మీ చింత యావత్తు యెహోవాపై వేయుడి
“దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి. ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.”—1 పేతురు 5:6, 7.
1. చింత మనల్ని ఎలా ప్రభావితం చేయగలదు, దీన్ని ఎలా ఉదాహరించవచ్చు?
చింత మన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగలదు. రేడియోలో వినే చక్కని సంగీతానికి కొన్నిసార్లు అంతరాయం కలుగజేసే అడ్డంకుతో దాన్ని పోల్చవచ్చు. రేడియో తరంగాలలో అంతరాయం లేకపోతే, ఆహ్లాదకరమైన సంగీతాన్ని ఆనందించవచ్చు, అది ప్రశాంతమైన వాతావరణాన్ని కలుగజేస్తుంది. అయితే, అంతరాయం యొక్క భీకరమైన శబ్దం మనకు చిరాకు, విసుగు కలుగజేస్తూ, అత్యంత చక్కని రాగాన్ని సహితం పాడుచేయ గలదు. చింత మన సమాధానంపై అలాంటి ప్రభావాన్నే చూపగలదు. మనం ప్రాముఖ్యమైన విషయాల యెడల శ్రద్ధ చూపించలేని విధంగా అది మనల్ని కృంగదీయగలదు. వాస్తవానికి, “ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును.”—సామెతలు 12:25.
2. “ఐహిక విచారములను” గూర్చి యేసుక్రీస్తు ఏమి చెప్పాడు?
2 అధికచింత చేత పరధ్యానములో పడిపోయే ప్రమాదాన్ని గూర్చి యేసుక్రీస్తు మాట్లాడాడు. అంత్యదినాలను గూర్చిన తన ప్రవచనంలో, ఆయనిలా కోరాడు: “మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమియందంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడి.” (లూకా 21:34-36) ఎక్కువగా తినడం, ఎక్కువగా త్రాగడం మందగించిన మానసిక స్థితిని ఎలా కలుగజేయగలదో, అలాగే దుఃఖకరమైన ఫలితాలతో, “ఐహిక విచారముల”తో కృంగిపోవడం మనం మన మానసిక సామర్థ్యాన్ని కోల్పోయేలా చేయవచ్చు.
చింత అంటే ఏమిటి
3. “చింత” ఎలా నిర్వచింపబడింది, దానికి కారణాలు కొన్ని ఏవి?
3 “చింత” యిలా నిర్వచించబడింది, “సాధారణంగా సంభవించనైయున్న లేక రాబోతున్న అనారోగ్యాన్ని గూర్చిన బాధాకరమైన లేక భయంతోకూడిన మానసిక అనిశ్చయత.” అది “భయంతోకూడిన శ్రద్ధ లేక ఆసక్తి” అలాగే “ఒక అసహజమైన, ప్రబలమైన భయంతో కూడిన భావన (చెమటపట్టడం, ఉద్విగ్నత మరియు అధిక హృదయ స్పందన) వంటి భౌతికసంబంధ సూచనలచే గుర్తించబడే భయం, భయం యొక్క గుణాన్ని మరియు వాస్తవాన్ని గూర్చిన అనుమానం, దాన్ని ఎదుర్కొనగలనా అని తన సామర్థ్యంపై తనకే అనుమానం.” (వెబ్స్‌టర్స్ నైన్త్ న్యూ కాలేజియేట్ డిక్షనరి) కాబట్టి చింత ఒక పెద్ద సమస్య కాగలదు. దానికి కారణమైన వాటిలో అనారోగ్యం, వృద్ధాప్యం, నేరాన్ని గూర్చిన భయం, ఉద్యోగాన్ని కోల్పోవడం, ఒకరి కుటుంబ సంక్షేమాన్ని గూర్చిన శ్రద్ధ వంటివి చేరివున్నాయి.
4. (ఎ) ప్రజలను గూర్చి, వారి చింతలను గూర్చి ఏమి గుర్తుంచుకోవడం మంచిది? (బి) మనం చింతను అనుభవిస్తున్నట్లయితే, ఏమి చేయవచ్చు?
