కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 9/15 పేజీలు 22-24
  • మీరు నిజంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరముందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు నిజంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరముందా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్షమాపణ చెప్పేందుకు ప్రేమ మనలను బద్ధులను చేస్తుంది
  • “దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి”
  • వివాహంలో క్షమాపణలు ఎంతో ప్రాముఖ్యమైనవి
  • క్షమాపణ కోరడమనే కళను అభ్యసించండి
  • నేను సారీ ఎందుకు చెప్పాలి?
    యువత అడిగే ప్రశ్నలు
  • క్షమాపణ ఎలా అడగాలి?
    తేజరిల్లు!—2015
  • క్షమాపణ చెప్పడం సమాధానపడడానికి కీలకం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • క్షమాపణ చెప్పడం ఎందుకంత కష్టం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 9/15 పేజీలు 22-24

మీరు నిజంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరముందా?

‘నేను ఎప్పుడూ క్షమాపణ చెప్పను’ అని జార్జ్‌ బెర్నార్డ్‌ షా వ్రాశాడు. ‘జరిగిందేదో జరిగిపోయింది’ అని ఇతరులు అనవచ్చు.

బహుశా మనం కూడా మన స్వాభిమానం దెబ్బ తింటుందేమోనన్న భయంతో మన తప్పును అంగీకరించేందుకు వెనుకంజవేయవచ్చు. అసలు సమస్య ఎదుటి వ్యక్తిదేనని మనం నిందమోపవచ్చు. లేక మనం క్షమాపణ చెప్పాలని అనుకుంటాం కానీ ఆ విషయం చివరకు అలక్ష్యం చేయబడిందని మనం భావించేంత వరకు దాన్ని వాయిదా వేస్తుండవచ్చు.

అట్లైతే, క్షమాపణ చెప్పడం ప్రాముఖ్యమా? అవి వాస్తవంగా ఏమైనా సాధించగలవా?

క్షమాపణ చెప్పేందుకు ప్రేమ మనలను బద్ధులను చేస్తుంది

యేసుక్రీస్తు యొక్క నిజ అనుచరుల గుర్తింపు చిహ్నమే సహోదర ప్రేమ. ఆయనిలా చెప్పాడు: “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందు”రు. (యోహాను 13:35) “యొకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి” అని లేఖనములు క్రైస్తవులను పురికొల్పుతున్నాయి. (1 పేతురు 1:22) మిక్కుటమైన ప్రేమ మనం క్షమాపణ చెప్పేందుకు మనలను బద్ధులను చేస్తుంది. ఎందుకు? ఎందుకంటే మానవ అపరిపూర్ణత తప్పక మన భావాలను గాయపరుస్తుంది మరి వాటిని సరి చేయకపోతే అవి ప్రేమను అణచివేస్తాయి.

ఉదాహరణకు, క్రైస్తవ సంఘంలో ఎవరితోనైనా మనకు వ్యక్తిగత విభేదాలు వస్తే మనం వారితో మాట్లాడకుండా ఉండాలని అనుకుంటాము. ఒకవేళ మనం బాధ కలిగించి ఉంటే, ఒక ప్రేమపూర్వక సంబంధం ఎలా పునరుద్ధరింపబడుతుంది? అనేక సందర్భాల్లో, క్షమాపణ చెప్పిన తర్వాత చక్కని పద్ధతిలో సంభాషించేందుకు ప్రయత్నించడం ద్వారా జరగవచ్చు. మనం మన తోటి విశ్వాసులకు ప్రేమను అచ్చి ఉన్నాము, ఏ విషయంలోనైనా బాధ కలిగించినందుకు మనం క్షమాపణ కోరితే మనం ఆ ఋణంలో కొంత తీర్చిన వారమౌతాము.—రోమీయులు 13:8.

ఉదాహరణకు, మారీ కార్మన్‌ మరియు పాకీ అనే ఇద్దరు క్రైస్తవ స్త్రీలు ఎంతో కాలం స్నేహంగా ఉంటున్నారు. హానికరమైన వృధా ప్రసంగాన్ని మారీ కార్మన్‌ నమ్మినందుకు పాకీతో ఆమెకున్న స్నేహం చల్లబడిపోయింది. ఎలాంటి వివరణ ఇవ్వకుండానే ఆమె పాకీని పూర్తిగా విడిచిపెట్టింది. దాదాపు ఓ సంవత్సరం తర్వాత, ఆ వృధా ప్రసంగం అబద్ధమైనదని మారీ కార్మన్‌ తెలుసుకుంది. ఆమె ఎలా ప్రతిస్పందించింది? ఆమె పాకీ వద్దకు వెళ్లి అంత చెడుగా ప్రవర్తించినందుకు తాను బాధపడుతున్నానని దీనంగా వ్యక్తం చేసేందుకు ప్రేమ ఆమెను కదిలించింది. దాంతో వారిద్దరి కళ్లలో నీళ్లు వరదలై ప్రవహించాయి, మరి అప్పటినుండి వారు విడదీయలేని స్నేహితులయ్యారు.

