ఏదో అక్షరార్థమైన స్థలం కాదు. పౌలు ఆ మాటల్ని వ్రాసినప్పుడు అపవాదియైన సాతానుకూ, వాని దయ్యాలకూ ఇంకా పరలోకంలోనికి ప్రవేశం ఉంది. (పోల్చండి యోబు 1:6; ప్రకటన 12:7-12.) ‘వాయుమండలం’ అన్న మాటకు, సాతానుకు చెందిన లోకంలో ప్రబలంగా ఉన్న ఆత్మ, లేదా మనోవైఖరి అని అర్థం. (పోల్చండి ప్రకటన 16:17-21.) మన చుట్టూ ఉన్న వాయువులా ఈ ఆత్మ సర్వవ్యాప్తమై ఉంది.
6. ‘వాయుమండల సంబంధమైన అధికారం’ ఏమిటి, అది అనేకమంది యౌవనస్థులపై ఎలా చెలాయించబడుతుంది?
6 కానీ ‘వాయుమండల సంబంధమైన అధికారం’ ఏమిటి? ఇది స్పష్టంగా ప్రజలపై ఆ ‘వాయువు’ చూపించే గొప్ప ప్రభావాన్ని సూచిస్తుంది. ఈ ఆత్మ, ‘అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తి’గా ఉందని పౌలు అన్నాడు. కాబట్టి ఈ లోకాత్మ అవిధేయతనూ తిరుగుబాటునూ పుట్టిస్తుంది, తోటివారి ఒత్తిడి అనేది ఈ అధికారం చెలాయించబడే ఒక విధానం. యౌవనస్థురాలైన ఒక యెహోవాసాక్షి ఇలా చెబుతుంది: “స్కూల్లో ఉన్నప్పుడు, కాస్తంత తిరుగుబాటు చేయమని ప్రతి ఒక్కరూ ప్రోత్సహిస్తారు. తిరుగుబాటు అని చెప్పగల దేన్నైనా చేసినప్పుడు మిగతా పిల్లలు ఎక్కువ గౌరవిస్తారు.”
లోకాత్మ రూపాలు
7-9. (ఎ) ఈ లోకాత్మ నేటి యౌవనస్థుల్లో ప్రదర్శితమౌతున్న కొన్ని విధాలను పేర్కొనండి. (బి) వీటిలో దేన్నైనా స్థానికంగా మీరు గమనించారా?
7 నేడు యౌవనస్థుల్లో కనబడే ఈ లోకాత్మకుగల కొన్ని రూపాలు ఏమిటి? నిజాయితీ లేకపోవడం, తిరుగుబాటు ధోరణి. కాలేజీ జూనియర్లూ సీనియర్లలో 70 శాతంమంది తాము హైస్కూల్లో ఉన్నప్పుడు కాపీలు కొట్టినట్లు చెప్పారని ఒక పత్రికా నివేదిక చెప్పింది. అమర్యాదకరంగా మాట్లాడటం, వ్యంగ్యంగా మాట్లాడటం, బూతులు మాట్లాడటం కూడా సర్వవ్యాప్తంగా ఉంది. నిజమే, కొన్ని సందర్భాల్లో యోబు, అపొస్తలుడైన పౌలు నీతియుక్తమైన ఉగ్రతను వ్యక్తం చేయడానికి కొందరు వ్యంగ్యం అని దృష్టించే మాటల్ని ఉపయోగించారు. (యోబు 12:2; 2 కొరింథీయులు 12:13) అయితే, నేడు అనేకమంది యౌవనస్థుల నోళ్ళలోంచి వెలువడుతున్న క్రూరమైన వ్యంగ్యం తరచు బూతుల క్రిందికి వస్తుంది.
