కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lvs అధ్యా. 17 పేజీలు 226-237
  • దేవుని ప్రేమలో నిలిచివుండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని ప్రేమలో నిలిచివుండండి
  • దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
  • “దేవుని ప్రేమ”లో చదవండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ విశ్వాసాన్ని బలపర్చుకుంటూ ఉండండి
  • ‘పరిణతి సాధించే దిశగా ముందుకు సాగిపోండి’
  • మీ నిరీక్షణపై మనసుపెట్టండి
  • మీ నిరీక్షణను బలంగా ఉంచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • యెహోవాకొరకు నిరీక్షిస్తూ ధైర్యంగా ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • మీరు క్రీస్తులాంటి పరిణతిని సాధించడానికి కృషిచేస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • యెహోవాకు దగ్గరగా ఉండండి
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
మరిన్ని
దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
lvs అధ్యా. 17 పేజీలు 226-237
పరదైసులో ఉన్న కుటుంబాలు

17వ అధ్యాయం

దేవుని ప్రేమలో నిలిచివుండండి

‘అతి పవిత్రమైన మీ విశ్వాసం అనే పునాది మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. దేవుని ప్రేమలో నిలిచివుండండి.’—యూదా 20, 21, అధస్సూచి.

1, 2. దేవుని ప్రేమలో నిలిచివుండడానికి మనం ఏం చేయవచ్చు?

మనందరం బలంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. అందుకే మంచి ఆహారం తీసుకుంటాం, క్రమంగా వ్యాయామం చేస్తాం, మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి కాస్త కష్టమైనా వాటిని చేస్తూ ఉంటాం. అయితే మనం వేరే విషయంలో కూడా బలంగా, ఆరోగ్యంగా ఉండాలి.

2 మనం మొదట్లో యెహోవా గురించి నేర్చుకుని ఆయనతో మంచి సంబంధం ఏర్పర్చుకున్నాం. అయితే, ఆ సంబంధాన్ని ఎప్పటికీ బలపర్చుకుంటూనే ఉండాలి. క్రైస్తవుల్ని యూదా ఇలా ప్రోత్సహించాడు: ‘దేవుని ప్రేమలో నిలిచివుండండి.’ అందుకోసం మనం ఏం చేయాలో కూడా ఆయన వివరించాడు: “అతి పవిత్రమైన మీ విశ్వాసం అనే పునాది మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి.” (యూదా 20, 21, అధస్సూచి) మరి మన విశ్వాసాన్ని ఎలా బలపర్చుకోవచ్చు?

మీ విశ్వాసాన్ని బలపర్చుకుంటూ ఉండండి

3-5. (ఎ) యెహోవా ప్రమాణాల విషయంలో మీరేం అనుకోవాలన్నది సాతాను కోరిక? (బి) యెహోవా నియమాలు, సూత్రాల గురించి మీరేం అనుకుంటున్నారు?

3 యెహోవా మార్గాలే సరైనవని వ్యక్తిగతంగా మీకు నమ్మకం కుదరాలి. దేవుని ప్రమాణాల ప్రకారం జీవించడం చాలా కష్టమని, తప్పొప్పుల్ని సొంతగా నిర్ణయించుకుంటే సంతోషంగా ఉంటామని మీరు నమ్మాలన్నది సాతాను కోరిక. అతను ఏదెను తోటలో హవ్వను అలాగే నమ్మించాడు. (ఆదికాండం 3:1-6) అప్పటినుండి ఇప్పటివరకు మనుషుల్ని అలా నమ్మించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

4 సాతాను చెప్పేది నిజమా? యెహోవా ప్రమాణాలు మనకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాయా? లేదు. ఉదాహరణకు, మీరు ఒక పార్కులో నడుస్తున్నారు అనుకోండి. అందులో ఒకచోట పెద్ద కంచె వేసి ఉంది. ‘ఈ కంచె నాకు అడ్డుగా ఉంది’ అని మీకనిపించవచ్చు. అప్పుడే ఆ కంచె అవతలి నుండి ఒక సింహం గర్జించడం మీరు విన్నారు. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? సింహానికి ఆహారం అవ్వకుండా ఆ కంచె మిమ్మల్ని కాపాడినందుకు సంతోషిస్తారు కదా! యెహోవా ప్రమాణాలు ఆ కంచె లాంటివి, అపవాది ఆ సింహం లాంటివాడు. దేవుని వాక్యం ఇలా హెచ్చరిస్తుంది: “మీ ఆలోచనా సామర్థ్యాల్ని కాపాడుకోండి, అప్రమత్తంగా ఉండండి! మీ శత్రువైన అపవాది గర్జించే సింహంలా ఎవర్ని మింగాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు.”—1 పేతురు 5:8.