మనం ఏదైనా తప్పు చేశామని మనం భావించకపోయినప్పటికీ, క్షమాపణ చెప్పడం అపార్థాన్ని తొలగించవచ్చు. మాన్యువల్‌ ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు: “అనేక సంవత్సరాల క్రితం నేను నా భార్య, ఒక ఆత్మీయ సహోదరి ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమె ఇంట్లో ఉన్నాము. ఆమె అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆమెకు, ఆమె పిల్లలకు సహాయం చేసేందుకు మేము చేయగల్గినంత చేశాము. అయితే ఆమె ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, మేము ఇంటి ఖర్చులను సక్రమంగా చెయ్యలేదని ఆమె ఒక స్నేహితునికి ఫిర్యాదు చేసింది.

“మేము ఆమెను దర్శించి, బహుశ మేము యౌవనస్థులం మరియు అనుభవం లేనివారమైనందున, ఆమె చూసుకునేంత సక్రమంగా మేము విషయాలను చూసియుండకపోవచ్చు అని మేము వివరించాము. వాస్తవానికి తానే మాకు రుణపడి ఉందని మరి ఆమె కొరకు మేము చేసిన దానికంతటికీ ఆమె నిజంగా కృతజ్ఞురాలని చెబుతూ ఆమె వెంటనే ప్రతిస్పందించింది. సమస్య పరిష్కరించబడింది. అపార్థాలు తలెత్తినప్పుడు వినయంగా క్షమాపణ అడగడం యొక్క ప్రాముఖ్యతను ఈ అనుభవం నాకు నేర్పింది.”

ప్రేమను చూపినందుకు, ‘సమాధానమును కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరించినందుకు’ యెహోవా ఈ జంటను దీవించాడు. (రోమీయులు 14:19) ఇతరుల భావాలను గుర్తెరగడం కూడా ప్రేమలో ఇమిడివుంది. “యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి” ఉండాలని పేతురు మనకు సలహా ఇస్తున్నాడు. (1 పేతురు 3:8) మనకు సహానుభూతి గనుక ఉంటే, అనాలోచితంగా మాట్లాడిన ఒక మాట లేక చేసిన ఒక క్రియ ద్వారా మనం కలిగించిన బాధను మనం గుర్తించగలుగుతాము మరియు క్షమాపణ చెప్పేందుకు మనం పురికొల్పబడతాము.

“దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి”

నమ్మకస్థులైన క్రైస్తవ పెద్దల మధ్య కూడా అప్పుడప్పుడూ తీవ్రమైన వివాదాలు తలెత్తవచ్చు. (అపొస్తలుల కార్యములు 15:37-39 పోల్చండి.) ఇలాంటి సందర్భాలలో క్షమాపణ చెప్పడం ఎంతో ప్రయోజనకరమైనదిగా ఉంటుంది. క్షమాపణ చెప్పడం కష్టమని భావించే పెద్దకు లేక మరో క్రైస్తవునికెవనికైనా ఏది సహాయం చేస్తుంది?

దీనత్వమే దానికి కీలకం. అపొస్తలుడైన పేతురు ఇలా సలహా ఇచ్చాడు: “ఎదుటివానియెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి.” (1 పేతురు 5:5) అనేక వివాదాల్లో ఇరువురూ నిందను భరించాల్సి ఉంటుందన్నది వాస్తవమైనప్పటికీ, దీనుడైన క్రైస్తవుడు తన స్వంత తప్పిదాలను గురించి ఆలోచించి వాటిని అంగీకరించేందుకు సిద్ధంగా ఉంటాడు.—సామెతలు 6:1-5.

ఎవరికైతే క్షమాపణ చెప్పబడుతుందో ఆ వ్యక్తి కూడా దాన్ని దీనమైన పద్ధతిలో అంగీకరించాలి. ఓ ఉపమానాన్ని ఉపయోగిస్తూ, సంభాషించుకోవలసిన ఇద్దరు వ్యక్తులు రెండు వేర్వేరు కొండ శిఖరాలపై నిలబడి ఉన్నారని మనం ఊహించుకుందాం. వారిని విడదీసిన అగాధంగుండా సంభాషించడం అసాధ్యం. వారిలో ఒకరు లోయలోకి దిగి వచ్చినప్పుడు మరియు మరొకరు కూడా అతని మాదిరిని అనుసరిస్తే అప్పుడు వారు సులభంగా సంభాషించుకోగలరు. అదే విధంగా, ఒకవేళ ఇద్దరు క్రైస్తవులు తమ మధ్యగల విభేదాలను పరిష్కరించుకోవాల్సిన అవసరత ఉంటే, అలంకారికంగా చెప్పాలంటే ప్రతి వ్యక్తి వినయంగా లోయలోకి దిగివచ్చి ఎదుటి వ్యక్తిని కలిసి, తగిన క్షమాపణ చెప్పుకోవాలి.—1 పేతురు 5:6.