8 వినోద కార్యకలాపాల్లో అతిగా పాల్గొనడం కూడా ఈ లోకాత్మకు మరో రూపం. యౌవనస్థుల నైట్‌క్లబ్బులు, రేవ్‌లు,a మరితర రకాలైన విశృంఖలమైన వినోద కార్యకలాపాలు యౌవనస్థుల్లో బాగా ఆదరణ పొందాయి. వస్త్రధారణలోను కేశాలంకరణలోను అతిగా పోవడం కూడా అలాగే సర్వవ్యాప్తంగా ఉన్నాయి. వదులుగా వేలాడుతూ ఉండే ర్యాప్ స్టైళ్ళ నుండి శరీరాన్ని చువ్వలతో గుచ్చుకునే విభ్రాంతికరమైన వేలంవెఱ్ఱి పద్ధతుల వరకు నేటి యువతలో అధికశాతం ఈ లోకంలో ఉన్న తిరుగుబాటు ఆత్మను ప్రదర్శిస్తుంది. (పోల్చండి రోమీయులు 6:16.) వస్తుసంపదల్ని కూడగట్టుకోవడంలో నిమగ్నం అయిపోవడం మరో రూపం. ఒక విద్యా పత్రిక ప్రకారం, “వ్యాపారస్థులు పిల్లలమీదికి భయంకరమైన టెక్నిక్కులతో అన్నివైపుల నుండీ దాడిచేస్తున్నారు, తమ ఉత్పత్తుల వెల్లువతో ముంచెత్తుతున్నారు.” అమెరికాలోని యౌవనస్థులు హైస్కూలు నుండి ఉత్తీర్ణులయ్యే నాటికి 3,60,000 టీవీ వాణిజ్య ప్రకటనల్ని చూసివుంటారు. మీ తోటివారు కూడా కొన్ని వస్తువుల్ని కొనుగోలు చేయమని మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు. పద్నాలుగేళ్ళ ఒక అమ్మాయి ఇలా చెబుతుంది: “‘నీవు వేసుకున్న స్వెట్టర్ ఏ తయారీ, కోటు ఏ కంపెనీది, జీన్స్ ఏ బ్రాండుది?’ అని ప్రతి ఒక్కరూ అడగటమే.”
9 బైబిలు కాలాల నుండే, అనైతికమైన ప్రవర్తనను రేకెత్తించడానికి ఆరోగ్యకరం కాని సంగీతం సాతాను ఉపయోగించుకునే ఉపకరణంగా ఉంది. (పోల్చండి నిర్గమకాండము 32:17-19; కీర్తన 69:12; యెషయా 23:16.) లైంగిక కోర్కెలను రేకెత్తించే, చివరికి పచ్చిగా ఉన్న పాటలతో అసభ్యకరమైన పదజాలంతో కూడిన సంగీతం, ఉద్రేకాన్ని కల్గించే లయబద్ధమైన సంగీతం బాగా ప్రజాదరణ పొందటంలో అంత ఆశ్చర్యంలేదు. అయితే ఈ లోకంలోని అపరిశుభ్రమైన ఆత్మకుగల మరో రూపం లైంగిక అనైతికత. (1 కొరింథీయులు 6:9-11) ద న్యూయార్క్ టైమ్స్ ఇలా నివేదిస్తుంది: “అనేకమంది యౌవనస్థులకు తాము తోటివారికి ఆమోదయోగ్యంగా ఉండాలనుకుంటే సెక్స్‌లో అనుభవం ఉండి తీరాల్సిందే . . . హైస్కూల్లోని సీనియర్లలో మూడింట రెండువంతుల మంది లైంగిక సంబంధాన్ని అనుభవించారు.” ద వాల్ స్ట్రీట్ జర్నల్‌లోని ఒక శీర్షిక 8 నుండి 12 ఏండ్ల వయస్సుగల పిల్లలు “లైంగికంగా క్రియాశీలంగా తయారౌతున్నారనడానికి” ఆధారాలను పేర్కొంది. ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన స్కూలు సలహాదారు ఒకామె ఇలా అంటుంది: “ఆరవ తరగతికి చెందిన గర్భవతులైన అమ్మాయిలు కనబడటం ప్రారంభమైంది.”b
లోకాత్మను తిరస్కరించటం
10. క్రైస్తవ కుటుంబాల్లోని కొందరు యౌవనస్థులు లోకాత్మకు ఎలా తల ఒగ్గారు?
10 విచారకరంగా, కొందరు క్రైస్తవ యౌవనస్థులు ఈ లోకాత్మకు తల ఒగ్గారు. “నేను నా తల్లిదండ్రుల ఎదుట, తోటి క్రైస్తవుల ఎదుట చక్కని వైఖరిని ప్రదర్శించాను” అని జపానుకు చెందిన అమ్మాయి ఒప్పుకుంటుంది. “కానీ నేను వేరే జీవితాన్ని కూడా గడిపేదాన్ని” అంటుందామె. కెన్యాలోని ఒక అమ్మాయి ఇలా అంటుంది: “నేను కొంతకాలంపాటు ద్వంద్వ జీవితాన్ని గడిపాను, నా చీకటి కోణంలో పార్టీలు, రాక్ సంగీతం, చెడు సహవాసాలు వంటివి ఉన్నాయి. ఇది తప్పని నాకు తెలుస్తునే ఉంది, కానీ కొంతకాలానికి అదంతా సమసిపోతుందని ఆశిస్తూ నిర్లక్ష్యం చేశాను. కానీ అలా జరగలేదు. పరిస్థితులు ఇంకా ఘోరంగా మారాయి.” జర్మనీలోని మరో అమ్మాయి ఇలా చెబుతుంది: “అదంతా చెడు సహవాసాలతో ప్రారంభమయ్యింది. అప్పుడు నేను పొగత్రాగటం ప్రారంభించాను. నేను నా తల్లిదండ్రులను గాయపర్చాలనుకున్నాను, కానీ చివరికి నన్ను నేనే గాయపర్చుకున్నాను.”
11. పదిమంది వేగులవారు చెడ్డ నివేదికను తీసుకువచ్చినప్పుడు అందరూ ఏమంటే తనూ అదే అనడానికి కాలేబు ఎలా నిరాకరించగలిగాడు?
11 అయినప్పటికీ, లోకాత్మను ఎదిరించటం, చివరికి తిరస్కరించటం సాధ్యమే. ప్రాచీనుడైన కాలేబు మాదిరిని పరిశీలించండి. పదిమంది పిరికి వేగులవారు వాగ్దత్త దేశాన్ని గురించిన చెడ్డ నివేదికను తీసుకువచ్చినప్పుడు, యెహోషువ ఆయనా ఏమాత్రం బెదిరిపోకుండా గుంపుతో చేరిపోవటానికి నిరాకరించారు. వారిద్దరూ ధైర్యంగా ఇలా అన్నారు: “మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మనయందు ఆనందించినయెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును; అది పాలు తేనెలు ప్రవహించుదేశము.” (సంఖ్యాకాండము 14:7, 8) కాలేబు ఆ ఒత్తిడిని తట్టుకుని దాన్ని ఎదిరించటానికి ఏమి సహాయపడింది? యెహోవా కాలేబును గురించి ఇలా చెప్పాడు: ‘ఆయనకు భిన్నమైన ఆత్మ ఉన్నది.’—సంఖ్యాకాండము 14:24, NW.
‘భిన్నమైన ఆత్మను’ కనపర్చడం
12. మాట్లాడే విషయంలో “భిన్నమైన ఆత్మ”ను కనపర్చడం ఎందుకు ప్రాముఖ్యం?
12 నేడు, ‘భిన్నమైన ఆత్మను’ కనపర్చడానికి, అంటే ఈ లోకవైఖరికి భిన్నమైన మనోవైఖరిని కనపర్చడానికి ధైర్యము బలము అవసరమౌతాయి. మీరు ఆ విధంగా చేయడానికి ఒక మార్గం ఏమిటంటే వ్యంగ్యంగాను అగౌరవంగాను మాట్లాడకుండా ఉండటమే. ఆసక్తికరంగా, “వ్యంగ్యం” అనే అర్థాన్నిచ్చే గ్రీకు పదమైన సర్కాస్‌మోస్ అక్షరార్థంగా “కుక్కల్లా కరచుకుంటూ కండల్ని పట్టి చీల్చడం” అని అర్థం వచ్చే గ్రీకు క్రియాపదం నుండి వచ్చింది. (పోల్చండి గలతీయులు 5:15.) ఎముకకు అంటిపెట్టుకుని ఉన్న కండని కుక్క ఎలాగైతే తన కోరలతో చీలుస్తుందో, అలాగే వ్యంగ్యంతో కూడిన “హాస్యం” ఇతరుల గౌరవాన్ని దిగజార్చగలదు. కానీ కొలొస్సయులు 3:8, “ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి” అని ఉద్బోధిస్తుంది. సామెతలు 10:19 ఇలా చెబుతుంది: “విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.” ఎవరైనా మిమ్మల్ని అవమానపరిస్తే, మీ హృదయాన్ని గాయపర్చిన వ్యక్తితో బహుశ ప్రశాంతంగా శాంతియుతంగా వ్యక్తిగతంగా మాట్లాడటం ద్వారా అతని వైపుకి ‘ఎడమచెంప కూడా’ త్రిప్పగలిగేంత ఆత్మనిగ్రహాన్ని కల్గివుండండి.—మత్తయి 5:39; సామెతలు 15:1.
13. వస్తుసంపదల పట్ల సమతుల్యమైన వైఖరిని యౌవనస్థులు ఎలా కనపర్చగలరు?
13 ‘భిన్నమైన ఆత్మను’ కనపర్చడానికి మరో మార్గం, వస్తుసంపదల విషయంలో సమతుల్యమైన దృక్కోణాన్ని కలిగివుండటమే. నిజమే, మంచి వస్తువులు కల్గివుండాలనుకోవడం స్వాభావికమే. యేసు క్రీస్తుకు కనీసం ఒక్క మంచి నాణ్యతగల వస్త్రం ఉండేదని స్పష్టమౌతుంది. (యోహాను 19:23, 24) అయితే, వస్తుసంపదల్ని సంపాదించటం ఎప్పుడైతే ఒక విపరీతమైన ఆశగా మారిపోతుందో, మీ తల్లిదండ్రులకు కొనే తాహతు నిజానికి లేకపోయినా కొనమని వారిని పీడిస్తుంటే లేదా మీ తోటివయస్కులను అనుకరించాలన్న ఉద్దేశంతో వారికున్నలాంటి వస్తువుల్ని కొనమని మీ తల్లిదండ్రుల్ని పీడిస్తుంటే అప్పుడు ఈ లోకాత్మ మీపైన మీరూహించిన దానికన్నా ఎక్కువగా అధికారం చెలాయిస్తున్నట్లు అర్థం. బైబిలు ఇలా చెబుతుంది: “లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.” అవును, వస్తుసంపదల వెంటపడే ఈ లోకాత్మ అధికారానికి లొంగిపోకండి! మీకున్న వాటితో సంతృప్తి పడటం నేర్చుకోండి.—1 యోహాను 2:16; 1 తిమోతి 6:8-10.
14. (ఎ) యెషయా కాలంలోని దేవుని ప్రజలు వినోదం విషయంలో సమతుల్యంలేని దృక్కోణాన్ని ఎలా ప్రదర్శించారు? (బి) నైట్‌క్లబ్బుల్లోను విశృంఖలమైన పార్టీల్లోను కొంతమంది క్రైస్తవ యౌవనస్థులు ఏ ప్రమాదాల్ని ఎదుర్కొన్నారు?
14 వినోదాన్ని తగిన స్థానంలో ఉంచటం కూడా ప్రాముఖ్యం. ప్రవక్త అయిన యెషయా ఇలా ప్రకటించాడు: “మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాల రాత్రివరకు పానముచేయువారికి శ్రమ. వారు సితారా స్వరమండల తంబుర సన్నాయలను వాయంచుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురుగాని యెహోవా పని యోచింపరు ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు.” (యెషయా 5:11, 12) విచారకరంగా కొందరు క్రైస్తవ యౌవనస్థులు అటువంటి విశృంఖలమైన పార్టీల్లో పాల్గొన్నారు. యౌవనస్థుల నైట్‌క్లబ్బుల్లో ఏమి జరుగుతుందో వర్ణించమని క్రైస్తవ యౌవనస్థులతో కూడిన ఒక గుంపుని అడిగినప్పుడు ఒక యౌవన సహోదరి ఇలా చెప్పింది: “ఎప్పుడూ దెబ్బలాటలు జరుగుతుంటాయి. నేను కూడా కొన్నిసార్లు ఇరుక్కున్నాను.” మరో యౌవన సహోదరుడు ఇలా అన్నాడు: “తాగటం, సిగరెట్లు కాల్చడం, ఇంకా అలాంటివి జరుగుతాయి.” ఒక యౌవన సహోదరుడు ఇలా ఒప్పుకున్నాడు: “అందరూ విపరీతంగా తాగుతారు. బుద్ధిహీనుల్లా ప్రవర్తిస్తారు! డ్రగ్స్ కూడా ఉంటాయి. చాలా ఘోరమైన విషయాలు జరుగుతాయి. అక్కడికి వెళ్లినా, దాని ప్రభావం నామీద పడదు అనుకుంటే మీరు పొరబడ్డారని అర్థం.” అందుకనే, బైబిలు కారణయుక్తంగానే అల్లరితో కూడిన ఆటపాటల్ని, లేదా “విశృంఖలమైన పార్టీలను” ‘శరీరకార్యాల్లో’ ఒకటిగా పేర్కొంటుంది.—గలతీయులు 5:19-21; బైయింగ్‌టన్; రోమీయులు 13:13.
15. బైబిలు వినోదం విషయంలో ఎటువంటి సమతుల్యత గల దృక్కోణాన్ని ఇస్తుంది?
15 హానికరమైన వినోదానికి దూరంగా ఉండటం మీ జీవితంలోని ఆనందాన్ని హరించివేయదు. మనం “ఆనందంగల దేవుణ్ని” ఆరాధిస్తున్నాము, ఆయన మీరు మీ యౌవనాన్ని ఆనందంగా అనుభవించాలని కోరుతున్నాడు ! (1 తిమోతి 1:11; NW; ప్రసంగి 11:9) కానీ బైబిలు ఇలా హెచ్చరిస్తుంది: “సుఖభోగములయందు [“వినోదమంటే,” లమ్సా] వాంఛగలవానికి లేమి కలుగును.” (సామెతలు 21:17) అవును, మీ జీవితంలో వినోదాన్నే ప్రధానాంశంగా చేసుకుంటే మీకు ఆధ్యాత్మిక లేమి కలుగుతుంది. అందుకని మీరు వినోదాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు బైబిలు సూత్రాలను పాటించండి. మీకు చెరుపు చేయకుండా క్షేమాభివృద్ధిని మాత్రమే కలుగజేసే విధంగా మీరు ఆనందాన్ని పొందటానికి చాలా మార్గాలున్నాయి.c—ప్రసంగి 11:10.
16. క్రైస్తవ యౌవనస్థులు తాము భిన్నమైనవారమని ఎలా చూపించవచ్చు?
16 మీ వస్త్రధారణలోను, కేశాలంకరణలోను నమ్రతను ప్రదర్శించటం, ఈ లోకంలోని వెఱ్ఱి స్టైళ్ళను తిరస్కరించటం కూడా మిమ్మల్ని భిన్నమైనవారిగా గుర్తిస్తుంది. (రోమీయులు 12:2; 1 తిమోతి 2:9) అదే విధంగా మీరు సంగీతం ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండటం కూడా మీరు భిన్నమైన ఆత్మగలవారని గుర్తిస్తుంది. (ఫిలిప్పీయులు 4:8, 9) “నా దగ్గరున్న మ్యూజిక్‌ని నిజానికి చెత్తబుట్టలో పడేయాలని నాకు తెలుసు” అని ఒక అమ్మాయి ఒప్పుకుంటుంది, “కానీ ఆ మ్యూజిక్ ఎంత బాగుందో!” అని కూడా అంటుందామె. మరో అబ్బాయి అదే విధంగా ఇలా ఒప్పుకున్నాడు: “నా విషయానికొస్తే సంగీతం నిజంగా ఉచ్చులాంటిది ఎందుకంటే అదంటే నాకు చాలా ఇష్టం. నేను వినే సంగీతంలో ఏదైనా చెడు ఉంటే లేదా నా తల్లిదండ్రులు ఆ చెడు గురించి నాకు చెబితే, నేను నా హృదయంపై పట్టు సాధించమని నా మనస్సుని గట్టిగా బలవంతపెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే నేను నా హృదయంలో ఆ సంగీతాన్ని ప్రేమిస్తాను.” యౌవనస్థులారా, ‘సాతాను తంత్రాల్ని ఎరుగనివారిగా’ ఉండకండి! (2 కొరింథీయులు 2:11) క్రైస్తవ యువతను యెహోవాకు విరుద్ధంగా త్రిప్పివేయడానికి సాతాను సంగీతాన్ని ఉపయోగించుకుంటున్నాడు! ర్యాప్, హెవీ మెటల్, ఆల్టర్నేటివ్ రాక్ అనే వివిధ రకాల సంగీతాన్ని చర్చిస్తూ వాచ్ టవర్ ప్రచురణల్లో శీర్షికలు వచ్చాయి.d అయితే, వాచ్ టవర్ ప్రచురణలు క్రొత్తగా పుట్టుకొచ్చే ప్రతి విధమైన సంగీతంపైనా వ్యాఖ్యానించడం సాధ్యం కాదు. అందుకని మీరు సంగీతాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు “బుద్ధి”ని “వివేచన”ను ఉపయోగించాలి.—సామెతలు 2:11.
17. (ఎ) పోర్నియా అంటే ఏమిటి, అందులో ఎటువంటి కార్యకలాపాలు ఇమిడివున్నాయి? (బి) నైతికత విషయంలో దేవుని చిత్తం ఏమిటి?
17 చివరిగా మీరు నైతికంగా పరిశుభ్రంగా ఉండాలి. “జారత్వమునకు దూరముగా పారిపోవుడి” అని బైబిలు ఉద్బోధిస్తుంది. (1 కొరింథీయులు 6:18) జారత్వము అని అనువదించబడిన గ్రీకు మూలపదమైన పోర్నియా వివాహబంధానికి వెలుపల జననేంద్రియాలను ఉపయోగిస్తూ జరిపే చట్టవిరుద్ధమైన లైంగిక కార్యకలాపాన్ని సూచిస్తుంది. అందులో నోటిని ఉపయోగించి లేదా ఇతర మార్గాల ద్వారా లైంగిక కోరిక రేకెత్తించటానికి ఉద్దేశపూర్వకంగా లైంగికావయవాలను ముట్టుకోవటం ఇమిడివుంది. కొందరు క్రైస్తవ యౌవనులు తాము నిజానికి జారత్వాన్ని జరిగించటం లేదని భావిస్తూ అటువంటి ప్రవర్తనలో పాల్గొన్నారు. అయితే, దేవుని వాక్యం స్పష్టంగా ఇలా చెబుతుంది: “మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును, . . . పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని చిత్తము.”—1 థెస్సలొనీకయులు 4:3, 4.
18. (ఎ) యౌవనులు ఈ లోకాత్మ మూలంగా కలుషితం కాకుండా ఎలా ఉండగలరు? (బి) తర్వాతి శీర్షికలో ఏమి చర్చించబడుతుంది?
18 అవును, యెహోవా అందించే సహాయంతో మీరు ఈ లోకాత్మ మూలంగా కలుషితం కాకుండా ఉండగలరు! (1 పేతురు 5:10) అయినప్పటికీ, సాతాను సాధారణంగా ప్రాణాంతకమైన తన ఉచ్చులను అందంగా తీర్చిదిద్దుతాడు, కొన్నిసార్లు ప్రమాదాన్ని పసిగట్టడానికి నిశితమైన వివేచన కావాల్సివస్తుంది. మా తర్వాతి శీర్షిక యువత తమ గ్రహణశక్తులను పెంపొందించుకునేందుకు సహాయం చేయడానికి రూపొందించబడింది.
[అధస్సూచీలు]
a ఇవి రాత్రంతా సాగే డాన్స్ పార్టీలు. మరింత సమాచారం కోసం తేజరిల్లు! యొక్క జనవరి 8, 1998 సంచికలోని “యువత ఇలా అడుగుతోంది . . . రేవ్స్ హానిరహితమైన సరదానా?” చూడండి.
b దాదాపు 11 ఏండ్లుగల పిల్లలు.
c కొన్ని సూచనల కోసం, యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) అనే పుస్తకంలోని 296-303 పేజీలను చూడండి.
d “సంఘపుస్తక పఠనముల కొరకు కావలికోట శీర్షికలు” అనే బ్రోషూరులోని 36 నుండి 40 పేజీలు చూడండి.
పునస్సమీక్షకు ప్రశ్నలు
◻ “లోకాత్మ” ఏమిటి, అది ప్రజలపై ఎలా ‘అధికారం’ చెలాయిస్తుంది?
◻ నేటి యౌవనుల్లో ఈ లోకాత్మ ఏయే రూపాల్లో ప్రదర్శితమౌతుంది?
◻ మాట్లాడే విషయంలోను, వినోదం విషయంలోను క్రైస్తవ యౌవనస్థులు ఎలా “భిన్నమైన ఆత్మ”ను కనపర్చగలరు?
◻ నైతికత విషయంలోను, సంగీతం విషయంలోను క్రైస్తవ యౌవనస్థులు ఎలా “భిన్నమైన ఆత్మ”ను కనపర్చగలరు?
[9వ పేజీలోని చిత్రం]
చాలామంది యౌవనులు తమ ప్రవర్తన ద్వారా తాము ఈ లోకాత్మ “అధికారం” క్రింద ఉన్నామని చూపిస్తారు
[10వ పేజీలోని చిత్రం]
సంగీతం విషయంలో చక్కని ఎంపిక చేసుకోండి
[11వ పేజీలోని చిత్రం]
లోకాత్మను ఎదిరించడానికి ధైర్యం అవసరం