5 మన జీవితం బాగుండాలని, మనం సాతాను చేతుల్లో మోసపోకూడదని యెహోవా కోరుకుంటున్నాడు. అందుకే మనల్ని కాపాడడానికి, సంతోషంగా ఉంచడానికి నియమాల్ని, సూత్రాల్ని ఇచ్చాడు. (ఎఫెసీయులు 6:11) యాకోబు ఇలా రాశాడు: “స్వేచ్ఛను ఇచ్చే పరిపూర్ణ నియమంలోకి పరిశీలనగా చూసి, దాన్ని పాటిస్తూ ఉండే వ్యక్తి . . . అలా చేయడంలో సంతోషం పొందుతాడు.”—యాకోబు 1:25.

6. యెహోవా మార్గాలు సరైనవి అనే నమ్మకం ఎలా బలపడుతుంది?

6 యెహోవా నిర్దేశాన్ని పాటిస్తే మన జీవితం మెరుగౌతుంది, ఆయనతో మన స్నేహం బలపడుతుంది. ఉదాహరణకు, తనకు ఎప్పుడూ ప్రార్థించమని ఆయన చెప్తున్నాడు, అలా ప్రార్థించడం వల్ల మనం ప్రయోజనం పొందుతాం. (మత్తయి 6:5-8; 1 థెస్సలొనీకయులు 5:17) ఆరాధన కోసం క్రమంగా కలుసుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకోమని, ప్రకటించడంలో అలాగే బోధించడంలో పూర్తిగా పాల్గొనమని ఆయన చెప్తున్నాడు. ఆ నిర్దేశాన్ని పాటిస్తే మనం సంతోషంగా ఉంటాం. (మత్తయి 28:19, 20; గలతీయులు 6:2; హెబ్రీయులు 10:24, 25) అవన్నీ చేయడం వల్ల వచ్చిన ప్రయోజనాల గురించి ఆలోచించినప్పుడు మన విశ్వాసం పెరుగుతుంది, యెహోవా మార్గాలే సరైనవి అనే నమ్మకం బలపడుతుంది.

7, 8. పెద్దపెద్ద పరీక్షలు వస్తాయేమో అనే ఆందోళనను ఎలా దూరం చేసుకోవచ్చు?

7 భవిష్యత్తులో మన విశ్వాసానికి పెద్దపెద్ద పరీక్షలు వస్తాయని మనం ఆందోళనపడవచ్చు. మీకెప్పుడైనా అలా అనిపిస్తే, యెహోవా చెప్పిన ఈ మాటల్ని గుర్తుంచుకోండి: “యెహోవా అనే నేనే నీ దేవుణ్ణి. నీకు ప్రయోజనం కలిగేలా నేనే నీకు బోధిస్తున్నాను, నువ్వు నడవాల్సిన దారిలో నేనే నిన్ను నడిపిస్తున్నాను. నువ్వు నా ఆజ్ఞల్ని శ్రద్ధగా వింటే ఎంత బావుంటుంది! అప్పుడు నీ శాంతి నదిలా, నీ నీతి సముద్ర తరంగాల్లా ఉంటుంది.”—యెషయా 48:17, 18.

సముద్ర తరంగాలు

8 యెహోవాకు లోబడితే మన శాంతి ఎప్పుడూ ప్రవహించే నదిలా ఉంటుంది, మన నీతి తీరం వైపు పరుగులు తీసే సముద్ర తరంగాల్లా ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరిగినా మనం దేవునికి నమ్మకంగా ఉండగలం. బైబిలు ఇలా మాటిస్తోంది: “నీ భారం యెహోవా మీద వేయి, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతుల్ని ఆయన ఎన్నడూ పడిపోనివ్వడు.”—కీర్తన 55:22.

‘పరిణతి సాధించే దిశగా ముందుకు సాగిపోండి’

9, 10. పరిణతి సాధించడం అంటే ఏంటి?

9 యెహోవాతో మీకున్న సంబంధం బలపడే కొద్దీ, మీరు ‘పరిణతి సాధించే దిశగా ముందుకు సాగిపోతారు.’ (హెబ్రీయులు 6:1) పరిణతి సాధించడం అంటే ఏంటి?

10 పరిణతి అనేది వయసుతో వచ్చేది కాదు. పరిణతి సాధించడం అంటే యెహోవాను దగ్గరి స్నేహితునిగా చేసుకోవడం, ఆయనలా ఆలోచించడానికి ప్రయత్నించడం. (యోహాను 4:23) పౌలు ఇలా రాశాడు: “శరీర కోరికల ప్రకారం నడుచుకునేవాళ్లు శరీర సంబంధమైన విషయాల మీద మనసుపెడతారు, కానీ పవిత్రశక్తికి అనుగుణంగా నడుచుకునేవాళ్లు పవిత్రశక్తికి సంబంధించిన విషయాల మీద మనసుపెడతారు.” (రోమీయులు 8:5) పరిణతిగల వ్యక్తి సుఖాల మీద, వస్తుసంపదల మీద మనసుపెట్టడు. బదులుగా యెహోవాను ఆరాధించడం మీద మనసుపెడతాడు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటాడు. (సామెతలు 27:11; యాకోబు 1:2, 3 చదవండి.) ఒత్తిడికి లొంగిపోయి తప్పు చేయడు. సరైనది ఏదో తనకు తెలుసు కాబట్టి అదే చేయాలని గట్టిగా నిశ్చయించుకుంటాడు.

11, 12. (ఎ) క్రైస్తవుల “వివేచనా సామర్థ్యాల” గురించి పౌలు ఏమన్నాడు? (బి) పరిణతి సాధించాలంటే ఏం చేయాలో ఉదాహరణతో చెప్పండి.

11 పరిణతి సాధించాలంటే కష్టపడాలి. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “గట్టి ఆహారం పరిణతిగల వాళ్ల కోసం. అలాంటివాళ్లు తమ వివేచనా సామర్థ్యాల్ని ఉపయోగిస్తూ వాటికి శిక్షణ ఇచ్చుకున్నారు. దానివల్ల వాళ్లు తప్పొప్పులను గుర్తించగలుగుతారు.” (హెబ్రీయులు 5:14) “శిక్షణ” అనే పదం వినగానే క్రీడాకారులు తీసుకునే శిక్షణ మనకు గుర్తుకురావచ్చు.

12 ఒక వ్యక్తి పెద్ద క్రీడాకారుడు అవ్వడానికి చాలా సమయం, శిక్షణ అవసరం. ఎవరూ పుట్టుకతోనే క్రీడాకారులు అవ్వరు. అప్పుడే పుట్టిన పిల్లవాడికి చేతుల్ని, కాళ్లను ఎలా ఉపయోగించాలో తెలియదు. కానీ కొంతకాలానికి ఆ పిల్లవాడు వస్తువుల్ని పట్టుకోవడం, నడవడం నేర్చుకుంటాడు. శిక్షణ తీసుకోవడం వల్ల అతను భవిష్యత్తులో పెద్ద క్రీడాకారుడు అవ్వవచ్చు. అదేవిధంగా, మనం పరిణతిగల క్రైస్తవులం అవ్వాలంటే సమయం, శిక్షణ అవసరం.

13. యెహోవాలా ఆలోచించడం ఎలా నేర్చుకోవచ్చు?

13 యెహోవాలా ఆలోచించడం, విషయాల్ని ఆయన దృష్టితో చూడడం ఎలాగో ఈ పుస్తకంలో పరిశీలించాం. మనం యెహోవా ప్రమాణాలకు ఉన్న విలువను గుర్తించి, వాటిని ప్రేమించడం నేర్చుకున్నాం. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనల్ని మనం ఇలా ప్రశ్నించుకుంటాం: ‘ఈ పరిస్థితికి సంబంధించి బైబిల్లో ఏ నియమాలు లేదా సూత్రాలు ఉన్నాయి? నేను వాటిని ఎలా పాటించవచ్చు? నేను ఏం చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు?’—సామెతలు 3:5, 6; యాకోబు 1:5 చదవండి.

14. విశ్వాసాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి?

14 యెహోవా మీద విశ్వాసాన్ని పెంచుకుంటూనే ఉండాలి. మంచి ఆహారం తీసుకుంటే శరీరం బలంగా తయారౌతుంది, అదేవిధంగా యెహోవా గురించి తెలుసుకుంటూ ఉంటే విశ్వాసం బలపడుతుంది. మనం బైబిలు అధ్యయనం మొదలుపెట్టినప్పుడు యెహోవా గురించి, ఆయన మార్గాల గురించి ప్రాథమిక సత్యాలు తెలుసుకున్నాం. అయితే, ఇప్పుడు మనం లోతైన విషయాల్ని కూడా అర్థం చేసుకోవాలి. “గట్టి ఆహారం పరిణతిగల వాళ్ల కోసం” అని అన్నప్పుడు పౌలు ఉద్దేశం అదే. అంతేకాదు మనం నేర్చుకున్నవాటిని పాటించడం ద్వారా తెలివి సంపాదించుకుంటాం. “తెలివి అన్నిటికన్నా ముఖ్యమైనది” అని బైబిలు చెప్తుంది.—సామెతలు 4:5-7; 1 పేతురు 2:2.

15. యెహోవా పట్ల, సహోదర సహోదరీల పట్ల నిజమైన ప్రేమ ఉండడం ఎంత ప్రాముఖ్యం?

15 ఒక వ్యక్తి బలంగా, ఆరోగ్యంగా ఉన్నంతమాత్రాన ఎప్పటికీ అలానే ఉంటాడని చెప్పలేం. అతను అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా, యెహోవాతో ఉన్న సంబంధం ఎప్పుడూ బలంగా ఉండాలంటే కృషి అవసరమని పరిణతిగల క్రైస్తవులకు తెలుసు. పౌలు మనకు ఈ సలహా ఇస్తున్నాడు: “మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో పరీక్షించుకుంటూ ఉండండి; మీరేమిటో రుజువు చేసుకుంటూ ఉండండి.” (2 కొరింథీయులు 13:5) అయితే, బలమైన విశ్వాసంతో పాటు యెహోవా పట్ల, సహోదర సహోదరీల పట్ల ప్రేమను పెంచుకుంటూ ఉండాలి. పౌలు ఇలా అన్నాడు: “నాకు సర్వజ్ఞానం ఉన్నా, కొండల్ని జరిపేంత బలమైన విశ్వాసం ఉన్నా ప్రేమ లేకపోతే నేను వట్టివాడినే.”—1 కొరింథీయులు 13:1-3.

మీ నిరీక్షణపై మనసుపెట్టండి

16. సాతాను ఏం కోరుకుంటున్నాడు?

16 మనం యెహోవాను సంతోషపెట్టేంత మంచివాళ్లం కాదని అనుకోవాలన్నది సాతాను కోరిక. మనం నిరుత్సాహానికి గురై, మన సమస్యలకు ఇక పరిష్కారం లేదని అనుకుంటే సాతాను సంతోషిస్తాడు. మనం తోటి క్రైస్తవుల్ని నమ్మడం, సంతోషంగా ఉండడం అతనికి ఇష్టంలేదు. (ఎఫెసీయులు 2:2) ప్రతికూల (నెగెటివ్‌) ఆలోచనలు మనకు హానిచేస్తాయని, దేవునితో మనకున్న సంబంధాన్ని పాడుచేస్తాయని సాతానుకు తెలుసు. అయితే, అలాంటి ఆలోచనలతో పోరాడడానికి యెహోవా మనకు నిరీక్షణను ఇచ్చాడు.

17. నిరీక్షణ ఎంత ప్రాముఖ్యమైనది?

17 నిరీక్షణ అనేది యుద్ధంలో సైనికుడి తలను రక్షించే శిరస్త్రాణం లాంటిదని బైబిలు చెప్తుంది. బైబిలు ఆ శిరస్త్రాణాన్ని “రక్షణ నిరీక్షణ” అని పిలుస్తుంది. (1 థెస్సలొనీకయులు 5:8) యెహోవా వాగ్దానాల మీద మనకున్న నిరీక్షణ మన మనసును కాపాడి, ప్రతికూల ఆలోచనలతో పోరాడడానికి సహాయం చేస్తుంది.

18, 19. నిరీక్షణ యేసుకు ఎలా బలాన్ని ఇచ్చింది?