4 స్పష్టంగా, చింతను కలుగజేసే అనేక పరిస్థితులు లేక సందర్భాలు ఉన్నట్లుగానే దానికి వివిధ స్థాయిలు వున్నాయి. ఒక పరిస్థితికి ప్రజలందరూ ఒకేలా ప్రతిస్పందించరు. గనుక, ఏదైనా మనల్ని బాధపెట్టకపోయినప్పటికీ, మన తోటి యెహోవా ఆరాధికులు కొంతమందికి అది అధికచింతను కలుగజేయగలదని మనం గుర్తించవలసిన అవసరత ఉంది. సామరస్యమైన, ఆనందకరమైన దేవుని వాక్య సత్యాలపై శ్రద్ధ నిలపలేక పోయేంత ఎక్కువగా చింత వున్నట్లయితే ఏమి చేయవచ్చు? యెహోవా సర్వాధిపత్యం మరియు క్రైస్తవ యథార్థత వంటి అంశాలను మనం దృష్టిలో వుంచుకోలేనంతగా చింత మనల్ని బాధిస్తే అప్పుడేమిటి? మనం మన పరిస్థితులను మార్చలేక పోవచ్చు. బదులుగా, జీవితం యొక్క కష్టతరమైన సమస్యలవల్ల కలిగే అనవసరమైన చింతను ఎదుర్కోడానికి సహాయం చేసే లేఖనాధార విషయాలను మనం పరిశీలించాలి.
సహాయం అందుబాటులో ఉంది
5. కీర్తన 55:22కు అనుగుణ్యంగా మనం ఎలా ప్రవర్తించవచ్చు?
5 క్రైస్తవులకు ఆత్మీయ సహాయం అవసరమైనప్పుడు, చింతల భారం అధికమైనప్పుడు, వారు దేవుని వాక్యం నుండి ఓదార్పు పొందవచ్చు. అది మనకు ఆధారపడదగిన నడిపింపును, యెహోవా నమ్మకమైన సేవకులుగా మనం ఒంటరి వారము కాదన్న అనేక ఆధారాలను అందజేస్తుంది. ఉదాహరణకు, కీర్తనల గ్రంథకర్తయైన దావీదు యిలా పాడాడు: “నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.” (కీర్తన 55:22) ఈ మాటలకు అనుగుణ్యంగా మనం ఎలా ప్రవర్తించగలము? మన చింతలు, వేదనలు, భయాలు, నిరుత్సాహాలు అన్నీ మన ప్రేమగల పరలోకపు తండ్రిపై వేయడం ద్వారా మనమలా చేయగలము. యిది మనకు భద్రతా భావాన్ని, సమాధానకరమైన మనస్సును యివ్వడానికి సహాయకరంగా ఉంటుంది.
6. ఫిలిప్పీయులు 4:6, 7 ప్రకారం, ప్రార్థన మనకు ఏమి చేయగలదు?
6 మన చింతయావత్తు, మన భారమంతా యెహోవాపై వేయాలంటే, క్రమమైన హృదయపూర్వక ప్రార్థన అత్యావశ్యకము. ఇది మనకు అంతర్గత సమాధానాన్ని తెస్తుంది, ఎందుకంటే అపొస్తలుడైన పౌలు యిలా వ్రాశాడు: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.” (ఫిలిప్పీయులు 4:6, 7) ఎంతో కష్టతరమైన సందర్భాల్లో సహితం యెహోవా యొక్క సమర్పిత సేవకులు అనుభవించే అసాధారణమైన శాంతియే అసమానమైన “దేవుని సమాధానము.” అది మనం దేవునితో కల్గివుండే సన్నిహితమైన వ్యక్తిగత సంబంధం ఫలితంగా వస్తుంది. మనం పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించి, అది మనల్ని ప్రేరేపించడానికి అనుమతిస్తే, మనం జీవిత సమస్యలన్నిటి నుండి విముక్తి పొందలేకపోవచ్చు, కాని మనం ఆత్మఫలమైన సమాధానాన్ని అనుభవించ గలుగుతాము. (లూకా 11:12, 13; గలతీయులు 5:22, 23) యెహోవా తన నమ్మకమైన ప్రజలందరిని “సురక్షితముగా నివసింపజేయునని,” మనకు శాశ్వత హాని కలుగజేసే దేనిని జరుగనివ్వడని మనకు తెలుసు గనుక, మనం చింతలో నిమగ్నం కాము.—కీర్తన 4:8.
7. చింతను ఎదుర్కోడానికి సహాయం చేయడంలో క్రైస్తవ పెద్దలు ఏ పాత్ర వహించగలరు?
7 అయితే, మనం లేఖనాలను ధ్యానిస్తూ, ప్రార్థనలో పట్టుదల కలిగివున్నప్పటికీ, యింకా చింత వుంటే అప్పుడేమిటి? (రోమీయులు 12:12) సంఘంలో నియమింపబడిన పెద్దలు కూడా మనకు ఆత్మీయంగా సహాయం చేయడానికి యెహోవా చేసిన ఏర్పాటు. దేవుని వాక్యాన్ని ఉపయోగించడం ద్వారా, మనతో కలిసి మన కొరకు ప్రార్థించడం ద్వారా వారు మనల్ని ఓదార్చి మనకు సహాయం చేయగలరు. (యాకోబు 5:13-16) దేవుని మందను యిష్టపూర్వకంగా, ఆసక్తితో, మాదిరికరమైన విధంగా కాయుమని అపొస్తలుడైన పేతురు తన తోటి పెద్దలను కోరాడు. (1 పేతురు 5:1-4) వీరికి మన క్షేమం యెడల శ్రద్ధ వుంది, మనకు సహాయం చేయాలని వారనుకుంటున్నారు. అయితే, పెద్దల సహాయం నుండి పూర్తిగా ప్రయోజనం పొందడానికి, సంఘంలో ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి, మనమందరము పేతురు యిచ్చిన యీ సలహాను పాటించాలి: “చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి; మీరందరు ఎదుటివానియెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.”—1 పేతురు 5:5.
8, 9. మొదటి పేతురు 5:6-11 నుండి మనం ఏ ఓదార్పును పొందవచ్చు?
8 పేతురు యింకా యిలా అన్నాడు: “దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి. ఆయన మిమ్మును లక్ష్యపెడుతున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగాచేసి స్థిరపరచి బలపరచును. యుగయుగములకు ప్రభావమాయనకు కలుగునుగాక. ఆమేన్.”—1 పేతురు 5:6-11 (NW).
9 ‘దేవుడు మన యెడల శ్రద్ధ కలిగివున్నాడు గనుక, ఆయనపై మనము మన చింతయావత్తు’ వేయగలమని తెలుసుకోవడం ఎంత ఓదార్పుకరంగా ఉంటుంది! హింస, ఇతర బాధలు తీసుకురావడం ద్వారా యెహోవాతో మనకున్న సంబంధాన్ని పాడుచేయడానికి అపవాది చేసే ప్రయత్నాలవల్ల మనకు కొంత చింత కలిగినట్లయితే, యథార్థతను కాపాడుకొనేవారికి అంతా మంచిగానే జరుగుతుందని తెలుసుకోవడం అద్భుతంగా ఉండదా? అవును, మనం కొంత బాధపడిన తర్వాత, కృపా బాహుళ్యముగల దేవుడు మన శిక్షణను ముగించి, మనల్ని దృఢంగా, బలంగా చేస్తాడు.
10. చింతను తగ్గించుకోడానికి సహాయం చేసే ఏ మూడు లక్షణాలను గూర్చి 1 పేతురు 5:6, 7 సూచిస్తుంది?
10 చింతను ఎదుర్కోడానికి మనకు సహాయం చేయగల మూడు లక్షణాలను 1 పేతురు 5:6, 7 సూచిస్తుంది. ఒకటి దీనత్వం, లేక “దీనమనస్సు.” సహనం కలిగివుండవలసిన అవసరతను సూచిస్తూ 6వ వచనం “తగిన సమయమందు” అనే మాటతో ప్రారంభమౌతుంది. ‘దేవుడు మన యెడల శ్రద్ధ కలిగివున్నాడు’ గనుక మనం నమ్మకంగా మన చింత యావత్తు దేవునిపై వేయవచ్చు అని 7వ వచనం చూపిస్తుంది, ఆ మాటలు యెహోవా యందు దృఢ నమ్మకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. కాబట్టి దీనత్వం, సహనం, దేవుని యందు దృఢ నమ్మకం చింతను పోగొట్టుకోడానికి ఎలా మనకు సహాయం చేస్తాయో చూద్దాము.
దీనత్వం ఎలా సహాయం చేయగలదు
11. చింతను ఎదుర్కోడానికి మనకు దీనత్వం ఎలా సహాయం చేయగలదు?
11 మనం దీనత్వం కలిగివుంటే, దేవుని ఆలోచనలు మన స్వంత ఆలోచనలకంటే ఎంతో ఉన్నతమైనవని మనం అంగీకరిస్తాము. (యెషయా 55:8, 9) యెహోవా యొక్క అపరిమితమైన జ్ఞానంతో పోల్చినప్పుడు మన పరిమితమైన ఆలోచనా సామర్థ్యాన్ని గుర్తించడానికి దీనత్వం మనకు సహాయం చేస్తుంది. నీతిమంతుడైన యోబు విషయంలోవలె, ఆయన మనం గ్రహించని విషయాలను చూస్తాడు. (యోబు 1:7-12; 2:1-6) “బలిష్టమైన దేవుని చేతి క్రింద” మనల్ని మనం తగ్గించుకోవడం ద్వారా, సర్వోన్నత సర్వాధిపతికి సంబంధించి మనం మన తక్కువ స్థానాన్ని అంగీకరిస్తున్నాము. తద్వారా ఆయన అనుమతించే పరిస్థితులను ఎదుర్కోడానికి యిది మనకు సహాయం చేస్తుంది. మన హృదయాలు తక్షణ ఉపశమనాన్ని కోరుకోవచ్చు, కాని యెహోవా లక్షణాలు పూర్తి సమతుల్యతను కలిగివున్నాయి గనుక, మన పక్షంగా ఎప్పుడు, ఎలా ప్రవర్తించాలో ఆయనకు కచ్చితంగా తెలుసు. మన చింతలను ఎదుర్కోడానికి ఆయన సహాయం చేస్తాడనే నమ్మకంతో, చిన్న పిల్లలవలె, మనం యెహోవా బలమైన చేతిని పట్టుకుందాము.—యెషయా 41:8-13.
12. హెబ్రీయులు 13:5 నందలి మాటలను మనం దీనంగా అన్వయించుకున్నట్లయితే, వస్తుసంబంధ భద్రతను గూర్చిన చింత ఎలా ప్రభావితం కాగలదు?
12 దేవుని వాక్యం నుండి ఉపదేశాన్ని అన్వయించుకోడానికి సుముఖత కూడా దీనత్వంలో యిమిడి వుంది, యిది తరచూ చింతను తగ్గిస్తుంది. ఉదాహరణకు, మన చింత వస్తు సంపదల కొరకు మనము పూర్తిగా నిమగ్నమై వుండడం ద్వారా వచ్చినదైతే, మనం పౌలు ఉపదేశం వైపు దృష్టి మళ్లించడం మంచిది: “ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొంది యుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని [దేవుడు] చెప్పెను గదా.” (హెబ్రీయులు 13:5) అలాంటి ఉపదేశాన్ని వినయంగా అన్వయించుకోవడం ద్వారా, వస్తు సంబంధ భద్రతను గూర్చిన గొప్ప చింతనుండి అనేకులు తమను తాము స్వతంత్రులను చేసుకున్నారు. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి యుండక పోవచ్చు, కాని వారికి ఆత్మీయంగా హాని కలిగేలా అది వారి ఆలోచనలను లోపరచుకొనదు.
సహనం యొక్క పాత్ర
13, 14. (ఎ) ఓర్పుతో కూడిన సహనానికి సంబంధించి, యోబు ఏ మాదిరి నుంచాడు? (బి) యెహోవా కొరకు సహనంతో ఎదురు చూడడం మనకు ఏమి చేయగలదు?
13 మొదటి పేతురు 5:6 నందలి “తగిన సమయమందు” అనే పదం ఓర్పుతో కూడిన సహనాన్ని గూర్చిన అవసరతను సూచిస్తుంది. కొన్నిసార్లు ఒక సమస్య చాలా కాలం వరకు వుంటుంది, అది చింతను అధికం చేయవచ్చు. ప్రాముఖ్యంగా, అలాంటి పరిస్థితిల్లోనే మనం విషయాన్ని యెహోవా చేతుల్లో విడిచిపెట్ట వలసిన అవసరత వుంటుంది. శిష్యుడైన యాకోబు యిలా వ్రాశాడు: “సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము గదా? మీరు యోబు యొక్క సహనమునుగూర్చి విన్నారు. యెహోవా యిచ్చిన ప్రతిఫలాన్నిబట్టి యెహోవా ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలిసికొని యున్నారు.” (యాకోబు 5:11 NW) యోబు ఆర్థిక నాశనాన్ని అనుభవించాడు, పదిమంది పిల్లలను మరణమందు కోల్పోయాడు, భయంకరమైన రోగంతో బాధపడ్డాడు, అబద్ధ ఆదరణకర్తల చేత తప్పుగా నిందించబడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో సహజంగా కనీసం కొంత చింత తప్పకుండా వుంటుంది.
14 ఏమైనప్పటికీ, ఓర్పుతో కూడిన సహనం విషయంలో యోబు మాదిరికరంగా వున్నాడు. మనం కఠినమైన విశ్వాస పరీక్షను ఎదుర్కుంటున్నట్లయితే, ఆయన చేసినట్లు, మనం ఉపశమనం కొరకు ఎదురు చూడవచ్చు. కాని చివరికి యోబు బాధనుండి ఆయనను విడిపించి, ఆయనను అత్యధికంగా ఆశీర్వదించడం ద్వారా దేవుడు ఆయన పక్షంగా వ్యవహరించాడు. (యోబు 42:10-17) యెహోవా కొరకు ఓర్పుతో ఎదురు చూడడం మన సహనాన్ని పెంచుతుంది, ఆయన యెడల మన భక్తి యొక్క లోతును తెలియజేస్తుంది.—యాకోబు 1:2-4.
యెహోవాయందు నమ్మకముంచుము
15. మనం యెహోవా యందు ఎందుకు దృఢంగా నమ్మకముంచాలి?
15 ‘ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుమని’ పేతురు తన తోటి విశ్వాసులను కోరాడు. (1 పేతురు 5:7) కాబట్టి మనం యెహోవాయందు దృఢ నమ్మకం కలిగి ఉండగలము, కలిగి ఉండాలి. సామెతలు 3:5, 6 యిలా చెబుతుంది: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” పూర్వపు అనుభవాల మూలంగా, చింతతో నిండియున్న కొందరు యితర మానవులను విశ్వసించడం కష్టంగా భావిస్తారు. కాని జీవానికి మూలము, జీవాన్ని కాపాడేవాడు అయిన మన సృష్టికర్తను విశ్వసించడానికి మనకు కచ్చితంగా కారణం వుంది. ఫలానా విషయంలో మనం మన స్వంత ప్రతిస్పందనను నమ్మకపోయినప్పటికి, మన బాధలలో నుండి యెహోవా మనల్ని విడిపిస్తాడని మనం ఎల్లప్పుడూ ఆయనపై ఆధారపడవచ్చు.—కీర్తన 34:18, 19; 36:9; 56:3, 4.
16. వస్తుసంబంధమైన వాటిని గురించిన చింతను గూర్చి యేసుక్రీస్తు ఏమి చెప్పాడు?
16 దేవున్ని విశ్వసించడంలో, తన తండ్రి నుండి నేర్చుకున్నది మనకు నేర్పిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకు విధేయులై యుండడం కూడా చేరియుంది. (యోహాను 7:16) యెహోవాను సేవించడం ద్వారా ‘పరలోకమందు ధనము కూర్చుకొనుడి’ అని యేసు తన శిష్యులను కోరాడు. ఆహారం, వస్త్రాలు, నివాసము వంటి వస్తుసంబంధ అవసరతల మాటేమిటి? “చింతింపకుడి” అని యేసు సలహా యిచ్చాడు. దేవుడు పక్షులకు ఆహారం యిస్తున్నాడని ఆయన తెలియజేశాడు. ఆయన పువ్వులను అందంగా అలంకరిస్తున్నాడు. దేవుని మానవ సేవకులు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? నిజంగా వారు శ్రేష్ఠులే. గనుక యేసు యిలా కోరాడు: “కాబట్టి మీరు ఆయన రాజ్యమును [దేవుని] నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.” యేసు యింకా యిలా కొనసాగించాడు: “రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.” (మత్తయి 6:20, 25-34) అవును, మనకు తిండి, నీరు, వస్త్రాలు, నివాసము అవసరమే, కాని మనము యెహోవా యందు విశ్వాసముంచితే, మనం ఈ విషయాల గురించి అనవసరంగా చింతించము.
17. రాజ్యాన్ని మొదట వెదకవలసిన అవసరతను మనం ఎలా ఉదాహరించవచ్చు?
17 రాజ్యాన్ని మొదట వెదకడానికి, మనం దేవునియందు విశ్వాసముంచాలి, మన ప్రాముఖ్యతలను సరైన స్థానంలో వుంచుకోవాలి. గాలి పీల్చుకునే పరికరాలు లేకుండా ఒక ఈతగాడు ముత్యపు చిప్పను వెదకడం కొరకు నీటి అడుగుకు వెళ్లవచ్చు. యిది ఆయన కుటుంబానికి జీవనాధారం. వాస్తవంగా ఒక పెద్ద ప్రాధాన్యతే! కాని యింకా ప్రాముఖ్యమైనదేమిటి? గాలి! ఆయన తన ఊపిరితిత్తులను నింపుకోడానికి క్రమంగా పైకి వస్తుండాలి. గాలి యింకా అత్యంత ప్రాధాన్యమైనది. అలాగే, జీవితావసరతలను తీర్చుకోడానికి మనం యీ విధానంలో కొంతవరకు యిమిడి వుండవలసి రావచ్చు. అయితే, మన కుటుంబీకుల యొక్క జీవమే ఆత్మీయ విషయాలపై ఆధారపడి వున్నందున అవి ముందుండాలి. వస్తుసంబంధ అవసరతలను గూర్చి అనవసరమైన చింత కలిగివుండడాన్ని నివారించేందుకు, మనకు దేవుని యందు దృఢ నమ్మకం వుండాలి. అంతేగాక, “యెహోవాయందు ఆనందించుట” మన రక్షణ దుర్గముగా నిరూపించబడుతుంది గనుక ‘ప్రభువు కార్యమందు అధికముగా చేయుట’ మన చింతను తగ్గించుకోడానికి సహాయం చేస్తుంది.—1 కొరింథీయులు 15:58; నెహెమ్యా 8:10.
మీ చింతను యెహోవాపై వేయడంలో కొనసాగండి
18. మన చింత యావత్తు యెహోవాపై వేయడం నిజంగా సహాయం చేయగలదనుటకు ఏ ఆధారం వుంది?
18 ఎల్లప్పుడూ ఆత్మీయ విషయాలపై శ్రద్ధ నిలుపడానికి, మనం మన చింతను యెహోవాపై వేయడంలో కొనసాగాలి. ఆయన నిజంగా తన సేవకులను గూర్చి శ్రద్ధ తీసుకుంటాడని ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోండి. విశదీకరించుటకు: తన భర్త తన యెడల చేస్తున్న ద్రోహానికి ఒక క్రైస్తవ స్త్రీ యొక్క చింత ఎంతగా పెరిగిపోయిందంటే, ఆమె నిద్రపోవడం అసాధ్య మయ్యింది. (కీర్తన 119:28 పోల్చండి.) పడకలో, ఆమె తన చింత యావత్తు యెహోవాపై వేసేది. తాను తన యిద్దరు చిన్న కుమార్తెలు అనుభవిస్తున్న బాధను దేవునికి చెబుతూ, తన అంతర్గత భావాలను తెలియజేసేది. పట్టుదలతోకూడిన ప్రార్థనలో ఉపశమనం కొరకు ఏడ్చిన తర్వాత, తన గురించి, తన పిల్లల గురించి యెహోవా శ్రద్ధ తీసుకుంటాడని నమ్మేది గనుక నిద్రపోగల్గేది. లేఖనాధారంగా విడాకులు తీసుకున్న యీ స్త్రీ యిప్పుడు ఒక పెద్దను వివాహం చేసుకుని సంతోషంగా ఉంది.
19, 20. (ఎ) మనం చింతను ఎదుర్కోడానికి కొన్ని మార్గాలు ఏవి? (బి) మన చింత అంతటితో మనం ఏమి చేస్తూవుండాలి?
19 యెహోవా ప్రజలుగా చింతను ఎదుర్కోడానికి మనకు అనేక మార్గాలున్నాయి. దేవుని వాక్యాన్ని అన్వయించుకోవడం ప్రాముఖ్యంగా సహాయకరంగా వుంటుంది. కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలలో ప్రచురించబడే సహాయకరమైన, ఉత్తేజకరమైన శీర్షికలతో సహా “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” ద్వారా దేవుడు అందజేసే శ్రేష్ఠమైన ఆత్మీయాహారం మనకున్నది. (మత్తయి 24:45-47) మనకు దేవుని పరిశుద్ధాత్మ యొక్క సహాయం వుంది. క్రమమైన, పట్టుదలతో కూడిన ప్రార్థన మనకు గొప్ప ప్రయోజనాన్నిస్తుంది. నియమింపబడిన క్రైస్తవ పెద్దలు ఆత్మీయ సహాయాన్ని, ఓదార్పును యివ్వడానికి సిద్ధంగా వున్నారు, యిష్టపడుతున్నారు.
20 మనల్ని చుట్టుముట్టగల చింతతో వ్యవహరించడానికి మన స్వంత దీనత్వం, సహనం ఎంతో ప్రయోజనకరంగా వుంటాయి. ఆయన సహాయాన్ని, నడిపింపును మనం అనుభవిస్తుండగా మన విశ్వాసం పెంపొందించబడుతుంది గనుక యెహోవా యందు దృఢ నమ్మకం కలిగివుండడం ప్రత్యేకంగా ప్రాముఖ్యము. అలాగే, దేవుని యందు విశ్వాసం మనం అనవసరంగా కష్టపడకుండా వుండేలా చేస్తుంది. (యోహాను 14:1) రాజ్యాన్ని ముందుంచడానికి, చింతను ఎదుర్కోడానికి మనకు సహాయం చేయగల ప్రభువు యొక్క ఆనందకరమైన పనిలో పనిరద్దీని కలిగివుండడానికి విశ్వాసం మనల్ని పురికొల్పుతుంది. అలాంటి చర్య, మనం నిరంతరం దేవునికి స్తుతులు పాడేవారి మధ్యన సురక్షితంగా వున్నట్లు భావించేలా చేస్తుంది. (కీర్తన 104:33) కాబట్టి, మనమందరం మన చింత యావత్తు యెహోవాపై వేయడంలో కొనసాగుదాము.
మీరెలా ప్రత్యుత్తరమిస్తారు?
◻ చింతను ఎలా నిర్వచించవచ్చు?
◻ మనం చింతను ఎదుర్కోగల కొన్ని మార్గాలు ఏవి?
◻ చింతను తగ్గించుకోడానికి దీనత్వం మరియు సహనం ఎలా సహాయపడతాయి?
◻ చింతను ఎదుర్కోడానికి, యెహోవా యందు దృఢవిశ్వాసం కలిగివుండడం ఎందుకు ప్రాముఖ్యము?
◻ మన చింత యావత్తు యెహోవాపై వేయడంలో మనం ఎందుకు కొనసాగాలి?
[24వ పేజీలోని చిత్రం]
“చింతించకండి” అని యేసు ఎందుకు చెప్పాడో మీకు తెలుసా?