వివాహంలో క్షమాపణలు ఎంతో ప్రాముఖ్యమైనవి

ఇద్దరు అసంపూర్ణ మానవుల వివాహం క్షమాపణ చెప్పుకోవల్సిన అవకాశాలను తప్పక అందిస్తుంది. భార్యభర్తలిరువురికీ, సహానుభూతి ఉంటే, వారు అనాలోచితంగా మాట్లాడి ఉంటే లేక ప్రవర్తించి ఉంటే అప్పుడు వారు క్షమాపణ చెప్పుకోవడానికి అది వారిని పురికొల్పుతుంది. సామెతలు 12:18 ఇలా పేర్కొంటుంది: “కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.” అనాలోచిత ‘కత్తిపోట్లను’ నివారించలేము, అయితే యథార్థమైన క్షమాపణ ద్వారా వాటిని నయం చేయవచ్చు. వాస్తవానికి, దానికి ఎడతెగని అప్రమత్తత, ప్రయత్నం అవసరము.

తన వైవాహిక జీవితాన్ని గురించి మాట్లాడుతూ, సూజన్‌a ఇలా చెబుతుంది: “జాక్‌కు* నాకు పెళ్లై 24 సంవత్సరాలైంది, అయితే మేము ఒకరి గురించి మరొకరం ఇంకా క్రొత్త సంగతులను నేర్చుకుంటున్నాము. కొంత కాలం క్రితం, మేము విడిపోయి కొన్ని వారాలు వేరుగా జీవించామన్నది విచారకరమైన విషయం. అయితే, పెద్దలు ఇచ్చిన లేఖనాధార సలహాను మేము విని మళ్లీ కలుసుకున్నాము. మాకు ఎంతో భిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్నాయి గనుక మా మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉందని మేమిప్పుడు గ్రహించాము. ఇది సంభవించినప్పుడు, మేము వెంటనే క్షమాపణ చెప్పుకుని ఒకరి ఆలోచనా దృక్పథాన్ని మరొకరం అర్థం చేసుకునేందుకు ఎంతో కష్టపడి ప్రయత్నిస్తాం. మా వైవాహిక సంబంధం ఎంతో మెరుగయ్యిందని చెప్పేందుకు నేను సంతోషిస్తున్నాను.” జాక్‌ ఇలా అన్నాడు: “మేము కలతచెందే అవకాశమున్న సందర్భాలను గుర్తించడం కూడా మేము నేర్చుకున్నాము. అలాంటి సమయాల్లో మేము ఒకరి ఎడల ఒకరము మరింత సున్నితంగా వ్యవహరిస్తాము.”—సామెతలు 16:23.

తప్పు మీది కాదని మీరు భావించినప్పుడు కూడా మీరు క్షమాపణ చెప్పాలా? ప్రగాఢ భావాలు ఇమిడివున్నప్పుడు, తప్పు ఎవరిదనేది నిర్ణయించడం కష్టం. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏమంటే వివాహంలో సమాధానాన్ని కల్గియుండడమే. దావీదును చులకన చేసిన వాని భార్యయగు ఇశ్రాయేలీయురాలైన అబీగయీలు వృత్తాంతాన్ని పరిశీలించండి. తన భర్త అవివేకానికి ఆమె బాధ్యురాలుకాకపోయినప్పటికీ ఆమె క్షమాపణ చెప్పుకుంది. “నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము” అని ఆమె వేడుకుంది. ఆమె ఎడల దయతో ప్రవర్తించడం ద్వారా మరియు ఒకవేళ ఆమె గనుక తనను ఆపకపోతే తాను అమాయకుల రక్తాన్ని చిందించే వాడినని దీనంగా అంగీకరిస్తు దావీదు ప్రతిస్పందించాడు.—1 సమూయేలు 25:24-28, 32-35.

అదే విధంగా, విజయవంతమైన వివాహానికి క్షమాపణ చెప్పేందుకు మొదటి వారై ఉండటానికి సుముఖత చూపడం ఎంతో అవసరమని, పెళ్లై 45 సంవత్సరాలు గడిచిన క్రైస్తవ స్త్రీ జూన్‌ భావిస్తుంది. ఆమె ఇలా చెబుతుంది: “ఒక వ్యక్తిగా నా భావాలకంటే మా వివాహమే ఎక్కువ ప్రాముఖ్యమైనదని నాకు నేను చెప్పుకుంటాను. కాబట్టి నేను క్షమాపణ చెప్పినప్పుడు, వివాహ పటిష్ఠతకు తోడ్పడుతున్నానని నేను భావిస్తాను.” జిమ్‌ అనే ఓ పెద్ద వయస్కుడు ఇలా పేర్కొంటున్నాడు: “నేను చిన్న విషయాలకు కూడా నా భార్యకు క్షమాపణ చెప్పుకుంటాను. ఆమెకు పెద్ద శస్త్ర చికిత్స జరిగినప్పటినుండి ఆమె సులభంగా కలత చెందుతుంది. అందుకే నేను ప్రతిసారి ఆమె చుట్టూ చేతులు వేసి ‘క్షమించు డియర్‌. నేను నిన్ను బాధపెట్టాలని అలా చేయలేదు’ అని అంటాను. నీళ్లు పోసినప్పుడు మొక్క ఎలా తేరుకుంటుందో అలా ఆమె వెంటనే తేరుకుంటుంది.”

మనం ఎంతగానో ప్రేమించే వ్యక్తిని మనం గాయపర్చితే, వెంటనే క్షమాపణ చెప్పడం ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. హృదయపూర్వకంగా మిలాగ్రోస్‌ అంగీకరిస్తూ ఇలా అంటోంది: “నాకు ఆత్మవిశ్వాసం చాలా తక్కువ, మరి నా భర్త కఠినంగా మాట్లాడితే నేను కలత చెందుతాను. అయితే ఆయన క్షమాపణ కోరితే నాకు వెంటనే ఉపశమనం లభిస్తుంది.” తగినట్లే, లేఖనాలు మనకు ఇలా చెబుతున్నాయి: “ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్యకరమైనవి.”—సామెతలు 16:24.

క్షమాపణ కోరడమనే కళను అభ్యసించండి

అవసరమైనప్పుడు క్షమాపణ చెప్పడాన్ని మనం అభ్యసిస్తే, ప్రజలు అనుకూలంగా ప్రతిస్పందించడం మనం కనుగొంటాము. బహుశ వారే వచ్చి క్షమాపణ అడుగవచ్చు. మనం ఎవరినైనా కలతపర్చామని మనకు అనుమానముంటే, ఎట్టి పొరపాటునైనా అంగీకరించకుండేందుకు కాలయాపన చేసే బదులు క్షమాపణ కోరడాన్ని ఎందుకు అలవాటు చేసుకోకూడదు? క్షమాపణ కోరడం చేతకానితనమని ఈ లోకం భావించవచ్చు, అయితే అది వాస్తవానికి క్రైస్తవ పరిణతికి రుజువునిస్తుంది. నిజమే, కొంతమట్టుకు తమ తప్పును అంగీకరించినప్పటికీ తమ బాధ్యతను విస్మరించే వారిలా మనం ఉండాలని అనుకోమన్నది వాస్తవమే. ఉదాహరణకు, మనం వాస్తవంగా అలా భావించకుండానే మనం ఎప్పుడైనా క్షమాపణ అడుగుతామా? మనం ఆలస్యంగా వస్తే, క్షమాపణల ప్రవాహాన్ని కుమ్మరించి, సకాలంలో రావడాన్ని అలవరచుకునేందుకు మనం తీర్మానించుకుంటామా?

కాబట్టి, మనం నిజంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరత ఉందా? అవును, ఉంది. మన కొరకును, ఇతరుల కొరకును మనమలా చేయ బద్ధులమై ఉన్నాము. అపరిపూర్ణత వలన కలిగిన బాధను తగ్గించేందుకు క్షమాపణ సహాయం చేస్తుంది, అది చెడిపోయిన సంబంధాలను బాగుచేయగలదు. మనం చెప్పే ప్రతి క్షమాపణ వినయం విషయంలో ఒక పాఠం మరియు ఇతరుల భావాల ఎడల మరింత సున్నితంగా వ్యవహరించేందుకు మనకు తర్ఫీదునిస్తుంది. దాని ఫలితంగా, తోటి విశ్వాసులు, వివాహ భాగస్వాములు మరియు ఇతరులు మనలను తమ ఆప్యాయతకు మరియు నమ్మకానికి అర్హులమైన వారిగా దృష్టిస్తారు. మనకు మనశ్శాంతి లభిస్తుంది మరియు యెహోవా దేవుడు మనలను దీవిస్తాడు.

[అధస్సూచీలు]

a వారి అసలు పేర్లు కాదు.

[23వ పేజీలోని చిత్రం]

యథార్థమైన క్షమాపణలు క్రైస్తవ ప్రేమను పురికొల్పుతాయి

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి