మకమకలాడుతున్న వత్తిని మీరు ఆర్పుతారా?
యేసు క్రీస్తు అన్ని రకాల ప్రజలకూ దేవుని రాజ్యసువార్తను ప్రకటించాడు. వారిలో అనేకులు అణచి వేయబడి నిరుత్సాహం చెందిన వారు ఉన్నారు. అయితే యేసు వారికి హృదయాన్ని ఉప్పొంగజేసే వర్తమానాన్ని ఇచ్చాడు. బాధను అనుభవిస్తున్న ప్రజలపట్ల ఆయన కనికరపడ్డాడు.
యెషయా నివేదించిన ఓ ప్రవచనంవైపు అవధానాన్ని మళ్లించడం ద్వారా సువార్త రచయితయైన మత్తయి యేసు కనికరాన్ని ఉన్నతపర్చాడు. యేసు నెరవేర్చిన మాటలను ఉదహరిస్తూ, మత్తయి ఇలా వ్రాశాడు: “న్యాయవిధిని ప్రబలము చేయువరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసెనారను (వత్తిని) ఆర్పడు.” (మత్తయి 12:20; యెషయా 42:3) ఈ మాటల అర్థమేమిటి, మరి యేసు ఈ ప్రవచనాన్ని ఎలా నెరవేర్చాడు?
ప్రవచనాన్ని నిశితంగా పరిశీలించడం
రెల్లు సాధారణంగా తేమగల నేలలో పెరుగుతుంది, అది దృఢమైన మొక్కకాదు. “నలిగిన రెల్లు” వాస్తవంగా బలహీనంగా ఉంటుంది. కాబట్టి అది, విశ్రాంతి దినాన యేసు బాగు చేసిన ఊచచెయ్యిగల వ్యక్తివంటి అణచివేయబడిన లేక హింసను అనుభవిస్తున్న ప్రజలను సూచిస్తుంది. (మత్తయి 12:10-14) అయితే దీపపు వత్తిని గూర్చిన ప్రవచనార్థక ఉదాహరణ సంగతేమిటి?
సా.శ. మొదటి శతాబ్దంలోని ఇళ్లలో ఉపయోగించే దీపం, పట్టుకునేందుకు పిడి ఉన్న ఒక చిన్న ముంతలాంటి మట్టిపాత్ర. ఆ దీపం సాధారణంగా ఒలీవనూనెతో నింపబడేది. అనుశోషణం ద్వారా, మంటను మండించేందుకు అవిసెనారతో చేయబడిన వత్తి నూనెను పైకి తీసుకునేది. ‘మకమకలాడుతున్న వత్తి’ ఆరిపోయే స్థితిలో ఉంటుందన్నది నిజమే.
సూచనార్థకంగా వంగిపోయి త్రొక్కబడి, నలిగిన రెల్లువలె ఉన్న అనేకులకు యేసు ఓదార్పుకరమైన తన వర్తమానాన్ని ప్రకటించాడు. ఈ ప్రజలు మకమకలాడుతున్న అవిసెనార వత్తివలె కూడా ఉన్నారు, ఎందుకంటే వారి జీవపు చివరి కాంతి దాదాపు ఆరిపోవచ్చింది. వారు వాస్తవంగా అణచివేయబడి, నిరుత్సాహం చెంది ఉన్నారు. అయితే, యేసు అలంకారార్థ నలిగిన రెల్లును విరువలేదు లేక లాక్షణిక మకమకలాడుతున్న వత్తిని ఆర్పలేదు. ఆయన ప్రేమపూర్వకమైన, కనికరం మరియు దయగల మాటలు బాధపడుతున్న ప్రజలను ఇంకా ఎక్కువ నిరుత్సాహపర్చలేదు మరియు కృంగదీయ లేదు. దానికి బదులుగా, వారితో ఆయన చెప్పిన మాటలు మరియు ప్రవర్తించిన తీరు వారిని ప్రోత్సహించేలా పనిచేసింది.—మత్తయి 11:28-30.
అనేకమంది తమకు నిరుత్సాహం కలిగించే సమస్యలను ఎదుర్కొంటున్నారు గనుక నేడు కూడా వారికి కరుణ, ప్రోత్సాహం అవసరం. యెహోవా సేవకులు కూడా అన్ని వేళలా బలమైన దుర్గములుగా ఉండరు. కొన్నిసార్లు కొందరు మకమకలాడుతున్న వత్తివలె ఉంటారు. కాబట్టి క్రైస్తవులు ప్రోత్సహించే వారిగా—చెప్పాలంటే, మంటకు ఇంకొంత గాలిపెట్టి దాన్ని ఆరిపోకుండా ఉంచే వారిగా—ఉండి, ఒకరినొకరు బలపర్చుకోవాలి.—లూకా 22:32; అపొస్తలుల కార్యములు 11:23.
క్రైస్తవులుగా మనం ప్రోత్సహించు వారిగా ఉండాలని ఇష్టపడతాం. ఆత్మీయ సహాయం కోరే వారిని ఎవరినైనా మనం ఉద్దేశపూర్వకంగా బలహీనపర్చాలని ప్రయత్నించం. వాస్తవానికి, ఇతరులను బలపర్చడంలో మనం యేసు ఉదాహరణను అనుకరించాలని కోరుకుంటాం. (హెబ్రీయులు 12:1-3; 1 పేతురు 2:21) ప్రోత్సాహం కొరకు మన వైపు చూసే వారిని ఎవరినైనా మనం తెలియకుండా నలుగగొట్టగలమన్న వాస్తవం, ఇతరులతో మనం కలిగివుండే వ్యవహారాలను గురించి గంభీరంగా తలంచడానికి మంచి కారణాన్నిస్తుంది. మనం ‘మకమకలాడుతున్న వత్తిని ఆర్పాలని’ ఎంతమాత్రం ఇష్టపడం. ఈ విషయంలో ఏ లేఖనాధార నియమాలు మనకు సహాయం చేయగలవు?
విమర్శ యొక్క ప్రభావాలు
ఒక క్రైస్తవుడు ‘ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన వారు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసికొని రావలెను.’ (గలతీయులు 6:1) అయితే, ఇతరులలోని తప్పిదాల కొరకు వెదకుతూ ఉండి, వారిని సరిదిద్దడానికి ప్రతి అవకాశాన్ని చేజికిచ్చుకోవాలని ప్రయత్నించడం సరైనదిగా ఉంటుందా? లేక వారి ప్రస్తుత ప్రయత్నాలు తగినవి కావని సూచిస్తూ, బహుశా తప్పు చేశామన్న భావాలను వారికి కలిగిస్తూ ఇంకా శ్రేష్ఠంగా చేయాలని వారిని నెట్టడం సరిగ్గా ఉంటుందా? యేసు అలాంటిదేదైనా చేశాడనడానికి ఎలాంటి ఆధారమూ లేదు. ఇతరులు మెరుగుపడటానికి సహాయం చేయాలన్నది మన సంకల్పమైనప్పటికీ, కనికరం లేని విమర్శను అందుకుంటున్న వారు బలపర్చబడినట్లు భావించే దానికన్నా బలహీనమై పోయామని భావిస్తారు. నిర్మాణాత్మకమైన విమర్శ కూడా ఎక్కువ పాళ్లలో ఇవ్వబడితే నిరుత్సాహకరంగా ఉండగలదు. బాగా ఆలోచించే క్రైస్తవుని మంచి ప్రయత్నాలను ఎప్పుడూ నిరాకరిస్తే, అతను తన చేతులెత్తేసి, ‘అసలు అంతగా ప్రయత్నించడం ఎందుకు?’ అని అనవచ్చు. వాస్తవానికి, అతను పూర్తిగా మానుకోవచ్చు కూడా.
లేఖనాధార సలహా ఇవ్వడం ప్రాముఖ్యమైనప్పటికీ, అది నియమిత పెద్దలు లేక సంఘంలోని ఇతరుల స్వభావాన్ని చూపకూడదు. క్రైస్తవ కూటాలు ప్రాథమికంగా సలహాలను ఇచ్చిపుచ్చుకోడానికి జరుపబడవు. బదులుగా, అందరూ దేవునికి తాము చేసే పవిత్రసేవను మరియు సహవాసాన్ని ఆనందించడానికి ఒకరినొకరం పురికొల్పుకుని, ప్రోత్సహించుకోడానికి మనం క్రమంగా కూడుకుంటాం. (రోమీయులు 1:11, 12; హెబ్రీయులు 10:24, 25) అపరిపూర్ణమైన తప్పిదాన్ని చూసీ చూడనట్లు వదిలివేయడం ప్రేమపూర్వకమైనది, జ్ఞానయుక్తమైనది. అలాంటి అపరిపూర్ణమైన తప్పిదానికి, గంభీరమైన తప్పిదానికి మధ్యగల వ్యత్యాసాన్ని మనం వివేచించగల్గడం ఎంత మంచిదో కదా!—ప్రసంగి 3:1, 7; కొలొస్సయులు 3:13.
ప్రజలు విమర్శకన్నా ప్రోత్సాహానికే ఎక్కువ తొందరగా ప్రతిస్పందిస్తారు. వాస్తవానికి, తాము అయుక్తంగా విమర్శించబడ్డామని వ్యక్తులు భావిస్తే, వారు తాము విమర్శింపబడిన ప్రవర్తనకు మరింత హత్తుకోవచ్చు! అయితే వారు న్యాయబద్ధంగా మెచ్చుకోబడితే, వారు ప్రోత్సహింపబడి, మెరుగుపడటానికి పురికొల్పబడతారు. (సామెతలు 12:18) కావున యేసు వలె ప్రోత్సహిస్తూ ఉండి ఎన్నడూ ‘మకమకలాడుతున్న వత్తిని ఆర్పకుండా’ ఉందాం.
పోల్చి చూడటం సంగతేమిటి?
ఇతర క్రైస్తవుల చక్కని అనుభవాలను వినడం చాలా ప్రోత్సాహకరంగా ఉండగలదు. రాజ్యవర్తమానాన్ని ప్రకటించడంలో యేసు శిష్యులు పొందిన సాఫల్యాన్నిగూర్చి విన్నప్పుడు ఆయన కూడా సంతోషించాడు. (లూకా 10:17-21) అదే విధంగా, ఇతరులు విశ్వాసంలో కలిగివున్న విజయాన్ని, మంచి ఉదాహరణను లేక యథార్థతను గురించి మనం విన్నప్పుడు మనం ప్రోత్సహింపబడతాం మరి మన క్రైస్తవ మార్గంలో నిలకడగా ఉండడానికి ఎక్కువ తీర్మానించుకుని ఉంటాం.
అయినప్పటికీ, ఒక రిపోర్టును, ‘మీరు ఈ క్రైస్తవులంత మంచిగా లేరు, మరి మీరు చేస్తున్న దానికంటే ఇంకా ఎక్కువ చేయవలసి ఉందన్న’ రీతిలో అందిస్తే అప్పుడేమిటి? శ్రోత బహుశా మెరుగుపడేందుకు శక్తివంతమైన కార్యక్రమాన్ని చేపడతాడా? ప్రాముఖ్యంగా, పోల్చితే లేక సూచిస్తే అతను నిరుత్సాహపడి మొత్తానికే వదిలేయగలడు. అది, ‘నువ్వు నీ అన్నలా ఎందుకు ఉండలేవు?’ అని ఒక తండ్రి తన పిల్లవాన్ని అడిగినట్లుగా ఉంటుంది. అలాంటి వ్యాఖ్యానం విముకతను, నిరుత్సాహాన్ని కలిగించగలదు, అయితే అది మంచి ప్రవర్తనను కలిగించకపోవచ్చు. పోల్చడాలు పెద్దలపై కూడా అలాంటి ప్రభావాన్నే చూపించగలవు, వారు ఎవరితో పోల్చబడుతున్నారో వారిపట్ల కొంత విముకతా భావం కూడా రావచ్చు.
దేవుని సేవలో అందరూ ఒకే మొత్తంలో పని చేయాలని మనం అపేక్షించలేము. యేసు ఉపమానాల్లోని ఒకదాంట్లో, ఒక యజమాని ఒకటి, రెండు లేక ఐదు తలాంతులను తన దాసులకు ఇచ్చాడు. అవి “ఎవని సామర్థ్యము చొప్పున వానికి” ఇవ్వబడ్డాయి. వారి పని భిన్నమైన ఫలితాలను ఇచ్చినప్పటికీ వారు నమ్మకంగా ఉన్నారు గనుక, బుద్ధిమంతంగా వ్యాపారం చేసి తమ తలాంతులను అధికం చేసిన ఇద్దరు దాసులూ మెచ్చుకోబడ్డారు.—మత్తయి 25:14-30.
అపొస్తలుడైన పౌలు సరైన రీతిలో ఇలా వ్రాశాడు: “ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి [పోల్చుకుని] కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును.” (గలతీయులు 6:4) ఇతరులకు నిజంగా ప్రోత్సాహకరంగా ఉండడానికి, మనం ప్రతికూలంగా పోల్చడాన్ని మానుకోవాలి.
ప్రోత్సహించడానికి కొన్ని మార్గాలు
నిరుత్సాహం చెందిన వారిని నిర్మించడానికి మరియు ‘మకమకలాడుతున్న వత్తిని ఆర్పకుండా’ ఉండటానికి మనం ఏమి చేయగలం? ప్రోత్సాహాన్ని అందించడం ఒక ప్రత్యేక సూత్రాన్ని అనుకరించడమని కాదు. అయితే, మనం బైబిలు నియమాలను అన్వయిస్తే మన మాటలు నిర్మాణాత్మకంగా ఉండగలవు. వీటిలో కొన్ని ఏవి?
దీనంగా ఉండండి. “కక్ష్యచేతనైనను వృథాతిశయము చేతనైనను ఏమియు చేయక” ఉండాలని ఫిలిప్పీయులు 2:3 నందు పౌలు మనల్ని పురికొల్చాడు. మనం దీనంగా మాట్లాడాలి, ప్రవర్తించాలి. ‘వినయమైన మనస్సుగలవారమై ఇతరులను మనకంటే యోగ్యులని ఎంచాలి.’ మనం మన గురించి అసలు ఆలోచించకూడదని పౌలు చెప్పలేదు. అయినప్పటికీ, ప్రతి వ్యక్తి ఏదో ఒక రీతిలో మనకంటే ఉన్నతుడని మనం గుణగ్రహించాలి. ఇక్కడ ‘యోగ్యులు’ అని అనువదించిన గ్రీకు పదం, ఒక వ్యక్తి “తన స్వంత ఆధిక్యతల వైపునుండి దృష్టి మళ్లించి, ఎదుటి వ్యక్తి ఏ అంశాల్లో ఉన్నతంగా ఉన్నాడో వాటిని శ్రద్ధతో పరికిస్తాడు” అన్న భావాన్ని సూచిస్తుంది. (జాన్ ఆల్బెర్ట్ బెంగెల్ రచించిన న్యూ టెస్టమెంట్ వర్డ్ స్టడీస్, సంపుటి 2, పేజీ 432) మనం ఇది చేయడం ద్వారా ఇతరులను మనకంటే ఉన్నతమైన వారిగా పరిగణిస్తే, మనం వారితో దీనమైన పద్ధతిలో వ్యవహరిస్తాం.
గౌరవం చూపండి. యథార్థంగా మనల్ని మనం వ్యక్తం చేసుకోవడం ద్వారా, దేవున్ని ప్రీతిపర్చాలని అనుకుంటున్న వ్యక్తులనుగా వారిని దృష్టిస్తూ, నమ్మకమైన తోటి విశ్వాసులపై మనకు నమ్మకం ఉందని మనం స్పష్టం చేయగలం. అయితే వారికి ఆత్మీయ సహాయం అవసరమైతే. గౌరవపూర్వకమైన, మర్యాదైన పద్ధతిలో వారికి సహాయం అందిస్తాం. పౌలు విషయాలను ఇలా చెప్పాడు: “ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి.”—రోమీయులు 12:10.
మంచి శ్రోతలై ఉండండి. అవును, నిరుత్సాహాన్ని కలిగించే సమస్యలను ఎదుర్కొంటున్న వారిని ప్రోత్సహించేందుకు, మనం ఉపన్యాసకులం కాక మంచి శ్రోతలమై ఉండాలి. త్వరగా, పైపైని సలహాలను ఇచ్చే బదులు, ఉన్న అవసరతలకు నిజంగా సరిపోయే లేఖనాధార మార్గదర్శక సూత్రాలను అందించేందుకు అవసరమయ్యే సమయాన్ని తీసుకుందాం. ఏమి చెప్పాలో మనకు తెలియకపోతే, ఓదార్పుకరంగా మాట్లాడి ఇతరులను బలపర్చడానికి బైబిలు పరిశోధన మనకు సహాయం చేయగలదు.
ప్రేమపూర్వకంగా ఉండండి. మనం ప్రోత్సహించాలని ఇష్టపడే వారిపట్ల మనకు ప్రేమ భావం ఉండాల్సిన అవసరత ఉంది. యెహోవా సేవకులైన మన తోటి వారికి అన్వయించినప్పుడు, మన ప్రేమ వారి అతి శ్రేష్ఠమైన ఆసక్తుల కొరకు చర్య తీసుకోవడం కంటే ఎక్కువే అయి ఉండాలి. అందులో ప్రగాఢమైన భావాలు కూడా ఇమిడి ఉండాలి. యెహోవా ప్రజలందరి పట్ల మనకు అలాంటి ప్రేమ ఉంటే, మన మాటలు వారికి యథార్థమైన ప్రోత్సాహాన్ని ఇవ్వగలవు. మెరుగుపర్చుకోవాలని మనం ఒక సలహాను అందించవలసిన అవసరం ఉన్నప్పటికీ, మన సంకల్పం ఒక విషయాన్ని చెప్పడం మాత్రమే కాక ప్రేమపూర్వకమైన సహాయాన్ని అందించాలన్నదైతే, మనం చెప్పేది తప్పుగా అర్థం చేసుకోబడటం లేక నష్టం కలిగించడం చేయదు. పౌలు ఎంతో సహేతుకంగా చెప్పినట్లు, “ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును.”—1 కొరింథీయులు 8:1; ఫిలిప్పీయులు 2:4; 1 పేతురు 1:22.
ఎల్లప్పుడూ ప్రోత్సహించేవారిగా ఉండండి
ఈ క్లిష్టమైన “అంత్య దినములలో,” యెహోవా ప్రజలు అనేక శోధనలను ఎదుర్కొంటారు. (2 తిమోతి 3:1-5) వారు కొన్నిసార్లు తమ సహనం యొక్క చివరి హద్దు అని అనిపించే దాని వరకు బాధననుభవిస్తారంటే అందులో ఆశ్చర్యంలేదు. యెహోవా సేవకులుగా, మన తోటి ఆరాధికుల్లో ఎవరైనా పూర్తిగా ఆరిపోబోయే మకమకలాడుతున్న వత్తుల్లా వారు భావించకుండా ఉండేలాంటిదేమీ చెప్పకుండా లేక చేయకుండా ఉండాలని మనం తప్పకుండా ఇష్టపడతాం.
కాబట్టి, మనం ఒకరినొకరం ప్రోత్సహించుకోవాలన్నది ఎంత ప్రాముఖ్యం! నిరుత్సాహం చెందిన తోటి ఆరాధికులపట్ల దీనంగా మరియు మర్యాదపూర్వకంగా ఉండటం ద్వారా వారిని ప్రోత్సహించేందుకు ప్రతి ప్రయత్నం చేద్దాం. వారు మనకు తమ బాధలను చెప్పుకుంటే జాగ్రత్తగా విందాం మరి దేవుని వాక్యమైన బైబిలు వైపుకు అవధానాన్ని మళ్లించడం ద్వారా వారికి సహాయాన్ని అందించాలని ప్రయత్నిద్దాం. అన్నిటికంటే మిన్నగా, యెహోవా ఆత్మఫలాల్లో ఒకటైన ప్రేమ ఒకరినొకరం బలపర్చుకోడానికి మనకు సహాయం చేస్తుంది గనుక దాన్ని ప్రదర్శిద్దాం. ‘మకమకలాడుచున్న వత్తిని ఆర్పేటువంటి’ ఏ రీతుల్లోనైనా మనం ఎన్నడూ మాట్లాడకుండా లేక ప్రవర్తించకుండా ఉందాం.