18 యేసుకున్న నిరీక్షణ ఆయనకు బలాన్ని ఇచ్చింది. ఆయన భూమ్మీద గడిపిన చివరి రాత్రి, ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో కష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. ఒక స్నేహితుడు ఆయనకు నమ్మకద్రోహం చేశాడు. ఇంకో స్నేహితుడు అసలు ఆయనెవరో తెలీదన్నాడు. మిగతావాళ్లు ఆయన్ని విడిచిపెట్టి పారిపోయారు. సొంత ప్రజలే శత్రువులై ఆయన్ని హింసించి చంపాలని పట్టుబట్టారు. ఇవన్నీ సహించడానికి యేసుకు ఏది సహాయం చేసింది? “ఆయన తన ముందు ఉంచబడిన సంతోషం కోసం హింసాకొయ్య మీద బాధను ఓర్చుకున్నాడు, అవమానాన్ని లెక్కచేయలేదు; ఇప్పుడాయన దేవుని సింహాసనానికి కుడిపక్కన కూర్చున్నాడు.”—హెబ్రీయులు 12:2.

19 తాను నమ్మకంగా ఉంటే యెహోవా పేరుకు మహిమ వస్తుందని, సాతాను అబద్ధికుడనే విషయం రుజువౌతుందని యేసుకు తెలుసు. ఆ నిరీక్షణ యేసుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. త్వరలోనే పరలోకానికి వెళ్లి తన తండ్రిని కలుస్తానని కూడా ఆయనకు తెలుసు. ఆ నిరీక్షణ వల్లే ఆయన అవన్నీ సహించగలిగాడు. యేసులాగే మనం కూడా మన ముందున్న నిరీక్షణ మీద మనసుపెడితే దేన్నైనా సహించగలం.

20. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండడానికి ఏది సహాయం చేస్తుంది?

20 మీ విశ్వాసాన్ని, సహనాన్ని యెహోవా చూస్తాడు. (యెషయా 30:18; మలాకీ 3:10 చదవండి.) మీ “హృదయ కోరికల్ని” తీరుస్తానని ఆయన మాటిస్తున్నాడు. (కీర్తన 37:4) కాబట్టి మీకున్న నిరీక్షణ మీద మనసుపెట్టండి. మీ నిరీక్షణను కోల్పోయి, యెహోవా వాగ్దానాలు ఎప్పటికీ నెరవేరవని మీరు అనుకోవాలన్నది సాతాను కోరిక. కానీ ప్రతికూల ఆలోచనలకు చోటివ్వకండి! మీ నిరీక్షణ బలహీనపడుతుందని అనిపిస్తే, సహాయం కోసం యెహోవాకు ప్రార్థించండి. ఫిలిప్పీయులు 4:6, 7 లో ఉన్న ఈ మాటల్ని గుర్తుంచుకోండి: “ఏ విషయం గురించీ ఆందోళన పడకండి. కానీ ప్రతీ విషయంలో ప్రార్థనల ద్వారా, అభ్యర్థనల ద్వారా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి, అలాగే కృతజ్ఞతలు చెప్పండి; అప్పుడు, మానవ అవగాహనకు మించిన దేవుని శాంతి క్రీస్తుయేసు ద్వారా మీ హృదయాలకు, మీ మనసులకు కాపలా ఉంటుంది.”

21, 22. (ఎ) భూమి విషయంలో యెహోవా ఉద్దేశం ఏంటి? (బి) మీరేం చేయాలని నిశ్చయించుకున్నారు?

21 రానున్న మంచిరోజుల గురించి క్రమంగా ధ్యానించండి. త్వరలోనే ప్రతీ ఒక్కరు యెహోవాను ఆరాధిస్తారు. (ప్రకటన 7:9, 14) కొత్తలోకంలో జీవితం మనం ఊహించేదాని కన్నా చాలా బాగుంటుంది! సాతాను, చెడ్డదూతలు, చెడ్డ ప్రజలు ఇక ఉండరు. రోగాలు, మరణం ఉండవు. మీరు ప్రతీరోజు నిద్రలేవగానే కొత్త ఉత్సాహంతో, సంతోషంతో ఉంటారు. భూమిని పరదైసుగా మార్చడానికి అందరు కలిసి పనిచేస్తారు. అందరికీ మంచి ఆహారం, సురక్షితమైన ఇళ్లు ఉంటాయి. ప్రజలు క్రూరంగా, కఠినంగా ఉండరు. బదులుగా ఒకరితో ఒకరు చాలా దయగా ఉంటారు. కొంతకాలానికి భూమ్మీదున్న మనుషులందరూ “దేవుని పిల్లల మహిమగల స్వాతంత్ర్యాన్ని” ఆనందిస్తారు.—రోమీయులు 8:21.

పరదైసులో ఉన్న కుటుంబాలు

22 మీరు తనను సన్నిహిత స్నేహితునిగా చేసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయనకు లోబడడానికి, ఆయనకు మరింత దగ్గరౌతూ ఉండడానికి ప్రతీరోజు కృషిచేయండి. మనందరం దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుందాం!—యూదా 21, అధస్సూచి.

బైబిలు సూత్రాలు

1 మీ విశ్వాసాన్ని బలపర్చుకుంటూ ఉండండి

“అతి పవిత్రమైన మీ విశ్వాసం అనే పునాది మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి.”—యూదా 20

విశ్వాసాన్ని ఎలా బలపర్చుకోవచ్చు?

  • ఎఫెసీయులు 6:11; యాకోబు 1:25; 1 పేతురు 5:8

    యెహోవాకు లోబడడం వల్ల ఎలా కాపాడబడతామో, మన జీవితం ఎలా మెరుగౌతుందో ఆలోచించండి.

  • మత్తయి 28:19, 20; 1 థెస్సలొనీకయులు 5:17; హెబ్రీయులు 10:24, 25

    విశ్వాసాన్ని బలపర్చుకోవాలంటే క్రమంగా ప్రార్థించాలి, యెహోవా గురించి ప్రకటించాలి, సహోదర సహోదరీలతో సహవసించాలి.

  • కీర్తన 55:22; యెషయా 48:17, 18

    యెహోవా మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన నిర్దేశాన్ని పాటించినప్పుడు మీరు శాంతిగా ఉంటారు.

2 పరిణతి గల క్రైస్తవులు అవ్వండి

“పరిణతి సాధించే దిశగా ముందుకు సాగిపోదాం.”—హెబ్రీయులు 6:1

పరిణతి సాధించడం అంటే ఏంటి?

  • రోమీయులు 8:5; హెబ్రీయులు 5:14

    పరిణతి సాధించాలంటే సమయం, కృషి అవసరం. పరిణతిగల క్రైస్తవుడు విషయాల్ని యెహోవా దృష్టితో చూడడానికి, తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు.

  • సామెతలు 27:11; యాకోబు 1:2, 3

    మీకు ఎదురయ్యే కష్టాల్ని మీ విశ్వాసాన్ని బలపర్చుకునే, యెహోవా మీదున్న ప్రేమను నిరూపించుకునే అవకాశాలుగా చూడండి.

  • సామెతలు 3:5, 6; యాకోబు 1:5

    నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరేం చేయాలని యెహోవా కోరుకుంటున్నాడో ధ్యానించండి, ఆయన సహాయం కోసం ప్రార్థించండి.

  • 2 కొరింథీయులు 13:5

    యెహోవా గురించి నేర్చుకుంటూ ఉండండి, ఆయనతో మీకున్న స్నేహాన్ని బలపర్చుకుంటూ ఉండండి.

3 మీ నిరీక్షణపై మనసుపెట్టండి

‘రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణం పెట్టుకోండి.’—1 థెస్సలొనీకయులు 5:8

నిరీక్షణ మనల్ని ఎలా కాపాడుతుంది?

  • హెబ్రీయులు 12:2

    భవిష్యత్తు విషయంలో మీకున్న నిరీక్షణ చాలా శక్తివంతమైనది. నిరీక్షణ వల్ల యేసు కష్టాల్ని ఎలా సహించగలిగాడో ఆలోచించండి.

  • ఫిలిప్పీయులు 4:6, 7

    మీ నిరీక్షణ బలహీనపడుతున్నట్టు అనిపిస్తే, దానిగురించి ప్రార్థించండి. ప్రతికూల ఆలోచనలు, సందేహాలు మిమ్మల్ని బలహీనపరుస్తాయి. కానీ యెహోవా మీకు ధైర్యాన్ని, మనశ్శాంతిని ఇస్తాడు.

  • మలాకీ 3:10; రోమీయులు 8:21

    మీకున్న నిరీక్షణ గురించి క్రమంగా ధ్యానించండి. రాబోయే కొత్తలోకంలో జీవితం మనం ఊహించేదాని కన్నా చాలా బాగుంటుంది.

  • కీర్తన 37:4; యూదా 21

    మీరు తనను దగ్గరి స్నేహితునిగా చేసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. ప్రతీరోజు ఆయనకు లోబడడానికి, ఆయనకు దగ్గరవ్వడానికి కృషిచేయండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి